నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాలు
వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజాభ్యున్నతి ప్రధానమని నమ్మి ముఖ్యమంత్రి పదవిని సయితం తృణప్రాయంగా పరిత్యజించిన నేత. సువిశాల ఆంధప్రదేశ్ రాష్ట్ర అవతరణకు ముఖ్యకారకులు. దీనివల్ల తన పదవికి ముప్పువాటిల్లుతుందని తెలిసినా వెరవనివారు బూర్గుల రామకృష్ణారావు. ఆయన సరియైన సమయం రాగానే ఆంధ్రులకు ఒకే రాష్ట్రం ఉండాలని ప్రతిపాదించారు. దానికి కేంద్రమంత్రి మౌలానా ఆజాద్ ‘మీ ప్రతిపాదనకు గల ఉద్దేశ మేమిటి’ అని అడిగినప్పుడు ‘హైదరాబాద్ పక్క రాష్ట్రంలో విలీనమైనప్పుడు అది విశాలమైన ఒక దేశంలో ఒక చిన్నభాగంగా ఉండి పోగలదన్న విషయం విస్మరించరాదు. అప్పుడు నేను దానికి ముఖ్యమంత్రిగా వుండను. నా ఈ ప్రతిపాదనకు అర్థం నా రాజకీయ మరణ వారంటుపై నేనే సంతకం చేసుకోవడమన్న మాట’ అని నిర్భయంగా చెప్పారు.
తెలుగునేలను పాలించిన ముఖ్యమంత్రులలో బూర్గుల రామకృష్ణారావు స్థానం విశిష్టమైనది. తెలుగు జాతి సగర్వంగా చెప్పుకోగలిగిన మహా పురుషులలో ఆయన అగ్రేసరులు. విద్యాధికులు. జాతీయతా భావాలకు బద్ధ శత్రువైన నిజాం నిరంకుశ ప్రభుత్వ కాలంలో ఖద్దరు ధరించిన దేశభక్తాగ్ర గణ్యుడు, న్యాయవాద శిరోమణి, రాజ్యాంగ సమ్మత మార్గానుయాయి. స్వాతంత్య్ర సమరయోధుడు, బహుభాషా కోవిదుడు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, సంస్కృతం, హిందీ భాషలలో రచనలు చేసిన ప్రతిభా సంపన్నుడు. ఒక హైస్కూలులో పర్షియన్ బోధించే ఉపాధ్యాయునిగా పనిచేసిన ఆంధ్రుడు బహుశ ఈయన ఒక్కరేనేమో ఆ సమయంలో ‘పారశీక వాఙ్మయ చరిత్ర’ రాశారు.
హైదరాబాద్ రాష్ట్ర పప్రథమ ప్రజా ముఖ్య మంత్రిగా పనిచేసి చరిత్ర కెక్కారు. ఆ సందర్భం లోనే…
‘రెండు వందల యేడుల నుంచి చిమ్మ
చీకటుల మ్రగ్గి, వెలుతురు రేక గనని
మాకు ప్రథ•మ ప్రజా ముఖ్యమంత్రి వీవు
కీర్తనీయ, బూర్గుల రామకృష్ణరాయ’ అని దాశరథి కృష్ణమాచార్యులు శ్లాఘించారు.
‘రామకృష్ణ్ణారావు పూర్ణపురుషుడు, వినయశీలి, సచ్చీలుడు, నిజాంకు అతి సన్నిహితంగా ఉండే వ్యక్తుల కూటమి విశ్వాసాన్ని సైతం చూరగొనగలిగిన స్ఫటిక సదృశ్యమైన నిజాయతీపరుడు. ఆయన గుండె నిబ్బరం, యుక్తాయుక్త విచక్షణ, సూక్ష్మ పరిశీలనా దృష్టిని పొగడకుండా ఉండలేకపోతున్నాను. ఒకప్పుడు నిజాం బంట్లు కొందరు రామకృష్ణరావును జైలులో పెట్టవలెనని చూచారు. క్రూరాతి క్రూరంగా గడిచిన ఆ తొమ్మిది మాసాల చరిత్రలో ఆయనకు ‘మంత్రి పదవి ఇస్తామ’ని ఒకసారి నిజాం నుంచి ఆహ్వానం కూడా అందింది. బెదిరింపులకు లొంగనట్టే, ఆయన ఎరగా చూపిన పదవికి వశుడు కాలేదు’ అని మున్సీ హైదరాబాదు జ్ఞాపకాలపై రాసిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ అనే గ్రంథంలో పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం భారత్ యూనియన్‌లో చేరేం దుకు నిరాకరించిన వారిపట్ల కఠినంగా వ్యవహ రించాలని, ప్రజావ్యతిరేక, నిరంకుశ, మతోన్మాదాన్ని తుడిచి వేయాలని పిలుపు నిచ్చారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడం మౌలానా ఆజాద్ అభిమతం కాగా, అది దేశానికి ఎప్పటికైనా ప్రమాద కరమని ఆయన చేసిన హెచ్చరిక ఆంధ్రుల చరిత్రలోనేగాక మహారాష్ట్ర, కర్ణాటక ప్రజల చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రాజకీయ అంశం.
హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన వెంటనే రామకృష్ణారావు ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసంగిస్తూ ‘భారతదేశంలో హైదరాబాద్ విడదీయరాని భాగం. బాధ్యతాయుత ప్రభుత్వం కావాలన్న ప్రజల కోర్కె నేటికి ఈడేరింది. స్వతంత్ర ప్రవృత్తితో ఆలోచించడం గానీ, వ్యవహరించడం గానీ హైదరాబాదు ప్రజలకు తగదు’ అని అన్నారు.
రామకృష్ణారావు 1899 మార్చి 13వ తేదీన (విళంబి నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ విదియ, సోమవారం, రేవతీ నక్షత్ర చతుర్థ చరణ యుక్త మకర లగ్నం)మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి తాలూకా పడకల్లు గ్రామంలో వైష్ణవ కుటుంబంలో న•రసింగ రావు, రంగనాయకమ్మ దంపతులకు జన్మించారు. వీరి ఇంటి పేరు పుల్లంరాజు కాగా, పూణేలో ఉన్నత విద్యాభ్యాసం రోజుల్లో మహారాష్ట్ర సంప్రదాయా ననుసరించి తమ గ్రామనామాన్నే ఇంటిపేరుగా పెట్టుకొని ‘రామ్‌కిషన్ రావు బూర్గుల’ అని రాసుకున్నారు. అలా ‘పుల్లంరాజు’ కాస్తా ‘బూర్గుల’ అయ్యింది. వీరి ఇంట్లో నిత్యారాధన ఉండేది. వారి తల్లిగారు రామానుజుల విరచిత గద్యత్రయము (శ్రీరంగ గద్యము, శరణాగతి గద్యము, వైకుంఠ గద్యము) చదవనిదే భోజనం చేసేవారు కారట.
బూర్గులకు 13వ ఏట 1912లో కొంపెల్ల నరసింహారావుగారి రెండవ కుమార్తె రత్నమ్మతో వివాహం (ఆమెకే రాధమ్మ అని మరోపేరు) జరిగింది ఆమె ఒక కుమారుడు కుమార్తె (రంగనాధరావు, శ్యామలాదేవి) లకు జన్మనిచ్చి. దురదృష్టవశాత్తూ 1920లో మరణించారు. 1924 బూర్గుల వారు మందుముల వెంకట నరసింహ•రావు కుమార్తె అనంతలక్ష్మీదేవి వీరి ద్వితీయ కళత్రంగా స్వీకరిం చారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు.
పూణేలో గోపాలకృష్ణ గోఖలే స్థాపించిన పెర్గుసన్ కాలేజీలో బీఏ, బొంబాయి విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి. చేసిన బూర్గుల 1923లో హైదరా బాద్‌లో న్యాయవాద వృత్తి ప్రారంభించి, అగ్రేసర న్యాయవాదిగా పేరు పొందారు. దివంగత పూర్వ ప్రధాని పి.వి.నరసింహరావు వీరి వద్ద జూనియర్‌గా పనిచేసిన వారే. ‘బూర్గుల వారిలో కొన్ని గొప్ప గుణాలుండేవి.ఆయన దిక్కులు పిక్కటిల్లజేసే పెద్ద ప్రాక్టీసును పెంచుకోలేదు. క్లయింట్లకు ఆయన సామర్థ్యంపై విశ్వాసముండేది. దాంతో ఆయనకు చేతినిండా పని వుండేది. వారి దగ్గరకు వచ్చే కేసులలో అత్యధికం రాజకీయ సంబంధమైనవే. వాటిని వాదించడానికి ఫీజు తీసుకునేవారు కాదు. ఒక కేసును ఆయన ఆమూలాగ్రం అధ్యయనం చేయడమంటూ ఎన్నడూ లేదు. కేసును తీసుకొనే టప్పుడు ఒకమారు నోట్సు, రిఫరెన్సులు గుర్తు కొరకు వ్రాసి పెట్టుకునేవారు. కాని ఆయన కోర్టులోకి వచ్చి వాదించడం మొదలు పెడితే సూక్ష్మంగా వ్రాసి ఉంచుకొన్న ఆ నోట్సును ప్రకాశమానమైన తమ ప్రజ్ఞతో విస్తృతీకరించి, కేసును దుర్భేద్యంగా రూపొందించి, అద్భుతమైన సాక్ష్యాధారాలు తయారు చేసేవారు. నేను బహుశ ఆయన జూనియర్లందరి లోకి జూనియర్‌ని తల్లికి కడగొట్టు బిడ్డపై కొంచెం హెచ్చుగా ప్రేమ ఉంటుందని అంటారు. అలాగే ఆయన నాపై ప్రత్యేకమైన ప్రేమ వాత్సల్యాలు చూపేవారు’ అని పీవీ నరసింహారావు వృత్తిరీత్యా గురువు గురించి రాశారు.
బూర్గుల ప్రజాహిత రంగాలలో ప్రసిద్ధులై ఉండటంవలన రాజకీయ సంబంధమైన కేసులు వీరివద్దకే వచ్చేవి. ముఖ్యంగా ఆర్య సమాజం కార్యకర్తలపైన, కేసులు, నిజాం పోలీసు వేధింపు కేసులు వచ్చేవి. కేసులు ఫీజు లేకుండా ఉచితంగా వాదించేవారు. ప్రజా ఉద్యమాలలో పనిచేసే కార్య కర్తలకు రక్షణ కల్పిస్తూ, ప్రజలలో ధైర్య సాహసాలు, చైతన్యం నింపేవారు. వృత్తి రీత్యా రాజకీయాలకు అతీతంగా వ్యవహరించేవారని, కమ్యూనిస్టు కార్యకర్తల కేసులు వాదించారని ఉమ్మడి ఆంధప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన గోపాలరావు ఎక్బోటే పేర్కొన్నారు.
1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చిన భారత రిపబ్లిక్ రాజ్యాంగాన్ని అనుసరించి దేశమంతటితో పాటు హైదరాబాద్ రాష్ట్రంలో కూడా సాధారణ ఎన్నికలు జరిగాయి. బూర్గుల కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధిగా షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. శాసనసభలో మొత్తం సీట్లు 175కు గాను కాంగ్రెస్-93 పీపుల్స్ డెమెక్రటిక్ ఫ్రంట్-77 స్థానాల్లో గెలిచాయి. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంలో తర్జన భర్జన జరుగుతుండగా దిగంబరరావు బిందూ పేరును స్వామి రామానందతీర్థ సూచించారు. కానీ బిందూ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఆ పదవికి బూర్గుల రామకృష్ణారావు తగిన వ్యక్తని చెప్పడంతో బూర్గుల హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన హయాంలోనే అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన (1955 డిశంబరు 10) చేశారు. వినోబాభావే భూదానోద్యమం కూడా వీరి కాలంలోనే ప్రారంభ మయినది.
శాసనసభలో సభ్యులు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు, మరాఠీ, కన్నడ భాషలలో మాట్లాడుతూ వుండేవారు. ఎవరు ఏ భాషలో ప్రశ్నవేస్తే వారికి ఆ భాషలోనే తడుముకోకుండా సమాధానం చెప్పేవారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా వెళ్లబోతున్నప్పుడు రాధాకృష్ణన్ ‘మీ బహు భాషా పాండిత్యం అక్కడ మీకు బాగా ఉపయోగపడగలదు’ అని అన్నారు. బూర్గుల దక్షిణ భారత హిందీ ప్రచారసభ ఆంధ్రశాఖకు పెద్ద అండగా ఉండేవారు.
ఒకే తెలుగు రాష్ట్రం కావా లన్న తన అభిప్రాయం పట్ల కేంద్రమంత్రి గోవిందవల్లభ పంత్‌కు సానుభూతి ఉన్నట్లు బూర్గుల గ్రహించారు. నెహ్రూపై మౌలానా ప్రభావాన్ని విరుగుడు మంత్రం వేసి, దేశ నడిబొడ్డున మతతత్వ దృష్టి గల రాష్ట్రం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను గురించి ఆయనకు నచ్చజెప్పడంలో కృతకృత్యుడయ్యాడని చెప్పుకునే వారు. అందుకే భోగరాజ పట్టాభి సీతారామయ్య ఆయనను ‘మహాంధ్ర రాజనీతిజ్ఞుడు’గా అభివర్ణించారు.
బూర్గుల వారికి గ్రంథ పఠనము, సాహిత్యా ధ్యయనం నిత్య అభ్యాసాలుగా వుండేవి. ‘నాకు కూడా వ్రాసే గుణం ఉంది, ఏదో ఒకటి వ్రాస్తూ వుండేవాడిని’ అని ఆయనే చెప్పుకున్నారు. 1924లో ఆంగ్లకవి ధామస్ ఎలిజీని ‘మృత సంస్కృతి’ పేర తెలుగులో వ్రాశారు.