– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్
అసలు యుద్ధాన్ని ఎందుకు సమర్థించాలి? అన్న ప్రశ్న నేడు బలంగానే ఉంది. ఏదో ఒకరోజున యుద్ధం ముగిసిపోక తప్పదు. కాబట్టి మనమే వీలైనంత తొందరగా యుద్ధాన్ని ఎందుకు ముగించకూడదు అని కూడా కొందరు విశ్లేషకులు ప్రశ్నించడం ఇందుకే. రష్యా మీద దాడి చేయవద్దు. అలాగే రష్యా దాడి చేస్తోందని దిగులు పడవద్దు అన్నాడొక హక్కుల ఉద్యమకారుడు. వ్యక్తీకరణ, మాటలు కొంచెం భిన్నంగా ఉండవచ్చు. ఇప్పుడు ప్రపంచమంతా ఇలాంటి అభిప్రాయాలే ఉన్నాయి. అయినా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఏడాది గడచిపోయింది. ప్రపంచం ఒక మహమ్మారి ప్రభావంతో కుదేలైన నేపథ్యంలో ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పటికీ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ యుద్ధం విస్తరించకూడదన్నదే ఎక్కువ దేశాల అభిమతం కూడా. ఏడాదిగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇటీవలి వరకు 8,006 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 13,287 మంది క్షతగాత్రులయ్యారు.
ఎంతో విశాలమైన రష్యా దేశ జనాభా 14.6 కోట్లు. చమురు, గ్యాస్, ఫెర్టిలైజర్స్, ముడిసరుకుల ఎగుమతులకు ప్రధానకేంద్రం. ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి మూలాలు 2014లో ఉన్నాయి. నాటి రష్యా అనుకూల ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ ‘యూరోపి యన్ యూనియన్-ఉక్రెయిన్ అసోసియేషన్ అగ్రిమెంట్’ పై సంతకం చేయడానికి తిరస్కరించారు. ఇదే నాటోలో చేరాలని 2008 నుంచి ఉక్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలను దెబ్బతీసి దేశంలో ‘‘రివల్యూషన్ ఆఫ్ డిగ్నిటీ’’ పేరుతో విప్లవానికి తెర తీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడు పదవి నుంచి తప్పుకోవడం, రష్యా రంగంలోకి దిగి క్రిమియాను ఆక్రమించుకోవడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఉక్రెయిన్ నాటోలో చేరడం రష్యాకు సుతరామూ ఇష్టం లేదు. తర్వాతికాలంలో తూర్పు ప్రాంతంలోని అత్యధిక ప్రాంతాల్లో పోరాడుతున్న వేర్పాటువాదులకు రష్యా మద్దతు ఇస్తూ వచ్చింది. అంతేకాదు. పశ్చిమ దేశాలు తన డిమాండ్లను అంగీకరించకపోతే సైనిక చర్య తప్పదని హెచ్చరిస్తూ వచ్చింది. నాటో ఇక తూర్పువైపునకు ఎట్టి పరిస్థితుల్లో విస్తరించరాదు. తూర్పు యూరప్ దేశాల్లో నాటో సైనిక కార్యకలాపాలు జరగడానికి వీల్లేదు. పోలండ్, బాల్టిక్ రిపబ్లిక్‌లైన ఇస్తోనియా, లాట్వియా, లిథుయేనియాల నుంచి నాటో తన పోరాట దళాలను ఉపసంహరించాలి. పోలెండ్, రొమేనియాల్లో క్షిపణులను మోహరించరాదు. ఒక్కమాటలో చెప్పాలంటే 1997కు ముందు నాటి సరిహద్దు ప్రాంతాలకు నాటో దేశాలు తమ సైనిక దళాలను ఉపసంహరించుకోవాలి. రష్యా చేస్తున్న ఈ డిమాండ్లను పశ్చిమ దేశాలు బేఖాతరు చేయడం ప్రస్తుత సైనిక చర్యకు ప్రధాన కారణం.
యుద్ధం మొదలు పెట్టడం సులభమే. ముగిం చడం పెద్ద సమస్య. ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ యుద్ధం ఎందుకు మొదలయింది? కరోనా దెబ్బతో కకావికలైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఏడాదిగా సాగుతున్న ఈ యుద్ధం ఎలాంటి ముద్రను మిగిల్చింది? వీటి గురించి ఇప్పుడు చర్చ అనివార్య మైంది.
నాటో అలయెన్స్‌కు రష్యా ఎందుకు వ్యతిరేకం?
యు.కె. యుఎస్‌లు సహా 30 దేశాలు నాటోలో సభ్యత్వం కలిగివున్నా యి. గతంలో యు.ఎస్. ఎస్.ఆర్.లో భాగస్వాములుగా ఉన్న లాత్వియా, ఎస్తోనియా, లిథుయేనియాలు నాటోలో చేరి పోయాయి. దీంతో ఐదు నాటో దేశాల సరిహద్దులు రష్యాతో పంచుకున్నాయి. ఈ విధంగా నాటో విస్తరణ తన భద్రతకు ప్రమాదమని రష్యా భావిస్తోంది. ఉక్రెయిన్ రష్యాకు దక్షిణ భాగంలో ఉండటమే కాదు, రష్యాకు సముద్రమార్గం ఉక్రెయిన్ నుంచి ప్రారంభ మవుతోంది. మరి ఉక్రెయిన్ కూడా యు.ఎ•.•తో చేతులు కలిపితే అది రష్యాకు సహజంగానే భద్రతాపరమైన సమస్య తెచ్చి పెడుతుంది. అందువల్లనే ఉక్రెయిన్ నాటో సభ్యురాలిగా చేరడం రష్యాకు ఇష్టంలేదు. నిజానికి యు.ఎస్.ఎస్.ఆర్. విచ్ఛిన్నం కావడం రష్యాకు సరికొత్త భద్రతా సమస్యలను తెచ్చిపెట్టింది. ప్రముఖ చరిత్రకారుడు స్టీఫెన్ కోట్కిన్ మాటల్లో చెప్పాలంటే పుతిన్ ఇప్పుడు అనుసరిస్తున్నది ‘రక్షణాత్మక దూకుడు’ వైఖరి. ఇదే సమయంలో తూర్పు ఉక్రెయిన్ విషయంలో 2015లో కుదిరిన మిన్‌స్క్ ఒప్పందం ఇప్పటి వరకు అమలుకాక పోవడం కూడా రష్యా అసహనానికి మరో కారణం. నాటో దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందిస్తున్న కారణం గానే, ఈ యుద్ధం ఇప్పటివరకు కొనసాగడానికి ప్రధాన కారణమని రష్యా భావిస్తోంది. ఇక ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరాలన్న దృఢనిశ్చయంతో ఉంది. తాను ఒకప్పుడు యు.ఎస్.ఎస్.ఆర్.లో అంతర్భాగమన్న విషయం మరచిపోయి, ఇప్పుడు రష్యాకున్న భద్రతా పరమైన సంశయాలను ఖాతరు చేయడం లేదు.
యూరప్ దేశాల్లో గందరగోళం
రష్యాపై ఏవిధంగా వ్యవహరించాలన్న విషయంలో పశ్చిమ దేశాల్లో కూడా ఏకాభిప్రాయం లేదు. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని, తగిన రాజనీతి జ్ఞతతో వ్యవహరించే నాయకత్వం నాటో దేశాల్లో కొరవడటం ప్రస్తుతం ఆ దేశాలను మరింత ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఎందుకంటే నాటో దేశాల ఇంధన అవసరాలు తీర్చేది రష్యా మాత్రమే. ఇప్పుడు అవి విధించిన ఆంక్షలతో తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కున్న చందంగా తయారైంది. ప్రస్తుత సందిగ్ధ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకొని, తానే నాయకుడిగా ఎదగాలన్న కాంక్ష ఫ్రాన్స్‌లో కనిపిస్తోంది. యూరోపియన్ యూనియన్ దేశాలు 39% సహజ వాయువును, 30% చమురును రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. మధ్య, తూర్పు యూరప్ దేశాలు తమ ఇంధన అవసరాల కోసం నూటికి నూరుశాతం రష్యాపై ఆధార పడుతున్నాయి. రష్యా విషయంలో ఈయూ దేశాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడానికి ఇదే ప్రధాన కారణం. ఇప్పుడు రష్యా ఆక్రమించుకున్న డోనెస్క్, లూహాన్స్ ప్రాంతంలో పెట్టుబడులను అమెరికా నిషేధించింది. దీతో పాటు పశ్చిమ దేశాలు కూడా ఆంక్షలు విధించాయి. రష్యాపై విధించిన ఆంక్షలు తిరిగి తమకే ఇబ్బందిగా మారడ•ంతో యూరప్ దేశాల్లో పరిస్థితులు దారుణ స్థితికి చేరుకున్నాయి. రష్యా నుంచి చమురు, ఆహార పదార్థాల దిగుమతులు ఆగిపోవడం, యూరప్ ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. యూరప్ ఆర్థిక వ్యవస్థలు బలీయమైనవి కావడం వల్ల తమ దేశాల ప్రజలను ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకోగలవు.
కానీ దీనికీ ఒక పరిమితి ఉంటుంది కదా! మరి ఈ యుద్ధం ఇట్లాగే కొనసాగితే యూరప్ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడం ఖాయం. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ మేఘాల్లో చిక్కుకొని కారుచీకట్లలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇది ఇట్లాగే కొనసాగితే ప్రపంచం మరో తీవ్ర ఆర్థికమాంద్యంలో కూరుకు పోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రూడాయిల్ ధరలు పెరగడంతో, ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతోంది. కొన్ని దేశాలకు ధాన్యం సరఫరా నిలిచిపోయి ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రష్యా సరఫరాలు నిలిచి పోవడం వల్ల ఏర్పడిన శూన్యతను పూడ్చడం దాదాపు దుస్సాధ్యమవుతోంది. రష్యా నుంచి సహజ వాయువు సరఫరాలు నిలిచిపోవడంతో, యూరప్ దేశాలకు ఈసారి శీతాకాలం నరకాన్ని తలపించేవిధంగా మారింది. ఈ ఆంక్షలన్నీ రష్యాను, ఆసియన్ ఆర్థిక దిగ్గజం చైనాకు మరింత దగ్గర చేసింది. ఇప్పటికే ఈరెండు దేశాలు 30 సంవత్సరాల గ్యాస్ సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఆంక్షలను నిర్వీర్యం చేసే పక్రియలో భాగమే. ఈ విధంగా ప్రస్తుత పశ్చిమ దేశాల వైఖరి రష్యా-చైనాల బంధాన్ని మరింత పటిష్టం చేస్తున్నది.
పెరిగిన ఆహారకొరత
ఈజిప్ట్, టర్కీ, ఆఫ్రికా దేశాల 70% ధాన్యం అవసరాలను రష్యా తీరు స్తున్నది. ప్రస్తుతం వీటికి సరఫరాలు నిలిచిపోవడంతో అవి అల్లాడుతున్నాయి. రష్యా ఉక్రెయిన్‌లు ప్రపంచంలోనే అత్యధిక గోధుమ ఉత్పత్తిదార్లు. ప్రపంచం లో 1/4 వంతు గోధుమ అవసరాలు తీర్చేది ఈ దేశాలు మాత్రమే. అసలే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న టర్కీ ప్రస్తుతం గోధుమ సరఫరాలు నిలిచి పోవడంతో తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నది. యుద్ధం, ఆంక్షల పుణ్యమాని చమురు, బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నం టాయి. ఆటోమోటివ్‌లు, సెల్‌ఫోన్లలో ఉపయోగించే పల్లాడియం కూడా రష్యా నుంచే ఎగుమతి అవుతుంది. ఫలితంగా ఈ వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
డాలర్‌పై ప్రభావం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం డీడాలరైజేషన్‌కు (డాలర్ పతనం) దారితీసింది. నిజంగా ఇదొక విచిత్రమైన అనివార్య పరిణామం. ప్రపంచంలో అత్యధికంగా చెలామణీ అయ్యేది డాలర్. ఒకదశలో 95% ప్రపంచ వాణిజ్య కేవలం డాలర్ మారకం ద్వారానే జరిగిందంటే ఆశ్చర్యపోవాల్సిందేమీలేదు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న యు.ఎస్. ప్రపంచ మార్కెట్‌లో మూడు ట్రిలియన్ల డాలర్లను చెలామణి లోకి తెచ్చింది. ఇదే సమయంలో 38 ట్రిలియన్ డాలర్ల విలువైన ట్రెజరీ బాండ్లను విడుదల చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో బంగారంతో ఏ విధమైన సంబంధంలేని కరెన్సీ బహుశా ఇదేనేమో! యు.ఎ.లో ప్రస్తుతం దాదాపు 500 బిలియన్ డాలర్ల విలువైన బంగారం నిల్వలున్నాయి. డాలర్ విలువ ప్రపంచంలో దాని చెలామణీపై ఆధారపడి ఉంటుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ మార్కెట్‌లో డాలర్ చెలామణి తగ్గిపోవడానికి దారితీసింది. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి ఏర్పడకపోవడం గమనార్హం. ఇప్పటి వరకు రష్యాతో డాలర్‌తో లావాదేవీలు కొనసాగించిన దాదాపు 60 దేశాలు ఇప్పుడు రూబుల్స్‌తో జరుపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలు ప్రస్తుతం చైనా యువాన్ కరెన్సీతో, 28 దేశాలు భారత రూపాయితో తమ లావాదేవీలు జరుపుతున్నాయి. ఈవిధంగా ఇతర కరెన్సీలను ఆమోదించడం మొదలు కావడంతో ప్రపంచ మార్కెట్‌లో 20% వరకు డాలర్ల చెలామణి తగ్గిపోయింది. రానున్న కొద్ది సంవత్సరాల్లో ఈ పరిణామం అమెరికా ఆర్థిక వ్యవస్థపై తప్పక పడుతుంది. ఇది జరగడం అమెరికాకు ఎంతమాత్రం ఇష్టంకాదు. అందుకనే యుద్ధం కొనసాగితే ప్రపంచాన్ని తన మార్గంలో నడిచేలా చేయవచ్చు నన్నది అమెరికా వ్యూహం. ఈ యుద్ధ పరిణామంతో చలి కాచుకోవడానికి యత్నిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇటీవల ఉక్రెయిన్‌లో పర్యటించడానికి ప్రధాన లక్ష్యం రెచ్చగొట్టడమే. యుద్ధం కొనసాగడం అమెరికా ఆర్థిక వ్యవస్థ మనుగడకు అత్యవసరం. ఇక యుద్ధంవల్ల దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థలు తమ మనుగడ కోసం చేసే ప్రయత్నంలో భాగమే ఈ డీడాలరైజేషన్!.
తప్పిన అమెరికా అంచనాలు
ఈ యుద్ధం నేపథ్యంలో రష్యాను తన కాళ్ల బేరానికి తెచ్చుకోవచ్చునన్న అమెరికా అంచనాలు తల్లక్రిందులయ్యాయి. ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాల నేపథ్యంలో రష్యా, చైనా, ఇరాన్, టర్కీలు సరికొత్త కూటమిగా ఏర్పడుతున్నాయి. చైనా, ఇరాన్‌లు సైనికపరంగా రష్యాకు సహాయం చేస్తుం డగా, టర్కీ మాత్రం కాస్పియన్, ఇరాన్, అరేబియన్ సముద్రాల గుండా చక్కటి సరఫరా గొలుసుకట్టు వ్యవస్థను ఏర్పరుస్తోంది. దీన్నే నార్త్-సౌత్ ట్రాన్స్ పోర్ట్ కారిడార్ (ఐఎన్‌ఎస్‌టీసీ) అని పిలుస్తున్నారు. ఆసియన్ మార్కెట్లు లక్ష్యంగా ఈ ఐఎన్‌ఎస్‌టీసీ ఏర్పాటవుతోంది. నిజానికి టర్కీ మనుగడకు ఇది చాలా అవసరం కూడా! ఈ కారిడార్ పశ్చిమ దేశాల ఆధిపత్యానికి ఒక సవాలే. ఎందుకంటే అమెరికా, యూరప్‌దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలు ఈ సరికొత్త కారిడార్‌కు వర్తించవు! ప్రస్తుతం చైనా- అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మనకు తెలిసినవే. ఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తూర్పు-పశ్చిమ ఆర్థిక ఫ్రంట్‌ల ఏర్పాటుకు దోహదం చేస్తున్నది.
పనిచేయని ఆంక్షలు
2014లో రష్యా క్రిమియాను ఆక్రమించినప్పుడు రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ అనుభవం నేర్పిన పాఠంతో ఈసారి ఉక్రెయిన్‌పై దాడికి దిగడానికి ముందే ఆంక్షల ప్రభావం తక్కువ ఉండేలా రష్యా జాగ్రత్తపడింది. అయినప్పటికీ రష్యాపై ఇప్పటి వరకు 2700 ఆంక్షలు కొనసాగు తుండగా, ఆ దేశానికి చెందిన 300 బిలియన్ డాలర్ల విలువైన బంగారం నిల్వలను పశ్చిమ దేశాలు స్తంభింపజేశాయి. రష్యాపై విధించిన ఆంక్షల్లో ప్రధానమైంది దాని స్విఫ్ట్ చెల్లింపుల వ్యవస్థను బ్లాక్ చేయడం. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ (స్విఫ్ట్) అనేది బెల్జియం ఫైనాన్షియల్ సర్వీసు. ప్రపంచ వ్యాప్తంగా 11వేల ఆర్థికసంస్థలను ఇది అనుసంధానించడమే కాకుండా, లావాదేవీల విషయంలో బ్యాంకులు పరస్పరం జాగ్రత్తలు తీసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. కానీ ఇప్పుడు రష్యా సహా పలుదేశాలు సొంత చెల్లింపుల వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవడంతో ఈ నిషేధం పెద్దగా పనిచేయడం లేదు. రష్యా ఎగుమతులు తిరిగి ప్రారంభమయ్యాయి. రష్యా నుంచి చౌక ధరలో చమురు ప్రపంచవ్యాప్తంగా రవాణా అవుతోంది. అధిక సంఖ్యలో దేశాల రూబుల్ మారకం ద్వారా ఈ చౌకధరలో చమురును కొనుగోలు చేస్తున్నాయి. వీటిల్లో ప్రధాన దేశం భారత్. ఇక దిగుమతుల విషయానికి వస్తే ఆసియన్ దిగ్గజం చైనా ఆ కొరతను తీరుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ యవనికపై పుతిన్ బలహీనపడటం మాట ఎలా ఉన్నా, మరింతగా బలపడ్డాడన్నది సుస్పష్టమవుతోంది.
బలిపశువులైన ఉక్రెయిన్ ప్రజలు
తమ దేశ రాజకీయ నాయకుల తెలివితక్కువ పనులు, పశ్చిమ దేశాల దురహంకారం వెరసి ఉక్రెయిన్ ప్రజలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. యుద్ధం జరిగేది ఉక్రెయిన్ భూభాగంలో. ఆయుధాలు కుప్పలుతెప్పలుగా సరఫరా చేసేది పశ్చిమ దేశాలు. ఈ ఆధిపత్యపోరులో ఉక్రెయిన్ ప్రజల కడగండ్లు పట్టించుకునే నాథుడే లేడు. ఆహారం, మందులు, నిత్యావసరాలు, నీరు, పునర్‌నిర్మాణం, ఆశ్రయ కల్పన వంటివి లేకపోవడంతో ఉక్రెయిన్ ప్రజలు అల్లాడుతున్నారు. ఇంత జరుగుతున్నా దేశాధినేతల్లోని అహంకారం కాల్పుల విరమణ దిశగా ముందుకెళ్ల నీయడం లేదు.
భారత్‌పై ప్రభావం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ప్రపంచదేశా లతో పాటు భారత్‌పై కూడా పడింది. ఆశ్చర్యకరంగా ఈ ప్రభావం మిగిలిన దేశాలంతగా లేదు. భారత్ వృద్ధిరేటు అనుకున్నదానికంటే వేగం మందగించి నప్పటికీ, ప్రపంచంలో వేగంగా పురోగమిస్తున్న ఆర్థికవ్యవస్థల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలు భారత్‌కు ఒక రకంగా వరంగా మారాయనే చెప్పాలి. రష్యా మన దేశానికి తక్కువ ధరలో క్రూడాయిల్ సరఫరాకు అంగీకరించడంతో 2022 ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో ఒక్కసారిగా రష్యానుంచి క్రూడాయిల్ దిగుమతులు ఐదురెట్లు పెరిగాయి. 2021-22లో మనదేశం చమురు దిగుమతుల విషయంలో రష్యాది 18 స్థానం. కేవలం పదినెలల కాలంలో రష్యా నాల్గవ స్థానానికి ఎగబాకింది. జి-7, యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యా చమురుపై బ్యారల్‌కు 60 డాలర్ల పరిమితి విధించడంతో, రష్యా అంతకంటే తక్కువ ధరకే మన దేశానికి చమురు సరఫరా చేస్తోంది. దీంతో 2022 డిసెంబర్‌లో మన చమురు దిగుమతులు రోజుకు 1.2 మిలియన్ బ్యారల్స్‌కు చేరుకున్నాయి. ఇదే సమయంలో ఇరాక్‌నుంచి 7% దిగుమతులు పెరిగి రోజుకు 886,000కు చేరుకోగా, సౌదీ అరేబియా నుంచి 12% పెరిగి రోజుకు 748,000 బ్యారల్స్ కొనుగోలు చేస్తున్నాం. ఇప్పుడు మన దేశానికి రష్యా, చైనాలు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములుగా ఉన్నాయి. ఇదే సమయంలో మొత్తంమీద మన ఎగుమతులు 17% పెరగడం గమనార్హం. నిజం చెప్పాలంటే రష్యా క్రూడాయిల్ మనదేశంలో ద్రవ్యోల్బణం పెరగకుండా అడ్డుకున్నదనే చెప్పాలి.
తటస్థవైఖరే మనబలం
భారత్‌లకు రష్యా-ఉక్రెయిన్‌లతో ద్వైపాక్షిక సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో సంఘర్షణ ప్రారంభమైన తొలినాటినుంచి ‘చర్చల ద్వారా మాత్రమే శాంతియుత పరిష్కారం సాధ్యం’ అని నొక్కి చెబుతూ రావడమే కాదు… తటస్థవైఖరిని కొనసాగిం చింది. ఇదే సమయంలో యుఎన్, ఇతర దేశాలు ఈ సంఘర్షణకు అరికట్టేందుకు చర్యలు తీసు కోవాలని పిలుపునిచ్చింది. ఈ యుద్ధం నేపథ్యంలో పుతిన్-జెలన్‌స్కీ మధ్య సంబంధాలను సమతుల్యంగా నిర్వహించడంలో భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహ రించింది. ఇదే సమయంలో ఈ యుద్ధం రష్యా – పశ్చిమ దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీయడం భారత్‌కు మరో తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఈ రెండు పక్షాల మధ్య భారత్ ఎంతో వ్యూహాత్మ కంగా తన విదేశాంగ విధానాన్ని అమలు చేయడం వల్ల అనుకోని లాభాలు కలుగుతున్నాయి. ఒక్క చైనా, పాకిస్తాన్ తప్ప మరే దేశంతో శత్రుత్వం లేకపోవడం భారత్‌కు కలిసొచ్చిన అంశం. అందువల్ల మనదేశ విధానాన్ని ఏ దేశమూ తప్పు పట్టలేని స్థితి నెలకొనడంతో, ప్రపంచ స్థాయిలో సమస్యల పరిష్కార గురువుగా అన్నిదేశాలు మనదేశంవైపే చూసే పరిస్థితి నెలకొంది. ఫలితంగా అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ కీలకపాత్ర పోషించే స్థాయికి ఎదిగింది.
రష్యా అధ్యక్షుడు సాధారణంగా తన స్థాయి నాయకులతో తప్ప మరెవరినీ కలవరు, చర్చించరు. విచిత్రంగా ఇటీవల భారత జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోవల్ రష్యా వెళ్లినప్పుడు, ప్రొటోకాల్ పక్కనపెట్టి పుతిన్ ఆయనతో గంటసేపు ఏకాంతంగా సమావేశం కావడం, భారత్‌కు ఆయన ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో చెబుతోంది. ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం చీఫ్ యాండ్రీ యెర్‌మార్క్, అజిత్ దోవల్‌తో మాట్లాడుతూ, ఉక్రెయిన్‌లో శాంతిస్థాపనకు వీలుగా ఐక్యరాజ్యసమితిలో ఒక ముసాయిదా తీర్మానానికి అనుకూలంగా ఓటు చేసి సహాయం చేయమని కోరడం మరో గుర్తించదగ్గ పరిణామం. ముఖ్యంగా డొనెక్స్‌కు చెందిన బఖ్‌మత్ పట్టణాన్ని రక్షించుకోవడం తమకు కష్టసాధ్యంగా మారిందని ఆయన మొరపెట్టుకున్నారు. గతంలో జెలన్‌స్కై మన దేశంపై ఆంక్షలు విధించాలని యుఎస్, ఇతర పశ్చిమ దేశాలను కోరినా వాటినుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆయనకూ భారత్ విలువ తెలిసొచ్చింది. ఐక్యరాజ్య సమితిలో ఫ్రాన్స్- రష్యాలమధ్య వాదోపవాదాలు జరిగిన నేపథ్యంలో ఫ్రాన్స్ కూడా ఈ ముసాయిదాకు అనుకూలంగా ఓటు చేయాలని భారత్‌ను కోరింది. ఇన్ని రకాల ఒత్తిళ్లున్నప్పటికీ ఫిబ్రవరి 23న జరిగిన ఓటింగ్‌లో భారత్ తటస్థ వైఖరినే అవలంబించింది. 141 దేశాలు తీర్మానానికి అనుకూలంగా, 7 దేశాలు వ్యతిరేకంగా ఓటు చేయగా, 32 దేశాలు తటస్థంగా ఉండిపోయాయి. ఇప్పటివరకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై యు.ఎన్.లో ప్రవేశపెట్టిన తీర్మానాలకు ఓటింగ్ విషయంలో భారత్ తటస్థవైఖరినే ఎంచుకుంది. ఇక అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యు.కె. తదితర దేశాలు ఈ యుద్ధాన్ని ఆపేశక్తి కేవలం భారత్‌కు మాత్రమే ఉన్నదని విశ్వసిస్తుండటం కూడా అంతర్జాతీయంగా పెరిగిన భారత ప్రతిష్టకు నిదర్శనం.
‘వసుధై•క కుటుంబకం’ అనేది మన దేశం విధానం. ప్రభుత్వాలు వస్తుం టాయి, పోతుంటాయి. కానీ ప్రజలే శాశ్వతం. వారి సంక్షేమమే ప్రధాన లక్ష్యం. ఇదే ప్రస్తుతం మన విదేశాంగ విధానంలోని కీలకాంశం. టర్కీ ప్రభుత్వం మనతో ఎంతగా విభేదిస్తున్నప్పటికీ, భూకంపంతో విలవిలలాడుతున్న స్థితిలో అక్కడి ప్రజలకు తొలి సహాయం అందించిన దేశాల్లో భారత్ ముందుంది. దేశ ప్రయోజ నాలు, ప్రపంచ ప్రజల సంక్షేమమే ప్రధాన అజెండాగా ముందు కెళుతున్న భారత్‌ను ఏ దేశమూ వేలెత్తి చూపలేదు. ఇంతటి విశాల భావంతో ముందుకెళుతున్న భారత్‌పై విషం చిమ్మే పాకిస్తాన్ ఇప్పుడు జోలె పట్టుకొని అడుక్కునే స్థితికి దిగజారింది. మనల్ని ఇబ్బంది పెడుతున్న చైనా అంతర్గతంగా తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. విశాల హితంకోసం పనిచేసే దేశానికి ప్రకృతి కూడా సహకరిస్తుందనడానికి ఇంతకుమించిన సాక్ష్యం మరొకటి లేదు.