తెలంగాణ సుసంపన్న, సస్యశ్యామల, ధనిక రాష్ట్రం. దేశంలోనే సంక్షేమ ఫలాలు ప్రజ లందరికీ అందిస్తున్న రాష్ట్రం. అవినీతి లేని రాష్ట్రం…. ఇవన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖరరావు నినాదాలు, వ్యాఖ్యలు, ప్రకటనలు. కానీ, వాస్తవ పరిస్థితి అలాగే ఉందా? లేక అందుకు విరుద్ధంగా ఉందా? అని పశ్నిస్తున్న ప్రతిపక్షాలు, సంక్షేమ ఫలాలు అర్హులందరికీ చేరడం లేదని వాదిస్తున్నాయి. ధనిక రాష్ట్రం కాదని, లోటు బడ్జెట్‌లో ఉందని లెక్కలు చెబుతున్నాయి. అసలు కేసీఆర్ పాలనే అవినీతిమయమని ప్రతీ సభలో, ప్రతీ సందర్భంలో అవి నినదిస్తు న్నాయి. అయితే, ఇప్పుడు స్వయంగా కేసీఆర్ నోటి నుంచే బయటికి వచ్చిన ఆ మాట సొంత పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతిపక్షాలకు ఆయుధమయ్యింది. వాస్తవమేంటో బయటకు రావాల్సిందేనన్న డిమాండ్లు నలువైపుల నుంచీ చుట్టు ముడుతున్నాయి. అంతర్గతంగా చెప్పాల్సిన అంశాలను బాహాటంగా సభలో ప్రస్తావించడం సంచలనంగా మారింది. కేసీఆర్‌కే బూమరాంగ్ అయ్యిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
దేశంలోనే ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు ముఖ్య మంత్రి సహా మంత్రులు, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ప్రతి సభలోనూ చెప్పడం సర్వసాధారణం కాగా. కొన్ని పథకాల విషయంలో వాటిని అంగీకరించా ల్సిందే అన్న భావన ఉంది. అయితే, సంక్షేమం విషయంలో అవినీతికి తావులేదని, ఇది అవినీతి రహిత రాష్ట్రమని కేసీఆర్ సహా ప్రభుత్వ యంత్రాంగం ప్రతిసారీ చెబుతుండటం కూడా కేసీఆర్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో చర్చనీయాంశమవుతోంది.
తెలంగాణలో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకం దళితబంధు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పూర్తిస్థాయి సబ్సిడీతో ఎస్సీల కోసం ఈ పథకాన్ని రూపొందించారు. సమాజంలో ఎస్సీలపై వివక్ష కొనసాగుతోందని, దానిని రూపుమాపే లక్ష్యంతో ప్రతి ఎస్సీ కుటుంబానికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అందులో భాగంగానే ఎస్సీలైన ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కూడా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రతి ఎస్సీ కుటుంబానికి రూ.పది లక్షల ఆర్థిక సాయం అందించడం దళితబంధు ప్రధాన ఉద్దేశం. ఈ పథకం కింద పొందిన ఆర్థిక సాయాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించవలసిన అవసరం లేదు. అంటే.. పూర్తి సబ్సిడీతో కూడిన సాయమన్న మాట. హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో ఈ పథకాన్ని ప్రకటించారు. అయితే, పథకం విధి విధానాల విషయంలో అప్పుడే పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఎస్సీల సాధికారత అంశం సమంజసమే అయినా, అట్టడుగున ఉన్నవాళ్లతో పాటు, ప్రభుత్వ ఉద్యోగు లకు కూడా వర్తింప జేయనవసరం లేదన్న వాదనలు వినిపించాయి. అంతగా సాయం చేయాలనుకుంటే.. ఇతర సామాజిక వర్గాల్లోనూ అంతకంటే అట్టడుగున ఉన్న కుటుంబాలను ఎంపిక చేసి సాయం అందించ వచ్చన్న సూచనలు వచ్చాయి. కానీ, ప్రభుత్వం మాత్రం వాటిని పరిగణనలోకి తీసుకోకుండా దళితబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే.. కొంతమేర మాత్రమే అబ్ధిదారులను ఎంపిక చేసి సాయం అందించారు. ఈ పథకం కింద రాష్ట్రమంతటా సాయం అందించా లంటే మరికొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది.
మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా తెలంగాణలో అమలవుతున్నాయి. వాటిలో రైతు బంధు, పింఛన్లు వంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే, వీటి కింద లబ్ధిదారులను ఎంపిక చేసే సందర్భం, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం విడుద లయ్యేటప్పుడు పెద్దఎత్తున అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు మొదటి నుంచీ వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో కొందరు ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారుల నుంచి బలవంతంగా ‘ఆమ్యామ్యా’లు వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విపక్షాలు తరచూ ఈ అంశాన్ని లేవనెత్తుతున్నా, వాటిమీద ఇన్నాళ్లూ పెద్దగా చర్చ జరగలేదు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. పార్టీ ఆవిర్భావ సమావేశం వేదికపైనే బహిరంగంగా ఎమ్మెల్యేలను హెచ్చరించడం, సంక్షేమ పథకాలకు ఎంపికైన లబ్ధిదారులనుంచి డబ్బులు వసూలు చేస్తు న్నారన్న లెక్కలు తన దగ్గర ఉన్నాయని చెప్పడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ ఎస్) పార్టీని స్థాపించారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించి, దీనితో కేసీఆర్ సీఎం అయ్యారు. తరువాతి ఎన్నికలలో (2018) కూడా విజయం సాధించారు. ఇక గతేడాది దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నట్టు ప్రకటించి టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి)గా మార్చారు. పేరు ఏదైనా పార్టీ గత నెల (ఏప్రిల్) 27వ తేదీకి 22 ఏళ్లు పూర్తి చేసుకుని 23వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. మంత్రులనుంచి పార్టీ జిల్లా స్థాయి నాయకుల దాకా తరలివచ్చారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన కేసీఆర్ ‘దళితబంధులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల చిట్టా నా దగ్గర ఉంది. కొందరు ఎమ్మెల్యేలు లబ్ధిదారుల వద్ద రూ. మూడు లక్షల వరకు తీసుకున్నారు. ఇది రిపీట్ అయితే వాళ్లకు టికెట్ ఉండదు’ అని బీఆర్‌ఎస్ నేతల గుండెల్లో బాంబు పేల్చారు. అనుచరులు డబ్బులు తీసుకున్నా ఎమ్మెల్యేలదే బాధ్యత అని స్పష్టం చేశారు. టికెట్ ఇవ్వకపోవడం కాదని, అసలు పార్టీలోనే ఉండబోరని కుండబద్దలు కొట్టారు. ఇప్పటికే చాలా సార్లు చెప్పానని, అయినా కొందరు ఎమ్మెల్యేలు వైఖరి మార్చుకోవడం లేదని మండి పడ్డారు. సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేల తోకలు కత్తిరిస్తా అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆ సభలో కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. దళితబంధుపథకంలో అవినీతి జరుగుతోందని స్వయంగా కేసీఆరే చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.
వాస్తవానికి ఎమ్మెల్యేల అనుచరులు రూ.లక్ష నుంచి 2లక్షల వరకు దండుకుంటున్న విషయం గతేడాదే మీడియా ద్వారా బయటకు వచ్చింది. డబ్బులు ఇచ్చి ఏడాది గడిచినా దళితబంధు కింద సాయం అందకపోవడంపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్న అంశం చర్చకు వచ్చింది. దళిత•బంధులో అవినీతి జరిగిందని తాజాగా స్వయంగా సీఎం కేసీఆరే స్పష్టంగా చెప్పడం రాజకీయ రగడ రాజేసింది. గతంలో ప్రతిపక్ష నేతలు విమర్శలు చేసి నప్పుడు ఖండించిన బీఆర్‌ఎస్ పెద్దలు పథకాన్ని పారదర్శకతతో అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు అవినీతి జరిగిందని కేసీఆరే ఒప్పుకోవడం రాజకీయంగా ఆ పార్టీకి మింగుడు పడని వ్యవహారంగా మారింది.
స్వయంగా ముఖ్యమంత్రే వ్యాఖ్యానించడం ఆషామాషీ కాదని విపక్షాల నేతలు అంటున్నారు. కమీషన్లు తీసుకున్న ఎమ్మెల్యేలను అంత సూటిగా, స్పష్టంగా విమర్శించిన కేసీఆర్ తన దగ్గర కచ్చితంగా వాళ్ల పేర్లు, అవినీతికి సంబంధించిన వివరాలు ఉంటాయని, అలాంటి ఎమ్మెల్యేల పేర్లు బయట పెట్టాలని, వారిని పదవుల నుంచి బర్తరఫ్ చేయాలని, అనర్హులుగా ప్రకటించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంకొందరు నేతలైతే, సీఎం వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని, విచారణ జరపాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నారు. కేసీఆర్ వ్యాఖ్యల ఆధారంగా దళితబంధు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరులో కమీషన్లు నొక్కేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై విచారణ జరపాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖకు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. పారదర్శకత, నిక్కచ్చితనం అంటూ పదేపదే నీతులు వల్లెవేసే కేసీఆర్, అవినీతిపరులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇకపై అవినీతికి పాల్పడవద్దని హెచ్చరించడం బాగున్నా, ఇప్పటి వరకూ జరిగిన కమీషన్ల దందాను ఎలా ఉపేక్షిస్తారని నిలదీస్తున్నారు.
30 శాతం కమీషన్ తీసుకునే ప్రభుత్వం మనకు అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలను రాబందుల్లా పీక్కు తింటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వాళ్లపై చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యం కేసీఆర్‌కు లేదని, ఎమ్మెల్యేల అవినీతిని ముఖ్యమంత్రే ప్రోత్స హిస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. కమీషన్లు తీసుకున్న ఎమ్మెల్యేల జాబితాను బయటపెట్టాలని, లబ్ధిదారులకు న్యాయంగా ప్రభుత్వం నుంచి రావలసిన డబ్బును ఎమ్మెల్యేల నుంచి తిరిగి ఇప్పిం చాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తాడికొండ రాజయ్యపై ఆరో పణలు రాగానే పదవి నుంచి వెంటనే తొలగించారని, ఇప్పుడు ఎమ్మెల్యేల అవినీతిపై స్పష్టమైన సమాచారం ఉందంటూనే ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రతిపక్షాల నేతలు నిలదీస్తున్నారు.
వాస్తవానికి ఈ పథకం అమలుకు సంబంధించి మొదటి నుంచీ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని 17 లక్షల ఎస్సీ కుటుంబాలకు విడతల వారీగా సాయం అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో సంతృప్తి స్థాయిలో పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించింది. అయితే, ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో పథకాన్ని అమలు చేస్తే, అక్రమాలు జరిగే అవకాశాలుంటాయని గతంలోనే ప్రతిపక్ష నాయకులు, నిపుణులు హెచ్చరించారు. అయినా పట్టించుకోని ప్రభుత్వం, లబ్ధిదారులకు నేరుగా నగదు రూపం లోనే సాయం మొత్తం ఇవ్వాలని నిర్ణయిం చింది. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించింది. ఎమ్మెల్యేలు ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకుని ముందుగా తమ అనుచరులు, కార్యకర్తలనే లబ్ధిదారులుగా ఎంపిక చేశారన్న ఆరోపణలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఒక్కో ఎమ్మెల్యే గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు లంచంగా తీసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. కొన్ని చోట్ల ప్రారంభించిన యూనిట్లలో నష్టాలు రావడం, కొన్ని మూతపడడం వంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇలాంటి పరిణామాలతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో తేరుకున్న ప్రభుత్వం..లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేల పరిధి నుంచి తప్పించి ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది.
అంటే.. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అవినీతి, అక్రమాలను ఇంతకుముందే గుర్తించింది. అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయడం, వాళ్లు ఎంపిక చేసుకున్న ప్రాజెక్టులు సాధ్యమా? కాదా? అన్న అంశాన్ని ప్రభుత్వ అధికారులైతే సమర్థవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంటుంది. పథకం మార్గదర్శ కాలను కూడా పరిగణనలోకి తీసుకొని, నిబంధనల ప్రకారం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అదే ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు అయితే.. జవాబుదారీ తనం ఉండకపోవచ్చు. అందుకే ఆలస్యంగా తేరుకున్న ప్రభుత్వం ఎమ్మెల్యేలను పక్కన బెట్టింది. ఈ మార్పులు జరిగి యేడాది అవుతుండగా… కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేలను హెచ్చరించడం వెనుక ఎన్నికల వ్యూహం దాగి ఉందంటున్నారు విశ్లేషకులు.
అసలే ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. ఈ పరిణామం బీఆర్‌ఎస్ నేతలకు మింగుడు పడటంలేదు. గులాబీ నేతల్లో గుబులు పట్టుకుంది. ఎన్నికల్లో తమకు టిక్కెట్ దక్కుతుందా? లేదా? అని చాలామంది ఆందోళనలో పడ్డారు. ఇప్పటికే 42 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు పీకే సర్వేలో తేలింది. పార్టీ నేతలతో పాటు గ్రామాల్లో కూడా వీరిని జనం పట్టించుకోవడం లేదని సర్వే సారాంశం.
ఈ సర్వేలో కొందరు ఎమ్మెల్యేలు నాలుగో స్థానానికి కూడా పడిపోయారట. ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు సర్వేలు ఇవే తేల్చాయం టున్నారు. అసలే ఈ టెన్షన్‌లో తలలు పట్టుకుంటున్న పలువురు ఎమ్మెల్యేలకు తాజాగా కేసీఆర్ హెచ్చరికలు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఉందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
– సుజాత గోపగోని, 6302164068, సీనియర్ జర్నలిస్