– శిప్ర ముని

భగవద్గీత నేటికి 5000 సంవత్సరాల నాటిది. ఇది వ్యాస విరచిత మహాభారతాంతర్భాగం. దీని ఆధారంగా ఆనాటి సాంఘిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను కొంతవరకు అంచనా వేయవచ్చు.

మహాభారత కాలంలో రాజరికం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ఇది ఆనువంశికంగా సంక్రమిం చేది. సమాజంలో సాత్విక యజ్ఞాలతో పాటు ఆడంబరాల కోసం రాజకీయ యజ్ఞాలు కూడా జరిగేవి. ‘నేనే దేవుణ్ణి, సృష్టి అనిత్యం, దీనికి వేరే కర్త లేడు. విషయవాంఛలే సర్వస్వం’ అని భావించే వర్గాలు సమాజంలో ఉండేవి.

వేదానికి సమున్నత గౌరవం ఉండేది. వేదం పేరుతో అవైదిక ఆచారాలు కూడా కొన్ని వ్యాపించాయి. వాటిని యదు వంశీయులు నిరోధించారు. యాదవ కృష్ణుడు ధర్మపీఠం అధిష్ఠించగా ద్రోణ, అశ్వత్థామ వంటివారు కొందరు బ్రాహ్మణులు క్షత్రియ విద్యలు స్వీకరించారు. బహుభార్యత్వం వలెనే బహు భర్తృత్వం కూడా కనపడుతున్నది. నియోగ పద్ధతిలో సంతానోత్పత్తి చట్ట సమ్మతమే. మనుస్మృతి ఉండేది. రాజులు చలద్యూతము ద్వారా రాజ్యాధికారాలు పొందేవారు. వారికది వ్యసనంగా ఉండేది. ఇది అప్పుడు మృగశిర ప్రథమయుగం.

గీతలో జనకుడు రాముడు వంటి పేర్లు కనిపిస్తాయి. కాబట్టి చారిత్రకంగా రామాయణ కాలం తర్వాత మహాభారత కాలం అనేది నిర్వివాదాంశం. గీతలో ఆర్య శబ్దం జాతి (రేస్‌) ‌వాచకంగా కాక, గుణవాచకంగా ఉపయోగించారు.

ద్రవ్య యజ్ఞంతోబాటు జ్ఞానయజ్ఞం, కర్మయజ్ఞం, ధ్యానయజ్ఞం కూడా ఉండేవి. ప్రపంచంలోని వివిధ దేశాలవారు ఆత్మ (సోల్‌)‌ను నమ్మారు. అది భౌతిక పదార్థం కాదు కాబట్టి నీటికి తడవదు, ఎండకు ఎండదు. అగ్నికి కాలదు.

గీత ప్రథమాధ్యాయంలో – యుద్ధంలో పాల్గొన్న కొందరు రాజులు, వారి రాజ్యాల పేర్లు కనిపిస్తాయి. ద్రుపదుడు, విరటుడు, చేకితానుడు, చేది, కాశీరాజులు, పురుజిత్తు, కుంతీభోజుడు, నైబ్యుడు, యుధామన్యుడు, విక్రాంతుడు, ఉత్తమౌజుడు, కర్ణుడు, కృపుడు, సౌమదత్తి, పంచపాండవులు, కౌరవులు ఇలా కొన్ని పేర్లు గమనిస్తే ఆనాటి (5000 ఏళ్లనాటి) రాజ్యాలను రాజ వంశాలను ఊహించ వచ్చు. వీటిని నేటి ఉత్తరప్రదేశ్‌, ‌బిహార్‌, ‌హరియాణా, పంజాబ్‌ ‌వంటి రాష్ట్రాలలోని ప్రాంతాలతో ధృవీక రించుకోవచ్చు.

‘ఐతరేయ బ్రాహ్మణం’లో విశ్వామిత్రునిచే శపితులైన వారి జాబితా ఉంది. వీరిలో నేటి దక్షిణ రాష్ట్రాలల్లోని ఆంధ్రజాతి వంటివారి పేర్లున్నాయి. మహాభారత యుద్ధంలో దాక్షిణాత్యులు కొందరు మల్లయుద్ధ వీరులు పాల్గొన్నట్లు తెలుస్తున్నది. అవంతి (ఉజ్జయిని), నలంద, కాశి, కాంచీపురం నేటికీ ప్రధాన విద్యాకేంద్రాలు. గాంధారి (కాందహార్‌), ‌మాద్రి (మద్ర) పాంచాలి (పాంచాల) ఇలాంటి పేర్లను బట్టి ఆనాటి ఆయా రాజ్యాల పేర్లను నేడు మనం పోల్చుకోవచ్చు. నైమిశారణ్యం నేటి ఉత్తరప్రదేశ్‌ ‌రాజధాని లక్నోకు సమీపంలో ఉంది. కురుక్షేత్ర హరియాణాలో ఉంది. సప్తసింధు – సుమేరు సుమేరియన్‌ – ఆర్యావర్తా వంటి పదాలపై చాలా పరిశోధనలు జరిగాయి.

అశ్వత్థం, శమీవృక్షం మిక్కిలి పవిత్రమైనవి. తాను అశ్వత్థ నారాయణుడను అని విభూతి యోగంలో శ్రీకృష్ణుడు చెప్పుకున్నాడు. పాండవుల ఆయుధాలను అజ్ఞాతవాసానికి ముందు రక్షించింది శమీవృక్షమే. షోడశ సంస్కారాలన్నీ నిగమ సంప్రదాయానుసారం జరిగేవి. చతురాశ్రమాలూ పాటించేవారు. చతుర్విధ పురుషార్థాలూ ముఖ్యమే. ధర్మ అవిరుద్ధ కామం తానేనని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. కామ శబ్దాన్ని విస్తృతార్థంలో తీసుకోవచ్చు.

వేదమంత్రాలను పత్రాలపై లిఖించేవారు (పేసరస్‌). ‌సంస్కృతం వ్యావహారిక అధికారభాష. యుద్ధంలో పద్మవ్యూహం, గరుడ వ్యూహాల వంటివి పన్నేవారు. ఈ విద్యను భారతదేశంలోనే కాక గ్రీసు, ఈజిప్టు, రోమన్‌ ‌సమాజాలలోనూ చూడవచ్చు. రథాలపై ధ్వజాలు ఉండేవి. యుద్ధంలో రసాయనిక ద్రవ్యాలు, అణుబాంబులు కూడా వాడిన దాఖలా లున్నాయి. ఆటంబాంబును బ్రహ్మస్త్రం అని పిలిచే వారు. పిచ్చుకమీద బ్రహ్మాస్త్రమా? అనే సామెత తెలి సిందే. విరటుని భార్య సుధేష్ణ మద్యాన్ని సేవించింది. బహిష్టు స్త్రీలను తాకటం పాపం. రజోగుణం ఉన్నవారు, తమోగుణులు రాజసభలలో స్త్రీలను అవమానించేవారు.

అహింస పరమధర్మం. అయితే శక్తిలేని శాంతి నిలువదు. అందువల్ల క్షత్రియులు సహజంగా (జెనిటిక్‌)‌యుద్ధం చేయవలసిందే. వివాహానికి ముందు ఆర్యా మహాదేవి ఆలయానికి వధువును తీసుకొనిపోయేవారు. రాక్షస వివాహాలు కూడా ఉండేవి.

యుద్ధంలో మరణించిన శత్రువు రొమ్ము చీల్చి రక్తం కళ్ల చూసేవారు. సమాజంలో శ్వపచులు కూడా ఉండేవారు. మృతమాంస భక్షణ తామస లక్షణం. పాలు, వెన్న, నెయ్యి సాత్విక భక్షణ.

‘నేనే జీవమునై యున్నాను’ శ్రీకృష్ణుని ఈ వాక్యం యోహాను సువార్తలోకి ఎలా ప్రవేశించింది?

యుద్ధ నివారణ కోసం ముందుగా దూతలు వెళ్లేవారు. వారిని బంధించడం కూడా కనపడు తున్నది. భూమిపై హక్కు 13 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత హక్కుదారు కనపడకపోతే అన్యాకాంత్రం అవుతుంది. రామాయణ కాలంలో ఈ హక్కు 14 సంవత్సరాలు. పెద్ద కొడుకును కాదని చిన్నవానికి రాజ్యాధికారం ఇవ్వటం చట్టసమ్మతం కాదు. రామాయణంలో కైక పురుషుల వలెనే యుద్ధతంత్రం నేర్చుకొని యుద్ధాలలో పాల్గొన్నది. అలాగే భారతంలో కూడా సత్యభామ యుద్ధతంత్రం నేర్చుకున్నది.

జరాసంధుడు శాక్తేయుడు. ఇతను స్త్రీలను చెరబట్టేవాడు. నరబలులు ఇచ్చేవాడు. ఇది అవైదికం కాబట్టి శ్రీకృష్ణుడు నిరోధించాడు. ఇంద్రుని పేర పశుయజ్ఞం జరిగితే దానినీ శ్రీకృష్ణుడు నిరోధించాడు. అప్పుడు ఇంద్రపూజకులు శ్రీకృష్ణునిపై తిరగబడ్డారు. ఐనా పోరాడి శ్రీకృష్ణుడు గోరక్షణ చేశాడు.

శ్రీకృష్ణుడు కస్తూరీ తిలకం, కౌస్తుభమణి, పీతాంబరాలతోబాటు నెమలి ఈకను కూడా అలంకరించుకున్నాడు. వేణువు ఒక వశీకరణ సంగీత వాద్యం. ఆనాడు భారతదేశం చాలా విస్తారంగా ఉండేది. నేటి పాకిస్తాన్‌, అఫ్ఘానిస్తాన్‌, ‌బెలూచిస్తాన్‌, ‌బర్మా, నేపాల్‌, ‌సింహళం, భూటాన్‌, ‌బంగ్లాదేశ్‌ ‌వంటివన్నీ భారతదేశంలో అంతర్భాగాలే.

రఘువంశ రాజులు (ఇక్ష్వాకులు) ఒక్క ఆసియాకు మాత్రమే కాక మొత్తం ప్రపంచానికీ అధిపతులు. అలాగే ధర్మరాజుని రాజసూయంలో ప్రపంచ దేశాధిపతులు పాల్గొని కానుకలు సమర్పించారు. గుణములను బట్టి, కర్మలను బట్టి సమాజాన్ని వర్గీకరించారు. వాణిజ్యం, పశుపోషణ వైశ్యధర్మం. బ్రాహ్మణుడు అనికేతనుడై సంచరిస్తూ ధర్మప్రచారం చేయాలి. ఒక రాజ్యాన్ని మరొక రాజు జయించినా అగ్రహారాలు (మాన్యాల) మీద, ఆలయ భూములమీద రాజులకు హక్కు ఉండదు. దానవిక్రయాది అధికారాలూ ఉండవు. అవి ధర్మప్రచారకులకే చెందుతాయి. మహాభారత యుద్ధం తర్వాత అర్జునుడు విషాదయోగంలో చెప్పినట్లు వర్ణసంకరం జరిగింది.

ఆనాటి ప్రపంచ దేశాలన్నింటిలోనూ సూర్యా రాధన ప్రధానంగా కనపడుతున్నది. సూర్యవంశం, చంద్రవంశం, అగ్నివంశం ఇలా రాజవంశాలు ఉండేవి.  రాజు దివ్యాంశ సంభూతుడు. అయితే అతడు కూడా ధర్మానికి బద్ధుడు కావలసిందే. ఎవరైనా బలహీనులను, గోవులను, విప్రులను వేధిస్తుంటే వారి నుండి రక్షణ చేయవలసిన బాధ్యత రాజుదే.

‘ఊర్థ్వబాహుర్విదర్మేషాం/న చకశ్చిత్‌ ‌శృణోతిమే

ధర్మాదర్ధశ్చ కామశ్చ/ స ధర్మం కిం న సేవ్యతే’

 (వేదవ్యాసుడు).

వేదమే అందరికీ ప్రమాణం. అయితే కొందరు సోమరిపోతులు మేము నిష్కాములం. కాబట్టి నిత్య నైమిత్తికాలు మాకు వర్తించవు అని తప్పించుకోవడం తగదు అని శ్రీకృష్ణుడు గీతలో హెచ్చరించడం గమనార్హం. గోధనం చాలా పెద్దది. శత్రువుల గోవులను అపహరించేవారు. వస్తుమార్పిడి ఉండేది. యజ్ఞంలో దక్షిణగా బంగారం, వెండి, గుర్రాలు (రథాలు), ఏనుగులు, గోవులు ఇచ్చేవారు. పాతివ్రత్యం అనే పదానికి గాంధారి విపరీతార్థం చెప్పింది. భర్తకు కన్నులు లేకపోతే తాను కళ్లకు గంతలు కట్టుకున్నది. ఫలితంగా గుడ్డి పాలనలో కొడుకులు దుర్మార్గులయినారు.

ఆనాడు ఏకేశ్వరారాధనతోబాటు యక్ష భూతారాధనలూ ఉండేవి. భూత శబ్దాన్ని శ్రీకృష్ణుడు పంచభూతాలు అనే అర్థంలో వాడాడేమో! మహా భారత యుద్ధం తర్వాత యాదవులు విదేశాలకు వెళ్లారు. వారిని యూదులు అని పిలిచారు. దేశంలో క్షత్రియ సంతతి తగ్గడంతో ఎన్నో అవైదిక మతాలు ప్రవేశించాయి. ధర్మయుద్ధం రాత్రిపూట చేయరాదు. స్త్రీలకు, పిల్లలతో, క్లీబులతో యుద్ధం చేయరు. నోట పుల్ల కరచుకొని శరణాగతుడై వచ్చిన శత్రువును క్షమించాలి. ఒకరు ఒక వ్యక్తిని యుద్ధంలో చంపుతాను అని ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞ చేసిన వారికే ఆ అవకాశం ఇవ్వాలి. యుద్ధవీరులతో నాలుగైదు శ్రేణులు (ర్యాంకులు) ఉన్నాయి. వీరిలో అతిరథ మహారథులు, శ్రేష్ఠులు, యుద్ధం జరగడానికి ముందు శంఖాలు పూరిస్తారు.

అశ్వ, గజ, రథ, పదాతి దళములు నాలుగు వర్ణములు. అశ్వపాలకులు రథ సారథులు, గజ సాహిణులు ఇలా కొన్ని పశుపాలక వర్గాలున్నాయి.

ఆనాటి గృహవాస్తు అత్యద్భుతం. నీరు లేని చోట ఉన్నట్లు, ఉన్నచోట లేనట్లు భ్రమింపజేయగల గృహనిర్మాణ కౌశలం ఉండేది. ద్వారకా నగరంలోని సంపదలు అనంతం. ఇది సముద్ర మధ్యం (అరేబియా సముద్ర మధ్య ద్వీపం)లో నిర్మించారు. పెద్ద పెద్ద అగడ్తలు, బురుజులతో నిర్మించిన ఈ నగరం మొహంజొదారో వలెనే ఏ కారణం చేతనో జలగర్భంలో అంతరించిపోయింది. భర్త చనిపోతే అంతఃపుర స్త్రీలు సహగమనం చేసేవారు. గజ్జెలు, అందెలు, మంజీరం, మేఖల, కంకణం, కుండలాలు, భుజకీర్తులు, ముత్యాల ముక్కెర, చూడామణి ఆభరణ విశేశాలు.

సముద్రవ్యాపారానికీ, యుద్ధానికీ ప్రపంచ వ్యాప్తంగా పడవలు ఉపయోగించేవారు. ఒక నౌక జల మధ్యంలో ఆగిపోతే దానిని తాళ్లతో మరొక నౌకను కట్టి లాగించి ఒడ్డుకు చేర్చేవారు. ఈజిప్టు, గ్రీసు, రోమన్‌ ‌దేశాల నౌకలన్నా భారతీయ నౌకలు తేలిక చెక్కతో మన్నికగా ఉండే విధంగా నిర్మించినుట్ట తెలుస్తుంది. గుజరాత్‌, ‌తమిళనాడు, ఆంధ్ర (మచిలీపట్టణం), వంటి చోట్ల నౌకా నిర్మాణ, ప్రయాణ కేంద్రాలు ఉండేవి.

స్త్రీలు గుజ్జన గూండ్లు, కొయ్యబొమ్మల పెండ్లిండ్లు, బంతి ఆటలు ఆడేవారు. ఆనాటి నర్తన శాలలు (ఆడిటోరియం) అత్యంత ఆధునిక నిర్మాణ శైలిలో ఉండేవి. రాత్రివేళ కాగడాలే దారిదీపాలు.

వంటలో పురుషులు కూడా నైపుణ్యం చూపించే వారు. నదులపై స్త్రీలు పడవలు నడుపుతూ ప్రయాణీ కులను ఒడ్డుకు చేర్చేవారు. ధనవంతులు, నిరుపేద బ్రాహ్మణులు ఒకే గురుకులంలో విద్యాభ్యాసం చేసేవారు. రాజులు తమ కుమార్తెలకు స్వయంవరం ప్రకటించేవారు. భూమి నుండి ఒక గ్రహాంతరం సంచారం చేసిన కథలు ‘భారతం’లో పుష్కలంగా ఉన్నాయి. అలాగే విమానయానమూ ఉంది.

ఉత్తరాయణ (సంక్రాంతి) పుణ్యకాలం అత్యంత పవిత్రమైనది. జ్యోతిష్యం (అస్ట్రానమీ, అస్ట్రాలజీ) రెండూ వ్యాప్తిలో ఉన్నాయి. కాలగణనతో గ్రహణాలు ఎప్పుడు వస్తాయో తెలుసుకోగలిగేవారు. సైంధవుడు మరణించిన రోజున సూర్యగ్రహణం వచ్చింది. పటిష్టమైన గూఢచార వ్యవస్థ ఉండేది. రాజులు కూడా మారువేషాలలో సంచరించేవారు. జడలు అల్లటం, రంగవల్లులు తీర్చటం, పుష్పమాలికా నిర్మాణం ప్రత్యేకంగా కొందఱు స్త్రీలు వృత్తిగా స్వీకరించేవారు.

పేద బ్రాహ్మణులు చినిగిన బట్టలు ధరించి, అటుకులు తిని కాలక్షేపం చేసేవారు. కొందఱు బ్రాహ్మణులు క్షత్రియులుగా మారగా కొందరు దాసీపుత్రులు మహాజ్ఞానులై సామాజిక గౌరవాన్ని పొందారు.

అధ్యాయ విభజననుబట్టి ఆనాటి సమాజంలో భక్తి, జ్ఞాన, కర్మ, కర్మసన్యాస యోగవాదుల మధ్య సంవాదం జరుగుతున్నది అనేది సుస్పష్టం. ఏకం పృథక్‌ ‌శబ్దాలనుబట్టి ఏకేశ్వరారాధకులు, బహుదేవతారాధకులు ఉన్నట్లు స్పష్టం.

రుగ్వేదంలో సరస్వతీ సూక్తం ఉంది. ప్రణోదేవి / అంబితయే / ఏమఱి- కృష్ణుడు తాను గంగానదిని అవటంవలన 5000 ఏళ్ల నాటికే సరస్వతి అంతర్వాహిని అయిందేమో పురాతత్వశాస్త్రవేత్తలు చెప్పాలి.

About Author

By editor

Twitter
YOUTUBE