‘సిద్ధాంతంతో నడుస్తూ.. సిద్ధాంతం వైపు నడిపించిన… ‘‘ఓ తపస్వి’’ గ్రంథ ఆవిష్కరణ సభలో హరిహరశర్మకు దత్తాత్రేయ హోసబలె నివాళి.

హరిహరశర్మగారి గురించి మనందరికి తెలిసినప్పటికీ కొత్త తరంవారికి నేరుగా వారి గురించి తెలియకపోవచ్చు.136 పేజీల ఈ పుస్తకంతో వారి లోతైన వ్యక్తిత్వం గురించి కొన్ని అంశాలు దర్శించ వచ్చు. పరిపూర్ణంగా చెప్పలేం. అయితే ఈ పుస్తకం శర్మగారి గురించే కాక, ఆర్‌ఎస్‌ఎస్‌. ‌ద్వారా ప్రేరణ పొంది వివిధ క్షేత్రాలలో పనిచేస్తున్న ముఖ్య కార్యకర్తలకు చెప్పాల్సిన అనేక విషయాలు ఉన్నాయి. వీరి వ్యక్తిత్వం వెనుక గౌరీశంకర్‌, ‌రంగయ్య, నర్సయ్య, యశ్వంతరావు కేల్కర్‌, ఓం‌ప్రకాశ్‌ ‌వంటి వారున్నారు. ఏబీవీపీ విద్యారంగంలో పనిచేస్తూ దేశమంతా విస్తరించిన గొప్ప సంస్థ. ఇది విస్తరించడానికి పనిచేసిన అనేకమంది కార్యకర్తల మాలలో ఒకానొక సుగంధభరిత పుష్పమే హరిహర శర్మ. భారతమాత చరణాల వద్ద తన జీవితాన్ని సమర్పించి ధన్యుడయ్యాడు. వారితో పనిచేసే భాగ్యం మాకు కలిగినందుకు మా జీవితం కూడా ధన్యమైంది. శర్మ వంటి తపస్వి మార్గ దర్శనంలో సమాజం కోసం పనిచేసే అవకాశం లభించడం మాకు భగవంతుడిచ్చిన గొప్ప బహుమతిగా భావిస్తున్నాం.

శర్మగారి గురించి అనేకమంది పొందిన అనుభవాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రొఫెసర్‌ ‌శేషగిరిరావు, వీరూమిత్రులు. శర్మగారు జీవితంలో మాతృభూమి అభ్యున్నతి తప్ప మరొక విషయానికి స్థానం కల్పించలేదని, వారి ఆలోచనలో సదా కేంద్ర బిందువు భారతమాతేనని అన్నారు. ఆ సభలో నేను ఉన్నాను. అదే విషయాన్ని ఈ పుస్తకంలో ప్రస్తావించారు. తేరా వైభవ్‌ ‌సదా రహే మా హమ్‌ ‌దిన్‌ ‌చార్‌ ‌రహే న రహే (మేము నాలుగు దినములు బతికినా చాలు. అమ్మా! నీ వైభవం ఎల్లప్పుడూ అమరమై ఉండుగాక!) అనేది సంఘ పాటలో ఒక పంక్తి. భారతవైభవం కోసం నా జీవితం సమర్పితమని సంఘ కార్యకర్తలం చెప్పుకుంటాం. అయితే ఇది ఎందుకు? అమరత్వం సిద్ధింప చేయవల్సింది భారతమాత వైభవానికే. నేను ఈ రోజు ఉండవచ్చు, రేపు ఉండకపోవచ్చు, మన భాగ్యం ఎంతవరకు రాసిపెట్టుంటే అంతవరకు జీవిస్తాం. అయితే భారతమాత వైభవం కోసం ఎందుకు పనిచేయాలి? స్వయంసేవక్‌గా శర్మ సంఘం ఏం చెప్పిందో దానిని జీవితాంతం తాదా త్మ్యంతో చేశారు. కార్యకర్త నుండి సంఘానుకూల జీవనాన్ని సంఘం ఆశిస్తోంది. తనువు, ధనాన్నే కాదు జీవితాన్ని సమర్పించే కార్యకర్తల మాలికలో శర్మగారికి ఒక ప్రముఖ స్థానం ఉంది. 1980లో వారు ప్రభుత్వ ఉద్యోగంలో బోధనా సిబ్బందిగా చేరి మంచి జీతం సంపాదిస్తున్నారు. ఆ సమయంలో సంఘ ఆజ్ఞానుసారం ఉద్యోగాన్ని వదిలి హైదరా బాద్‌కు వచ్చి విజయనగర కాలేజి ఆఫ్‌ ‌కామర్స్‌లో చేరారు. ఆ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న సమయంలో 2 సంవత్సరాలపాటు టెక్నికల్‌ ‌కారణాలవల్ల జీతం రాలేదు. అయినప్పటికీ కాలేజీకి వెళ్లి తన విధిని నిర్వహిస్తూనే వచ్చారు. వారిని హైదరాబాద్‌కు పిలిపించింది జీతం లేకుండా పని చేయడానికి కాదు. కాని వారికి జీతం రాకపోయినా తనకు కళాశాలలో అప్పగించిన ప్రిన్సిపల్‌ ‌బాధ్యతను నిర్వహిస్తూనే ఏబీవీపీ కార్యాన్ని కూడా సంపూర్ణంగా చేస్తూ వచ్చారు. వీరిది మధ్యతరగతి కుటుంబం కావడం వలన జీతం లేకుండా అనేక నెలలపాటు గడపడం కష్టమని గ్రహించారు ప్రొ.శేషగిరిరావు. సెక్రటేరియట్‌లో ఫైలు కదలడం లేదు. ఈ సమయంలో సంబంధిత వివరాలు ఇచ్చినట్లయితే బీజేపీ ఎమ్మెల్యేల ద్వారా ప్రయత్నం చేస్తానని శేషగిరిరావు సూచించారు. వివరాలు ఇవ్వకుండా అంతా ఈశ్వరేచ్ఛ అనేశారు. అలా ఎందుకు ఆలోచించారో మరి. భారతమాత వైభవం కోసం చేస్తున్న ఈ పని న్యాయం, ధర్మమార్గాల ద్వారా నిస్వార్థంగా చేస్తున్నట్లయితే ఈ రోజు కాకుంటే రేపు ఈశ్వరుడు చూసుకుంటాడు అని అన్నారు. అలాంటి ఆధ్యాత్మిక భావన, ఈశ్వరుని పట్ల విశ్వాసం, శ్రద్ధా అనేవి కార్యకర్తను వికసింపచేసి, ఆంతరంగికంగా బలాన్ని కలిగిస్తాయి.

కళాశాల పనైనా, ఏబీవీపీ పనైనా, జీవితంలో ఏదైనా సమస్యలు ఎదుర్కోవలసి వచ్చినప్పుడైనా వజ్రంవలె కఠినంగా వ్యవహరించేవారు. కార్యకర్తల ఇంటి పరిస్థితి గురించి ఆలోచించినప్పుడు ఎంతో సంవేదనతో, మృదువుగా వ్యవహరించేవారు. అందుకే వారు తపస్వి. తాను సిద్ధాంతంతో నడుస్తూ, సిద్ధాంతంవైపు కార్యకర్తలను నడిపించిన మహాను భావుడు. సిద్ధాంతం చెప్పడానికి కాదు, అలాగే పుస్తకంలో రాసుకోవడానికి కాదు, వేదికపై నుండి ఉపన్యాసం ఇవ్వడానికి కాదు. సిద్ధాంతానికి అను కూలంగా జీవించవలసి ఉంటుంది. కార్యకర్తగా శపథం చేయడం చాలా సులభం. కానీ దానిని ఆచరించడం కష్టం. ప్రతీ రక్తపు బొట్టు అర్పిస్తూ జీవితాంతం ప్రకాశాన్నిస్తూ సాగడం కోసం సాధన చేయవలసి ఉంటుంది. ఇదంతా చేస్తున్నప్పుడు నేనూ అంత పనిచేశాను. ఇంత పనిచేశాను. అతనికి ఫలానా లభించింది. అతనికన్నా ఎక్కువ త్యాగం చేశాను. నాకు ఏమి లభించలేదు. ఇలా ఆలోచించడం మొదలుపెడతారు కొందరు. నాకు ఈ పదవి కావాలి. ఆ పదవి కావాలి అనే వ్యాపార ధోరణి ప్రబలుతుంది. నేను ఇంత పెట్టుబడి పెడితే ఆ మేరకు లాభమైతే పొందాలి కదా అనుకుంటారు. ఒక సత్య సిద్ధాంతంపై నిలబడిన స్వయంసేవక్‌, ‌కార్యకర్త తన సమయం వెచ్చిస్తూ చేస్తున్న సమర్పణ వ్యాపారం కాదు. తనువు, మనస్సు, ధనాన్ని సమ ర్పించి అమ్మా! నీ వైభవాన్ని ఎల్లప్పుడూ నిలిచేటట్లు చేస్తాననే మాటలు వినసొంపుగా ఉంటాయి. ఇలాంటి వాటిని లేశమాత్రంగా కూడా తన మనస్సులో స్థానం కల్పించకుండా జీవించిన శర్మగారు మనకు ఉదాహరణగా నిలుస్తారు.

 నీళ్లలాగ కార్యకర్త ఉండాలి అని చెబుతుంటాం. అంటే నీళ్లు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపం దాల్చాలి అని అర్థం. ఆ విధంగానే కార్యకర్త ఏ క్షేత్రంలోకి పంపబడితే ఆ క్షేత్రానికి అనుగుణంగా తనకు తాను రూపుదిద్దుకొని పనిచేయాలి. శర్మగారు వందశాతం ఆ విధంగా పనిచేశారు. ఏబీవీపీ రాష్ట్ర బాధ్యను మోస్తూనే మరొకవైపు జర్నలిజం కోసం రచనా కాలేజీని ప్రారంభించారు.

శర్మగారు ఇన్ని పనులను ఏలా చేయగలిగారు? అందరిలాగానే భగవంతుడు వీరికి కూడా 24 గంటలే ఇచ్చాడు. వీరు ప్రిన్సిపాల్‌గా ఉన్నప్పుడు, వీరిది ఇంగ్లీష్‌ ‌సబ్జెక్ట్ అయినప్పటికీ ఎవరైనా లెక్చరర్‌ ‌రాకపోతే సంబంధిత సబ్జెక్ట్‌ను ఆ తరగతి విద్యార్థు లకు చెప్పేవారు. ఒక కార్యకర్తగా గృహస్థాశ్రమాన్ని కొనసాగిస్తూ, ఇన్ని రకాల పనులు స్వీకరించి అన్నింటికీ న్యాయం చేయడమే కాదు, అన్ని పనులను సఫలం చేయడం అంత సులభం కాదు. ఇది సాధించి చూపించారు శర్మగారు. ఇప్పుడు తెలుగు ప్రాంతాలలో పరిస్థితులు కొంతవరకు మారి ఉండవచ్చు, నక్సలైటు, మావోవాది ఉద్యమాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నప్పుడు వీరు, శేషగిరిరావు, మనోహర్‌రావు, రంగయ్య, నర్సయ్య, మురళీమనో హర్‌లు విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉద్యోగంలో ఉంటూ ఏబివిపి కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇస్తూ సమస్యలను పరిష్కరించే పనిలో నిమగ్నమై ఉండే వారు. దీనికి ధైర్యం కావాలి. ఆదర్శంతో ఎప్పుడైతే తాదాత్మ్యం చెందుతాడో అలాంటి కార్యకర్త ఇలాంటి క్లిష్ట సమయంలో కార్యాన్ని ముందుకు తీసుకెళ్లగలడు.

కార్యకర్తలు తెలుగు ప్రాంతాలలో, తమిళనాడు, కేరళ, అస్సాం లాంటి చోట పనిచేస్తూ దేశ సరిహద్దులను కాపాడే సైనికులను తలపింపచేశారు. సరిహద్దులను కాపాడే సైన్యం ముందర ఈ దేశ భూభాగంలో ప్రతి అంగుళాన్ని రక్షించాలనే ఏకైక లక్ష్యం ఉంటుంది. అవతల శత్రువులు ఉంటారు. తుపాకీ పట్టుకొని కాపాల కాస్తున్నప్పుడు తన బుల్లెట్‌తో అవతలి శత్రువు చస్తాడా లేక అతడి బుల్లెట్‌ ‌తగిలి నేను మరణిస్తానా తెలియని స్థితి. ఇక్కడ ఏబీవీపీ వ్యతిరేక వర్గంవైపు బుల్లెట్లు ఉన్నాయి. మనకు ఎటువంటి ఆయుధాలు లేవు. అయితే ఒకే ఒక ఆయుధం మాత్రం ఉంది. అదే ధైర్యం. అలాంటి వారిని వికసింపచేసి సైనికులులాగా తయారుచేసే పనిని తీవ్రమైన అభిరుచితో దీప జ్వాలవలే నిరంతరం వెలిగే పనిని శర్మ వంటి వారు చేశారు. ఈ పని కోసమే తపించి తపించి పనిచేశారు. కనుక వారు తపస్వి. ఏ పనినైనా కుశలతతో భగవంతునికి అర్పించి చేస్తుంటే అదే యోగం అని భగవద్గీతలో చెప్పినట్లుగా అన్నిరకాల పనులను కౌశల్యంతో చేసిన యోగ సాధకుడు శర్మ. ప్రతి కార్యకర్త ఈ పుస్తకాన్ని చదివి ప్రేరణ పొందాలి. దానివల్ల ఇప్పటివరకు విస్తరించిన సంస్థ పని వెనుక ఇలాంటి పెద్దలు ఏ విధంగా కష్టించి పనిచేశారో అవగాహన కలుగు తుంది. శర్మగారు నేడు మన మధ్యలో లేరు. 2017వ సంవత్సరంలో స్వర్గస్తుల య్యారు. 5 సంవత్సరాల తరువాత వారి గురించి పుస్తకం వచ్చింది. చాలామంది తాము మరణించాక పుస్తకం వేస్తారో లేదో అని తాము జీవించి ఉండగానే స్పాన్సర్‌ ‌చేసి తమ గురించి పుస్తకం ముద్రించుకుంటారు. అయితే శర్మగారి గురించి వచ్చిన ఈ పుస్తకం అలాంటిది కాదు. వీరితో కలిసి పనిచేసిన అనేక మంది కార్యకర్తలకు వారి నుండి కలిగిన అనుభవాల సారాంశమే ఈ పుస్తకం.

ప్రసిద్ధ ఆంగ్లకవి షేక్స్పియర్‌ ‌తాను రాసిన 156 పద్యాలలో (సొనెట్స్) ఒక వ్యక్తికి అమరత్వం రెండు రకాలుగా ప్రాప్తిస్తుందని వివరించారు. ఒకటి తమ వంశవృద్ధి ద్వారా, రెండవది సాహిత్యంలో తన పేరు రావడం ద్వారా. కానీ భారతీయ సంస్కృతి మరొక రకంగా వ్యాఖ్యానించింది.

న ప్రజయ న కర్మణ న ధనేన

త్యాగేనైక అమృతత్వ మానశుః

ఒక వ్యక్తికి అమరత్వం అతని వంశ వృద్ధి ద్వారా గానీ, అతను చేసిన పనుల వల్లగానీ లేదా ధనం వల్లగానీ ప్రాప్తించదు. త్యాగం ద్వారా మాత్రమే అమరత్వం లభిస్తుంది అనేది భారతీయ సిద్ధాంతం. ఈ విధంగా జీవించిన బుద్ధభగవానుని, వివేకా నందుని, రాజా హరిశ్చంద్రుని వంటివారిని మన సమాజం గుర్తుపెట్టుకుంటుంది. ఇక్కడ కూడా పుస్తకంలో శర్మగారి పేరు శాశ్వతం కాదు, వారి త్యాగమే శాశ్వతం. శర్మాజీ ఎప్పుడూ ఇచ్చేదే నేర్చు కున్నారు. తన ప్రతిభను త్యాగం చేశారు. సావర్కర్‌ ‌లాయర్‌. ‌వారి లాయర్‌ ‌డిగ్రీ కూడా ఆంగ్ల ప్రభుత్వం లాక్కున్నది. తిరిగి ఇవ్వలేదు. కాలాపాని (అండమాన్‌ ‌జైల్‌)‌లో గడిపారు. ఆ విధంగా తన ప్రతిభ, ప్రతిష్ట, పురస్కారాలను సర్వస్వం భారతమాత చరణాలవద్ద సమర్పిచిన ధన్యజీవి సావర్కర్‌. ‌శర్మగారి రక్తం గ్రూప్‌ ‘0’ ‌పాజిటివ్‌. అం‌టే వారిది యూనివర్సల్‌ ‌డోనర్‌ ‌గ్రూపు. దానికి తగ్గట్టుగానే సమాజానికి ఇస్తూనే వారు జీవించారు. తన ప్రతిభను, రచనను, ఉపన్యాసాన్ని ఇలా అనేక రకాల వ్యక్తిగత విషయాలను సమాజానికి సమర్పించారే తప్ప తిరిగి నాకు ఏమి వస్తుందని ఆలోచించలేదు. ఇలాంటి దీపస్తంభంగా, నందా దీపంగా నిలిచిన శర్మలాంటి అనేకమంది కార్యకర్తలు తన రక్తాన్ని, చమటను ఒక్కొక్క బొట్టున సంఘము అనే చెట్టు మూలాలకు సమర్పించటం ద్వారా ఆ చెట్టు మహావృక్షమై అనేకమందికి ఫలాలనిస్తూ, వందలాది ప్రాణులకు నీడనిస్తూ, వేలాది పక్షులకు ఆశ్రయమిచ్చే స్థాయికి ఎదగాలని ఆశించారు. తపస్వి అయిన శర్మగారిని నిమిత్తం చేసుకొని సంఘకార్య పరంపరకు చెందిన వారిని స్మరించుకుంటూ, కార్యకర్త పరంపర, కార్యకర్త పక్రియ, కార్యకర్త ఆదర్శం, ఆధునిక కాలంలో ఈ దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌, ‌దాని ప్రేరణతో నడుస్తున్న వివిధ క్షేత్రాలలోని కార్యకర్తలకు శ్రేష్టమైన ఉదాహరణను, ఆదర్శాన్ని , పద్ధతిని వికసింపచేసిన గొప్ప పరంపరంకు నేను ప్రణమిల్లుతున్నాను. మరొకసారి శర్మగారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వీరి జీవితం మనకు ఎల్లప్పుడు ప్రేరణ కలిగించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

——–

‘ఓ తపస్వి’ ఆవిష్కరణ

సామాజిక కార్యకర్త హరిహరశర్మ జీవిత విశేషాలు, ఏబీవీపీతో ఆయన అనుబంధం, జ్ఞాపకాలపై సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌రాంమోహన్‌ ‌కండ్లకుంట ‘ఓ తపస్వి’ అనే పుస్తకాన్ని రచించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 27‌న ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని కేశవ మెమోరియల్‌ ‌కళాశాలలో జరిగింది.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌కార్యవాహ దత్తాత్రేయ హొసబలె హాజరై ప్రసంగించారు. హరిహరశర్మ కుమార్తె తుమ్మలపల్లి శైలజ, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. జానారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్‌. ‌ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏబీవీపీ పూర్వ, ప్రస్తుత కార్యకర్తలతో పాటు ఇతరులూ పెద్దఎత్తున తరలివచ్చారు.

About Author

By editor

Twitter
YOUTUBE