సంపాదకీయం
శాలివాహన 1945 శ్రీ శోభకృత్ చైత్ర బహుళ చవితి – 10 ఏప్రిల్ 2023, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
వాస్తవాన్ని వినువీధులకు ఎత్తిన ఘటన ఒకటి. నిజాన్ని ఎప్పటికీ పాతాళంలోనే తొక్కి ఉంచాలన్న జాత్యహంకారానికి అద్దం పట్టిన దుర్ఘటన మరొకటి. హిందూ వ్యతిరేక ఉన్మాదాన్ని సహించేది లేదంటూ అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని జార్జియా అసెంబ్లీ తీర్మానించింది. శ్వేతజాతి విద్యాసంస్థ విద్యార్థి సంఘానికి ఒక హిందూ జాతీయవాదీ, భారతీయుడూ నాయకుడా? అనుకుంటూ పోటికే అర్హత లేకుండా చేసింది ‘ఘనత వహించిన’ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్సెస్ (ఎల్‌ఎస్‌ఈ).ఈ రెండూ ఒక్కరోజు తేడాలో ప్రపంచ ప్రజల దృష్టికి వచ్చాయి.
అమెరికా సమాజం స్వేచ్ఛాజీవనానికి ఆలవాలం. భారతీయ సమాజం సంప్రదాయాలకు విలువ ఇస్తుంది. తను జీవిస్తున్న గడ్డ ఎడల భక్తిభావం ప్రదర్శించడం అందులో భాగమే. ఎన్ని తరాలు గడచినా, మధ్యలో ఆరాధనా పద్ధతులు మారినా మూలాలను విస్మరించడానికి మాత్రం అసలైన భారతీయులు సిద్ధపడరు. ఈ సత్యాన్ని చాలా దేశాలలో ప్రజలు ఏనాడో గుర్తించారు. ఇందుకు చక్కని ఉదాహరణ జార్జియా అసెంబ్లీ చేసిన తీర్మానం. ఈ తీర్మానం ఆమోదిస్తూ ఎంత చక్కని మాటలు చెప్పిందా సభ!
హిందూ వ్యతిరేక ఉన్మాదాన్ని (హిందూ ఫోబియా) అంగీకరించేది లేదని ఆ అసెంబ్లీ తన తీర్మానంలో వెల్లడించింది. ఇదిసరే, మరొక వాక్యం భారతీయుల తత్త్వాన్ని బాగా పట్టి ఇవ్వగలదు. వంద దేశాలలో భారతీయులు (హిందువులు) ఉంటున్నారు. 120 కోట్ల మంది ఆ ధర్మాన్ని అవలంబిస్తున్నారు. హిందుత్వం విస్తారమైనదే కాదు, పురాతనమైనది కూడా అని శ్లాఘించింది ఆ తీర్మానం. భారత్ తనకు తానుగా ఇరుగు పొరుగు మీద ఏనాడూ దండ యాత్రలు చేయలేదు. కానీ విదేశీయుల దురాక్రమణ ఫలితంగా వందల పర్యాయాలు ఆ సంస్కృతి, ధర్మం గాయపడ్డాయి. వంద దేశాలలో హిందువులు నివసిస్తున్నా వారి మీద వేర్పాటువాద, మతోన్మాద ఆరోపణలు లేవు. కయ్యానికి కాలు దువ్వే జాతి అన్న నింద లేదు. కాందిశికులుగా, శరణార్థుల పేరుతో కొన్నిదేశాలకు చేరిన వారు ఇప్పుడు ఆశ్రయం ఇచ్చిన పాపానికి అక్కడ వేర్పాటువాదాన్ని విస్తరింపచేశారు. తమది శాంతిని కోరే మతమంటూనే స్థానిక మతస్థుల హక్కులను హింసాయుతంగా గుంజుకుంటున్నారు. ఇదంతా వర్తమాన దృశ్యం.
భిన్న సంప్రదాయాలు, విశ్వాసాలకు చోటు కల్పిస్తూ సమరసతను ఒక విలువగా ఆచరిస్తూ పరస్పర గౌరవం కోసం, తద్వారా శాంతియుత వాతావరణం కోసం హిందుత్వం కట్టుబడి ఉంటుందని కూడా జార్జియా అసెంబ్లీ తీర్మానం పేర్కొన్నది. భారతీయ చరిత్రనూ, ధర్మాన్నీ చక్కగా వర్ణించిన మాటలు కావా ఇవి! హిందుత్వం అందించిన యోగ, సంగీతం, ఆయుర్వేదం, ఆహార పద్ధతులు ప్రపంచంలోనే విశిష్టమైనవి అని కూడా ప్రస్తుతించింది. ఇక జార్జియా రాష్ట్రం కూడా హిందువులకు సముచిత స్థానం కల్పిస్తున్నది. మార్చి 22న హిందువుల హక్కుల దినంగా పాటించింది. ఆ రోజు కార్యక్రమానికి అమెరికాలోని రెండు ప్రధాన పార్టీల నుంచి 25 మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. దాని ఫలితమే అసెంబ్లీ తీర్మానం. ఈ విధంగా హిందూ ఫోబియాకు వ్యతిరేకంగా తీర్మానించిన తొలి రాష్ట్రంగా జార్జియా చరిత్రకెక్కింది. లారెన్ మెక్‌డొనాల్డ్, టోడ్ జోన్స్ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. వీరిలో జోన్స్ హిందూ సంతతి వారు అధికంగా ఉన్న ఫోర్‌సిత్ కౌంటీకి చెందినవారే. హిందువుల సంఘీభావం ఇక్కడ అట్లాంటా చాప్టర్ ఆఫ్ ద కోవిలేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అనే సంఘం కూడా పనిచేస్తున్నది. వీరందరికీ భారతీయులంతా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే భారతదేశమంటే ఏమిటో తెలిసి కూడా నిద్ర నటిస్తున్న, మూర్ఖత్వం వీడడానికి మొరాయిస్తున్న మూఢులకు ఇదొక కనువిప్పు. అమెరికా కేంద్రంగానే డిజ్‌మ్యాంటిలింగ్ గ్లోబల్ హిందుత్వ వంటి తుంటరి ఉద్యమాలు మొదలెట్టిన వారికి చెంపపెట్టు. కానీ దుష్ప్రచారాలను మాత్రమే నమ్ముతూ భారత్‌మీద దురభిప్రాయాలను భద్రంగా దాచుకుంటున్న బ్రిటిష్ జాతీ యులకు ఇంకా కనువిప్పు కలగడం లేదు. ఇందుకు తాజా ఉదాహరణ ఇదే.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్సెస్ అంటే ప్రపంచ మంతా గౌరవిస్తుంది. కానీ అలాంటి గౌరవం అందుకోవడానికి ఆ సంస్థకు ఇప్పటికీ అర్హత ఉందా అన్నదే ప్రశ్న. ఎల్‌ఎస్‌ఈ విద్యార్థి సంఘానికి ఎన్నికలు ప్రకటించారు. వాటిలో ప్రధాన కార్యదర్శి పదవికి కరణ్ కటారియా ను పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారు. కారణం-అతడు భారతీయ మూలాలు ఉన్నవాడు. ఇంకా పెద్ద నేరం-ఆ జాత్యహంకార విద్యాసంస్థ ప్రాంగణమంతా పేరుకుపోయిన భారత వ్యతిరేక ప్రచారాన్ని ఖండించడం. న్యాయవాద వృత్తిలో ఉన్న కటారియా ప్రస్తుతం ఎల్‌ఎస్‌ఈలో పోస్ట్‌గ్రాడ్యు యేషన్ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ ఆయన ఏప్రిల్ 2వ తేదీన తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఒక భారతీయుడు, అందునా హిందువు ఎల్‌ఎస్‌ఈ విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించడమేమిటన్నదే వారి కడుపుమంట. తన మీద హిందూ జాతీయవాది అన్న ముద్ర వేసి పోటీలో లేకుండా చేశారని కటారియా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. 2021లో ఉడిపికి చెందిన రష్మీ సామంత్‌కు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో సరిగ్గా ఇదే అనుభవం ఎదురైంది. ఆమె గతంలో బీజేపీని సమర్థించిందన్న సాకు చూపి, విద్యార్థి సంఘ అధ్యక్ష పదవినుంచి గెలిచిన ఐదురోజులకే తప్పించారు. ఇతర సంస్కృతులనుంచి, దేశాల నుంచి వచ్చిన వారి మీద బ్రిటిషర్లు ఇలాంటి ముద్రలు వేయడం జుగుప్సాకరమైన విషయం. ఎల్‌ఎస్‌ఈ వికృతంతో పాటు కొన్ని దేశాలలో దారి తప్పిన సిక్కులు చేస్తున్న అలజడులను, భారతదేశంలో ముస్లిం మతోన్మాదులు గావిస్తున్న విధ్వంసాలను ప్రపంచం ఇప్పటికైనా వాస్తవికంగా చూడడం అవసరం.