ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
– పాలంకి సత్య
అతడి కష్టాన్ని గమనించిన హెలీనా ‘‘నేను రాసిపెట్టనా?’’ అన్నది. అతడామె వంక నిస్సహా యంగా చూసి ‘‘పాఠాలు గురు ముఖతః నేర్చు కోవ డమే కానీ, రాసే అవసరం ఎక్కువగా లేదు’’. అందునా ఈ ఆకులపై రాయడం నాకు సాధ్యం కావడం లేదు.
‘‘ఈజిప్టు వాసులు మాత్రమే ఈ ఆకులను ఉపయోగిస్తారు. గ్రీస్, రోమ్‌లలో వీటి వాడకం అంత ఎక్కువగా లేదు. చిరకాలంగా ఇక్కడ ఉన్నందువల్ల నేను రాయగలను’’.
వేరే మార్గం కనిపించని మిహిరుడు ఆమె మాటలు అంగీకరించి తాను రాయబోయే గ్రంథంలోని మొదటి శ్లోకం చెప్పాడు. ఆమె అతని వంక ఆశ్చర్యంగా చూసింది. ఆమెలో ఆ ఆశ్చర్యం ఎందుకో మిహిరునకు మొదట అర్థం కాలేదు. ఆ తర్వాత ఆమె ఆంతర్యం అవగతమైంది. ఆమెకు సంస్కృత భాషతో పరిచయం లేకపోవడమే కాదు. ఆ భాష ఉన్నదని తెలిసే అవకాశం కూడా లేదు. మిహిరుడామెకప్పుడు భరతభూమి గురించీ, సంస్కృత భాష గురించీ వివరంగా చెప్పాడు. విషయమర్ధమైన హెలీనా తనకు సంస్కృత భాష లిపిని నేర్పిస్తే, నేర్చుకుని, లేఖన చేయగలనన్నది.
నాలుగు దినములైనా గడవక ముందే ఆమె దేవనగరి లిపిని నేర్చుకుని, మిహిరుడు శ్లోకాలు చెబుతుండగా రాయడము ప్రారంభించింది.
దినకర వసిష్ట పూర్వాన్ వివిధ
మునీంద్రాన్ ప్రణమ్య భక్త్యాదౌ
జనకం గురుంచ శాస్త్రే
యేనాస్మీన్ నః కృతోబోధః
మొదటి శ్లోకం రాసి మిహిరునికి చూపించింది. ‘‘ఒక తప్పు కూడా లేదని’’ అతడు మెచ్చుకున్నాక హెలీనా శ్లోకార్ధం అడిగినది.
‘‘సూర్యుడు, వసిష్టుడు మొదలైన అనేక మునులకు, నాకు విద్య నేర్పిన నా జనకులకు నమస్క రించి’’ అంటూ మిహిరుడు చెప్పిన తర్వాత ఆమె మీరు మీ తండ్రి వద్దనే చదువుకున్నారా?’’ అని అడిగినది.
‘‘అవును’’ అని మిహిరుడు సమాధానమిచ్చాడు. ప్రశ్న అడిగే సమయంలో ఆమె గొతు బొంగురు పోయిన సంగతి శాస్త్ర రచనలో మునిగి ఉన్న వరాహ మిహిరుడు గమనించలేదు.
— —– —— —-
వరాహ మిహిరుడికి కాలం చక్కగా గడచి పోతున్నది. ఉదయమే స్నాన, జపాది కర్మలు, తర్వాత యవన గురువుల వద్ద విద్యాభ్యాసం, ఇంటికి వచ్చి స్నానం, పూజ నిర్వర్తించి, భోజనం చేయడం, ఆపైన రోమను ఖగోళశాస్త్ర గురువుల వద్ద పఠనం, సాయం సమయములో హెలీనా సహాయంతో గ్రంథ రచన.
ఒకనాడు రోమను గణితంలో ఉన్న తప్పును గురించి శ్లోకరూపంలో మనసులో అనుకుంటూ ఇంటికివచ్చాడు. యవన సిద్ధాంతం, రోమను సిద్ధాంతం చెప్పి,రోమనులు చెప్పిన దానిని అనుస రించకూడదన్న భావంతో శ్లోకం రచించాడు. హెలీనా ఇంటలేదు. ఏదో ఒక పనిమీద వెళ్లి ఉండవచ్చునేమో. తానే రాసుకోవాలని అనుకుంటున్న మిహిరునికి ఏడుపు వినిపించింది. ఇంటి యజమానురాలు దుఃఖిస్తున్నట్లున్నది. ధనం తక్కువ అయినదా? హెలీనా ఆ పని మీదనే వెళ్లినదా?
మిహిరుడామె వద్దకు వెళ్లి ‘‘అమ్మా, ఏమైంది? ఏదైనా దుర్వార్త తెలిసిందా?’’ అని అడిగినాడు.
‘‘ఏమీలేదు’’ అని ఆమె అన్నది.
‘‘అమ్మా, నన్ను మీ కుమారునిగా భావించండి. మీ కష్టం తెలిస్తే వీలయిన సహాయం చేయగలను’’. ధనం అవసరమన్న భావం మిహిరునితో ఉంది.
‘‘ఇది ఒకరు తీర్చగలిగిన కష్టం కాదు. ఎవరికీ ఇంతవరకూ చెప్పక పోవడానికి అదే కారణం. నా రహస్యం తెలిస్తే అవమానమే కానీ ప్రయోజనం లేదు’’.
మిహిరుడు మౌనంగా కూర్చున్నాడు.
కొంతసేపైన తర్వాత ఆమె ‘‘పరదేశవాసివి. నీకు తెలిసినంత మాత్రాన నష్టం లేదు. కానీ ఎవరికీ తెలియనీయవద్దు’’ అన్నది.
మిహిరుడేమీ మాట్లాడలేదు.
‘‘నా పేరు పాంపేయా. నేను రోమ్ పాలకునికి ఒకప్పటి భార్యను. నన్ను నా భర్త పరిత్యజించాడు. పాలకుని భార్యగా సకల సంపదలతో, గౌరవ మర్యా దలతో జీవించిన నేను నిరుపేదగా, భర్తృ పరిత్యక్తగా రోమ్‌లో ఉండలేకపోయాను. నేను ఏ తప్పు చేయలేదు. అయినా శిక్ష తప్పలేదు’’.
‘‘భగవంతుని లీలలు అర్ధం కావు కదా’’.
‘‘దేవతల ప్రసక్తి ఎందుకు? జరిగిన సంగతి తెలిస్తే నీవా మాటను అనవు’’.
మిహిరుడు మౌనం వహించాడు. పాంపేయా కనుల ముందు కదలాడిన ఆమె గత జీవితం వాగ్రూపంలో మిహిరుని కనులముందు నిలిచింది.
‘‘నేను రోమ్ పాలకుడు జూలియస్ సీజర్‌కు ఒకప్పుడు భార్యను. నా మాతామహుడైన సుయిల్లా వలన సీజర్ చిన్న వయసులో అనేక కష్టాలు అనుభవించాడు. రోమ్ వదలి పోవలసివచ్చింది. మా తాతగారి మరణాంతరమే తిరిగి రాగలిగాడు. వచ్చిన తర్వాత అనేక విజయాలు సాధించాడు. అతని భార్య మరణించిన అనంతరం నాతో పెళ్లి కావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
కొంతసేపు ఆగిన పాంపేయా తర్వాత జరిగినది చెప్పసాగింది.
ఒకనాడు దేవీపూజ చేస్తూ బంధుమిత్రులైన స్త్రీలను ఆహ్వానించాను. పురుషులకు ప్రవేశం లేని గృహాంతర్భాగంలోనికి క్లోడియస్ అనే పురుషుడు స్త్రీ వేషధారియై ప్రవేశించాడు. అతడు లోనికి వచ్చిన విషయం ఎలానో బయటపడింది. నన్ను ఆకర్షించి, తన ప్రేయసిగా చేసుకునేందుకు వచ్చాడన్నది పుర జనుల నమ్మకం. అంతటా ఈ విషయం చర్చనీ యాంశమైంది. క్లోడియస్‌ను న్యాయస్థానానికి రప్పించారు. కానీ నా భర్త అతని గురించి ఏ విధమైన ఆరోపణా చేయలేదు. వ్యతిరేకంగా సాక్ష్యమీయలేదు. క్లోడియస్ నిర్దోషి అని విడిచిపెట్టారు. కానీ, కానీ…’’
కొంతసేపు ఆగిన పాంపేయా ‘‘నా భర్త బహి రంగంగా నా భార్య ప్రవర్తన మీద ఎటువంటి సందేహాలకూ తావు ఇవ్వకూడదు’’ అని చెప్పి నన్ను పరిత్యజించాడు. జరిగిన అవమానం తట్టుకొనలేక, నావద్ద ఉన్న కొద్దిపాటి ధనంతో అలెక్సాండ్రియాకు వచ్చి నిరుపేద జీవితం గడుపుతున్నాను. ఎంత మరచిపోదామన్నా, నా భర్త కఠిన ప్రవర్తనను మరచి పోలేక, అప్పుడప్పుడు దుఃఖిస్తూ ఉంటాను’’ అన్నది.
వరాహమిహిరుడు మృదువుగా ‘‘అమ్మా! కొన్ని నిర్ణయాలు ఎంత కఠినమైనవైనా, ఎంత క్రూరంగా కనిపించినా పాలకుల• తీసికొనక తప్పదు. మా భూమిలో మేము దైవంగా ఆరాధించే శ్రీరామ చంద్రుడు ఇటువంటి పరిస్థితులలోనే తన ప్రియసతిని అడవులక• పంపవలసి వచ్చింది’’ అన్నాడు.
పాంపేయా తన దుఃఖాన్ని కొంతవరకూ మరచిపోయి,ఆశ్చర్యంగా ‘‘నిజమా?’’అని అడిగినది.
మిహిరుడు ‘‘అవును’’ అన్నాడు.
పాంపేయా ఎందుకు? అని అడిగినది.
‘‘కానీ ఆ మహాపురుషుడి చరిత్ర వింటే మీరు పూజించాలనే అనుకుంటారు’’
పాంపేయా రామ చరితం చెప్పమని అడిగింది. మిహిరుడు మొదలుపెట్టే సమయానికి హెలీనా తాను క్రయము చేసిన వస్తువులతో వచ్చి అక్కడ కూర్చు న్నది. వరాహ మిహిరుడు సంక్షిప్తంగా రామకథను చెప్పసాగాడు. దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలనీ, వారికి రామలక్ష్మణ, భరత, శత్రుఘ్నులనే కుమారులు కలిగారనీ చెప్పాడు. నెమ్మది, నెమ్మదిగా పాంపేయా, హెలీనాల మదికి కథ హత్తుకునేలా చెప్పి, సీతాదేవిని రావణుడు అపహరించడం, రావణ సంహారం, సీతను విడిపించి, అయోధ్యకు తిరిగివచ్చి శ్రీరాముడు పట్టాభిషిక్తుడయ్యేదాకా చెప్పాడు.
‘‘ఇంతటితో కథ సుఖాంతమైనదని అనకుంటాం. కొంతకాలానికి సీత గర్భవతి అయింది. శ్రీరామ చంద్రుడు ఎల్లవేళలా చారులను పంపి, ప్రజల కష్ట సుఖాలూ, తన పాలనపై జనుల అభిప్రాయాలూ తెలుసుకునేవాడు. లంకలో కొద్దికాలం నివసించిన స్త్రీని రాముడు స్వీకరించడం కొందరికి నచ్చలేదని ఆయనకు తెలిసింది. ప్రజాభిప్రాయమునకు విలువ నిచ్చి, ఆమె కోరిక మేరకు అడవులకు పంపాడు. వ్యక్తి సౌఖ్యంకన్నా సంఘశ్రేయస్సు గొప్పదని ఆయన భావన.’’
‘‘సీత ఏమయిది?’’ హెలీనా కుతూహలంగా ప్రశ్నించింది.
‘‘ఆమె ఒక రుషి ఆశ్రమంలో తల దాచుకుని, ఇద్దరు పిల్లలను కన్నది. కానీ అయోధ్యలో రామచంద్రుడామెకై పరితపించిపోయాడు. యాగం చేయవలసిన సమయం వచ్చినది. అది భార్యా సమేతంగా నిర్వహించాలి. ఆమె స్వర్ణ ప్రతిమను చేయించి, యాగం చేశాడు. చివరగా ఆమె కుమారులకే రాజ్యమిచ్చాడు’’.
పాంపేయా కనులు మూసుకుని, ఒక్క క్షణ ముండిపోయింది. ఆపైన కనులు తెరచి, ‘‘హెలీనా; ఆలస్యమవుతున్నది.వెళ్లి వంట ప్రారంభించు’’ అంది.
హెలీనా వెళ్లాక మిహిరునితో నెమ్మదిగా మాట్లాడింది.
‘‘నీవు చెప్పిన కథలోని రాజును మీరెందుకు దేవునిగా పూజిస్తారో తెలిసింది. ప్రజాభిప్రాయానికి విలువనిచ్చి, ఆయన భార్యను పరిత్యజించాడు. నా భర్త కూడా చేసినదే అదే అనిపిస్తుంది. సామ్య మంత వరకే. నన్ను వదలిపెట్టిన తర్వాత పునర్వివాహానికి ముందు ప్రేయసీమణులకు కొదవ లేదు. రాజ్యాలు కొల్లగొట్టి తెచ్చిన విలువైన వస్తువులు ఆ ప్రియ భామలకే ఇచ్చేవాడు. అయినా ఓర్చుకున్నాను. చివరకు సీజర్ ఇక్కడనే ఉండి, ఈజిప్టు రాణి క్లియోపాత్రాతో సరస జీవితం సాగిస్తున్నాడు.’’
మిహిరుని నోట అనుకోకుండా ఒక ప్రశ్న వచ్చింది. ‘‘ఈ దేశపు రాణి పేరు క్లియోపాత్రా అని తెలియదే. స్త్రీలు సింహాసనార్హతను పొందగలరా?’’
అప్పుడే అక్కడకు వచ్చిన హెలినా ‘‘మీకు నూతన శాస్త్ర విషయ పఠనం, గ్రంథరచన, రాత్రి నక్షత్ర పరిశీలన తప్ప భూమ్మీద జరిగే సంఘటనలతో పనిలేదు’’ అన్నది.
‘‘అదేమి మాట?’’
‘‘ఈ దేశమేలే రాజు ఎవరు?’’
మిహిరునికి తెలియదు. తెలుసుకునే ప్రయత్న మతడేనాడూ చేయలేదు. విద్యాభ్యాసం త్వరగా ముగించుకుని, భరతభూమికి తిరిగి పోవాలన్నదే అతని తలపు.
హెలీనా తిరిగి ప్రశ్నించింది. ‘‘ఈ దేశమేలే రాజు ఎవరు?’’
‘‘ఇప్పుడే ఈ దేశాన్ని క్లియోపాత్రా అనే రాణి ఏలుతున్నదని తెలిసింది. క్లియోపాత్రా అంటే జనకునకు శోభ తెచ్చునది అని గ్రీకు భాషలో అర్థం.
‘‘భాషాపాండిత్యాలకు లోటు లేదు’’ అని హెలీనా నవ్వింది. ఆపైన ‘‘ఈజిప్టునకు ఏలికలిద్దరు. క్లియో పాత్రా, టోలమీ. వారిద్దరూ సోదరీ సోదరులు మాతమ్రే కాక భార్యాభర్తలు.’’
‘‘సోదరీసోదరుల నడుమ వివాహమా?’’ వినడానికే తల్లడిల్లిపోయాడు. యవనులు మ్లేచ్ఛులని ఎన్నో మారులు ఎందరో అనగా విన్నాడు. కానీ ఇంత విశృంఖలత్వమా?
‘‘ఆ వివాహం ఈ మధ్యనే జరిగింది. రోమ్ పాలకుడు…’’ అంటూ చెప్పబోతున్న హెలీనాను ఆపి వంట పూర్తి చేయమని ఆదేశించింది పాంపేయా.
— —– —— —-
మరునాడు నగరంలో ఉత్సవం జరుగు తున్నందున చదువుకు అవకాశం లేదు. వరాహ మిహిరుడు తాను ముందునాడు మనస్సులో అనుకున్న శ్లోకాలను చెప్పగా హెలీనా లిఖించినది.
‘‘అయిదుగురు వ్యక్తుల అభిప్రాయాలను క్రోడీకరించి గ్రంథరచన చేస్తున్నారు. గ్రీకు సిద్ధాంతానికి పాలిశ సిద్ధాంతమన్న పేరేల?’’
‘‘పారసీక దేశంలో నాకు గ్రీకు ఖగోళ శాస్త్రం నేర్పిన గురువుగారి నామధేయం పాలే. ఆయన పేరును పాలిశ సిద్ధాంతమని రాశాను. నాకు పారసీక దేశంలో అనేకమంది గ్రీకులతో పరిచయం. కానీ సోదరీసోదరుల పరిణయం.. ఏనాడూ వినలేదు.’’
‘‘అది యవన సంప్రదాయం కాదు. గ్రీకులలోనూ ఆ సంస్కృతి లేదు. అలెక్సాండరు విశ్వ విజేత కావలెనన్న కాంక్షతో వరుసగా రాజ్యాలను జయిస్తూ వచ్చాడు. అతని మరణాంతరం గ్రీకు సామ్రాజ్యం విచ్ఛినమైంది. పారసీక ప్రాంతాన్ని సెల్యూకస్ తీసుకొన్నాడు. ఈజిప్టు టోలమీ వశమైంది. అలెక్సాండరు దండయాత్రకు ముందు ఈజిప్టును ఏలినవారే ఫారోలు. రాజవంశీకుల రక్తం ఇతరుల రక్తంతో కలసి కలుషితం కాకూడదట. అందుకే అలాంటి పెళ్లిళ్లని తప్పనిసరి చేశారు. ఈజిప్టు తమ వశమైనాక గ్రీకు ఏలికలకూ ఆ సంప్రదాయం తప్ప లేదు. కానీ సామాన్య ప్రజలలో అలాంటి వివాహాలు నిషిద్ధమే’’.
‘‘నీకీ విషయలెట్లా తెలిసినవి?’’
‘‘పరిచారికకు తెలియరాదని మీఅభిప్రాయమా?’’
‘‘లేదు… నేనట్లు అనుకొనలేదు. నేను నేర్చుకొన వలెనన్న మార్గమేది?’’
‘‘అలెక్సాండ్రియాలోని గ్రంథాలయంలో చాలా పుస్తకాలున్నాయి. ఈజిప్టు, గ్రీసు, రోమ్‌ల చరిత్రను అక్కడ చదివి తెలిసికొనవచ్చును’’.
మిహిరుడామెను మరికొంత సమాచారమడిగే లోపుగా పాంపేయా ‘‘హెలీనా’’ అని పిలిచినది.
— —– —— —-
అలెక్సాండ్రియాలోని పుస్తక భాండాగారం చూసిన వరాహ మిహిరునకు కళ్లు తిరిగినట్లయింది. నాలుగు లక్షల గ్రంథాలుండవచ్చు. అక్కడనున్న వారిని వివరాలడిగి, చరిత్ర చదవసాగాడు. నిత్య కర్మలు, యవన, రోమక ఖగోళ శాస్త్రాభ్యాసం, గ్రంథ రచనలకు చరిత్ర పఠనం తోడైంది. మరణా నంతరం కూడా తాము జీవిస్తామన్న నమ్మకంలో ఫారోలు తమకై తాము పెద్ద కట్టడాలు నిర్మించుకొన్నారట. రాజులంతా చనిపోయారు కానీ ఆ కట్టడాలు మాత్రం మిగిలాయి. భరత భూమికి తిరిగి ప్రయాణమయ్యే ముందు వాటినొకసారి చూడగలిగిన బాగుండునా? ఇదేమి కోరిక? భగవదాలయాలను చూడాలి కానీ మరణించిన వారి గుర్తులనా?
— —– —— —-
వారవ గడచిన తర్వాత వరాహ మిహిరుడు పాంపేయాతో రోమును గురువుల వద్ద నా విద్యాభ్యాసం పూర్తయివది. ఒక నెలలో గ్రీకు ఖగోళ శాస్త్ర పఠనం కూడా ముగియవచ్చును. చదువు పూర్తయిన వెంటనే మా ఇంటికి తిరిగి పోగలను. మీకు ముందుగా చెప్పడం నా ధర్మం’’ అన్నాడు.
పాంపేయా తల ఊపింది. కానీ మనసులో భయ పడింది. మిహిరుడిచ్చిన ధనంతో గృహ నిర్వహణకి లోటు లేకుండా గడచిపోతున్నది. ఇకపై ఎలా?
మిహిరుడామె ముఖకవళికలను గమనించలేదు. తన గ్రీకు గురువు ఇంటికి వెళ్లి చదువుకొనడం ప్రారంభించాడు. పాఠం పూర్తయిన తర్వాత గురువు తనకు గ్రామాంతరము వెళ్లవలసిన పని పడినదనీ, నాలుగైదురోజులకు కానీ తిరిగి రాలేననీ, మిహిరుడు తన వద్దకు రావలసిన పని లేదనీ చెప్పాడు. మిహిరుడు గురువును ‘‘నేను మీతో రావచ్చునా? ప్రయాణ మధ్యలో ఆగినప్పుడు చదువుకుంటాను’’ అన్నాడు.