ఇప్పుడు హైదరాబాద్‌ అం‌టే ప్రపంచ విఖ్యాత నగరం. ఇది అందరికీ తెలుసు. కానీ ఇదే ఒకనాటి హైదరాబాద్‌ ‌సంస్థానమనీ, అందులో మన పూర్వీకులు, అంటే హిందువులు దినదిన గండం- నూరేళ్ల ఆయుష్షు అన్నట్టుగా,  కట్టు బానిసలు కంటే కడుహీనంగా నికృష్ట జీవనం గడిపారని చాలామందికి తెలియదు. ఆగస్టు 15, 1947న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా హైదరాబాద్‌ ‌సంస్థానానికి రాలేదనీ వారికి తెలియదు. స్వేచ్ఛకోసం ప్రజానీకం మరో స్వాతంత్య్ర పోరాటం చేస్తే, పదమూడు నెలల రెండు రోజులు ఆలస్యంగా సెప్టెంబరు 17, 1948న హైదరాబాద్‌కు స్వాతంత్య్రం వచ్చిందనీ తెలియదు.

సంస్థానంలో మెజారిటీ ప్రజలు హిందువులు. నిజాం రాజ్య పునాదులలో ఉన్నదంతా హిందువుల శ్రమ. ఆ సౌధం నిలిపినదీ వారే. వీరు ప్రధానంగా శాంతి కాముకులు. ఈ వాస్తవం మరచిన నిజాం హిందూ ప్రజానీకం ఆచార వ్యవహారాలని, సంప్రదాయాలని, విద్యా విధానాన్ని అస్తవ్యస్తం చేసి, తన అదుపులో పెట్టుకోవడానికి అనుసరించని దుర్మార్గం లేదు. చరిత్ర పుటలు తిరగేస్తే మనకు కన్పించే నిజాం నైజం ఇదే. మత మార్పిడులకై ప్రత్యేక నిధి ఏర్పాటు చేశారంటేనే పరిస్థితిని అంచనా వేయవచ్చు. మత వ్యవహారాలు చూసే శాఖ ఉమూరే ముజహబి. హిందూ ఖైదీలను ముఖ్యంగా ఆడ ఖైదీలను ముల్లాలు ప్రత్యేకంగా జైళ్లకు వెళ్లి, మతం మార్చేవారు.

46వ నంబర్‌ ‌ఫర్మానా (1920) ప్రకారం హిందూ సార్వజనిక కార్యక్రమాలన్నీ నిషిద్ధం. జాతీయ నాయకులు లోకమాన్య బాలగంగాధర్‌ ‌తిలక్‌, ‌బిపిన్‌ ‌చంద్రపాల్‌ ‌వంటి వారి ఫోటోలపైన, వందేమాతరం నినాదంపైన నిషేధం విధించారు. గస్తీ నిపాన్‌ ‌తిరుపవన్‌ ‌తెచ్చిన 53వ నంబరు ఫర్మానా మరింత కఠినమైనది. 53 నంబర్‌ ‌ఫర్మానా పాఠ శాలల్లో తెలుగును బోధనా భాషగా నిషేధించింది. పత్రికలపైనా ఆంక్షలు విధించింది. ఉర్దూ మాద్యమం గానే విద్యావ్యవస్థ సాగింది. ఇక చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి వంటి వృత్తిపనుల వారు వెట్టి చాకిరీతో బ్రతుకులీడ్చేవారు. అర్థాకలితో నకనకలాడుతూనే అధికారుల సవారీ ముందు జంతువుల్లా పరుగెత్తేవారు. ఒంటినిండా బట్ట, కడుపునిండా తిండి రెండూ లేవు.

ఇలాంటి సమాజంలో కొత్త ఉషోదయమే ఆర్య సమాజ్‌ ‌రాక. గురుకులాల స్థాపన, జాతీయ భాషగా హిందీ, వేదా ధ్యయనం, స్త్రీవిద్య, సమాజంలో జవసత్వాల కోసం అఖాడాలు (వ్యాయామశాలలు) ప్రారంభించడం, సత్‌సంఘాలు, యజ్ఞ సంస్కారం, గోవధ నిషేధం, మతమార్పిడి నిరోధం, శుద్ధి, స్వధర్మ స్వజాతి, స్వదేశీ, రాష్ట్ర చింతన, సంఘటిత సమాజం అవసరాన్ని గుర్తించేటట్టు చేసింది. వీటి సాధనకు ఆర్య సైనికులు ఇక్కడ సత్యాగ్రహం చేశారు. ‘ఇంతటి క్రమశిక్షణతో సుదీర్ఘకాలం సాగిన సత్యాగ్రహాన్ని నా జీవితంలో మొదటిసారి చూశాను. ఇది అద్భుత మైనది’ అని మహాత్మాగాంధీ ఆర్యసమాజ్‌ ‌సత్యా గ్రహాన్ని గూర్చి అన్నారు. తరువాత మనసు మార్చుకున్నారు. ఈ సత్యాగ్రహంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘం సభ్యులు కీర్తి ప్రతిష్టలను ఆశించకుండా వందలసంఖ్యలో పాల్గొన్నారు. దీని వివరాలు శ్రీ నానాపాల్కర్‌ ‘‌హెడ్గేవార్‌’ అనే గ్రంథంలో పేర్కొన్నారు. నాటి ప్రముఖ సంఘ నాయకులెందరో ఉద్యమానికి ఊతం ఇచ్చారు.

ఇలా నిజాం పాలన అంతం కోసం ఆర్య సమాజం, హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌, ‌కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులూ ఇతరులు పోరాడారు. ప్రజల మనోబలాన్ని, పోరాటశక్తిని గ్రామగ్రామాలకు అన్ని వర్గాలోకి తీసుకువెళ్లిన ఘనత ఆర్య సమాజానిది. కాని దురదృష్టవశాత్తూ ఆర్య సమాజం పాత్ర, ప్రాధాన్యాలను కుహనా లౌకికవాదులు తగ్గించివేశారు. కమ్యూనిష్టుల కంటే ముందు నైజాంను ఎదిరించి పోరాడి ప్రాణాలను తృణప్రాయంగా వదిలినవారు ఆర్యవీరులే.  దాదాపు పన్నెండు వందల సంవత్సరాలు పరాయి పాలనలో అవసాన దశకు చేరిన హిందూ సమాజాన్ని వెన్నుతట్టి లేపి ‘ఎన్నటికి విదేశీయుల రాజ్యం శిరోధార్యం కాజాలదు’ అని ఘంటాపదంగా చెప్పిన ధీశాలి స్వామి దయానంద. ఆయన స్థాపించిన ఆర్యసమాజ్‌ ‌దేశ స్వాతంత్య్రం కోసం స్వరక్షణ కోసం అవిరళ కృషి చేసింది. హైదరాబాద్‌ ‌సంస్థానంలో హిందువుల ధార్మిక స్వాతంత్య్రానికి జాతి పరిరక్షణకు ఆర్య సమాజం సత్యాగ్రహం ద్వారా బాటలు వేసింది.

హైదరాబాద్‌ ‌సంస్థానంలోని బీడు జిల్లా దారూర్‌లో గోకుల్‌ ‌ప్రసాద్‌ ‌కృషితో మొదటిగా 1891లో ఆర్యశాఖ ప్రారంభమైంది. గిరిజానంద సరస్వతి ఆధ్వర్యంలో 1892లో హైదరాబాద్‌లోని సుల్తాన్‌ ‌బజారులో ఆర్య సమాజ స్థాపన జరిగింది. మొదటి అధ్యక్షులు కామత్‌ ‌ప్రసాద్‌. ‌మంత్రిగా (నిర్వాహకులు) ఆదిపూడి సోమనాథరావు, ప్రధాన్‌గా లక్ష్మణ్‌ ‌దాస్‌, ‌ధర్మోపదేశకులుగా పండిత హరిహరదేవ్‌ ‌నియుక్తులయ్యారు. క్రమక్రమంగా రాష్ట్రమంతటా విస్తరించిన ఆర్య సమాజం విశ్వరూపం నిజాంకు వణుకు పుట్టించింది. అదే సమయానికి ఆదిపూడి సోమనాథరావు దయానంద సరస్వతి ప్రఖ్యాత గ్రంథం ‘సత్యార్థ ప్రకాశ్‌’‌ను తెలుగులోనికి అనువదించారు.

ఈ సమాజ ఆవిర్భావానికి ముందు మతాంతరీకరణ చెందిన హిందువులను తిరిగి స్వధర్మంలోనికి తెచ్చే పక్రియ అంటూ ఏదీలేదు. ఇటువంటి మతమార్పిడి వలన ఈ దేశానికి, హిందూ సమాజానికి శాశ్వతంగా వాటిల్లే నష్టం గురించి అంతగా పట్టించుకునేవారు కాదు. హిందూ జనాభా తరగటం ఇతర మతాల జనాభా పెరిగేది. ఇది ఓ పథకం ప్రకారం చేసిన పనే. దూరదృష్టి గల దయా నంద హిందూజాతి, దేశ క్షేమాన్ని గూర్చి ఆలోచించి శుద్ధి (పునరాగమన) సంస్కారాన్ని హిందూ సమాజానికి అందించాడు. లక్షలాదిగా మతం మారిన హిందువులను స్వధర్మంలోకి తీసుకొచ్చారు.

ప్రజల్లో ఐకమత్యం పెంపొందిస్తూ రామచంద్ర దెహల్వి ప్రసంగ ధార హైదరాబాదు వాసుల్లో సామాజిక స్పృహను అమితంగా కలిగించింది. పండిత నరేంద్రజీ రచనలు, ఆర్య సమాజ్‌ ‌పత్రిక ‘వైదిక ఆదర్శ’ ప్రజానీకానికి చక్కని సందేశాన్ని అందజేశాయి. ఆర్య సమాజ్‌ ‌ప్రచారాన్ని అరికట్టి జనబాహుళ్యాన్ని లొంగదీసుకోవాలనే ఉద్దేశంతో ‘‘ఇతైహదుల్‌ ‌ముసిల్మాన్‌’’ ‌తబ్లిక్‌ అనే పోటీ సంస్థలను, దీన్‌దార్‌ ఉద్యమాన్ని నిజాం ప్రారంభించాడు. 1934లో ‘వైదిక ఆదర్శ’, సత్యార్థ ప్రకాశ్‌ ‌గ్రంథాన్ని నిషేధించాడు నిజాం. అదే సంవత్సరం ఏప్రిల్‌ 12‌న హోమాలు, హవనాలు చేయడాన్కి సత్‌సంఘాలు నిర్వహించుకోరాదని హుకుం జారీ చేశాడు. నిజాం విధించిన నిర్బంధాల్ని ఎదిరించి నిలిచిందీ ఆర్య సమాజం. మజ్లిస్‌ అధ్యక్షులు బహదూర్‌ ‌యార్జంగ్‌ ‌హైదరాబాదుకు ఒక రహస్య సర్క్యులర్‌ ‌పంపాడు. అందులో పేద హరిజనుల్ని (నేడు ఎస్సీలు) పెద్ద సంఖ్యలో ముస్లింలుగా మతం మార్చాలనీ, ఈ పని అత్యంత గోప్యంగా జరగాలనీ ఉంది. రాష్ట్రంలోని తమ శాఖలన్నింటిని అప్రమత్తం చేసింది. ఈ కార్యభారాన్ని శ్రీ డా।। పండిత్‌ ‌నరేంద్రజీకి శ్రీ బలదేవ్‌ ‌పతంగికి అప్పగించారు. వారు మిర్యాలగూడ, సూర్యాపేట, పరకాల వరంగల్‌, ‌బావుపేట, దేవర కద్ర, దేవరకొండ, ప్రాంతాల్ని సందర్శించి ఇస్లాం పుచ్చుకున్న దాదాపు పదివేలమంది హరిజనుల్ని తిరిగి హిందూమతంలోనికి తీసుకువచ్చారు. ఈ విషయంలో చంద్రపాల్‌ ‌కృషి గొప్పది. వరంగల్‌ ‌జిల్లాలో ఆయన ఎంతో చైతన్యం తీసుకువచ్చారు.

వరంగల్‌ ‌జిల్లాలోని మానుకోట, నర్సంపేట, పర్కాల ములుగు, చల్వాయి, పెద్ద పెండ్యాల, చినపెండ్యాల, పల్లగుట్ట, ఘనపురం, ఉర్యు, కరీమాబాదు, రంగసాయిపేట, మడికొండ, ధర్మసాగరం, హసన్‌పర్తి, రాజారం, తాటికాయల, కాజీపేట, కడిపికొండ, ఆరెపల్లి, దామెర, నాగారం, జిమ్మికుంట, కమలాపురం మొదలైన గ్రామాల్లో ఆర్యశాఖలు ప్రారంభమైనాయి. అవే సమాజ సంరక్షణా కేంద్రాలుగా పరివర్తనం చెందాయి. ఇటువంటి నిర్మాణాత్మక కార్యక్రమాల్లో నిరంతరం పాటుపడ్డ వారిలో చెరకు కాంతయ్య, కాళోజీ నారాయణరావు, గార్లపాటి రాఘవరెడ్డి, పండిత వెంకటేశ్వరశాస్త్రి, కటంగూరు కేశవరెడ్డి, పాప వినాశార్య, పల్లా రామకోటార్య, బుర్రా కృష్ణస్వామి, నరసింహర్య, విలాసీరాం, పొత్కపల్లి కొండలరెడ్డి, తిరుపతిరావు, ఇటికాల మధుసూదన్‌రావు, వి.జనార్దన్‌ ‌గుప్త, మద్దాల అనంతయ్య, ముల్కల భూమయ్య, ఏటూరి వెంకటేశ్వర్రావు, మంతిప్రగడ వెంకటేశ్వర్రావు, బుర్రా శ్రీహరి, గుజ్జారి సత్యప్రకాశ్‌, ‌గంగు సత్యనారాయణ మున్నగు వారెందరో నిరంతరం శ్రమించి ఆర్య సమాజ శాఖను స్థాపించి, ప్రజల్లో చైతన్యం రగిలించారు. స్వాతంత్య్ర సమరం కోసం సమాయత్త చేశారు. మత మార్పిడిలను సమర్థంగా ఎదుర్కొని శుద్ధి కార్యక్రమాన్ని ఉధృతంగా కొనసాగించారు ఆర్య సమాజ కార్యకర్తలు. దీనితో బహదూర్‌ ‌యార్జంగ్‌, ఆర్య సమాజం పెరిగేకొద్దీ నిజాం ప్రతీ కార్యక్రమాన్ని నిషేధించడం ప్రారంభించాడు. నిజాం విధించిన ప్రతి నిషేధాజ్ఞను ధైర్యంగా ఎదిరించడం వలన ఆర్య సమాజానికి, నిజాంకు ప్రచ్ఛన్న యుద్దం ప్రారంభమైంది.

నిజాం ప్రభుత్వం ఆర్య సమాజం మీద ఎంత కఠినంగా వ్యవహరించాడో చెప్పేందుకు అనేక రుజువులు ఉన్నాయి. అందులో కొన్నింటిని చూద్దాం: హైదరాబాదులో జరిగిన నవ యువక సమ్మేళనంలో పండిత నరేంద్రజీ ‘హైదరాబాద్‌ ‌స్టేట్‌ 82 ‌వేల చ।।కిలో మీటర్ల సువిశాల చెరసాల’ అన్నందుకు ఆరు నెలలు జైలు శిక్ష వేశాడు నిజాం. ‘ఈ సంస్థానంలో ఏ కోర్టులో కూడా హిందువులకు న్యాయం జరగడం లేదు’ అన్నందుకు గణపతిలాల్జీకి మూడు నెలలు జైలు శిక్ష వేశారు. కల్యాణి ప్రాంతంలో ఆర్య సమాజాన్ని ప్రచారం చేసున్నాడనే కారణంగా మోహన్‌ ‌సింగ్‌ను, మురఖేడ్‌లో యజ్ఞగుండాన్ని పెట్టే ప్రయత్నం చేశాడని చౌదరి శ్రీరాంను జైలులో వేశారు. నాగర్‌కోయిల్‌లో రఘునాథ ప్రసాద్‌, ‌ఘనశ్యాం ప్రసాద్‌ అనే ఇద్దరు అన్నదమ్ములు యజ్ఞాలు చేయిస్తున్నారని శిక్షించారు. బీదర్‌లో భీమశంకర్‌ అఖాడాకు అనుమతి లేదని తాలూకా తహశీల్దారు మూయించాడు. అక్టోబరు 29, 1932న హల్లీఖేడ్‌లో బన్సీలాల్‌ శ్రీ‌రామచంద్ర రావు ఇంట్లో ఉపన్యసించడం నేరమని మండల అమీన్‌ ‌నోటీసు పంపాడు.

జూన్‌ 26, 1933‌న హల్లీఖేడ్‌లో నడిపే పాఠశాలకు అనుమతి లేదని మూయించారు. జూన్‌ 18, 1937‌న యజ్ఞాలు చేయడం చట్టవిరుద్ధమని ప్రకటించారు. ఏప్రిల్‌ 5, 1938‌న హైదరాబాద్‌లో ఉపన్యసించడానికి వచ్చిన పండిత దేవేంద్రనాథ్‌ ‌శాస్త్రిని నిజాం పోలీసులు ఆపడానికి ప్రయత్నించారు. నిజాం ప్రభుత్వం, పాసిస్టు, నాజిస్టు, కమ్యూనలిస్టు పరిపాలనపై ఆనాటి పరిస్థితును విమర్శించిన శ్రీరామ్‌శర్మ, రాజారాం శాస్త్రి, హకీం గణపతిరావు, చంద్రపాల్‌, ‌విష్ణు భగవంత్‌, ‌స్వామి సత్యానంద్‌లను మే 2, 1939న అరెస్టు చేసి శిక్ష వేశారు. ఆర్య సమాజంపై ఇలాంటి కక్ష సాధింపులు అనేకం నిజాం చేశాడు.

భారతదేశాన్ని పరాయి పాలన నుంచి విముక్తం చేయడానికి ఎందరినో స్వాతంత్య్ర సమరయోధులుగా తయారుచేసిన ఘనత ఆర్య సమాజానిదే. శ్యాంజీ కృష్ణవర్మ, లాలా హరదయాళ్‌, ‌భాయి పరమానంద, మదన్‌లాల్‌ ‌ధీంగ్రా, రాంప్రసాద్‌ ‌బిస్మిల్‌, అస్షాఖుల్లా, సర్దార్‌ ‌భగత్‌సింగ్‌, ‌చంద్రశేఖర్‌ ఆజాద్‌, ‌స్వామి శ్రాద్దా నంద, లాల లజపతిరాయ్‌, ‌బాబూ రాజేంద్ర ప్రసాద్‌, ‌భారత ఉక్కు మనిషి సర్దార్‌ ‌వల్లభాయ్‌పటేల్‌, ‌లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి, చౌదరి చరణ్‌సింగ్‌, ‌నిజాంను హత మార్చడానికి ప్రయత్నించిన నారాయణరావు పవార్‌ ‌వంటి వారంతా ఆర్య సమాజీయులు. లేదా దానితో ప్రభావితమైనవారే. ఆనాడు రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌, ఆర్య సమాజం నిజాం వ్యతిరేక ఉద్యమం నడవకపోయివుంటే ఈనాడు తెలంగాణాకు స్వాతంత్య్రం వచ్చేది కాదు, వచ్చినా ముస్లిం ఆధిపత్య ప్రాంతంగానే ఉండేది. రెండవ కశ్మీర్‌గా మారి ఉండేది.

– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE