– పెనుమాక నాగేశ్వరరావు

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‘అక్కడ ఏం దాచిపెట్టారూ! నాకు తెలీక అడుగుతానూ’’ కోపంగా అన్నాను అమ్మానాన్నలతో.

ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు తప్ప నాకేం సమాధానం చెప్పలేదు.

‘ఇక్కడ పిల్లలతో కాలక్షేపం చేయవచ్చు. మీకు ఒంట్లో నలతగా ఉంటే నేను, రాధిక ఉన్నాం. మాకూ మీ ఇద్దరూ ఇంట్లో ఉంటే అదో ధైర్యము, సంతోషము. అందరం కలసి ఉంటే బాగుంటుంది కదా? మీరెందుకు వారానికోసారి వెళ్తామంటారు?’ నా మాటల్లో అసహనం ధ్వనించకపోలేదు.

‘మళ్లీ నీ దగ్గరికే వస్తాంగా నాన్నా………. కాకపోతే ఓ నెల రోజులు అక్కడ ఉండి, అక్కరలేని సామానంతా అవతల పారేసి, ఉపయోగపడేవాటిని సర్దుకుందామని, తెలిసిన వాళ్ల కందరికి చెప్పి వద్దామని వెళ్లటం.. అంతే’ క్లుప్తంగా చెప్పింది అమ్మ.

‘పదో పరకో ఇవ్వాల్సిన వాళ్లకి ఇచ్చి, మనకి రావలసినవి ఏమైనా ఉంటే తీసుకుని రావచ్చు గదా అని కూడా ఆలోచిస్తున్నా’ ఆచితూచి అన్నాడు నాన్న.

‘‘మీ ఇద్దరికీ అక్కడికి వెళ్లాలని మహా ఆరాటంగా ఉందని నాకు తెలుసు. అందుకు ఏవేవో సాకులు చెబుతున్నారనీ తెలుసు. పిల్లలు మీరున్నన్ని రోజులూ సంతోషంగా ఉన్నారు. నేనూ రాధిక కూడా చాలా సార్లు అనుకున్నాం మీరు ఉంటే ఇల్లు గలగలమంటూ కళకళ లాడుతున్నదని. తాను కూడా మిమ్మల్ని ఇక్కడే ఉండమని కోరుకుంటున్నది. ఈ రోజుల్లో ఏ కోడలు అలా కోరుకుంటున్నది చెప్పండి. మిమ్మల్ని వెళ్లమని మేమెవ్వరం కోరుకోవటంలేదు.’’ మనస్ఫూర్తిగా అన్నాను.

‘‘నువ్వింతగా చెప్పాలా గోపాలా….. నిన్ను కన్నవాళ్లం, నీ మనసేమిటో మాకు తెలీదా? నీ చేత ఇన్నిసార్లు అడిగించుకోవటం మాకూ చిన్నతనంగానే ఉంది. ఇవ్వాళ కాకపోతే రేపైనా నీ దగ్గరకు రావాల్సిన వాళ్లమేగా నాయనా. వస్తాం, ఉంటాం. కాకపోతే మీ నాన్న చెప్పినట్లు అక్కడి పనులన్నీ చక్కబెట్టుకుని ఓ నెల రోజుల్లో తిరిగి వద్దామని ఆలోచన’’ సున్నితంగా చెప్పింది అమ్మ.

‘‘సరే మీ ఇష్టం. కానీ ఎంత తొందరగా తిరిగి వస్తే అంత మంచిది. మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. నాకు అక్కడికి వచ్చి ఉండటం కుదరని పని అని మీకు తెలిసిందే. నన్నూ, పిల్లల్నీ ఇక్కడ ఉంచి రాధిక రావటమూ కుదరదు. మీరు ఇక్కడ ఉంటేనే మీకూ, నాకూ అనుకూలం. ఇల్లు కొంచం ఇరుకే……కాదనను. కానీ ఎలాగోలా ఇక్కడే సర్దుకుందాం. సరిపుచ్చుకుందాం కొన్నాళ్లు. కొంత ఇబ్బంది ఉన్నా సంతోషంగా ఉందాం.’’ మనసులో మాటల్ని బయట పెట్టాను.

వారి ప్రయాణానికి ఒప్పుకున్నాననే ఆనందం వాళ్ల ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. ఒకర్నొకరు చూసుకుని ముసిముసిగా నవ్వుకున్నారు. వారి సంతోషం చూసి నాకు ముచ్చటేసింది. ‘‘రేపు ఆదివారం బయలుదేరండి మరి.. మిమ్మల్ని దింపి వెనక్కి వస్తాడు మానస్‌. ‌నాకు కుదరకపోవచ్చు’’ అన్నాను వాళ్లనే చూస్తూ.

మరీ మర్నాడే ప్రయాణం అనుకోగానే వాళ్ల ముఖాలు మరింతగా వెలిగిపోయినై. పైగా మనవడితో అంటే మరీ ఆనందం. అమ్మా వాళ్లని మాతోనే ఉంచుకోవాలని నాకు, మా ఆవిడకు గట్టి కోరిక. కానీ వాళ్ల కోరిక వేరేగా ఉంది.

———————

‘‘ఏంది మూర్తిగారూ రోజుకంటే ముందే బయలుదేరినావు…పైగా మనవడ్ని వెంటపెట్టుకుని మరీ కదిలావు. ఏంది కథ? రాత్రి సరిగా నిద్ర పట్టలేదా ఏంది’’ నవ్వుతూ పలకరించాడు రాజు.

‘అదేం లేదయ్యా…శుభ్రంగా నిద్రపోయాను. ఓ పదినిమిషాలు అటు ఇటు అంతే’’ అంటూనే అడుగులు ముందుకు వేశాడు మూర్తి.

‘‘ఆయన ఎవరు తాతయ్యా’’ అడిగాడు మనవడు మానస్‌.

‘‘అతను రాజు. గత పాతికేళ్లుగా ఇక్కడే బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ ఉంటున్నాడు. అతని భార్య, కొడుకు, కోడలు కూడా ఇదే పని. ఈ చుట్టుపక్కల వారందరూ ఇతని దగ్గరే బట్టలు ఇస్త్రీ చేయించుకుంటారు’’ ఓపిగ్గా చెప్పాడు.

‘‘ఏం మాష్టారూ మనవడా…… పెద్దబ్బాయ్‌ ‌కొడుకేగా…వాళ్లు రాజమండ్రి లోనేనా ఉండటం’’

‘‘అవును సుబ్బయ్యా… పెద్దబ్బాయ్‌ ‌కొడుకే. వచ్చే ఏడు పదో తరగతి చదవాలి’’

‘‘మీ ఇంట్లో చదువులకేంలే మాష్టారూ….. మీ ఇంట్లో అందరూ టీచర్లయ్యే!’’ అంటూనే ఇడ్లీ పాత్రని పొయ్యిపై పెట్టాడు సుబ్బయ్య. అంతలోనే ఆయన భార్య అనసూయ ఇంట్లో నుంచి వచ్చి చెట్నీ గిన్నె బల్ల మీద పెట్టింది.

‘‘ఈ అబ్బాయ్‌ ‌పేరు మానస్‌ ‌కదూ పంతులుగారూ’’ పళ్లు ఇకిలిస్తూ అడిగిందామే.

‘‘అవునమ్మా.. పేరు బాగా గుర్తుందే నీకు’’ అంటూ మనవడి వీపు నిమిరాడాయన

‘‘నాకెందుకు తెలీదు. మీ మనవరాలి పేరు చైత్ర కదూ. నాకు మీ ఇంట్లో వాళ్లందరి పేర్లూ గుర్తే’’

‘‘అవున్నిజమే. ఎప్పటినుంచో కలసిమెలసి ఉంటున్నాం కదా. అవును గాని, ఓ గంట అయ్యాక వీడ్నే పంపిస్తాను. నాలుగు ప్లేట్లు ఇడ్లీ కాస్త గట్టి చెట్నీ వేసి కట్టి పంపించమ్మా’’

‘‘అలాగే. నాకు ప్రత్యేకంగా చెట్నీ గురించి చెప్పాలా . అలాగే పంపిస్తాను. రా అబ్బాయ్‌. ‌నువ్వు ఎప్పుడు వచ్చినా వేడి వేడి ఇడ్లీ కట్టి ఇస్తాలే’’

తల గుండ్రంగా ఊపి తాతయ్య వెంట నడిచాడు మానస్‌.

‘‘అవును తాతయ్యా వాళ్లందరూ ఎందుకలా చిన్ని విషయాన్ని అంతంత సేపు మాట్లాడతారు?’’

‘‘రోజూ చూసుకునే మనుషులే అయినా, కలిసే మనుషులే అయినా ఆ పలకరింపులో ఓ ఆత్మీయత ఉంటుందిరా. వాళ్లకు నేను వెళుతున్నది పాల ప్యాకెట్‌, ‌పేపరు తెచ్చుకునేందుకని తెలుసు. అయినా అడుగుతారు. అలా పలక రించటం మాకు తెలిసిన మర్యాద, ఓ రకం అభిమానం. రోజూ వాట్సాప్‌లో గుడ్‌ ‌మార్నింగులు, గుడ్‌నైట్‌లు అని మెసేజ్‌లు పంపిస్తున్నారే, అంతకన్నా మించిన ఆత్మీయమైన పలకరింపులు ఇవి. తెలిసిన విషయాలే అయినా అలా అడగటం మా అందరి అలవాటు.’’

‘‘వీళ్లతో నువ్వు కూడా ఇలాగే మాట్లాడతావా అయితే’’

‘‘అవును ఇలాగే మాట్లాడుతాను. ఇలాగే అడుగుతాను.’’ అంటుండగానే ఓ సందులో నుంచి మోటార్‌ ‌సైకిల్‌ ‌మీద పోలీసాయన కనిపించాడు.

‘‘డ్యూటీకి బయలుదేరారా’’ అడిగాడు మూర్తి.

‘‘అవును మాష్టారు. కులాసానా’’ అనడిగి వెళ్లిపోయాడు అతగాడు.

‘‘నాకు ఇప్పుడు అర్ధం అయింది. నువ్వు కూడా అందర్నీ ఇలాగే అడుగుతావని. ఆయన పోలీసు డ్రెస్సులో వెళుతుంటే నువ్వు డ్యూటీకేనా అని అడిగావే.. అప్పుడే అనుకున్నాను’’ అని నవ్వేశాడు మానస్‌.

‌మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయని బాధపడే మనసున్న మనుషులు నిత్యం మనకి ఎదురవుతూనే ఉంటారు. అయితే మధురాతి మధురమైన మానవ సంబంధాలు ఎందుకు మృగ్యమవుతున్నాయని ఆలోచిస్తున్న వారి సంఖ్య తక్కువే. జీవితాన్ని గురించి, జీవిత గమనాన్ని గురించి కాస్త నింపాదిగా ఆలోచించే తీరిక ఎవరికి ఉంది?

మనని ఎవరూ పట్టించుకోనప్పుడు మాత్రమే మానవ సంబంధాల గురించి ఆలోచిస్తున్నాం. శరీరంలో జవం, జేబులో జీవం ఉన్నంతవరకూ, ఒకరితో నాకేం పని అని మనుషులు విర్రవీగుతున్నారు. వారికి డిపెండెన్సీ అవసరం లేదు. ఇండిపెండెన్స్ ‌కావాలి.

మనుషులు మనసుపెట్టి పనిచేసే రోజులు పోయినై. పని అంతా యంత్రాలతోనే. మనల్నీ, మన నైపుణ్యాలను, మన భావుకతను అమాంతంగా మనల్నే మింగేసింది సాంకేతికత. మరుగున పడిపోతున్నది నైతికత. మాయమై పోతున్నది మానవత. అసలైన మనిషే లేనప్పుడు మానవ సంబంధాలెలా ఉంటై! యంత్రాలు మనల్ని మనకీ, మనవారికీ దూరం చేస్తూనే, దగ్గర చేస్తున్న భ్రమ కల్పిస్తున్నై. యంత్రాలకి అలవాటుపడ్డ మనిషి యంత్రమే అయిపోతున్నాడు. యంత్రాల మధ్యన యాంత్రిక సంబంధాలే ఉంటాయి కానీ మానవ సంబంధాలుంటాయా? ఇది మన ఐడెంటిటీని పోగొట్టుకోవడం. మనం మనం కాకుండా పోవటం. పడమటి గాలి బలంగా వీస్తున్నది. అందులో కొట్టుకుపోతున్నాం మనం. కానీ స్వధర్మే నిధనం శ్రేయః పర ధర్మే భయావహః అని మరచిపోతున్నాం.

మనసు నిండా ఏవేవో ఆలోచనలు.

‘‘ఏం పంతులుగారూ ఈ మధ్యన అసలు రావటమే లేదు’’ సెలూన్‌ ‌చిమ్ముకుంటూ అడిగాడు కృష్ణ.

‘‘అవును కృష్ణా. ఊళ్లో లేం. రేపు నేనూ, మా మనవడు ఇద్దరం వస్తాంలే. ఇద్దరికీ క్రాపు చేయాలి’’ అంటూ ఇంటి దారి పట్టాడు మూర్తి.

‘‘ఏంటి తాతయ్యా, నాకు ఇక్కడ క్రాప్‌ ‌చేయిస్తావా’’ వేళాకోళంగా అన్నాడు మనవడు.

‘‘మీ ఊళ్లో కన్నా బాగా చేస్తాడు కృష్ణ. ఓ సారి చేయించుకుని చూడు తెలుస్తుంది.’’

‘‘నేను చేయించుకోను గాక చేయించుకోను. అయినా నా క్రాప్‌ ఏమీ పెరగలేదు. నువ్వు చేయించుకో. కావాలంటే నేను నీకు తోడుగా వస్తాలే’’

‘‘సరే నీ ఇష్టం. ఇదిగో ఈ పాల ప్యాకెట్‌ ‌మీ బామ్మకిచ్చి త్వరగా కాఫీ పెట్టమను’’ అంటూ కాళ్లు కడుక్కుని వరండాలో ఉన్న వాలు కుర్చీలో కూర్చుని పేపర్‌ ‌చదవసాగాడు మూర్తి.

పక్కింటి శంకరం గారు వచ్చారు. చూస్తున్న పేపర్‌ ‌మడిచేసి ‘‘ఏం శంకరం గారు ఎలా ఉన్నారు?’’ అడిగాడు మూర్తి.

‘‘మేం బాగానే ఉన్నాం మాష్టారూ….మీరు అబ్బాయి దగ్గరకు వెళ్లారని, ఇక అక్కడే ఉందా మనుకుంటున్నారని విన్నాను. అందుకే ఓ సారి పలుకరించి వెళ్దామని వచ్చాను’’

‘‘అవును. మా అబ్బాయి, కోడలు మమ్మల్ని అక్కడికి వచ్చేయమని ఒకటే గొడవ చేస్తున్నారు. కాదనలేక వెళుతున్నాం. వెళ్లలేక వెళుతున్నాం’’

‘‘అయ్యో, పుట్టిన ఊరు, తిరిగిన నేల వదలటం ఎంత కష్టమో మనకు తెలిసిందే. అయినా ఓ వయసు వచ్చాక పిల్లల మాట వినాల్సిందే. వాళ్ల అనుకూలతని గురించి ఆలోచించాల్సిందే’’

ఆయనతో మాట్లాడుతుండగానే ఇద్దరికీ కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది మూర్తి భార్య రాజేశ్వరి.

ఆమెను కూడా పలకరించి మరో అయిదు నిమిషాలు కూర్చుని వెళ్లిపోయాడు శంకరం. పేపరు తెరిచాడు మూర్తి. కళ్లు అక్షరాలను చూస్తున్నాయే కానీ మనసు కుదరటం లేదు. పేపరు పక్కన పెట్టాడు. కళ్లు మూసుకుని పడక కుర్చీలో పడుకున్నాడు.

‘ఊపిరి ఉన్నంతవరకు ఊరితో స్నేహం’’ అని నానుడి. ఇక్కడి మనుషులతోనే కాదు, గుడులతో, బడులతో, గోడలతో, చెట్లతో, కరెంటు స్తంభా లతో….ఇలా అన్నింటితో ఏదో మనకే తెలియని ఓ అనుబంధం ఏర్పడిపోతుంది. ఆ చలనం లేనివి కూడా మనతో ఏమిటేమిటో మాట్లాడు తున్నట్లు అనిపిస్తుంటుంది ఆ రోడ్ల వెంట వెళుతుంటే. ఈ పరిసరాలని చూస్తుంటేనే ఓ పరవశం. ఈ మనుషులతో మాట్లాడుతుంటే ఓ పులకరింత, ఓ మైమరపు. ఇవన్నీ ఒదులుకొని ఎక్కడో నిస్తేజంగా, నిర్లిప్తంగా బతకటంలో ఏం అర్థం ఉంది?

మనసు నిండా ఆలోచనలే. ఆలోచనలన్నీ ఊరు చుట్టే. అక్కడి మనుషుల చుట్టూనే. అక్కడినుంచి ఎక్కడికి వెళ్లటానికీ మనసు అంగీకరించటం లేదు. కొడుకు, కోడలి దగ్గరికే కావచ్చు, వాళ్లు మా రాకని ఇష్టపడుతున్నారు నిజమే. మనవడు, మనవరాలు మా కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న మాటా నిజమే. అయినా సరే ఊరు వదిలి వెళ్లటానికి ససేమిరా అంటున్నది మనసు. ఈ సున్నితమైన విషయాన్ని ఎలా చెప్పటం? ఎలా చెప్పి ఒప్పించటం? కొడుక్కి కోపం రాకుండా ఎలా సమాధానపరచాలి? పిల్లల్ని ఎలా సముదాయించాలి? ఈ ప్రశ్నల్ని తనలో తానే వేసుకుంటున్నాడు మూర్తి.

మేముంటున్నది సొంత ఇల్లేమీ కాదు. అద్దె ఇల్లే. అయితేనేం నాలుగు దశాబ్దాలుగా ఆ ఇంట్లోనే ఉంటున్నాం. అంతగా ఆ ఇంటి మీద మమకారం. మా అంతట మేం వెళితే తప్ప ఇంటివాళ్లు మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమనరు. ఆ భయం లేదు. ఊళ్లో ఎటు వెళ్లినా ఎవరో ఒకరు తెలిసిన వాళ్లు కనబడతారు. పలకరిస్తుంటారు.

ఒక్కమాటలో చెప్పాలంటే అక్కడ ఉండటమే ఓ ఆనందం. తిన్నా, తినకపోయినా, ఆ గొంతులు వినబడుతుంటే సగం బలం. అలాగని మేం పస్తులుండాల్సిన పరిస్థితులేమీ లేవు. ఏమిటో మరి ఆ ఊరిని వదిలిపెడితే మా ఉనికిని కోల్పోయిన భావన. మా అస్తిత్వాన్ని పోగొట్టు కున్నామన్న దిగులు. వాళ్లెవ్వరూ కనబడకుండా, వాళ్లకి దూరంగా వెళ్లి ఉండలేని ఓ అసహాయత, ఓ బలహీనత. దీన్ని ఎవ్వరికీ చెప్పుకోలెం. చెప్పకుండా దాచుకోలెం. ఇదో అవస్థ. అంతే. అర్ధరాత్రి నిద్ర పట్టక నా భార్య రాజేశ్వరిని నిద్ర లేపాను. నా కేమైనా ఒంట్లో నలతగా ఉందేమోనని భయపడింది ఆమె.

‘‘ఏంటండీ…..ఏమైంది’’ గాబరాగా అడుగుతూ లేచి కూర్చుంది.

‘‘ఏం కాలేదు. కంగారుపడకు. ఏమిటో నిజం చెప్పాలంటే నాకు ఈ ఊరు వదిలి వెళ్లాలంటే చాలా దిగులుగా ఉంది రాజేశ్వరి’’ అన్నాను బాధగా. ఏం మాట్లాడలేదు ఆమె.

‘‘అక్కడికి వెళితే పిల్లల మధ్యన ఉంటాం నిజమే. కానీ ఈ ఊరిని, ఈ నేలని, ఈ మనుషుల్ని, ఈ పరిచయాల్ని వదిలి వెళ్లాలంటే చాలా కష్టంగా ఉంది రాజేశ్వరి’’ అన్నాను. అప్పటికే నా గొంతు జీరా బోయింది. నా తలను ఆమె ఒడిలో పెట్టుకుని పడుకున్నాను. ఎంత ప్రయత్నించినా దుఃఖం ఆగలేదు. చిన్నగా మొదలయిన ఏడుపు వెక్కిళ్ల వరకు వెళ్లింది.

‘‘అయ్యో ఊర్కోండి. పిల్లవాడు లేస్తాడు, భయపడతాడు. రేపు ప్రశాంతంగా ఆలోచిద్దాం, మాట్లాడుకుందాం, పడుకోండి’’ అనునయంగా అన్నదామె.

‘‘కాదు రాజేశ్వరి. నాకు నిద్ర రావటం లేదు. నా ఆలోచనలు నన్ను నిద్రపోనీయటం లేదు. మనసంతా దిగులుగా ఉంది. ఎవ్వరితో చెప్పుకోలేక నిన్ను నిద్రలేపాను. నాకు వ్యాకులతగా ఉంది. ఈ బాధతోనే అక్కడికి వెళ్లి మనోవేదనతో మంచం పడతానేమో.. భయంగా ఉంది రాజేశ్వరీ. ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు కదా. ఆ సంతోషమే కరవైపోతే, ఇక బతికి ఉండి మాత్రం ఉపయోగం ఏముంటుంది?’’ నా మనసులోని దిగులును, గుబులును నా అర్ధాంగితో పంచుకున్న తర్వాత కొంచం ఉపశమనంగా అనిపించి తరువాత ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాను.

తెల్లవారింది. మానస్‌ని నిద్ర లేపాను. ఇద్దరం కలసి పాల ప్యాకెట్‌ ‌కోసం బయలుదేరాం. తరువాత సెలూన్‌కి వెళ్లి వచ్చా. టిఫిన్‌ ‌తిని మానస్‌ ‌తిరుగు ప్రయాణంఅయ్యాడు. బస్‌స్టాండ్‌ ‌దాకా వెళ్లి మనవడిని బస్‌ఎక్కించి ఇంటికి చేరాను.

పదిరోజుల తర్వాత ఇంటిముందు కారు ఆగితే నేనూ, రాజేశ్వరి బయటకు వచ్చాం. కొడుకు, కోడలు, పిల్లలు కారు దిగి లోపలికి వచ్చారు. మా కళ్లని మేమే నమ్మలేకపోయాం. ఆప్యాయంగా ఎదురెళ్లి కోడల్ని పొదివిపట్టుకుని లోపలికి తీసుకువచ్చింది నా భార్య. ఏం మాట్లాడాలో తెలీని ఆనందంలో మనవడ్ని, మనవరాల్ని దగ్గరకు తీసుకున్నాను. డ్రైవర్‌కి డిక్కీలో సామాను తీసుకురమ్మని చెప్పి లోపలికి నడిచాడు నా కొడుకు.

‘‘నాన్నా.. మీరూ, అమ్మా మీ ఇష్టప్రకారం హాయిగా ఇక్కడే ఉండండి. మేమే వీలయినప్పుడల్లా వచ్చి మిమ్మల్ని చూసి వెళుతుంటాం. మీకు రావాలనిపించినప్పుడు మా దగ్గరికి వచ్చి మీకు ఎంతకాలం ఉండాలనిపిస్తే అన్నీ రోజులుండి మళ్లీ ఇక్కడికే వచ్చేద్దురు గాని. మీ మనసులో ఎంత దిగులు పెట్టు కున్నారో మానస్‌ ‌నాకు చెప్పాడు. అంతేకాదు, మీరు ఇక్కడ ఉంటే సంతోషంగా ఉన్నారని, మీ ముఖంలోని వెలుగే వాడికి తెలిసిపోయిందట’’ చెప్పాడు మధు.

మానస్‌ని దగ్గరకు తీసుకుని ముద్దాడాను. వెయ్యి ఏనుగుల బలం వచ్చింది నాకు. ఆ ఊరు వదిలి వెళ్లటం లేదనే విషయం నన్ను ఆనంద డోలికల్లో ముంచేస్తున్నది. కొత్త ఉత్సాహం చోటు చేసుకున్నది.

నాలుగు రోజులు మా దగ్గరే ఉండి మాకు కావలసినవన్నీ కొని తెచ్చి వెళ్లిపోయారు పిల్లలు.

రాజేశ్వరి నన్ను సంతోషంగా కౌగిలించుకుంది. ప్రేమగా ఆమెను చుట్టేశాను. నిజం చెప్పొద్దూ.. మా ఊరు నన్ను కౌగిలించుకున్న అనుభూతికి లోనయ్యాను.

About Author

By editor

Twitter
YOUTUBE