– క్రాంతి

మనిషిని కుక్క  కరిస్తే వార్త కాదు. మనిషి కుక్కను కరిస్తే వార్త అని జర్నలిజం విద్యార్థులకు బోధించేవారు. కాలం మారింది. కుక్కలు కరిచే స్థాయి నుంచి ప్రాణాలు తీసే స్థాయికి చేరాయి. అందుకే కుక్కలు మనుషులను కరచిన ఘటనలు టీవీల్లో, పత్రికల్లో ప్రధాన వార్తలుగా మారుతున్నాయి. దీన్నిబట్టే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో నాలుగేళ్ల బాలుడు కుక్కల దాడిలో మృతి చెందిన దుర్ఘటన పెద్ద చర్చకే దారి తీసింది. ఈ దుర్ఘటన మిమ్మల్ని కదిలించలేదా అని కోర్టు అధికారులను ప్రశ్నించింది. కుక్కల దాడిలో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వ యంత్రాంగం కదలక తప్పలేదు. ఆగమేఘాల మీద చర్యలు ప్రారంభమయ్యాయి.

శునకాలు విశ్వాసానికి ప్రతీక. పెంపుడు శునకాలతో పెద్ద సమస్య లేదు. ఎవరికీ పట్టని వీధి కుక్కలతోనే సమస్య. విచ్చలవిడిగా సంచరించే ఈ కుక్కల మానసిక స్థితి ఎప్పుటికప్పుడు మారుతూ ఉంటుంది. ఫిబ్రవరి 19వ తేదీన హైదరాబాద్‌, అం‌బర్‌పేట ఆరో నంబర్‌ ‌బస్టాప్‌ ‌సమీపంలో జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ ప్రజల దృష్టిలో పడింది.

నిజామాబాద్‌ ‌జిల్లా ఇందల్వాయికి చెందిన గంగాధర్‌ ఇక్కడ కార్‌ ‌సర్వీసింగ్‌ ‌సెంటర్‌లో వాచ్‌మన్‌. ఇద్దరు పిల్లలు. ఆరేళ్ల క•తురు, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్‌ ఉన్నారు. ఈ ఇద్దరితో గంగాధర్‌ ‌తాను పనిచేసే కారు సర్వీసింగ్‌ ‌సెంటర్‌ ‌వద్దకు వచ్చాడు. ఆ సమయంలో బాలుని మీద వీధి కుక్కలు దాడి చేశాయి. కొందరు స్థానికులు ప్రదీప్‌ను ఆదుకుని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రదీప్‌ ‌మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని కదిలించింది. పసిబిడ్డ ప్రదీప్‌ని పీక్కు తిన్న రాకాసి కుక్కల దాడి జనం కంటి మీద కునుకులేకుండా చేసింది. తమ చుట్టూ ఉండే పసిపిల్లల ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో తెలియని పరిస్థితిలోకి నగర వాసుల్ని నెట్టేసింది.

పెరిగిపోయిన కుక్క కాట్లు

అంబర్‌పేట ఘటన మొదటిది కాదు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లో కుక్క కాట్లు సర్వసాధారణ మయ్యాయి. బస్తీలు, కాలనీలు వీధుల్లో పెద్ద సంఖ్యలు కుక్కలు కనిపిస్తున్నాయి. కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. బాటసారులు, వాహనాలపై వెళ్లుతున్నవారి వెంటపడి మరీ కరుస్తున్నాయి. రాత్రే కాదు పగలు కూడా బయటి రావాలంటే జనం వణికిపోతున్నారు. కాలినడకన వెళ్లాలంటే భయపడుతున్నారు మార్నింగ్‌ ‌వాక్‌కి వచ్చినవారినీ, రాత్రి విధుల నుంచి తిరిగి వచ్చే వారినీ అవి వదిలిపెట్టడం లేదు.

మేడ్చల్‌ ‌మల్కారం పరిధిలో ఇటీవల పాఠశాలకు వెళ్తున్న ఏడేళ్ల విద్యార్థిపై వీధి కుక్కలు దాడి చేసి కాలును తీవ్రంగా గాయపరిచాయి. స్థానికులు అడ్డుకోవడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది. ఓల్డ్ అల్వాల్‌లోని ప్రెసిడెన్సీ కాలనీలో వీధికుక్కలు 20 మందిని కరిచాయి. ఆ కాలనీ కాపలాదారుడి నాలుగు సంవత్సరాల కుమారుడి కండ పీకేయడంతో నెల రోజులు ఆసుపత్రిలో చికిత్స అందించి రక్షించారు. చికిత్సకైన ఖర్చు రూ. లక్షను కాలనీ వాసులందరూ విరాళాలు సేకరించి భరించారు. కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీవో టౌన్‌షిప్‌లో మూడు వారాల క్రితం ఐదేళ్ల బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో శునకాలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. టౌన్‌షిప్‌లో కుక్కల బెడద నుంచి రక్షించాలని కోరుతూ రక్షణోద్యోగులు ఇటీవల ఆందోళన నిర్వహించారు.

 మహానగరంలో 2.75 లక్షల శునకాలు

2022 గణాంకాల ప్రకారం కుక్క కాటు కేసుల్లో తెలంగాణ రాష్ట్రం 8వ స్థానంలో ఉంది. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎం‌సీ) పరిధిలో ఏటా కుక్కకాటు కారణంగా 50 మందికి పైగా చనిపోతున్నారు. దాదాపు వెయ్యిమందికిపైగా తీవ్రంగా గాయపడున్నారు. ఈ సంఖ్య ఇటీవలి కాలంలో ఆశ్చర్యకరమైన స్థాయిలో పెరిగిపోయింది. కుక్క కాటుకు యాంటీ రాబీస్‌ ‌వ్యాక్సిన్‌ ‌వేసే నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌ప్రివెంటివ్‌ ‌మెడిసిన్‌ (ఐపీఎం)కు రోజూ 200 మంది బాధితులు వస్తున్నారు.

ఒక్క శేరిలింగంపల్లి ప్రాథమిక వైద్య కేంద్రానికే నిత్యం 5 నుంచి 10 మంది వరకు యాంటీ రాబీస్‌ ‌వ్యాక్సిన్‌ ‌తీసుకోవడానికి వస్తున్నారు. ప్రస్తుత ఫిబ్రవరి మాసం ముగియక ముందే ఇప్పటికే 164 మంది ఆసుపత్రికి వచ్చారు. డిసెంబరులో 278 మంది, జనవరిలో 172 మంది వచ్చి చికిత్స చేయించుకొని టీకా తీసుకున్నారు. ఫీవర్‌ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా అవుట్‌ ‌పేషెంట్‌ ‌కేసుల్లో 40 శాతం కేసులు కుక్క కాటువే ఉంటున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారిలో ఎక్కువ మంది కుక్క కాటు బాధితులే. కుక్క కాటుతో వచ్చే రాబిస్‌తో చాలా ప్రమాదం.

హైదరాబాద్‌ ‌మహానగరంతో పాటు శివారు ప్రాంతాల్లో దాదాపు 5.75 లక్షల కుక్కలు ఉన్నాయి. ఇదే ఇప్పుడు అతిపెద్ద సమస్య. మహానగరంపై వేసవి ప్రభావం అప్పుడే మొదలైంది. ఎండల ప్రభావం మనుషులతో పాటు జంతువులపై కూడా తీవ్రంగా పడుతోంది. దీంతో వీధి కుక్కలతో పాటు పెంపుడు కుక్కలు కూడా పిచ్చికుక్కల మాదిరి ప్రవర్తిస్తున్నాయి. నీడతో పాటు నీళ్లూ, ఆహారం, చల్లని వాతావరణం దొరక్క అల్లాడిపోతున్నాయి.

అనుమానాస్పద మృతా?

వీధి కుక్కల బెడదకు సంబంధించి అడుగడుగునా అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తున్నది. అంబర్‌పేట ఘటనలో మూడు రోజుల తర్వాత పోలీసులు తీరిగ్గా స్పందించారు. మీడియాలో వరుసగా వార్తలు రావడంతో న్యాయ సలహా తర్వాత కేసు నమోదు చేశారు. 174 సీఆర్పీసీ కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కుక్కల దాడిలో చనిపోతే అనుమానాస్పద మృతి కేసు నమోదు చేయటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవు తోంది. ఈ ఘటనకు కారణమైన వారిని నిందితులుగా చేర్చుతూ వారిపై కేసులు పెట్టకుండా అనుమానాస్పద మృతిగా కేసు పెట్టటమేంటని మండిపడుతున్నారు. వీధి కుక్కల బెడద తగ్గించా లంటూ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించట్లేదంటూ యంత్రాంగం మీద విమర్శలు గుప్పించారు. మున్సిపల్‌ ‌మంత్రి, నగర మేయర్‌ ‌మీద, జీహెచ్‌ఎం‌సీ కమిషనర్‌, అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎవరి మీద కేసు పెట్టాలన్న అయోమయంలో పోలీసులు పడ్డారు. కుక్కలు రెచ్చిపోతున్నా జీహెచ్‌ఎం‌సీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం తోనే వాటి బారిన పడుతున్నామని జనం ఆరోపిస్తున్నారు. కుక్కల సంచారంపై జీహెచ్‌ఎం‌సీకి ఫిర్యాదు చేస్తే సిబ్బంది చుట్టపుచూపుగా వచ్చి దొరకట్లేదంటూ వెళ్లిపోతున్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు తప్ప ఇతర సమయాల్లో ఈ సమస్యపై అధికారులు సమీక్ష కూడా చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు.

ఈ పరిణామాలలో కొన్ని విస్తుపోయే అంశాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లో కుక్కల సంచారం పెరగడానికి కారణం ఏమిటి? ఇక్కడ ఉన్నవి చాలవన్నట్లు గజ్వేల్‌ ‌కుక్కలను తెచ్చి ఇక్కడ వదిలేశారా? అంటే అవుననే అంటున్నారు. గజ్వేల్‌లోని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ఫామ్‌హౌస్‌ ఏరియాలో వీధి కుక్కల సంచారం పెంచింది. గతేడాది జీహెచ్‌ఎం‌సీ సిబ్బందిని గజ్వేల్‌ ‌రప్పించారు. వారు సీఎం ఫామ్‌హౌస్‌ ‌పరిసర ప్రాంతాలతోపాటు చుట్టు పక్కనున్న గ్రామాల్లో మూడు రోజుల స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌నిర్వహించి 200 కుక్కలను పట్టుకున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం వాటికి వ్యాక్సి నేషన్‌, ‌స్టెరిలైజేషన్‌ ‌చేసి పట్టుకున్న ప్రాంతంలోనే వదిలేయాలి. కానీ వాటిని జీహెచ్‌ఎం‌సీ సిబ్బంది స్టెరిలైజేషన్‌, ‌వ్యాక్సినేషన్‌ ‌చేయకుండా వాటిని నాలుగు దఫాలుగా హైదరాబాద్‌ ‌నగరంలోని వివిధ ప్రాంతాల్లో వదిలేశారనే ఆరోపణలున్నాయి. నగరంలో ఒకే ప్రాంతంలో వదిలేస్తే స్థానికంగా వ్యతిరేకత వస్తుందని భావించిన సిబ్బంది వాటిని హాఫీజ్‌ ‌పేట, శేరిలింగంపల్లి, కొండాపూర్‌, ‌పటాన్‌ ‌చెరుతో పాటు సికింద్రాబాద్‌ ‌జోన్‌లోని అంబర్‌పేట, మరికొన్ని సర్కిళ్లలో వదిలిపెట్టారని సమాచారం. సికింద్రాబాద్‌ ‌జోన్‌లో సుమారు 86 కుక్కలను వదిలి పెట్టగా, వాటిలో ఎక్కువగా అంబర్‌పేట సర్కిల్‌లోనే విడిచి పెట్టినట్లు తెలిసింది. గ్రామీణ వాతారణంలో పెరిగిన కుక్కలు నగరంలోని రణ గోణ ధ్వనులు, గందరగోళ వాతావరణంతో ఆందోళనకు గురై రెచ్చిపోతున్నాయని భావిస్తున్నారు. అంబర్‌పేటలో బాలుడిని చంపింది గజ్వేల్‌ ‌కుక్కలే అయి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అంబర్‌పేట ఘటన జరిగిన తర్వాత జీహెచ్‌ఎం‌సీ మేయర్‌ ‌గద్వాల విజయలక్ష్మి తన కార్యాలయంలో పశువైద్య విభాగం ఉన్నతాధి కారులతో సమీక్ష నిర్వహించి. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దాడికి పాల్పడ్డ శునకాలకు ఓ స్థానిక మహిళ నిత్యం మాంసాహారం వేసేది. రెండు రోజులుగా అమె లేకపోవడంతో కుక్కలు ఆకలితో ఉండిపోయాయి. అందువల్లే పసి బాలునిపై క్రూరంగా దాడి చేసుండొచ్చు.’’అన్నారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీధి కుక్కల దత్తతకు నగరవాసులు ముందుకు రావాలని, దీన్ని ప్రోత్సహించేందుకు ప్రతి ఆదివారం శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. వీధి కుక్కలకు ఎలాంటి ఆహారమివ్వాలి, దాడి చేసేందుకు యత్నిస్తే ఎదుర్కొవడం ఎలా.. వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తామని వివరించారు.

ప్రాణాలకు విలువలేదా?

మేయర్‌ ‌వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కుక్కల దాడిలో బాలుడు చనిపోతే ఇంతవరకు సీఎం స్పందించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌మండిపడ్డారు. కేసీఆర్‌ ‌హయాంలో ఫామ్‌హౌజ్‌లో కుక్కకు ఉన్న విలువ మనుషులకు లేదని విమర్శించారు. వీధి కుక్కలను అరికట్టే బాధ్యత జీహెచ్‌ఎం‌సీపై ఉన్నా ఆ దిశగా అధికారులు కృషి చేయడం లేదని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌విమర్శించారు. విశ్వనగరంలో బీఆర్‌ఎస్‌ ‌పాలన కుక్కలు బాలునిపై దాడి చేసి చంపే వరకు వచ్చిందని వ్యాఖ్యానించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‘‌నో వర్డస్ 2 ‌కన్సోల్‌’ అం‌టూ ట్వీట్‌ ‌చేశారు.వీధి కుక్కల బెడదను ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఉన్న ఏర్పాట్లు సరిపోవని ఈ సంఘటన రుజువు చేస్తున్నందున అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. మేయర్‌ ‌చేసిన వ్యాఖ్యలపై సినీ దర్శకుడు రాంగోపాల్‌ ‌వర్మ తనదైన శైలిలో సెటైరికల్‌ ‌కామెంట్స్ ‌చేశారు. పిల్లల ప్రాణం కంటే కుక్కల ఆకలి గురించి ఆలోచించడమేంటని మండిపడ్డారు. అంతగా ఉంటే మేయర్‌ ‌గారు కుక్కలన్నింటినీ ఇంటికి తీసుకువెళ్లి ఆహారం పెట్టొచ్చు కదా అని కామెంట్‌ ‌చేశారు. కుక్కలన్నీ మేయర్‌ ఇం‌ట్లో ఉంటేనే పిల్లలకు రక్షణ ఉంటుందని సెటైర్‌ ‌వేశారు. కుక్కలను ఒక్క దగ్గరకు చేర్చి మేయర్‌కు పంపండి అంటూ కామెంట్స్ ‌చేశారు. ఇదంతా కుక్కల దాడి, బాలుని మృతి ఎంత తీవ్రంగా కదిలించిందో చెబుతోంది.

ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు

వీధి కుక్కలు మనుషులపై దాడులు చేయకుండా ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రభుత్వాన్ని, జీహెచ్‌ఎం‌సీని హైకోర్టు ప్రశ్నించింది. బాలుడి మృతి ఘటన మీ మనసులను కదిలించలేదా అని ప్రశ్నించింది. ప్రదీప్‌ ‌మృతి చెందిన ఘటనపై పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటోగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ ‌భూయాన్‌, ‌జస్టిస్‌ ఎన్‌.‌తుకారాంజీలతో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి 23న విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎం‌సీ కమిషనర్‌, ‌హైదరాబాద్‌ ‌కలెక్టర్‌, ‌జీహెచ్‌ఎం‌సీ అంబర్‌పేట డిప్యూటీ కమిషనర్‌,‌లీగల్‌ ‌సర్వీసెస్‌ అథారిటీ సభ్యకార్యదర్శులను ప్రతి వాదులుగా చేరుస్తూ నోటీసులు జారీ చేసింది. కుక్కలకు ప్రత్యేక ఆశ్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తే రోడ్లపై సంచరించే అవకాశం ఉండదని పేర్కొంది.ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. జీహెచ్‌ఎం‌సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ బాలుడిపై దాడి చేసిన మూడు కుక్కలకు స్టెరిలైజ్‌ ‌చేసి వదిలిపెట్టారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కుక్కల దాడిలో మృతి చెందిన ఘటన పరిహారానికి అర్హమైన కేసు అని, బాలుడి తల్లిదండ్రులకు పరిహారం అంశాన్ని వచ్చే విచారణలో పరిశీలిస్తామంటూ విచారణను ధర్మాసనం మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.

స్టెరిలైజేషన్‌ ‌పేరుతో అవినీతి

అసలేం జరుగుతోందని ఆరా తీస్తే కనిపించిన లెక్కలు విస్తుగొలిపాయి.. ఒకప్పుడు కుక్కలను బంధించి వధించేవారు. అయితే బ్లూక్రాస్‌, ‌పెటా వంటి జీవకారుణ్య సంఘాల విజ్ఞప్తితో గత మూడు దశాబ్దాలుగా నగర పాలక సంస్థ కుక్కలను చంపకుండా వాటికి సంతానోత్పత్తి కలగకుండా (స్టెరిలైజేషన్‌) ‌జంతు జనన నియంత్రణ (ఏబీసీ) శస్త్రచికిత్స చేస్తున్నారు. ఇందు కోసం జీహెచ్‌ఎం‌సీ వెటర్నరీ విభాగం అయిదు స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకుంటోంది.

మహానగరంలోని 75 శాతం కుక్కలకు స్టెరిలైజేషన్‌ ‌పూర్తయిందని, ఇందు కోసం రూ.15 కోట్ల ఖర్చు చేశామని అధికారులు చెబుతున్నారు. ఇదే నిజమైతే వీధి కుక్కలు ఎప్పుడో అంతరించి ఉండాలి. కానీ కుక్కల సంఖ్య రోజు రోజుకీ పెరుగు తోంది. ప్రదీప్‌పై మూకుమ్మడిగా దాడి చేసి మృతికి కారణమైన శునకాలను జీహెచ్‌ఎం‌సీ వెటర్నరీ విభాగం వారు పట్టుకున్నారు. దాడి చేసింది ఓ తల్లికుక్క, సంతానమని తేలింది. అయితే తల్లికుక్కకు గతంలోనే స్టెరిలైజేషన్‌ ‌జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. మరి దానికి పిల్లలు ఎలా పుట్టాయన్నదే ప్రశ్న. జీహెచ్‌ఎం‌సీలో జంతు జనన నియంత్రణ(ఏబీసీ) శస్త్రచికిత్స పేరిట జరుగుతున్న అవినీతికి ఇదే ఉదాహరణ.

ఒకటి, రెండు దురదృష్టకర ఘటనలు దృష్టిలో పెట్టుకుని ఎంతో విశ్వాసంగా ఉండే కుక్కలను శత్రువులుగా చూడొద్దని ప్రముఖ నటి, బ్లూక్రాస్‌ ‌వ్యవస్థాపకురాలు అక్కినేని అమల అన్నారు. మాసాబ్‌ట్యాంక్‌లోని శాంతినగర్‌ ‌సంక్షేమ సంఘంలో జీహెచ్‌ఎం‌సీ నిర్వహించిన అవగాహన కార్య క్రమంలో అమల పాల్గొన్నారు. ఇటీవల చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనలు జనంలో కోపాన్ని, ఆవేశాన్ని కలిగించాయని ఆమె అంగీకరించారు. అయితే, వాటిని కొట్టటం లేదా చంపడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. కుక్కలను ఓపికగా ప్రేమగా చూస్తే అవి పదింతలు మనల్ని ప్రేమిస్తాయన్నారు. వాటి ప్రాణాల్ని సైతం ఇచ్చి ఇతరులను కాపాడిన ఉదంతాలు కూడా ఉన్నాయని అమల వ్యాఖ్యా నించారు. కుక్కలకు రాబిస్‌, ‌కు.ని. ఆపరేషన్లు చేసుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ సంస్థ కృషి చేస్తోందన్నారు. నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు జనంలో గందరగోళం సృష్టిస్తాయి. మనుషుల ప్రాణాల కన్నా కుక్కల హక్కులకే ఎక్కువ ప్రాధాన్యం ఉందన్న భావన వ్యక్తమవుతున్నది. పెటా వంటి సంస్థలు చేసే సూచనలు ఆచరణ సాధ్యమైన వేనా? ఇంకా వీధి కుక్కలకు ఉన్న హక్కులు ఆవులకు, అడవిలో లేళ్లకు, నెమళ్లకు లేకపోవడం విచిత్రమనే వారు కూడా ఉన్నారు. రాబిస్‌ ‌వంటి కారణమయ్యే కుక్కకాటు విషయంలో కారుణ్యం కంటే వాస్తవికంగా వ్యవహరించడం అవసరం కాదా!

రాబిస్‌ ‌మిషన్‌, ‌స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో గోవా రాష్ట్ర ప్రభుత్వం వీధి శునకాలను మూడేళ్లలో నియంత్రించగలిగింది. గత మూడేళ్లలో కుక్కకాటు కారణంగా అక్కడ ఎవరూ చనిపోలేదు. అన్నింటికీ ఏటా టీకాలు వేయడం, ప్రతి కుక్కకు వయసు రాగానే పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్స చేయడం, దాడి నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో తెలుపుతూ పాఠశాల విద్యార్థులకు, మహిళలకు అవగాహన కల్పించడం, ఇతరత్రా చర్యలతో స్థానిక ప్రభుత్వం మంచి ఫలితాలు సాధించింది. దేశంలోని పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఏబీసీ కార్యక్రమం మంచి ఫలితాలి స్తుండగా.. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో మాత్రం పది హేనేళ్లుగా సాధ్యపడట్లేదు. అది గుర్తిస్తే కుక్కల బెడద నివారణకు మొదటి మెట్టు కాగలదు.

About Author

By editor

Twitter
YOUTUBE