– పాలంకి సత్య
ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
కాళిదాసు నెమ్మదిగా మాట్లాడాడు. ‘‘మహా ప్రభువులు తమకు తెలియనిదేమున్నది? దృశ్య కావ్యాలైన నాటకాలను సామాన్య ప్రేక్షక రంజక ములుగా మలచడం తప్పనిసరి. భరత ఖండం మీద యవనులు, శకులు దండయాత్రలు జరిపిన తర్వాత వారి సంస్కృతీ సంప్రదాయాల ప్రభావం భారతీయు లపై పడింది. అందుకే నాటకాలలోని నాయికను బేలగా సృష్టించడం, కథను మార్చి దుష్యంతుడామెను శాపవశమున మరచిపోయినట్టు చేయవలసి వచ్చింది.’’
‘‘కావచ్చును… మా మిత్రుడిప్పుడే మీ ‘మాళవికాగ్నిమిత్ర’ నాటక కథను చెప్పినాడు. స్త్రీలపై ప్రేమ గురించిన ఆలోచన తప్ప మరే విషయమూ పట్టనివాడు మహారాజయితే వంశ నాశనమూ, రాజ్య నాశనమూ తప్పవు. మీ కవితాశక్తి అమోఘం. ఆ శక్తిని మహోన్నతమైన నాయక పాత్ర చిత్రణకు ఉపయోగించమని మా సూచన. శ్రీరామచంద్రుని మించిన పాలకుడెక్కడ? రామరాజ్యమన్న మాట ఎల్లకాలం నిలిచిపోదా?’’
‘‘ప్రభువుల ఆజ్ఞ మేరకు శ్రీరామచంద్రుడు జన్మించిన రఘువంశంలోని రాజులను కీర్తిస్తూ రచన చేయగలను. నాటక రచన ప్రజా ప్రియమునకే అని గ్రహించినాను. నా కావ్యరచన ప్రజాహితం కోసమే అగుగాక’’.
‘‘త్వరలోనే ప్రారంభించగలరు!’’
కాళిదాసు విక్రమాదిత్యుని వద్ద సెలవు తీసికొని వెళ్లిపోయాడు.
మిహిరుడు విక్రముడితో ‘‘కవుల రచనా విధానాన్ని ప్రభువు శాసించ వచ్చునా’’? అన్నాడు.
‘‘కవులను శాసించడమా? కవులు నిరంకుశులని నాకు తెలియదా? నాయక పాత్ర చిత్రణ నా మనసుకు నచ్చలేదని చెప్పినాను. ఉత్తమ పాలక లక్షణాలు అగ్నిమిత్రునిలో కనిపించలేదన్నారు. ప్రజాహిత కార్యాలు నిర్వర్తించడం ప్రభువు ధర్మం. భోగాల మీదకు మనసు పోరాదు. పట్టాభిషేకం జరుపవలసిన ఘడియలో శ్రీరామచంద్రుడు వనవాస దీక్షను స్వీకరించినాడు. రాజు అనుసరించవలసినది ఆయన మార్గాన్నే’’.
‘‘నిజమే’’ అన్న మిహిరుడు ‘‘యాత్రపై నేను రాస్తున్న గ్రంథం పూర్తి కావచ్చినది’’ అన్నాడు.
‘‘నీ అలెక్సాండ్రియా యాత్ర త్వరలో జరుగ గలదు. రాబోవు శరదృతువులో వర్తక బృందమొకటి పారసీక, మెసపటోమియా, జూడియా దేశాల మీదుగా ఈజిప్టుకు బయలుదేరుతోంది. నీవు వారితో వెళ్లవచ్చును.’’
* * * * * *
జగత్తుకు మాతాపితలైన పార్వతీ పరమేశ్వ రులను స్తుతించి, రఘువంశ కావ్య రచన ప్రారంభించినాడు కాళిదాసు. సూర్యుని నుంచే ఉద్భవించిన రఘు వంశమెక్కడ, తానెక్కడ అన్న భయం కలిగింది. తనకు తాను ధైర్యం చెప్పుకుని రాయడం సాగించాడు.
ముందుగా రాజుల గుణ గణాలను వర్ణించాడు. ‘‘జన్మ నుంచీ పరిశుద్ధులు, ఫలాన్ని ఆశించకుండా పనిచేసేవారు, అర్థుల కోరికలను తీర్చేవారు, అపరాధులను దండించేవారు, త్యాగం చేయడానికే ధనమార్జించేవారు, మితభాషులూ, సత్య వాక్కు కలిగినవారు, సంతానం కోసమే గృహస్థ ధర్మాన్ని స్వీకరించిన వారు’’ అంటూ మొదలుపెట్టి రఘు వంశీయుల అనేక లక్షణాలను కాళిదాసు తెలియజేశాడు. విక్రమాదిత్య మహారాజు రచించమన్నది ఇటువంటి ఉత్తమ పాలకుల గురించే కదా అన్న భావం కాళిదాసు మనసులో కదలాడింది.
రఘు మహారాజు దిగ్విజయాన్ని వర్ణిస్తూ రాసిన నాల్గవ సర్గ పూర్తయిన తర్వాత కాళిదాసు విక్రమాదిత్యుని దర్శించి, కావ్యాన్ని వినిపించాడు.
‘‘మహాకవీ! రసరమ్యమైన కావ్యాన్ని మీ వలె సృష్టించడం ఇంకెవరీకీ సాధ్యం కాదు. మీరు కవి కులగురువులు. మా ఆస్థానమును మీరు అలంకరించెదరు గాక’’.
ఒక శుభ ముహూర్తంలో కాళిదాసుకు ఆస్థానకవిగా అభిషేకం జరిగినది. విక్రమాదిత్యుడు ఆనందపరవశుడై సభా మందిరాన్ని వీక్షించాడు. వైద్యశాస్త్ర నిపుణుడు ధన్వంతరి, పదకోశ నిర్మాత అమరసింహుడు, భాషా శాస్త్రవేత్త వరరుచి, జ్యోతిశ్శాస్త్ర పండితుడు, తన ప్రియమిత్రుడు వరాహమిహిరుడు. పరిపాలనకునిగా అన్ని విద్యలనూ పోషించడం తన ధర్మం. భరత ఖండ రక్షణలో, సనాతన ధర్మ పరిరక్షణలో, విద్యా పోషణలో తన కర్తవ్యం నిర్వర్తించడంలో సర్వేశ్వరుడు తోడ్పడుగాక.
* * * * * *
రాజాస్థానంలో కాళిదాసు అభిషేక మహోత్సవం చూసి ఇంటికి వచ్చిన వరాహమిహిరునికి తన మామగారైన డేరియస్ రాక ఆశ్చర్యాన్ని కలిగించింది. అతడు డేరియస్‌కు నమస్కరించి ‘‘మీ రాకను ముందుగా తెలియపరిస్తే నగర పరిసరాలలోనే ఎదురేగి ఉందును కదా!’’ అన్నాడు.
‘‘మా కుమారులిరువురూ దక్షిణ భారతంలో కొనుగోలుకై బయలుదేరినారు. దౌహిత్రుని చూడడానికి నేను వారితో వచ్చినాను’’ డేరియస్ అన్నాడు. మిహిరుడు ‘‘కొంతకాలం మీరు ఇక్కడనే ఉండమని మనవి’’ అన్నాడు. ఆదిత్యదాసు కుమారుని మాటను బలపరచినాడు.
మరునాడు ఉదయ సంధ్యావందనమైన తర్వాత మిహిరుడు తన జనకులకూ, మామగారికీ తాను యవన జ్యోతిషాన్ని మరింత నేర్చుకొనడానికి అలెక్సాండ్రియా వెళ్లగలననీ, చక్రవర్తి తనను పంపించేందుకు సహాయమందిస్తున్నారనీ చెప్పి, వారి ఆశీర్వాదాలు పొందాడు. ఛాయాదేవి కొంత అని ష్టాన్ని చూపినా, ఆపైన అంగీకరించి, దీవించింది.
ఏకాంతంలో ఖనా తన కోరికను వెలిబుచ్చింది. ‘నేను కూడా మీతో వచ్చేందుకు అంగీకరించమని ప్రార్థిస్తున్నాను.’’
‘‘ప్రార్థించడమేమిటి ప్రేయసీ! నీవు ఆజ్ఞాపించ వలసినదానవు. నేను నీ ఆజ్ఞను పాలించవలసిన వాడను’’.
‘‘అయితే నేను రావచ్చును కదా!’’
‘‘ప్రియా! పారశీక రాజ్యానికైతే నేను అంగీకరించేవాడను. ఆపైన ఉన్నవి మ్లేచ్ఛదేశాలు. అనార్యులు ఏలే ప్రాంతాలకు నిన్ను తీసికొని వెళ్లలేను. స్త్రీలకు రక్షణ కానీ, గౌరవం కానీ లేని దేశాలలో నివసించడం శ్రేయోదాయకం కాదు’’.
‘‘మిమ్ము వదలి ఉండలేను’’.
‘‘ఖనా! విద్యావతివి, వివేకవతివి. నీవిట్లు మాట్లాడుట పాడికాదు. తండ్రిగారికి గురుకుల నిర్వహణలో తోడ్పడడం, మామగారికి సౌకర్యాలు సమకూర్చడం, కుమారునకు చదువు చెప్పడం నీ కర్తవ్యాలు. కర్తవ్య దీక్ష గురించి నీకు చెప్పవలసని పని లేదు. నేను త్వరలోనే తిరిగి రాగలను. నీ చిరునవ్వే నాకు శ్రీరామరక్ష’’.
ఖనా కన్నీళ్ల మధ్య నవ్వింది.
‘‘అదిగో కుమారుడు సైతం నవ్వుతున్నాడు’’ అంటూ మిహిరుడు తన తనయుని వంక తదేకంగా చూస్తూ ఉండిపోయాడు.
* * * * * *
వరాహమిహిరుని యాత్ర అతడు అనుకున్నట్లు ఆరంభం కాలేదు. వాయవ్య దిశ నుండి శకులు భరతఖండం మీద దండెత్తినారని వేగు వచ్చింది. వర్తకులు భూమార్గంలో రాకపోకలు ఆపి, భరుకచ్ఛం నుండి నౌకలలో వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు. సముద్రయానం పాపకారకమని నమ్మకమున్న వరాహమిహిరుడు వారితో వెళ్లడానికి ఇష్టపడలేదు.
విక్రమాదిత్యుడు శకులను ఎదుర్కొనే ప్రయత్నాలు ప్రారంభించి, యుద్ధయాత్ర విషయమై తన పట్టమహిషితో సంభాషించాడు. వీరలక్ష్మీదేవి తాను కూడా యుద్ధంలో పాల్గొంటానని అన్నది.
‘‘వీరా! నీ పరాక్రమం నాకు తెలియనిది కాదు. కానీ ఇదివరలో సేన కదలినప్పుడు నేను ఉజ్జయినీ రాజ్యానికి మాత్రమే పాలకుడను. నేడు పదునెనిమిది రాజ్యాలు మన వశంలో ఉన్నవి. వాటినన్నిటినీ రక్షించుకొనవలసిన అవసరమున్నది. రాజ్య పాలనను, రాజధాని రక్షణను నీవు స్వీకరించెదవు గాక’’.
‘‘ప్రభువులు రాజ్యాలను జయించి, రాచ కన్యలను స్వీకరించెదరు గాక’’ అని మేలమాడిన భార్యతో విక్రముడు ‘‘అదేమి మాట?’’ అన్నాడు.
‘‘పదునెనిమిది రాజ్యాలు వశమైనవానికి పదునెనిమిది కన్యలు వశం కావడంలో వింత ఏముంది?
‘‘పదునెనిమిది రాజ్యాలను ఏలడం కన్నా, పదునెనిమిది మంది భార్యలను ఏలుకోవడం కష్టం సుమా!’’ విక్రముడు నవ్వుతూ అన్నాడు.
‘‘అది సాధారణ పురుషులకు వర్తిస్తుంది. మీ వంటి మహావీరునికి, కళాకోవిదునికి అతిలోక సుందరునికి ఏ కన్య వశం కాకుండా ఉండగలదు?’’
‘‘నేను మాత్రం నీకు వశుడిని!’’
కొంతసేపు సరస సంభాషణ, మరికొంతసేపు యుద్ధయాత్ర, రాజధాని రక్షణ, రాజ్య పరిపాలనపై చర్చ జరిగిన తర్వాత విక్రముడు స్కంధావార పరిశీలనకై కదిలాడు. తనను చూడడానికి రావలసిందని ఒక భటుని చేత వరాహమిహిరుని వద్దకు వార్త పంపించాడు.
సాయం సమయంలో వచ్చిన మిహిరుని తనతో పాటు రమ్మని విక్రముడన్నాడు. తన వలన ప్రయోజనమేమీ లేదనీ, తన రాక విక్రమునికి అవరోధం కాగలదనీ మిహిరుడన్నాడు.
‘‘బహు భాషా కోవిదుడవు. యవన, పారశీక సంప్రదాయాలు తెలిసినవాడవు. నీవు నాతో ఉండడం అన్ని విధాలా ఉపయోగంగా ఉండగలదు.’’
వరాహమిహిరుడు, ‘‘మిత్రుని మాటను కాదనలేను. చక్రవర్తుల ఆజ్ఞను ఉల్లంఘించలేను’’ అన్నాడు.
విక్రముడు సన్నగా నవ్వాడు.
ఇంటికి వచ్చిన మిహిరుడు తల్లిదండ్రులకూ, మామగారికీ విషయం తెలిపి, వారి ఆశీర్వాదాలను స్వీకరించి, ఖనాను అనునయించి, ప్రయాణ ప్రయత్నాలు ప్రారంభించాడు.
* * * * * *
శకులపై దండయాత్రకు ముహూర్తం నిశ్చయ మైంది. పట్టమహిషీ, ఇతర రాణులూ విక్రమాదిత్య చక్రవర్తికి నీరాజనమిచ్చారు. వేద పండితులు స్వస్తి వాచకాలు పలుకుతుండగా, నగర కాంతలు పువ్వులనూ, లాజలనూ చల్లుతుండగా ఉజ్జయినీ సేన వాయువ్య దిశగా పయనమైంది. నేపాల రాజు మానదేవుడు తన సేనలోని ముఖ్య భాగాన్ని పాచాల దేశంలో విక్రమాదిత్యుని సేనను కలుసుకునేలా పంపించాడు. పాంచాలసేన యుద్ధానికి సిద్ధంగా ఉన్నది.
సర్వ సేనలనూ సమీకరించిన చక్రవర్తి వితస్తా నదినీ, సింధు నదినీ ఏయే భాగంలో ఎక్కడెక్కడ దాటాలో నిర్ణయించి, శత్రువులను ఎదుర్కొనే వ్యూహ రచన చేశాడు. జన నష్టం తక్కువగా ఉండేలా శకులను ముట్టడించే పద్ధతులను సేనాపతులకు వివరించాడు. తాను సూచించిన మార్గాలలోనే సేనను నడిపి, శత్రువులతో యుద్ధం చేయమని ఆదేశించాడు.
విక్రమాదిత్యుని రణనీతి శత్రువులను సులభంగా ఓడిపోయి, పరాజితులయ్యేలా చేసింది. పరాజితు లను చంపరాదన్నది భారతీయుల యుద్ధనీతి. పారిపోతున్న వారిని వదలివేసిన పిదప విక్రమా దిత్యుడు ‘‘ఇప్పటిలో భరత భూమిపై ఎవరూ దండెత్తలేరు’’ అన్నారు.
‘‘విక్రమాదిత్య చక్రవర్తికి జయము. శకారికి జయము’’ అన్న జయజయ ధ్వానాలు మిన్నంటాయి.
సైనికులు విజయోత్సాహంతో పండుగ జరుపు కుంటుండగా, విక్రమాదిత్యుడు సేనాధిపతులతో చర్చలు జరిపాడు. శకులు పరాజితులైన మాట నిజమే. వారు తిరిగి దండెత్తకుండా ఉండడానికై చేయవలసినదేమిటి? సరిహద్దులలో సేనను మోహరించి ఉంచటమా? తమ సేనను ముందుకు నడిపి వారి రాజ్యాలను జయించటమా? ఏ మార్గం మంచిది?
‘‘సేనాధిపతులందరూ తమ అభిప్రాయాలను చెప్పిన తర్వాత విక్రమాదిత్యుడు ‘‘సేనను ముందుకు నడుపడమే మేలని మీలో ఎక్కువమంది ఉద్దేశంగా ఉంది. మాకును సేనతో ముందుకు కదలవలెననే ఉంది. కానీ రణయాత్ర శత్రు నిర్మూలనానికే కారాదు. భరతఖండ వీరపరాక్రమాలను ప్రదర్శించడమే ముఖ్యోద్దేశం. మన భూమి మీద దండెత్తే ఆలోచనను శకులు పూర్తిగా విస్మరించాలి. మన ధర్మం, సంస్కృతీ సంప్రదాయాలనూ వారికి తెలియజేయాలి తప్ప వారి సంప్రదాయాలను తిరస్కరించరాదు’’ అన్నాడు.
‘‘ప్రభూ! పారశీక దేశానికి ఆవల యవన రాజ్యముంది. ఒకప్పుడు పారశీక వారి ఏలుబడిలోనే ఉండేది. గ్రీకు రాజులైన అలెక్సాండరు, సెల్యూకస్ భరతభూమిపై దండెత్తి భంగపడిన విషయం ప్రభువులకు తెలియనిది కాదు. తమకంగీకారమైతే, మన రణయాత్రను పొడిగించవచ్చును’’ అని నేపాల సైన్యాధ్యక్షుడన్నాడు.
విక్రమాదిత్యుని ఆమోదంతో సభ ముగిసింది. మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం సేన ముందుకు సాగి పారసీక రాజధానిని ముట్టడించింది.
* * * * * *
యుద్ధంతో ఏ విధమైన సంబంధాన్ని పెట్టుకో కుండా, వరాహమిహిరుడు కాలి నడకన నగరంలోకి ప్రవేశించాడు. అడ్డగించిన రాజభటులతో తన యవన జ్యోతిష గురువులను కలవడానికి వెడుతున్నానని చెప్పి, ఆయన నివాసముండే ప్రదేశం గురించి తెలిపాడు. రాజ భటులలో ఒకడు మాత్రమతని వెంట వచ్చి, మిహిరుడు గృహంలోనికి వెళ్లిన తర్వాత కొంతసేపు నిలబడి వెళ్లిపోయాడు.
యవన పండితుడు శిష్యుని సాదరంగా లోనికి తీసుకుని వెళ్లాడు. ఆయన సంతోషంగా ‘‘నీ వంటి శిష్యుడు లభించడం నా అదృష్టం. కొంతకాలం నావద్ద ఉండమనే సాహసం చేయలేను. నగరాన్ని శత్రుసేన ముట్టడించినదన్న వార్త ఇప్పుడే తెలిసింది. నీవు వెంటనే అలెక్సాండ్రియాకు ప్రయాణం కట్టడం మంచిది’’ అన్నాడు.
‘‘గురువర్యా! భయపడవలసిన అవసరం లేదు. భరతఖండ చక్రవర్తి, ఉజ్జయినీ పతి విక్రమాదిత్యుడు సేనా సమేతంగా దండెత్తినారు. ఈ దండయాత్ర కేవలం బల ప్రదర్శనకే. ఇకపై శకులు కానీ, పార్థియనులు కానీ భరతభూమిని ఆక్రమించే ప్రయత్నం చేయరాదన్నదే వారి ఉద్దేశం. పౌరులకు ఎటువంటి హానీ జరగదు’’.
గురువులో భయం కొంతవరకూ తగ్గినది. గురుశిష్యులిద్దరూ అనేక శాస్త్ర విషయాలు చర్చించు కున్నారు. చివరిగా ఆయన ‘‘మిహిరా, నీకు నేర్పిన విద్య కన్నా నీవద్ద నేను నేర్చుకున్నదే ఎక్కువ. ఈ సంగతిని ఇదివరకే నీతో చెప్పినట్లు గుర్తు’’ అన్నాడు.
అలెక్సాండ్రియా నుంచి తిరిగి వచ్చేటప్పుడు తిరిగి దర్శనం చేసుకుంటానని చెప్పి వెలుపలకు వచ్చిన మిహిరుని మనస్సులో ఒక ఆలోచన మెరుపు వలె మెరిసింది. తాను రచించిపబోయే యవన సిద్ధాంత గ్రంథాన్ని గురువుల పేరుతో వెలయించుట తన ధర్మం. ఆయన పేరు పాల్. సిద్ధాంతానికి పాలిశ సిద్ధాంతమన్న పేరు సరి అయినది. ఆ ఊహా వరాహమిహిరునికి తృప్తినిచ్చింది.