రాహుల్ గాంధీ నోటివాటం లేదా నోటి దురద ఎంతటిదో సూరత్ కోర్టులో తేలిపోయింది. ఆ నాలుక తీట మీద రావలసిన తీర్పులు మరికొన్ని కూడా ఇంకా మిగిలి ఉన్నాయన్న సంగతి విస్మరించరాదు. సూరత్ కోర్టు వారు రెండేళ్లు జైలు శిక్ష విధించారు. అలాగే ఆ శిక్ష వెంటనే అమలు కాకుండా బెయిల్ కూడా ఇచ్చారు. రాహుల్ దేశం నలుమూలలా ఉన్న న్యాయస్థానాలలో ఇలాంటి బెయిల్ తీసుకుని మనుగడ సాగిస్తున్నారు. భారతీయులకు సత్యం, అహింస, రాజనీతి వంటివి ఎడాపెడా బోధిస్తున్నారు. ఆయన మీద దాదాపు 12 కేసులు ఉన్నాయి. వీటిలో ఎక్కువ నోటివాటానికి చెందినవి. నిజానికి ఆయనకి 2019 బెయిళ్ల నామ సంవత్సరమే. పట్నాకు చెందిన ఒక వ్యక్తి వేసిన పరువు నష్టం కేసులో బెయిల్ తీసుకున్నారు రాహుల్. పెద్ద నోట్ల రద్దు సమయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ తమ మీద ఆరోపణలు చేసినందుకు అహమ్మదాబాద్ సహకార బ్యాంక్ పరువు నష్టం దావా వేసింది. ఈ కేసులో కూడా బెయిల్ పొందారు. ఒక స్వయంసేవక్ వేసిన పరువునష్టం కేసులో ముంబాయి కోర్టు నుంచి బెయిల్ తీసుకున్నారు రాహుల్. గౌరీ లంకేశ్‌ను హత్య చేసిన వారు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ సిద్ధాంతాల వారే అన్నందుకు రాహుల్ బోనెక్కారు. గాంధీజీని ఆర్‌ఎస్‌ఎస్ హత్య చేసిందని నేరుగా ఆరోపించి భివాండీ (మహారాష్ట్ర) కోర్టులో నిలబడ్డారాయన. 2016 నాటి ఈ కేసులోను బెయిల్ తీసుకున్నారు.
తాను సావర్కర్‌ను కానని, గాంధీననీ, గాంధీ ఏనాడూ వెనకడుగు వేసి క్షమాపణలు చెప్పడని రాహుల్ నిన్న మొన్న డంబాలు పలికారు. కోర్టు శిక్షించిన తరువాత కూడా రాహుల్ స్వాతంత్య్ర సమరయోధులను విడిచిపెట్టకుండా అవమా నించడం జాతి చేసుకున్న దౌర్భాగ్యం. ఇక్కడ సావర్కర్ పేరు ఎందుకు? అయినా తాను ఏనాడూ క్షమాపణలు కోరలేదని రాహుల్ చెప్పడం ఒట్టి అబద్ధం. పెద్ద దగా. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా 2019 ఎన్నికల ప్రచారమంతా రాహుల్ ఉపయోగించుకున్న చౌకీదార్ చోర్ హై నినాదంతో పరువునష్టం కేసు ఎదుర్కొని సుప్రీంకోర్టు ఎదుట సాష్టాంగపడ్డారు. క్షమాపణలు వేడారు. లెంపలు వేసుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా మోదీ తనను తాను వ్యవస్థకు చౌకీదార్‌నని చెప్పుకునేవారు. దానిని కాంగ్రెస్ ప్రబుద్ధులు ఇలా హేళన చేశారు.
‘గలి గలి మే షోర్ హై, దేశ్‌కా చౌకీదార్ చోర్‌హై’-ఇదీ ఆ నినాదం. దీనిని మొదట సెప్టెంబర్ 20, 2018న రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రయోగించారు. దీనిని ప్రవీణ్ మిశ్రా అనే కాంగ్రెస్ ప్రముఖుడు కూరిస్తే, నాటి ప్రధాన కార్యదర్శి దీపక్ బబారియా బ్రహ్మాండం అంటూ దేశం మీద వదలడానికి అనుమతి ఇచ్చాడు. మరొక ఆలోచన లేకుండా రాహుల్ పలికారు.అక్కడి ఎన్నికల ప్రచారంలో ప్రయోగించాక రాజస్తాన్ పత్రికలన్నీ పతాకశీర్షికలుగా ప్రచురించాయి. అప్పటికి కూడా బీజేపీ మౌనంగానే ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల తరువాత బీజేపీ నాయకురాలు మీనాక్షి లేఖి దీని మీద సుప్రీం కోర్టులో పరువు నష్టం దాఖలు చేశారు. దీనితో రాహుల్ క్షమాపణలు చెప్పారు.
భివాండీ కోర్టు కేసు గురించి అంతా తెలుసుకోవాలి. 2014లో ఈ కేసుకు సంబంధించి భారత శిక్షా స్మృతి 499, 500 సెక్షన్ల మేరకు సమన్స్ జారీ అయ్యాయి. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త రాజేశ్ కుంతే మిశ్రా ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. గాంధీజీని ఆర్‌ఎస్‌ఎస్ హత్య చేసిందని ఆరోపించినందుకు రాహుల్ విచారణను ఎదుర్కొన్న కేసు ఇదే. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ భివాండీలో నిర్వహించిన ఒక ప్రదర్శనలో రాహుల్ ఈ ఆరోపణ చేశారు. ‘ఇదే వారి వ్యవహార శైలి. గాంధీజీని ఆర్‌ఎస్‌ఎస్ సంస్థ నుంచి వచ్చినవారే హత్య చేశారు. ఆ సంస్థ సభ్యులే కాల్చి చంపారు. కానీ ఇప్పుడు వారే గాంధీజీ గురించి మాట్లాడుతున్నారు’ అని రాహుల్ అన్నారు. ఇది జరిగిన తరువాత భివాండీ జారీ చేసిన సమన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. తాను వ్యక్తిగతంగా ఈ కేసులో కోర్టుకు శాశ్వతంగా రానక్కరలేకుండా కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ సమన్స్ రద్దు చేయడానికి, విచారణను ఆపడానికి కూడా హైకోర్టు నిరాకరించింది.గాంధీజీని ఆర్‌ఎస్‌ఎస్ వారు హత్య చేశారని తాను ఏనాడూ అనలేదని పచ్చి అబద్ధం ఆడారాయన.
ఆర్‌ఎస్‌ఎస్ గౌరవానికి భంగం కలిగించారంటూ గౌహతికి చెందిన అంజన్ బోరా చేసిన ఫిర్యాదు మేరకు రాహుల్‌కు సమన్స్ జారీ అయినాయి.
జార్ఖండ్‌లో జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో రాహుల్ నోటివాటం హద్దులు దాటిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. కానీ మనం చూస్తున్నది రేప్ ఇన్ ఇండియా అన్నారు రాహుల్. నిత్యం లైంగిక అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. బేటీ బచావో, బేటీ పఢావో అన్నారు మోదీ. అయితే ఎవరి ఆడవారిని రక్షించాలో మోదీ చెప్పలేదు అన్నారు రాహుల్. ఈ రాష్ట్రంలో కూడా దొంగలందరికీ మోదీ ఇంటి పేరే ఉంటుందన్న వ్యాఖ్య మీద వ్యాజ్యం నడుస్తున్నది. ఆయన మీద మొత్తం మూడు కేసులు ఉన్నాయి. మొదటిది న్యాయవాది ప్రదీప్ మోదీ వేసిన కేసు. ప్రదీప్ మోదీ కూడా తమ ఇంటి పేరు గలవారంతా దొంగలే అన్న వ్యాఖ్య మీద కేసు వేశారు. అమిత్ షాను హంతకుడు అని వ్యాఖ్యా నించినందుకు ఈ రాష్ట్రంలోనే మరొక పరువు కేసు నమోదైంది. 2018 నాటి జబల్‌పూర్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ఆ మాట అన్నారు. ఇదే ఆరోపణ మీద బీజేపీ నాయకుడు ప్రతాప్ కతియార్ కూడా పరువు నష్టం కేసు పెట్టారు. సూరత్ కోర్టు తీర్పు తరువాత ఈ మూడు కేసులను కూడా త్వరగా విచారించాలని ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడు బిరంచి నారాయణ్ కోరారు.
సైన్యం జరిపిన ఉగ్రవాద వ్యతిరేక దాడులను మోదీ తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించు కుంటున్నారని కూడా రాహుల్ ఆరోపించారు. 2016లో ఒక సందర్భంలో మాట్లాడుతూ సైనికులు రక్తం ధారపోసి సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే మోదీ వారి వెనకాల దాక్కున్నారని రాహుల్ ఆరోపణ.
2019 ఎన్నికల ప్రచారంలోనే రాహుల్ గాంధీ గుజరాత్‌లో అమిత్‌షా మీద హత్యారోపణ చేశారు. సొహ్రబుద్దీన్ షేక్ నకిలీ ఎన్‌కౌంటర్ బాధ్యత అమిత్ షాదేనని చెప్పడం రాహుల్ ఉద్దేశమేమో కానీ, ఆయనను హత్య చేసిన వానిగా చిత్రించే ప్రయత్నం చేశారు. ఈ ఆరోపణ మీద కూడా పరువు నష్టం కేసు వేశారు. రాహుల్ బెయిల్ తీసుకున్నారు.
కాంగ్రెస్ నేతలకు జ్ఞానం వస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. 2014 ఎన్నికల ప్రచారం సమయంలో మణిశంకర్ అయ్యర్ అనే కాంగ్రెస్ నాయకుడు ‘మోదీ కాంగ్రెస్ సభల దగ్గర తేనీరు అమ్ముకోవాలే తప్ప, ప్రధాని కావడం అసాధ్యం’ అన్నాడు. మార్చి 25న ఆ పార్టీ కార్యదర్శి గాంధీ-నెహ్రూ కుటుంబ వారసురాలు ప్రియాంక ఏమని ట్వీట్ చేశారు? ‘ప్రజలు ఎన్నుకున్న ప్రజాసేవకుడు ప్రజల సమస్యల మీద గొంతు ఎత్తే ప్రయత్నం చేస్తుంటే, ఆదానీ సేవకుడు ఆ గొంతును అణచివేయడానికి చూస్తున్నాడు’ అని. ఇది నిజమైన ప్రజాసేవకులు ఉపయోగించే భాషనే చెప్పాలా? చిన్నచిన్న వృత్తులను అవహేళన చేయడం దురహంకారం కాదా?