– సుజాత గోపగోని, 6302164068

జీవో నెంబర్‌ 111. ‌హైదరాబాద్‌ ఉనికిని కాపాడుకునేందుకు, హైదరాబాద్‌ ‌వాసులకు తాగునీటి కష్టాలు ఎదురుకాకుండా ఉండేం దుకు, నగర భవిష్యత్తుకు ఢోకా లేకుండా సాగిపోయేందుకు, ఒకరకంగా హైదరాబాద్‌ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు ఈ జీవో ఆయువుపట్టు అని చెబుతారు పర్యావరణ వేత్తలు. అదేవిధంగా భూసారాన్ని రక్షించు కునేందుకు, భూగర్భ నీటినిల్వలను కాపాడు కునేందుకు… అన్నింటికీ మించి హైదరాబాద్‌ ‌జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌ (‌గండి పేట), హిమాయత్‌సాగర్‌లను భద్రంగా ఉంచేందుకు ఈ జీవో దోహదపడుతోంది. కానీ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆలోచన మేరకు జీవో నెంబర్‌• 111‌ను ఎత్తి వేసేందుకు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

హైదరాబాద్‌ ‌శివారు ప్రాంతంలోని వందేళ్ల కాలం నాటి రెండు పెద్ద చెరువులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ పెద్ద చెరువుల చుట్టూ 10 కిలోమీటర్ల దూరంలో నిర్మాణాలను నియంత్రించే జీవో 111ను వెనక్కు తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా గతంలోనే కేసీఆర్‌ ‌ప్రకటించారు. దీంతో ఆ చెరువుల భవిష్యత్తు ఎలా మారబోతోందన్న చర్చ అప్పటి నుంచే మొదలయ్యింది. ఇక హైదరాబాదీలకు ఆ జంట జలాశయాల నుంచి నీళ్లు అక్కర్లేదా? అనే వాదనలు ఎక్కువయ్యాయి. ఈ జంట జలాశయాలు మానవ నిర్మిత ప్రాజెక్టులే. 1908లో హైదరాబాద్‌ను ముంచెత్తిన మూసీ వరదల తరువాత అప్పటి నిజాం నవాబు ప్రఖ్యాత ఇంజినీర్‌ ‌మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి, మూసీ నదిపై సమగ్ర నీటి పారుదల వ్యవస్థను రూపొందించేలా ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా ఈ జలాశయాలు నిర్మించి వరద నీటిని నిల్వ చేస్తూనే, హైదరాబాద్‌ ‌నగరానికి తాగు నీరు అందించే ఏర్పాటు చేశారు.

జీవో నెంబర్‌ 111 ‌కథా కమామీషూ…

శతాబ్ద కాలం నుంచీ హైదరాబాద్‌ ‌తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు.. నగరానికి వరద పోటు రాకుండా కాపాడుతున్న జంట జలాశయాలకు సంబంధించి, ఆ ప్రాంతంలో సహజంగానే కొనసాగుతున్న వ్యవసాయం గురించి ఇబ్బందులేమీ తలెత్తలేదు. ఆంక్షలు, నిబంధనలు, జీవోల అవసరం రాలేదు. కానీ, పరిశ్రమల ఏర్పాటు కోసం పెద్దగా నిబంధనలేమీ రూపొందించని కాలంలో 1980, 1990 దశకాల్లో గండిపేట ప్రాంతంలో సురానా ఇండస్ట్రీస్‌ అనే సంస్థ హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌కెమికల్‌ ‌టెక్నాలజీ నుంచి అనుమతి తీసుకొని ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టింది. అయితే, అది రసాయన పరిశ్రమ కావడంతో ఉస్మాన్‌సాగర్‌, ‌హిమాయత్‌ ‌సాగర్‌ ‌జలాశయాలకు భవిష్యత్తులో ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంటుందని ‘ఫోరం ఫర్‌ ‌బెటర్‌ ‌హైదరా బాద్‌’ ‌సంస్థ హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేసింది. అయితే, హైకోర్టులో ఆ సంస్థకు అనుకూలంగా తీర్పు రావడంతో.. పిటిషనర్లు సుప్రీం కోర్టులో అప్పీల్‌ ‌చేశారు. ‘ఫోరం ఫర్‌ ‌బెటర్‌ ‌హైదరాబాద్‌’ ‌సంస్థ లేవనెత్తిన అంశాలు, వాళ్లు చేసిన వాదనను సుప్రీం కోర్టు అంగీకరించింది. జంట జలాశయాల చుట్టూ నిర్మాణాలపై కఠిన ఆంక్షలు విధించాలని ఆదేశా లిచ్చింది. అలా తొలుత 1994లో జీవో నెంబర్‌ 192‌ను తీసుకొచ్చారు. దానిని 1996లో సవరించి జీవో నెంబర్‌ 111‌గా మార్చారు.

111 జీవో పరిధి, ఆంక్షలు

జలాశయాలను కలుషితం, కబ్జా కాకుండా కాపాడుకునేందుకు తెచ్చిన ఈ జీవో కింద ఉన్న ప్రాంతమంతా బయో కన్జర్వేషన్‌ ‌జోన్‌గా ఉంది. దీని ప్రకారం ఉస్మాన్‌సాగర్‌, ‌హిమాయత్‌సాగర్‌ ‌జలాశయాల పరిధిలోని లే అవుట్లలో 60 శాతం ఖాళీ స్థలం వదలాలి. గ్రామ కంఠం మినహా మిగిలిన చోట్ల భూమిలో 10 శాతమే నిర్మాణాలు ఉండాలి. మిగతా స్థలమంతా చెట్లు, పంటపొలాలే ఉండాలి. చుట్టుపక్కల క్రిమిసంహారక మందుల వినియోగంపై పరిశీలన ఉండాలి. కట్టడాలు కూడా జీ2 అంతస్తుల కంటే ఎక్కువ ఉండకూడదు లాంటి నిబంధనలు చాలా ఉన్నాయి.  జంట జలాశయాల చుట్టూ ఉన్న పలు గ్రామాలు ఈ జీవో పరిధిలోనే ఉన్నాయి. మొత్తం 7 మండలాల్లోని 84 గ్రామాల్లో జీవో నెంబర్‌ 111 ‌ప్రకారం భూముల వినియోగంపై ఆంక్షలు ఉన్నాయి. శంషాబాద్‌ ‌మండలంలోని 47 గ్రామాలు, మొయినాబాద్‌ ‌మండలంలో 20, చేవెళ్ల మండలంలో ఆరు,శంకరపల్లి మండలంలో మూడు, రాజేంద్రనగర్‌ ‌మండలంలో మూడు, షాబాద్‌ ‌మండలంలో రెండు, కొత్తూరు మండలంలో ఒక గ్రామంపై ఈ జీవో మేరకు ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో, హైదరాబాద్‌ ‌శివార్లలో భూముల ధరలు ఎంత పెరిగినా, ఈ జీవో అమల్లో ఉన్న గ్రామాల్లో మాత్రం భూముల ధరలు పెరగలేదు. ఆయా గ్రామాలలో భూముల కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు సరికాదా, జీవో గురించి తెలిసి భూములు కొన్నవాళ్లు కూడా అమ్మేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో నిర్మాణాల విషయం లోనూ చాలా కఠినమైన నిబంధనలు ఉండడంతో స్థానికులు జీవో వ్యతిరేక పోరాట సమితిగా ఏర్పడ్డారు. ఈ 83 గ్రామాల వారూ రెండుసార్లు ఆ జీవోకు వ్యతిరేకంగా తీర్మానం కూడా చేశారు. పర్యావరణవేత్తలు మాత్రం జీవోను కొనసాగించాలని వాదిస్తున్నారు.

111 జీవో పరిధిలోని ప్రాంత విస్తీర్ణం 538 చదరపు కిలోమీటర్లు. అంటే ఇది దాదాపు జీహెచ్‌ఎం‌సీ విస్తీర్ణానికి సమానం. ఈ గ్రామాల్లో 1 లక్షా 32 వేల ఎకరాల భూములున్నాయి. అందులో ప్రభుత్వానికి చెందిన భూములే 18 వేల ఎకరాలకు పైగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌ ‌విస్తరణ అవకాశం బాగా పెరుగుతుంది. నగరానికి చేరువలో మరో భాగ్యనగరం పట్టేంత విస్తీర్ణంలో భూములున్నా అలాంటి భూముల్లో వ్యవసాయేతర కార్యకలాపాలు చేపట్టడంపై జీవో 111 ప్రకారం ఆంక్షలున్నాయి. ఇక్కడ వ్యవసాయేతర కార్యకలపాలపై నిషేధం ఉంది.  తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ 111 జీవోను ఎత్తివేస్తే.. రియల్‌ ఎస్టేట్‌, ‌భూములు చేతులు మారడం వంటి అంశాలు పక్కన పెడితే పర్యావరణ పరంగా ఉస్మాన్‌సాగర్‌, ‌హిమాయత్‌సాగర్‌ ‌జలాశ యాలు అత్యంత కీలకమైనవి. మూసీ ప్రవాహం వరద నియంత్రణ, తాగునీటి సరఫరా, భూగర్భ జల కాలుష్యం పరంగా అనేక రకాలుగా వీటి పరిరక్షణ అత్యంత ముఖ్యం అంటున్నారు పర్యావరణవేత్తలు. వాస్తవానికి హైదరాబాద్‌ ‌నగరాన్ని కుండపోత వానలు, వరదల నుంచి కాపాడేవి ఈ జలాశయాలే అని వాదిస్తున్నారు. చుట్టుపక్కల కట్టడాలపై ఆంక్షలు పూర్తిగా ఎత్తివేస్తే వీటి రూపమే మారిపోతుందని, హైదరాబాద్‌ ‌నగరానికి భద్రత లేకుండా పోతుందని అంటున్నారు.

తాగునీటి కహానీ

తొలుత హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలు సహా అన్ని ప్రాంతాలకూ ఈ జలాశయాల నుంచే తాగునీరు సరఫరా జరిగేది. కాలక్రమంలో కొన్ని ప్రాంతాలకు కృష్ణా, గోదావరి నీరు అందుబాటులోకి వచ్చింది. అలాగే మంజీర నీరు కూడా కూడా సరఫరా అవుతోంది. ఇప్పుడు మల్లన్నసాగర్‌ ‌జలా శయంగా నిర్మించి, గోదావరి నదిమీద నిర్మిం చిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు. అయితే, హైదరాబాద్‌ ‌మహానగరానికి ఒక్క మల్లన్నసాగర్‌ ‌నుంచి తాగునీరు సరిపోతుందని కేసీఆర్‌ అం‌టున్నారు. ఇలా పలు ప్రధాన నదుల నుంచి తాగునీరు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ జలాశయాల ప్రాధాన్యం కొద్దిగా తగ్గింది.

ఇప్పటికే కృష్ణా, మంజీరా నుంచి నీటి సరఫరా సాగుతున్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తరలి స్తున్న మల్లన్నసాగర్‌ ‌నీరు హైదరాబాద్‌ అవసరాలకు సరిపోతుందని కేసీఆర్‌ ‌చేస్తున్న వాదనను పర్యావరణ వేత్తలు తప్పుబడుతున్నారు. అసలు హైదరాబాద్‌కు ఎంత నీరు కావాలి? రానున్న దశాబ్దాల్లో నీటి లభ్యత ఎలా పెరుగుతుంది? నది నీరు ఎలా వస్తుంది? దానికి ఏర్పాట్లు ఎలా చేస్తారు? లాంటివి అధ్యయనం లేకుండా కేవలం మల్లన్న సాగర్‌ను చూపించి ఈ రెండు చెరువులను నాశనం చేస్తారా? అని పర్యా వరణ వేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి పరిమితులు లేకుండా జీవోను ఎత్తేస్తే ఈ రెండు చెరువులూ మరో హుస్సేన్‌ ‌సాగర్‌లా తయారవుతాయని అంటున్నారు.

రియల్‌ ఎస్టేట్‌పై తీవ్ర ప్రభావం

ఈ జీవో పరిధిలోని 84 గ్రామాల్లోని భూము లన్నీ ఆంక్షల మధ్య బయో కన్జర్వేషన్‌ ‌జోన్‌లో ఉన్నాయి. తాజాగా కేబినెట్‌లో బయో కన్జర్వేషన్‌ ‌జోన్‌ను తొలగించి హెచ్‌ఎం‌డీఏ నిబంధనల అమ లుకు నిర్ణయించడంతో 84 గ్రామాలపై ఉన్న ఆంక్షలు తొలగనున్నాయి. బయో కన్జర్వేషన్‌ ‌జోన్‌ ‌మొత్తం వ్యవసాయ కన్జర్వేషన్‌ ‌జోన్‌గానే పరిగణించ నున్నారు. కేబినెట్‌ ‌నిర్ణయానుసారం త్వరలోనే బయో కన్జర్వేషన్‌ ‌జోన్‌ను తొలగిస్తూ సీఎల్‌యూకు, నాలా కన్వర్షన్‌కు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు రాను న్నాయి. దాని ప్రకారమే 111 జీవో ఏరియాలోని భూములను భూ యజమానుల విజ్ఞప్తి మేరకు సీఎల్‌యూ కింద రెసిడెన్షియల్‌, ‌కమర్షియల్‌, ఇలా కోరుకున్న జోన్లకు మార్పు చేయనున్నారు.

భూముల అమ్మకంపైనే సర్కారు కన్ను

సంక్షేమ పథకాల కొనసాగింపు, కొత్త వాటి అమలుకు నిధుల వెసులుబాటు తగ్గిన పరిస్థితుల్లో జీవో 111 రద్దు సర్కారుకు ఓ ఇంధనంలా మార నుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 84 గ్రామాలను జీవో పరిధి నుంచి తప్పించడం ఇందుకు ఒక కారణం కాగా, ప్రభుత్వానికి వేల కోట్ల రాబడి తెచ్చిపెట్టే ప్రభుత్వ భూములు పెద్దఎత్తున ఉండటం మరో కారణమంటున్నారు. పట్టా భూముల లావా దేవీలతో ఖజానాకు వచ్చే రాబడికి దన్నుగా సర్కారు భూములు కాసులు కురిపించే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా భూముల విక్రయాల ద్వారా ఏటా సగటున రూ.10వేలకోట్ల వరకు రాబడి ఉంటుందని ప్రభుత్వం అంచనావేసింది. కానీ, గడి చిన ఆర్థిక సంవత్సరంలో రూ.2వేలకోట్లే వచ్చింది. నగర శివార్లలోని ప్రభుత్వ భూములను హెచ్‌ఎం‌డీఏ ద్వారా అభివృద్ధి చేసి వేలానికి పెడుతుండగా, వాటి కొనుగోలుకు వ్యాపార సంస్థల నుంచి అంతంత మాత్రమే పోటీ ఉంటోంది. ఆర్థిక జిల్లా పరిధిలో విస్తరిస్తున్న సాఫ్ట్‌వేర్‌, ‌ఫార్మా తదితర రంగ సంస్థలు ఇతర ప్రాంతాల్లో భూముల కొను గోలుకు పెద్దగా మొగ్గుచూపడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్థిక జిల్లాకు ఆనుకుని ఉన్న జీవో 111 పరిధిలోని భూములకు భారీగా గిరాకీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే శంషాబాద్‌, ‌మొయినాబాద్‌, ‌షాబాద్‌, ‌చేవెళ్ల, శంకర్‌పల్లి, రాజేంద్రనగర్‌, ‌కొత్తూరు మండలాల పరిధిలో భూముల ధరలు భారీగా పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్లో ఎకరా పది కోట్లపైనే ఉంటోంది. అసైన్డ్ ‌భూములకూ ఎకరాకు కనీసం అయిదు కోట్ల వరకు పెడుతున్నారు.

ఓఆర్‌ఆర్‌ ‌వెంట కాసుల పంట

జీవో 111 పరిధిలోని మండలాల్లోని 84 గ్రామాలపరిధిలో 31వేలఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా, వాటిలో ప్రభుత్వానికి చెందినవే 18,372 ఎకరాలున్నాయి. ఇవి ఎక్కువగా మొయినాబాద్‌, ‌శంషాబాద్‌, ‌షాబాద్‌ ‌మండలాల్లో విస్తరించి ఉన్నాయి. మొయినాబాద్‌ ‌మండల పరిధిలోని రాష్ట్ర పోలీస్‌ అకాడమీ నుంచి శంషాబాద్‌ ‌విమానాశ్రయం వరకు ఓఆర్‌ఆర్‌ ‌వెంబడి 18 గ్రామాల పరిధిలో సర్కారు భూములున్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం ఇక్కడ ఎకరా ధర ఎంత లేదన్నా 2 కోట్ల రూపా యలకు పైగానే ఉంది. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ ‌లైన్లు, మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తే 5 కోట్ల రూపాయలు దాటుతుందని చెబుతు న్నారు. దీంతో పాటు అసైన్డ్, ‌సీలింగ్‌ ‌భూములు కలిపి 11వేల ఎకరాలకు పైగా అందుబాటులో ఉండటం కలిసి వస్తుందని రెవెన్యూ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రిజిస్ట్రేషన్లతోనూ ఆదాయం

జీవో పరిధిలో ఉన్న గ్రామాల్లో లక్ష ఎకరాల్లో పట్టా భూముల్లో లావాదేవీలకు వీలు ఏర్పడుతుంది. ఇప్పటివరకు సాగు అవసరాలకు మాత్రమే ఈ భూముల వినియోగం పరిమితమైంది. జీవో రద్దుతో ఈ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారం, పారిశ్రా మికీకరణ పెరిగి వ్యవసాయేతర లావాదేవీలు జోరందుకోనున్నాయి. దీనివల్ల ఎకరా భూమికి స్థానిక మార్కెట్‌ ‌విలువ ప్రకారం స్టాంపు డ్యూటీతో 12 లక్షలనుంచి 15 లక్షల వరకు రాబడి వచ్చే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్‌ ‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏడాదికి ఎంత లేదన్నా రూ. 5 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

లక్షకోట్ల స్కామ్‌?

‌హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములన్నీ కొడి గట్టాయి. స్థలాలన్నింటికీ సర్కారు ఎసరు పెట్టింది. భవిష్యత్తులో ప్రభుత్వ భూమి అన్నదే కనిపించకుండా వేలాలు వేసింది. ఇక, హైదరాబాద్‌ ‌పరిసరాల్లో జీవో 111 పుణ్యమాని కొన్ని భూములు ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. ఈ జీవో రద్దుతో స్థానికంగా కూడా పెద్దగా భూములకు డిమాండ్‌ ‌లేదు. ఈ పరిస్థితులను ప్రభుత్వం.. ముఖ్యంగా అధికారపార్టీ నాయకులు క్యాష్‌ ‌చేసుకోవాలనుకుంటున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. మరోవైపు.. 111 జీవోరద్దు వెనుక లక్ష కోట్ల రూపాయల స్కామ్‌ ఉం‌దని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE