– పాలంకి సత్య

ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన

మరునాటి ఉదయంబు ఆదిత్యదాసు ఆలయానికి వెళ్లి మహాకాళుని దర్శించుకుని, జాముసేపు జపం చేసినాడు. తన కుమారునికీ ఖనాకీ వివాహం జరిపించేందుకు స్వామి అంగీకరించి నట్లుగా ఆయన మనస్సుకు అనిపించింది.

ఇంటికి వచ్చి మిహిరునికి తన అంగీకారాన్ని తెలిపిన తర్వాత ఆదిత్యదాసు డేరియస్‌ ‌పంపిన దూతలతో మాట్లాడాడు. ఖనాను తన ఇంటి కోడలిగా స్వీకరించడానికి తాను సమ్మతిస్తున్నాననీ, రాబోవు చైత్రపూర్ణిమ నాడు అవంతీ నగరంలోనే వివాహం జరిపించాలనీ, ఆ సమయానికి డేరియస్‌, అతని పుత్రులు, బంధుమిత్రులు వధువుతో సహా తమ ఇంటికి రావాలనీ తెలియచెప్పాడు.

దూతలు ఆనందంగా పారశీక నగరానికి పయనమయ్యారు.

* * * * * *

పరదేశంలోనూ, ప్రయాణాలలోనూ విహిత విధులను సరిగా నిర్వర్తించలేకపోయినందుకు మిహిరునకు ప్రాయశ్చిత్త కర్మ నిర్వహించారు. జప, హోమ, దాన క్రియలన్నీ పూర్తయినాక ఆదిత్యదాసు కుమారునితో ‘‘నీవు ఒకసారి విక్రమాదిత్య మహా రాజును సందర్శించి విషయమంతటినీ విన్న వించడం ముఖ్యం. ఖనా భరతఖండంలో జన్మించినా పారసీకుల ఇంట పెరిగింది. మీ వివాహంలో వర్ణ సంకరం లేదు. ఆమె కొన్ని హోమాలు  చేయవలసి ఉంటుది. కానీ రాజాను మతో ధర్మః అన్నారు. ప్రభువు అంగీకరించిన తర్వాత ఎవరూ కాదనలేరు. ఖనా విషయమాయనకు సంపూర్ణంగా తెలియ చేసిరా!’’ అన్నాడు.

మరునాడు మిహిరుడు కోటలోనికి వెళ్లి తన పేరు చెప్పి, మహారాజ సందర్శన కాక్షతో వచ్చానని చెప్పాడు. సాయం సమయంలో తమ ఏకాంత మందిరంలో తమను కలవవచ్చునని విక్రమాదిత్యుడు భటుని ద్వారా సందేశమిచ్చాడు. మిహిరుడు ఇంటికి తిరిగివచ్చి, తండ్రికి విషయాన్ని నివేదించి, సూర్యాస్త మయానికి ముందే రాజప్రాసాదానికి చేరుకున్నాడు. మహారాజు ఆజ్ఞ వలన కాబోలును భటుడు మిహిరుని వెంటనే లోనికి తీసికొనివెళ్లాడు.

విక్రమాదిత్యుని చూసిన వెంటనే మిహిరుడు ‘‘పరమేశ్వరుడు విక్రమాదిత్య మహారాజును అనుగ్రహించుగాక’’ అనే భావంతో ఆశువుగా ఒక శ్లోకం రచించి, చదివాడు. ప్రభువు కనుసన్నపై భటుడు వెలుపలకు వెళ్లిపోయాడు. విక్రముడు లేచి మిహిరుని గాఢాలింగనం చేసికొని ‘‘మిత్రమా, ఎన్నాళ్ల కెన్నాళ్లకు!’’ అన్నాడు.

‘‘ఉజ్జయిని చేరుకున్ననాడే నీ వద్దకు రావలెనని పించినది. కానీ జననీజనకుల దర్శనమూ, ప్రాయశ్చిత్త హోమ నిర్వహణ పూర్తయ్యేవరకూ రాలేకపోయాను.’’

‘‘నీ విద్యాయాత్ర విశేషములేమి? తక్షశిలలో వైద్యశాస్త్ర విషయాలు నేర్చుకొంటానని చెప్పినావు. ఆపైన పారశీక దేశానికి వెళ్లినట్లు తెలిసింది.’’

మిహిరుడు తక్షశిలలో, పారశీకంలో తాను చదువుకున్న విశేషాలను తెలిపినాడు. ‘‘యవన గురువులు ధనం స్వీకరించి కానీ చదువు నేర్పరు. ధనహీనుడైన నేను ఆయనకు మన జ్యోతిషం నేర్పినాను. అందుకు ప్రతిగా వారి శాస్త్రం నాకు నేర్పినారు. మన రాజ్యంలో వలె భోజన సత్రములు లేవు. ఒక పారశీక ధనికుడు నాపై దయతో వసతినీ, భోజనమూ వారింటిలో ఏర్పాటు చేసినారు’’.

‘‘రథం మీద తిరిగి వచ్చితివని వింటిని’’.

‘‘నీకెట్లు తెలిసినది’’ అని అడుగబోయిన మిహిరుడు ‘రాజుల చార చక్షువులు’ అన్న సంగతిని గుర్తుకు తెచ్చుకుని గృహ యజమానియే నాయందు వాత్సల్యంతో శకటమిచ్చి పంపినారు. అందుకే రెండు మాసములలోనే రాగలిగాను’’.

మిహిరుడు మరి కొంతసేపు తన విద్యార్థి జీవితం గురించి వివరించాడు. ఒక పరిచారిక వచ్చి ‘‘మహారాణి వీరలక్ష్మీదేవి తమ దర్శనాన్ని కోరుతున్నారు’’ అని విన్నవించింది.

‘‘మిత్రమా’ సెలవు’’ అన్న మిహిరునితో ‘‘నీ పరిచయం, దర్శనం రాణికి కలుగవద్దా?’’ అని విక్రముడన్నాడు.

మహారాణి విక్రముని మందిరానికి వచ్చి, పరిచారిక ద్వారా తన రాకను తెలియచేసి, విక్రముని అనుమతిపై లోనికి వచ్చింది.

‘‘ప్రేయసీ, అనేక పర్యాయములు నా మిత్రుడు మిహిరుని గురించి నీ వద్ద ప్రస్తావించాను. ఇతడే ఆ మిహిరుడు. నా బహిఃప్రాణం.’’

వీరలక్ష్మిదేవి మిహిరునకు అభివాదం చేసినది. కొంతసేపు సంభాషణ సాగాక, ఆమె, ‘‘ఆర్యపుత్రుల ప్రాణస్నేహితులు మిహిరాచార్యులను మా నగరంలో ఈనాడు ఉండవలసినదిగా కోరుతున్నాను’’ అంది.

ప్రియకాంతను అనుసరిస్తూ విక్రముడు ‘‘అవును మిత్రమా! నేటి రాత్రి ఇక్కడనే ఉండు.’’ అన్నాను.

‘‘ఇంట చెప్పి రాలేదు’’

‘‘గురువర్యులకు నేను వార్తను పంపగలను’’ అన్న విక్రముడు భటుని పిలించి, ఆదిత్యదాసుకు వార్త పంపించాడు. మహారాణి ఆజ్ఞపై పరిచారిక మిహిరునికై ఏర్పాట్లు చేసినది.

ఆనాటి రాత్రి విక్రముడు భార్యను ‘‘ప్రియా, మిహిరుని నగరంలోనే ఉండమన్నదెందుకు?’’ అన్నాడు.

‘‘ప్రభువులు తమ హృదయమును గోప్యంగా ఉంచగలరు. ఇతర హృదయాలలోని ఆలోచనలను గ్రహించగలరు. ఇంత చిన్న విషయం స్ఫురించ లేదా?’’

విక్రముడు ప్రశ్నార్థకంగా చూశాడు.

‘‘మీ ప్రియమిత్రులు తమ వివాహ విషయం మీతో ప్రస్తావించుటకో, మీకు తెలియజేసేందుకో వచ్చారు. వారి ముఖకవళికలు, వారి మాట తీరు కొంత బెరుకుతనాన్ని సూచించాయి. సాధారణ విషయాలైతే బెరుకెందుకు?’’

‘‘మిహిరునికి నావద్ద భయమేల?’’

‘‘భయం కాదు, సిగ్గు’’

‘‘అంతగా హృదయాంతరములోని విషయాలను గ్రహించగలదానివైతే నా మనసులో ఏమున్నదో చెప్పగలవా?

‘‘నేనే కదా!’’ అంటూ విక్రముని చెక్కిలిపై తన చెక్కిలి ఉంచింది.

* * * * * *

మరునాడు మంత్రి, సామంతులతో సమావేశం, మధ్యాహ్నం సంధ్యావందనమూ, భోజనమూ పూర్తయిన తర్వాత విక్రముడు మిహిరునితో కలిసి, ఉద్యానవనంలోకి ప్రవేశించాడు. సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉన్నప్పటికీ చలిగానే ఉన్నది. తరుచ్ఛా యలో శిలా వేదికపై ఆసీనులైనాక మిహిరుడు తాను తక్షశిలలో, పారశీక దేశంలో నేర్చుకున్న విశేషాంశా లను మరింత వివరంగా చెప్పాడు. విక్రముడు తన ఆనందాన్ని వ్యక్త పరుస్తూ ‘‘నీవు నేర్చిన విద్యనంతటినీ గ్రంధస్థం చేస్తే అనేకులకు ఉపయోగకరం కాగలదు’’ అన్నాడు.

‘‘ఇదివరలోనే అనేక గ్రంథములన్నవి కదా!’’

‘‘కావచ్చు… కానీ నీవు వివరించే పద్ధతి బాగున్నది. త్వర లోనే రచనా వ్యాసంగం ప్రారం భించమని నా కోరిక. మా ఆ స్థానంలో జ్యోతిష శాస్త్రవేత్తగా నీవుండి పుస్తక రచన చేయవలసింది. భాషాశాస్త్రంలోనూ, వైద్యశాస్త్రంలోనూ తగిన వారిని కొలువులో నియమించి, చదువుల తల్లి సేవ చేయడమే నా కర్తవ్యమని భావిస్తున్నాను’’.

‘‘మిత్రమా! చక్కటి ఆలోచన. కానీ నన్ను మించిన వారెందరో ఉన్నారు’’.

‘‘ఆ సంగతి నిర్ణయించవలసినది నీవు కాదు’’.

వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నవి’’ అని  మిహిరుడు సంభాషణను మరో దారికి మరల్చాడు.

‘‘ఆకాశంలో మబ్బులు లేవే’’?

‘‘నా యవన జ్యోతిష గురువులకు ఈ విషయం గురించి తెలియచేస్తే వారు ఎంతో సంతోషించారు. అదిగో, ఎదురుగా ఉన్న వృక్షాన్ని చూడు… పాము చెట్టెక్కుతున్నది. వానకు సంకేతమిది. చీమలు గుడ్లు మోసుకుపోవడం వర్ష సూచన అని చెప్పగానే ఖనా ఆశ్చర్యపడింది.

విక్రముడు చిరునవ్వుతో ‘‘ఖనా ఎవరు?’’ అన్నాడు.

మిహిరుడు తబ్బిబ్బయి ‘‘నేనేమన్నాను? మా యవన గురువులు..’’ అంటూ ఉండగా విక్రమా దిత్యుడు ‘‘ఆశ్చర్యపడిన ఆ ఖనా ఎవరు?’’ అన్నాడు.

మిహిరుడు నెమ్మదిగా ‘‘మిత్రమా!’’ అని ఒక్క క్షణమాగి ‘ఈ విషయం తెలియజేయమనే నన్ను తండ్రిగారు నీ వద్దకు పంపించారు’’ అన్నాడు.

‘‘మిహిరా, నా వద్ద భయమేల? వివరంగా చెప్పు’’

మిహిరుడు తాను పారశీక రాజ్యం చేరు కొనడమూ, అక్కడ ఒకరింట ఒక రాత్రికి ఆశ్రయం కోరడమూ, వారింటనే వసతి, భోజనం తానున్న కాలమంతటికీ లభించడమూ చెప్పాడు. గృహ యజమాని కుమార్తె ఖనాకు తాను భారతీయ జ్యోతిశ్శాస్త్రము బోధించిన సంగతి తెలియచేశాడు. ఖనా జన్మ వృత్తాంతమంతా వివరించాడు. ఆమె తండ్రి డేరియస్‌ ‌తన కుమార్తెను వివాహం చేసుకోనడమూ, తన సూచనపై దూతలను తన జనకుల వద్దకు పంపడమూ, ఆయన అంగీకారమూ తెలియజేశాడు.

‘‘తండ్రిగారు ఖనాను నేను వివాహమాడడంలో ధర్మ విరుద్ధమేమీ లేదనీ, కొన్ని హోమాలు నిర్వహించవలసి ఉంటుందనీ చెప్పారు. కానీ నీ సమ్మతి ముఖ్యమని అన్నారు. రాజానుమతో ధర్మః అన్నది నీకు తెలియనిది కాదు. నీ అంగీకారంతో, వీలయితే నీ సమక్షంలో వివాహం జరుగవలెనని వారి కోరిక’’.

‘‘గురువర్యుల ఆజ్ఞను శిరసా వహిస్తాను. ఆమె జన్మచే భారతీయ కన్య. ఈ వివాహం ధర్మ విరుద్ధం కాదు. నేనే దగ్గర ఉండి మీ వివాహం జరిపించ గలను’’.

‘‘మిత్రమా, ధన్యుణ్ణి’’

ప్రకృతి అక్షతలతో ఆశీర్వదిస్తున్నదా అన్నట్లు వాన ప్రారంభమైంది. దూరాన నిలబడ్డ భటులు ఛత్రములతో వారి వద్దకు వచ్చారు.

* * * * * *

మరునాడు విక్రమాదిత్యుడు మిహిరునితో పాటు ఆదిత్యదాసు కుటీరానికి వెళ్లి, గురువుకూ, గురుపత్నికీ నమస్కరించి, వారి అనుమతిపై ఆసీనుడైనాడు.

‘‘గురువర్యా, మిహిరుడు అనేక శాస్త్రాలను అభ్యసించి వచ్చిన సంగతి ఎంతో ఆనందాన్నిచ్చింది. అతనిని అవంతీ రాజ్య గణిత, జ్యోతిషశాస్త్రవేత్తగా నియమించాలని ఉన్నది. మీకు తెలియపరచి సభలో నిర్ణయం ప్రకటించవలెనని మీ వద్దకు వచ్చాను’’.

ఆదిత్యదాసు మనసులో ఆనందము ఉప్పొంగింది. ఆయన ‘‘అవశ్యమట్లే’’ అన్నాడు.

‘‘మిహిరుని వివాహానికి నేను సన్నిహితుడనై ఉండగలను. ఆస్థానంలో శాస్త్రవేత్త అయిన కారణంగా కోటలోని ప్రాసాదమొక్కటి అతని కుటుంబం నివసించేందుకు నిర్దేశితమైనది. తామిద్దరూ మిహిరునితో కలసి అచ్చట నివసించ వలసిందిగా అభ్యర్థిస్తున్నాను.

ఆదిత్యదాసు ‘‘ఆ విషయమై తర్వాత ఆలోచింప వచ్చును. మహారాజ సమక్షంలో మిహిరుని వివాహం జరగడం మా అందరి అదృష్టం’’ అన్నాడు.

‘‘అనుగృహీతుణ్ణి’’ అని విక్రముడు ఒక్కసారి నమస్కరించి, కోటకు దారి తీశాడు.

* * * * * *

మహారాజు ఆజ్ఞపై ఒక మంత్రి సభలో ఒక పత్రం చదివాడు.

‘‘జగన్మాతాపితరులైన పార్వతీపరమేశ్వరులకు నమస్కరించి, పరయార వంశీయుడు, గంధర్వ సేనల పుత్రుడు, విక్రమాదిత్య నామధేయుడు, అవంతీ రాజ్యాధిపతి అయిన మేము నేటి నుంచి ఆదిత్యదాస పుత్రుడైన మిహిరాచార్యుని ఆస్థాన గణిత, జ్యోతిషశాస్త్రవేత్తగా నియమిస్తున్నాము. వారి నివాసమునకై కోటలోని ప్రాసాదమొక్కటి నిర్దేశించడం కూడా అయింది. ప్రాసాదములోని దాస దాసీ జనానికీ, ఇంటి నిర్వహణకూ ధనం రాజ్య కోశాగారం నుండే చెల్లిస్తారు.’’ అని మంత్రి చదివిన వెంటనే సభలో జయజయధ్వానాలు, కరతాళధ్వనులు వినబడినాయి.

సద్దుమణిగిన తర్వాత మంత్రి ‘‘పరమార వంశీయులు వరహ లాంఛనులు. ఆది వారహమూర్తి భూదేవిని రక్షించినట్లే మాకు భూ భారం వహించ వలసిన ఆవశ్యకతను తెలియచేయుటకై వరాహ లాంఛనమిచ్చారు. నేటి నుంచి మిహిరాచార్యులు కూడా వరాహ లాంఛనులు కాగలరని మేము ప్రకటిస్తున్నాము. వారికపై వరాహమిహిరులని పిలవబడుదురు గాక’’ అని పత్రాన్ని చదివాడు.

రాజసభలో వరాహ మిహిరుని మహారాజు స్వయంగా సత్కరించాడు. ఛాయాదేవి పుత్రోత్సా హంతో పొంగిపోయినది. ఆదిత్యదాసు పుత్రుడు తనను మించినవాడయినందుకు సంతోషించాడు.

* * * * * *

విక్రమాదిత్యుని అభ్యర్ధనపై, మిహిరుని కోరికపై ఛాయాదేవీ, ఆదిత్యదాసులు ప్రాసాదములోనే నివసించసాగారు. గురుకుల నిర్వహణ మేడ వెనుకగా ఉన్న చిన్న ఇంటిలో జరుగుతున్నది. మిహిరుడు గ్రంథ రచనలో నిమగ్నుడైనాడు. శాస్త్ర విజ్ఞానమే కాక, కవితా రచన కూడా అతని సొత్తు. సుందరమైన భాషలో, సరళమైన శైలిలో అతడు గ్రంథ రచన ఆరంభించినాడు. మహారాజు అయిదుగురు లేఖకులను మిహిరుని వద్దకు పంపాడు. వరాహ మిహిరుడు చెబుతుండగా వారు రాయసాగారు.

సృష్టికర్త బ్రహ్మదేవుడు. ఆయన పేర ప్రసిద్ధమైన పైతామహ సిద్ధాంతంతో తాను రచన ఆరంభించ గలనని తండ్రికి చెప్పి, ఆయన ఆశీర్వాదములను పొందాడు. ఆపై విక్రమాదిత్యునికి విషయాన్ని తెలిపి, అనుమతి స్వీకరించి గ్రంథరచన ప్రారంభించాడు.

ఆదిత్యదాసు గురుకుల నిర్వహణ, వరాహ మిహిరుడు గ్రంథరచన చేస్తుండగా ఛాయాదేవి వివాహ ఏర్పాట్లు ప్రారంభించింది. ధనవంతుల ఇంట పెరిగిన యువతి సాధారణ కుటీరంలో ఎట్లు నివసించగలదో అని తాను భయపడినది. కోడలు ఇంట అడుగు పెట్టే వేళా విశేషము కాబోలును ప్రాసాద జీవనమూ, దాస దాసీ జనమూ, పంచ భక్ష్య పరమాన్నములతో భోజనమూ నేడే ఏర్పడినవి. భగవంతుని కృపా విశేషమని ఆమె అనుకున్నది.

* * * * * *

చైత్ర మాసారంభానికి డేరియస్‌ ‌తన పుత్రులతో, ఖనాతో, బంధుమిత్రులతో పరిచారకగణంతో ఉజ్జయిని చేరుకున్నాడు. మహారాజు అనుమతితో విశాలమైన మైదానంలో గుడారాలు వేసుకుని, వాటిలో నివసించసాగాడు. వ్యాపారరీత్యా అనేక రాజ్యాలలో పర్యటించిన డేరియస్‌కూ, అతని కుమారులకూ గుడారాలలో నివసించడం అసౌకర్యం కాదు. ఉభయ భాషా పరిజ్ఞానమున్న వారితో కలసి డేరియస్‌ ‌కుటుంబ సమేతంగా ఆదిత్యదాసు వద్దకు వెళ్లాడు. మిహిరుడు తాము నివసించేది చిన్న కుటీరమన్నాడే! ఈ భవంతి ఏమి?

డేరియస్‌ ఆలోచనను గ్రహించినట్లుగా ఆదిత్యదాసు అతనితో విక్రమాదిత్య మహారాజు మిహిరుని ఆస్థాన జ్యోతిశ్శాస్త్రవేత్తగా నియమించిన సంగతీ, ప్రభువే నివాసానికి ప్రాసాదాన్ని అనుగ్ర హించిన సంగతీ చెప్పాడు. కాబోయే వియ్యంకుల మధ్య భరతఖండ, పారశీక సంస్కృతుల గురించిన సంభాషణ జరిగినది.

ఖనాను ఛాయాదేవి గృహాంతర్భానికి తీసుకొని వెళ్లింది. కాబోయే అత్తగారికి ఖనా భారతీయ పద్ధతిలో నమస్కరించింది. ఆమె సంస్కృత భాషా పరిజ్ఞానం ఛాయాదేవిని ఆనందపరచినది. ‘‘నీతో ఏ విధంగా సంభాషించాలో అని భయపడ్డాను’’ అన్న ఆమెతో ఖనా తాను తక్షశిలలో సంస్కృతమభ్యసించాలని చెప్పింది.

About Author

By editor

Twitter
YOUTUBE