– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్
నాట్యం, నృత్యం, నర్తనం… ఈ మూడూ ఒకేలా అనిపించినా, వినిపించినా, కనిపించినపుడు మనకు కలిగే అనుభూతి వేరు. నృత్త, గీత, వాద్య సమ్మిళితంగా వీక్షక ప్రేక్షక జన మనోహరంగా నిత్యనూతనమై ప్రత్యక్షమవుతుంది నృత్య ప్రదర్శన. ప్రత్యేకించి మన భారతీయ నాట్యశాస్త్రం, కళ, విద్య, అభినయం నిఖిల ప్రపంచానికీ ఆదర్శప్రాయం, స్ఫూర్తి ప్రదాయకం. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, మోహినీ అట్టం, కథాకళి, మణిపురి, కథక్ – ఇలా పేరు ఏదైనా నర్తకి/ నర్తకుడి కౌశలం మనలోని ప్రతీ ఒక్కరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆచార సంప్రదాయాలను, ఆధునిక ప్రత్యేకతలను రంగించిన ఏ కార్యక్రమమైనా భావ, రాగ, తాళ సమన్వితంగా వెల్లివిరుస్తుంది.
మనమంతా తరచుగా వినే ‘సంప్రదాయం’ ఒక ప్రస్ఫుట పద్ధతి, విధి విధానం, గురుపరంపర ఫలితం. ఇందులోని ధర్మం, ఆచరణ రీతి, వ్యవహార సరళి మొత్తం సమాజాన్నే ప్రభావితం చేస్తాయి. ప్రధానంగా యువతరానికి మార్గనిర్దేశంగా నిలిచి, సమున్నత ప్రమాణాల పరిరక్షణకు దోహదపడతాయి. అందుకే సాంస్కృతిక వికాసమే ధ్యేయంగా ‘సంప్రదాయ కళా గురుకులం’ స్థాపించారు స్వాతి సోమనాథ్. శ్రీకాకుళంలోని నాగావళి నది సమీపాన పన్నెండు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో, కళ్లేపల్లి వద్ద నాట్య ఆశ్రమం వేదికగా తరగతులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కూచిపూడి పక్రియ పాత్ర, ప్రశస్తి, ప్రాధాన్యం, ప్రాచుర్యం మరింత పెరిగేలా బోధన, అధ్యయనం, శిక్షణలనే త్రిసూత్రాలను పాటిస్తూ వస్తున్నారు. తిరుమల- తిరుపతి దేవస్థానం, దేవదాయ ధర్మాదాయ విభాగం, భాష – సాంస్కృతిక అభివృద్ధి శాఖ, విద్యావికాస సంస్థల సౌజన్యంతో నిరంతర సేవ సాగిస్తున్నారు. ప్రభుత్వ సహాయ సహకారాలు, స్వచ్ఛంద సేవా సంస్థల సమన్వయ ఉపకారాలు ఎంతగానో దోహదపడుతున్నాయి.
కూచిపూడితో పాటు శాస్త్రీయ సంగీతంలో వేసవి శిక్షణ ఈ గురుకుల విధానం. ‘సంప్రదాయ’ అనే పేరు జీవనతీరుగా మారితేనే భారతీయత వెల్లివిరుస్తుందని నిర్వాహకుల ప్రగాఢ విశ్వాసం. ఇదే ఏప్రిల్ నెల చివరి వారంలో మొదలై జూన్ రెండో వారం వరకు కొనసాగే శిక్షణ పక్రియ గురించి అడిగితే, గురుకుల వ్యవస్థ జాతికి ఎంత అవసరమో మరింత విపులీకరించారు ఆమె.
విద్యార్థినీ విద్యార్థుల శిక్షణకు అవసరమైన అన్ని సదుపాయాలూ కలిగించడమే ‘గురుకులం’ సారాంశం. గురుశిష్యులు ఒకే ప్రదేశంలో ఉంటూ బోధన, అధ్యయనాలు సాగిస్తుండటమే విద్యారంగ ఆరోగ్య సూత్రం. ఇదే రుషి సంప్రదాయం గురుపీఠం స్థానాన్ని అంతటా సుస్థిరం చేస్తూ వచ్చింది. శాంతం, సహనం, స్వచ్ఛత, క్రమశిక్షణ, నిజాయతీ వంటివి ప్రబోధాలతో వచ్చేవి కావు. చూసి, తెలుసుకుని, అలవరచుకుంటేనే ప్రాప్తిస్తాయి. ఆ కారణంగానే గురుకుల పాఠ్యాంశాల్లో ఆధ్యాత్మికత, నైతికత అంతర్భాగాలు. లౌకిక, ధార్మిక జీవనాలు వేర్వేరు కానే కావు. అవన్నీ ఒకటే. అక్కడ నేర్పేవి జీవిత పాఠాలు. ఈ ప్రయో జనాలన్నింటినీ పరిగణించి నృత్య, సంగీత అభ్యాసకులకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నట్లు సంచాలకురాలి హోదాలో విశదీకరించారు స్వాతి సోమనాథ్. గురుకులంలో ఉండేవారికి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా ఆశ్రమం తలుపులు తెరిచి ఉంచడం అంటే – భారతీయ విలువలను పరివ్యాప్తం చేయడం. లలితకళల జాతీయ కేంద్రంగా కళ్లేపల్లిని తీర్చిదిద్దాలన్న ఆశయం వెనుక చెన్నై కళాక్షేత్ర ప్రభావం ఎంతైనా ఉందంటున్నారు. ఆ క్షేత్రాన్ని జాతీయ ప్రాధాన్య సంపదగా కేంద్ర ప్రభుత్వం ఏనాడో గుర్తించడాన్ని ఆమె మరోసారి గుర్తు చేస్తున్నారు. సహజ సుందర ప్రకృతిలో, ఆత్మీయ వాతావరణంలో కొనసాగే శిక్షణ, అధ్యయన, పరిశోధనలే సత్వర ఫలితాలిస్తాయని అందరికీ తెలిసిందే. రుక్మిణీదేవి అరుండేల్, యామినీ కృష్ణమూర్తి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ తదితర ఎందరో కళాకోవిదుల ప్రేరణే తనను అన్ని విధాలా ముందుకు నడిపిస్తోంని చెప్తున్నారామె.
ఉత్సవాలతో ఉత్సాహంగా…
కూచిపూడిలో పోస్టుగ్రాడ్యుయేషన్, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులతో పాటు నట్టవాంగం, మాడ్యులేషన్, కొరియోగ్రఫీ, వాయిస్ కల్చర్ వంటి అంశాల శిక్షణ యువతరానికి చక్కని వన్నె తెస్తుంది. వివిధ రంగాల సుప్రసిద్ధులు పి.సుశీల, శాశ్వతీసేన్, సురభి రంగారావు, పంతుల రమ, కన్యాకుమారి, మల్లాది సోదరులు, హరికథా ప్రవీణులు రంగారావు, మీగడ రామలింగస్వామి, జానపదకళల అప్పలనాయుడు, మరెందరో అతిథి బోధకుల, సలహాదారుల నిర్దేశకత్వం విద్యార్థినీ విద్యార్థుల జీవితాలను రసవంతంగా తీర్చిదిద్దుతున్నాము. తరచు ఏర్పాటయ్యే బోధక ప్రదర్శనలు, కార్యశాలలతో సంప్రదాయ ప్రాంగణం కళకళ లాడుతుంటుంది. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ అనుబంధ వ్యవస్థ /సంస్థగా ఇది అలరారుతోంది. ఏటా కార్తిక కళామహోత్సవం జరుగుతుంటుంది. జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతిగల వారెందరో కళ్లేపల్లి వేదికను పంచుకుంటుం టారు. అదే రీతిలో వచ్చే ఆగస్టులో సిద్ధేంద్ర జయంతి, అక్టోబరులో వాగ్గేయకార మహోత్సవాలు ఏర్పాటవుతాయి. తాజ్, ఖజురాహో వంటి ప్రఖ్యాత వేడుకలకూ ఇక్కడి నుంచి కళాకారులను పంపిస్తుంటారు. మరో విశేషం ఏమిటంటే, వారంలో ఆరు రోజుల పాటు సాయంత్రం వేళల్లో అన్ని వయసుల వారికీ కూచిపూడి ప్రత్యేక తరగతుల నిర్వహణ.
కళలకీ సమాజానికీ సేవ
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఏ. చేశారు స్వాతి సోమనాథ్. హైదరాబాద్‌లోని సెంట్రల్ వర్సిటీ ద్వారా కూచిపూడి నాట్యరంగ ప్రత్యేక పరిశీలన చేశారు. భాషాశాస్త్రాల సంస్థ నుంచి ఎంఫిల్ పట్టా అందుకున్నారు. తనదైన రీతిలో దేశమంతటా సహస్రాధిక ప్రదర్శనలిచ్చారు. ఢిల్లీ, చెన్నై, భోపాల్, ముంబయి, బెంగళూరు, తిరుచినాపల్లి, రాయఘర్, తంజావూరు, తిరుపతి, హైదరాబాద్, మరెన్నో వేదికలమీద నర్తించి యశస్సు సాధించారు. జగద్గురు ఆదిశంకరుల వారి గురించి తెలుగు రాష్ట్రాల్లో మొదటగా కూచిపూడి బాలే కొరియోగ్రఫీ నిర్వహించారు. దేశరాజధానిలోని ఇండియా గేట్ వద్ద విభిన్న ప్రతిభావంత బాలలతో కలిసి ప్రథమంగా ఒక ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. టిబెట్ ప్రాంతంలోని మానస సరోవర్ దగ్గర నర్తించి ఎందరెందరినో మెప్పించారు. ఆధునికతను మేళవిస్తూ, మొట్టమొదటగా కూచిపూడి నాట్యశాస్త్ర చరిత్రకి వీధి నాటక రూపమిచ్చి రికార్డు సృష్టించారామె. కొరియోగ్రఫీ చేసిన వాటిల్లో ప్రణయ వరూధిని, సౌందర్య దర్శనం ఉన్నాయి. సర్వజ్ఞ శంకర, శరణం గోవిందం, నౌకా చరిత్రం, జయదేవ మహాకవి ‘గీతగోవిందం’ ఆధారంగా ప్రదర్శనం, నారాయణ గురుదర్శనం, శక్తి ఆమ్రపాలి, హిందుత్వ, జాతీయ సమైక్యత అంశాలపైనా ఆ నర్తకీమణి ఇచ్చిన నాట్య ప్రదర్శనలు ఆబాల గోపాలాన్నీ మురిపించాయి. అన్నింటికీ భారతీయతే మూలాధారమని విస్తార ప్రచారం చేస్తూ వస్తున్న వనితారత్నం ఆమె.
సంప్రదాయ భారతికి నమస్కృతి
‘ధర్మోరక్షతి రక్షితః’ అని నర్తనరూపాన ప్రదర్శించారు స్వాతి సోమనాథ్. జ్ఞానపీఠ మహాకవి విశ్వనాథవారి ‘కిన్నెరసాని’కి నృత్య రూపమిచ్చి కళా హృదయాలను పరమానందభరితం చేశారు. నృత్య చూడామణి, నాట్యరాణి, నర్తన పారిజాత తదితర పురస్కృతులు వరించినా, తన చూపులన్నీ భారీతీయత పైనే కేంద్రీకృతమయ్యాయని ఎప్పుడూ చెప్తుంటారు. అవార్డులు, రివార్డులు, బిరుదులు, సత్కార పరంపరలు ఎన్నెన్ని ఉన్నా, తన ఆలోచనలు సమస్తం సంప్రదాయం వైపే మొగ్గుతుంటాయంటారు. కూచిపూడిని అన్నింటా అంతటా విస్తరింపచేస్తున్న నిరంతర కళాసేవానిరతి స్వాతి సోమనాథ్!