– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు

తమ చిన్నారులను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బడికి పంపించాలన్న తపన ఇవాళ తల్లిదండ్రులలో సర్వసాధారణంగా కనిపిస్తున్నది. మూడో ఏడు రాగానే ఎల్‌కేజీలో వేయడం ఇందుకే. ఆ విధంగా తమ చిన్నారి జీవితంలో ఏకంగా ఒక సంవత్సరం వృథా కాకుండా కాపాడుతున్నామని వారంతా తమను తాము సంతృప్తి పరుచుకుంటున్నారు. ఒక చిన్నారి ఈ సంవత్సరం మూడో సంవత్సరంలోకి ప్రవేశిస్తాడు. అతడికి ఎల్‌కేజీ అర్హత వచ్చేస్తుంది. కానీ వాస్తవంగా జరిగేది వేరు. ఒక ఉదాహరణ: ఒక పాఠశాలలో ఇద్దరు బాలులను ఒకేసారి చేర్పించారు. ఇద్దరూ ఒకే సంవత్సరంలో పుట్టిన మాట నిజమే. కానీ అందులో ఒక బాలుడు చాలా తొందరగా ఉపాధ్యాయులు చెప్పింది నేర్చుకోగలిగాడు. తోటి బాలలతో ఆటలు ఆడగలిగాడు. చలాకీగా, ఎలాంటి ఆత్మన్యూనత లేకుండా కలివిడిగా తయారయ్యాడు. కానీ రెండో బాలుడు దీనికి పూర్తిగా విరుద్ధం. కారణం ఒకటే. అన్నీ నేర్చుకున్న ఆ బాలుడు ఆ సంవత్సరం జనవరిలో పుట్టాడు. నేర్చుకోలేకపోయిన బాలుడు అదే ఏడాది డిసెంబర్‌లో పుట్టాడు. ఆరేళ్ల లోపు పిల్లలలో ఎదుగుదలకు సంబంధించి ఒక సంవత్సరకాలం చాలా కీలకం. దాని ఫలితమే ఆ ఇద్దరిలో ఆ తేడా. ఒక సంవత్సరం కాపాడామని అనుకున్న తల్లిదండ్రులకు ఆ సంవత్సరమంతా తమ చిన్నారి పడిన యాతనను గమనించే తీరిక, ఆలోచన లేవు. ఇది ఒక విశ్వవ్యాప్త వాస్తవం. బ్రిటన్‌కు చెందిన ఫిస్కల్‌ ‌స్టడీస్‌ ‌సంస్థ సర్వేలో ఇదే తేలింది. ఒకే సంవత్సరంలో పుట్టినా చిన్న పిల్లలు పెద్ద పిల్లలతో పోటీ పడలేకపోతున్నారు. చదువును భారంగానే భావిస్తున్నారు. అందుకే చిన్నారులను పాఠశాలలకు పంపేందుకు ఒక నిర్దిష్ట వయసు విధానాన్ని పాటించాలని కేంద్రం భావిస్తున్నది. నిజానికి ఇది పాత పద్ధతే. పెరిగిన విద్యావ్యాపారంతో పాటు, మారిన జీవన శైలి కూడా పిల్లలను సాధ్యమైంత త్వరగా పాఠశాలలో వేయాలన్న ఒక అవాంఛనీయ పరిణామానికి కారణమయ్యాయి. అదే కొనసాగుతోంది.

చిన్నారులకి రెండు నుంచి రెండున్నర ఏళ్లు వచ్చేసరికి బడిలో వేద్దామన్న ఆలోచన తల్లిదండ్రు లకు వస్తున్నది. కొందరు నర్సరీలో చేరతారు. ఇంకొందరు ఎల్‌కేజీ, యూకేజీలలో చేరతారు. ఏమైనా ఒకటో తరగతిలో చేరడానికి సరైన వయసు ఆరేళ్లు. అంటే 5+ నుంచి ఆరేళ్ల వయసు కలిగిన వారు. ఇంకా చెప్పాలంటే చిన్నారులను పాఠశాలకు పంపుతున్న ఆ సంవత్సరం మార్చి ముగిసేనాటికి వారికి ఐదేళ్లు నిండి ఉండాలి. కాబట్టి తరువాతి విద్యా సంవత్సరానికి ఆ చిన్నారికి పాఠశాలలో చేరడానికి వయసు రీత్యా అర్హత వస్తుంది.

చాలామంది నిపుణులు ఆరో ఏట చిన్నారులను బడికి పంపడమే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నారు. కొఠారి (1964) కమిషన్‌ ఐదేళ్లకే చిన్నారులను బడికి పంపవచ్చునని సిఫారసు చేసింది. కేరళ వంటి రాష్ట్రాలు అదే అమలు చేస్తు న్నాయి. ఆరేళ్లు వచ్చినప్పుడే చిన్నారులు ఉపాధ్యా యులు చెప్పేది శ్రద్ధగా వినగలుగుతారని నిపుణుల ఏకాభిప్రాయం. రాయడం, చదవడం వంటి విద్యా విషయాల మీద కూడా ఆ వయసులోనే ఆసక్తి ఉంటుంది. నిజానికి జీవితంలో విశ్వవిద్యాలయంలో గడిపిన కాలం కంటే చిన్నారికి ఆరో ఏట ప్రవేశించే కాలమే చాలా విలువైనదని అంటారు. చిన్నారి మెదడు పూర్తిస్థాయి తయారుకావడంలో ఆరో సంవత్సరం కీలకమే. అప్పుడే మెదడు 95 శాతం తయారవుతుంది. అంటే పెద్దల మెదడు దశకు చేరుతుంది. తెలివితేటలు నాలుగో సంవత్సరానికి 50 శాతం, ఎనిమిదో సంవత్సరానికి 80 శాతం వృద్ధి చెందుతాయి. అందుకే ఆరో ఏడుకు అంత ప్రాధాన్యం. భాషలు నేర్చుకోవడం, ఇతర నైపుణ్యా లను సులభంగా గ్రహించడానికి అదే సరైన వయసు. అదే గ్రహించే శక్తి ‘ఎబ్జార్బెంట్‌ ‌మైండ్‌’ ‌దశ.

ఆరేళ్లకు స్కూళ్లలో ప్రవేశం, మాతృభాషలో చదువు, నచ్చిన కోర్సులను ఎంచుకునే అవకాశం, నాణ్యమైన బోధన, రాణించటానికి విస్తృత అవకాశాలు… కొత్త విద్యాసంస్థల ఏర్పాటు ఇలా ఎన్నో అవకాశాలను ఎన్‌ఈపీ తెర ముందుకు తెచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో అతి గొప్ప సంస్కరణకు కేంద్రం నాంది పలికింది. అదే జాతీయ విద్యావిధానం (నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ ‌పాలసీ-ఎన్‌ఈపీ). స్వామి వివేకానంద ప్రవచించిన ‘మ్యాన్‌ ‌మేకింగ్‌ ఎడ్యుకేషన్‌’, అర విందుడి ‘ఇంటిగ్రేషనల్‌ ఎడ్యుకేషన్‌’, ‌మహాత్మాగాంధీ ‘బేసిక్‌ ఎడ్యుకేషన్‌’‌ల సమ్మిళిత నమూనాగా ఇది రూపుదిద్దుకుంది. సామాజిక ఆర్థిక పరివర్తనకు ఉద్దేశించినదే ఈ ప్రయత్నం. కొత్త విద్యావిధానం సూచించిన రీతిలోనే ఒకటో తరగతిలో చేరడానికి ఆరేళ్ల వయసును ప్రామాణికంగా తీసుకోవాలని, ఇది కచ్చితంగా అమలు చేయాలని ఫిబ్రవరి 22వ తేదీన కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.

ఐదేళ్ల తపస్సు, 2.5 లక్షల గ్రామపంచాయతీలు, 12,500 స్థానిక సంస్థల్లో సామూహిక చర్చలు, 575 జిల్లాల్లో సమావేశాలు, 15 లక్షల సూచనలు, సలహాలు. కడకు రెండు లక్షల సలహాలకు ఆమోద ముద్ర. అలా 2020లో నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ ‌పాలసీ రూపుదిద్దుకుంది. ‘ఇది ఇండియన్‌ ఎడ్యుకేషన్‌ ‌కాదు… భారతీయ ఎడ్యుకేషన్‌’ అం‌టోంది కేంద్ర ప్రభుత్వం. ‘ఆత్మనిర్భర దేశంలో.. ఆత్మనిర్భర విద్య’ అని ప్రస్తుతిస్తున్నారు విద్యారంగ నిపుణులు.

స్వాతంత్య్రానికి ముందు బ్రిటిషు విద్యా విధానంలో బట్టీపట్టటం అనేది తెలివితేటలకు కొల మానంగా ఉండేది. విద్యార్థుల్లో ఆలోచన, విశ్లేషణా సామర్థ్యం అనేది అంతగా ఉండేది కాదు. దీనివల్ల సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర య్యాయి. కొత్త విద్యావిధానం (ఎన్‌ఈపీ) మాతృ భాషలో విద్యాబోధనకు అవకాశం కల్పిస్తుంది. దీనివల్ల విద్యార్థి తన ఆలోచనాపరిధి, విశ్లేషణా సామర్థ్యం, తార్కిక జ్ఞానం, పరిశోధనా పటిమలను పెంచుకోగలుగుతాడు. అలాగే మెడికల్‌, ఇం‌జనీరింగ్‌ ‌లతో పాటు ఉన్నత విద్యకు సంబంధించిన సిలబస్‌ అం‌తా ప్రాంతీయ భాషలో అందుబాటులోకి తెచ్చుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు భోపాల్‌లో మొదటి సెమిస్టర్‌ ‌వైద్యవిద్య కోర్సును పూర్తిగా హిందీలో బోధిస్తున్నారు. గుజరాతీ, తెలుగు, ఒడియా, పంజాబీ, బెంగాలీలో బోధనకు సన్నాహాలు సాగుతున్నాయి. విద్యార్థి ఎప్పుడయితే మాతృభాషలో ఏదైనా నేర్చుకుంటాడో అతనిలో నిబిడీకృతమైన శక్తులు.. సంగీతం వంటి కళారంగంలో కావచ్చు, ఇతరత్రా రంగాల్లో కావచ్చు, బయటకు వస్తాయి. ఈ ఏడాది జులై 29 నాటికి ఎన్‌ఈపీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. 28 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 2,774 ఇన్నొవేటివ్‌ ‌కౌన్సిళ్లు ఏర్పాటయ్యాయని కేంద్ర విద్య మంత్రిత్వశాఖ అంతర్గత నివేదిక చెబుతోంది. ఇందులో 2వేల సంస్థలు స్కిల్‌ ‌హబ్‌లుగా పనిచేస్తాయి. స్కిల్‌ ‌డెవలప్‌మెంటు ఎంట్ర ప్రెన్యూర్‌షిప్‌ ‌మంత్రిత్వశాఖ పోర్టుల్లో దాదాపు 700 వరకూ రిజిస్టర్‌ అయ్యాయి.

ఈ ఆలోచన అమలులో తొలి సోపానమే ఒకటో తరగతిలో ప్రవేశానికి కనీసం ఆరేళ్ల వయసు ఉండాలంటూ ఇటీవల కేంద్రం ఇచ్చిన నిబంధన. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన 5+3+3+3 విధానం ప్రకారం చిన్నారులకు ఆరేళ్ల వయసులో ఒకటో తరగతి మొదలవుతుంది. మూడు నుంచి ఐదేళ్ల వయసులో మధ్య ఉన్న చిన్నారులందరికీ ఫౌండేషన్‌ ‌దశలో భాగంగా విద్య అందిస్తారు. ఇందుకు గాను ప్రీస్కూలు. ఆ తర్వాత 1, 2 తరగతులను చిన్నారులు అభ్యసించవలసి ఉంది. మూడేళ్ల వయసులో పిల్లలను స్కూలుకు పంపటం వల్ల మంచి పునాది పడటంతో పాటు ప్రీస్కూలు నుంచి రెండో తరగతి వరకూ చిన్నారుల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడతాయి. అంగన్వాడీలు, ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌, ‌ప్రయివేటు, ఎన్జీఓ సంస్థల ఆధ్వర్యంలో నడిచే ప్రీస్కూళ్లలో అభ్యసిస్తున్న చిన్నారులందరికీ ఒకటో తరగతిలో చేరటానికి ముందే నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ విధానం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నూతన విద్యా విధానానికి అనుగుణంగా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న వయసు నిబంధనను సర్దుబాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం స్పష్టంగా ఆదేశించింది.

అసలు జాతీయ విద్యావిధానం ఏమిటి?

1986 నుంచి కొనసాగిస్తున్న విద్యావిధానంలో మార్పులు చేస్తూ కొత్తగా తెచ్చిన జాతీయ విద్యావిధానానికి కేంద్ర క్యాబినేట్‌ 29 ‌జులై 2020న ఆమోద ముద్ర వేసింది. అంతకు ముందు ఇస్రో మాజీ ఛైర్మన్‌ ‌కె.కస్తూరిరంగన్‌ ఆధ్వర్యంలో కమిటీ డిసెంబర్‌, 2018‌లో ముసాయిదాను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం ప్రభుత్వం మే, 2019లో ప్రజాభిప్రాయం కోరింది. భారతీయ విద్యావిధానంలో సానుకూల మార్పులకిది దోహదం చేస్తుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకూ, అవసరాన్ని బట్టి వృత్తివిద్యలను ప్రోత్స హించేలా దీని రూపకల్పన సాగింది. ఈ విద్యా విధానంలో ఫలానా భాషలో చదవాలన్న వత్తిడి ఎవరిపైనా ఉండదు. తమ ఆసక్తులకు అనుగుణంగా వారి భాషను ఎంపిక చేసుకోవచ్చు.

–    ఆయా రాష్ట్రాలు ఎంపిక చేసుకున్న మేరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో బోధించటం అనే అంశంపైన ప్రధానంగా దృష్టి పెడతారు.

–   ఇప్పుడు ఉన్న 10+2 విధానానికి బదులుగా 5+3+3+4 విధానాన్ని అనుసరిస్తారు. ఫౌండేషన్‌ ‌స్టేజీ, ప్రిపరేటరీ స్టేజీ, మిడిల్‌ ‌స్టేజీ, సెకండరీ స్టేజీగా వాటిని విభజించారు.

–   ఉపాధ్యాయ వృత్తిని చేపట్టేవారు తప్పనిసరిగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సుని విజయవంతంగా పూర్తి చేయాలని నిబంధన విధించారు.

స్కూలు ఎడ్యుకేషన్‌: ఇం‌దులో నాలుగు దశలు ఉంటాయి..

పాఠశాల విద్య ప్రాథమిక దశ (ఫౌండేషన్‌ ‌స్టేజ్‌)-‌లో మూడేళ్ల స్కూలు లేదా అంగన్‌ ‌వాడీ విద్య. ఆ తర్వాత ప్రైమరీ స్కూళ్లలో 1, 2 తరగతులు. ఇది మూడేళ్ల నుంచి ఎనిమిది సంవత్సరాల వరకూ సాగుతుంది. ఇందులో యాక్టివిటీ బేస్డ్ ‌లెర్నింగ్‌ ఉం‌టుంది.

సన్నాహక దశ (ప్రిపరేటరీ స్టేజ్‌)- ‌మూడు నుంచి ఐదేళ్ల మధ్య ఉంటుంది. 9 నుంచి 11 ఏళ్ల వయసు. ఇందులో రాయటం, మాట్లాడటం, చదవటం, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, ‌లాంగ్వేజీ, ఆర్టస్, ‌సైన్సు, మేథమెటిక్స్ ‌వంటివి ఉంటాయి.

మధ్యస్థ దశ (మిడిల్‌ ‌స్టేజ్‌)- ఆరు నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులు ఇందులోకి వస్తారు. అప్పుడు విద్యార్థి వయసు 11 నుంచి 14 ఏళ్ల వరకూ ఉంటుంది. ఈ దశలో మేథ్స్, ‌సైన్సు, సోషల్‌ ‌సైన్సెస్‌, ఆర్టస్, ‌హ్యూమానిటీస్‌ ‌వంటివి నేర్చు కుంటారు.

ద్వితీయ దశ (సెకండరీ స్టేజ్‌)-ఇం‌దులో 9, 10 తరగతులు ఒక దశ, 11, 12 తరగతులు ఇంకో దశ. 14 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వయసు విద్యార్థులు ఇందులోకి వస్తారు.

స్కూలు ఎడ్యుకేషన్‌లో చేపట్టిన ప్రధానమైన మార్పు.. విద్యార్థి ప్రతి సంవత్సరంలో పరీక్షలకు హాజరై తల పగలగొట్టుకోవలసిన పనిలేదు. 2, 5, 8 తరగతుల్లో పరీక్షలుంటాయి. ఆ తర్వాత 10, 12 తరగతుల్లో బోర్డ్ ఎగ్జామ్‌ ఉం‌టుంది. దీనిని కూడా రీ డిజైన్‌ ‌చేస్తున్నారు. 6వ తరగతి నుంచి ‘రికార్డింగ్‌’ ‌విధానాన్ని అమలు చేస్తున్నారు. ఎక్స్‌పరిమెంటల్‌ ‌లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఇస్తారు.

స్కూల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందిస్తారు. అలాగే కౌన్సిలర్లు, సోషల్‌ ‌వర్కర్‌లను కూడా అందుబాటులో ఉంచుతారు. దీని ద్వారా విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.


నూతన భవిష్యత్తు వైపు చూపు

‘మన విద్యావిధానం, దాన్ని అందించే విద్యాసంస్థలపైన భారతదేశ ఉజ్వల భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందుకే స్వాతంత్య్రం అనంతరం ‘అమృతకాలం’లో విద్యాసంస్థలలో మౌలిక సదుపాయాలను కల్పించటంలో కావచ్చు, లేదా విధానాల రూపకల్పనలో కావచ్చు, ప్రతి దశలోనూ వేగవంతమైన చర్యలకు సిద్ధం అవుతున్నాం. భారతదేశం.. ఆత్మతత్త్వం నుంచి పరమాత్మ తత్త్వం వరకూ, ఆధ్యాత్మికత నుంచి ఆయుర్వేదం వరకూ, సోషల్‌ ‌సైన్సెస్‌ ‌నుంచి సోలార్‌ ‌సైన్సెస్‌ ‌వరకూ, మ్యాథ్స్ ‌నుంచి మెటలర్జీ వరకూ, శూన్యం నుంచి అనంతం వరకూ పరిశోధనలు చేపడుతూ ప్రపంచానికి మార్గం చూపింది. లింగ సమానత్వం అనే పదం బయటకు రాని రోజుల్లోనే మహిళా పండితులు పురుషులకు దీటుగా వాదించి తమ సత్తా చూపారు. గార్గి, మైత్రేయలు అందుకు పెద్ద ఉదాహరణ. ఆ చీకటి రోజుల్లోనే భారతదేశం మానవత్వం అనే వెలుగును ప్రపంచానికి చూపించింది. ఆ కిరణాల నుంచి ఆధునిక ప్రపంచం, ఆధునిక సైన్స్ ‌పుట్టుకొచ్చాయి. ఇంతకు ముందున్న ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశాయి. కీలక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఐటీలు, ఐఐఎమ్‌లు, ఏఐఐఎమ్‌ఎస్‌ల సంఖ్య గణనీయంగా పెంచాం. 2014 తర్వాత వైద్యకళాశాలల సంఖ్య 65 శాతం పెరిగాయి. నూతన విద్యావిధానం కింద దేశం మొట్టమొదటిసారిగా ముందుచూపుతోనూ, భవిష్యత్తు దిశగానూ అడుగులు వేస్తోంది. మెరుగైన విద్యా విధానంలో చదువుకున్న యువతీ యువకులు, స్వాతంత్య్రం వందేళ్ల పండుగను 2047లో జరుపుకుంటున్నప్పుడు ఆధునిక భారత స్వప్నాన్ని గుర్తించగలుగుతారు’.

(ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌కోటలోని శ్రీ స్వామి నారాయణ్‌ ‌గురుకుల్‌ 75‌వ అమృత మహోత్సవ కార్యక్రమం సందర్భంగా స్ఫూర్తిమంతంగా చేసిన ప్రసంగంలోని భాగమిది.)


వివిధ రాష్ట్రాల్లో అమలు

జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయటానికి ఉత్తర్వులిచ్చిన మొదటి రాష్ట్రం కర్ణాటక. అది 2021లో ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఆరేళ్ల వయసులో ఒకటో తరగతిలో చేర్చే విధానం అక్కడ అమలులో ఉంది. తర్వాత 26 ఆగస్టు, 2021న మధ్యప్రదేశ్‌ అనుసరించింది. దశలవారీగా దీనిని అమలు చేయదలిచామని ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ‌ప్రకటించారు. గోవా ఈ ఏడాది ఎన్‌ఈపీ అమలు చేస్తానని ప్రకటించింది. మహారాష్ట్ర, ఆంధప్రదేశ్‌, ‌రాజస్తాన్‌, అస్సాం రాష్ట్రాలు దీనిని అమలు చేయటానికి సన్నాహాలు చేస్తున్నాయి. జాతీయ విద్యావిధానంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తున్నామని, పూర్తిగా ఈ విధానాన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా మేఘాలయ రికార్డులకెక్కుతుందని ఆ రాష్ట్ర సీఎం ప్రకటించారు. దాదాపు రెండు కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగించేలా అక్కడ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.

ప్రపంచమంతా రాజ్యాలు, రాజవంశాల గురించి చర్చించుకున్నప్పుడు, భారత దేశం గురుకుల విద్యావ్యవస్థను అమలు చేసింది. అవి సేవ, సమానత్వం, ప్రేమలకు ప్రతీకలుగా శతాబ్దాల పాటు నిలిచాయి. నలంద, తక్షశిల యూనివర్సిటీలు గురుకుల విద్యావ్యవస్థలకు పర్యాయ పదాలుగా ఉండేవి. పరిశోధనలు, ఆవిష్కరణలు అనేవి భారతీయ జీవనవిధానంలో ఒక భాగం. ఇప్పుడు దేశంలో కనిపిస్తున్న భిన్నత్వం, సాంస్కృతిక వైభవం అనేవి అప్పటి నుంచి వచ్చినవే. విద్య పైన జీడీపీలో 3, 4, 5 శాతం ఖర్చుచేయాలన్న చర్చలు సాగేవి. విద్యను విస్మరించారన్న విమర్శలు కూడా అధికంగా ఉండేవి. ఇప్పుడు విద్యకు బడ్జెట్లో 6 శాతం కేటాయించి విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు. నలంద యూనివర్సిటీకి పూర్వవైభవం తేవటానికి రూ. 2,700 కోట్లు కేటాయించింది. ఇదంతా కేంద్రం సాధించిన అతి పెద్ద విజయం. ఎన్‌ఈపీలో మైలురాళ్లు.

ఎన్‌ఈపీ వల్ల సంస్థాగతంగా చోటుచేసుకున్న పరిణామాలు, దాని ప్రభావం గురించి కేంద్రం వివిధ సందర్భాల్లో ప్రకటనలు చేస్తూ వచ్చింది. మంత్రులు వివిధ వ్యాఖ్యాలు చేశారు. వీటి గురించి తెలుసు కుంటే ఎన్‌ఈపీ ఈ రెండేళ్లలో సాధించిన విజయాలను అర్థం చేసుకోవటం వీలవుతుంది.

విద్యార్థుల్లో అంతర్గత సామర్థ్యం వెలికితీత

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంతటి సృజనాత్మక ఆవిష్కరణ మరొకటి లేదని కేంద్రమంత్రి జితేంద్ర చెప్పుకొచ్చారు. బహుళ ఐచ్ఛిక విధానం కింద సాగే ఈ విధానం వల్ల భారతీయ విద్యావ్యవస్థ స్వరూప స్వభావాలే మారిపోతాయని అభిప్రాయపడ్డారు. 21వ శతాబ్దపు భారతదేశంలో అవసరమైన అభివృద్ధి సాధకమైన, దూరదృష్టితో కూడిన నిర్ణయమని అన్నారు. ‘కేవలం డిగ్రీల కోసం కాకుండా, విద్యార్థులలో నిబిడీకృతమైన శక్తిసామర్థ్యాలను, ఆసక్తులను వెలికితీయటానికి ఉపయోగపడుతుంది. బహుళ కోర్సుల విధానాన్ని ఎంపిక చేసుకోవటం, వాటి నుంచి బయటపడే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించటం వల్ల, అకాడమిక్‌గా వారికి స్వేచ్ఛ లభిస్తుంది’ అన్నారు.

క్రీడలు, స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌రంగాల్లో..

క్రీడలు, స్కిల్‌ ‌డెవలప్‌మెంట్‌కు ఎన్‌ఈపీ మైలురాయి అని కేంద్రమంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌చెప్పుకొచ్చారు. ‘స్కిల్‌ ఇం‌డియా పోగ్రామ్‌ ‌కింద దేశానికి సంబంధించిన యువకులకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సాఫ్ట్ ‌స్కిల్స్‌పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. దేశ, విదేశాల్లోనూ మన విద్యార్థులు రాణిస్తారు’ అని అన్నారు.

‘దేశం ఆజాదీ కా అమృతోత్సవ్‌’ ‌సంబరాలు జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో, మనం వలసవాద మనస్తత్వం నుంచి బయటపడాలి. పశ్చిమం నుంచి వచ్చినది ఏదైనా విశిష్టమైనదన్న భావనను విడనాడాలి. నాణ్యమైన విద్యను అందించే హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నాం’ అన్నారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా.

కొవిడ్‌-19 ‌ప్రభావం మిగతా అన్ని రంగాల్లో మాదిరిగా నూతన విద్యా విధానం అమలుపైన పడింది. కార్యక్రమాలు మందగించాయి. కొవిడ్‌ ‌నాటి పరిస్థితులు చాలా విషయాల్లో వచ్చిన పరిమితులు తెచ్చినట్టే టీచర్ల శిక్షణ, విద్యార్థుల బోధనల్లోనూ మార్పులు తెచ్చాయి. భిన్నమైన మార్గాలను ఉపాధ్యాయులు అన్వేషించారు. డిజిటల్‌ ‌మార్గం వల్ల కలిగే ప్రయోజనాలు అర్థమయ్యాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా బాగా అలవాటు పడ్డారు. ఈ రకమైన అలవాట్లు కొత్త విద్యావిధానంలో మార్పులను త్వరితగతిన అందుకోవటానికి దోహదం చేస్తాయి. విద్యారంగంలో పరివర్తన వేగవంతమైంది. ఇదే తీరుగా ముందుకు సాగితే ప్రభుత్వం ఆశిస్తున్న మార్పులు సాధ్యమవుతాయి.

మారిన జీవశైలి, తల్లిదండ్రులలో వచ్చిన మార్పు, అపోహలు, విద్యారంగంలో వ్యాపార పోకడలు ఇవన్నీ విద్యా విధానాన్ని, విద్యార్థులను కొన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఆ క్రమంలోనే ఆరేళ్లకు ఒకటో తరగతిలో చేర్చాలన్న నిబంధన కాస్త అదుపు తప్పుతోంది. దీనిని మళ్లీ నిలబెట్టవలసిన అవసరం ఉంది.

About Author

By editor

Twitter
YOUTUBE