డెబ్భైల్లో అమెరికా ఆధిపత్యానికి నాటి సోవియట్‌ ‌యూనియన్‌ ‌రూపంలో సవాల్‌ ఎదురైంది. 90ల్లో సోవియట్‌ ‌యూనియన్‌ ‌పతనం కావడంతో పెద్దన్నకు ఎదురులేకుండాపోయింది. నిన్న మొన్నటి వరకూ దాదాపు ఇదే పరిస్థితి. నాటి సోవియట్‌ ‌స్థానాన్ని ఇప్పుడు కమ్యూనిస్టు చైనా భర్తీ చేస్తోంది. ప్రపంచ రాజకీయాల్లో వాషింగ్టన్‌ ఆధిపత్యాన్ని బీజింగ్‌ ‌సవాల్‌ ‌చేస్తోంది. తాజాగా బద్ధశత్రువులైన సున్నీ, షియా దేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్‌ ‌మధ్య రాజీ కుదర్చడం ద్వారా పశ్చిమాసియాలో అమెరికా ప్రాధాన్యాన్ని చైనా గణనీయంగా తగ్గించింది. పశ్చిమాసియా దేశాలతో ఇజ్రాయెల్‌ను సన్నిహితం చేసేందుకు కూడా బీజింగ్‌ ‌ప్రయత్నాలు ప్రారంభించింది. తాజాగా ‘నాటో’(నార్త్ అట్లాంటిక్‌ ‌ట్రీటీ ఆర్గనైజేషన్‌)‌లో కీలక దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్.. అమెరికాకు వ్యతిరేకంగా గళం ఎత్తడం వెనక కూడా చైనా పాత్ర ఉందన్నది జగమెరిగిన సత్యం.

నాటి సోవియట్‌ ‌యూనియన్‌కు వ్యతిరేకంగా అప్పట్లో అమెరికా నాయకత్వంలో ‘నాటో’ పురుడు పోసుకుంది. సోవియట్‌ ‌యూనియన్‌ ఎక్కడ తమపై దాడి చేస్తుందన్న భయంతో యూరప్‌లోని చిన్నా చితకా దేశాలు నాటోలో చేరాయి. కూటమిలోని ఏ దేశంపై దాడి జరిగినా సభ్య దేశాలన్నీ మద్దతుగా నిలబడాలన్నది నాటో నిబంధన. దీంతో యూరప్‌ ‌లోని అప్పటి సోవియట్‌ ‌యూనియన్‌ ఇరుగు పొరుగు దేశాలు చాలావరకు నాటోలో చేరాయి. తాజాగా ఫిన్లాండ్‌ ‌కూటమిలో చేరింది. దీంతో సభ్య దేశాల సంఖ్య 31కు చేరింది. ఇప్పుడు స్వీడన్‌ ‌కూడా కూటమిలో చేరేందుకు పావులు కదుపుతోంది. అయితే కూటమిలోని మరో సభ్య దేశం టర్కీ (తుర్కియే) అందుకు మోకాలడ్డుతోంది. ఫిన్లాండ్‌ ‌చేరికపై కూడా టర్కీ అభ్యంతరం చెప్పినప్పటికీ అమెరికా జోక్యంతో వెనక్కితగ్గింది. కూటమిలోని ఏ ఒక్క సభ్య దేశం అభ్యంతరం చెప్పినా కొత్త దేశం చేరిక ఆగిపోతుంది. ఫిన్లాండ్‌ ‌కూటమిలో చేరడంతో ఆ దేశం సురక్షితంగా మారిందని నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ ‌స్టోలెన్‌ ‌బర్గ్ ‌తెలిపారు. ఫిన్లాండ్‌ ‌తమ కూటమిలో చేరినంత మాత్రాన మాస్కో భద్రతకు ఎటువంటి ముప్పు లేదని, తాము సదా శాంతినే కోరుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఫిన్లాండ్‌ ‌కోరితే తప్ప ప్రత్యేకంగా ఆ దేశానికి అదనపు బలగాలు పంపబోమని వెల్లడించారు. ఇప్పుడు ఫిన్లాండ్‌ ‌నాటో ఇనుప కవచ భద్రతతో ఉందన్నారు.

ఫిన్లాండ్‌తో రష్యాకు దాదాపు 1340 కిలోమీటర్ల సరిహద్దుంది. ఈ సరిహద్దు ఇప్పుడు నాటోలోకి అందుబాటులోకి రావడం రష్యా భద్రతకు సవాల్‌గా మారనుందని దౌత్యవేత్తలు విశ్లేషిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఫిన్లాండ్‌ ‌పరిణామాలను నిశితంగా పరిశీ లిస్తున్నట్లు క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ ‌తెలిపారు. నాటో విస్తరణ తమ దేశ భద్రత, ప్రయోజ నాలను ఉల్లంఘించడమేనని ఆయన వ్యాఖ్యానిం చారు. తాజా చర్య తాము ప్రతీకారం తీర్చుకునే దిశగా పురిగొల్పుతుందని పేర్కొన్నారు. ఫిన్లాండ్‌లోకి ఎటువంటి అదనపు భద్రతా బలగాలను, ఆయుధా లను పంపినా ఆ దేశ సరిహద్దుల్లో తమ బలగాలను బలోపేతం చేస్తామని ఆయన హెచ్చ రించారు. అయితే ప్రస్తుతానికి తమకు ఫిన్లాండ్‌తో ఎటువంటి ప్రాదేశిక తగాదాలు లేవని, ఇదే పరిస్థితి భవిష్యత్తు లోనూ కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ‌బ్రిటన్‌, ‌డెన్మార్క్, ‌బెల్జియం, ఇటలీ, లగ్జెంబర్గ్, ‌కెనడా, ఐస్‌ ‌లాండ్‌, ‌నెదర్లాండ్స్, ‌నార్వే, పోర్చుగల్‌,అల్బేనియా, బల్గేరియా, క్రొయే షియా, చెక్‌ ‌రిపబ్లిక్‌, ఎస్తోనియా, గ్రీస్‌, ‌లాత్వియా, లిధువేనియా, మాంటెనిగ్రో, నార్త్ ‌మాసిడోనియా, పోలండ్‌, ‌రుమేనియా, స్పెయిన్‌, ‌టర్కీ, ఇటలీ, స్లోవే కియా,హంగరీ, ఫిన్లాండ్‌… ‌కూటమిలోని సభ్య దేశాలు.

వాస్తవానికి ఫిన్లాండ్‌, ‌స్వీడన్‌ ‌తటస్థ దేశాలు. ఈ దేశాలు సహజంగా ఎటువంటి కూటముల్లో చేరవు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్య నేపథ్యంలో ఆ దేశాలు తమ విధానాన్ని మార్చుకు న్నాయి. తమ దేశాల భద్రతకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు నాటోలో చేరడమే పరిష్కార మార్గమని అవి భావించాయి. అయితే ఫిన్లాండ్‌ ‌విషయంలో అమెరికా ఒత్తిడికి తలొగ్గిన టర్కీ స్వీడన్‌ ‌విషయంలో మాత్రం పట్టుదలగా ఉంది. కుర్దిష్‌ ఉ‌గ్రవాదులకు మద్దతు పలుకుతూ వారు తమ వీధుల్లో ప్రదర్శనలు చేసుకోవడానికి స్వీడన్‌ అనుమతించ డంపై టర్కీ అధ్యక్షుడు తయ్యద్‌ ఎర్దగన్‌ ‌గుర్రుగాఉన్నారు. ఇదిలాఉండగా మరో సభ్య దేశమైన హంగరీ కూడా స్వీడన్‌ ‌చేరికకు ఆమోదం తెలపాల్సి ఉంది. అయినప్పటికీ నాటోలో స్వీడన్‌ ‌కూడా త్వరలో సభ్య దేశంగా చేరనుందని నాటో ప్రధాన కార్యదర్శి స్టోలెన్‌బర్గ్ ‌తెలిపారు. జులైలో జరిగే నాటో సదస్సులో ఆ దేశం చేరుతుందని నాటో అమెరికా రాయబారి జూలియన్‌ ‌స్మిత్‌ ఆశాభావం వ్యక్తంచేశారు.

కూటమిలో 31 దేశాలు ఉన్నప్పటికీ అమెరికాదే ఆధిపత్యం. దాని మాటే చెల్లుబాటవుతుంది. మిగతా దేశాల పాత్ర నామమాత్రమే. ఇప్పుడు కూటమిలోని కీలక దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్‌ల నుంచి అమెరికాకు సవాల్‌ ఎదురవుతోంది. ఈ రెండు దేశాలు బహి రంగంగానే అగ్రరాజ్యం నిర్ణయాలను తప్పుపడుతు న్నాయి. వాషింగ్టన్‌ ‌నిర్ణయాలకు డూడూ బసవన్నలా తలూపే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నాయి. కూటమిలో తాము గౌరవప్రదమైన సభ్య దేశాలుగా ఉండాలని భావిస్తున్నాం తప్ప ఒకరికి తొత్తులుగా ఉండాలనుకోవడం లేదని పరోక్షంగా అమెరికా నుద్దేశించి వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ దేశాల వ్యాఖ్యల వెనుక బీజింగ్‌ ‌పాత్ర ఉందన్నది బహిరంగ రహస్యం. ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్‌ ‌మెక్రాన్‌ ‌చైనాలో పర్యటించారు. ఆ దేశ అధినేత షి జిన్‌పింగ్‌తో సమావేశం అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు అమెరికాను ఇరుకున పెట్టే విధంగా ఉన్నాయి. నిర్మొహమాటంగా వాషింగ్టన్‌ ‌వైఖరిని ఆయన ఖండించారు. ‘తైవాన్‌ ‌విషయంలో అమెరికా – చైనాల మధ్య యూరప్‌ ఇరుక్కోవలసిన అవసరం లేదు. ఈ విషయంలో చైనానో, అమెరికానో అనుసరించాల్సిన అవసరం మాకు లేదు. యూరప్‌ ఎవరికీ బానిస కాదు. సంబంధం లేని విషయాల్లో ఇరుక్కునే ప్రమాదాన్ని యూరప్‌ ఎదుర్కొంటోంది. మాకు వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అవసరం’ అని మెక్రాన్‌ ‌కుండబద్దలు కొట్టారు. అనంతరం నెదర్లాండ్స్ ‌పర్యటన సందర్భంగా ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం విశేషం. అమెరికా మిత్రదేశం అయినంత మాత్రాన దాని చేతిలో పావుగా, బానిసగా ఉంటామని అర్థంకాదు.. అని తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. వాషింగ్టన్‌ ‌పెద్దన్న పాత్ర వల్ల తమకు నిర్ణయాల్లో స్వేచ్ఛ లేకుండా పోతుందని అన్నారు.

నాటోలోని మరో కీలక దేశం జర్మనీ కూడా ప్యారిస్‌ ‌బాటలోనే ఉంది. ఇటీవల జర్మనీ అధ్యక్షుడు కూడా చైనా వెళ్లివచ్చారు. ఆ దేశ అధినేత షి జిన్‌ ‌పింగ్‌తో భేటీ అయ్యారు. నాటో సభ్య దేశంగా, యూరప్‌లో కీలకశక్తిగా ఉన్న జర్మనీ రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు భారీగానే సాయమందిస్తోంది. అదే సమయంలో రష్యా పట్ల అంతగా కఠిన వైఖరిని అవలంబించడం లేదు. దానికి సొంత కారణాలు న్నాయి. ఇంధన తదితర రంగాల్లో జర్మనీ భారీగా రష్యాపైనే ఆధారపడటం ఇందుకు ప్రధాన కారణం. జర్మనీ సంకీర్ణ సర్కారులోని భాగస్వామ్య పార్టీలు కూడా మాస్కో పట్ల అంత విముఖంగా ఏమీ లేవు. రష్యాతో తెగతెంపులు చేసుకోవడానికి కూడా అవి ఇష్టపడటం లేదు. రక్షణ బడ్జెట్‌ను  భారీగా పెంచు కున్న జర్మనీ ఆయుధ సంపత్తిని సమ కూర్చుకోగానే ఫ్రాన్స్ ‌మాదిరిగా తన గళాన్ని పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమిలోని స్పెయిన్‌, ‌పోర్చుగల్‌, ఇటలీ కూడా ఫ్రాన్స్, ‌జర్మనీ బాటలో ప్రయాణించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఇటలీని రష్యా మిత్రదేశంగా కూటమి అనుమానిస్తోంది. కూటమిలోని మరో కీలక ముస్లిం దేశం టర్కీ కూడా అమెరికా, రష్యాలకు సమానదూరం పాటిస్తోంది. వాస్తవానికి నాటోలో ఫిన్లాండ్‌ ‌చేరికను టర్కీ గట్టిగా వ్యతిరేకించింది. చివరికి అమెరికా ఒత్తిడితో అయిష్టంగానే అంగీకరించింది. జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌లు ఇంతకుముందే యూరోపియన్‌తో చైనా బంధాన్ని బలపరిచాయి. స్థూలంగా చూస్తే అమెరికా మాదిరిగా నాటోలోని కొన్ని సభ్య దేశాలు చైనాతో ఘర్షణను కోరుకోవడం లేదు.

మెక్రాన్‌ ‌వ్యాఖ్యలు, జర్మనీ వైఖరి నాటో కూటమి లోని కొన్ని దేశాల విధానాలు కలకలం రేపుతున్నాయి. మెక్రాన్‌ ‌వ్యాఖ్యలను యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌పార్లమెంటు ప్రతినిధి తోసిపుచ్చారు. ఆయన తమ దేశ వైఖరి గురించి మాట్లాడాలి తప్ప మొత్తం యూరప్‌ ‌గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. అమెరికాతో వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కోరుకునే బదులు అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం కోరుకుంటే మంచిది.. అని పోలండ్‌ ‌ప్రధాని పేర్కొన్నారు. మొత్తానికి అమెరికా, దాని మిత్రదేశాల మధ్య విభేదాలు రగిలించడంలో చైనా సఫలమైందని చెప్పవచ్చు. తద్వారా ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఆధిపత్యాన్ని సవాల్‌ ‌చేసే ప్రయత్నాల్లో కీలక అడుగులు వేస్తోంది.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

About Author

By editor

Twitter
YOUTUBE