ఎండలు భగ్గుమంటున్నాయి. అగ్నిప్రమాదాలు తలెత్తి, ప్రాణాల్ని హరిస్తున్నాయి. ఎప్పుడు ఏ వార్త వినాల్సి / చూడాల్సి వస్తుందోనని జనం గుండెలు దడదడలాడుతున్నాయి. వేసవి, అగ్ని అనగానే మనందరి ఎదుటా ఠక్కున నిలచేది అగ్నిమాపక శాఖ. ‘మాపక’ అంటే కొలమానం అనే సాధారణ అర్థమున్నా, అగ్ని ప్రమాదాల్ని నిరోధించే, నివారించే విభాగంగానే దానికి పేరు. కారణమేదైనా, ఒకే క్షణంలో అంటుకునే అగ్గిరవ్వ… అంతా చూస్తుండగానే సమస్తాన్నీ భస్మీపటలం చేసేస్తుంది. ఎవరో ఒకరి, ఏదో ఒక అజాగ్రత్త ఎందరెందరి జీవితాలనో చీకటిమయంగా మార్చేస్తుంది. మన దేశానికి సంబంధించి, అగ్ని ప్రమాద నిరోధక ఉత్సవాలు ఏటా ఏప్రిల్‌లో ఏర్పాటవడం పరిపాటి. ఇంటా బయటా నిప్పును ఆర్పే బృందంలో సర్వసాధారణంగా పురుషులనే చూస్తుంటాం. కానీ, మహిళలూ ఉన్నారని ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయా చోట్ల స్వచ్ఛందంగా / ఉద్యోగపరంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారనీ మనలో కొంతమందికే తెలుసు!

భారత్‌లో అగ్నిమాపక విభాగం ఏనాడో ప్రారంభమైంది. తెల్లదొరల పాలనలోనే అది రూపుదిద్దుకుంది. ఆ రీత్యా, శాఖ ఆవిర్భవించి ఇప్పటికి రమారమి ఎనిమిది దశాబ్దాలు. గతంలో ముంబయిలో ఒక ఓడకు నిప్పంటుకున్నప్పుడు అగ్నిమాపక విభాగ సిబ్బంది ప్రాణాలకు తెగించి రంగంలోకి దూకి పరిస్థితిని అదుపులోకి తేగలిగారు. ఆ నియంత్రణ పాటవాన్ని గుర్తు చేసుకుంటూ, మనమంతా వార్షిక ఉత్సవాలు జరపుకంటున్నాం. నిజానికి, ప్రమాదాల నివారణకన్నా వాటి నిరోధం మీదనే చూపుసారిస్తుంటారు. అందుకే స్వాతంత్య్ర అనంతరం మన బాలబాలికల పాఠ్యపుస్తకాల అంశంగా ‘అగ్ని నుంచి భద్రత’ చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం విస్తృత ప్రచారోత్సవాలనీ నిర్వహిస్తూ వస్తోంది. ఇళ్లు, కార్యాలయాలతోపాటు విద్యా సంస్థలు, వైద్య నిలయాలు, పరిశ్రమలు, కర్మాగారాలు, దుకాణ సముదాయాల్లోనూ ప్రత్యేకించి మండుటెండల్లో అగ్ని ప్రమాదం పొంచి ఉంటుంది. అవే కాకుండా రైల్వేస్టేషన్లు, గోదాములు తదితర బహిరంగ ప్రదేశాల్లోనూ ఇదే ముప్పు ఉండనే ఉంటుంది మరి. అగ్నిప్రమాదాలను నియంత్రించి ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులను కాపాడేందుకు కొన్చిచోట్ల దళ అధిపతులగా వనితలే ఉన్నారు! మన దేశానికి చెందినంత వరకు తొలి ఉద్యోగిని హర్షిణి. రెండు దశాబ్దాల కిందట ఓనాడు విధి నిర్వహణలో భాగంగా ఆమె బరిలోకి దిగారు. ప్రాణాల్ని పణంగాపెట్టి మరీ ప్రమాదాన్ని నియంత్రించ గలిగారు.

ధీరచరిత లెందరో

తమిళనాడులోని ‘ఫైర్‌ అం‌డ్‌ ‌రెస్క్యూ సర్వీసెస్‌’ ‌పేరొందిన ప్రభుత్వ సేవా బృందం. మంటల వంటి విపత్తుల్ని ఎదుర్కోవడం, బాధితులకు అన్ని విధాలా సహాయం అందించడం దాని ప్రధాన విధి. ఆ రాష్ట్రంలో, అదీ మన భారత్‌లోనే తొలిసారిగా ఒక మహిళా ఫైర్‌ ఆఫీసరుగా నియమితులయ్యారు. ఆమె పేరు మీనాక్షి. ఒక సందర్భంలో రెస్క్యూ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించి, రాష్ట్రపతి పతకాన్ని అందుకున్న ధీరోదాత్త. అటు తర్వాత నియమిత అధికారిణి ప్రియ. కోయంబత్తూరులో బాధ్యత వహించినవారు. అదే రాష్ట్ర రాజధాని నగరంలోనూ తరువాతి కాలంలో పనిచేసి శక్తి సామర్థ్యాల్ని మరింతగా నిరూపించుకున్నారు. ముంబయి దళంలోకి పుష్కర కాలం క్రితమే వనితల్ని తీసుకోవడంతో, ఆ మేర సేవా సహాయాలు మరింతగా విస్తరించాయి. విస్తృతంగా చూస్తే, అత్యున్నత స్థాయిలో కమిషనర్‌ ఉం‌డటమనేది విదేశాల్లో కనిపిస్తుంది. అదే పెద్ద శ్రేణి కార్యనిర్వాహక హోదా, కమాండింగ్‌ అధికారత్వం. ఫైర్‌ ‌చీఫ్‌ ఆఫీసర్‌, ‌ఫైర్‌ ‌మాస్టర్‌… ఇలా ఎందరెందరో. అలనాడు అమెరికాలో మొదటి మహిళా అధికారి మోలీ. యునైటెడ్‌ ‌కింగ్‌డమ్‌లో మేరీ. న్యూజిలాండ్‌లో అన్నేబారీ కెనడాలో వీరోచిత అతివలు మరెంతోమంది కనిపిస్తారు. క్వీన్స్‌లాండ్‌లో ప్రథమ అధికారిణి మిచెల్‌ అక్కడి స్టేషన్‌ ఆఫీసర్‌. ‌జపాన్‌లో కవాసకి, పాకిస్థాన్‌లో షాజియా పరీవన్‌, ‌టర్కీలో తులుంబాకే బహియ్రే.

బాధ్యత ప్రభుత్వాలదే

ప్రధానంగా అమెరికాకు చెందిన ‘ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ‌ఫైర్‌ ‌ఫైటర్స్’ ఉద్యోగినుల సంక్షేమానికి పలు సూచనలు చేసింది. ఇక ఆస్ట్రేలియాలో ‘విమెన్‌ ఇన్‌ ‌ఫైర్‌ ‌ఫైటింగ్‌’ ‌పేరిట బోధక, శిక్షక, ప్రసార బ్లాగ్‌ల నిర్వహణ చేపట్టారు. అక్కడ స్వచ్ఛంద రీతిన కార్యకర్తల సేవలూ లభ్యమవు తున్నాయి. ఆసియాలో యువతులు అగ్నిమాపక పనిని వృత్తిగా ఎంచుకుంటూనే ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిన ఇంకా కొన్నిదేశాల్లో మే తొలివారంలో సిబ్బంది సంక్షేమ ఉత్సవాలు జరుపుతుంటారు. భారత్‌లో విమానాశ్రయాల వద్ద ఫైర్‌ అం‌డ్‌ ఎమర్జెన్సీ సర్వీసులు నడుపుతుంటారు. వాటిల్లోని ప్రథమ వనితా ఫైర్‌ ‌పైటర్‌ ‌తాన్యా. రోజూ పొద్దున్నే నిద్రలేచి, జాగింగ్‌ ‌తదితర వ్యాయామాలు చేసి, డ్రిల్‌ -‌పెరేడ్‌ ‌ముగించి, అతిపెద్ద నీటి పంపులూ నిచ్చెనల వాడకంపైన సమగ్ర శిక్షణ పొందే సాహసికురాలు. నిత్య సాధన, నిరంతర అప్రమత్తత వల్లనే అగ్ని నివారణ సులభ సాధ్యమవుతుందని చెప్తుంటారు. పోలీసు ఉద్యోగాలు సైతం నిర్వహించే లలనలకు ఆ శాఖలోని అంతర్భాగమైన అగ్ని మాపకంలో ఎందుకు ప్రోత్సాహం లభించడం లేదన్నది తెలుగు రాష్ట్రాలలో ప్రశ్న. ప్రోత్సాహకం అటుంచి, అసలు ప్రవేశం ఏ మేర అన్నదీ ప్రశ్నార్థకంగానే మిగిలి పోతోంది. తమిళనాడు సహా గుజరాత్‌, ‌మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో ఉన్నంత ప్రాతినిధ్యం ఇక్కడ ఎందుకు కనిపించడం లేదన్నదే గమనించాల్సిన అంశం. పొరుగు రాష్ట్రంలో ఫైర్‌ ‌డిపార్ట్‌మెంట్‌ ‌డీఎస్పీగా కూడా స్త్రీ పనిచేస్తుంటే, ఈ రాష్ట్రాల్లో అసలు ప్రవేశాల ఊసే ఎందుకు ఉండదన్నది చర్చనీయం. గుజరాత్‌లోని పలు జిల్లా కేంద్రాలలో ఫైర్‌ ‌విమెన్‌ ఉన్నారు. రాజస్థాన్‌లో ఒకేసారిగా వందల సంఖ్యలో నియామకాలు జరిపారు. ముంబయి ఫైర్‌ ‌బ్రిగేడ్‌లో ఇన్‌స్పెక్టర్లుగా పడుతులనే నియమించారు. మరి తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలో విభిన్న పరిస్థితి ఎందుకన్నది ఆయా ప్రభుత్వాలే ఆలోచించుకోవాలి.

సంకల్ప శక్తికి ఎదురేముందీ?

వనితా సాధికారత గురించి మాట్లాడనివారు లేరు. ఆడవారికి సమాన అవకాశాలివ్వాలన్న ప్రసంగాలకూ కొదవలేదు. తెలుగు రాష్ట్రాలు అందునా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ ‌ప్రాంతంలో అగ్నిమాపక పరంగా కొద్దిమంది మహిళా సిబ్బంది కనిపించినా, ఆ కేటాయింపు సరిపోదు. ఉదాహరణకు ముంబయిని చూడండి… అక్కడి రెండు ఫైర్‌ ‌స్టేషన్లకు సునీత, శుభాంగి నేతృత్వం వహిస్తున్నారు. గోవాలో కూడా శిక్షణ, కమ్యూనికేషన్‌ ‌కర్తవ్య నిర్వహణల్లో మహిళలే కనిపిస్తారు. దేశంలోని ఇతర రాష్ట్రాలలోను అగ్ని మాపక విభాగంలో పడతుల పాత్ర, ప్రాతినిధ్యం, ప్రశస్తిని ప్రభుత్వాలు పెంచాలని పరిపాలనా సంస్కరణల ప్రతిపాదనల వేదిక ఏనాడో సూచించింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల స్థితి గతులపైనా అధ్యయనాలు జరిపింది.

మనం స్త్రీని భావించాలే కానీ-

వీరభరిత విస్ఫారిత

విజయ శౌర్య వాహిని

ఆమెను… చతుశ్శతము సుధాత్త

చంద్రకిరణ సముద్భాతగా

చూసివారే శౌర్యవాహినిగానూ తిలకించగలరు.

గగనాంగణ మొక్క మహత్‌

‌కాంతికలితమై వెలిగెను!

అవనీ స్థలి నవ చైత

న్యాంకితమై విలసిల్లెను.

అన్నట్లు – మధుర హృదయిని అయినా, ఆపద్భాంధవి అయినా, సమయ సందర్భాలను అనుసరించి ధీరచిత్తంతో సేవాంగణంలోకి దూకే సాహసి అయినా స్త్రీ మూర్తే. ఆ స్థిర సంకల్పం ముందు అగ్నిప్రమాదాల నివారణా సాధ్యమే! అంతటి మానసిక కాంతిని, సామాజిక చైతన్యాన్ని పాలకులే పరిరక్షించాలి. వనితా శక్తిని విస్తృతీకరించాలి.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE