వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

– కె.వి.లక్ష్మణరావు


‘‘సార్‌! ‌మొండిబాకీని ఎలాగైనా వసూలు చేసేయాలని ఇంత దూరం తీసుకొచ్చేశారు. ఇక్కడ చూస్తే బైక్‌ ఆగిపో యింది. ఊరు కానీ ఊరు; పైగా పల్లెటూరు. ఏం చేద్దాం సార్‌?’’ అసహనాన్ని వ్యక్తం చేస్తూ అడిగాడు సుందరం.

‘‘సుందరం! రంగారావు మొండిబాకీని ఎలాగైనా వసూలు చేస్తానని బ్యాంక్‌ ‌మేనేజర్తో ‘చాణక్య శపథం’ చేసి మరీ వచ్చాను. ‘‘విషయం, వివరం కనుక్కో కుండా వెనక్కి వెళ్లేది లేదు. ఎన్ని అవాంతరాలెదురైనా సరే!’’ అన్నాను.

 ‘‘ఫీల్డ్ ఆఫీసర్‌ అనిపించుకున్నారు.!’’ అసహనాన్ని అలా వ్యక్త పరుస్తూ అన్నాడు సుందర్‌.

‘‘‌తప్పదు..! ఊళ్లోకి వచ్చేస్తుంటాం..’’ అంటూ బైక్‌ ‌సెంటర్‌ ‌స్టాండ్‌ ‌వేశాను. బైక్‌ ‌రిపేర్‌ ‌సెంటర్‌ ‌కూడా కనుచూపు మేరలో లేదు. అసలే శీతాకాలం, ఆకాశం నిండా మబ్బులు ఆవరించడంతో పగలు కూడా సాయంత్రంలా ఉంది. ‘‘బాకీ ముందు, బైక్‌ ‌బాగు పడటం తరువాత’’ సుందర్‌తో అన్నాను.

మా వైపుగా పంచెకట్టులో ఉన్న పెద్ద మనిషి వస్తున్నాడు. పట్నంలో ఒకరి ఆచూకీ చెప్పమంటే ఎవ్వరూ చెప్పరు కానీ అదే పల్లెటూరిలో మనిషే కాదు, ప్రతీ చెట్టూ-పుట్టా కూడా చెబుతుంది.

‘‘రంగారావు ఇంటికి ఎలా వెళ్లాలి ?’’ పెద్ద మనిషినడిగాను.

అతను ఆగి… ‘‘ఈ ఉళ్లో రంగారావులు చాలా మందే ఉన్నారు. మీకు ఏ రంగారావు’’ కావాలి? అడిగాడు. నేను చెప్పలేక సుందర్‌ ‌కేసి చూశాను.

‘రైతు కూలీ’ సుందర్‌ అన్నాడు.

‘ఊళ్లో అందరూ రైతులే… మీకు ఏ రంగారావు కావాలి?’’ పెద్దమనిషి వెంటనే అడుగుతూ జవాబు కోసం చూశాడు.

‘‘కష్టం’’ అనుకుంటూ సుందర్‌ ‌కేసి చూశాను.

నా అసహనాన్ని కనిపెట్టేసిన సుందర్‌ ‌తన ఫోన్లో ఉన్న రంగారావు ఫోటోను పెద్దమనిషికి చూపిం చాడు. ‘‘బుర్రకథ రంగారావా?’’ అంటూ ఆ పెద్దమనిషి, ‘‘తిన్నగా వెళ్లండి. అమ్మవారి గుడి వస్తుంది, గుడి నుండి కుడివైపు తిరగండి, కొంత దూరం వెళ్లాక.. పూరిపాకే అయినా ‘బుర్రకథలు చెప్పబడును’ అన్న చెక్కబోర్డు కనబడుతుంది. అక్కడే ఉంటాడ వెళ్లండి బాబూ!’’ సవివరంగా చెప్పాడు.

‘ధన్యవాదాలండీ’! అంటూ ముందుకు కదిలాను.

నాతో సుందర్‌ ‘‘‌బుర్రకథ రంగారావని అడగాలట. ఆ మాట వినగానే భలే నవ్వొచ్చింది సార్‌?’’ అన్నాడు.

‘‘ఎందుకని?’’ అడిగాను.

‘‘ఈ రోజుల్లో బుర్రకథలెవరు చూస్తారు సార్‌. ‌బుర్రఉన్న వాళ్లెవ్వరూ చూడరు. పెద్దవాళ్లకి గుర్తు లేదు, చిన్నవాళ్లకి వాటితో పనిలేదు!’’ వెటకారంగా అన్నాడు.

సుందరం మాట నాకు నచ్చలేదు. ‘‘జానపద కళలలో బుర్రకథ ఒకటి… నీకు తెలిసే వెక్కిరిం చావా?’’ ఒక్కసారిగా సుందరం కేసి సీరియస్గా చూస్తూ అన్నాను.

సుందర్‌ ‌కూడా వెనక్కి తగ్గకుండా… ‘‘పోనీ మీకు తెలుసా సార్‌?’’ ఎదురు ప్రశ్న అడగటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

నేను సుందరానికిచ్చిన చనువుతోనే చొరవగా అలా అన్నాడనిపించింది. బుర్రకథ గురించి చెప్పడం ఇప్పుడవసరం అనిపించింది.

నేను కోపం తగ్గించుకుంటూ ‘‘సుందర్‌…! ‌బుర్ర కథ పితామహుడు షేక్‌ ‌నాజర్‌. ‌జానపద కళలలో బుర్రకథ కూడా ఒకటి. ‘‘వినరా భారత వీర కుమార వీరగాధ నేడు’’! అంటూ తంబుర చేతపట్టి అభినయం చేస్తూంటే, అటూ ఇటూహాస్యం, కథ చెప్పేవాళ్లు జోడు గుర్రాల్లా అభినయిస్తూ డిక్కీ కొడుతుంటారు, చూసేవాళ్లు తమని తాము మరిచిపోతారు. వాళ్లు చెప్పే కథలో లీనమైపోయి మైమరచి పోతారు’’

‘‘ఇవన్నీ మీకెలా తెలుసుసార్‌?’’ ‌సుందరం ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగాడు.

‘‘మా నాన్న కామేశం బుర్రకథ కళాకారులు’’ అంటూ గర్వంగా చెప్పాను. సుందరానికి నాన్న పేరు చెప్పగానే నా గతం కళ్లముందు కదలాడింది.

‘‘కుమార్‌! ‌డిక్కీ వాయించమంటే నీకంతిష్టమా?’’ నాన్న బుర్ర కథ చెప్పేందుకు మేకప్‌ ‌వేసుకుంటూ నన్ను చూసి అడిగారు.

డిక్కీ వాయించడం ఆపి నాన్న కేసి నవ్వుతూ చూశాను.

‘‘ఆపకు! బాగా వాయిస్తున్నావురా. ఈసారి బుర్రకథ రిహర్సెస్లో నీకు బుర్రకథ నేర్పిస్తాను! సరేనా?’’ నాన్న నన్ను దగ్గరకు తీసుకుంటూ అన్నారు.

నాలో ఆనందంతో కూడిన ఉద్వేగం కలిగింది. ‘‘అలాగే నాన్నా! మీ ప్రోత్సాహం’’ అన్నాను.

సత్యహరిశ్చంద్ర, అల్లూరి సీతారామరాజు, తాండ్ర పాపారాయుడు వంటి వీరుల చరిత్రను నాన్న క్షుణ్ణంగా చదివి ఆ చరిత్రను బుర్రకథ రూపంలోకి మార్చి రాసేవారు. పాటలు కూడా చేర్చి బుర్రకథగా చెప్పేవారు. షేక్‌ ‌నాజర్‌ ‌గారి పాటలను కూడా పాడేవారు.

అల్లూరి సీతారామరాజులో ‘‘లాగరా.. హైలెస్సో… లాగరా.. హైలస్సా’’ అంటూ గిరిజనులు రోడ్డు వేస్తూ పాడే పాటనూ, బొబ్బిలి యుద్ధంలో ‘‘అరెరే… ఇక్కడ పుట్టిన ‘కుందేలు’ అక్కడ ‘కుక్క’ను ధిక్కరించుమన్నా!’’ అంటూ బొబ్బిలి ప్రాంతం పౌరుషం చెప్పే పాటలను. బుర్రకథలో చెబుతూంటే ప్రేక్షకులు లేచి చప్పట్లు కొట్టేవారు.

గణపతి నవరాత్రులకు, దేవీనవరాత్రులకు గుడి ప్రాంగణంలో వేదిక మీద నాన్న మరో ఇద్దరి కళాకారులతో బుర్రకథ చెప్పేవారు.

‘‘మా గుడి వద్ద చెప్పండి, మా ఉళ్లో చెప్పండి’’ అంటూ ఎక్కడెక్కడి వాళ్లో వచ్చి ఉదయం నుండీ మా ఇంటి ముందు క్యూ కట్టేవారు. ఆరోజుల్లో నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లేవి. కానీ అన్ని రోజులూ ఒకేలా ఉంటే అది జీవితం ఎందుకవుతుంది.?

సినిమా ప్రభావం బాగా పెరిగింది. నవరాత్రి ఉత్సవాల్లో కూడా రోడ్డు మీద రాత్రి ప్రదర్శించే సినిమాకే గిరాకీ పెరిగింది. బుర్రకథ ప్రభావం బాగా తగ్గింది. కేవలం కళను నమ్ముకుని బ్రతికే నాన్నలాంటి కుటుంబాల నోట్లో మట్టి కొట్టింది సినిమాయే’!! చాలా మంది కళాకారులు మూలన పడిపోవాల్సి వచ్చింది..

ఒకప్పుడు మా ఇంటికి వచ్చి బుర్రకథ చెప్పమని నాన్నను అడిగిన వాళ్లందరూ నాన్న కనబడితే మొహం చాటేస్తున్నారు. బ్రతుకు తెరువు కోసం నాన్నే స్వయంగా పందిట్లోకి వెళ్ళి ‘‘బుర్రకథ చెబుతాం బాబూ’’! అని అడిగే (దు)స్థితికొచ్చేశారు. అప్పుడు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను.

దీనంగా ఉన్న నాన్నతో ‘‘నాన్నా! తోలు బొమ్మలాటలు చెప్పేవాళ్లకు రోజులు లేవు, నాటకం వేసేవాళ్లు పగటి వేషగాళ్లుగా మారి బ్రతుకీడుస్తున్నారు. ఇప్పుడు బుర్రకథ చెప్పే నీలాంటి వారికి కూడా ఈ పరిస్థితి దాపురించింది. ‘రంగు’ పూసుకుని కళను నమ్ముకుని బ్రతికే కళాకారుల జీవితాలలో రంగులు లేవు, పగటి పూట గడవదు, రాత్రి నిద్రపట్టదు. ‘కల’కు కూడా నోచుకోని ‘‘కళ’ లెందుకు? నాన్నా! బాధగా అడిగాను.

నా బాధలో ఆవేశాన్ని గమనించిన నాన్న నన్ను దగ్గరకు తీసుకుంటూ ‘‘కుమార్‌! ‌కళలెప్పుడూ గొప్పవే, కానీ రోజులే మారిపోతాయి. సినిమా ప్రభావంతో బుర్రకథ ప్రభావం తగ్గడం మాట నిజమే…కాదనను. కానీ తగ్గిందని తలొగ్గడం మనిషి లక్షణం కాదురా! అది ధీరగుణం అనిపించుకోదు. ఓర్పుతో వేచి ఉండాలి. సత్యహరిశ్చంద్రుడు సత్యం కోసం కష్టాలెన్నో పడ్డాడు. పాలకుని స్థాయి నుండి కాటికాపరిగా దిగజారినా కూడా సత్యాన్ని వీడలేదు. కష్టాలు తృణప్రాయంగా త్రోసి ‘రాజ’న్నాడు. తిరిగి సత్యంతో పాటు తాను నెగ్గి, మహరాజయ్యాడు. ఆయన కథనే బుర్రకథగా చెప్పిన నేను ఇప్పుడు కష్టం వచ్చిందని కృంగిపోతే ఎలా.? ‘కళ’’.. నా దృష్టిలో ‘కల’గా మిగిలిపోకూడదు. జీవం కోల్పోయిన కళ తిరిగి పునరుజ్జీవం పొందుతుంది. నాకా నమ్మకం ఉంది!’’ అన్నారు.

నాన్న మొక్కవోని ధైర్యానికి, సంకల్పబలానికి చాలా సంతోషం వేసింది.

బుర్రకథ పునరుజ్జీవం కోసం ఎవరి దగ్గరా పైసా పుచ్చుకోకుండానే బుర్రకధలు చెప్పేవారు. నాకది నచ్చక… ‘‘నాన్నా! పైసలు రాని, విలువలేని బుర్రకథను చెప్పి సమయాన్ని పాడుచేసుకోకు. బ్రతుకుతెరువు కోసం మరో పని చేయరాదా?’’ అని నేను అన్నప్పుడు ‘‘కుమార్‌! ‌పంట పండలేదని నష్టం వచ్చిందని రైతు పుడమిని నిందించడు. తిరిగి అదే నేలపై సాగుకు సిద్ధమౌతాడు. కళాకారుడు కూడా అంతేరా? ఒకప్పుడు నన్ను బ్రతికించిన కళను తిరిగి బ్రతికించుకోపోతే ఎలా? అప్పు పెరిగిపోదూ?’’ అంటూ చమత్కారంగా మాట్లాడేవారు. శ్వాస ఆగిపోయే వరకూ బుర్రకథనే ధ్యాసగా బ్రతికారు. నాన్నను బ్రతికించలేని బుర్రకధ అంటే నాకు అసహ్యం వేసి అప్పటి నుండీ అటువైపు పోలేదు. కానీ నాన్న ‘కళ’ను కొనసాగించలేకపోయానన్న బాధ మాత్రం ఈ మధ్యనే కలుగుతోంది. కనీసం కళకు గౌరవం ఇవ్వాలనీ, తప్పు సరిదిద్దుకోవాలనీ మనసులో వేదన మొదలైంది.

నా కళ్లు తడిబారుతున్నాయి. అది చూసి ‘‘సారీ! సార్‌’’ అన్న సుందర్‌ ‌మాటతో ప్రస్తుతంలోకి వచ్చాను. జ్ఞాపకం నెమరు వేసుకుంటూనే రంగారావు ఇంటికొచ్చేశాను. పూరిపాక, సూర్యచంద్రులు కూడా ఆ పాకలో తలదాచుకునేలా పైన అక్కడక్కడా చిల్లులున్నాయి. అక్కడక్కడా గుంటలు పడిన అరుగు మీదే కుదురుగా కూర్చుని రంగారావు ఉన్నాడు.

తంబుర చేత బూని… ఎడమ చేతుల్లో రెండు కంజిరలు పట్టుకుని ‘‘వినరా భారత వీరకుమారా! వీరగాథ నేడు..తందాన తాన!’’ అంటూ ఒక్కడే బుర్రకధ పాట పాడుతూ, మా ఇద్దరిని చూసి ఒక్కసారిగా ఆగాడు. అతణ్ణి చూస్తున్న చిన్న పిల్లలతో ‘‘నా కోసం ఎవరో వచ్చారు మీకు తరువాత బుర్రకథ నేర్పుతాను వెళ్లండి!’’ అన్నాడు.

‘‘అలాగే తాతయ్యా!’’ అంటూ పిల్లలు వెళ్లారు…

‘‘చెప్పండి బాబూ! మీ ఊరిలో బుర్రకధ ప్రదర్శన ఇవ్వాలా?’’ ఎంతో ఆర్తిగా, ఆశగా అడిగాడు.

నాకు నాన్న గుర్తొచ్చారు. గొంతు గద్గదమైంది. మాట రాలేదు.

నా పరిస్థితి గమనించిన సుందర్‌…‘‘‌కాదండీ! మేము బ్యాంక్‌ ‌నుండి వచ్చాము. మీ మొండీబాకీ గురించి అడగడానికొచ్చాము!’’ విషయం సూటిగా చెప్పాడు.

వెంటనే రంగారావు ‘‘కూర్చోండి బాబూ! అంటూ నాలుగో కాలు సరిగా లేని పీటను మా ముందు వేసి వినయంగా నిల్చొన్నాడు.

‘‘మీరు నిలబడకండి! కూర్చోండి.!’’ అంటూ నేను అరుగు మీద కూర్చున్నాను.

నా ముందు మొహమాటంగా కూర్చుంటూనే ‘‘పంట పండలేదు. నష్టం వచ్చింది. కానీ వ్యవసాయం మానలేను. బుర్రకథ ‘‘కళ’’ తప్పింది. కానీ కళను వీడలేను. కాలం కలిసొస్తుంది. శిశిరం వెనుక వసంతం వస్తుంది. పంట పండుతుంది కళకు పునరుజ్జీవం కూడా వస్తుంది. అప్పుడు మీ బాకీ వడ్డీ సహా తీర్చేస్తాను’’ నేను ఏమి అడక్కుండానే రంగారావు చెప్పాడు.

ఆయనలో ‘‘నాన్న’’ కనిపిస్తున్నాడు. ఆయన మనోధైర్యంలో నాన్న వినిపిస్తూన్నాడనిపించింది.

కష్టంలో కళను వీడలేదు. పిల్లలకు నేర్పుతూ బుర్రకథకు పునరుజ్జీవం కలిగిస్తున్నారు.

నేను వెంటనే లేచాను. చేతులు జోడించిన రంగారావు చేతులను పట్టుకుంటూ మా అపార్ట్మెంట్‌ ‌వద్ద ప్రతీ సంవత్సరం సంక్రాంతి పండుగకు ఉత్సవాలు జరుగుతాయి. అక్కడ మీ బుర్రకథ ప్రదర్శన కావాలి. మేము వచ్చింది మీ బాకీ వసూలు చేయడానికే కాదు, మీ ప్రదర్శన ఇవ్వాలని అడగడానికి కూడా వచ్చాం ఇస్తారా?’’ వినయంగా అడిగాను.

రంగారావు కళ్లు తడిబారాయి. రెండు కళ్లనూ తుడుచుకుంటూ ‘‘తప్పకుండా! బుర్రకథ ప్రదర్శన ఇస్తాను బాబూ!’’ అన్నారు. ఆ మాటల్లో బుర్రకథ మళ్లీ జీవం పోసుకున్నట్లనిపించింది.

‘‘ఇరవై వేలు’’ చెక్‌ ‌రంగారావు చేతుల్లో పెట్టాను. సుందర్‌… ‌నన్ను ఆశ్చర్యంగా గమనిస్తున్నాడు… ‘‘దేనికి బాబూ!’’ రంగారావు నన్నడిగారు.

‘‘మీ కథా ప్రదర్శనకు! వద్దనకండి’’ అన్నాను.

చాలా సంతోషం బాబూ! కానీ బ్యాంకు బాకీ పడిన ఇరవై వేల రూపాయలు అప్పును మీరే తీర్చేయండి బాబూ!’’ అంటూ చెక్కును నా చేతిలో తిరిగి పెట్టాడు.

‘నిజమైన కళాకారులంతే అప్పును ఉంచుకోరు’’ అనిపించింది.

నేను నవ్వుతూ చెక్కు తీసుకుని ‘‘మీ బాకీ తీరింది. ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తానంటూ భుజం తట్టాను’’.

అప్పుడే అక్కడ గోడ మీద వేలాడుతున్న ఫొటో అప్రయత్నంగా చూశాను.

‘ఫొటోలో ఉన్నది? రంగారావు…’ దాని గురించి అడిగాను.

ఆయన ఆ ఫొటో వద్దకు వెళ్లి ‘‘మా గురువుగారు బాబూ! ఆయన శిష్యులలో నేనూ ఒకడిని’’ గర్వంగా చెప్పారు.

నా కళ్లలో అప్రయత్నంగా నీళ్లు…అవి కన్నీళ్లు కావని, ఆనంద బాష్పాలని అర్థమైంది. తడిబారిన కళ్లను తుడుచుకుంటూ ‘కళ•’ ‘కల’ కాలేదు… పునరుజ్జీవమయింది. అన్నాను… ఫొటోలో ఉన్న నాన్నకు దణ్ణం పెడుతూ…

About Author

By editor

Twitter
YOUTUBE