పార్లమెంటుకు ఇక సెలవేనా?

సూరత్‌ ‌న్యాయస్థానం తీర్పు కాంగ్రెస్‌ ‌పార్టీ భవితవ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? మోదీ అనే ఇంటిపేరును అడ్డం పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ మీద అవాకులూ చవాకులూ పేలినందుకు గాంధీ-నెహ్రూ కుటుంబ వారసుడు రాహుల్‌ ‌గాంధీకి న్యాయమూర్తి జస్టిస్‌ ‌వర్మ రెండేళ్లు జైలుశిక్ష విధించారు. రూ. 15,000 జరిమానా కూడా విధించారు. చాలా చిత్రంగా జైలు శిక్ష పడడమనే మచ్చ కంటే, లోక్‌సభ సభ్యునిగా రాహుల్‌ ఎదుర్కొంటున్న అనర్హత గురించి దేశంలోను, కాంగ్రెస్‌ ‌పార్టీలోను ఎక్కువ చర్చ జరుగుతోంది. 1975 నాటి అలహాబాద్‌ ‌హైకోర్టు తీర్పు, దరిమిలా ఇందిరాగాంధీ ఎదుర్కొన్న ఇరకాటం, మారిన రాజకీయాలు, ఆ నేపథ్యమే మళ్లీ ఇందిరను ప్రధానిగా ప్రతిష్టించడం వంటి పరిణామాలను గుర్తు చేసుకుని కొందరు కాంగ్రెస్‌ ‌నాయకులు సూరత్‌ ‌న్యాయస్థానం తీర్పులో కాంగ్రెస్‌కు పునర్‌ ‌వైభవం తెచ్చే వరాన్ని చూసుకుంటూ మురిసిపోతున్నారని  వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ అలా ఆనందపడుతూ ఉంటే, ప్రతిపక్షాల నేతలలో ప్రధాని పదవి కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నవారికి కూడా ఇది తీపి కబురనే అనుకోవాలి. ఎందుకంటే ప్రధాని పదవికి ప్రధాన పోటీదారు రంగం నుంచి దాదాపు తప్పుకున్నట్టే.

ప్రస్తుతం అమలులో ఉన్న నియమ నిబంధనలను బట్టి రాహుల్‌ ‌గాంధీ లోక్‌సభ సభ్యత్వం కోల్పోయే అవకాశం చాలా ఎక్కువ. అనర్హత ఆయన భవితవ్యాన్ని ఇంకా అగమ్యగోచర స్థితిలోకి నెట్టి వేస్తుంది. ఆయనకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం మళ్లీ దక్కేది ఎనిమిదేళ్ల తరువాతే. రెండేళ్లు శిక్ష పడినవారు, ఆ శిక్షాకాలం పూర్తయ్యాక కూడా 1951 నాటి ప్రజాప్రాతినిధ్యం చట్టం మేరకు ఆరేళ్ల వరకు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులు. ఈ అంశాన్ని ఆయన జీవితాశయం అనే కోణం నుంచి చూస్తే, 52 ఏళ్ల రాహుల్‌ ‌తన 60వ ఏడు వరకు ఆగాలి. వాస్తవానికి మధ్యంతర ఎన్నికలు జరగకపోతే 2034 సంవత్సరంలో  గాని రాహుల్‌కు ఎంపీగా పోటీ చేసే అవకాశం రాదు. కానీ అప్పటికి ఆయన 64వ పడిలో పడతారు. ఇది మోదీ ఇంటిపేరును దుర్వినియోగం చేసిన నేరానికి ఫలితం మాత్రమే. కానీ రాహుల్‌ ‌మీద ఉన్న నేరం ఇదొక్కటే కాదు. మెడ మీద కత్తిలా వేలాడుతున్న మరొక కేసు నేషనల్‌ ‌హెరాల్డ్ అవినీతి వ్యవహారం. దీనిని కూడా నరేంద్ర మోదీ హయాంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌దర్యాప్తు చేస్తున్న సంగతి విస్మరించలేం.

2019 ఎన్నికలు ఇచ్చిన కుదుపుతో ఇప్పటికే చాలామంది సీనియర్లను కోల్పోయిన కాంగ్రెస్‌కు సూరత్‌ ‌న్యాయస్థానం తీర్పు మరొక కుదుపును సిద్ధం చేస్తుందనే చాలామంది అభిప్రాయం. కాబట్టి సూరత్‌ ‌పరిణామాన్ని మాత్రమే చూసి రేపటి కాంగ్రెస్‌ ‌రూపురేఖల మీద అంచనాకు రావడం సాధ్యం కాదు. ఆ ఎన్నికలలో అమేథిలో స్మృతి ఇరానీ రూపంలో ఎదురైన ఘోర పరాజయమే పార్టీని డోలాయమాన స్థితికి నెట్టివేసింది. చాలామంది కాంగ్రెస్‌ ‌నేతలు ఇతర పార్టీలలోకి సర్దుకున్నారు. కొందరికి పొగపెట్టారు. జి.26 అని ఒక బృందం కూడా తయారయింది. వాయినాడ్‌ (‌కేరళ) ఏదో విధంగా రాహుల్‌ను గట్టెక్కించి లోక్‌సభకు పంపినా సూరత్‌ ‌తీర్పుతో అది మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలింది.

సూరత్‌ ‌తీర్పు కాంగ్రెస్‌నీ, రాహుల్‌నీ నిలబెట్టే పరిణామమే అవుతుందా? ఇది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్న కోణమే. నిలబెట్టేదేనని కాంగ్రెస్‌ ‌నాయకులు అంచనాకు రావడంలో ఆత్మతృప్తి మాత్రమే కనిపిస్తుంది. అలహాబాద్‌ ‌హైకోర్టు తీర్పు తరువాత ఇందిరను సీబీఐ విచారించింది. తరువాత జనతాపార్టీలో గొడవలు మొదలయ్యాయి. మొరార్జీని ప్రధాని పదవి నుంచి దింపేసే అవకాశం ఇందిరకు అయాచితంగా చరణ్‌సింగ్‌ ‌రూపంలో వచ్చింది. ఇప్పుడు కూడా అదే లెక్క వర్తిస్తుందని కాంగ్రెస్‌లో కొందరైనా భావించడం విడ్డూరమే తప్ప మరొకటి కాదు. మొదటి వాస్తవం- రాహుల్‌ ‌గాంధీ ఇందిరాగాంధీ కాదు. భారతీయ జనతాపార్టీ నాటి జనతా పార్టీ వంటిదీ కాదు. అసలు అత్యవసర పరిస్థితి కాంగ్రెస్‌ను చివరి అంకంలోకి తీసుకువచ్చిన పరిణామమని కాంగ్రెస్‌ ఇప్పటికీ గుర్తించడం లేదనే అనిపిస్తుంది. జనతా పార్టీని ఇందిర ధ్వంసం చేసి ఉండవచ్చు. ధ్వంసం కావడానికి వీలైన అన్ని లక్షణాలు ఆ పార్టీలో ఉన్నాయి. అయినా భారతీయ జనతా పార్టీకి జన్మనిచ్చినది జనతా పార్టీయే. కాంగ్రెస్‌ను చివరి అంకంలోకి శరవేగంగా ప్రవే శపెట్టినది ఈ పార్టీయే.

కాబట్టి ఇవాళ దేశ రాజకీయాలలో ఉన్న పోటీకీ, 1977-79 నాటి రాజకీయాలలో నెలకొన్న పోటీకీ పోలిక లేదు. నాడు ఉన్నవి బలమైన కాంగ్రెస్‌; ‌బలహీన, అనైక్య విపక్షం. నేడు ఉన్నది బలమైన అధికారపక్షం, బలహీన కాంగ్రెస్‌. ‌పైగా నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసు దర్యాప్తును కూడా వేగవంతం చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎటు మళ్లుతాయి? ఈ భయమే సూరత్‌ ‌తీర్పుతో వచ్చే కాస్త లబ్ధి పట్ల ఆ పార్టీలో కనిపించిన ఆశను అడుగంటిపోయేటట్టు చేస్తోంది. ఎనిమిదేళ్లు రాహుల్‌ ఎన్నికల రాజకీయాలకు దూరమైతే పార్టీలోనే ప్రత్యామ్నాయ నాయకత్వం అనివార్యంగా ఆవిర్భవిస్తుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

2014 తరువాత ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ ‌చేసినదేమిటి? నరేంద్ర మోదీని తీవ్ర పదజాలంతో నిందించడం ఒక్కటే. ఆ విమర్శలన్నీ గాంధీ-నెహ్రూ కుటుంబం నుంచి ప్రధాని పదవి చేజారినందుకు పెట్టిన శాపానార్ధాలను తలపించాయే తప్ప, నిర్మాణాత్మక విమర్శలని ఎవరూ భావించలేదు. ప్రధాని పదవి విపక్షాల పరం కావడం, కాంగ్రెస్‌ ‌పార్టీలోనే పీవీ వంటి వారి చేతిలోకి వెళ్లడం- ఆ రెండూ ఒక్కటే అన్న రీతిలోనే రాహుల్‌ ‌వైఖరి కనిపించింది. సామాజిక న్యాయం గురించి, సమానత్వం గురించి, అందరికీ అవకాశాల గురించి రాహుల్‌ ఎన్ని కబుర్లు చెప్పినా ఆయన కోరుకుంటున్నది కుటుంబ పాలనేనని చాలాసార్లు రుజువు చేశారు. ప్రతిపక్ష విమర్శ, ప్రతిపక్ష పాత్ర అంటే తన కుటుంబ పాలనను పునఃప్రతిష్టించడం గానే రాహుల్‌ ‌మనసా వాచా భావించారు. మోదీ ఇంటిపేరున్న వారంతా దొంగలే అని వదరడం అందులో భాగమే. రాహుల్‌ ‌మనసు నిండా మాత్రమే కాదు, కొందరు కార్యకర్తల అంతరంగం కూడా అదే. రాహుల్‌గాంధీ కుటుంబాన్ని చట్టం కాస్త ప్రత్యేకంగా చూడవలసిందే అన్నారు మీర్జాపూర్‌కు చెందిన కాంగ్రెస్‌ ‌నాయకుడు ప్రమోద్‌ ‌తివారీ. ఎందుకు? ఆయన తండ్రి, నానమ్మ కూడా దేశం కోసం త్యాగం చేశారట. ఎంత తక్కువ వీలుంటే అంత తక్కువ శిక్షతో సరిపెట్టాలని కూడా తివారీ కోర్టువారికి ఉచిత సలహా ఇచ్చారు. మాజీ ఎంపీ రేణుకా చౌదరికి కూడా గతంలో మోదీ అన్న ఒక మాట గుర్తుకు వచ్చి పరువు నష్టం వేస్తానని చెబుతున్నారు. అప్పుడెప్పుడో మోదీ ఆమెను శూర్పణఖ అన్నారని ఆరోపణ.

 ఇంతకీ ఎన్నికల రాజకీయాలలో, ప్రచారంలో రాహుల్‌ ‌ధోరణి గురించి దేశంలో, పార్టీలో ఉన్న అభిప్రాయం ఏమిటి? ఆ కోణం నుంచి మాత్రం   రాహుల్‌పై అనర్హత వేటు గురించి అంతగా ఆలోచించవలసినది కాదని కొందరు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. వచ్చే 2024 ఎన్నికలలో ప్రతిపక్షాలను ఏకం చేసే చర్చలను రాహుల్‌ ‌కంటే కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమర్ధంగా నిర్వహించగలరన్న వాదన కూడా బయలుదేరింది. కానీ, గాంధీ-నెహ్రూ కుటుంబమే కాంగ్రెస్‌కు శరణ్యమన్న భావన కూడా బలంగానే ఉంది. అది ఇకపైనా నెరవేరడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? సోనియాకు ఆరోగ్యం సరిగా లేదు. ప్రియాంక గాంధీ మీద ప్రత్యేకంగా ఏమీ కేసులు లేవు. కానీ ఆమె భర్త రాబర్ట్ ‌వాధ్రా మీద మాత్రం కేసులు ఉన్నాయి. సోదరుడికి శిక్ష పడిన వెంటనే ప్రియాంక మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, సవాలు విసిరారు. ఇదంతా సామాజిక మాధ్యమాల లోనే. ఇలా కాకుండా ప్రియాంక బయటి ప్రపంచం లోకి వచ్చి క్రియాశీలకంగా ఉంటే ఫలితం ఉండ వచ్చునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాహుల్‌ ‌గాంధీకి శిక్ష పడిన మరునాడే 14 విపక్షాలు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ల దుర్వినియోగాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఇందులో కాంగ్రెస్‌ ‌కూడా ఉండ డమే వింత. భారతీయ జనతా పార్టీని విమర్శించే క్రమంలో తాము భారతదేశాన్ని తూలనాడు తున్నామనీ, సార్వభౌమాధికారాన్ని అవమాన పరుస్తున్నామని ఏనాడో మరచిపోయిన విపక్షాలు, ఇప్పుడు బీజేపీ మీద ఆగ్రహంతో కోర్టులు, నిబంధనల విషయంలో కూడా అదే తప్పు చేస్తున్నాయి.

About Author

By editor

Twitter
YOUTUBE