– పాలంకి సత్య

‘‘ఓటమిని ఎవరూ ఇష్టపడరు. కానీ యుద్ధంలో గెలుపు కోసం కుటిల మార్గాన్ని అనుస రించడం వాంఛనీయం కాదు. జరిగినదేదో జరిగి పోయింది. విజేతకు మీ కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించగలమని యుద్ధభూమిలో బహిరంగంగా ప్రకటించారు. ఏం చెయ్యాలని అనుకుంటున్నారు?’’

‘‘ప్రభూ! మీ ఆజ్ఞకు బద్ధుడను కాగలను.’’

‘‘ఇది నేను ఆజ్ఞాపించవలసిన విషయం కాదు. ధర్మ శాస్త్రవేత్తలు నిర్ణయించవలసిన సంగతి.’’

‘‘మహారాజా, మీరు సూచించినట్లే పండిత సభను ఏర్పాటు చేయగలను’’

పండిత సభలో వాదోపవాదాలయిన తర్వాత యుద్ధ విజేత ఒక స్త్రీ కాబట్టి ఆమె భర్తయే కళింగ సేనను వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. తన ధర్మపత్ని అంగీకారంతో విక్రమాదిత్యుడు కళింగ సేనను పరిణయమాడాడు.

నూతన వధువుతో, తన పట్టమహిషితో పురుషోత్తముడైన జగన్నాథస్వామిని దర్శించుకున్న తర్వాత విక్రమాదిత్యుడు సేనను దక్షిణ దిక్కుగా నడిపించాడు.

* * * * *

వరాహ మిహిరుని గ్రంథ రచన సాగిపోతున్నది. బృహజ్జాతకమనే పేరుతో హోరాశాస్త్రాన్ని ఆరంభించాడు.

ఆదిత్య దాసతనయః తద వాప్తి బోధః

కాపిత్థకే సవితృలబ్ధ వరప్రసాదః

ఆవంతికో మునిమతాన్యవ లోక్య సమ్యక్‌

‌హోరాం వరాహ మిహిరో రుచిరాం చకార

అని గ్రంథాంత శ్లోకాన్ని మొదటగానే రచించాడు. పితరుల కృపా, భగవంతుని దయా ఉంటే ఏ ప్రయత్నమైనా పూర్తి కాగలదని అతని నమ్మకం.

‘ఆదిత్యదాసు కుమారుడూ, ఆయన వద్ద చదువుకున్నవాడూ, కాపిత్థక క్షేత్రంలో సూర్యదేవుని అనుగ్రహం పొందినవాడూ, ఉజ్జయినీవాసీ అయిన వరాహ మిహిరుడు అనేకమంది రుషుల మార్గాలను పరిశీలించి హోరాశాస్త్ర రచనను చేశాడు’ అనే అర్ధమున్న శ్లోకం రాసి•, జనకులకు చూపించాడు.

ఆదిత్యదాసు ఆనందంతో, ‘కుమారా! నీ వంటి పుత్రుని కన్నందుకు నా జన్మ సార్థకమైనది. గురుకులంలో కొలది మందికి విద్య నేర్పడం కన్నా గ్రంథ రచనల ద్వారా అనేకులకు జ్ఞానార్జన చేసే అవకాశం కల్గిస్తున్నావు. నీ ప్రయత్నాలు సర్వదా, సర్వథా సఫలీకృతముగు గాక’ ఆశీర్వదించాడు.

‘పితృదేవుల కృపాకటాక్షములే నాకు శ్రీరామరక్ష’ అని మిహిరుడన్నాడు.

* * * * *

ఆనాటి రాత్రి ‘సిద్ధాంతాలను రాయడం ఆపివేసి హోరాశాస్త్రం ప్రారంభించినారేమి?’ అని భర్తను ప్రశ్నించినది, ఖనా.

‘‘సూర్య సిద్ధాంతం, వశిష్ఠ సిద్ధాంతం, పైతామహ సిద్ధాంతం పూర్తయినాయి. యవన సిద్ధాంతం గురించి రాయనిదే గ్రంథము సంపూర్ణం కాదు. మీ తండ్రిగారి ఇంట నివసించి, యువన గురువుల వద్ద కొంత విద్య అభ్యసించాను. సంపూర్ణంగా నేర్చుకొన డానికి అలెక్సాండ్రియా వెళ్లాలని గురువర్యులు సూచించారు. ఆ నగరమెక్కడ ఉన్నదో… ఆకాశ వీధి తెలిసినంతగా భూమార్గాలు తెలియవు. అందుకే హోరాశాస్త్ర రచన ప్రారంభించాను’’.

‘‘లేఖకులలో ఒకరిగా ఉండవలెనని నా కోరిక… మీరు అనుమతిస్తేనే …!

‘‘వేరొక గ్రంథం కూడా ప్రారంభించబోతున్నాను. నీవు లేఖరిగా ఉండవచ్చును’’.

‘‘ఒకేమారు రెండు పుస్తకాలా?’’

‘‘రాయకూడదా?’’

‘‘తప్పక రాయవచ్చును’’.

వరహ మిహిరుడు ప్రారంభించే సంకేత మివ్వగానే ఖనా భూర్జ పత్రాలనూ, లేఖన సాధనములనూ తీసికొని దీపానికి దగ్గరగా కూర్చున్నది. శృంగార రస ప్రధానమైన కావ్యం చెప్పడం మొదలుపెట్టాడు మిహిరుడు. ఖనా ఆశ్చర్యానందాలలో మునిగిపోయి, లేఖనం ఆపివేసింది. తన భర్త చక్కటి కవిత్వమల్లగలరని ఆమెకు తెలుసు. శాస్త్ర గ్రంథాలను సైతం రమణీయంగా, పాఠక మనోరంజకంగా రచిస్తున్న సంగతి ఆమెకు విదితమే. కానీ ఇప్పుడు రస శిఖరాలను అధిరోహింపచేస్తున్నారే.

‘‘ఖనా’’ భార్య లిఖించడం లేదని గమనించిన మిహిరుడామెను పిలిచాడు. ఖనా మారు పలుకలేదు. మిహిరుడామె వద్దకు వచ్చి, తల నిమిరి, దగ్గరగా తీసుకున్నాడు. ‘‘ఏ పుణ్యఫలమో! మీరు నాకు గురువుగా, భర్తగా లభించారు’’ ఖనా అన్నది.

* * * * *

అలెక్సాండర్‌ ‌శిలా విగ్రహాన్ని చూసిన నాటి నుంచీ జూలియస్‌ ‌సీజర్‌ ‌మనసులో ఆలోచనలు పరిపరి విధాలుగా పోసాగాయి. ముప్పది మూడేండ్లు నిండకముందే అలెక్సాండర్‌ ‌ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకున్నాడు. విశ్వవిజేతగా పేరు గాంచాడు. జీవించి ఉండి ఉంటే ఇంకెన్ని విజయాలను సాధించేవాడో! తనకిప్పుడు ముప్పది రెండేళ్లు. ఇంతవరకూ తాను సాధించినదేమిటి? ఒక చిన్న ప్రాంతం మీద అధికారామా? అలెక్సాండరు కున్న అదృష్టం తనకు లేని మాట నిజమే. అతడు మాసిడోనియా రాజకుమారుడు. వంశ పరంపరగా అతనికి రాజ్యాధికారం లభించినది. రోమ్‌లో రాజరికం లేదు. ఎన్నిక ద్వారానే తాను అధికారం సంపాదించుకోవాలి. సైన్యాధికారం చేజిక్కించు కోవాలి. ఆపైన భూప్రపంచమంతటినీ జయించి, సర్వశాసకునిగా, నియంతగా పరిపాలన చేపట్టాలి. హిస్పానియాలోనే ఉండిపోతే రోమ్‌ ‌నగరంలో ఎన్నికలలో పోటీ పడి అధికారం చేపట్టడం సాధ్యం కాదు.

ఈ ఆలోచన కలగగానే సీజర్‌ ‌రోమ్‌కు తిరిగి వచ్చాడు. చిన్నతనంలో తనను అనేక కష్టాలకు గురిచేసిన సులా దౌహిత్రి పాంపేయాను వివాహం చేసుకున్నాడు. ఈ విషయమందరినీ ఆశ్చర్యపరచినా సీజర్‌ ‌లక్ష్యపెట్టలేదు. మనసులో ఒక్కటే ఆలోచన. ఎన్నికలలో గెలవాలి. గెలుపుకై ధనం వ్యయపరచాలి. ధనమెలా సమకూర్చుకోవాలి? అప్పు చేయడమొక్కటే మార్గంగా కనిపించింది. దొరికిన ప్రతిచోటా రుణం సంగ్రహించి, గెలుపుకై పోరాడాడు.

తనకన్నా బలమైన ప్రత్యర్థులపై సీజర్‌ ‌విజయం సాధించాడు కానీ ఆ ఆనందమెక్కువ కాలం నిలవలేదు. ఏడాదికే పదవీ కాలం ముగిసి పోయింది. హిస్పా నియాకు మళ్లీ వెళ్లవలసి వచ్చింది. ఎన్నికలలో విజయానికై చేసిన అప్పు మిగిలింది. రుణమిచ్చిన వారు వత్తిడి తేసాగారు. రోమ్‌ ‌నగరంలో అత్యంత ధనవంతుడైన క్రాసస్‌ను ఆశ్రయించి, రాజకీయరంగంలో అతని వైపున ఉంటానని మాట ఇచ్చి, రుణదాతల నుంచి విముక్తి పొంది, హిస్పానియాకు తిరిగి వెళ్లిపోయాడు. క్రాసస్‌కు ప్రత్యర్థి అయిన పాంపేకు సీజర్‌ ‌ప్రవర్తన కోపాన్ని తెప్పించింది. ఎన్నికలలో గెలవడమనుకున్నంత సులభమూ, సుఖప్రదమూ కాదని సీజర్‌కి తెలియవచ్చింది. సైనికబలమే నిజమైన బలమని అతడనుకున్నాడు. ధర్మబలమన్నది తెలియని మాట కదా!

హిస్పానియాకు తిరిగి వెళ్లడానికి ముందు సీజర్‌ ‌తన చిరకాల ప్రేయసి సెర్విలియా వద్దకు వెళ్లాడు. ఆమె ముఖం కొంత పక్కకు తిప్పుకుని ‘‘పాంపేయా ప్రియ భర్తకు స్వాగతం’’ అన్నది.

‘‘నేను పాంపేయాకు ప్రియభర్తను కావచ్చును. కానీ ప్రియాతి ప్రియమైన వనితవు నీవే’’.

‘‘మాటలతో మభ్య పెట్టడం నీకు వెన్నతో పెట్టిన విద్య. రోమ్‌ ‌నగరవాసులనే నీ వాక్కుతో లోబరచు కున్నావు కదా!’’

‘‘మాటలతో కాదు చేతలతోనే నిన్ను సుఖ పెట్టగలను’’ అంటూ చేతులు చాచిన సీజర్‌కు దూరంగా వెళ్లి సెర్విలియా ‘‘నా భర్త ఏ క్షణంలోనైనా తిరిగి రావచ్చును’’ అన్నది.

ఇప్పటికి సెలవు. రేపు హిస్పానియాకు వెళ్లవలసి ఉన్నది. ఒక సంవత్సరంలో తిరిగి వస్తాను. అనేక యుద్ధాలలో విజయం కారణముగా నాకు విజయోత్సవాలు జరగగలవు. వాటిని నీవు చూడగలవు’’ అని సీజర్‌ ‌గర్వంగా అన్నాడు.

* * * * *

హిస్పానియాకు వెళ్లిన సీజర్‌ ‌మరింత సైన్యాన్ని సమీకరించి, సర్వసైన్యాధికారిగా కీర్తి నందుకున్నాడు. రెండు సంవత్స రాలు విజయయాత్రలో గడచి పోయినాయి. రోమ్‌ ‌నగరంలో తన విజయోత్స వాలను ఘనంగా జరుపు కోవాలనీ, అదే సమయంలో అధికార సభలో అత్యున్నత స్థానానికి జరిగే ఎన్నికలలో పోటీ చేయాలనీ సీజర్‌ అనుకున్నాడు. కానీ నిబంధనల మేరకు సైన్యాధికారి ఎన్నికలలో పోటీ చేయరాదు. ఏదీ వదులుకోవడం సీజర్‌కు ఇష్టం లేదు. నిబంధనలలో లొసుగు వెతికే ప్రయత్నం సఫలం కాలేదు. చివరకు సభలో స్థానమే ముఖ్యమని నిర్ణయించుకుని, చతుర్విధ ఉపాయాలూ ప్రయోగించి, సీజర్‌ ఎన్నికలో గెలుపొందాడు. ఇక రోమ్‌ ‌రాజ్యమంతటినీ తన ఆధిపత్యంలోనికి తెచ్చుకోవాలి. తనకిదివరలో ధనమిచ్చి ఆడుకున్న క్రాసస్‌, అతని ప్రత్యర్ధి పాంపే ఇద్దరికీ సంధి కుదిర్చి తనవైపు తిప్పుకోవాలి.

యుద్ధంలో ప్రత్యర్థులను ఓడించి, కొల్లగొట్టిన ధనాన్ని తాను హిస్పానియా నుంచి రోమ్‌కు తెచ్చాడు. అందులో కొంత భాగాన్ని క్రాసెస్‌కు ఇచ్చి అతనితో మైత్రిని బలపరచుకోవచ్చును. పాంపేను ఎలా తనవైపుకు తిప్పుకోవాలి! అందుకు జూలియాను ఇచ్చి వివాహం చేయడమే ఏకైక మార్గంగా జూలియస్‌ ‌సీజర్‌కు కనబడింది. శత్రువును మిత్రుడిగా మార్చుకోవడానికి రెండే మార్గాలు. కాంతా, కనకాలలో ఏదో ఒకదానిపై ఆశ కలిగించాలి. జూలియస్‌ ‌సీజర్‌ ‌కన్నా పాంపే అయిదారు సంవత్సరాలు పెద్దవాడు. అధికార వాంఛతో కళ్లు మూసుకుపోయిన సీజర్‌కు ఆ సంగతి కనిపించలేదు.

వయసులో ఎంతో పెద్దవాడితో, ఇదివరలోనే చాలా వివాహాలు జరిగిన వానితో తన వివాహం జరిపించడానికి తండ్రి నిర్ణయించాడని తెలిసిన జూలియా దుఃఖపడింది. తన తల్లి ఉంటే ఈ వివాహం జరగకుండా ఆపగలిగేదా? తన సవతి తల్లి పాంపేయాను అడిగితే ఏమవునో? ఆమెకు తన మీద ప్రేమ ఉండే అవకాశమే లేదు. తన మీద జాలితో ఆమె ప్రయత్నించినా తండ్రి పాంపేతో సంబంధాన్ని వదలుకునే అవకాశముందా?

జూలియా ఇష్టానిష్టాలతో సంబంధం లేకుండా ఆమె వివాహం పాంపేతో జరిగిపోయింది.

క్రాసస్‌, ‌పాంపేలకు జూలియస్‌ ‌సీజర్‌ ‌మైత్రి కుదిర్చాడు. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా ముగ్గురూ కలసి అధికారత్రయంగా ఏర్పడి రోమ్‌ ‌పరిపాలననూ, సైనిక చాలనాన్నీ ప్రారంభించారు. పాంపే తాను ఇదివరలోనే జూడియా (నేటి జోర్దాను), సిరియా దేశాలను జయించి, రోమ్‌ ‌దేశ విజయ స్తంభాలను నాటించి, కట్టడాలు కట్టించిన సంగతి చెప్పాడు.

‘‘ఆ రాజ్యంలో తన గెలుపును స్థిరపరచుకోవాలి. నేను ఉత్తర దిక్కుగా సేనను నడిపి గాలియా (నేటి ఫ్రాన్సు, పరిసర దేశాలు), జెర్మానియా, బ్రిటానికాలను జయించాలని అనుకుంటున్నాను. గ్రీసు, రోమ్‌లవలె అవి నాగరికత వృద్ధి చెందిన ప్రాంతాలు కావు. అనాగరికత, ఆటవిక జాతులు తిరిగే రాజ్యాలను జయిస్తే అక్కడ నివసించేవారిని మన వద్దకు బానిసలుగా తేవచ్చును’ అని సీజర్‌ అన్నాడు.

క్రాసస్‌ ‌సిరియా ప్రాంతానికీ, పాంపే జోర్డానుకీ వెళ్లడానికి నిర్ణయమైనది. అత్యంత ధనిక దేశం ఈజిప్టుపై కూడా తన దృష్టి సారించగలనని పాంపే అన్నాడు.

* * * * *

దక్షిణ దిక్కుగా కదలిన విక్రమాదిత్యుని సేన వరుసగా రాజ్యాలను జయిస్తూ, దక్షిణ సముద్ర తీరం చేరుకున్నది. ‘శ్రీరామచంద్రుడిక్కడనే సేతువును నిర్మించి, లంకేశ్వరుడైన రావణుని యుద్ధంలో నిర్జించి, సీతాదేవిని చెర విడిపించాడు’’ అని ఆ ప్రాంత ప్రజలు తెలియచెప్పారు. నావలలో సముద్రం దాటి సింహళం జయించాలని ఉజ్జయినీ రాజు అనుకుంటున్న సమయంలోనే సింహళేశ్వరుడు తాను యుద్ధం చేయలేననీ, కప్పం చెల్లించగలననీ, తన కుమార్తెను విక్రమునికి భార్యగా సమర్పించగలననీ దూతలను పంపించాడు. సింహళరాజు నుంచి కానుకలను స్వీకరించిన తర్వాత సేన కేరళ దేశానికి మరలి, పశ్చిమ సముద్ర తీరం ప్రక్కగా పయనిస్తూ గోదావరీ తీరాన ఉన్న ప్రతిష్టానపురానికి యోజనం దూరాన విడిసింది.

యుద్ధానికి సన్నద్ధమయ్యే సమయానికి ప్రతిష్టానం వైపు నుండి ధర్మధార వినిపించింది. యుద్ధం చేయబోమని, సంధికి సిద్ధంగా ఉన్నామనీ సంకేతిస్తూ పూరించే శంఖధ్వనే ధర్మధార. ప్రతిష్టానపురాన్ని పరిపాలించే చాళుక్య రాజులు అగ్ని వంశ క్షత్రియులు. పౌరుషానికి పేరెన్నిక గలవారు. వారు ధర్మధార పట్టడం ఏమిటి?

చాళుక్య రాయబారులు వచ్చి విక్రమాదిత్యునితో తమ మహారాజు ఉజ్జయినీ పతిని కలసి సంభాషించాలని కోరుకుంటున్నారని చెప్పారు. విక్రముడు అంగీకరించిన పిదప, చాళుక్యరాజు ఉజ్జయినీ సేనా స్కంధావారానికి వచ్చాడు. పరస్పర అభివాదాలైన తర్వాత చాళుక్య పతి ‘‘నా కుమార్తె నిజ కోసం తమ హస్తాన్ని అర్ధించడానికి వచ్చాను’’ అని అన్నాడు.

విక్రముడు తల పంకించాడు.

‘‘నాకు ఏకైక సంతానం నిజ. మా వంశాచారాన్ని అనుసరించి పాలకునకు కుమారులు లేని పక్షంలో రాజ్యం దౌహిత్రునకు సంక్రమిస్తుంది. ఆ నియమాన్ని అనుసరించి నా అనంతరం నిజకు కలుగబోయే కుమారుడు చాళుక్య వంశానికి దత్తుడయి ప్రతిష్టానపుర సింహాసనం అధిరోహించగలడు. ఈ నిబంధన తమకు సమ్మతము కాగలదని ఆశిస్తున్నాను’’.

‘‘ఈ విషయమై ఆలోచించి నిర్ణయ తెలియ చేయగలం’’ అని చెప్పి విక్రముడు చాళుక్య రాజును వీడు కొలిపాడు.

* * * * *

ఉజ్జయినీ రాజ్యమంత్రి మండలి చాళుక్యులతో వివాహ సంబంధం వైపు మొగ్గు చూపింది. తన తండ్రిగారు గంధర్వసేనులు అగ్నివంశ క్షత్రియులతో వైవాహిక బంధం అభివృద్ధి కారకమని సూచించారు. తన పుత్రులూ, పౌత్రులూ దక్షిణా పథాన్ని పాలించడం మేలే కదా! విక్రముడు చాళుక్య రాజ కుమార్తెను వివాహం చేసికొనడం మంచిదనే నిర్ణయించుకున్నాడు. కానీ ముందుగా వీర అంగీకారం తప్పనిసరి.

విక్రముడు తన ధర్మపత్నితో విషయం ముచ్చటిం చాడు. ఆమె ‘‘నిజ అన్న పేరు వినలేదు. సత్య అన్నది సాధారణమైన నామం’’ అన్నది.

‘‘కావచ్చును… ఒక్కొక్క వంశంలో ఒక్కొక్క సంప్రదాయముంటుంది. నామధేయములైనా అలాగే ఉంటాయేమో! నీవు ఏకైక సంతానమయినా, మీ తండ్రిగారు నన్ను అజయమేరు పాలకునిగా అభిషేకించారు. చాళుక్యుల నియమాలు వేరు. దానికేమి కానీ ఈ వివాహం నీకు సమ్మతమేనా?’’

వీరలక్ష్మీదేవి అంగీకరించినది. విక్రముడు చాళుక్య రాజకన్యను వివాహం చేసుకుని ఉజ్జయిని చేరుకున్నాడు.

* * * * *

ఉజ్జయినీ నగరం చేరుకుని యుద్ధ యాత్రలో ఉన్నప్పుడు సరిగా నిత్య, నైమిత్తిక కర్మనలను చేయలేనందుకు ప్రాయశ్చిత్త హోమ, జప, దానాదులను చేసిన అనంతరం విక్రమాదిత్యుడు పట్టమహిషితో, నూతన వధువలతో తండ్రిగారు గంధర్వసేనులను దర్శించుకుని, విషయములను వివరంగా తెలియజేశాడు.

(సశేషం)

About Author

By editor

Twitter
YOUTUBE