‘తమ విశ్వాసాల మేరకు పండుగలూ, పర్వదినాలలో శోభాయాత్ర జరుపుకునే హక్కు భారతదేశంలో అత్యధికులైన హిందువులకు లేదా?’ కొన్ని దశాబ్దాలుగా వినబడుతున్న ప్రశ్న ఇది. ఈ మార్చి 30న జరిగిన రామనవమి శోభాయాత్రల తదనంతర పరిణామాలు ఇదే ప్రశ్నను మరొకసారి వేసుకోక తప్పనిసరి పరిస్థితి కల్పించాయి. ఎనిమిది రాష్ట్రాలలో నవమికి హిందువులు శోభాయాత్రలు నిర్వహించుకోవడానికి అనేక అగచాట్ల పాలయ్యారు. హింసాకాండ, దహనాలు తప్పలేదు. 2022లో దేశ రాజధానిలో జేఎన్‌యూ (కావేరి విద్యార్థి వసతిగృహం)లో జరిగిన దురాగతాన్ని గుర్తు చేసుకోవాలి. అక్కడ నవమి ఉత్సవాలు నిర్వహించిన ఏబీవీపీ విద్యార్థులను ఏదో విధంగా హింసించాలని వామపక్ష విద్యార్థి సంఘాలు శాకాహార, మాంసాహార భోజన వివాదం రేపాయి.  ఏఐఎస్‌ఎఫ్‌ ఏబీవీపీ వారి నవమి వేడుకను భగ్నం చేయడానికి యత్నించడమే కాదు, వసతిగృహమంతా మాంసాహారం పంపిణీ చేసింది. దేశంలో కొన్ని ప్రాంతాలకు శ్రీరామనవమి ఉరేగింపు ప్రవేశించడం నిషిద్ధమా? హిందువుల ఆరాధ్యదైవం రామచంద్ర మూర్తి కొలువైన రథాలు అటుగా వెళితే రాళ్లవర్షం తప్పదా? ఒకరో ఇద్దరో, లేదా పదులలో జనం చనిపోక తప్పదా? బిహార్‌, ‌బెంగాల్‌లలో ఐదు రోజుల తర్వాత కూడా విధ్వంసం కొనసాగడం అరాచకానికి పరాకాష్ట.

రామనవమి శోభాయాత్ర అనేకాదు, హనుమత్‌ ‌జయంతికీ, గణేశ్‌, ‌దసరా నిమజ్జనోత్స వాలకీ కూడా ముస్లిం మతోన్మాదుల నుంచి ఈ ప్రతిఘటన తప్పడం లేదు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలు గడచినా, ప్రపంచమంతా మారుతున్నా భారతదేశం లోని ముస్లిం మతోన్మాదులు మారడం లేదు. శాంతిని కోరే మతం ఇస్లాం అని చెబుతూనే ప్రతి హిందూ పండుగను ఎందుకు ద్వేషిస్తారు? కారణం ఇక్కడి సెక్యులరిస్టులు, ఉదారవాదులు, కమ్యూనిస్టుల ప్రోద్బలమే. పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్య మంత్రి మమతా బెనర్జీ ఇందుకు మంచి ఉదాహరణ.  ‘శ్రీరామనవమి ఉరేగింపు అటువైపు వెళ్లడానికి ప్రభుత్వం అనుమతి లేదు. అయినా వెళ్లారు’.. ఫలితంగానే ఆ ‘వర్గం’ ఇలాంటి దాడికి పాల్పడింది అని పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మార్చి 30న నిర్మొహమాటంగా చెప్పారు. ఆ విధంగా కొన్ని ప్రాంతాలలో హిందువులు తమ దైవాలతో ప్రవేశించరాదన్న లౌకికవాదుల షరతును పునరు ద్ఘాటించినట్టయింది. కానీ తమకు అనుమతి ఉందనీ, ఒక దశాబ్దకాలంగా శోభాయాత్ర సాగుతున్న మార్గం లోనే జరిపామని రామ్‌నవమి శోభాయాత్ర హౌరా ప్రాంత కన్వినర్‌ ఇం‌ద్రదేవ్‌ ‌దూబే చెబుతున్నారు. యాత్ర నిర్వహించే ప్రాంతం మ్యాప్‌ను పోలీస్‌ ‌స్టేషన్‌కు అందచేశామని కూడా చెప్పారు. ఈ సమయంలోనే పోలీస్‌ ‌శాఖ విశ్వహిందూ పరిషత్‌కు అందచేసిన షరతులతో కూడిన అనుమతి పత్రం కూడా బయటకు వచ్చింది. కానీ దీనికి సరైన సమాధానం లేదని టీఎంసీ ఇప్పుడు అడ్డంగా వాదిస్తోంది. ఆ వర్గం దాడి చేస్తుందని తెలిసి కూడా ఎందుకు వెళ్లారని వాదించారు. బీజేపీ, సంఘ పరివార్‌ ‌బయట నుంచి గూండాలను తెచ్చి ఇలాంటి అల్లర్లను సృష్టిస్తున్నవని కూడా చెప్పారామె. ఇది ప్రభుత్వ వైఫల్యమే తప్ప ముఖ్యమంత్రి ఆరోపణలలో నిజమేదీ లేదని పశ్చిమ బెంగాల్‌ ‌బీజేపీ నాయకుడు, ప్రతిపక్ష నేత సువేందు అధికారి అన్నారు.  ఔట్‌లుక్‌ ‌పత్రిక వెబ్‌సైట్‌ ఇచ్చిన సమాచారాన్ని బట్టి పశ్చిమ బెంగాల్‌లో విశ్వహిందూ పరిషత్‌ ‌వేయి శోభాయాత్ర లను ఏర్పాటు చేసింది. హౌరా, ఖరగ్‌పూర్‌, ‌బ్యారక్‌ ‌పూర్‌, ‌భద్రేశ్వర్‌, ‌సిలిగురి, అసన్‌సోల్‌ ‌ప్రాంతాలు జైశ్రీరామ్‌ ‌నినాదంతో మారుమోగాయి.

మధ్యప్రదేశ్‌లో మెట్ల బావి కూలిపోవడం తప్ప, అన్ని చోట్ల భక్తిప్రపత్తులతో హిందువులు మర్యాద రామన్న పుట్టినరోజు వేడుకను నిర్వహించుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌, ‌గుజరాత్‌లోని వడోదరలలో తీవ్రస్థాయిలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. శంభాజీనగర్‌లో ఉన్న ఒక హిందూ ఆలయం మీద కొందరు ముస్లిం మతోన్మాదులు రాళ్లు, పెట్రోలు బాంబులు విసిరారు. దీనితోనే గొడవ మొదలయింది. వడోదరలో ముస్లిం మతోన్మాదులు రెచ్చిపోయి నవమి శోభాయాత్రల మీద రాళ్లదాడికి దిగారు. ఢిల్లీలోని జహంగీర్‌పురాలో కూడా శోభాయాత్ర ప్రవేశించి నప్పుడు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ముంబైలోని పశ్చిమ ములద్‌, ‌మల్వానిలో కూడా మార్చి 30 రాత్రి రెండు ‘వర్గాల’ మధ్య ఘర్షణ జరిగింది.

పశ్చిమ బెంగాల్‌లో మార్చి 31న కూడా అల్లర్లు కొనసాగాయి. హౌరాలో కాజీపడా ప్రాంతం నుంచి శోభాయాత్ర సాగుతుండగా అల్లర్లు మొదలయి నాయని పశ్చిమ బెంగాల్‌ ‌పోలీసులు చెప్పారు. ముఖ్య మంత్రి మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాలకు తగ్గట్టే మిగిలిన చోట్ల కంటే ఇక్కడ అల్లర్లు తీవ్ర స్థాయిలోనే జరిగాయి. చాలా కార్లు ధ్వంసమైనాయి. దుకాణాలకు, ఆటో రిక్షాలకు, పోలీసు వాహనాలకు దుండగులు నిప్పు పెట్టారు. వదోదరలోని పంజ్రీఘడ్‌ ‌మొహల్లా దగ్గర ఫతేపురాలో మధ్యాహ్నం, కుంభర్వాడ దగ్గర సాయంత్రం అల్లర్లు జరిగాయి. ఫతేపురా అల్లర్లలో ఎవరూ గాయపడ లేదు. కానీ కుంభర్వాడ రాళ్లు రువ్విన ఘటనలో కొందరు మహిళలు గాయ పడ్డారు. ఫతేపురా శోభాయాత్రను విశ్వ హిందూ పరిషత్‌ ‌నిర్వహించగా, రెండోది బీజేపీ ఎంఎల్‌ఏ ‌మనీషా వకీల్‌ ‌నాయకత్వంలో జరిగింది.

అయోధ్యలో రామజన్మ భూమి ఇటీవలనే విముక్తయింది. కానీ రాముడి పుట్టినరోజు వేడుకను తమ విశ్వాసాల మేరకు హిందువులు జరుపుకునే వెసులుబాటు ఇంకా ఈ దేశంలో రాలేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటికీ ముస్లిం మతోన్మాదుల మనస్తత్వం మార లేదు. ఆధిపత్య భావన వదలడం లేదు. శ్రీరామనవమి శోభాయాత్ర మీద సరిగ్గా మసీదుల ఎదుట, ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలలో రాళ్లు పడడం, ఆపై అల్లర్లు జరగడం రివాజుగా మారింది. ఇందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, ‌విశ్వహిందూ పరిషత్‌లను బాధ్యులను చేయడం కూడా అంతే రివాజుగా మారింది. 1979 నాటి జంషెడ్‌పూర్‌ అల్లర్ల నుంచి ఇదే ధోరణి.

1979 సంవత్సరంలో రామనవమికి జరిగిన అల్లర్లను దేశంలోనే ఘోరమైన అల్లర్లుగా, నవమి శోభాయాత్రల చరిత్రలో జరిగిన అతి పెద్ద అల్లర్లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. జంషెడ్‌పూర్‌ ‌లేదా టాటానగర్‌ ‌ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది. దేశంలోనే ప్రణాళికాబద్ధంగా నిర్మించిన తొలి నగరంగా పేరు ఉంది. నిజానికి ఇది ఒకనాడు పూర్తిగా ఆదివాసీలు నివాసం ఉన్న స్థలం. తరువాత వారంతా పక్కనే ఉన్న దిమ్నాబస్తీ అనేచోట వలస వెళ్లారు. దీనికి మరొక పక్క ఉన్నదే సంబీర్‌నగర్‌. ఇది పూర్తిగా ముస్లింలు కేంద్రీకరించిన ప్రదేశం. దిమ్నాబస్తీలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సేవా కార్యక్రమాలు జరిగేవి. అప్పటికే క్రైస్తవ మిషనరీలు విపరీతం కావడంతో గిరిజనులు తమ మూలాలను మరచిపోకుండా ఉండేందుకు 1978 నుంచి రామనవమి వేడుకుల ఆ బస్తీలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రారంభించింది. కానీ గిరిజనుల సాగించే ఆ శోభాయాత్రను సంబీర్‌నగర్‌ ‌గుండా వెళ్లడానికి ఆ కాలంలోనే అధికారులు అనుమతించ లేదు. బిహార్‌, ‌మధ్యప్రదేశ్‌, ఒడిశా తదితర రాష్ట్రా లలో క్రైస్తవం పెరగడానికి కాంగ్రెస్‌ ‌పాలనే అనుకూలించినప్పటికి, ఈ 1979 నాటి ఉదంతం జరిగే నాటికి దేశంలో జనతా ప్రభుత్వం ఉన్నది. సంబీర్‌నగర్‌ ‌గుండా శోభాయాత్రకు అనుమతి నిరాకరించడంలో ఉన్న వివక్ష గురించి ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థల సభ్యులు (శ్రీరామనవమి కేంద్రీయ అక్షర సమితి) బాగా ప్రచారం చేశారు. హిందువులకు తమ దేశంలో శోభాయాత్రలు జరుపుకునే పూర్తి స్వేచ్ఛ లేదా? అని ప్రశ్నించారు. చివరికి అధికార యంత్రాంగం సంబీర్‌నగర్‌తో సంబంధం లేని ఒక మార్గాన్ని శోభాయాత్ర కోసం సూచించింది. అందుకు వారు అంగీకరించలేదు. ఆ సమయంలోనే మార్చి 1979లో నాటి సర్‌సంఘ చాలక్‌ ‌పరమ పూజనీయ బాలాసాహెబ్‌ ‌దేవరస్‌ అక్కడ పర్యటించారు. దీనితో హిందువులు మరింత జాగరూకులయ్యారు. మొత్తానికి అధికార యంత్రాంగం దిగివచ్చి సంబీర్‌నగర్‌ ‌మొత్తం శోభా యాత్రకు అనుమతించకపోయినా, షరతులతో యాత్ర జరపాలని నిర్ణయించారు. అయితే కొద్దిమందితో ప్రారంభమైన ఈ యాత్రలో చివరికి 15,000 మంది వచ్చి చేరారు. ఈ యాత్ర ఒక మసీదు ముందుకు రావడంతోనే ముస్లింలు ఆపేశారు. పోలీసులు వచ్చి కొంతమందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన హిందువులను విడుదల చేస్తే తప్ప ఈ ఊరేగింపు అక్కడ నుంచి కదలదని ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన స్థానిక శాసనసభ్యుడు (జంషెడ్‌పూర్‌ ఈస్ట్) ‌దీనానాథ్‌ ‌పాండే ప్రకటించారు. సంఘాన్ని వ్యతిరేకించేవారు కూడా అంగీకరించిన ఒక సత్యం, ఆ సమయంలో ముస్లింల వైపు నుంచి ఒక రాయి వచ్చి శోభాయాత్ర మీద పడింది. అప్పటికే ముస్లింలు అల్లర్లకు పూర్తి సంసిద్ధులుగా ఉన్నారు. దీనితో కొన్నిరోజుల పాటు అల్లర్లు, హత్యాకాండ జరిగాయి. జనతా పార్టీ నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌ ‌పది రోజుల తరువాత అల్లర్లను కఠినంగా అణచివేశారు. ఆ సమయంలో మొత్తం 108 మంది చనిపోయినట్టు సమాచారం. అందులో హిందువులు 25 మంది. ముస్లింలు 79 మంది (అంకె మారలేదు. ఇది నిజమే). రాష్ట్ర ప్రభుత్వం జితేంద్ర నారాయణ్‌ ‌నాయ కత్వంలో ఒక దర్యాప్తు సంఘాన్ని నియమించింది. ఈ కమిషన్‌ ‌పాండేనే తప్పు పట్టింది.

ఏప్రిల్‌ 16, 1986‌న దేశంలో కొన్నిచోట్ల రామనవమి శోభాయాత్రల మీద దాడులు జరిగాయి. అయోధ్య ఉద్యమం వేడి నేపథ్యంలో జరిగిన ఈ శోభాయాత్రలను ముస్లింలు అడ్డుకున్నారు.

1987లో జరిగిన నవమి సందర్భంగా ఢిల్లీలో జరిగిన శోభాయాత్రలో అల్లర్లు జరిగాయి. అయోధ్య ఉద్యమానికి వ్యతిరేకంగా అదే రోజు నిరసన ప్రదర్శన నిర్వహించిన ముస్లింలు శోభాయాత్రను అడ్డుకున్నారు.

1991(మార్చి 20)లో ఒరిస్సాలోని భద్రలోక్‌లో కూడా శోభాయాత్ర ముస్లింలు ఉండే ప్రాంతంలోకి ప్రవేశించగానే హింస చెలరేగింది.

ఏప్రిల్‌ 1, 1993‌న భత్కల్‌, ‌కమతక (ఉత్తర కర్ణాటక) అనే చోట నవమి శోభాయాత్ర మీద రాళ్లు విసిరిన ఘటన జరిగింది. పోలీసుల రికార్డుల ప్రకారమే 17 మంది హత్యకు గురయ్యారు. 90 మంది గాయపడ్డారు. 226 ఇళ్లు తగులబెట్టారు. 143 దుకాణాలను దోచుకున్నారు. ఇవన్నీ ముంబై దాడుల తరువాత జరిగాయి. భత్కల్‌ ‌తరువాత ఉగ్రవాద ముస్లిం మూకలకు అడ్డాగా తయారు కావడం చరిత్ర.

ఏప్రిల్‌ 5, 2006‌లో అలీఘడ్‌లో రామనవమి శోభాయాత్ర సందర్భంగానే అల్లర్లు జరిగాయి. ఐదుగురు చనిపోయారు.

2009లో మహారాష్ట్రలోని పుసద్‌ అనే చోట జరిగిన శోభాయాత్రను ముస్లింలు అడ్డగించారు. దీనితో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రాళ్లు రువ్వు కున్నారు. 70 దుకాణాలకు నిప్పు పెట్టారు. కాన్పూర్‌ (2014), ‌హజారీబాగ్‌ (‌జార్ఖండ్‌, 2016)‌లలోను శోభాయాత్రలలోనే అల్లర్లు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్‌లో ముస్లింలు శోభాయాత్రకు అభ్యంతరం చెప్పారు. లౌడ్‌ ‌స్పీకర్ల వినియోగాన్ని వ్యతిరేకించారు. ఇదే చివరకు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నాటు బాంబులు కూడా విసిరారు. అసన్‌సోల్‌, ‌జోధ్‌పూర్‌లలో 2029లోను, గుజరాత్‌, ‌జార్ఖండ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌పశ్చిమ బెంగాల్‌, ‌గోవా, మహారాష్ట్రలలో 2022లోను కూడా నవమి శోభా యాత్రల సందర్భంగా ముస్లింలు అల్లర్లు సృష్టించారు.

2022లో పది రాష్ట్రాలలో నవమి శోభా యాత్రలు దాడులకు గురైతే ఆ సంఖ్య ఈ సంవత్సరం ఎనిమిది అయింది. ఇది చెప్పుకోదగ్గ మార్పేమీ కాదు. ముస్లిం మతోన్మాదులలో ఆధిపత్య భావన నిలకడ గానే ఉంది. ఇదే వికృత వాదనతో ఆ వర్గాలు సాగు తున్నాయి. వీటికి సమాధానం ఇంకాస్త గట్టిగా ఉండాలంటే హిందువులు ఐక్యం కావడమే శరణ్యం. గొప్ప చరిత్రపురుషుడిని ఆరాధించే హక్కును హిందువులు కోరుతున్నారు. శ్రీరాముడు భారతదేశం లోని హిందువులకే కాదు, ఎన్నో ప్రపంచదేశాల జాతులకు కూడా ఆరాధనీయుడే. రామాయణం ఆదర్శ గ్రంథమే. అడుక్కుతింటున్న పొరుగు దేశాన్ని కాదు, ప్రపంచంలోనే బలీయ శక్తిగా ఎదుగుతున్న భారతదేశాన్ని ముస్లిం మతోన్మాదులు అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇప్పటికైనా మంచిది. ఇలాంటి వాతావరణాన్ని ప్రోత్సహించడానికి మమత వంటి వారు అబద్ధాలు చెప్పడం మానుకోవాలి.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE