బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు సంస్కరణ చట్టాలను ఉపసంహరించుకొనక తప్పని పరిస్థితిని మనం చూశాం. ఈ చట్టాలకు నిరసనోద్యమం పేరుతో నకిలీ రైతులు 2020లో అరాచకం సృష్టించారు. ఎర్రకోట మీద దాడి వరకు వెళ్లిన రైతులను ఆనాడు చాలామంది శంకించారు. ఆ అనుమానమే ఇప్పుడు నిజమైంది. వాళ్లు రైతులు కాదు. ఖలిస్తాన్‌ ‌మద్దతుదారులు. భారత వ్యతిరేకులు. ఆ చట్టాలు రైతులకు మేలు చేసేవేనని ఎంత చెప్పినా వినకపోవడానికి కారణం ఖలిస్తాన్‌ ‌వాదం. 1984 జూన్‌ ‌తరువాత నేలకరించిందనుకున్న ఖలిస్తాన్‌ ఉ‌గ్రవాదం రైతు ఉద్యమం కారణంగా ప్రాణం పోసుకుంది. కాంగ్రెస్‌, ‌వామపక్షాలు, దేశంలోని ప్రతి బీజేపీయేతర పక్షం సంస్కరణ చట్టాలను ఉపసంహరింప చేయా లని మంకు పట్టు పట్టాయి. పంజాబ్‌లో తాజా అరాచకానికి, అమృత్‌పాల్‌ ‌వంటి కొత్త ఉగ్రవాది పుట్టుకు రావడానికి కారణం భారత దేశ విపక్షాలే. సరిహద్దు రాష్ట్రమని కూడా ఆలోచించకుండా కాంగ్రెస్‌, అకాలీదళ్‌, ‌సమాజ్‌వాదీ పార్టీ అన్నీ కూడా వేర్పాటువాదానికి మరొకసారి బీజాలు పడుతున్నా బీజేపీ చేతులు కట్టేశాయి. రెండు కోణాల నుంచి ఇప్పుడు ఈ సమస్య భారత్‌ను వేధిస్తున్నది. పంజాబ్‌లో దీని అలజడి సరే, కొన్ని విదేశాలలో కూడా ఖలిస్తాన్‌ ‌మద్దతుదారులు వీరంగం వేస్తున్నారు. రైతు చట్టాలను ఉపసంహ రించేటట్టు చేయడాన్ని పెద్ద విజయంగా పరిగణి స్తున్నారు. కాబట్టి పంజాబ్‌ ‌దేశ ఏర్పాటును కూడా వత్తిడి విన్యాసాలతో సాధించ వచ్చునన్న నమ్మకం వేర్పాటువాదులలో పెల్లుబుకు తున్నది. వీటి నుంచి జనించినవాడే అమృత్‌పాల్‌.

‌నిన్నటిదాకా దుబాయ్‌లో కారు డ్రైవర్‌గా పనిచేసిన అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌కొన్ని నెలలోనే భింద్రెన్‌ ‌వాలేను గుర్తుకు తెస్తూ అలజడి ఎలా సృష్టించగలి గాడు? అమృత్‌పాల్‌ ‌సింగ్‌ను అరెస్ట్ ‌చేయడానికి ఆ రాష్ట్ర పోలీసులు మార్చి 18 నుంచి ప్రయత్నిస్తున్న ప్పటికీ ఇప్పటివరకు సఫలం కాలేదు. అక్కడ ఉన్నది ఆప్‌ ‌ప్రభుత్వం. కాబట్టే ఆ అరెస్టు సాధ్యం కావడం లేదన్న ఆరోపణలు ఎప్పుడో వచ్చాయి. అమృత్‌పాల్‌ ‌నాయకత్వంలోని సంస్థ ‘వారిస్‌ ‌పంజాబ్‌ ‌దే’. అతడు ఖలిస్తాన్‌ ‌సానుభూతిపరుడు. ఇదంతా ప్రస్తుత పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి భగవంత్‌ ‌మాన్‌కు ఇది పెద్ద సవాలు. బీజేపీ ప్రభుత్వానికి కూడా అంతే. 80,000 మంది పోలీసుల నిఘా నుంచి ఎలా తప్పిం చుకుపోయాడని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిజమే, ఎవరి అండతో అమృత్‌పాల్‌ ‌వేషాలు మార్చి నేపాల్‌ ‌వరకు వెళ్లాడు? ఇదే కాదు. ఇతడి పలా యనం తరువాత కెనడా, ఇంగ్లండ్‌, అమెరికాలలో ఖలిస్తాన్‌ ‌మద్దతు దారులు రెచ్చిపోవడం మరొకటి. భారత జాతీయ పతాకాన్ని దహనం చేయడం వరకు వెళ్లారు. ఇదా సిక్కుల నుంచి నానక్‌ ఆశించినది?

ఢిల్లీలో రైతుల పేరిట వేర్పాటువాదుల అరాచకం, తరువాత పంజాబ్‌లో ఆప్‌ ‌ప్రభుత్వం రావడం ఖలిస్తాన్‌ ఉద్యమం భగ్గుమనడానికి కారణం. మార్చి 10, 2022న ఆమ్‌ ఆద్మీ పార్టీ గొప్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ‘మార్పు’ నినాదంతో ఏఏపీ అధికారాన్ని హస్తగతం చేసుకున్న ప్పటికీ, ఇప్పటివరకు అది సాధించిన సానుకూల మార్పేంటనే దానిపై పంజాబీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వాల వైఫల్యాలు, వాటి ప్రతికూల ప్రభావాలు ఇంకా వారి మనసుల్లోంచి తొలగిపోలేదు. ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నప్పటికీ, కొన్ని సిక్కు వర్గాలకే పరిమితమైనట్టు ఇటీవలి పరిణామాలు వెల్లడిస్తు న్నాయి. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత భగవంత్‌ ‌మాన్‌ ‌ఖాళీ చేసిన సంగ్రూర్‌ ‌లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఖలిస్తాన్‌ అనుకూల నేత సిమ్రన్‌ ‌జిత్‌ ‌సింగ్‌ ‌మాన్‌ ఎన్నిక కావడంతో రాష్ట్రంలో ఖలిస్తాన్‌ ‌ప్రత్యేకవాద ‘ప్రమాద ఘంటికలు’ మళ్లీ మోగుతున్నాయన్న సత్యం తేటతెల్లమైంది. అయితే ఇతడు అమృత్‌పాల్‌ను సమర్ధించకపోవడం పెద్ద ఊరట. వీటిని మొగ్గలోనే తుంచివేయకపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే ఇటువంటి ఏ చిన్నపాటి సానుకూలాంశాన్ని వేర్పాటువాదులు వదులుకోరు! ఇప్పుడు సరిగ్గా జరిగిందిదే.

 దుబాయ్‌ ‌నుంచి భారత్‌కు వచ్చి వారిస్‌ ‌పంజాబ్‌ ‌దే సంస్థను తన చేతుల్లోకి తీసుకున్న అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకోవడానికి ఇది ఒక అవకాశాన్ని కల్పించింది. నిజానికి 2020 సెప్టెంబర్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతుల ఉద్యమంలోనే ఈ ఖలిస్తాన్‌ ‌బీజాలు కనిపించాయి. దీన్ని రాజకీయే తర ఉద్యమంగా పేర్కొన్నప్పటికీ, రాడికల్‌ ‌సిక్కు రాజకీయాల ప్రారంభానికి ఇది వేదికగా నిలిచింది. దుబాయ్‌ ‌నుంచి ఏడు నెలల క్రితం భారత్‌కు వచ్చిన అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌పంజాబ్‌ ‌సంస్కృతిని, సిక్కు మతాన్ని కాపాడేవాడిగా తనను తాను ప్రకటించుకొని రాడికల్‌ ‌రాజకీయాలు ఆరంభించాడు.

ముఖ్యమంత్రి మాన్‌ ‌తమది సెక్యులర్‌ ‌పార్టీగా ఎంతగా చెబుతున్నప్పటికీ, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎదురవుతున్న భద్రతా పరమైన సవాళ్లను ఎదుర్కొనడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా రాజకీయ నాయకుడిగా మారిన గాయకుడు సిద్ధు మూసేవాలా మరణం, పోలీస్‌ ‌స్టేషన్లపై రెండు రాకెట్‌ ‌గ్రెనెడ్‌ ‌దాడులు, హిందూ-సిక్కు వర్గాల మధ్య ఘర్షణల వంటి సంఘటనలు ప్రభుత్వాన్ని కుదిపేసిన మాట వాస్తవం. ఇప్పుడు ఖలిస్తాన్‌ ఉ‌గ్రవాదులకు నాయకత్వం వహిస్తున్న అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌రూపంలో ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి వచ్చిపడింది. అనతి కాలంలోనే ఇతడికి వచ్చిన పలుకుబడిని బట్టి పంజాబ్‌లో అమృత్‌పాల్‌ ‌సింగ్‌ను ఎక్కువగా అభిమానిస్తున్న వారెవరన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. టెక్‌ ‌సిక్కు యువత అతని రాడికల్‌ ‌రాజకీయాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారన్న సత్యాన్ని భద్రతా సంస్థలు గుర్తించాయి. భింద్రన్‌వాలే రాడికల్‌ ‌రాజకీయాల గురించి తమ పెద్దల నుంచి, ఆన్‌లైన్‌లో ఆర్టికల్స్ ‌ద్వారా తెలుసుకుంటున్న యువతను అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌దూకుడు రాజకీ యాలు సహజంగానే ఆకర్షిస్తున్నాయి. కానీ పంజాబ్‌లో రాజకీయాలను సమూలంగా మార్చివేస్తా నంటున్న అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌మాటలను మెజారిటీ వర్గాలు విశ్వసించక పోవడం సానుకూలాంశం.

అజ్‌నాలా సంఘటన రాష్ట్రంలో శాంతిభద్రత లను దెబ్బతీయడంలో అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌పాత్రను మరింత స్పష్టం చేసింది. ఫిబ్రవరి 23న అతడి మద్దతుదార్లు ఆ పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి, అమృత్‌ ‌పాల్‌ ‌సింగ్‌ ‌ప్రధాన మద్దతుదారు లవ్‌‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌తూఫాన్‌ను విడిపించుకుపోవడం ప్రభుత్వానికి సవాలుగా నిలిచింది. తూఫాన్‌ ఒక కిడ్నాప్‌ ‌కేసులో నిందితుడు. కేవలం ఒక్కడిని పోలీస్‌స్టేషన్‌లో ఉంచలేని ప్రభుత్వం, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎట్లా కాపాడగలదన్న ప్రశ్నలు అన్ని వర్గాల నుంచి వస్తు న్నాయి. అదీ కాకుండా ఈ సంఘటన అకస్మాత్తుగా జరిగింది కాదని, వారాలుగా పక్కా ప్రణాళిక రచించి మరీ ఈ అకృత్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆనంద్‌పూర్‌ ‌ఖల్సా పేరుతో నడుపుతున్న అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌ప్రైవేటు సైన్యాన్ని కట్టడి చేయాలని కేంద్రం పంజాబ్‌ ‌ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతోంది. అంతేకాదు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మార్చి 2న పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి భగవంత్‌ ‌మాన్‌ను ఢిల్లీకి పిలిపించి పరిస్థితి చేయి దాటిపోకముందే గట్టి చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలుస్తోంది. అంతేకాదు, 1800 మంది కేంద్ర రిజర్వ్ ‌పోలీసులను కూడా రాష్ట్రానికి కేంద్రం పంపింది. భగవంత్‌ ‌మాన్‌ ‌ప్రభుత్వం తన రాజకీయ భవితవ్యాన్ని పణంగా పెట్టి మరీ అమృత్‌పాల్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోకతప్పదు. ఎందుకంటే ఒకవైపు అప్పులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రప్రభుత్వం పాలనను సజావుగా నడిపించడం సాధ్యం కాదు. ఇది భగవంత్‌ ‌మాన్‌కు బాగా తెలుసు. అదీకాకుండా పంజాబ్‌ ‌వ్యవసాయిక రాష్ట్రం, మద్దతు ధరకోసం కేంద్రంపై ఆధారపడక తప్పదు. దీనికితోడు సరిహద్దు రాష్ట్రం కావడంతో భద్రతాపరంగా మరింత సున్నిత పరిస్థితి నెలకొనడం మరో కారణం. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు వందమంది అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌మద్దతుదారులను అరెస్ట్ ‌చేసినట్టు వార్తలు వచ్చాయి. శాంతిభద్రతల సమస్యల దృష్ట్యా రాష్ట్రంలో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను నిలిపి వేయడంతో 27 మిలియన్ల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

గత ఏడాది రాజకీయ నాయకుడిగా మారిన గాయకుడు దీప్‌ ‌సిద్ధూ 2022, ఫిబ్రవరిలో కారు ప్రమాదంలో మరణించిన తర్వాత అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ఒక్కసారి వెలుగులోకి వచ్చాడు. సిద్ధు నేతృత్వంలో ఏడాది పాటు రైతు ఉద్యమం సాగింది. సిద్ధు ‘వారిస్‌ ‌పంజాబ్‌ ‌దే’ సంస్థ స్థాపకుడు. దేశంలో వ్యవసాయ రంగాన్ని అధునీకరణ చేయాలన్న ప్రధాని నరేంద్రమోదీ యత్నానికి వ్యతిరేకంగా సిద్ధు రైతులను, ముఖ్యంగా పంజాబ్‌ ‌సిక్కు రైతులను సమీకరించి ఉద్యమాన్ని కొనసాగించాడు. నిరసనల పేరుతో రైతులు ఎర్రకోట మీద దాడి చేయడం వెనుక సిద్ధు హస్తమందుని తేలింది. ప్రభుత్వం తీసుకొచ్చే మార్పుల వల్ల పంట ఉత్పత్తుల ధరలు తగ్గుతాయన్న భయాన్ని రైతుల్లో సిద్ధు విజయవంతంగా వ్యాపింపజేయగలిగాడు. ఎట్టకేలకు 2021లో మోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది. దీని తర్వాత వారిస్‌ ‌పంజాబ్‌ ‌దే సంస్థ సిక్కు మతం, పంజాబ్‌ ‌సంస్కృతి పరిరక్షణ పేరుతో ఉద్యమాన్ని కొనసాగించింది. సిద్ధు తర్వాత సంస్థను తన ఆధీనం లోకి తెచ్చుకున్న అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌రెచ్చగొట్టే ప్రసంగాలతో పంజాబ్‌ ‌ప్రజల్లో పలుకుబడి పెంచుకోవడానికి యత్నించి సఫలమయ్యాడు. మోదీ నేతృత్వంలోని జాతీయవాద ప్రభుత్వం సిక్కుల అభ్యున్నతిని అడ్డుకుంటోందని కూడా విషప్రచారం చేశాడు. చివరకు జర్నయిల్‌ ‌భింద్రన్‌వాలేను హతమార్చిన ఇందిరా గాంధీకి పట్టిన గతే ఇప్పుడు హోంమంత్రి అమిత్‌షాకూ పడుతుందని హెచ్చరించే దాకా వెళ్లాడు. విచిత్రమేమంటే మత్తుమందులకు బానిసలైన వారిని తిరిగి మామూలు మనుషులను చేయడానికి కృషి చేస్తున్నవాడిని ఈవిధంగా పోలీసులు వేధించడం అక్రమమంటూ అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌తండ్రి తర్సేమ్‌ ‌సింగ్‌ ‌పేర్కొన్నాడు. కానీ ఆయన చెప్పినదానికి భిన్నంగా మత్తుమందులకు బానిసలైన యువతను బాగుచేసే నెపంతో, వారిని ఆత్మాహుతి బాంబర్లుగా తయారు చేస్తున్నాడన్న ఆరోపణలను అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ఎదుర్కొంటున్నాడు.

 భారత్‌లో సిక్కుల జనాభా 2 శాతం మాత్రమే. పంజాబ్‌లో వీరి జనాభా అత్యధికం. 1947లో బ్రిటిష్‌వారు మనదేశానికి స్వాతంత్య్రం ప్రకటించి నప్పుడు సిక్కుమతాన్ని అనుసరించే ప్రజలు అధికంగా ఉన్న పంజాబ్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కొందరు డిమాండ్‌ ‌చేశారు. కానీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పంజాబ్‌ను రెండుగా విడగొట్టి, ఒక భాగం పాకిస్తాన్‌లో మరో భాగం భారత్‌లో కలపడంతో ప్రత్యేకదేశం వాదన తెరమరుగైపోయింది. ఈ కాలంలో సిక్కులు రాజకీయ, సాంస్కృతిక స్వాతంత్య్రం కోసం ఎక్కువగా పోరాటం సలిపారు. అయితే 1980 ప్రాంతంలో సిక్కు వేర్పాటువాదులు రాష్ట్రంలో అనేక మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడటంతోపాటు, ఖలిస్తాన్‌ ఉద్యమం ఊపందు కోవడంతో కేంద్ర ప్రభుత్వం దాన్ని అణచివేసేందుకు చర్యలు చేపట్టింది. చివరికి 1984లో సిక్కుల స్వర్ణదేవాలయంపై సైనిక చర్యకు ఇది దారితీసింది. ఇంత జరిగినా ఖలిస్తాన్‌ ‌వాదుల సంఖ్య చాలా స్వల్పంగా ఉండటం గమనార్హం. ఎందుకంటే ఉగ్రవాదం మళ్లీ జడలు విప్పితే తీవ్రంగా నష్టపోయేది తామేనన్న సత్యం సిక్కు ప్రజలకు బాగా తెలుసు. అందువల్లనే ఖలిస్తాన్‌ ‌వాదులకు మనదేశంలోని సిక్కు సమాజం నుంచి పెద్దగా మద్దతు లభించడంలేదు.

విదేశాల్లో కొనసాగుతున్న ఖలిస్తాన్‌ ఉ‌గ్రవాదం దేశ భద్రతకు పెను ప్రమాదకరంగా భారత ప్రభుత్వం భావిస్తోంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద ఇటువంటి చాలా గ్రూపులను భారత ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది. అయితే బ్రిటన్‌, ‌కెనడా, ఆస్ట్రేలియాల్లో ఈ గ్రూపులకు సిక్కుల నుంచి మద్దతు లభిస్తోంది. అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌మద్దతు దారులు యునైటెడ్‌ ‌కింగ్‌డమ్‌, ‌యూఎస్‌ల్లోని భారత కాన్సులేట్‌ ‌కార్యాలయాలపై దాడులు చేసి విధ్వంసం సృష్టిస్తున్నారు. కెనడాలో కూడా ఖలిస్తాన్‌ ‌వాదులు విధ్వంసానికి పాల్పడుతుండటంతో పోలీసుల గాలింపులు కొనసాగుతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పంజాబ్‌కు చెందిన పెద్దసంఖ్యలో సిక్కులు ఉద్యోగ ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ యూఎస్‌, ‌బ్రిటన్‌, ఆ‌స్ట్రేలియాలకు వెళ్లి స్థిరపడ్డారు. ఆయా దేశాల్లో సిక్కుల జనాభా అధికంగా ఉండటానికి ఇదే కారణం. అయితే ఖలిస్తాన్‌ ‌మద్దదారుల సంఖ్య మనదేశంలో చాలా తక్కువ. భారత్‌లో మాదిరి కాకుండా పై మూడు దేశాల్లో తమ కార్యకలాపాలను నిర్వహించుకునే స్వేచ్ఛ అధికంగా ఉండటంతో, అక్కడి వారు ఖలిస్తాన్‌ ఉద్యమానికి తమ మద్దతు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా బ్రిటన్‌లో ఖలిస్తాన్‌ ‌మద్దతుదారులు పాల్పడిన విధ్వంసం నేపథ్యంలో భారత్‌ ‌ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అక్కడి భారత్‌ ‌హైకమిషన్‌ ‌కార్యాలయానికి భద్రత కల్పించడంలో వైఫల్యంపై తన నిరసనను తెలియజేయడమే కాదు, ఢిల్లీలోని బ్రిటిష్‌ ‌రాయబార కార్యాలయం వద్ద భద్రతను తొలగించింది. కుక్కకాటుకు చెప్పుదెబ్బ మాదిరిగా ప్రభుత్వం తీసుకున్న చర్యతో, బ్రిటన్‌ ‌దిగొచ్చి, లండన్‌లోని భారత హైకమిషన్‌ ‌కార్యాలయం వద్ద భద్రతను పెంచింది. ఫలితంగా మార్చి 22న మళ్లీ ఆందోళన జరపాలని వచ్చిన ఖలిస్తాన్‌ ‌మద్దతు దారులు వెనక్కి తగ్గక తప్పలేదు. ఫెడరేషన్‌ ఆఫ్‌ ‌సిక్‌ ఆర్గనైజేషన్‌, ‌సిక్కు యూత్‌ ‌జెతేభాండియా సంస్థలు మార్చి 22న భారత్‌ ‌హైకమిషన్‌ ‌వద్ద నిరసనలకు పిలుపునిచ్చాయి. అయితే భద్రత కట్టు దిట్టంగా ఉండటంతో వారి ఆలోచన ఫలించలేదు. ఇదే సమయంలో లండన్‌లోని భారత రాయబార కార్యాలయం.. అక్కడి సిక్కువర్గాల్లో ప్రచారమవుతున్న తప్పుడు వార్తలకు కౌంటర్‌ ఇవ్వడం మొదలుపెట్టింది. ముఖ్యంగా పంజాబ్‌లో నిషేధిత ‘వారిస్‌ ‌పంజాబ్‌ ‌దే’ సంస్థకు వ్యతిరేకంగా పోలీసులు తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన వాస్తవాలను బ్రిటిష్‌ ‌సిక్కులకు సవివరంగా తెలిపేందుకు చర్యలు చేపట్టింది. కేవలం కొద్దిమంది వ్యక్తులు ప్రచారం చేసే తప్పుడు వార్తలను నమ్మొద్దంటూ బ్రిటిష్‌ ‌సిక్కు పౌరులను కోరుతోంది.

ప్రస్తుతం పరారీలో ఉన్న అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌కోసం పోలీసులు పెద్దఎత్తున గాలింపు జరుపు తున్నారు. ఇతడు నేపాల్‌కు తప్పించుకుపోయినట్టు తేలడంతో అక్కడి నుంచి పారిపోకుండా ఆపవల సిందని భారత్‌ ‌వారిని కోరింది. ఇదిలా ఉండగా వారిస్‌ ‌పంజాబ్‌ ‌దే సంస్థ రాష్ట్ర హైకోర్టులో ఒక పిటిషన్‌ ‌దాఖలు చేసింది. పోలీసులు సింగ్‌ను అక్రమంగా నిర్బంధించారన్నది దీని సారాంశం. అయితే 80వేల మంది రాష్ట్ర పోలీసులు వెతుకు తుండగా సింగ్‌ ఎట్లా తప్పించుకొనిపోగలడని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాదు నిఘా వర్గాల ఘోర వైఫల్యమంటూ చీవాట్లు పెట్టింది. అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌తప్పించుకోవడంలో అతని సన్నిహిత సహచరుడు పాపల్‌‌ప్రీత్‌ ‌సింగ్‌ (38) ‌పాత్ర ఉన్నదని అధికారులు చెబుతున్నారు. పాపల్‌‌ప్రీత్‌ ‌సింగ్‌కు ఐఎస్‌ఐతో సన్నిహిత సంబంధాలున్నాయని, కేవలం వారి ఆదేశాల మేరకే ఇతగాడు నడుచు కుంటున్నాడని కూడా వారు అనుమానిస్తున్నారు. అమృత్‌పాల్‌ ‌సింగ్‌కు ఇతడు మార్గదర్శకుడని, ఇతని సలహాల మేరకే సింగ్‌ ‌పనిచేస్తాడని కూడా పోలీసులు గట్టిగా చెబుతున్నారు. గత ఏడాది అమృత్‌పాల్‌ ‌సింగ్‌ ‌దుబాయ్‌ ‌నుంచి భారత్‌కు వచ్చి ‘వారిస్‌ ‌పంజాబ్‌ ‌దే’ సంస్థ పగ్గాలు చేపట్టిన దగ్గరి నుంచి పాపల్‌‌ప్రీత్‌ ‌సింగ్‌ అతడితో సన్నిహితంగా పనిచేస్తున్నాడు. పాపల్‌‌ప్రీత్‌ ‌సింగ్‌కు ఐఎస్‌ఐతో సన్నిహిత సంబంధా లుండటం వల్ల అమృత్‌పాల్‌సింగ్‌ ఎపిసోడ్‌ ‌మొత్తం ఆ సంస్థ మార్గదర్శనంలో సాగుతున్నదని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు.

1980 దశకాల్లో మీడియా నేడున్నంత విస్తృత స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఏ సంఘటన అయినా ప్రముఖ పత్రికల్లో వస్తేనే సామాన్య జనానికి తెలిసేది. కానీ నేడా పరిస్థితి లేదు. సమాచార విస్తృతి వేగం పెరగడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇందుకు దోహదం చేస్తుండడంతో క్షణాల్లో సమాచారం ప్రజల్లోకి వెళ్లిపోతున్నది. ఫలితంగా స్వల్ప సంఘట నకూ విపరీత ప్రచారం రావడంతో, ఏదో జరిగి పోతున్నదన్న భయాందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతు న్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రధాన సంఘట నకు, స్వల్ప సంఘటనకు తేడా లేకుండా పోయింది. ‘అతి’ ప్రచారం అనర్థాలకు దారితీస్తోంది. సంఘ విద్రోహశక్తులు, వేర్పాటువాదులకు విపరీత ప్రచారం లభించడానికి కారణం ఇదే.

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE