ఆర్య సమాజం నుండి దొరికిన బొంబాయి, మద్రాసులలోని నిషేధిత పత్రికలలోని క్లిప్పింగ్‌లు, కరపత్రాలను జైలు ఉద్యోగి, క్షురకుడు సుబ్బన్న తన పొదిలో దాచుకుని రహస్యంగా జైలులోని ఆళ్వారుస్వామి తదితరులకు అందచేసే వాడు. జైలులోని వారికి అలా అనేక నిషేధ వార్తలు చదివే అవకాశం కలిగింది. ఉర్దూలో వచ్చిన ఒక కరపత్రంలో ‘బక్రీద్ పండుగ నాటి గొర్రెల్లా మీరంతా సఫా. బతికి బయట పడతామని ఆశ పడకండి. ఇండియన్ సైన్యం సరిహద్దు దాటిందో… మీ పీకల్లో నుంచి ప్రాణాలు దాటినట్లే’ అని ఉంది. అయితే ఎవరో ఆకతాయి రాసి ఉంటాడని, ఖాతరు చేయకండని ఒకరన్నారు. ‘లేదండోయ్ మనని చంపి వాళ్లు చస్తారు’ అన్నాడు మరో ఖైదీ. అయినా గుండెల్లో గుబులు. ఇంతలో ఆంగ్లంలో మరో కరపత్రం వచ్చింది. ‘భయపడకండి. మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డువేస్తాం. జైలు మీద దాడి చేసిన వారిని కాల్చేస్తాం. సరిహద్దుల్లో సంచలనం, తస్మాత్ జాగ్రత్త! వందేమాతరం’ అని ఉంది.
బ్రిటిష్ వారు దేశానికి స్వాతంత్య్రం ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చిందన్న ఆనందం కన్నా అటు కాశ్మీర్ సమస్య, ఇటు నాలుగు వందల పైచిలుకు సంస్థానాల విలీనం సమస్య, అందులోనూ హైదరాబాద్ సంస్థానం అంశాన్ని ఎలా పరిష్కరించా లన్న ఆలోచనలే నాయకులను పట్టి పీడిస్తున్నాయి. ఈలోగా గాంధీజీ హత్య. దేశ సమస్యలలో భారతీయు లుండగా, హైదరాబాద్ నైజాం మాత్రం ఈ చిన్నపాటి హైదరాబాదు సంస్థాన సమస్యను పెద్దదిగా ఐక్యరాజ్య సమితికి నివేదించాడు. అందుకు సామ్రాజ్యవాదుల అండను పొందాడు. బ్రిటిష్ పాలకులకు అణగిమణిగి ఉంటూ హైదరాబాద్‌లోని వారి ప్రతినిధులైన రెసిడెంట్ల కోరికలు తీర్చడానికి దివారాత్రాలు గానాబజానాలతో తృప్తి పరుస్తూ కాలక్షేపం చేసిన నిజాం నవాబు, తనను సర్వ స్వతంత్రునిగా ప్రకటించుకున్నాడు. బ్రిటిష్‌వారి సైన్యం శతాబ్దాలుగా బొలారం, తిరుమలగిరి (సికింద్రాబాద్) ప్రాంతాలలో ఉంటే కిక్కురుమనని నిజాం ‘భారత సైన్యం మా రాష్ట్రంలో వుండడానికి వీల్లేదని’ మూర్ఖించాడు. యథాతథపు ఒప్పందం ప్రకారం, ఏడాది పాటు భారత సైన్యాలు పెట్టే బేడా సర్దుకుని వెళ్లిపోయాయి. ఇది ఎత్తుగడ మాత్రమేనని కొందరు, నిజాం నక్కజిత్తులకు భారత ప్రభుత్వం చిత్తయిపోయిందని మరికొందరు బాహాటంగానే చెప్పుకున్నారు. అయితే భారత ఏజెంట్ జనరల్‌గా కనైయాలాల్ మానెక్లాల్ మున్షీ (కె.ఎం.మున్షీ) బొలారంలో బస చేయడం భారతీయులకు కొంత ఊరట కలిగించిన అంశం.
గురాత్‌కు చెందిన మున్షీ భారత స్వాతంత్రోద్యమకర్త, వృత్తిరీత్యా న్యాయవాది, రచయిత, ముందు చూపున్న రాజకీయ దురంధరుడు.ఆయన కలం పేరు ఘనశ్యామ్ వ్యాస్. 1938లో భారతీయ విద్యాభవన్ అనే ఓ ఎడ్యుకేషనల్ ట్రస్టును స్థాపించి భారతదేశ చరిత్రను లిఖించాడు. ఆయన విశ్వహిందూ పరిషత్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. హైదరాబాద్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి చ•ర్యను కనిపెడుతూ కేంద్రానికి తెలియజేస్తూ వుండేవాడు. నిజాం ప్రభుత్వం చేసే యుద్ధ్ద సన్నాహాలు, ఆయుధ ఉత్పత్తి రహస్యాలు, వందేమాతరం రామచంద్రరావు, వీరభద్రరావు వంటి దేశభక్తుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కేంద్రాన్ని హెచ్చరించే వాడు.
‘వందేమాతరం’ రామచంద్రరావు ఇంటి పేరు కాదు. 1940లో చంచల్ గూడా జైల్లో నిర్భంధలో ఉన్న రామచంద్రరావుకు మూడు డజన్ల కొరడా దెబ్బలు కొట్టాలని శిక్ష విధించారు. అలా ప్రతి దెబ్బకు ‘వందేమాతరం’ అంటూ నినదిస్తూ, బాధను ఓర్చు కున్నాడు. అలా ఆయన ‘వందేమాతరం’ రామచంద్ర రావు అయ్యారు. కొంతసేపటికి ఆ దెబ్బలకు తాళలేక స్పృహ తప్పిపోయాడు. అయినా దెబ్బలు కొడుతూనే ఉన్నారట. ఆ సమయానికి స్వామి రామానందతీర్థ అక్కడే సింగిల్ సెల్‌లో నిర్బంధంలో వున్నారు. ‘నేను వందేమాతరంను చూడాలని కోరగా, ఒక షరతు మీద అనుమతిస్తామని, చూసి వెంటనే వచ్చేయాలి. ఆయనతోఓ ఏమీ మాట్లాడకూడదు’అని జైళ్ల ఐజీపీ చెప్పారని ఆయన రాసుకున్నారు. ‘వందేమాతరం గారిని చూశాను ఛిన్నా భిన్నమై పోయిన శరీరంతో పడి వుండగా చూచి వచ్చేశాను’ పేర్కొన్నారు. ఈలోగా సిడ్నీ,కాటన్ ఆయుధాలు సరఫరా చేయ డానికి నిజాంతో ఒప్పందం చేసుకున్నాడు. మహా ఘనత వహించిన నిజాం ప్రభువు హైదరాబాదు రాష్ట్రాన్ని ఇస్లామిక్ స్టేట్‌గా ప్రకటిస్తూ పర్మాన (రాజపత్రం) జారీ చేశాడు. ఈ విషయాన్ని దక్కన్ రేడియో పదే పదే ప్రకటించింది. జర్మనీలో గోబెల్స్ ప్రచారానికి తీసిపోనిది దక్కన్ రేడియో.
1939-45 మధ్య రెండవ ప్రపంచ యద్ధాన్ని ఓ కొలిక్కి తెచ్చిన విన్‌స్టన్ చర్చిల్, యుద్ధ్దానంతరం బ్రిటన్ ఎన్నికల్లో పోటీచేసి అట్లీ చేతుల్లో ఓడిపోయాడు. ‘నిజాం రాజు సర్వస్వతంత్రుడు’ అని, 17 జూన్ 1947న బ్రిటిష్ పార్లమెంటులో ‘భారత స్వాతంత్య్ర చట్టం’ ఆమోదం పొందిందని, దాని ప్రకారం భారతదేశంలోని సంస్థానాలు సర్వస్వతంత్ర మయ్యాయని వ్యాఖ్యానించాడు. చర్చిల్ ప్రకటనకు వ్యతిరేకంగా సుప్రసిద్ధ భారతీయ రచయిత ముల్క్‌రాజ్ ఆనంద్ లండన్‌లో ఓ ప్రకటన జారీ చేశాడు.
హైదరాబాదు రాష్ట్రంలో జరుగుచున్న దురాగతాల వార్తలు దేశంలోని ప్రముఖ నగరాల నుండి వెలువడే ఆంగ్ల, హిందీ, మరాఠా•, కన్నడ పత్రికలు ప్రచురితమవుతున్నాయి. లిటిల్ హిట్లర్‌గా పిలిచే నాయకుడు ఖాసీం రజ్వీ ప్రయివేటు సైన్యం గ్రామాల్లో సాగిస్తున్న హింసాకాండ, మానభంగాలు, హత్యలు పాఠకులకు భయం పుట్టిస్తున్నాయి. మరోవంక ఆ వార్తలు రాసే పత్రికలను నిజాం ప్రభువు నిషేధించాడు. బొంబాయికి చెందిన సుప్రసిద్ధ రచయిత కింగ్‌స్లే మార్టిన్ హైదరాబాద్ వచ్చి రజ్వీని కలసి తాను సేకరించిన సమాచారాన్ని 20 మార్చి 1948న ‘న్యూ స్టేట్స్‌మన్ అండ్ నేషన్’ పత్రికలో వివరంగా ప్రచురించాడు.
రజ్వీతో కింగ్‌స్లే
‘నేను ఖాసీం రజ్వీ ఇంటికి వెళ్లాను. వయస్సు నలభయ్‌కి పైగా వుంటుంది. చిన్నగడ్డంతో ఉన్న అతని చూపుల్లో ఉద్రేకం, ఉన్మాదం కొట్టొచ్చినట్లు కనిపించాయి. హైదరాబాద్ రాష్ట్రంలో సర్వశక్తి మంతుడు ఖాసీం రజ్వీయే తప్ప నిజాం నవాబు కాడు. ఈ ఇత్తెహాద్-ఉల్-ముస్లిమీన్ నాయకుడి కింద రెండు లక్షల మంది బలాఢ్యులైన సాయుధ మహమ్మదీయ యువకులతో ప్రయివేటు సైన్యం ఉంది. ఎవరినైనా ఎదిరించగలం అనే ధీమాతో ప్రవర్తిస్తున్నారు. సరైన ఆయుధాలు లేకుండా, కొద్ది సంఖ్యలో వున్న నిజాం సైన్యానికి, రజాకారు సేనకు పోలికేలేదు. ‘రజాకార్లదే రాజ్యం. అసలు సైన్యంలో దమ్ము లేదు. రజ్వీతో మాట్లాడాను. భారత యూనియన్‌లో చేరడానికి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రవేశ పెట్టడానికి నేను వ్యతిరేకిని. నాకు స్వతంత్ర హైదరాబాదు కావాలి’ అని ఉద్రేకంగా కచ్చితంగా చెప్పాడు’ అని కింగ్‌స్లే వివరించారు.
ఇంకా ఆయన మాటల్లోనే…‘మరి ఈ హత్యలు, లూటీలు, మానభంగాల మాటేమిటి?’ అని ప్రస్తావించగా, ‘అవి హిందూ మతోన్మాదులు చేస్తున్నారు. మేము కాదు. కావాలంటే మీరు స్వేచ్ఛగా గ్రామాలకు వెళ్లి చూడండి!’ అనడంతో, ఆతని మాటలు పరిశీలించాలని గ్రామాలకు వెళ్లాను. అక్కడి పరిస్థితి ఆయన వాదానికి పూర్తి భిన్నంగా ఉంది. మతకలహాలను సృష్టించే అతని ఉద్రేక పూరిత ప్రసంగాలను గురించి ప్రజలు నాకు స్వయంగా చెప్పారు. అతని అనుచరుల చర్యలు హిట్లర్ ఆదేశంతో నాజీలు జరిపిన దురాగతాలతో పోలివున్నాయి. ఇత్తేహాద్ వలంటీర్లు గ్రామాలను లూటీ చేస్తూ, ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారని తేలింది. ఆడవాళ్లు ఇళ్ల నుండి బయటకు రావడం లేదు. ధృఢకాయులైన యువకులు ఊరి బయట మంచెలు కట్టుకొని తుపాకీలతో రాత్రిళ్లు కాపలా కాస్తున్నారు. రజాకార్లను ఎదిరిస్తున్నారు. ‘‘ఆయుధ నిషేధ చట్టం ప్రభుత్వం ప్రవేశ పెట్టడంతో మమ్మల్ని మేము రక్షించుకునే అవకాశం కూడా పోతున్నది. ఊళ్లు వదిలేసి, రాష్ట్ర సరిహద్దులు దాటి, స్వతంత్ర భారత ప్రాంతాల్లో తలదాచుకోవలసిన సమయం ఆసన్నమైంది’’ అని వారు మొర పెట్టుకున్నారు.
చాలా కుటుంబాలు అటు మద్రాసు రాష్ట్రంలోకి, ఇటు బొంబాయి సరిహద్దుల్లోకి వెళ్లాయి. గ్రామీణులు తమ ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. రజాకార్లను ధైర్యంగా ఎదిరించి, వాళ్లకు దేహశుద్ధి చేసి, ఆయుధాలు లాక్కుని గ్రామ ప్రజలను రక్షిస్తున్నారు. అయితే ఇది ఎక్కువగా మదరాసు రాష్ట్ర సరిహద్దుల్లోనే చేయగలుగుతున్నారు. హైదరాబాద్ నిస్సందేహంగా పాసిస్టు రాష్ట్రం, ఇక్కడ ప్రాథమిక పౌరహక్కులు శూన్యం. కింగ్‌స్లే మార్టిన్ ఈ వివరాలన్నీ తమ పత్రికలో రాశారు. రజ్వీ దురాగతాలకు, నిజాం నవాబు నియంతృత్వ పాలనకు సైనికచర్య రూపంలో అడ్డుకట్ట పడే సమయం ముంచుకొస్తోంది. అబద్దపు వార్తలు ప్రచారానికి దక్కన్ రేడియో పెట్టింది పేరు. నిజాం సేనలు, రజాకార వీరులు ధైర్య సాహసాలతో భారత సైన్యాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. విజయ పరంపరలతో మన సైన్యం ముందుకు సాగిపోతున్నది’ అని అని గంటకోసారి ప్రసారం చేస్తుండేది.
అది మేకపోతు గాంభీర్యమే. ‘భారతసైన్య పురోగమనాన్ని ఆపే శక్తి నాకు లేదు’ అని నిజాం నవాబుకు సైన్యాధిపతి ఎల్.ఎడ్రూస్ నిర్మొహ మాటంగా చెప్పడమే అందుకు ఉదాహరణ. ‘నేను ఢిల్లీతో మాట్లాడడానికి వీలుకాలేదు. టెలిఫోన్, వైర్‌లెస్ ఏదీ లేదు. భారత ప్రభుత్వ ఆదేశాలను పాటించి యుద్ద విరమణ చేయడం, లాయఖ్ ఆలీ మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేయడం, రజాకారు సంస్థను నిషేధించడం, స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామీ రామానంద తీర్థను ఇతర రాజకీయ ఖైదీలను విడుదల చేయడమే తక్షన కర్తవ్యమని నవాకు నేను చెప్పదగిన సలహా అని మున్షీ తన ‘ది ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా’లో పేర్కొన్నారు. ఆయన అన్నట్లుగానే 17 సెప్టెంబరు 1948న నిజాం భేషరతుగా లొంగిపోయాడు.
– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు