సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌  ‌వైశాఖ బహుళ చతుర్దశి – 20 మార్చి 2023, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


‌ధర్మధ్వజాన్ని రెపరెపలాడిస్తూ సాంస్కృతిక, సామాజిక చైతన్యాన్ని జ్వలింప చేస్తూ ఉంటాయి మన పండుగలు. వాటిలో ఉగాది ఎలాంటిది? దీర్ఘరాత్రులు వెళ్లిపోయిన తరువాత తూర్పు కొండలలో విచ్చుకునే ఉషోదయాలను వీక్షించమని చెబుతుంది. భవిష్యత్తు మీద మనందరిలో తిరుగులేని విశ్వాసాన్ని నిర్మిస్తుంది. కాలగమనంలో చీకటియుగాలు ఎంత సహజమో, వెలుగుల వెల్లువలూ అంతే నిజం. ఉగాది సందేశం ఇదే. ఆ పండుగ తాత్త్వికత, ఆ రోజున స్వీకరించే షడ్రుచుల ప్రసాదం ఇస్తున్న సందేశం ఏమిటి? భారతీయ పురాణాలే కాదు, చరిత్రల సారాంశమూ వాటిలో మిళితమై ఉన్నాయి. అలాంటి ఉగాది రోజున జన్మించారు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వ్యవస్థాపకులు పరమపూజనీయ డాక్టర్‌ ‌కేశవరావ్‌ ‌బలీరాం హెడ్గేవార్‌. ఈ ‌సందర్భం నిశ్చయంగా ఈ పండుగకు మరో అమృతప్రాయమైన ప్రాధాన్యాన్ని సంతరించి పెట్టింది.

శతాబ్దాలుగా భారతావని మీద ఆవరించిన చిమ్మచీకటి తొలగి, కొత్త సూర్యోదయాన్ని దర్శించడం ఎప్పుడు సాధ్యం కాగలదని డాక్టర్‌జీ వేసుకున్న ప్రశ్నకు సమాధానమే-సంఘటిత హిందూ సమాజం. హిందువుల ఐక్యతే ఈ దేశానికి నవోదయం. అందుకు నాటి చీకట్లని తిడుతూ కూర్చోలేదాయన. కొత్త ఉషస్సును స్వాగతించడానికి సంఘశాఖలనే చిరుజ్యోతులను వెలిగించే మహా యజ్ఞానికి అత్యంత వాస్తవిక, చారిత్రక దృష్టితో డాక్టర్‌జీ శ్రీకారం చుట్టారు. ఈ యజ్ఞం వందేళ్ల శుభ సందర్భానికి చేరువవుతున్న తరుణంలో ఈ సువిశాల భారతంలో లక్ష ప్రదేశాలకు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చేరాలని నేటి పెద్దలు ఆకాంక్షిస్తున్నారు. డాక్టర్‌జీకి ఇదొక గొప్ప నివాళి. ఆర్‌ఎస్‌ఎస్‌, ఆటుపోట్ల మధ్య సాగిన ఆ మహా సంస్థ ప్రస్థానం, తిరుగులేని పోరాట స్ఫూర్తితో ఇంతవరకు సాధించిన సానుకూల విజయ పరంపర, భారతీయత మీద దాని ప్రభావం ఇప్పుడు ఓ ప్రపంచ అద్భుతం. దీనికి తొలి అడుగు డాక్టర్‌జీదే. సొంత నేల విడిచి, పరాయి సంస్కృతిని పట్టుకుని సాము చేస్తున్న భారతీయ సమాజం నిజంగా ఎటు సాగాలో నిర్దిష్టంగా, నిర్దుష్టంగా నిర్దేశించిన తొలి అడుగు అది. వారి ప్రతి అడుగు ఒక నిరుపమాన, నిర్మాణాత్మక సందేశమే.

డాక్టర్‌జీ పూరించిన శంఖారావం భారతీయ సమాజం చెవులలో పడడానికి దాదాపు 98 ఏళ్లు పట్టింది. ధార్మిక పునాదితో, చరిత్ర చెప్పే గుణపాఠంతో, తాను ప్రత్యక్షంగా వీక్షించిన స్వాతంత్య్రోద్యమ కాలపు చేదు వాస్తవాలతో డాక్టర్‌జీ ఇచ్చిన అమృతోపమానమైన ఆ సందేశం హిందూ సోదరుల గుండెలను తాకడానికి ఇంతకాలం పట్టింది. ఏడెనిమిది శతాబ్దాల బానిసత్వం, పరాయి పాలన; వాటి ఫలితంగా జరిగిన విలువల విధ్వంసం ఈ ఘోర బధిరత్వానికి మూలం. హిందువులు హిందువుల మని చెప్పుకునే చొరవా లేదు. మేం హిందువులమని చెప్పుకుందామన్న ఆత్మగౌరవ వ్యక్తీకరణా లేదు. కానీ, ఔను! మేం మహమ్మదీయులం, మేం వేరు, ఈ దేశంలో మాకో ముక్క కావాలని వారు విభజించుకుపోవడం ఇటీవలి చరిత్రే. ఈశాన్య భారత పరిస్థితి అంతదాకా వచ్చినా, క్రైస్తవానికి భంగపాటు ఎదురైందంటే కారణం పెరిగిన హిందూ చైతన్యమే. అది ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కృషి ఫలితం. స్వయంసేవకుల త్యాగఫలం. కశ్మీర్‌ ‌భారతదేశానికి మకుటాయమానమని చరిత్ర ఘోషిస్తున్నా, వాస్తవాలు గొంతెత్తుతున్నా అక్కడి ప్రజలను ఇంకా నాన్చకుండా ప్రధాన స్రవంతి భారతీయులతో మమేకం చేయడం వెనుక ఉన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సిద్ధాంత స్ఫూర్తి ఒక్కటే.

మన పురోగతికి మన గతం, దాని తాత్త్వికత; మన ధర్మం, అది ఇచ్చే దృష్టి చోదకశక్తిగా ఉండాలన్నదే డాక్టర్‌జీ సందేశమని అర్ధమవుతుంది. భారతీయమైన ఆలోచన భారతీయతకు శ్రీరామరక్ష అన్న సూత్రంతో సాగుతున్న సంస్థ సంఘం. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌లేని ఆధునిక హిందూ సమాజం మనుగడను ఊహించడానికి ఇవాళ ఎవరికీ మనస్కరించడం లేదన్నది వాస్తవం. ఆర్‌ఎస్‌ఎస్‌ ఇవాళ హిందూ సమాజపు గుండె లయ. ఇందుకు మూల పురుషుడు డాక్టర్‌జీ. వారి సానుకూల దృక్పథం. అందుకే డాక్టర్‌జీ జయంతిని కూడా వెంటపెట్టుకుని వచ్చే ప్రతి ఉగాది భారతీయులకు ప్రత్యేకమైన పండుగ.

About Author

By editor

Twitter
YOUTUBE