తెలంగాణను ప్రశ్నపత్రాల లీకేజీ బెడద పట్టి పీడిస్తోంది. విద్యార్థులను మానసికంగా ఆందోళనకు గురిచేస్తోంది. కొందరి దుర్మార్గపు చేష్టలు లక్షల మందిని బాధ పెడుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగ నియామకాల పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను వెంటాడుతోంది. రాష్ట్రంలో ప్రకంపనలు పుట్టిస్తోంది. విపక్షాల ఆగ్రహ జ్వాలలు, ప్రభుత్వం నష్ట నివారణ ప్రయత్నాలు వంటి పరిణామాలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. సరిగ్గా ఇదే సమయంలో మరో పరీక్షపత్రం లీకయ్యింది. మొన్నటి టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన మంటలు ఆరకముందే పరీక్షల తొలి రోజే ఎస్సెస్సీ పరీక్ష పేపర్ లీకయ్యింది.
ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటం, సంబంధిత ఉన్నతాధికారుల అలసత్వం, ఏం జరిగినా ఏమీ కాదనే ధైర్యం, పెద్దల అండదండలుంటే ఏం చేసినా సమర్థించుకోవచ్చనే వెసులుబాటు తత్వం వంటి పరిణామాలు విద్యార్థులు, నిరుద్యోగ యువకుల పాలిట శాపంగా మారుతున్నాయి. అసలే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీకేజీ వ్యవహారం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంటే.. ఇదే సమయంలో జరుగు తున్న ఎస్సెస్సీ పరీక్షలను ప్రతిష్టాత్మకంగా తీసు కోవాల్సింది పోయి.. పర్య వేక్షణను గాలికొది లేయడంవల్లే తాజా పరిణామం జరిగిందన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే, పదో తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై పాఠశాల విద్యాశాఖ మాత్రం వెంటనే స్పందించింది. పోలీస్ విభాగం, విద్యాశాఖ ఉమ్మడిగా విచారణ చేపట్టాయి. ఇప్పటికే నలుగురు విద్యాశాఖ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. వికారాబాద్ జిల్లా తాండూర్‌లో స్కూల్ నెం.1 సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్, ఇద్దరు ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేశారు.
తవ్వినకొద్దీ బయటపడుతున్న లింకులు
ఇక, టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం మాత్రం మామూలుగా లేదన్న సంగతి దర్యాప్తులో స్పష్టంగా బట్టబయలవుతోంది. ఏకంగా మనీ ల్యాండరింగ్ జరిగిందన్న ఆధారాలు బయటకు వచ్చాయి. దీంతో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ ఎంటరయ్యింది. ఇప్పటిదాకా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ – సిట్ చేపట్టిన దర్యాప్తును మరింత లోతుగా విశ్లేషించేందుకు సన్నాహాలు చేస్తోంది. మరోవైపు.. ఈ కేసులో నిందితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అంతేకాదు, ఈ కేసు పెద్దల మెడకు కూడా చుట్టుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏకంగా టీఎస్‌పీఎస్సీ పెద్దలను కూడా సిట్ అధికారులు విచారించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. చిన్న ఉద్యోగుల నుంచి ప్రారంభమైన విచారణ కమిషన్ లోని పెద్దల వరకు వెళ్లింది. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ సెక్రెటరీ అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డి లను సిట్ అధికారులు విచారించారు. హిమాయత్ నగర్‌లోని సిట్ కార్యాలయంలో అధికారులు ఇద్దరినీ ప్రశ్నించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ ఇద్దరిని వేర్వేరుగా సిట్ చీఫ్, నగర పోలీస్ అదనపు కమిషనర్ (క్రైమ్స్) ఏఆర్ శ్రీనివాస్, ఇతర అధికారులు దాదాపు రెండున్నర గంటలపాటు విచారించారు. సిట్ అధికారులు అనితా రామ చంద్రన్‌ను.. ప్రవీణ్‌కుమార్ మీ వద్ద పీఏగా ఎలా వచ్చాడు? పీఏలుగా వచ్చే వారి అర్హత, వారి విధి విధానాలు ఏమిటి? ప్రవీణ్‌పై గతంలో వచ్చిన ఆరోపణలు, తీసుకున్న చర్యలు, ప్రశ్నపత్రాలు ఉండే విభాగానికి, మీకు మధ్య ఉండే సంబంధాలు, కస్టోడియన్ శంకర్ లక్ష్మిపై ఏమైనా ఆరోపణ లున్నాయా? ఏటా సైబర్ ఆడిటింగ్ జరిగిందా? ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర ఏంటి? టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తూ కమిషన్ ఆధ్వర్యంలో జరిగే పరీక్షలు రాయవచ్చా? మీ పీఏ గ్రూప్-1 పరీక్ష రాస్తున్న విషయం మీకు తెలుసా? తదితర అంశాలపై ఆమెను ప్రశ్నించినట్టు తెలిసింది. దీనికి అనితా రామచంద్రన్ సవివరంగా సమాధానాలిచ్చినట్టు సమాచారం. ప్రవీణ్ గ్రూప్ 1 పరీక్ష రాసినట్టు తనకు తెలుసని అనితా రామచంద్రన్ సిట్ ముందు చెప్పారు. అయితే ప్రవీణ్ డిస్‌క్వాలిఫై కావడంతో అతనిపై అనుమానం రాలేదని చెప్పారు. కాగా తన పీఏ రమేష్ గ్రూప్ 1 రాసినట్టు తనకు తెలియదని లింగారెడ్డి చెప్పారు. మొత్తం పరీక్షల నిర్వహణ, కాన్ఫిడెన్షియల్‌పై సిట్ అధికారులు వివరాలు రాబట్టారు. అంతేకాదు, కమిషన్ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయాలని సిట్ భావిస్తున్నట్టు సమాచారం.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1, అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవ హారంలో చాలా పెద్ద చైన్ లింక్ ఉన్నదని సిట్ అధికారులు ఓ అంచనాకు వచ్చారు. ఇప్పటివరకు పలు దఫాలుగా ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించిన దర్యాప్తు అధికారులు.. మళ్లీ మళ్లీ వాళ్లను విచారిస్తే మరిన్ని డొంకలు కదిలే అవకాశం ఉందని న్యాయ స్థానానికి విన్నవించారు. తొలుత కస్టడీలోకి తీసుకున్న సమయంలో చాలామంది నోరు మెదప లేదని తదుపరి విచారణలో వివరాలు వెల్లడిస్తున్నారని సిట్ అధికారులు అంటున్నారు. అందుకే నిందితులను ఎక్కువ రోజులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే కేసులో ఉన్న లింకులన్నీ బయటపడతాయని చెబుతున్నారు.
ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన రాజశేఖర్, ప్రవీణ్ కుమార్, రేణుక పేపర్ లీక్ చేసి చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నిందితుల బంధువులు, స్నేహితులు ఎవరైనా టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాశారా? అనే అంశాన్ని సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. నిందితులు ఎంతమందికి పేపర్లు లీక్ చేశారు? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే గ్రూప్-1లో 100కుపైగా మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితాను కూడా అధికారులు పరిశీ లిస్తున్నారు. దీంతో ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న రాజశేఖర్ సమీప బంధువు ప్రశాంత్ గ్రూప్-1 పరీక్ష రాసినట్లు బయటపడింది. న్యూజిలాండ్‌లో ఉంటున్న అతడు.. గతేడాది అక్టోబర్‌లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాసినట్లు గుర్తించారు. పరీక్ష రాసిన అనంతరం ప్రశాంత్ తిరిగి న్యూజిలాండ్ వెళ్లినట్లు సిట్ గుర్తించింది. అంతేకాకుండా ప్రశాంత్‌కు 100కుపైగా మార్కులు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అతడికి ఎలా పేపర్ లీక్ చేశారనే అంశాన్ని పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం రాజశేఖర్ పోలీసుల కస్టడీలో ఉండగా.. అతడిని ప్రశాంత్‌కు పేపర్ లీక్ చేసిన విషయం గురించి ప్రశ్నించారు. ప్రశాంత్ తన సమీప బంధువు అని రాజశేఖర్ అంగీకరించాడు. కానీ పరీక్ష పేపర్ విషయం చెప్పలేదని సమాచారం. అలాగే నిందితు లందరినీ కూడా ఇదే కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రేణుక ద్వారా కూడా చాలా మందికి పేపర్ లీక్ అయినట్లు గుర్తించారు. దీంతో ఆమె నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు.
ప్రతిపక్షాల విమర్శలు
రాజకీయంగానూ ఈ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు సిట్ నోటీసులు ఇవ్వడం, ఆ ఇద్దరికి కేటీఆర్ కూడా లీగల్ నోటీసులు పంపడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలకు మరింత పదును పెట్టాయి. ప్రభుత్వ కనుసన్నల్లోనే అక్రమాలు జరిగాయని, భారీ ఎత్తున లావాదేవీలపై విచారణ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. మొత్తం ఘటనపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తేనే అసలు నిజాలు బయటకొస్తాయని బీజేపీ డిమాండ్ చేసింది. పేపర్ లీకేజీకి బాధ్యుడైన కేసీఆర్ తనయుడిని బర్తరఫ్ చేసే దాకా పోరాడతామని బండి సంజయ్ ఉద్ఘాటించారు. లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. అంతేకాదు, బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టింది. మా కొలువులు మాగ్గావాలె అనే నినాదంతో హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించింది.
ప్రభుత్వ తీరుపై అనుమానాలు
ప్రశ్నపత్రం లీకేజీలో ప్రభుత్వంలోని పెద్దల పాత్రపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేతలు ఈడీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో కావాల్సిన వాళ్లను ప్రభుత్వం కాపాడుతూ.. చిన్న చిన్న ఉద్యోగులను ఇరికిస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రపతికి ప్రవీణ్ కుమార్ లేఖ
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో మొదటి నుంచి తాము చెబుతున్నట్లుగానే కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందన్న విషయం రోజురోజుకు మరింత బలపడుతోందని బీఎస్పీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. తనకు సంబంధం లేదంటూనే టీఎస్‌పీఎస్సీ తరఫున కేటీఆర్ వాకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారని ఆరోపించారు. మార్చి 13న పేపర్ లీకేజీ బయటపడిన సమయంలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారని, ఇక అప్పటి నుంచి మీడియా ముందుకు ఆయన ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.
టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యులు చెప్పాల్సిన విషయాలను మంత్రి కేటీఆర్ ఎందుకు చెబుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంశం ఇప్పుడు రాష్ట్రపతి వరకూ వెళ్లింది. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, టీఎస్‌పీఎస్సీ వ్యవహారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు లేఖ రాశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించి సమగ్ర విచారణ జరిపించాలని లేఖలో కోరారు. ప్రస్తుత కమిషన్‌ను బర్తరఫ్ చేయాలని కూడా లేఖలో పేర్కొన్నారు.
– సుజాత గోపగోని, 6302164068, సీనియర్ జర్నలిస్ట్