ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో భయంకర సంక్షోభం తలెత్తింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య భగ్గుమన్న అగ్ని ఆ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది, నిజానికి, 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఎన్నికలకు సారథ్యం వహించిన పైలట్‌ను కాదని, అశోక్ గెహ్లోట్‌ను ముఖ్య మంత్రిని చేస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అధిష్టానాన్ని చిక్కులోకి నెట్టివేసింది. అధిష్టానం నిర్ణయం పర్యవసానంగా మొదలైన కిస్సా కుర్సీకా ఖేల్.. చివరకు కాంగ్రెస్ ఖేల్ ఖతం అయ్యే స్థితికి చేర్చిందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యమత్రి గెహ్లోట్, ఆయన అంతర్గత ప్రత్యర్థి సచిన్ పైలట్, మధ్య తాజాగా రగిలిన వివాదం రేపటి అసెంబ్లీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది.. ముఖ్యంగా, ఆ రాష్ట్ర సర్కార్ పైలట్ సీట్లో కూర్చోవాలన్న సచిన్ పైలట్ కల నెరవేరుతుందా? అనేది ఆసక్తికర చర్చగా మారింది.
రాజస్థాన్ అసెంబ్లీకి ఈ సంవత్సరం చివర్లో (నవంబర్, డిసెంబర్ నెలల్లో) లేదా అంతకంటే ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అంటే ఎన్నికలకు ఇంకా నిండా ఎనిమిది నెలల సమయం కూడా లేదు. మరోవంక ప్రధాన పతిపక్షం బీజేపీ ఇప్పటికే ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా ఇతర కీలక నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. ఈ వ్యాసం రాసే సమయానికి హోం మంత్రి అమిత్ షా రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు. భరత్‌పూర్‌లో బూత్ ప్రెసిడెంట్ సంకల్ప సమ్మేళనంలో పాల్గొన్నారు. బూత్ స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఇదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీలో మరో యుద్ధానికి తెరలేచింది. మరో ‘వార్’ మొద లైంది. కాంగ్రస్‌లో అంతర్గత కుమ్ములాటలు, ముఠా తగాదాలు, గ్రూప్ రాజకీయాలు కొత్తకాదు. ముఖ్యంగా రాజస్థాన్ విషయంలో అయితే గత నాలుగు సంవత్సరాలుగా గెహ్లోట్, పైలట్ వర్గాల మధ్య నిత్య సంఘర్షణ డైలీ సీరియల్’ గా నడుస్తూనే వుంది.
అవును, కథ పాతదే…‘కిస్సా కుర్సీకా’ కహానీ. గత నాలుగు సంవత్సరాలుగా వివిధ దశల్లో, వివిధ రూపాల్లో నడుస్తున్న నాటకమే, ఇప్పడు మరో రూపంలో తెరమీదకు వచ్చింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, మాజీ ఉప ముఖ్యమంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. ఇదేమీ రహస్యం కాదు. ఆ ఇద్దరి మధ్య గల శత్రుమిత్ర సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒకరిని ఒకరు అనని మాట లేదు. ఒకరిపై ఒకరు చేయని ఆరోపణ లేదు. అశోక్ గెహ్లూట్ అయితే, సొంత పార్టీకి చెందిన పైలట్‌ను ‘ద్రోహి’ అని దూషించారు. అదే మాటను పైలట్ ఇంకో భాషలో అన్నారు.
నిజానికి, గడచిన నాలుగు సంవత్సరాలలో ఆ ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు అనేకం పతాక శీర్షికలకు ఎక్కాయి. ఒకటి రెండు సందర్భాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచుల వరకు వెళ్లి వచ్చింది. ఇలా ఇద్దరి మధ్య విభేదాలు తెరపైకొచ్చిన ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుంది. అయినా,ప్రతి సందర్భంలోనూ గెహ్లోట్ దే పై చేయి అయింది. కారణాలు ఏవైనా అన్ని సందర్భాలలో అధిష్టానం గెహ్లోట్‌కే జై కొట్టింది. చివరకు, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సంద ర్భంగా గెహ్లోట్ అధిష్టానం దూతలను (అందులో ప్రస్తుత పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కూడా ఆన్నారు) అవమానించి పంపినా ఆయనపై చర్యలు తీసుకునే సాహసం అధిష్టానం (సోనియా, రాహుల్) చేయలేక పోయింది. గెహ్లోట్‌కు పార్టీఅధ్యక్ష బాధ్యత, పైలట్‌కు ముఖ్యమంత్రి బాధ్యత అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం గత ఏడాది నిర్ణయించింది. గెహ్లోట్ అందుకు ఓకే అంటూనే తెరవెనుక చక్రం తిప్పారు. ఆఖరు నిమిషంలో గెహ్లోట్ ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు జెండాఎగరేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో అధిష్టానం లొంగక తప్పలేదు. గెహ్లోట్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న పైలట్ డిమాండ్ కూడా నెరవేరలేదు. ఇదిగో అదిగో అంటూ చివరకు ఆ ఉదంతానికి ముగింపు పలికింది.
అందుకే ఇప్పుదు ఎన్నికలముందు పైలట్ ముఖ్య మంత్రి అశోక్ గెహ్లోట్‌పై మరోమారు యుద్ధం ప్రకటించారు. గత బీజేపీ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించా లన్నది ఆయన డిమాండే అయినా, లక్ష్యం ముఖ్య మంత్రి గెహ్లోట్ అనేది వేరే చెప్పనక్కరలేదు. అవును. గేహ్లోట్ టార్గెట్ గానే పైలట్ మిస్సైల్ ఫైర్‌చేశారు. పార్టీ అధిష్టానం హెచ్చరికలను బేఖాతారు చేస్తూ, ముందు ప్రకటించిన విధంగా, ఏప్రిల్ 11న తమ మద్దతుదారులతో కలిసి ఒక రోజు నిరశన దీక్షకు కూర్చున్నారు.
గత ప్రభుత్వ అవినీతిపై దర్యాప్తు జరిపిస్తామని హామీఇచ్చి అధికారంలోకివచ్చిన కాంగ్రెస్, ఆ ఊసేత్త కుండా రేపటి ఎన్నికల్లో ఏ ముఖంతో ప్రజల ముందుకు పోగలదని సచిన్ ప్రశ్నిస్తున్నారు. కానీ, నాలుగేళ్లతర్వాత, ఎన్నికలు తరుము కొస్తున్న సమయంలో పైలట్ రోడ్డెక్కడం ఏమిటీ? ఎందుకు? అంటే…అదేమీ బ్రహ్మరహస్యంకాదు. గెహ్లూట్‌ను ఆయనను వెనకేసుకువస్తున్న పార్టీ అధి ష్టానాన్ని ఇరకాటంలోకి నెట్టేందుకు పైలట్ వ్యూహాత్మకంగా పావులుకదుపుతున్నారని వేరే చెప్పనక్కరలేదు.
గత ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను అస్త్రాలుగా చేసుకుని గెహ్లోట్’ను ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహంతోనే పైలట్ పావులు కదుపుతున్నారు. గెహ్లోట్ తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే, గత ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించేందుకు భయపడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. గెహ్లోట్ అవినీతిని ఎండగట్టేందుకు సచిన్ బీజీపే భుజాలపై తుపాకీ పెట్టి గెహ్లోట్‌కి గురి పెడుతున్నారు.
విజేత పైలట్
ఇంతకూ ముందే అనుకున్నట్లు గెహ్లోట్, పైలట్ మధ్య యుద్ధం ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు. 2018 ఎన్నికలలో హస్తం పార్టీ విజయం సాధించినప్పటి నుంచీ వారిద్దరి మధ్య కిస్సాకుర్సీకా.. ఆటసాగుతూనే ఉంది. నిజానికి, ఆ ఎన్నికల్లో గెలి చింది కాంగ్రెస్ అయినా గెలిపించిన వ్యక్తి పైలట్. ఎన్నికలకు ముందు ఐదేళ్లు రాజస్థాన్ పీసీసీ అధ్య క్షుడిగా ఉన్న పైలట్’ అహోరాత్రులు శ్రమించారు. ఆ ఐదేళ్లలో పార్టీ బరువు బాధ్యతలు మొత్తం తన భుజాలకు ఎత్తుకున్నారు. పార్టీ అధికారికంగా ప్రకటించకపోయినా, కాబోయే ముఖ్యమంత్రి పైలట్ అనే ప్రజలు భావించారు. ప్రజలు ఆయనకే ఓటేశారు. అయితే, ఫలితాలు వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. పైలట్ కట్టిన కోటలో గెహ్లోట్ కుర్చీ ఎక్కారు. పైలట్ ఉప ముఖ్యమంత్రి కుర్చీకే పరిమితమయ్యారు. అది కూడా అట్టే కాలం నిలవలేదు. గెహ్లోట్ పొమ్మనకుండానే పొగపెట్ట డంతో పైలట్ తిరుగుబాటు జెండా ఎగరేశారు. క్యాంపు రాజకీయాలు నడిపారు. అయితే, గెహ్లోట్ ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని మెజారిటీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకున్నారు. పైలట్’ ఫ్లైట్ చాలావరకు ఖాళీ అయింది. కేవలం 10-15మంది ఎమ్మెల్యేలు మాత్రం ఆయన క్యాంపులో మిగిలారు. సంఖ్యాబలం లేక పైలట్ చతికిల పడ్డారు. అన్నిటినీ మించి పార్టీ అధిష్టానం, గెహ్లోట్ కొమ్ము కాయ డంతో పైలట్‌పై పోరులో ఆయన పైచేయి సాధిస్తు న్నారు. పైలట్ ఎప్పటికప్పుడు ఓడిపోతు న్నారు.
ఇప్పుడు కథ క్లైమాక్స్‌కు చేరిందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగి లాభం లేదని సచిన్ పై•లట్ కొంచెం చాలా ఆలస్యంగానే అయినా నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరోమారు పాత ట్రిక్ ప్లే చేసేందుకు ఎత్తులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. చర్చల పేరుతో కాలయాపన చేసి వేడి చల్లార్చేందుకు, సమస్య పరిష్కారానికి పార్టీ ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా చర్చలు జరపాలని పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి సుఖ్‌జిందర్ సింగ్ రణధవా నిర్ణయించారు. ‘పార్టీ వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడిన పైలట్‌పై క్రమశిక్షణ చర్యలు తప్పవని దీక్షకు ముందు హెచ్చరించిన అధిష్టానం, ఇప్పడు ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి నిర్ణయం తీసు కుంటామని చెప్పడం సమస్యను పక్క దారి పట్టించే ఎత్తుగడగా భావిస్తున్నారు. అలాగే, గత అనుభవా లను బట్టి చూస్తే, హోంమంత్రి అమిత్ షా అన్నట్లు, పైలట్ క్షేత్ర స్థాయిలో ఎంతగా కష్ట పడినా కాంగ్రెస్ పార్టీ ‘ఖజానా’ నింపడంలో ఆయన గెహ్లోట్‌తో పోటీపడలేక పోతున్నారు. అందుకే, అధిష్టానం ఎప్పుడు గెహ్లోట్ పక్షం వహిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధిష్టానం గెహ్లోట్ జోలికి రాదని, రాలేదని ఆయన వర్గం ధీమాగా వుంది. అందుకే ఆయన వర్గీయులు, మళ్లీ గెహ్లోటే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవంక, ఇప్పడు బంతి పైలట్ కోర్టులో ఉందని ఆయన ఇప్పటికైనా అటోఇటో తేల్చుకోలేక పోతే చివరకు ఎటూ కాకుండా పోతారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అందుకే పైలట్ కాంగ్రెస్ చేయి వదిలి, సొంత మార్గం ఎంచుకోవడమే ఉత్తమం అనే మాట వినిపిస్తోంది. అదే సమయంలో పైలట్ బీజేపీలో చేరతారా? లేక ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో చేయి కలుపుతారా? అనే ఊహాగానాలు వినిపిస్తునాయి. అలాగే, గుజ్జర్ ఓట్లకు గురి పెట్టి హనుమాన్ బెనీవాల్ పార్టీ, బీఎస్పీ, ఎన్సీపీ లతో జతకట్టే ఆలోచన కూడా ఉన్నదని అంటున్నారు.
అదలాఉంటే, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోమారు పతాక స్థాయికి చేరిన నేపథ్యం, అసలు కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందా? అంటే, అది అయ్యే పనికాదని అంటు న్నారు. పైలట్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా? లేదా అనే విషయంతో సంబంధం లేకుండా, ఈసారి ఎన్నికల్లో హస్తం పార్టీకి ఎదురు గాలి తప్పదని అంటున్నారు. ఇక ఇప్పడు పైలట్ చేయి వదిలి సొంత నిర్ణయం తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీ మరింతగా నష్ట పోతుందని, అదే సమయంలో పైలట్ పార్టీలో కొనసాగినా, అసమ్మతి రాజేసినా లేక మరో పార్టీలో చేరినా రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీగానే మూల్యం చెల్లించవలసి వస్తుందని అంటున్నారు.
పైలట్ నంబరు రాదు
ఈ నేపథ్యంలో రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో సాగుతున్న బీ ఇంటర్నల్ ఫైట్’ నేపథ్యంగా, సచిన్ పైలట్ ఏ సాకుతో ధర్నా చేసినా, ఆయన నంబర్ మాత్రం రాదంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితికి అద్దం పడుతు న్నాయని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు సచిన్ పైలట్ ఫ్లైట్ ఓ జీవిత కాలం లేటుగా నడుస్తుందని చమత్కరిస్తున్నారు. అదలాఉంటే, రాష్ట్రంలో క్షేత్ర స్థాయి పరిస్థితిని గమ నిస్తే, అంతర్గత కుమ్ములాటలతో పాటుగా, గెహ్లోట్ 3-డి(దంగే, దుర్వ్యహార్, దళిత అణచివేతే) ప్రభుత్వంపట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పరిశీలకులు అంటున్నారు. అందుకే, రానున్న రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి మూడింట రెండొంతుల ఆధిక్యత లభిస్తుందనే విశ్వాసంతో ఉన్న అమిత్‌షా, కాంగ్రెస్ నాయకులు అనవసరంగా ఆరాట పడుతున్నారని చురక వేశారు. నిజానికి ఏ విధంగా చూసినా రేపటి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది కమలం, ఓడేది హస్తం అంటున్నారు.
చివరగా ..
రాజస్థాన్ ప్రభుత్వాన్ని పైలట్‌గా ముందుండి నడిపించాలన్న సచిన్ ఆశ నెరవేరుతుందో లేదో ఇప్పటికిప్పుడే చెప్పలేం. కానీ ఒకటి మాత్రం నిజం. కాంగ్రెస్ గనక ఈసారి ఆయన లేకుండా ఎన్నికల బరిలోకి దిగితే 2013లో వచ్చిన 21 సీట్లు కూడా రాకపోవచ్చనేది విశ్లేషకుల అంచనా.
– రాజనాల బాలకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్