– వల్లూరు జయప్రకాష్‌ ‌నారాయణ

శాసనమండలి ఎన్నికల్లో తమ అభ్యర్థులను ఏకగ్రీవం చేసుకునేందుకు వైసీపీ విపక్షాల అభ్యర్థులపై సామదానభేదదండోపాయాలు ప్రయోగి స్తోంది. విపక్షాలకు పడే ఓట్లతో ప్రజాగ్రహం బయటకు కనిపిస్తుందనే యోచనతో పోలింగ్‌ ‌జరగకుండా ఏకగ్రీవాలకు వత్తిడి తెస్తోంది. ఈ దాష్టీకం కొత్తకాదు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, శాసనసభ, పార్లమెంటు ఉపఎన్నికల సందర్భంగా ఆ పార్టీ కొనసాగిస్తున్నదే. విపక్షాలను ఎన్నికల్లో పోటీ చేయనీయడం లేదు. ఏకగ్రీవం పేరుతో విపక్షాల అభ్యర్ధులు నామినేషన్ల్ వేయకుండా వైసీపీ గుండాయిజం, రౌడీయిజం చేస్తోంది. నామినేషన్‌ ‌పత్రాలను చింపేయడం, బెదిరింపులకు దిగడం, భౌతికదాడులు చేయడం, పోలీసులతో అక్రమ కేసులు పెట్టించడం అందరూ చూశారు. దొంగ ఓటరు ఐడీలను సృష్టించి ఎన్నికల్లో ఓట్లు వేయిస్తుండగా విపక్షాలు పట్టుకున్నా అధికార పక్ష (ప్రభుత్వ) దౌర్జన్యానికి భయపడి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ‌కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు శాసనమండలిలో సభ్యుల భర్తీకై ఎన్నికలు జరుగనున్నాయి.

తమ మాట నెగ్గలేదన్న కోపంతో మండలినే రద్దు చేసేంతవరకు వెళ్లిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. ప్రాథమిక విద్యను అందించడంలో మాతృభాషను కాదని ఆంగ్లాన్ని ప్రవేశపెట్టడం నుంచి అమరావతిని రాజధానిగా కాదని 3 రాజధానుల వరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు శాసనమండలిలో తిరస్కారానికి గురికావడంతో వ్యవహారం మండలిని రద్దుచేసే దాకా వెళ్లింది. తమ నిర్ణయాలను వ్యతిరేకించేవారు మండలిలో ఉండరాదన్నది ఆ పార్టీ అభిప్రాయం. అయితే అదే మండలిలో తమ సభ్యుల సంఖ్య పెరగడంతో దాని పునరుద్ధరణకు శాసనసభలో తీర్మానం చేసింది. ప్రస్తుతం ఖాళీ అయిన 13 ఎమ్మెల్సీ స్ధానాలన్నిటిని చేజిక్కించుకోవాలని తీవ్ర వ్రయత్నాలు చేస్తోంది. స్ధానిక సంస్థలు, ఉప ఎన్నికల్లో మాదిరిగానే ఇక్కడ కూడా రౌడీయిజం, గుండా యిజం, అధికారదుర్వినియోగానికి పాల్పడుతోంది.

రాష్ట్రంలో ఖాళీ అయిన 13 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 9న ఎన్నికల షెడ్యూల్‌ ‌ప్రకటించింది. 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలు, మూడు గ్రాడ్యుయేట్‌, ‌రెండు టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 16వ తేదీన నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు 23వ తేదీ తుదిగడువు కాగా, 24న వాటిని పరిశీలించారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 27. మార్చి 13న పోలింగ్‌ ‌జరుగుతుంది. 16న ఓట్లు లెక్కిస్తారు. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు; ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు, పట్టభద్రుల నియోజకవర్గాలకు విషయానికి వస్తే.. 1. ప్రకాశం- నెల్లూరు-చిత్తూరు, 2. కడప-అనంతపురం- కర్నూలు, 3. శ్రీకాకుళం-విజయనగరం- విశాఖ పట్నం స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

రద్దు…పునరుద్ధరణల ‘మండలి’..?

శాసనమండలిలో అధికారపక్షానికి బలం లేక బిల్లులు వీగిపోతుండడంతో మండలి రద్దుకు వైసీపీ ప్రభుత్వం 2020 జనవరిలో శాసనసభలో చేసిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదానికి పంపగా, అది అక్కడ పరిశీలనలో ఉంది. ప్రజాసంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలకు ‘మండలి’ అడ్డుపడుతోందని, శాసన మండలి వల్ల ఎవరికీ ఉపయోగం లేదని ముఖ్య మంత్రి నుంచి మంత్రులు, శాసనసభ్యుల వరకు ఆ రోజు వ్యాఖ్యానించారు. చట్టాలకు సంబంధించి ‘మండలి’ సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే అధికారపార్టీకి మండలిలో మెజార్టీ రావడంతో శాసనమండలి రద్దు తీర్మానాన్ని 2021 నవంబరులో వెనక్కి తీసుకుంది.

ఏకగ్రీవం పేరుతో దౌర్జన్యం…

స్థానిక సంస్థల, ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ ‌నియోజకవర్గాల ఎన్నికలను సాధ్యమైనంత మేర తన అనుచరులతో ఏకగ్రీవం చేసి విపక్షాల అభ్యర్థులను మండలిలో అడుగుపెట్టనివ్వరాదనే ఆలోచనతో అధికార పార్టీ వ్యవహరిస్తోంది. ఇందుకోసం వైసీపీయేతర అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుపడుతోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా పలు జిల్లాల్లో విపక్షాల అభ్యర్థులు ముసుగులు వేసుకుని నామినేషన్లు వేసేందుకు ప్రయత్నించారు. వారితో నామినేషన్లను ఉపసంహరింప చేసేందుకు వైసీపీ నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఆ అభ్యర్థుల బలం, బలహీనతల ఆధారంగా అధికారం ఉపయోగించి వివిధ కోణాల్లో బల ప్రయోగం చేస్తున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో 9 స్థానాలకు ఎన్నికలు జరగవలసి ఉండగా, ఈ రకమైన వత్తిళ్లతో అధికారపక్ష అభ్యర్థులు ఐదు స్థానాల్లో ఏకగ్రీవానికి మార్గం సుగమం చేసుకుంటున్నారు.

నామినేషన్లు తిరస్కరించి ఏకగ్రీవాలు

వైసీపీ రౌడీయిజం ఎలా ఉందంటే…! ఎన్నికల అధికారులు అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి ప్రత్యర్థుల నామినేషన్‌ ‌పత్రాలను ఏదో ఒక సాకు చూపి తిరస్కరిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్‌ ‌కడప జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ ‌పత్రాల్లో బలపరిచిన వారి సంతకాలు ఫోర్జరీవంటూ ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. దీంతో ఇక్కడ వైసీపీ అభ్యర్థి పి.రామ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైంది. అనంతపురం జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి వేలూరు రంగయ్య నామినేషన్‌ను అధికారులు పరిశీలనలో తిరస్కరించడం అక్కడ అధికారపక్ష అభ్యర్థి ఎస్‌.‌మంగమ్మ, చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం స్వతంత్ర అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్‌ ‌తిరస్కరణ పాలు కావడంతో వైసీపీ అభ్యర్థి సిపాయి సుబ్రహ్మణ్యం ఏకగ్రీవం కానున్నారు. నె•ల్లూరు జిల్లాలో కూడా అభ్యర్థిని బలపర్చిన వారి సంతకం ఫోర్జరీ అనే అభియోగంతో నామినేషన్‌ను తిరస్కరించడంతో వైసీపీ అభ్యర్థి మేరుగ మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు వీలుచిక్కింది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి చెందిన కడలి శ్రీదుర్గ, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను సాంకేతిక కారణాలతో అధికారులు తిరస్కరించ డంతో కుడుపూడి సూర్యనారాయణరావు మాత్రమే పోటీలో మిగిలారు. ఇలా ఇప్పటివరకు కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో కేవలం వైసీపీ అభ్యర్థులు మాత్రమే మిగలడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గంలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలవడంతో పోటీ అనివార్యంగా కనపడుతోంది. వీరు ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో అధికార పార్టీ నేతలు గాలిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి ఒకరు బరిలో ఉండగా, పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఇక మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో మాత్రం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ ఐదు నియోజకవర్గాలు ఏకగ్రీవం చేయడం అసాధ్యం.

ప్రజావ్యతిరేకత బహిర్గతం కానీయకుండా…

వాస్తవానికి స్థానిక సంస్థల్లో అధికార పార్టీ అభ్యర్థులే ఎక్కువ శాతం ఉన్నారు. గెలుపు నల్లేరుపై నడకే. కానీ ఇటీవల అధికార పార్టీపై ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో పోలింగ్‌ ‌జరిగితే ఆ ప్రభావం పడుతుందేమోనని వైసీపీ నేతలు భయపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాలుగేళ్లలో అన్ని విధాల వైఫల్యం చెందింది. ఒక్క అభివృద్ధిపని కూడా చేయలేదు. ఒక్క సాగునీటి ప్రాజెక్టును చేపట్టలేదు. పాతవాటిని పూర్తిచేయలేదు. సంక్షేమం పేరు చెప్పి అప్పులు తెచ్చి నగదు పంచి ఓట్లు కొనుగోలుచేస్తున్నారు. వనరులు దోచేస్తున్నారు. పన్నుల భారం, విద్యుత్‌ ‌ఛార్జీలు, పెట్రోలు ధరల పెంపుతో జనం ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇసుక పాలసీ పేరుతో తమ కడుపులు కొట్టారని నిర్మాణరంగ కార్మికులు మండి పడుతున్నారు. నాసిరకం మద్యాన్ని రెండు రెట్లు ధరలు పెంచి ప్రభుత్వమే అమ్ముతూ మద్యం నిషేధ హామీని గాలికి వదిలేసింది. ఉద్యోగ ఖాళీల భర్తీపై నిరుద్యోగులకు, పాత పెన్షన్‌ ‌విధానం అమలు చేస్తామని ఉద్యోగులకు, సర్వీసును క్రమబద్ధీకరి స్తామని కాంట్రాక్టు ఉద్యోగులు ఇచ్చిన హామీలుకు నోచలేదు. స్థానిక సంస్థల నిధులను దారి మళ్లించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు దిగుతూ, పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారు.

నిబంధనల ఉల్లంఘనలు

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైసీపీ అడుగ డుగునా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల కోడ్‌ను ఏ మాత్రం పట్టించుకోకుండా, వివిధ పథకాల పేరుతో ఓటర్లను ప్రభుత్వం ప్రలోభ పెడుతోంది. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించు కోవడంతో పాటు ఓటర్లను ఆకర్షించడానికి కానుకలు పంచిపెడు తోందని విపక్షాలు అంటున్నాయి. సీఎం జగన్మోహన్‌ ‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 2011 మంది జూనియర్‌ ‌న్యాయవాదులకు ‘లా నేస్తం’ పథకం కింద రూ. కోటి 55 వేలు వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం ప్రచార ఆర్భాటం కోసం మరో కోటి రూపాయలకుపైగా ఖర్చు చేయడంపై ప్రతిపక్షాలు విమర్శలు సంధించాయి. గతంలో ఎమ్మెల్సీ ఓట్ల చేర్పింపులో వాలంటీర్ల పాత్రపై విమర్శలు వచ్చాయి. అధికార పార్టీకి అనుకూలంగా దొంగ ఓటర్లను పెద్దఎత్తున చేర్చినట్లు ప్రచారముంది. అనుకూలమైన అధికారులను ఆయా ప్రాంతాలకు బదిలీ చేయడాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏపీఎస్‌ఈఆర్టీ సంచాల కులుగా ఉన్న ప్రతాప్‌ ‌రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల ముందు హడావిడిగా కడప ఆర్జేడీ (పాఠశాల విద్య)గా ప్రభుత్వం బదిలీ చేసింది.

వైసీపీ అనుకూల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారెడ్డి గెలుపు కోసం ఆయన బహిరంగంగా సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి (వీసీ) పీవీజీడీ ప్రసాదరెడ్డి సైతం అక్కడి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. విశాఖ దసపల్లా హోటల్లో వైసీపీ ముఖ్యనేతలు ఏర్పాటు చేసిన సమావేశానికి వీసీ ప్రసాదరెడ్డి తన హోదాకు భిన్నంగా హాజరు కావడంపై విద్యార్థి, యువజన సంఘాలు తీవ్ర నిరసన తెలిపాయి. ప్రతాపరెడ్డి, ప్రసాదరెడ్డిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌, ఎన్నికల కమిషన్‌కు ఉపాధ్యాయ సంఘాలు, ప్రతిపక్షాల ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.

బీజేపీ తరపు అభ్యర్థులు….

భారతీయ జనతా పార్టీ మూడు పట్టభద్రుల ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం పట్టభద్రుల నియోజక వర్గం నుండి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ వీవీఎన్‌ ‌మాధవ్‌ని తిరిగి ఎంపిక చేసింది. ప్రకాశం నెల్లూరు చిత్తూరు నియోజకవర్గానికి సన్నపురెడ్డి దయాకర్‌ ‌రెడ్డి, కడప అనంతపూర్‌ ‌కర్నూలు నియోజకవర్గానికి నాగరూరు రాఘవేంద్రను ఎంపిక చేసింది.

ఓటు లేని సీఎం…

 పశ్చిమరాయలసీమ నియోజకవర్గానికి చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డికి అక్కడ పట్టభద్రుల ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. వైసీపీ రాష్ట్ర అధినేతగా, సొంత పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు మేలు కలిగేలా ఓటు నమోదు చేసుకోనప్పుడు, నియోజకవర్గ పరిధిలోని ఓటర్లను ఎలా ఓటు అడుగుతారో చెప్పాలని విపక్షాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. దీన్ని బట్టి మండలి ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు వైసీపీ కోల్పోయిందని కూడా అంటున్నాయి.

వ్యాసకర్త: ఛైర్మన్‌,‌సెంట్రల్‌ ‌లేబర్‌ ‌వెల్ఫేర్‌ ‌బోర్డు, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ.

About Author

By editor

Twitter
YOUTUBE