– గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
శ్రీదేవిని నేను పూజించేవాణ్ణే కాని, ఒళ్లంతా పులుముకోవాలని తాపత్రయ పడేవాణ్ణి కాను. అంటే, నేను ఆస్తికుణ్ణేకాని, కొబ్బరికాయలు, అగరొత్తులు, హ్రీం హ్రీం అరుపులు వగైరాలు నాకిష్టం వుండవు. మంచి చెయ్యాలను కున్నది చేస్తాను. దానికి బిరుదులు, నిషేధాలు కోరుకోను. కానీ నా ఆప్తమిత్రుడు సూర్యారావు దగ్గర మాత్రం దీనిపై చర్చ వచ్చేసింది.
* * * * *
గవర్నమెంటు కాలేజి ప్రిన్సిపాల్‌గా నేను రిటైర్ అయిన వెంటనే నా ఆప్త మిత్రుడు సూర్యారావు అక్కడే ప్రిన్సిపాల్ అయ్యాడు. అతనూ రిటైర్ అయ్యాడు. అయితే, ఒక హాస్టల్ నడుపుతున్నాడు. నేను సాహిత్య వ్యాసంగంలో గడుపుతున్నాను. ఊళ్లో నా ఇల్లు ఆగ్నేయ మూల ఉంటే అతని ఇల్లు వాయవ్య మూల ఉంది.
పొద్దున్నే సూర్యారావు నుంచి ఫోను అందుకుని నేను అతని ఇల్లు-కమ్ హాస్టల్‌కు వెళ్లాను. ఎనిమిదిమంది విద్యార్థులూ – 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్ డిగ్రీ-వాళ్లు వాళ్లు. వాళ్లూ, సూర్యారావు భార్య జయమ్మ, దొడ్లో 10×15 అడుగులున్న పూలమొక్కల స్థలంలో కర్రపుల్లల్తో నేలంతా కెలుకుతున్నారు.
సూర్యారావు నాతో అన్నాడు, ‘‘కృష్ణా, గొడవొచ్చి పడిందయ్యా, ఇంట్లో మా ఆవిడ రోజూ ఒక నాగ ప్రతిమకు పూజచేసి నైవేద్యం పెట్టేది. ఆ తర్వాత అన్నం, పప్పు, కూర, పులుసు వండి ఈ నైవేద్యం పెట్టినదాన్ని కలిపి కుర్రాళ్లకి బాక్సుల్లో అంది స్తూండేది. వాళ్లు తీసుకెళ్లిపోయేవారు. ఇవ్వాళ ఆమె పూజ జరగలేదు. ఎందుకంటే, ఆ నాగప్రతిమ పూజ మండపంలో లేదు! దీంతో టైమ్‌టేబిల్ అంతా ఆగిపోయింది. ఇదిగో నిన్న పూజ చేసిన తర్వాత ఆ నిర్మాల్యం తీసికెళ్లి ఈ మొక్కల్లో అలవాటు ప్రకారం పోసేసినప్పుడు ఆ పూలతో పాటు స్వామి వెళ్లి పోయాడేమోనని అంతా కలిసి వెతుకుతున్నారు. వంటా లేదు, గంటా లేదు, చదువులు ఈ పూట చెట్టెక్కాయి.’’
‘‘అరెరె, ఎంత పని జరిగింది!.. పోనీ సూర్యం, నేను కూడా ఓ చెయ్యి వెయ్యనా?’’అని నేనన్నాను,
‘‘నీ భ్రమ! ఇప్పుడు తొమ్మిదవుతోంది. ఇవ్వాళ పొద్దున ఏడింటి నుంచీ ఇప్పటి దాకా ఈ తొమ్మిది మంది వీరులూ, నాతో కలిసి పదిమందీ కూడా, సగర చక్రవర్తి భూమిని తవ్వినట్లు ఈ తోటని తవ్వి పోసేశాం. హుఁ రా, కాఫీ తాగుదాం….!
ఇద్దరం వెళ్లి వాకిట్లో కూర్చుని ప్లాస్కుల్లోని కాఫీ తాగుతున్నాం.
కుర్రాళ్లు చేతులు కడుక్కొని తమ గదిలోకెళ్లి పోయారు.
జయమ్మ వచ్చి ‘‘ఏమండీ స్వామి కనిపించ లేదండి’’ అంది. ఆమె మొహంలో ఏడుపు ఒకటే తక్కువ. పమిట చెంగుతో కళ్లు తుడుచుకుంది. ‘‘వచ్చే కృత్తిక నక్షత్రం రోజున బ్రాహ్మణ్ణి తీసికెళ్లి అభిషేకం చేద్దామనుకున్నాను. ఇంకేం చేయిస్తాను.’’ అంది.
‘‘అమ్మా, కృత్తికా నక్షత్రం ప్రతినెలా వచ్చేదే. దానికి అంత దిగులెందుకు?’’ అన్నాను,
‘‘అది కాదు, అన్నయ్య గారూ! ఇవి రాక రాక వచ్చే రోజులు. మంగళవారం కూడా కలిసుందట. బెజవాడ దగ్గర కంచిస్వామి వారు కట్టిన ఆలయంలో చేస్తే మహా పుణ్యంట’’ ఆమె మళ్లీ కళ్లు తుడుచుకుంది.
కాలేజీ కుర్రాళ్లు ‘‘అమ్మగారూ మేం కాలేజీకి వెళ్లిపోతాం లెండి’’ అంటూ వచ్చారు. జయమ్మ, ‘‘ఆగండి నాన్నా! పోనీ అన్నం ఒక్కటే వండి పెరుగేసిస్తాను’’ అంటూ ఇంట్లో కెళ్లిపోయింది. వాళ్లు గదిలోకెళ్లారు.
సూర్యారావు అన్నాడు, ‘‘ఒకడు పదో తరగతి వాడు. పేరు శివుడు. ముగ్గురు తొమ్మిదో తరగతి వాళ్లు. ఇద్దరు ఇంటరు, ఇద్దరు డిగ్రీ ఫస్టియరు. డిగ్రీ వాళ్లే తొందరపడతారు. లాబ్‌ల గురించి ఈపూట వాళ్లకి అన్నం లేదు. ఏం చెయ్యగలం?’’
‘‘మీ దంపతులు ఎంతో చేస్తున్నారు. ఇంకేం చెయ్యగలరు?’’ అన్నాను,
‘‘అది కాదు కృష్ణా! వీళ్లల్లో ఇద్దరికి అమ్మలేదు. ఇద్దరికి నాన్నలేడు. ఎవ్వరికీ ఇంటి దగ్గర తిండిలేదు. వాళ్లకు నా పెన్షన్‌తో నేనేదో చెయ్యగలిగింది చేస్తున్నాను.’’
‘‘నువ్వు చేసేది సరే సూర్యం! నీ భార్య కాశీ అన్నపూర్ణలాగా వండి పెడుతోంది. ఇది అసలు గొప్ప విషయం! నిరుత్సాహ పడొద్దని ఆమెకు చెప్పు. నాగప్రతిమ దొరుకుతుందిలే… వెళ్లొస్తాను.’’ – అంటూ నా ఇంటికి వచ్చేస్తాను.
* * * * *
వారం అయ్యింది. సూర్యారావు ఫోన్‌లో అన్నాడు, ‘‘ఏమిటో కృష్ణా! జయమ్మ, లేచి తిరగట్లేదు. ఏం చేస్తోందో తెలీనట్లు ఏదో చేస్తోంది. స్టూడెంట్లు, వాళ్లే వండుకుని తిని వెడుతున్నారు. అన్నట్టు గంట గంటకీ వెళ్లి కర్రపెట్టి పూల మొక్కలన్నీ కెలుకుతోంది. మళ్లీ వచ్చి కూర్చుండి పోతోంది. నువ్వొకమాటు రాకూడదూ?’’
తక్షణం నా బండిని దుర్రుమనిపించి వెళ్లాను. టైము ఉదయం పదకొండు.
జయమ్మ దేవతామందిరం దగ్గర పడుకోనుంది. ఆమె చూపులు ఆ మందిరంలోకే.
‘‘చెల్లమ్మా, ఏమిటీ హడావిడి?’’ అడిగాను.
జయమ్మ, చటుక్కున లేచి ‘‘ఆఁ వచ్చావా సుబ్రహ్మణ్యస్వామి వచ్చావా!’’ అంటూ నావైపు ఎగాదిగా చూసి ‘‘మీరా, అన్నయ్యా!’’ అంటూ మళ్లీ పడుకొని పోయింది. మళ్లీ లేచి ‘‘ఆ స్వామి రాడు, నా కొడుక్కి కొడుకుని ఇవ్వడు. నాకు మనవడు పుట్టడు! నాకు వంశం లేదు!… నా బతుకింతే దేవుడా!…’’ భళ్లున ఏడుపు కక్కేసింది.
సూర్యం ఆమె వీపు నిముర్తూ ‘‘ఏడవకు, వస్తాడు, వస్తాడు.’’ అన్నాడు. ఆమె, ‘‘వచ్చేవాడయితే వెళ్లిపోతాడా, రాడు. నీకెం తేలీదు, రాడు…’’
‘‘చెల్లమ్మా! మీరు దొడ్డి ఊడ్చే పనిమనిషిని అడిగారా? ఈ కసవుని మీరు వాకిట్లో బకెట్లో పెడితే ‘తడిచెత్త, పొడిచెత్త’ వాడు తీసికెళ్లిపోయాడేమో అడిగారా?’’అన్నాను,
వాకిట్లోకి నన్ను పిలిచి సూర్యారావు, ‘‘అడిగాం కృష్ణా! అందర్నీ అడిగాం. ‘తడిచెత్త, పొడిచెత్త’ వాడితో ‘‘నీకు మంచి బహుమతి ఇస్తాం’’ అని కూడా అన్నాము. ప్చ్, ఫలితం లేదు!.. అయితే ఒకరోజు పొద్దున్న నేను వాకిట్లో నుంచునుండగా దారినపోయే దానమ్మ ఎవరో ఒకావిడ వచ్చి ‘‘సార్, మా పిల్ల పూలకి ఏడుస్తోంది. మీ దొడ్లో పూలున్నాయంటగా. కాసినివ్వగలరా?’’ అని నన్నడిగింది. నేను దొడ్లో పడి ఉన్న నిర్మాల్యం తీసికెళ్లి ఆమె దోసిట్లో పోసాను. అందులోగాని ఆ ప్రతిమ వెళ్ళిపోయిందేమో. అప్పుడు జయమ్మ తాజా పూలతో ఇంట్లో పూజ చేసు కుంటోంది. కనుక ఆవిడకి ఈ విషయం నేను తెలియ నివ్వలేదు. నువ్వు కూడా నీ లోపలే ఉంచుకో.’’
వంట చేస్తున్న కుర్రాడి మీద అనవసరంగా జయమ్మ ‘‘నీకు బుద్ధిలేదురా. స్వామిని వెతికి పెట్టలేవు? అన్నం ముందా? దేవుడు ముందా?’’ అంటోంది.
నాకర్థమైంది? ఆవిడకి బి.పి.వచ్చేసింది!
నేనూ సూర్యారావూ కలిసి ఆవిణ్ణి బలవంతంగా డాక్టర్ దగ్గరికి ఇంచుమించు ఈడ్చికెళ్లాం!
ఆవిడ బి.పి.కౌంటు 270 ఉంది! డాక్టరే అదిరిపోయాడు? ‘‘యాభై ఏళ్లకి ఇంత రాకూడదండీ’’ అన్నాడు.
అరగంట అరగంటకి గ్లైకోమెట్, టెల్మిసార్, లాంక్టస్ – వగైరా వగైరా బిళ్లలూ ఇంజక్షన్లూ ఇవ్వటం మొదలుపెట్టారు. ఉదయం పదిగంటలకు వెళ్లిన వాళ్లం సాయంకాలం ఐదింటికి ఆవిడ బి.పి. 170కి వచ్చింది. డాక్టర్, ‘‘ఇంక పర్వాలేదు. ఈ మందులే జాగర్తగా వాడండి. బి.పి. బాగా పెరిగితే పెరాలిసిస్ లోకి దింపుతుంది. జాగర్త మళ్లీ రేపొచ్చి చెప్పండి’’ అన్నాడు.
ఇంటికి వచ్చాం. జయమ్మకి వంట్లో నీరసం వచ్చేసింది. కళ్లుమూసుకుని పడుకుండిపోయింది. కళ్లు తెరిచినప్పుడల్లా ‘‘ఏడే నా స్వామి వచ్చాడా?’’ నా మనవణ్ణి తెచ్చాడా?… రాడండి బాబూ, పాపిష్ఠిదాన్ని. ఎన్ని కడుపులు కొట్టానో, ఎన్ని జన్మల్లో కొట్టానో, దేవుడా, దేవుడా నన్ను తీసికెళ్లిపో….’’ అంటూ కొంత ఏడుపూ, కొంత మగత.
నేను నా భార్యకి ఫోన్‌చేసి ‘‘నేను సూర్యారావు ఇంట్లోనే ఉండిపోతున్నాన’’ని చెప్పాను. బార్లీ జావ పెట్టి జయమ్మకిచ్చాను. డాక్టరిచ్చిన నిద్రమాత్రలు కూడా అయ్యినయ్యి. జయమ్మ నిద్రలోకి జారుకుంది.
* * * * *
సూర్యారావు నాతో అన్నాడు,‘‘మాకున్నది ఒక్కడే. వాడికి పెళ్లయ్యి ఎనిమిదేళ్లయ్యింది. అయిదేళ్లు అందరం ఓపిక పట్టాం. కానీ మూడేళ్లబట్టే మా కోడలికీ, మా ఆవిడకీ పెరపెర మొదలైంది. ఆంధ్రలో మోపిదేవి, కర్ణాటకలో కుక్కీ, తమిళనాడులో తిరుచెందూర్ – ఇట్లా తిరగని సుబ్రహ్మణ్య క్షేత్రం లేదు. చెయ్యని పూజ లేదు. కొడుకులో వచ్చే సూర్యకాంతి తనింట్లో వెలగాలని మా కోడలు కోరుకుంటూంటే, వంశోద్ధారకుడై రేపు తనకు పిండోదకాలు వదిలే వాడొచ్చి తన భుజాలు తొక్కాలని మా ఆవిడ కోరుకుంటోంది. దాని కోసమే, ఎవరో స్వామీజీ ఇచ్చిన నాగప్రతిమని తెచ్చిపెట్టుకుని రోజూ పూజ చేసుకుం టోంది. నేనూ అప్పుడప్పుడు చేస్తూంటాననుకో. నలుగురు కుర్రాళ్లకి అన్నం పెడితే మంచిదని ఎవరో చెప్పారుట. ఇంకేం, నా చేత ఈ హాస్టల్ తెరిపించింది. నాకూ ఆ లక్షణాలు కొన్ని ఉన్నాయి గదా? నీ దగ్గర్నుంచి నేర్చుకున్నావ్?!….’’
‘‘నేను నీకేం నేర్పాను. నేను ప్రిన్సిపాల్ అయినప్పుడు నువ్వు లెక్చర్‌రవేగా?’’ వాళ్లల్లో నేనొకడిని! పరీక్ష ఫీజు కట్టలేనివాళ్లకి ఎంతమందికి నువ్వు కట్టావో. బెంచీలు బాగు చేయించావో. నీ అటెండర్‌కి కాలు విరిగితే వారం రోజుల్లో మళ్లీ హెడ్గేవార్ వగైరా పేర్లు ఎత్తినప్పుడు నిన్ను ఆడిపోసు కోటానికి ఎవరికీ నోరు పెగల్లేదు?… ఎంక్వైరీకి వచ్చిన ఆర్‌జెడి కూడా, నీ మీద ఆయనకొచ్చిన నాకు కంప్లెయింట్‌ని మాముందరే చించిపారేసి వెళ్లిపోయాడు!…. అదుగో అదే నువ్వు నాకు నేర్పావు! లోకం కోసం బతకడం నేర్పావు! అదే! అందుకని నేను నా భార్యకు సహకరిస్తున్నాను’’
‘‘ఆవిడ వండిపెట్టే పప్పూ, అన్నమే వీళ్లకు పరమాన్నం తెలుసా? ఎందుకంటే, వాళ్ల గ్రామాల్లో వాళ్లకి అంబలి తప్ప మరేమీ తెలీదు, దొరకదు!’’
నేనన్నాను, ‘‘ఏదో చెప్పావు, ఇంటెగ్రల్ హ్యూమనిజం మీద దీనదయాళ్ చెప్పినట్టు!’’
సూర్యారావు నవ్వాడు. మేం వెళ్లిచూసాం. జయమ్మ గాఢని ద్రలో ఉంది!
* * * * *
తెల్లవారింది. సూర్యారావు కాఫీ పెట్టాడు. జయమ్మ లేచి తాగింది. ఆ బలహీనంలోనే మళ్లీ కర్రపుచ్చుకుని వెళ్లి దొడ్లో కెలకటం మొదలుపెట్టింది. ‘‘ఒరేయ్ శివా రారా!’’ అంది. వాడొచ్చాడు. వాడూ కెలకటం మొదలుపెట్టారు.
నేనూ సూర్యారావు చూస్తూ ఉండిపోయాం. నేను నా ఇంటికొచ్చేశాను.
* * * * *
పబ్లిక్ పరీక్షలొచ్చేసినయ్యి.
నాలుగురోజుల తర్వాత నేను మళ్లీ వెళ్లాను. జయమ్మ అదే బలహీనంతో ఉంది. వంట చెయ్యలేక పోతోంది. సూర్యారావు వంట మనిషిని పెట్టాడు.
జయమ్మ కార్యక్రమం, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అదే కర్రతో అదే పనిగా ఆ పూల దొడ్డిని కెలుకుతూండటమే. పరీక్షల మూలంగా కుర్రాళ్లు ఆమె దగ్గరకు రావటం మానేసారు.
జయమ్మ నోట దుర్వాక్యాలు రావట్లేదుగాని, చాలా కుంగిపోయిందని మాత్రం తెలుస్తోంది. దొడ్లో కెలకటం అయ్యాక వెళ్లి పూజామందిరం ఎదురుగా కూర్చోవటం లేదా, అక్కడే పడుకోవటం!
నాకే ఆలోచన్లొచ్చాయి. ‘దేవుడంటే ఇంతమందిని ఇట్లా, తన చుట్టూ, ఎప్పుడూ ఏపనీ చేసుకోనివ్వ కుండా తిప్పుకునే శక్తా? మనిషి ఏమి చెయ్యలేనప్పుడు తనే ఏదో ఒకటి చెయ్యొచ్చుగదా! కనీసం అప్పుడైనా నాలాంటివాళ్లు కొబ్బరి కాయలు కొడతారు గదా!…. అసలు నేనే ఇప్పుడు ఏదో ఏం చెయ్యకూడదు?’
* * * * *
ఏప్రిల్ నెలలో కుర్రాళ్లు ఒక్కొక్కొళ్లూ వాళ్ల గ్రామాలకు వెళ్లిపోవడం మొదలుపెట్టారు. ఏప్రిల్ 20న పది పబ్లిక్ ఆఖరు పరీక్ష రాసి శివ కూడా వెళ్లిపోయాడు.
ఏప్రిల్ 22న సూర్యారావు నాకు ఫోన్ చే•. ‘‘కృష్ణా! దేవుడు దొరికాడోయ్, జయమ్మ ఏనుగు నెక్కిపోతోంది. రా, రా!’’అని చెప్పాడు.
అంతకన్నా ఆశ్చర్యంగా నేను, ‘‘అమోఘం! అద్భుతం! వస్తున్నా’’
నేను లోపలికి అడుగుపెట్టానో లేదో జయమ్మ ఎగురుకుంటూ వచ్చినా చేయ్యి పట్టుకుని, ‘‘నా దేవుడు వచ్చాడన్నయ్యగారూ! వచ్చాడు, వచ్చాడు. ఇదిగో!’’ అంటూ నన్ను బరబరా మందిరం దగ్గరికి లాక్కెళ్లి చూపించింది. లోపల కొంచెం మకిలి పట్టిన సుబ్రహ్మణేశ్వరస్వామి పడగ, పూవులతో నిండి ఉంది.
‘‘ఎంత అదృష్టవంతురాలవమ్మా!, నీ భక్తి, నీ పూజ, నిన్ను కాపాడాయి!’’ అని, వాళ్లకి స్వీట్లు ఇచ్చి వచ్చేసాను.
మర్నాడు ఆ దంపతులు ఇద్దరూ విజయవాడ దగ్గరనున్న సుబ్రహ్మణేశ్వర స్వామికి అభిషేకం చేయించుకొని వచ్చారుట, సూర్యారావు చెప్పాడు.
మే వచ్చింది. మళ్లీ సూర్యారావు ఫోన్. నేను వెళ్లాను.
‘‘ఒక పెద్ద శుభవార్త. మా కోడలికి మూడో నెల వచ్చిందని డాక్టర్ చెప్పిందట. ఈ పొద్దున్నే మా అబ్బాయి ఫోన్ చేశాడు. అంతే, మొహం కూడా కడుక్కోకుండా జయమ్మ కట్టుబట్టల్తో హైద్రాబాద్ వెళ్లిపోయిందయ్యా!’’ సూర్యారావు చెప్పాడు.
మేమిద్దరం కౌగలించుకున్నాం. కాస్సేపు మాటలయ్యాక సూర్యారావు అన్నాడు, ‘‘చూడు, ఆ కుర్రాళ్లు గది తుడుస్తూంటే ఈ బిల్లు దొరికిందే మిటి?… బంగారం షాపు- వెండివస్తువు – వెయ్యి రూపాయలు- కొన్నవాడు శివ-తేది 20 ఏప్రిల్ ఏమిటిది? అన్నట్టు 20 ఏప్రిల్ శ్రీరామనవమి. ఆ రోజు సాయంత్రం బంగారం కొట్లో నువ్వూ శివా కనిపించినట్టు నాకు జ్ఞాపకం వస్తోంది. ఆ రాత్రే టిక్కెట్టుకు డబ్బులు నా దగ్గర తీసికెళ్లినవాడు సాయంత్రం బంగారం కొట్లో కనిపించటమేమిటి? పక్కన నవ్వుండటమేమిటి?… ఆఁ, అవును, జయమ్మకి సుబ్రహ్మణ్య ప్రతిమ, చుక్కలమల్లె మొక్క మొదట్లో కొమ్మల మధ్య దొరికినది ఏప్రిల్ 22నే కదా!…ఆఁ, ఏదో జరిగిపోయింది… నిజం చెప్పు… ఏం జరిగింది?’’
నేను సాదాసీదాగా కుర్చీలో వెనక్కి వాలి కూర్చుని అన్నాను. ‘‘అవును, సూర్యం, మోసం జరిగింది! నేనే ఆ నాగప్రతిమని శివకు కొనిచ్చి ఆ మొక్కలో పెట్టమన్నాను. నేను మీ దంపతుల్ని మోసం చేశాను. నాకు ఎంత పాపం వస్తుందో, ఏం శిక్ష వేస్తావో వెయ్యి!.. అన్నట్టు శివ ఇంటర్‌కు వెళ్లిపోతాడు. నీకు ఇంక దొరకడు. నాకే వెయ్యి!’’
సూర్యారావు నవ్వి, ‘‘ఏమిటీ ఎంతమందికి ఆత్మవిశ్వాసం నేర్పిన నువ్వే ఇట్లా మాట్లాడు తున్నావా?… లోకంలోని జీవుల్ని ఆ ఈశ్వరుడిలో ఐక్యం చేసేందుకే, అట్లాంటి జీవితం జీవించటం కోసమే, ‘కృణ్వంతో విశ్వం ఆర్యమ్’ అంటూ మనం పుట్టాం. నువ్వు చేసిన పనివల్ల జయమ్మ తిరిగి మామూలు మనిషయ్యింది. మోసం అయినా, అది పుణ్యమే! పరోపకారమే పుణ్యం. పరాపకారమే పాపం!’’
‘‘మరి నువ్వు ఆ దానమ్మకు ఆ పాతప్రతిమను ఇచ్చెయ్యటం?’’
‘‘అదీ పరోపకారమే. పుణ్యమే… అయితే జయమ్మకు చెప్పి చెయ్యాల్సింది. నాకూ తెలినీ పొరబాటు అది!.. అయినా నువ్వు ఇంత చర్చించటమేమిటి?… సరే, మేం వచ్చేవారం అంతా కలిసి పళదామనుకుంటున్నాం, మీ దంపతులు కూడా రండి!’’
‘‘సారీ సూర్యారావు, రేపు మా అబ్బాయీ పిల్లలూ వస్తున్నారట. రాలేను.’’
* * * * *
ఇట్లా పాపం – పుణ్యం చర్చ జరిగిన తర్వాత సూర్యారావుకు మనవడు కలిగిన తర్వాత, నాక్కూడా – అప్పుడప్పుడు రెండు తులసీదళాలు ఆంజనేయ స్వామికి వెయ్యటం కూడా మంచిదేమో అనిపించ సాగింది!