– సుజాత గోపగోని, 6302164068
చదువులు భయపెడుతున్నాయి. విద్యార్థుల్లో దడ పుట్టిస్తున్నాయి. తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నాయి. లక్షల రూపాయలు పెట్టి పిల్లల్లో భయాన్ని, ఒత్తిడిని కొనుక్కుం టున్న చందంగా తయారవుతున్నాయి. విద్యార్థుల్లో ఉన్న అవగాహన, విజ్ఞానం బట్టీలు, మార్కులు, ర్యాంకుల వరదలో కొట్టుకుపోతున్నాయి. మొత్తానికి విద్యార్థులు యంత్రాల్లా తయారవుతున్నారు. తెలంగాణలో ఈ పరిస్థితి ఒకింత అధ్వా నంగా ఉంది. కార్పొరేట్ విద్య మాయలో చదువులు అల్లాడిపోతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం విద్యారంగాన్ని వెక్కిరి స్తోంది. ఫలితంగా తల్లిదండ్రుల్లో తెలియని ఓ భయాందోళన నెలకొంది. ఈ పరిస్థితులు అసలు హాస్టల్ చదువులంటేనే తల్లిదండ్రులు భయపడిపోయేలా పరిణమించాయి.
ఓవైపు ర్యాగింగ్, మరోవైపు మార్కుల కోసం అధ్యాపకుల ఒత్తిళ్లు విద్యార్థులను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయి. అయితే సీనియర్ల ఆగడాలు, లేదంటే అధ్యాపకుల అరాచకాలు విద్య కోసం హాస్టళ్లలో చేరే వాళ్ల మనసును కలుషితం చేస్తున్నాయి. తమ గమ్యం ఏంటో కూడా మర్చిపోయే పరిస్థితులను సృష్టిస్తు న్నాయి. తెలంగాణలో గత కొన్నిరోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు సమాజానికి సవాలు విసురుతున్నాయి. అసలు అవి ఆత్మహత్యలా? హత్యలా? అని అందరూ ఆలో చించేలా చేస్తు న్నాయి. కానీ సమాధానాలు మాత్రం లభించడం లేదు. వీటికి మూలం ఎక్కడుంది అనే అంశాలపై ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకుల పంట పండాలని లక్ష్యాలు విధిస్తుండటంతో లెక్చరర్లు బట్టీ చదువులకే మొగ్గు చూపుతున్నారు. అప్పటికే రూపొందించిన మెటీరియల్‌ను విద్యార్థులతో బట్టీ కొట్టిస్తున్నారు. ఫలితంగా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలికితీయకపోగా ఉన్నది కాస్త పోయే రీతిలో కార్పొరేట్ చదువులు కొనసాగుతున్నాయి. ఇక స్పెషల్ సిలబస్ అంటూ ఐఐటీ, జేఈఈ, ఏఐఈఈఈ, నీట్ బ్యాచ్‌ల విద్యార్థులపై చేస్తున్న ఒత్తిడి మాటల్లో చెప్పలేం. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రిళ్లు పొద్దుపోయే వరకు స్పెషల్ క్లాసులంటూ రుద్దుడే.. రుద్దుడు. చదువు.. చదువు తప్ప వేరే ధ్యాస లేకపోవడంతో మానసిక ప్రశాంతత, స్వేచ్ఛ కరువై వారిలో ఉన్న సహజ ప్రతిభకు కూడా ఫుల్ స్టాప్ పడుతోంది.
ఇక హాస్టళ్లలో ఉండే విద్యార్థుల సంగతి.. కొంతమంది ఇష్టంగా చేరితే కొంతమంది అయిష్టంగానే హాస్టళ్లలో చేరుతున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో విద్యనభ్యసించడానికి హాస్టళ్లలో చేరిన విద్యార్థులు ఒక్కసారిగా మారిన వాతావరణాన్ని ఆకంపు చేసుకోలేకపోతున్నారు. అంతకు క్రితం వరకు పాఠశాలల్లో చదువు పూర్తికాగానే ఇంటికి వెళ్లి తల్లిదండ్రుల వద్ద మెలిగిన వాతావరణం ఒక్కసారిగా దూరమవుతుంది. ప్రథమ సంవత్సరంలో చేరిన తర్వాత ఒకటి రెండు వారాలు కొత్తగా, ఉత్సాహంగా అనిపించినా రాను రాను విద్యార్థుల్లో కొంత అలజడి మొదలైపోతుంది. తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడాలన్నా నిర్ణీత సమయం ఉండటంతో ఆయా క్యాంపస్‌ల్లో వేలాది విద్యార్థుల మధ్య తమకెప్పుడు మాట్లాడే సమయం వస్తుందోనని ఆశగా ఎదురుచూస్తుంటారు. ఇక విద్యార్థినుల పరిస్థితి దయనీయం. అప్పుడే కౌమారదశకు రావడం, శారీరకంగా వారిలో వచ్చే మార్పులు, ఇబ్బందులను ఇతరులకు చెప్పుకునేందుకు ఇబ్బందిపడే మానసిక స్థితి వర్ణనాతీతం. ఆదివారం వచ్చినా పుస్తకాలతో మాత్రమే కుస్తీపట్టాలి. దీంతో ఎంతోమంది విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. రెండు సంవత్సరాలు ఎలా గడుస్తాయో! అంటూ స్నేహితులు, క్లాస్‌మెట్స్‌తో చర్చించుకుంటూ రాత్రుళ్లు నిద్రిస్తున్నా అవే ఆలోచనలతో మునిగిపోతుంటారు. ఈ క్రమంలో అధ్యాపకుల ఒత్తిడిని తట్టుకోలేక, ర్యాంకుల వేటలో పరుగెత్తలేక, ఇంటి వద్ద తల్లిదండ్రుల పరిస్థితిని అర్థం చేసుకుని వారికేం సమాధానం చెప్పాలో తెలియక వారిలో వారు మథన పడుతూ కుంగిపోతూ అత్మన్యూనతా భావంలో కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కార్పొరేట్ విద్యా సంస్థల వలలో పడకుండా పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందిం చాలి. స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించాలి. వారిని సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రేరేపించాలి. వారికి దేనిపై ఆసక్తి ఉందో గ్రహించి, ఆ దిశగా వారిలో ప్రోత్సహించాలి.
ఇటీవలి పరిణామాలని గమనిస్తే వరంగల్‌లో మెడిసిన్ విద్యార్థి ప్రీతి ఘటన, హైదరాబాద్ నార్సింగిలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కన్నవాళ్లకు కడుపుకోతను మిగులుస్తున్నాయి. విద్యావ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతున్నాయి. చదువుకునే వ్యవస్థలో ఏం లోపించిందో, ఏం అవసరం ఉందో అర్థమయ్యేందుకు గుణపాఠాలుగా మారుతున్నాయి.
తనపై ర్యాగింగ్ జరిగిన విషయం మెడిసిన్ విద్యార్థి ప్రీతి తల్లిదండ్రులకు చెప్పింది. కానీ, రెండు రకాల భయాలు ఆమె తల్లిదండ్రులను ఆవరించాయి. అప్పటికే ఎంతో ఖర్చుచేసి కూతురుని చదివిస్తున్న తాము ఇప్పటికిప్పుడు చదువు ఆపేస్తే ఆ ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందనుకున్నారు. మరోవైపు.. కాలేజీలో గట్టిగా అడిగితే వేధింపులు ఎక్కువవుతాయని భయపడ్డారు. అందుకే మింగలేక కక్కలేక తమ బాధను లోపలే దాచుకున్నారు. కానీ తమ బిడ్డ దూరం అవుతుందని ఊహించలేక పోయారు.
ప్రీతి ఇంతటి ఘోరమైన నిర్ణయం తీసుకుందంటే దీని వెనక ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆమె చిన్నపిల్ల కాదు. ఒక డాక్టర్. బ్యాచిలర్ డాక్టర్ కోర్సు పూర్తి చేసికొని వైద్యురాలిగా పనిచేస్తుంది కూడా. ఇప్పుడు స్పెషలైజేషన్ కోసం పీజీ మెడిసిన్ కోర్సు అభ్యసిస్తోంది. కాలేజీలు ఎలా ఉంటాయి, చదువులు ఎలా ఉంటాయి తెలియనివి కాదు. అలాగే ర్యాగింగ్ అంటే కూడా అవగాహన లేని అమ్మాయి కాదు. కానీ ఊహించని రీతిలో కడతేరింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని కాలేజీ వర్గాలు చెబుతుంటే.. లేదు హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తు న్నారు. ఏది జరిగినా దానికి కారణం మాత్రం వేధింపులు, ఒత్తిడి అనేది మాత్రం స్పష్టం అవుతుంది. ఇక నార్సింగ్ శ్రీచైతన్య కాలేజీలో అసువులు బాసిన సాత్విక్‌ది మరో కథ. ప్రీతి సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటే.. సాత్విక్ అధ్యాపకుల ఒత్తిడి భరించలేక బలవన్మరణం చెందాడు.
వాతావరణం ఇలా ఎందుకు తయారవు తుంది? సీనియర్లు ర్యాగింగ్ అంటూ జూనియర్లను ఎందుకు వేధిస్తున్నారు? అధ్యాపకులు కూడా విద్యార్థులు స్వతంత్రంగా, ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని ఎందుకు కల్పించలేక పోతున్నారు? ఇక, కార్పొరేట్ యాజమాన్యాలు, అధికారులు, ఉన్నతాధికారులు ఈ పరిస్థితులను ఎందుకు మార్చలేక పోతున్నారు? ఇలా వేసుకుంటూ పోతే అన్ని ప్రశ్నలే ఎదురవుతున్నాయి. వాటికి పరిష్కార మార్గాలు ఉన్నప్పటికీ అవి అమలవుతాయా, లేవా? అనే సందిగ్ధతను లేవనెత్తుతున్నాయి.
ధరావత్ ప్రీతి తన సీనియర్ వేధింపులు భరించలేక ఒత్తిడికి గురైందని తల్లిదండ్రులు, పోలీసులు వెల్లడించారు. అది నిర్ధారణ కూడా అయింది. అయితే మరో కోణం కూడా ఉంది. ప్రీతి ఒత్తిడి వెనక కళాశాల యాజమాన్యం తీసుకునే 50 లక్షల రూపాయల బాండ్ కూడా కారణమంటున్నారు. వైద్య విద్యలో పీజీ సీటు వచ్చిన సమయంలో అడ్మిషన్ బాండ్ కింద 50 లక్షలరూపాయల అగ్రిమెంట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఒకవేళ ఏ కారణాలతోనైనా కోర్సును మధ్యలో వదిలేస్తే విశ్వవిద్యాలయానికి 50 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా బాండ్ తీసుకుంటే అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య విద్యా కోర్సును విద్యార్థులు ఎవరూ మానుకోరని భావించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. పీజీ మెడికల్ సీటు మధ్యలో వదిలేస్తే రూ.20 లక్షలు చెల్లించాలని గత సంవత్సరం దాకా నిబంధన ఉండేది. అయితే, చాలామంది వైద్య విద్యార్థులు మెడికల్ పీజీ కోర్సులను మధ్యలోనే వదిలేస్తున్న కారణంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆ మొత్తాన్ని 50 లక్షల రూపాయలకు పెంచింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒకవేళ ఏవైనా ఇబ్బందులతో చదువు వద్దు అనుకున్న విద్యార్థులు కూడా, వదిలి వెళ్లలేని పరిస్థితి. అటువంటి పరిస్థితినే ప్రీతి కూడా ఎదుర్కొందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ల ఒత్తిడి తట్టుకోలేని ప్రీతి, అందులో నుంచి బయట పడలేని పరిస్థితి. ఒకవేళ చదువు మానేద్దామని భావిస్తే 50లక్షల రూపాయలు యూనివర్సిటీకి చెల్లించాలంటే తన తండ్రి అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి కడతాడని ప్రీతి తీవ్ర ఒత్తిడికి, మనోవేదనకు గురైందని అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మెడికల్ పీజీ విద్యార్థులకు ప్రభుత్వం తప్పనిసరి చేసిన యాభై లక్షల బాండ్ విషయంపై చర్చ జరుగుతోంది. ర్యాగింగ్ భూతంపై కూడా ఉక్కుపాదం మోపాలని, ర్యాగింగ్‌కు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించాలని కోరుతున్నారు.
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్