సంపాదకీయం
శాలివాహన 1945 శ్రీ శోభకృత్ వైశాఖ బహుళ ఏకాదశి
15 మే 2023, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
వేదిక ఏదైనా కశ్మీర్ సమస్యను లేవనెత్తడం పాకిస్తాన్‌కు ఉన్న దీర్ఘరోగం. ఆ ధోరణి అంతర్జాతీయ దౌత్య మర్యాదలకు వ్యతిరేకమే అయినా సిగ్గుపడదు. కశ్మీరీల హక్కులను భారత్ కాలరాస్తున్నదని గగ్గోలు పెట్టడమే దాని ధ్యేయం. తాజాగా 370 అధికరణ రద్దు మహాపరాధం అంటూ కొత్త పల్లవి అందుకుంది. మే 4,5 తేదీలలో గోవాలో జరిగిన షాంఘై సహకార వ్యవస్థ సమావేశాలలోనూ పొరుగు దేశానిది ఇదే పోకడ. ఇదే అదునుగా భారత విదేశ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ పాక్ ‘చేదు వాస్తవాలను గమనించేటట్టు’ చేశారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ముఖం వాచేటట్టు ఆ ప్రతిస్పందన ఉంది. ‘పాకిస్తాన్‌తో భారత్ చర్చించే విషయం ఏదైనా ఉన్నదీ అంటే, అదొక్కటే- ఆక్రమిత కశ్మీర్ నుంచి పాకిస్తాన్ ఎప్పుడు ఖాళీ చేస్తుంది? అసలే పాకిస్తాన్ విశ్వసనీయత ఆ దేశ విదేశీ మారక నిల్వల కంటే వేగంగా తరిగిపోతోంది’ అనీ చురక వేశారు జైశంకర్.
మోదీ మీద బిలావల్ నోరు పారేసుకోవడం వల్ల 2020లో ఇక్కడ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమైనాయి. కాబట్టి బిలావల్‌తో దౌత్యం అంటే పాకిస్తాన్ పిల్లిని చంకనపెట్టుకుని వచ్చినట్టే. గోవా సమావేశాల సమయంలోనే రాజౌరీలో భద్రతాదళాల మీద ఉగ్రవాద దాడి జరిగింది. ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఇవన్నీ భారత విదేశాంగమంత్రి దృష్టిని దాటి పోవు. కరచాలనం సహా పాకిస్తాన్ విదేశాంగమంత్రితో జైశంకర్ ఆచితూచి వ్యవహరించారు. 370 అధికరణ రద్దు ఇక చరిత్ర పుటలలో అంశమని జైశంకర్ బల్లగుద్డి చెప్పారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్ అంతర్భాగమేనని పునరుద్ఘాటించారు. కాస్త మేలుకొని చేదెక్కుతున్న వాస్తవాలను గమనించుకుంటే మంచిదని కూడా బిలావల్‌కు జైశంకర్ చెంప చెళ్లుమనే విధంగానే తగిలించారు. ఉగ్రవాదానికి బలైనవారు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నవారితో ఉగ్రవాదం గురించి చర్చించలేరని తీవ్రంగానే హెచ్చరించారు. జి20 సమావేశాలు జమ్ములో నిర్వహించడం గురించి పాకిస్తాన్ అభ్యంతరం చెప్పడం ఏమిటి? జమ్ముతో ఆ దేశానికేమిటి సంబంధం? అని కూడా జైశంకర్ నిలదీశారు. గోవా సమావేశాలు ముగిసిన వెంటనే చైనా విదేశాంగ మంత్రి కిన్ గంగ్ పాకిస్తాన్‌లో వాలిపోయారు. కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితి చార్టర్ మేరకు పరిష్కరించుకోవాలని అక్కడ నుంచి ఒక ఉచిత సలహా పడేశారు. ఇది చాలు, జైశంకర్ ప్రకటన ఆ రెండు దేశాలను ఎంత కుదిపిందో చెప్పడానికి.
కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించడం, 370 అధికరణను పునరుద్ధరించడం వంటి చర్యలు చేపడితే తప్ప పాకిస్తాన్ భారత్‌తో చర్చలకు అంగీకరించలేదని బిలావల్ ఈ సమావేశాలలో చెప్పడం వింతల్లో కెల్లా వింత. 2011లో నాటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బాని ఖర్ భారత్‌కు వచ్చారు. ఆమె వచ్చిన పుష్కరం తరువాత జరిగిన బిలావల్ పర్యటన ఆ లోటును కాస్త కూడా తీర్చేదిగా లేదు. పొరుగు దేశంతో భారత్ చర్చలకు ప్రతిపాదించినదెప్పుడు? అందుకే బిలావల్ అధిక ప్రసంగానికి మన విదేశాంగమంత్రి జైశంకర్ అంత దీటుగా స్పందించవలసి వచ్చింది. సరిహద్దు తీవ్రవాదంతో సహా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రతిఘటిస్తేనే భారత్ చర్చల గురించి ఆలోచిస్తుందని మళ్లీ స్పష్టం చేయవలసి వచ్చింది.
కశ్మీర్ అంశం లేవనెత్తితే పాకిస్తాన్‌లో ఇరకాటంలో పడక తప్పని పరిస్థితిని కొద్దికాలం క్రితమే మన ప్రభుత్వాధినేతలు సిద్ధం చేసుకున్నారు. 1947 తరువాత జరిగిన తప్పిదాలను సరిదిద్దడం తమ ప్రభుత్వ ప్రాథమ్యాలలో అగ్రస్థానంలో ఉన్నదని బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం బాహాటంగానే ప్రకటిస్తున్నది. అందులో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి భారత్‌లో అంతర్భాగం చేయడం కూడా ఒకటి. ఈ అంశానికి మోదీ సర్కార్ 2.0లో మరింత ప్రాధాన్యం కనిపిస్తుంది. 2019 నుంచి కూడా పలువురు కేంద్రమంత్రులు ఆ విషయం మీద స్వరం పెంచారు కూడా. 2019 సెప్టెంబర్‌లో ఐక్య రాజ్యసమితి సమావేశాలకు కాస్త ముందు మన విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ విషయం చెప్పారు. ఏదో ఒకరోజు ఆక్రమిత కశ్మీర్ భారత్ అధికార పరిధిలోకి వస్తుందని అన్నారు. ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనన్న మన వైఖరిలో మార్పేమీ లేదని తెగేసి చెప్పారు. తరువాత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఇదే అంశాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ప్రధాని కార్యాలయ వ్యవహారాల సహాయమంత్రి జితేంద్ర సింగ్ మే నెల ఒకటో తేదీన ఈ విషయం పునరుద్ఘాటించారు. ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడం, భారత్‌లో విలీనం చేయడం కేంద్ర ప్రభుత్వ ప్రాధమ్యాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయని చెప్పారు. లండన్‌లో ఉన్న కశ్మీరీ విద్యార్థులు, సామాజిక బృందాలను ఉద్దేశించి అక్కడ మాట్లాడుతూ ఈ విషయం చెప్పారాయన. ఆ ముహూర్తం ఎంతో దూరంలో లేదని కూడా ఆయన తేల్చి చెప్పడం గమనించదగిన అంశమే. దీనిని జితేంద్రసింగ్ తన అధికార పర్యటనలో చెప్పడం విశేషం. 370 అధికరణ రద్దుతో కశ్మీరీలమన్న భావన స్థానికులలో అంకురించిందని, సమానావకాశాలు అందుబాటులోకి వచ్చాయని కూడా ఆయన చెప్పారు.
ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగం చేయడంతో మాత్రమే సర్దార్ పటేల్ సంస్థానాల విలీనం మహా యజ్ఞానికి పరిపూర్ణత చేకూరుతుంది. ఐక్య రాజ్యసమితి నిస్సహాయత, కొన్ని మన రాజకీయ పార్టీల బుజ్జగింపు ధోరణి ఆ సమస్యను ఏడున్నర దశాబ్దాలుగా నానబెడుతూ వచ్చాయి. ఖండిత కశ్మీర్ నుంచి భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికై వచ్చిన శాసనసభ్యుల కోసం జమ్ముకశ్మీర్ శాసనసభలో అట్టేపెట్టిన స్థానాలు త్వరలోనే భర్తీ అవుతాయని మనసారా ఆశిద్దాం. అందుకే ఆక్రమిత కశ్మీర్ నుంచి పాకిస్తాన్ ఎప్పుడు ఖాళీ చేస్తుందన్న ప్రశ్న ఇంకా పదునెక్కాలి.