– వెంకట శివకుమార్ కాకు
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
నందుకి పాతికేళ్లు ఉంటాయి. ఆనందం వెతుక్కుంటూ బయలుదేరాడు. ఏంటి ఈ విడ్డూరం…. తను ముందుకు వేస్తున్న ప్రతీ అడుగు ఆశ్చర్యం కలిగిస్తోంది. జీవితంపై కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. చిత్రంగా తను నడుస్తున్న దారి పొడవునా చెట్లున్నాయి. విచిత్రంగా జనం ఫుట్ పాత్ మీదనే నడుస్తున్నారు. అడ్డదిడ్డంగా అస్సలు పోవడం లేదు. నమ్మలేని విషయం ఏంటి అంటే… వాహనాలన్నీ ఒకే వరుసలో పోతున్నాయి. ఎవ్వరూ కూడా వంకర టింకర డ్రైవింగ్ చెయ్యడం లేదు. మొత్తం మారిపోయింది. ఆనందుకు ఇదంతా నమ్మశక్యంగా లేదు.
కొన్నాళ్ల క్రితం…
ఆనందు ఉండే కాలనీలో ఎవరో చెట్లు కొట్టేస్తు న్నారు. ‘‘బాబు… ఎందుకయ్యా అలా మంచి మంచి చెట్లు నరికేస్తున్నారు?’’ ఆపుకోలేనంత బాధతో అడిగాడు. ‘‘చెట్లు అడవిలో ఉండాలి. మనుషులు ఉండే చోటు అడ్డంగా ఎందుకు సార్?’’ అన్న ఆ అజ్ఞాని సమాధానం విని దిమ్మ తిరిగింది. ఆ మాటలు విన్నాక ఆనందుకి నీరసం నెత్తిన ఎక్కింది. ‘‘చెట్లు మనుషులకి అడ్డం ఏంటి? మతి ఉండే మాట్లాడుతున్నాడా?’’ అని మనస్సులోనే అనుకున్నాడు.
ఇక చేసేది లేక అత్యవసర పని మీద మోటారు బండి మీద బయలుదేరాడు. ఆ రోజు ఎందుకో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. బండి వెనుక బండి ఆగిపోయి ఉన్నాయి. అదేం పట్టనట్టు…. ఒక బడుద్దాయి వెనుక నుంచి ఆగకుండా హారన్ కొడుతూ ఉన్నాడు. ఇంకో బడుద్దాయి చిన్న కుదుపుతో తనని దాటేసి కోపంగా చూసి వెళ్లాడు. ముందున్న మరో బడుద్దాయి ఫోన్లో ముచ్చట్లు పెడుతూ డ్రైవింగ్. వీళ్లందరినీ చూసి ఆనందుకి ముచ్చెమటలు పట్టాయి.
ఒక కూడలిలో ఎర్ర సిగ్నల్ పడింది. అయిన ఒక ట్రక్ నడిపేవాడు ఆగకుండా వెళ్లిపోయాడు. అనుకోని ఈ సంఘటన వలన అటు నుంచి పచ్చ సిగ్నల్ నుంచి వస్తున్న ఒక జంట దాదాపు ట్రక్ క్రింద పడినంత పనైపోయింది. ఇదంతా చూసి ఆనందుకి పిచ్చెక్కింది. అంతే కాదు…. ఇవేమీ పట్టించుకోకుండా ట్రాఫిక్ పోలీసు దూరంగా, ఒక చాయ్ కొట్టు దగ్గర ఆరాంగా చాయ్ తాగుతున్నాడు. ఎవ్వరూ ఆగడం లేదు. ఆరెంజు సిగ్నల్ పడి పచ్చ సిగ్నల్ వచ్చే లోపే ముందున్న చాలా మంది రయ్ అంటూ సిగ్నల్ దాటేసారు. పచ్చ సిగ్నల్ కోసం చూస్తున్న ఆనందుని మిగతావాళ్లు పిచ్చోడిలా చూసారు. ఆనందువల్ల అరసెకను ఆలస్యం అయ్యింది అని ఒకడైతే కొట్టడానికి కూడా సిద్ధం అయ్యాడు.
అలా గతం గుర్తు చేసుకుంటూ మళ్లీ సిగ్నల్ దగ్గర ఆగాడు.
ఈ సారి జనంలో మార్పు చూసి ఆశ్చర్యం ఆకాశాన్ని తాకింది. ఇప్పుడు తన వెనుక అందరూ వరుసలో నిలబడ్డారు. అసలు ఎవ్వరూ ఫోన్ చూడ్డం లేదు. అందరి ముఖంపై చిరునవ్వు. ట్రాఫిక్ పోలీసు జంక్షన్ మధ్యలో నిలబడి తన బాధ్యత నిర్వర్తిస్తు న్నాడు. రోడ్ దాటే వాళ్లు కూడా తమ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎవ్వరూ తొందర పడ్డం లేదు.
ఇదంతా నమ్మలేని ఆనందు మళ్లీ గతంలోకి వెళ్లాడు.
ఒక రోజు సిగ్నల్ దగ్గర నిలబడినప్పుడు బిచ్చగాళ్లు తన పైన దాడి చేసారు. ఎర్ర సిగ్నల్ పడింది అంటే బిచ్చగాళ్ల హడావిడి మొదలవుతుంది. అంతే కాదు పచ్చ సిగ్నల్ పడిన కూడా…. కొందరైతే దారి వదలకుండా అడ్డం వస్తారు.
ఇదంతా గుర్తు చేసుకుంటూ ఉండగా గ్రీన్ సిగ్నల్ పడ్డంతో మళ్లీ ప్రస్తుతంలోకి వచ్చాడు.
ఒక్క బిచ్చగాడు కూడా కనిపించ లేదు. తనని తాను గట్టిగా గిల్లుకొని ఇది నిజమే అని నమ్మకం తెచ్చుకున్నాడు. అమితమైన ఆశ్చర్యంతో ముందుకు వెళ్లాడు. కొంచెం దూరంలో ఏదో ప్రమాదం జరిగింది. అది చూసి ఆనందు ఆగిపోయాడు. తను సాయం చేద్దాం అని ముందుకు కదిలాడు. తన కన్నా ముందు పదిమంది వచ్చారు. ఈ సారి ఎవ్వరూ కూడా మొబైల్ ఫోన్లో వీడియోలు తీయడం లేదు. అవి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంలో బిజీగా లేరు.
గుంపులో ఒకరు అతన్ని లేపి పక్కన నీడలో కూర్చో పెట్టారు. మరొకరు మంచి నీళ్లు తాగిస్తు న్నారు.
‘‘హెలో! ఇక్కడ ట్రంక్ రోడ్ జంక్షన్‌కి కొంచెం ముందు యాక్సిడెంట్ అయ్యింది. త్వరగా రండి’’ అని ఫోన్‌లో ఆంబులెన్స్‌కి ఒకతను కాల్ చేసాడు. ఇదంతా ఆనందుకి నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకంటే….?
గతం ఎంత విషాదంగా ఉండేది… తలచు కుంటేనే ఒళ్లంతా గగుర్పాటు కలిగింది.
ఒక రోజు ఆనందు వెళ్తున్న బైక్‌ని ఒక కారు అడ్డంగా వచ్చి గుద్ది ఆగకుండా వెళ్లిపోయింది. క్రింద పడిన ఆనందుకి బాగా దెబ్బలు తగిలాయి. అసలు కదలలేక పోతున్నాడు. పదిమంది ముందుకు వచ్చారు. ఆనందు సాయం కోసం చెయ్యి ముందుకు చాపాడు. వాళ్లు చేతులు జేబులో పెట్టి ఫోన్ బయటకి తీసారు. ఆనందు బాధని వీడియో తీయడం మొదలు పెట్టారు.
ఆనందు చెయ్యి పట్టుకొని సెల్ఫీ తీసుకొని ‘‘మనిషికి మనిషి సాయం చెయ్యాలి’’ అని ఫేస్‌బుక్‌ల్లో పోస్టులు పెట్టేసారు. ఆనందు నొప్పితో బాధ పడు తున్నాడు. స్పృహ పోతోంది. ఈ లోపు ఒకడు దగ్గరగా వచ్చి ప్యాంట్ జేబులో చెయ్యి పెట్టు పర్స్ లాగేసాడు. ఎప్పటికో వచ్చాడు మహానుభావుడు… ‘‘ఎవరైనా ఆంబులెన్స్‌కి కాల్ చేసారా లేదా?’’ అని అందరినీ అడుగుతున్నాడు. తాను కాల్ చెయ్యొచ్చు కదా… అది చెయ్యడం లేదు. ట్రాఫిక్ ఎక్కువ అవ్వడంతో… ఎప్పటికో నిదానంగా పోలీసు జీప్ వచ్చింది. ఒక కానిస్టేబుల్ ఆంబులెన్స్‌కి కాల్ చేసారు. అలా దేవుడి దయ వల్ల ఆనందు బ్రతికి బయట పడ్డాడు.
గతం చేసిన గాయం నుంచి బయటకి వచ్చాడు …
ఇదేదో మాయలా ఉంది…. ఇప్పుడు అందరూ కలిసి దగ్గరుండి ప్రమాదం జరిగిన అతన్ని ఆంబు లెన్స్ ఎక్కించారు. ‘‘నేను కూడా తోడుగా వెళ్తాను’’ అని ఒకడు ఆంబులెన్స్ ఎక్కి కూర్చున్నాడు. ‘‘నేను వెనుక నా బండిలో వస్తాను’’ అని మరొకడు అన్నాడు. ‘‘నేను వాళ్ల ఇంట్లో వాళ్లకి ఇన్ఫార్మ్ చేస్తాను’’ అని ఇంకోతను అన్నాడు. అలా అందరూ సాయాన్ని పంచుకొంటున్నారు.
ఇదంతా నమ్మలేని ఆనందు…. ఆత్రుత ఆపుకోలేక ఆంబులెన్స్ వెనుకనే వెళ్లాడు. ఎవరో ముందే ఇన్ఫార్మ్ చెయ్యడంతో…. హాస్పిటల్ స్టాఫ్ సిద్ధంగా ఉన్నారు. అతన్ని జాగ్రత్తగా దించుకొని లోపలికి తీసుకొని వెళ్లారు. ‘‘ఇతని మొబైల్ తీసుకొని తన ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి’’ అని ఒక డ్యూటీ డాక్టర్ అన్నాడు. ‘‘పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి’’ అని హాస్పిటల్ అడ్మిన్‌ని పురమాయించాడు. ‘‘ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాం సర్’’ అని పక్కనే ఉన్న అతను అన్నాడు. అందరూ ఎవరి పనులు వాళ్లు ఎంతో నిబద్ధతతో చేస్తున్నారు.
అంబులెన్స్‌లో తను హాస్పిటల్‌కి వచ్చిన రోజు గుర్తుకు వచ్చింది. గతం గుర్తొచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఆ రోజు అంబులెన్స్ హాస్పిటల్ ముందు ఆగింది. ఆనందుని ఆదుకోవడానికి అక్కడ ఎవ్వరూ లేరు. సెక్యూరిటీ దగ్గర వదిలి అంబులెన్స్ వాడు వెళ్లిపోయాడు. చాలా సమయానికి తీరిగ్గా ఒక నర్స్ వచ్చింది. ‘‘బ్రతికున్నాడా? పోయాడా?’’ అని రిసెప్షన్ వాడితో జోక్‌వేసింది. ఆ మాట విని అప్పటిదాకా కదలకుండా పడి ఉన్న ఆనందులో కూడా చలనం వచ్చింది. ‘‘గట్టి ప్రాణమే….’’ అనుకుంటూ లోపలికి తీసుకెళ్లింది.
‘‘పోలీసులు వచ్చి చూడనివ్వండి. అప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెడదాం’’ అని డ్యూటీ డాక్టర్ అన్నాడు. ‘‘సార్, సార్ ఇతని జేబులో పైసా కూడా లేదు’’ అని జేబులు వెతుకుతూ నర్స్ బాధగా అంది. ‘‘చూస్తుంటే డబ్బున్న వాడిలా ఉన్నాడు. బిల్ కడితే ఓకే. తన కోసం ఎవ్వరూ రాలేదంటే అనాథ శవం లెక్కే… తన శరీరంలో ఉన్న అవయవాలే మన బిల్ పే చేస్తాయి’’ అని చెప్పి నవ్వాడు. ఆ మాటతో నర్స్ కూడా నవ్వింది.
ఆ గతం గుర్తుకు వచ్చి శరీరం ఒక్కసారిగా వణికింది. తనని తాను తడిమి చూసుకుంటూ ప్రస్తుతంలోకి వచ్చాడు.
ఒంట్లో ఏమైనా అవయవాలు మిస్ అయ్యా యేమో అని…. కానీ ఇప్పుడు హాస్పిటల్ వాతావరణం చూసి చాలా ఆనందం కలిగింది.
చాలా ఆనందంతో ఇంటి వైపు కదిలాడు. తమ ఇంటి పక్కనే ఉండే రామయ్య గుర్తుకు వచ్చాడు.
రామయ్యకి డెబ్బై యేళ్లు ఉంటాయి. తన పొలం మీదుగా హైవే వెయ్యడంతో ఉన్న ఒక్క ఆధారంపోయింది. పొలం తీసుకొని డబ్బులు ఇస్తాను అని చెప్పిన ప్రభుత్వం మారిపోయింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏవేవో లెక్కలు అడుగు తోంది. పొలం పోయింది. డబ్బులు రాలేదు. జీవితం అల్లకల్లోలం అయ్యింది. గవర్నమెంట్ ఆఫీసర్లు మళ్లీ రా…. మళ్లీ రా…. అంటూ తిప్పుకుంటున్నారు.
ఆ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి తన కాళ్లకున్న చెప్పులు అరిగిపోయాయి. పాలిపోయిన వదనంతో బయటకి వస్తున్న రామయ్యతో ‘‘పదివేలు ఉంటే పనైపోతుంది’’ అని డోర్ బయట ఉన్న బ్రోకర్ ఆశ పెడుతున్నాడు. ‘‘ఈ సర్కారు వాళ్లే నాకు బోలెడు డబ్బివ్వాలి. అలాంటిది…. నేను పదివేలు కాదు పది పైసలు కూడా ఇవ్వను’’ అని రామయ్య గట్టిగా కూర్చు న్నాడు.
అధికారులు లంచం కంచంలో తిని మంచంలో హాయిగా నిద్రపోతున్న రోజులు అవి… అనుకుంటూ గతం నుంచి ప్రస్తుతంలోకి అడుగేసాడు.
అప్పుడే ఒక ప్రభుత్వ ఆఫీసు ముందు జన సందోహం కనిపించింది. ఆనందు అటువైపు వెళ్లాడు. ఆ జనం మధ్యలో దూరాడు. ‘‘మాష్టారు ఏంటి సంగతి? ఎందుకు ఇంత జనం ఉన్నారు?’’ అని ఆనందు ఆత్రం ఆపుకోలేక పక్కనే ఉన్న వాడిని అడిగాడు. ‘‘ఒక్క పైసా లంచం తీసుకోకుండా అన్నీ ఫైల్స్ క్లోజ్ చేసారు.. ఇక్కడ పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు. అందుకే జనం వాళ్లని సత్కరిస్తున్నారు’’ అని చెప్పాడు. ఆ మాటతో ఆనందుకి కళ్లు తిరిగాయి. భయంతో చెమట్లు కూడా పట్టాయి. ‘‘ప్రభుత్వ ఆఫీసులు లంచం తీసుకోకుండా పని చేస్తున్నాయా? ప్రజలు వాళ్లని సత్కరిస్తున్నారా’’ అనే నిజం నమ్మడానికి చాలా సమయం పట్టింది.
‘‘ఇదంతా ఏంటి?’’ అని దేవుడిని అడగాలి అనుకున్నాడు. హడావిడిగా గుడి వైపు కదిలాడు. గుడి రూపు రేఖలు మారిపోయాయి. ‘‘సార్…. సార్…. టెంకాయ మా దగ్గర తీసుకోండి’’ అని ఎవ్వడూ మీద పడిపోవడం లేదు. ‘‘ఉచితంగా పాదరక్షలు ఇక్కడ ఉంచుకోండి’’ అని రాసి ఉన్న దగ్గర ఉన్న అతను డబ్బులు అడగడం లేదు.
మళ్లీ గతం వెంటాడింది…
పోయిన సారి పుట్టినరోజు నాడు గుడికి వచ్చాడు ఆనందు. గుడి దగ్గరకి రాగానే ముగ్గురు మీద పడి పోయారు. ‘‘సార్ టెంకాయ పాతిక….’’ అని ఒకడు. ‘‘టెంకాయ ఇరవై…’’ అని ఇంకోడు. ‘‘నా దగ్గర టెంకాయ కొంటే చెప్పులు ఉచితంగా పెట్టుకోవొచ్చు’’ అని మరొకడు. వాళ్లని ఎలాగో దాటుకొని ‘‘ఉచితంగా పాదరక్షలు ఉంచుకోండి’’ అని బోర్డు ఉన్న వైపు నడిచాడు. ‘‘జతకి పది….’’ అని అన్నాడు. ‘‘ఉచితం అని రాసి ఉంది’’ అని ఆనందు ఆవేశంగా అన్నాడు. ఆ మాటకి వాడి కోపం చూసి…. ఆనందు పది రూపాయలు వాడి చేతిలో పెట్టాడు.
గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి వచ్చే సరికి క్యూ లైన్ ఆగిపోయింది. ‘‘మాష్టారు? ఎందుకు క్యూ లైన్ ఆగిపోయింది?’’ అని వినయంగా పక్కనే ఉన్న ఇంకో భక్తున్ని అడిగాడు. ‘‘మన ఎమ్మెల్యే గారి తమ్ముడు ఒక్కగానొక్క రెండో భార్య పుట్టిన రోజు. వాళ్లకి లోపల స్పెషల్ పూజ జరుగుతోంది’’ అని అతను సమాధానం చెప్పి భజన చేసుకుంటూ ఉన్నాడు. ‘‘గుడిలో కూడా ఈ రెకమెండేషన్లు ఏంటి? దేవుడి దగ్గర అందరూ ఒక్కటే కదా….’’ అని మనస్సులో మాట బయటకి అనేసాడు. ‘‘అరే వీడెవడో మన ఎమ్మెల్యేని అనరాని మాటలు అంటు న్నాడు’’ అని లైన్‌లో ఉన్న కార్యకర్త ఆవేశంగా అరిచాడు. ఏదో తేడా కొట్టి ‘‘ఎమ్మెల్యే జిందాబాద్… జిందాబాద్….’’ అని అరుస్తూ తెలివిగా తప్పించు కున్నాడు ఆనందు.
ఎమ్మెల్యే అనుచరుల నుంచి ఆ రోజు తప్పిన అపాయం గుడి లోపలికి వెళ్తూ ఉంటే గుర్తుకు వచ్చింది. అలా ప్రస్తుతంలోకి….
ఇప్పుడు గుడిలో క్యూ ఏ తోపులాట లేకుండా ముందుకు వెళ్తూ ఉంది. తన వెనుకే ఒక పెద్ద మనిషి క్యూలో ఉన్నాడు. ‘‘మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది ….’’ అని ఆనందు అనుమానంగా అన్నాడు. ‘‘ఆయన తెలీదా? మన ఏరియా ఎమ్మెల్యే గారు….’’ అని పక్కన ఉన్న పెద్ద మనిషి చెప్పిన మాట విని శిలలా నిలబడి పోయాడు ఆనందు. ‘‘ముందుకు పదండి….’’ అని ఎమ్మెల్యే అన్నాడు.
‘‘సార్…. మీరు ఇలా క్యూలో ఏంటి?’’ అని ఆనందు ఆపుకోలేక అడిగాడు. ‘‘ఆ భగవంతుని ముందు అందరం ఒక్కటే….’’ అని ఎమ్మెల్యే చెప్పిన మాటలు విని తన మాట పడిపోయింది. ఆ లైన్‌లో అలా దేవుడిని తలచుకుంటూ ముందుకు వెళ్లి పోయాడు. ‘‘కానుకలు హుండీలో వెయ్యండి. హారతి పళ్లెంలో ఎవ్వరూ వెయ్యకండి’’ అని పూజారి అంటున్నాడు. పొరపాటున హారతి పళ్లెంలో పడిన కానుకలు పూజారి స్వయంగా హుండీలో వేస్తున్నాడు. ఇదంతా చూసి ఆనందు మతి భ్రమించేలా ఉంది.
పరవశంతో ఆ దేవుడికి దణ్ణం పెట్టుకున్నాడు. ఈ సారి తీర్ధం అమృతంలా అనిపించింది. చిటికెడు ప్రసాదంతో కడుపు నిండిపోయింది. అసలు తను చూస్తున్న మార్పుతో మనస్సు నిండిపోయింది. తనని తాను గట్టిగా గిచ్చుకున్నాడు. చాలా నొప్పి కలిగింది. ‘‘మాష్టారు! నన్ను ఒక్కసారి గట్టిగా గిల్లండి లేదా కొట్టండి’’ అని పక్కనే ఉన్న పెద్దాయనని అడిగాడు. ‘‘ఎల్లప్పుడూ తోటి మనిషికి సాయం చెయ్యాలి. ఇలా అపకారం ఎవరైనా చెయ్యగలరా? తోటి మనిషిని కొట్టడం? గిల్లడం? ఎంత పాపం….’’ అని అతను చెప్పి గిల్లకుండా అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
‘‘ప్రపంచం నిజంగా మారిపోయిందా?’’ అని ఆశ్చర్యపోతూ ముందుకు కదిలాడు. అడుగడుగునా మారిన ప్రపంచం ఎదురవుతోంది… జంతువులు జూలో లేవు. అడవిలో మాత్రమే ఉన్నాయి. రైతు పంటని ఎవ్వరూ దోచుకోవడం లేదు. రైతు ఆత్మహత్య అనేది అసలు జరగడం లేదు. అలాగే రైతులు కూడా పొలాల్లో రసాయనాలు కలపడం లేదు. పాలల్లో నీళ్లు కూడా…. దొంగతనాలు లేనే లేవు… పోలీసులు సరిగ్గా పని చేస్తున్నారు. అసలు జనం ఓటుకి అమ్ముడు పోవడం లేదు. రాజకీయ నాయకులు కూడా ఓట్లు అడుక్కోవడం లేదు. మద్యం కొట్లు ఊరి చివరకి విసిరివేయపడ్డాయి. యువకులు అమ్మాయిలను గౌరవిస్తున్నారు. ప్రేమించి మోసం చెయ్యడం లేదు. పెళ్లి చేసుకొని విడాకుల పేరుతో ఎవ్వరూ విడిపోవడం లేదు.
ఇదంతా నమ్మలేక గిలగిల కొట్టుకుంటున్న ఆనందు… అలారం మ్రోగడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచాడు. తను చూసిన కలల ప్రపంచం నుంచి బయటకి వచ్చాడు. ‘‘ఇదంతా కలా? నిజం కాదా?’’ అనుకుంటూ నిట్టూర్చాడు.
‘‘ఇదంతా కొంతవరకైనా నేను నిజం చేసి చూపిస్తాను….’’ అని లేచి ఇంటర్వ్యూ కోసం రెడీ అయ్యాడు. తనకి ఈ రోజు ఐఏఎస్ ఫైనల్ ఇంటర్వ్యూ ఉంది. కలెక్టర్‌గా ఒక జిల్లాని, కొందరిని అయిన తన కలలోలా… ఇలలో మార్చి…. తన కలల ప్రపంచాన్ని కొంతవరకైనా నిజం చేసు కోవాలి…. అని మనస్సులో గట్టిగా అనుకున్నాడు. ఆ నిర్ణయంతో ఆనందు ముఖంలో ఆనందం మళ్లీ తిరిగి వచ్చింది.