– వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ

విశాఖలో కార్యనిర్వాహక రాజధానికి ఉత్తరాంధ్ర ప్రజలు మద్దతు ఇవ్వరని గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలిపోవడంతో అమరావతి రాజధాని, దానిని డిమాండ్‌ ‌చేసే వారి పట్ల వైసీపీ ప్రభుత్వానికి కక్ష, అసహనం పెరిగి పోయాయి. శాసనసభ ఎన్నికలకు గడువు ఏడాది మాత్రమే ఉండటం,వాటికి ఈ గ్రాడ్యుయేట్‌ ఎన్నికలను సెమీఫైనల్‌గా వైసీపీ నాయకులే భావించడం, 108 అసెంబ్లీ స్ధానాల్లో జరిగిన 3 గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడం, వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక• విధానాలను ప్రజలు బహిరంగంగానే విమర్శించ డంపై పెద్దఎత్తున చర్చ జరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఆందోళన ప్రారంభమైంది. వైసీపీ నాయకులు వాస్తవాలను జీర్ణించుకోలేకపోతున్నారు. అమరావతి రైతులు, అమరావతి ఉద్యమానికి మద్దతు ఇచ్చిన మేధావులు, రాజకీయ పార్టీలపై గత నాలుగేళ్లుగా చేస్తున్న దాడులు చివరి ఏడాది మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజల సమస్యలను, వారు పడుతున్న బాధలు విపక్షాలు విననీయకుండా చేయడం, ప్రతిపక్షాలు ప్రజలకు మద్దతును ఇవ్వనీయకుండా, వాటి గళాలను విప్పనీయకుండా ప్రభుత్వం అన్నిరకాల నియంత్రణ చర్యలు చేపట్టింది. జీవో నెంబరు 1 తీసుకొచ్చి ప్రతిపక్షాల బహిరంగ సభల నిర్వహణపై నియంత్రణ విధించింది.

ఈ నేపథ్యంలో అమరావతి రైతుల ఉద్యమం 1200వ రోజులకు చేరిన సందర్భంగా ఆ ప్రాంతంలో జరిగిన సమావేశానికి హాజరైన అన్ని పార్టీల ప్రతినిధులు రైతు ఉద్యమానికి మద్దతు కొన సాగిస్తూనే, ప్రభుత్వ దమననీతిని దుయ్యబట్టారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌, ‌మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, నాతో పాటు కొందరు బీజేపీ నేతలం హాజరయ్యాం. వైసీపీ అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై సత్యకుమార్‌, ఆదినారాయణరెడ్డి ఎప్పటిలానే విమర్శలు చేశారు. వీరిపై ఎప్పటి నుంచో కక్ష పెంచుకున్న వైసీపీ నాయకులు మాటువేసి, తిరిగి వెళ్తున్న బీజేపీ నాయకులపై పోలీసుల సమక్షంలోనే భౌతిక దాడులకు దిగారు. ముఖ్యమంత్రి ఆదేశంతో, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ ‌పథకం ప్రకారం ఈ దాడులు చేయించారని బీజేపీ నాయకులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. పైగా బాధితులపైనే కేసులు నమోదు చేశారు. బీజేపీ చేసిన ఆందోళనలు, ఒత్తిడి మేరకు ఆ ప్రాంతంలోని జార్జి అనే వ్యక్తిని (సత్యకుమార్‌ ‌కారుపై రాయి వేసినట్లు చెప్పి) అరెస్టు చేసి సాధారణ కేసు పెట్టారు.

సంఘీభావమే నేరమా…?

ఈ సంఘటనలో బాధితులైన సత్యకుమార్‌ ‌తదితర నేతలు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం, అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ భూములిచ్చిన రైతులు చేస్తున్న ఉద్యమం మార్చి 31 నాటికి 1200వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా మందడంలోని దీక్షా శిబిరం వద్ద జరిగిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, ‌రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ తదితరులు పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేసిందంటూ మాట్లాడారు. ప్రసంగం ముగిసిన తర్వాత చేయి నొప్పిగా ఉందంటూ ఆదినారాయణ రెడ్డి విజయవాడ వెళ్లిపోగా, కార్యక్రమం అనంతరం సత్యకుమార్‌, ‌బీజేపీ ఇతర నాయకులు…సీడ్‌ ‌యాక్సిస్‌ ‌రోడ్డు మీదుగా విజయవాడకు పయన మయ్యారు. వారి వాహనశ్రేణి మందడం మలుపు వద్ద గల మూడు రాజధానులు దీక్షా శిబిరం వద్దకు చేరుకునే సరికి అక్కడ పెద్ద సంఖ్యలో మాటువేసి ఉన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా కూర్చున్నారు. సత్యకుమార్‌ ఉన్న వాహనంపైకి రాళ్లు రువ్వారు. జెండా కర్రలతో కొట్టడంతో కారు అద్దం పగిలింది. సత్యకుమార్‌, ఆదినారాయణ రెడ్డిలను అసభ్య పదజాలంతో దూషిస్తూ, ‘వారెక్కడ’? అంటూ అన్ని వాహనాల్లో వెతికారు. సత్యకుమార్‌ ‌వాహనానికి రక్షణగా నిలిచిన బీజేపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు, నాయకులు దాడికి దిగి పిడిగుద్దులు గుద్దారు. సత్యకుమార్‌ ‌వ్యక్తిగత సహాయకుడు కాశయ్యను ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్లారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎస్సీ నాయకుడు పణతల సురేష్‌ ‌మరి కొంతమంది పైనా దాడి చేసి, చొక్కాలు చించేశారు. ఈ ఘటనలో వారికి గాయాలయ్యాయి. సత్యకుమార్‌ ‌వాహనానికి ముందున్న వాహనం అద్దాల్ని కర్రలు, బండరాళ్లతో కొట్టి ధ్వంసం చేశారు. వాహనం దిగేందుకు యత్నించిన సత్యకుమార్‌ను పోలీసులు అడ్డు కున్నారు. వాహనశ్రేణికి అడ్డంగా నిలిచిన వైసీపీ నాయకుడిని తొలగించి సత్యకుమార్‌ను, ఆయన వాహనశ్రేణిని అక్కడి నుంచి పంపించారు.

వైసీపీ నాయకులు దాడి చేస్తూంటే పోలీసులు చోద్యం మాశారు. దాడి చేయడాన్ని అడ్డుకోబోయిన బీజేపీ నాయకుల్ని, కార్యకర్తలను రోప్‌ ‌పార్టీలతో నియంత్రించారు. బీజేపీ నేతల వాహనాలపై దాడిని అడ్డుకోలేదు. ఆ సమయంలో అక్కడున్న 500 మందికి పైగా పోలీసులు తలచుకుంటే అసలు దాడే జరగకుండా చూసే అవకాశమున్నా అలాంటి ప్రయత్నమే చేయలేదు. సత్యకుమార్‌, ఆదినారాయణ రెడ్డి మార్చి 31 ఉదయం రాజధాని ఉద్యమ శిబిరం వద్దకు వెళ్లినప్పుడు మూడు రాజధానుల శిబిరం వద్ద పోలీసులు, వైసీపీ కార్యకర్తలు ఎవరూ లేరు. కానీ బీజేపీ నాయకులు తిరిగి వచ్చేసరికి వైసీపీ కార్య కర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని దాడికి పాల్పడ్డారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ ‌పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ దాడులు జరిగాయని ఆరోపిస్తూ, బీజేపీ నాయకులు గుంటూరు రేంజ్‌ ‌డీఐజీ త్రివిక్రమవర్మకు ఫిర్యాదు చేశారు. ఆ దాడులకు నిరసనగా బీజేపీ రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలు నిర్వహించింది.

బాధితులపైనే కేసులు

ఎక్కడైనా నేరం చేసినట్లు ఆరోపణలు ఉన్నవారిపై కేసులు నమోదు చేస్తారు. కాని ఆంధప్రదేశ్‌లో అందుకు విరుద్ధమైన పరిస్థితి. దాడికి పాల్పడింది వైసీపీ నాయకులు, కార్యకర్తలు కాగా, బీజేపీ శ్రేణులు బాధితులు. కానీ గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు మాత్రం బాధితులపై తీవ్ర సెక్షన్ల కింద , దాడి చేసిన వైసీపీ వారిపై తేలికపాటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైసీపీ సానుభూతి పరుడు బేతపూడి రాజేంద్రకుమార్‌ ఇచ్చిన ఫి•ర్యాదు ఆధారంగా పోలీసులు బీజేపీ శ్రేణులపై కేసు నమోదు చేశారు. మరణానికి దారితీసేలా, తీవ్రగాయాలు కలిగించేలా భయోత్పాతం సృష్టించారని, నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డారని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, నేర సంఘటనలకు కారణమవుతుందని తెలిసి అవతలి వారిని రెచ్చగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగానే అవమానించా రని, అసభ్యకరంగా నినాదాలు చేశారంటూ ఐపీసీ 504, 505(2), 506, 294 సెక్షన్ల కింద బీజేపీ వారిపై కేసు నమోదు చేశారు. వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడ్డ బీజేపీ దళిత నాయకుడు పణతల సురేష్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వైసీపీ నాయకులపై తేలికపాటి సెక్షన్ల కింద కేసు నమోదైంది. బహిరంగ ప్రదేశంలో అసభ్యకరంగా నినాదాలు వేశారని, దాడికి పాల్పడ్డారంటూ ఐపీసీ 323, 204, 27 రెడ్‌విత్‌ 31 ‌సెక్షన్ల కింద కేసు పెట్టారు.కాగా, ఇది పోలీసుల ఏక•పక్ష వైఖరికి నిదర్శనమని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. వాస్తవానికి తమపై మోపిన నేరారోపణలన్నీ వైసీపీ వారు చేసినవని, తమతో సమానంగా వారిపైనా కేసులు పెట్టాలని బీజేపీ నేతలు చెబుతున్నారు.

పోటీ ఉద్యమం పేరుతో రౌడీయిజం

అమరావతి రాజధాని రైతులు ఒక పక్క దీక్షలు చేస్తుంటే అదే ప్రాంతంలో మూడు రాజధానులకు మద్దతు ఇచ్చేవారి పేరిట మరో శిబిరంలో దీక్ష చేస్తున్నారు. అయితే వీరంతా వైసీపీ డబ్బిచ్చి తెచ్చిన వారేనని ఆరోపణలు ఉన్నాయి. ఈ శిబిరం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇక్కడికి రోజూ పది మంది మాత్రమే వచ్చి, సాయంత్రానికి వైసీపీ నాయకులిచ్చే ‘కూలి’ డబ్బులు తీసుకుని వెళ్లిపోతారని విమర్శలున్నాయి. అమరావతి రైతులు ఏదైనా పెద్ద కార్యక్రమం, అన్ని పార్టీల సమావేశం నిర్వహించినపుడు వీరికి పనిపడుతుందట. ఈ సమయాల్లో ఎక్కువ మందిని అద్దెకు తెచ్చి, తమ రౌడీలతో కలసి విపక్ష నాయకులపై భౌతికదాడులు చేయడం ఇప్పటికి ఎన్నోసార్లు జరిగింది. ప్రభుత్వమే ఈ పోటీ ఉద్యమం దీక్షా శిబిరాన్ని పెంచి పోషిస్తుండటం ఉద్రిక్తతలు, గొడవలకు కారణం అవుతోందని విపక్ష పార్టీల ఆరోపణ.

ప్రజావిశ్వాసం కోల్పోతున్న పోలీసులు

రాష్ట్రంలో పోలీసులు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నారు. అధికార పార్టీకి గులాంగిరీ చేసే పోలీసుల వల్ల మొత్తం పోలీసు వ్యవస్థ అంటేనే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. శాంతిభద్రతలను అదుపుచేయాల్సిన బాధ్యత పోలీసు శాఖదే. తప్పుచేసిన వారిని అరెస్టు చేసి, బాధితులకు న్యాయం చేయడం, ప్రజలకు రక్షణ కల్పించడం పోలీసుల విధి. కాని కొందరు పోలీసు అధికారులు తమ వ్యక్తిగత స్వార్ధం కోసం అధికార పార్టీకి దాసోహం అయ్యారు.

అధికార పార్టీ చేసే రౌడీయిజాన్ని సమర్ధిస్తూ, బాధితులపై కేసులు నమోదు చేస్తూ ఉద్యోగ ధర్మాన్ని వెక్కిరిస్తున్నారు. ప్రతిపక్షాలను పోలీసు అండతో వేధిస్తే, అవి అధికారంలోకి వచ్చి ఇదే రీతిన కక్ష సాధింపు చర్యలకు పాల్పడవచ్చు. పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం కోల్పోయిన ప్రజలు ఆందోళనకారులు అవుతారు. దాంతో సమాజంలో శాంతిభద్రతలు లోపిస్తాయి. ఇది ప్రజల భద్రత, ప్రజాస్వామ్యానికి సమస్యగా మారుతుంది.

వ్యాసకర్త: ఛైర్మన్‌,‌సెంట్రల్‌ ‌లేబర్‌ ‌వెల్ఫేర్‌ ‌బోర్డు,

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ.

About Author

By editor

Twitter
YOUTUBE