– రతన్‌ ‌శార్ద, ప్రముఖ రచయిత, కాలమిస్ట్

ఈశాన్య రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చాలా బలమైన శక్తిగా ఎదిగింది. ఇటీవల జరిగిన త్రిపుర, నాగాలాండ్‌, ‌మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని సారథ్యంలోని ప్రాంతీయ కూటమి ఎన్‌ఈడీఏ విజయ పరంపర కొనసాగింది. ఒక్కప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న త్రిపురలో వరుసగా రెండవసారి బీజేపీ విజయకేతనం ఎగరేసింది. కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్ట్ ‌పార్టీలు కలిసి పోటీ చేసినా, వ్రతం చెడిందే కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఒక్క త్రిపురలోనే కాదు, నాగాలాండ్‌లోనూ బీజేపీ కూటమి విజయం సాధించింది. హంగ్‌ ఏర్పడిన మేఘాలయలోనూ బీజేపీ భాగసామ్య పక్షంగా అధికారంలో వుంది. నిజానికి ఈ మూడు రాష్ట్రాలలో మాత్రమే కాదు, ఈశాన్య భారతం లోని ఎనిమిది రాష్ట్రాలలో బీజేపీ అడుగులు బలంగా పడుతున్నాయి. కాషాయ దళం పాద ముద్రలు స్పష్టమవుతున్నాయి.


నిజానికి, క్రైస్తవ జనాభా అధికంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలలో హిందూ జాతీయవాద పార్టీగా ముద్ర పడిన బీజేపీ గెలుపు ఎవరూ ఉహించింది కాదు. అందుకే, 2018లో బీజేపీ అక్కడ తొలి విజయం సొంతం చేసుకున్న సమయంలో, ఆ కమల వికాసాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా, అస్సాం ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్‌ ‌బిశ్వశర్మ వ్యూహ చాతుర్యం, మాయాజాలంగా పేర్కొని తలలు పండిన రాజకీయ విశ్లేషకులు కూడా ఆత్మతృప్తి పొందారు. ముఖ్యంగా, ‘ఎర్ర’ చొక్కా మేధావులకు అయితే, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు ఇప్పటికీ మింగుడు పడడం లేదు.

అయితే, ఈ విజయానికి ఏది కారణం? అంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం గడచిన ఎనిమిదేళ్లలో చేసి చూపిన అభివృద్ధి, విభిన్న జాతుల మధ్య సాధించిన సయోధ్య ప్రధాన కారణాలుగా పేర్కొంటారు. ‘మోదీ ప్రభుత్వం వేసిన బాటలు, కమలదళం కలను సాకారం చేశాయి’ అనే సమా ధానం వస్తుంది. అందులో అనుమానం లేదు. అతిశయోక్తి అసలే లేదు. కానీ, అదొక్కటే కారణమా? అంటే కాదు. దేశంలో, మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో చోటు చేసుకుంటున్న రాజకీయ, సామాజిక మార్పులకు మోదీ తెచ్చిన మార్పులే కారణం అనుకుంటే, అది సత్యమే, కానీ సంపూర్ణ సత్యం కాదు. అర్థసత్యమే మాత్రమే అవుతుంది. గడచిన ఎనిమిదేళ్లలో దేశంలో, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల రాజకీయ, సామాజిక ముఖచిత్రంలో వచ్చిన మార్పులకు, మోదీ పాలన ఒక సాధనం అయితే కావచ్చును కానీ, కేవలం ఎనిమిదేళ్ల మోదీ ప్రభుత్వ పాలన కారణంగానే ఈశాన్య రాష్ట్రాలలో మార్పు, పరివర్తన వచ్చిందని అనుకుంటే పొరపాటే అవుతుంది. నిజానికి ఎన్నో దశాబ్దాలుగా ఎందరో అజ్ఞాత యోధుల (అన్సంగ్‌ ‌హీరోస్‌) ‌త్యాగధనులు, సాగించిన అవిశ్రాంత కృషి, త్యాగాల ఫలితంగానే ఈరోజున దేశంలో, మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో జాతీయ భావజాల ప్రభుత్వాలు మళ్లీమళ్లీ అధికారంలో వస్తున్నాయి. అదో పరంపరగా కొనసాగుతోంది.

ఎన్నో దశాబ్దాలుగా సవాళ్లను ఎదుర్కొంటూ, ఎలాంటి గుర్తింపు, గౌరవం ఆశించకుండా సామాజిక, రాజకీయ మార్పు కోసం కృషి చేస్తున్న వారు అజ్ఞాత హీరోలు, రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ‌స్వయంసేవకులు, ప్రచారకులు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ప్రచారకులు చేసిన త్యాగాల ఫలితంగానే ఈ రోజున ఈశాన్య భారతంలో కాషాయ జెండా రెపరెపలాడుతోంది. విజయం వెంట విజయంతో ముందుకు సాగుతోంది.

ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, అనేక పొరుగు దేశాలకు సరిహద్దుగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలకు ఒకప్పుడు భారతీయ జాతీయ స్రవంతిలో చెప్పుకోదగిన స్థానం లేదు. జాతీయ రాజకీయాల లోనే కాదు, జాతీయ మీడియాలోనూ, ఈశాన్య రాష్ట్రాలకు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. జాతీయ వార్తా ఛానల్స్’‌లో ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన అసలే ఉండేది కాదు. ఉగ్రవాదుల దాడులు లేదా ఎన్నికలకు సంబంధించిన ప్రస్తావనలు తప్ప. మహాభారత పరంపరకు ప్రతీకగా నిలిచిన ఈశాన్య రాష్ట్రాల సంస్కృతీ, సంప్రదా యాలు, అభివృద్ధికి సంబంధించిన చర్చ, జాతీయ చానల్స్’ ‌పట్టించుకున్న సందర్భాలు ఇంచుమించుగా లేవనే చెప్పవచ్చును. కానీ ఈ రోజున ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావన లేకుండా ఎక్కడా, ఎలాంటి చర్చ ముందుకు సాగడం లేదు. ఇప్పడు ఈశాన్య భారతం, దేశానికి దగ్గరైంది. గతంలో దూరాన్ని పెంచిన రోడ్‌ ‌బారికేడ్లు ఇప్పుడు లేవు. ఈశాన్య భారత్‌ ‌మధ్య దూర భారం తొలిగి పోయింది.

గతంలో, రాజకీయ పార్టీలు ఈశాన్య రాష్ట్రాలను ఎన్నికల సమయంలో మాత్రమే తెరచుకునే ఓట్ల గిడ్డంగిగా పరిగణించాయి. ఎన్నికల సమయంలో స్థానిక చర్చి పెద్దలు, వేర్పాటువాదులు, నిగూఢ ముస్లిం నాయకుల సహకారంతో ఓట్లు వేయించుకుని ఎన్నికలలో గెలిచిన తర్వాత, కేంద్రం ఇచ్చే అభివృద్ధి నిధులను అరగించడం అలవాటుగా మలచు కున్నారు. అందుకే, ఎన్నో దశాబ్దాలుగా ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధికి నోచుకోలేదు. అయితే మోదీ ప్రధాని అయిన తర్వాత, దేశ అభివృద్ధిని నిర్వచించే ఈశాన్య భారతంపై దృష్టి కేంద్రీకరించారు. అంతవరకు ఉపేక్షకు గురైన అష్టలక్ష్మీ స్థావరం ఈశాన్య భారతం అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా బాటలు వేశారు.

గడచిన ఎనిమిది సంవత్సరాలలో ఈశాన్య భారత ముఖచిత్రం అనూహ్యంగా మారిపోయింది. ఈ ఎనిమిదేళ్లలో ఈశాన్య రాష్ట్రాలు ఎంతగానో అభివృద్ధి చెందాయి. అన్నిటినీ మించి ఇంతకాలం స్వదేశంలో పరాయివాళ్లుగా జీవిస్తూ వచ్చిన ఈశాన్యరాష్ట్రాల విభిన్నతెగల ప్రజల మనసుల నుంచి పరాయిభావన తొలగిపోయింది. ఇక ఎనిమిదేళ్ల అభివృద్ధి విషయానికి వస్తే, కేంద్ర ప్రభుత్వ సహకారంతో సమ్మిళిత అభివృద్ధిలోని ఏ కోణాన్నీ బీజేపీ ప్రభుత్వాలు వదిలేయ లేదు. దీంతో ప్రజల్లో విశ్వాసం పెరిగి, అది ఆదరణగా మారింది. ఈశాన్య భారతం బీజేపీకి జై కొడుతోంది.

అందుకే 2018 విజయాలను, అమిత్‌ ‌షా, హేమంత్‌ ‌బిశ్వ శర్మ వ్యూహ చాతుర్యం, మాయా జాలంగా వర్ణించిన వారు 2023 విజయాలను ఆ విధంగా చూడలేక పోతున్నారు. జాతీయవాద భావజాల విజయంగానే చూస్తున్నారు. నిజం.. క్రైస్తవ చర్చి ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలలో ఐదేళ్ల పాలన తర్వాత, హిందూత్వ, మతతత్వ పార్టీగా అసత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న జాతీయ పార్టీ బీజేపీ తిరిగి విజయం సాధించడం సామాన్య విషయం, కాదు. అందుకే, ఈ విజయాన్ని బీజేపీ చేసి చూపిన సమ్మిళిత అభివృద్ధి నమూనా విజయంగా భావించవలసి ఉంటుంది. కాదంటే, వేర్పాటువాదానికి, తిరుగుబాటులకు పెట్టింది పేరుగా నిలిచిన ప్రాంతంలో, ఒక ‘హిందు’ జాతీయ పార్టీ, ప్రాతీయ పార్టీలతో కలిసి నాగాలాండ్‌లో 51 శాతం, మేఘాలయలో 41 శాతం, త్రిపురలో 39 శాతం ఓట్లు సాధించడం ఎలా సాధ్యం? అలాగే, ఈశాన్య భారతం, పరాయీకరణ, ఒంటరితనాన్ని వదిలి భారతీయతకు దగ్గరైంది. భారతీయ స్రవంతి ఒడికి చేరింది. అందుకే భారతీయ జాతీయవాదానికి వేదికగా నిలిచిన బీజేపీ ఈశాన్య రాష్ట్రాలలో ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగింది. అక్కడ రాజకీయ, సామాజిక పరివర్తనకు కేంద్ర బిందువుగా మారింది.

ఒకప్పుడు ఆగష్టు 15, (స్వాతంత్ర దినోత్సవం), జనవరి 26 (గణతంత్ర దినోత్సవం) జరుపుకోని, జాతీయ వేడుకలను బహిష్కరించి, గంటలు, రోజుల తరబడి బ్లాక్‌ ‌డే పాటించిన ఈశాన్య భారతం, ఈ రోజున భారతీయ జాతీయ స్రవంతిలో సేద తీరుతోంది. ఒకప్పడు 72 గంటల రోడ్డు బారికేడ్లు నిత్యకృత్యంగా మారిన ఈశాన్య భారతంలో ఇప్పడు ఆ మాటే వినిపించడం లేదు. ఒకప్పడు ప్రజల నుంచి సొంత పన్నులు వసూలు చేసిన సమాంతర ప్రభుత్వాలు సాగించిన అరాచకాలు చాలావరకు తెరమరుగయ్యాయి. ఈ మార్పులు, ఈ ప్రాంతానికి కావలసింది ఏమిటో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఇక్కడి ప్రజలు సోదర భావం కోరుకుంటున్నారు. నిజమైన అభివృద్దిని, తమ జీవితాల్లో వెలుగును ఆకాంక్షిస్తున్నారు. అన్నిటినీ మించి సమానత్వాన్ని కోరుకుంటున్నారు.

అయితే, కాంగ్రెస్‌ ‌పార్టీ ఈశాన్య రాష్ట్రాలను ఉపేక్షించడమే కాక ‘చిన్న’ రాష్ట్రాలు అంటూ చిన్న చూపు చూసింది. కానీ, కేంద్రంలో బీజేపీ అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీక రించారు. అయితే, ఈ తొమ్మిది సంవత్సరాలలోనే ఒక్కసారిగా ఇంత మార్పు వచ్చిందా? అంటే లేదు. దశాబ్దాలుగా ఎందరో అజ్ఞాత యోధులు, అన్సంగ్‌ ‌హీరోస్‌’ ‌సాగింగించిన అవిశ్రాంత, నిస్వార్ధ కృషి ఫలితంగా ఈ మార్పు, ఈ పరివర్తన సాధ్యమైంది.

బీజేపీ సారథ్యంలోని అటల్‌ ‌బిహారీ వాజపేయి ప్రభుత్వ హయాంలో రాజకీయంగా తొలి బీజం పడింది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంతో పాటు అటల్జీ, సంఘ్‌ ‌తలపెట్టిన పవిత్ర కార్యం పరిపూర్ణం చేయడంలో తొలి అడుగు పడింది. అయితే, ఆ తర్వాత పది సంవత్సరాలలో ఈశాన్య రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన మన్మోహన్‌ ‌సింగ్‌ ‌ప్రధానిగా ఉన్న రోజుల్లో దురదృష్టవశాత్తు అభివృద్ధి మంత్రం స్వరం మారింది. ఈశాన్య రాష్ట్రాలు ‘చిన్న’ రాష్ట్రాలు అనే చిన్నచూపు మళ్లీ తెరపైకొచ్చింది.

విదేశీ ప్రేక్షకులను ఉద్దేశించి గంభీర ఉపన్యా సాలు చేయడం వల్లనో, సోషల్‌ ‌మీడియా, టీవీలలో ప్రముఖంగా ప్రచారం సాగించడం వల్లనో, జాతి నిర్మాణం జరగదు. ఈశాన్య విషయంలో ఇదే నిజం మరో మరు రుజువైంది. నేను చెపుతున్న జాతి నిర్మాణ పక్రియ 70 ఏళ్ల క్రితం, 1950లో ఆర్‌ఎస్‌ఎస్‌ 10 ‌మంది ప్రచారకుల బృందాన్ని అప్పట్లో అస్సాంగా పిలిచే ఈశాన్య ప్రాంతానికి పంపడంతో మొదలైంది. అంతకు ముందు అప్పటి సర్‌ ‌కార్యవాహ శ్రీ ఏకనాథ్‌ ‌రనడే, అస్సాం (పూర్తి ఈశాన్య ప్రాంతం, నార్త్-ఈస్ట్ ‌ఫ్రాంటియర్‌ ఏజెన్సీ)లో నెల రోజులు విస్తృతంగా పర్యటించారు. అక్కడి నుంచి మహారాష్ట్రకు తిరిగి వచ్చిన తర్వాత, సంఘ్‌ ‌శిక్షావర్గలో పాల్గొన్నారు. మహారాష్ట్ర సంఘ్‌ ‌చాలక్‌ శ్రీ ‌బాబురావ్‌ ‌భిడేకు ఈశాన్య ప్రాంత పరిస్థితిని వివరించి, పెద్ద సంఖ్యలో ప్రచారకులను అస్సాంకు పంపాలని కోరారు. అస్సాంలో తక్షణమే పెద్ద ఎత్తున సంఘ్‌ ‌కార్యాన్ని ప్రారంభించాలని, లేదంటే చర్చి మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న వేర్పాటువాదుల కార్యకలాపాల కారణంగా రానున్న 30 ఏళ్లలో అస్సాం మొత్తం భారతదేశానికి దూర మవుతుందని చెప్పారు. ఇదే విషయంపై ఆయన శిక్షా వర్గలో ప్రసంగించారు. ఆ వెంటనే అస్సాంకు పదిమంది ప్రచారకుల బృందం బయలుదేరింది.

అయితే, చేతిలో సరైన వనరులు, సామాజిక, రాజకీయ మద్దతు లేకుండా సంఘ్‌ ‌కార్యాన్ని ముందుకు తీసుకుపోవడం మాములు వ్యవహారం కాదు. కత్తి మీద సాము కంటే కష్టమైన కార్యం, అంతేకాదు, 1836 నుంచి విభిన్న క్రైస్తవ తెగలకు చెందిన చర్చి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్న ప్రతికూల వాతావర •ణంలో పని చేయడం మాములు విషయం కాదు. చాలా చాలా కష్టతరమైన కార్యం. ఈశాన్య ప్రాంతం అంతటా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యకర్తలు, ప్రచారకులు తీవ్ర ప్రతిఘటన, దాడులు ఎదుర్కొ న్నారు. పరిశోధన, గ్రంథ రచన కోసం నేను కలసిన ప్రచారకులు అందరూ ఇదే అనుభవం పంచుకున్నారు.

వివాద పరిష్కారం

సంఘ్‌ ‌విధానం… అలాంటి పరిస్థితిలోనూ మారుమూల ప్రాంతాలలో పాఠశాలలు ప్రారంభించడం, సేవా కార్యక్రమాలు, గిరిజనులకు ప్రత్యేకంగా స్వయం పోషక కార్యక్రమాల ద్వారా స్వయంసేవకులు, ప్రచారకులు సంఘ్‌ ‌కార్యాన్ని ముందుకు తీసుకు పోయారు. అలాగే, రామకృష్ణ మిషన్‌ ‌వంటి ఇతర సంస్థలు కూడా విద్యా, సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నాయి. క్రైస్తవ మత సంస్థలు, చర్చి నుంచి విపరీత దాడులు ఎదుర్కొం టున్న స్థానిక ఆచార వ్యవహారాలు, శతాబ్దాల సంప్రదాయాల రక్షణకు సంఘ్‌ ‌మద్దతుగా నిలిచింది.

సంఘ్‌ ఈశాన్య ప్రాంతాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. పెద్ద సంఖ్యలో ప్రచారకులను పంపడంతో పాటుగా అవసరమైన వనరులు కల్పించడం, మహారాష్ట్రలో ఈశాన్య ప్రాంత విద్యార్ధుల కోసం హాస్టల్స్ ‌ప్రారంభించడం ద్వారా ఈశాన్య ప్రాంతాన్ని దత్తత తీసుకోవాలని మహారాష్ట్రను కోరింది. ప్రస్తుత పూజ్య సర్‌ ‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌సహా మహారాష్ట్ర ప్రచారకులు అందరూ ఈశాన్య ప్రాంతంలో సుదీర్ఘ కాలం పని చేశారు. మరో ముఖ్య విషయం, 1964లో విశ్వ హిందూ పరిషత్‌ (‌వీహెచ్‌’‌పీ) ప్రారంభ సదస్సు ప్రయాగలో, రెండవ సదస్సు అస్సాంలో జరిగాయి. ఈ సదస్సులో విభిన్న ఈశాన్య గిరిజన తెగల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు, ‘ప్రగతి శీలురు’ ‘మేము ప్రకృతిని, పశు పక్ష్యాదులను పూజిస్తాము, గొడ్డు మాంసం భుజిస్తాము కాబట్టి హిందువులము కాదు’ అనే వాదన తీసుకొచ్చారు. అందుకు శ్రీ గురూజీ, హిందువులు అందరూ ప్రకృతి అరాధకులే, పశు పక్ష్యాదులను పూజించే వారే అని సమాధాన మిచ్చారు. గొడ్డు మాసం తినడం అనేది అనివార్యత వలన వచ్చిన అలవాటు, అంతకు మించిన మంచి ఆహారం లభిస్తే ఆ అలవాటు మారిపోతుంది., మరుగున పడి పోతుందని చెప్పారు. ఆవిధంగా స్థానిక దేశీయ విశ్వాసాల పునర్జీవనం మొదలైంది. ఇక అక్కడి నుంచి స్థిరంగా ముందుకు సాగుతూ వస్తోంది.

అందులో భాగంగా, గురూజీ ప్రేరణతో మణి పూర్‌లో పాఠశాల ప్రారంభించిన మహారాష్ట్రలోని థానేకు చెందిన భయ్యాజీ కానే, ఆ ప్రాంత వాసులలో తాము ఈ దేశస్థులం కాదు, పరాయి వారం అనే భావనను తొలిగించి, అక్కడి విద్యార్ధుల మనసులలో సమైక్యతా భావనని నింపేందుకు, ముంబై పంపడంతో మొదలైన కార్యక్రమం ‘స్టూడెంట్‌ ఎక్స్చేంజి’ కార్యక్రమంగా దేశ వ్యాప్తంగా విస్త రించింది. విద్యార్ధి పరిషత్‌. (ఏబీవీపీ) ఈ కార్యక్ర మాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల ప్రస్తుత రాజకీయ నాయకులలో చాలా మంది ఈ పక్రియ ద్వారానే జాతీయ భావనకు దగ్గరయ్యారు. అలాగే, వనవాసీ కల్యాణ ఆశ్రమం ద్వారా ఎంతో మంది గిరిజన క్రీడాకారులు జాతీయ స్థాయిలో గుర్తింపు గౌరవం పొందారు. జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకుంటున్నారు.

అయితే ఇదంతా ఆషామాషీగా అవలేదు. స్వయం సేవకులు, ప్రచారకులు ఎన్నో కష్ట నష్టాలు భరించారు. 1999లో నలుగురు ప్రచారకులు హత్యకు గురయ్యారు. ఆ నలుగురు ప్రచారకులను, చర్చి సహకారంతో అపహరించుకు పోయిన దుండగులు, వారిని చిత్ర హింసలకు గురిచేశారు. చివరకు అత్యంత దారుణంగా, అతి కిరాతకంగా హత్య చేశారు. అయినా, ఇతర కార్యకర్తలు, ప్రచారకులు వెనకడుగు వేయలేదు. అదే స్ఫూర్తితో ముందుకు సాగారు. ఇంకెందరో ముందుకొచ్చారు. అందులో కొందరు అంతే దారుణంగా హత్యకు గురయ్యారు. అయిన సంఘ్‌ ‌కార్యం ఆగలేదు. పవిత్ర గంగా ప్రవహంలా కొనసాగుతూనే వుంది.

ఇలా ఎందరో పుణ్య పురుషులు సాగించిన తపస్సు ఫలాల ఆధారంగా ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, పరివర్తనకు బృహత్‌ ‌కార్యాన్ని ప్రారంభించారు. ప్రధాని మోదీ ఈ ప్రాంతంలో, ఇంతవరకు ప్రధానులు అందరూ కలిసి పర్యటించిన దానికంటే ఎక్కువగా మొత్తం 51 సార్లు పర్యటిం చారు. అలాగే ‘ప్రతి 15 రోజులకు ఒక కేంద్ర మంత్రి ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఈప్రాంత ప్రజలు వేగంగా సాగుతున్న అభివృద్ధి ఫలాలను అనుభ విస్తున్నారు. ఏవేవో ఉచిత పథకాల ద్వారా లభించే తాత్కాలిక ఫలాలు కాదు. పరివర్తన చక్రాల కదలిక ద్వారా అందుతున్న శాశ్వత ఫలాలు. అందుకే ఇప్పడు ఈశాన్య భారతంలో బందులు లేవు, బందూకుల చప్పు•ళ్లు లేవు. ఉగ్రవాదులు , వేర్పాటు వాదుల గర్జనలు లేవు.

ఈ కారణంగానే నేను, 2023 ఎన్నికలలో మూడు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ రాజకీయ విజయంగా భావించడం లేదు. ఈశాన్య ప్రాంతం భారత ప్రధాన జీవన స్రవంతి ఒడి చేరడంగా, ఇటు ఈశాన్య ప్రాంత ప్రజలలో అటు సమస్త భారతీయుల మనసులలో పూసిన సమైక్య పుష్పంగా భావిస్తాను. ఇదేదో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ‘మేరీ కొమ్‌’ ‌కథ కాదు. దేశ వ్యాప్తంగా హారతులు అందుకుంటున్న ఎందరో క్రీడాకారుల కథ. రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. అది కాదు విషయం. భారతదేశం, విభజిత, విచ్చిన్న రాజకీయాల శక్తులకు వ్యతిరేక ప్రభంజనంగా మారింది. అదీ విశేషం.

‘ఆర్గనైజర్‌’ ‌నుంచి

అను: రాజనాల బాలకృష్ణ

About Author

By editor

Twitter
YOUTUBE