‘‘బౌద్ధులూ హిందువులూ కనిపించేది ఆసియాలోనే. అందులో హిందువుల సంఖ్య ఎక్కువగా ఉన్నది హిందూదేశంలోనే. ఇక్కడి 35 కోట్ల జనసంఖ్యలో హిందువులు 25 కోట్లు మాత్రమే. మిగతా పది కోట్లు నేడు హిందువులు కారు. మొదట్లో వీరు హిందువులే. మన ఉదాశీనత వల్ల, నిర్లక్ష్యం వల్ల కోల్పోయాం.
…ఈ పరిస్థితి ఇలా మరికొన్ని శతాబ్దాల పాటు ఉండడం తటస్థిస్తే వెదికినా పేరుకు హిందువు కనిపించడు…. అటు మహమ్మదీయులు బాహాటంగా పాకిస్థాన్ కోర్కెను బ్రిటిష్‌వారి ముందుంచుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో జాగ్రత వహించి ఆత్మ సంరక్షణార్థం సంఘటితమవాలి.
…సంఘటనే రాష్ట్రానికి (దేశానికి) అపారశక్తి… శక్తి లేని రాష్ట్రం ఎన్ని కోరికలు కోరినా ఫలించవు. శక్తి లేని యెడల నీ మొర వినరు. నిన్ను గుర్తించరు. ఈ దుర్బలుడు చేసేదేమిటని న్యూనభావము చూపుతారు…’’
ఇవన్నీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్థాపకులు పూజ్యశ్రీ డాక్టర్ హెడ్గేవార్ ముప్పది ఏండ్లకు పూర్వం హిందూ దేశ పరిస్థితికి విచారిస్తూ హిందూదేశానికి సందేశమిస్తూ చెప్పిన ముక్కలు.
ఎంతటి దూరదృష్టి! ఎంతటి సత్యవచనములు! ఈ దేశపు మంచిచెడ్డలు ఈ గడ్డనపుట్టిన సంస్కృతీ, ధర్మంతో పెనవేసుకొని వున్న హిందువుల మీద ఆధారపడివున్నవనే విషయం అందరికీ మనసుల్లో అర్ధమవుతున్నట్టిదే. హిందువులు ఐక్యమత్యంగా ఉంటే, ఈ దేశానికి అజేయమైన శక్తి లభిస్తుందని కూడా అందరికీ తెలుసు. కానీ ఆ ముక్కలు ధైర్యంగా చెప్పే సాహసం ఎవరికీ లేకపోయిన దశలో ఆ ముక్కలనడమేగాక అట్టి సంఘటనా సాధనకై ఒక మహా సంస్థను సృష్టించిన ఘనత కూడా డాక్టర్‌జీదే. రాజకీయములలో చిక్కుకుని, అడ్డత్రోవల ద్వారా స్వరాజ్యమునాశించిన మహావ్యక్తులకు కూడా ఈ మహా వాక్యములలోని సత్యము సకాలములో అవగాహన కాలేదు. దేశ విభజన అడుగగానే గాంధీజీ అన్నారు- ‘హిందువులు ఐకమత్యంగా వుండి వుంటే విభజనను నివారించగల్గి వుండేవారమ’ని. సమయం మించిన తర్వాత సత్యం గుర్తించారు. విభజన అనివార్యమైంది.
హిందువుల సంఘటన అనేది ఒక్క విభజనకు సంబంధించిన అంశం కాదు. ఈ దేశ ఉత్థాన పతనాలకు సంబంధించిన అంశం. అత్యంత సహజమైన వాస్తవం. దేశ విభజనకు గిలగిల్లాడి పోయిందెవరు? చైనా దురాక్రమణ విషయమై వ్యధ చెందుతున్నదెవరు? దేశానికి మరే విపత్తు వచ్చినా ఆధారపడ తగినదెవరు? నిశ్చయంగా హిందువులు. ఈ దేశమున వికసించిన సంస్కృతీ సభ్యతలేవీ అంటే అవి నిస్సశయంగా హిందూ సంస్కృతీ సభ్యతలే. అట్టి స్థితిలో దీనిని హిందూ రాష్ట్రమనడం అత్యంత సహజమైన విషయం. అనకపోవడం కృత్రిమత్వం. ఇదంతా ఒక వాదాతీతమైన సత్యం. ఈ సత్యాన్ని విస్మరించి, హిందూ రాష్ట్రమనడాన్ని ఒక వాదనగా చిత్రించి, హిందూరాష్ట్ర వాదులనే ఒక వర్గాన్ని పేరు పెట్టి ఈ సహజత్వానికి విరుద్ధమైన రాష్ట్రవాదాన్ని ఇక్కడ నెలకొల్పాలనే ప్రయత్నాలు ఈనాటికీ జరుగుతున్నాయి. పైగా సహజత్వాన్ని సవాలు చేసి హిందూ రాష్ట్ర భావనయే దేశానికి ప్రమాదమని, వారికి రాష్ట్రీయత అంటేనే తెలియదని శ్రీ నెహ్రూ బోంట్లు ప్రవర్తించడాన్ని కూడా నేడు చూస్తున్నాం.
ఏ నిఘంటువును చూచినా రాష్ట్రము(నేషన్) అంటే ‘ఒకే సంతతికి చెంది ఒకే సంస్కృతి భాష, చారిత్రకత కలిగిన జనత’ అని కనిపిస్తుంది. అయితే చారిత్రకత లేని, సంస్కృతి లేని నూతనంగా పుడ్తున్న రాష్ట్రాలకు వర్తించే మరొక నిర్వచనం కూడా కనిపిస్తుంది. పాత చరిత్రను, సంస్కృతిని, జాతీయతను చెరిపివేసి నూతన జాతీయతను సృష్టించాలనుకున్న వాళ్లు రెండో నిర్వచనం స్వీకరించారు. సవాళ్లు విసురుతున్నారు. వీరి ప్రయత్నంలో మొదటి ఫలితం దేశ విభజన. రెండవ ఫలితం నిరంతరం హిందూ సమాజము తగ్గిపోతూ అన్య సమాజాలు బలపడడము. మూడు నాలుగు ఐదు ఫలితాలు ఏమైనా కావచ్చు.కానీ అంతిమ ఫలితం మాత్రం హిందూ సమాజము జీర్ణమై పోవడం. హిందూదేశమనేది అఖండంగా కాక అనేక ముక్కలుగా అయిపోవడం. పూజ్యశ్రీ డాక్టర్‌జీ నివారించదలిచిందీ పరిస్థితిని. మాన్యశ్రీ మాలవీయ తమ అంతిమ సందేశంలో పేర్కొన్నది కూడా ఇదే. ‘‘తాము జీవించదలిస్తే హిందువులు పూనికతో నిలవాలి’’ అంటారాయన. అదే పూనికతో నిలిచేందుకు ప్రాతిపదికగా హిందూ ధర్మాన్ని ప్రతిపాదించారు డాక్టర్‌జీ. ‘‘ఆ హిందూధర్మమే ఈ రాష్ట్రానికి (దేశానికి) ఆత్మ. అది దెబ్బతిననంత కాలం ఈ రాష్ట్రానికి దెబ్బ లేద’’ న్నారు వివేకానందులు. ‘‘అది దెబ్బతింటే దానిని పునరుద్ధరించే బాధ్యత నాయకులది’’ అన్నారు లోకమాన్య తిలక్. వీరందరినీ కలిపి ఉమ్మడిగా రాష్ట్రీయతీ అంటే అర్ధం తెలియదు పొమ్మన్నారు నెహ్రూగారు. వ్యక్తుల సవాళ్లు రాష్ట్రాల ప్రాతిపదికలను మార్చలేవు. కాకపోతే వ్యక్తులు శక్తిమంతులయినప్పుడు రాష్ట్ర నిర్మాణ కార్యక్రమాలకు ఆటంకాలు పెంచబడితే పెంచబడవచ్చు. కానీ అవి ఆగిపోను మాత్రం ఆగిపోవు. విఫలం అంతకన్న కాబోవు.
చరిత్ర గడుస్తున్నకొద్దీ ఆనాటి డాక్టర్‌జీ ప్రబోధం ఎంతటి సత్యమో అర్ధమవుతూ వస్తున్నది. సంఘటన ఆవశ్యకత కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నది. శుష్క రాజకీయ వాదులేమి చెప్పినా, ఈ నిత్య సత్యాన్ని విజ్ఞతాపూర్ణమైన సమాజం తిరస్కరించాలని పరిస్థితి ఏర్పడుతోంది. ఉగాది పూజ్యశ్రీ డాక్టర్‌జీ జన్మదినం. ఈ పర్వదినాన, వారి జన్మదినాన వారి ఉత్తమ సందేశ సంస్మరణం మనకు తగిన పని.
(సరిగ్గా ఆరవయ్యేళ్ల క్రితం 22.3.1963న ఉగాది ప్రత్యేక సంచిక ద్వారా ‘జాగృతి’ వెలువరించిన సంపాదకీయం)