– క్రాంతి

పాకిస్తాన్‌ ఇప్పుడు రెండు విధాలా నలిగిపోతోంది. పీకల్లోతు అప్పులు దేశాన్ని నిండా ముంచేస్తోంటే, పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థలే కాటేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మన పొరుగు దేశంలోని తాజా పరిణామాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. పాకిస్తానీయులు భారత ప్రభుత్వంతో పోల్చుకుంటూ తమ దేశ నాయకులను నిందిస్తున్నారు. తాజాగా కశ్మీర్‌ ఉ‌గ్రవాదంతో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు పాకిస్తాన్‌లో అనూహ్యంగా హత్యకు గురయ్యారు. దీనిపై పాక్‌ ‌ప్రభుత్వం కూడా నోరు మెదపడం లేదు. సాధారణ పరిస్థితుల్లో అయితే పాకిస్తాన్‌లో జరిగిన ఆ హత్యలు తీవ్ర కలకలం రేపేవి. పాక్‌ ‌ప్రభుత్వం, ప్రతిపక్షాలు, మీడియా భారతదేశాన్ని నిందించేవి. ప్రపంచ వేదికపై నానా యాగీ చేస్తూ భారత్‌ను తూర్పార పట్టేవి. కానీ ఇప్పుడు తేలు కుట్టిన దొంగలా మౌనంగా ఉండిపోయాయి. అధికారికంగా, అనధి కారికంగా కూడా ఎలాంటి స్పందన లేదు. ఇంతకీ ఏం జరిగింది? చనిపోయిన ఆ వ్యక్తులు ఎవరు? వారికి అంత ప్రాధాన్యం ఏముంది?

ఫిబ్రవరి 20న.. పాకిస్తాన్‌లోని ప్రముఖ నగరాల్లో ఒకటైన రావల్పిండిలో బషీర్‌ అహ్మద్‌ ‌పీర్‌ అలియాస్‌ ఇం‌తియాజ్‌ ఆలం అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మోటర్‌ ‌సైకిల్‌ ‌మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి అతన్ని హతమార్చారని అక్కడి పత్రికల్లో వార్త వచ్చింది. ఫిబ్రవరి 26న.. కరాచీలో సయ్యద్‌ ‌ఖాలిద్‌ ‌రజా అనే పాఠశాల యజమానిని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మోటర్‌ ‌సైకిల్‌ ‌మీద వచ్చి హత్య చేశారు. గత సంవత్సరం మార్చి 9న పాకిస్తాన్‌ ‌లోనే జహూద్‌ ‌మిస్త్రీ అనే వ్యక్తి కూడా ఇదే తరహాలో ఇద్దరు వ్యక్తులచే హత్యకు గురయ్యాడు. ఈ ముగ్గురూ పాకిస్తాన్‌లోని వేర్వేరు నగరాల్లో, వేర్వేరు తేదీల్లో హత్యకు గురైనా, ఇవన్నీ ఒకే తరహాలో జరిగాయి. హతులంతా సామాన్య పౌరుల్లానే కనిపిస్తు న్నారు. కానీ వీరి నేపథ్యం వేరు. వీరి గత చరిత్ర అంతా జమ్ముకశ్మీర్‌తో ముడిపడి ఉంది.

బషీర్‌ అహ్మద్‌ ‌పీర్‌ అలియాస్‌ ఇం‌తియాజ్‌ ఆలం జమ్ముకశ్మీర్‌లో హిజ్బుల్‌ ‌ముజాహిద్దీన్‌ ‌సంస్థకు చెందిన ఉగ్రవాది. ఉగ్రవాదులను సరిహద్దు దాటించడంలో, ఆయుధాలు సమకూర్చడంలో సిద్ధహస్తుడు. ఇతనికి ఎన్నో ఉగ్రవాద నేరాలతో సంబంధం ఉంది. తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు జమ్ముకశ్మీర్‌ ‌కుప్వారాలోని బాబాపోరా గ్రామంలో ఈ ఉగ్రవాదికి చెందిన ఆస్తులను ఉపా చట్టం కింద స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్‌ ‌ఖాలిద్‌ ‌రజా జమ్ముకశ్మీర్‌లో అల్‌ ‌బదర్‌ ఉ‌గ్రవాద సంస్థకు 8 ఏళ్లపాటు నాయకునిగా ఉన్నాడు. ఎన్నో విధ్వంసాలు, హత్యలతో ఇతనికి సంబంధం ఉంది. ఇక జహూర్‌ ‌మిస్త్రీ చరిత్ర మరింత గగుర్పాటు కలిగిస్తోంది. ఇతను హర్కతుల్‌ ‌ముజాహిద్దీన్‌ ‌సంస్థకు చెందిన ఉగ్రవాది. 1999లో జరిగిన కాందహార్‌ ‌విమాన హైజాక్‌ ‌ఘటనలో నిందితుడు. ఈ ఘటనలో కరడుగట్టిన హఫీజ్‌ ‌సయీద్‌ ‌సహా అయిదుగురు ఉగ్రవాదులను విడిపించుకెళ్లాడు.

జమ్ముకశ్మీర్‌లో అనేక ఉగ్రవాద ఘటనల్లో పాలుపంచుకొని పాకిస్తాన్‌లో రహస్యంగా తలదాచు కుంటున్న వీరిని అప్పగించాలని భారత్‌ ‌గతంలో కోరింది. అయితే తమ దేశంలో అలాంటి వారెవరూ లేరని పాకిస్తాన్‌ ‌బుకాయిస్తూ వచ్చింది. ఇప్పుడు వీరు అనూహ్యంగా తమ దేశంలోనే ఒకే తరహాలో హత్యకు గురి కావడం గమనార్హం. వీరిని హతమార్చింది భారత్‌కు చెందిన రా (రీసెర్చ్ అం‌డ్‌ అనాలిసిస్‌) ఏజెంట్స్ అని కొందరు అంటున్నారు. ఇజ్రాయిల్‌ ఇం‌టెలిజెన్స్ ‌సంస్థ మొసాద్‌ ‌వీరిని మట్టుబెట్టిందని మరికొందరు భావిస్తున్నారు. పాకిస్తాన్‌ ‌మాత్రం ఈ ఘటనలపై ఏమాత్రం నోరు మెదపడం లేదు. భారత్‌ ‌లేదా ఇజ్రాయిల్‌కు చెందిన అధికారులు వీరిని మట్టుబెట్టారని ప్రకటిస్తే తమ పరువు పోతుందని, పాకిస్తాన్‌లోనే వారు ఇంతకాలం తలదాచుకున్నారనే వార్త ప్రపంచానికి తెలిసిపోతుందని భయం. అందుకే పాకిస్తాన్‌ ‌తేలు కుట్టిన దొంగలా వ్యవహరి స్తోంది. మరోవైపు భారత్‌ ‌కూడా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.

ఉగ్రవాదుల స్వర్గధామం పాక్‌

‌ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని ఉగ్రవాద సంస్థలు పాక్‌లోనే ఉన్నాయి. పాకిస్తాన్‌ ‌ప్రభుత్వ గూఢచార సంస్థ ఇంటర్‌-‌సర్వీసెస్‌ ఇం‌టెలిజెన్స్ (ఐఎస్‌ఐ) ‌వీటిని పర్యవేక్షించడంతో పాటు నిధులు ఇస్తోంది. శిక్షణశిబిరాలను కూడా నిర్వహిస్తుంది. ఇనిస్టిట్యూట్‌ ‌ఫర్‌ ‌కన్‌ఫ్లిక్ట్ ‌మేనేజిమెంట్‌ (ఐసీఎం) వారి సౌత్‌ ఏసియా టెర్రరిజం పోర్టల్‌ (ఎస్‌ఏటీవీ) ప్రకారం పాకిస్తాన్‌లో ఇలాంటి సంస్థలు 162 ఉన్నాయి. ఇందులో లష్కరే తోయిబా, జైష్‌-ఎ- ‌మహ్మద్‌ ‌ముజాహిదీన్‌, ఇస్లామిక్‌ ‌స్టేట్‌, అల్‌ఖైదా, తాలిబన్‌, ‌హిజ్బుల్‌-‌ముజాహిదీన్‌, ‌హక్కాని నెట్వర్క్ ‌తరదిర పేర్లు అందరికీ సుపరిచితమే. అమెరికా ఒత్తిడి కారణంగా పాకిస్తాన్‌ 81 ‌సంస్థలపై నిషేధం విధించగా, 46 సంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయి. మిగతా 36 పెద్దగా ఉనికిలో లేవని చెబుతారు. కశ్మీర్‌, ‌పంజాబ్‌ ‌సహా భారత్‌లో తీవ్రవాదాన్ని రెచ్చ గొట్టడం, సైన్యం, ప్రభుత్వ కార్యాలయాలు, రాయబార కార్యాలయాలు, పౌరులపై కాల్పులు, బాంబుపేలుళ్లకు పాల్పడటం వీటి నిత్యకృత్యాలు. అదేవిధంగా ప్రముఖలను హత్య చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఈ గ్రూపులన్నీ భారత్‌తో పాటు అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఇ‌జ్రాయిల్‌, ‌చైనా, నాటో కూటమి దేశాలకు వ్యతిరేకంగా పని చేస్తుంటాయి.

బ్రిటిష్‌వారు స్వాతంత్య్రం ఇస్తూ భారతదేశాన్ని చీల్చి పాకిస్తాన్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కశ్మీర్‌ ‌కోసం భారతదేశం మీద దండెత్తి ఓడిపోయిన ఘనత పాకిస్తాన్‌కు ఉంది. భారత్‌తో మూడుసార్లు యుద్ధం చేసింది. అవకాశం దొరికిన ప్రతిసారీ భారత్‌ను ఛిన్నాభిన్నం చేయాలనేది దాని ప్రధాన ధ్యేయం. పాకిస్తాన్‌ ఏర్పడింది మొదలు ఇప్పటివరకూ అక్కడ సుస్థిరమైన పాలన లేదు. ప్రజాస్వామ్యం బలపడలేదు. భారత వ్యతిరేకతపైనే ఆ దేశ మనుగడ ఆధారపడి ఉంది. అక్కడి రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికీ, అధికారం నిలుపుకోవడానికి భారత్‌నే బూచిగా చూపిస్తాయి. పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం, సైన్యం భారత్‌లో నిరంతరం మత, ప్రాంతీయ విద్వేషాలను రగిలిస్తుంటాయి. ఇందుకోసం ఉగ్రవాదులను తయారుచేసి శిక్షణ ఇస్తున్నారు. కానీ వారు పెంచిపోషించిన ఉగ్రవాదులే ఆ దేశానికి ఇప్పుడు ప్రమాదకరంగా తయారయ్యారు. పాక్‌ ‌ప్రస్తుతం ఎదుర్కొంటున్న దుస్థితికి నేపథ్యం ఇదే. భారత్‌ను అస్థిరపరచడంలో ఉన్న శ్రద్ధ సొంత ప్రజల బాగోగులపై చూపకపోవడంతో పాకిస్తాన్‌ ‌మునుపెన్నడూ లేనంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. ప్రపంచంలోనే అతితక్కువ అక్షరాస్యత ఉన్న దేశాల్లో పాకిస్తాన్‌ ఒకటి. 68 శాతం మంది పిల్లలు మాత్రమే ప్రాథమిక విద్యకు నోచుకున్నారు. 34.8 శాతం యువత తీవ్రవాదం వైపు ఆకర్షితులు అవుతున్నారు. ప్రస్తుతం ఆ దేశంలోని విదేశీ మారక నిల్వలు పూర్తిగా నిండుకున్నాయి. ఆర్థిక సహాయం కోసం ఐఎంఎఫ్‌తో పాటు యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాల వైపు చూస్తోంది. ఎక్కడా అప్పులు పుట్టడం లేదు. చెప్పుకోవడానికి అణ్వస్త్ర దేశమైనా అప్పుల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పాకిస్తాన్‌ ‌ప్రధాని షెహబాజ్‌ ‌షరీఫ్‌ ఇటీవల వాపోయారు.

పాకిస్తాన్‌ ‌పెంచి పోషించిన ‘తెహ్రీక్‌ ఇ ‌తాలిబన్‌ (‌టీటీపీ) భస్మాసుర హస్తంగా మారిపోయింది. ఈ తాలిబన్లు ఆ దేశంలోని ఖైబర్‌ ‌ఫక్తున్‌ఖ్వా, బెలూచి స్తాన్‌, ‌సింధ్‌, ‌పంజాబ్‌ ‌సహా పలు కీలక ప్రాంతాల్లో సైన్యం, పోలీసులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. ‘తెహ్రీక్‌ ఇ ‌తాలిబన్‌’ ‌పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఇతర ఉగ్రవాద సంస్థలను కూడా కలుపుకొని పనిచేస్తోంది. ఆ దేశంలోని నిరుద్యోగ యువకులనూ తమ సైన్యంలో చేర్చుకుంటూ, ఆయుధ శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇది ‘బెలూచిస్తాన్‌ ‌లిబరేషన్‌ ఆర్మీ’ని తమ సంస్థలో విలీనం చేసుకున్నట్లు పాకిస్తాన్‌ ‌నిఘా వర్గాలు చెబుతున్నాయి. ‘తెహ్రీక్‌ ఇ ‌తాలిబన్‌’‌కు ఆఫ్ఘానిస్తాన్‌లోని తాలిబన్‌ ‌ప్రభుత్వ సహకారం పూర్తిస్థాయిలో ఉంది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్‌ ‌దీనిపై పూర్తిస్థాయి యుద్ధం చేయాల్సి వస్తే ఎదుర్కోలేని దుస్థితి నెలకొంది. నాటో దళాలు ఆఫ్ఘానిస్తాన్‌ను వదిలి వెళ్లేటప్పుడు సుమారు 22,000 వాహనాలు, 64,000 మిషన్‌ ‌గన్స్‌ను అక్కడే వదిలి వెళ్లాయి. ఇందులో ఎమ్‌ 16, ఏకే 47 రకానికి చెందిన ఆయుధాలు సుమారుగా మూడు లక్షలకు పైగా ఉంటాయి. ఇంతటి ఆధునిక ఆయుధాలు, కమ్యూనికేషన్‌ ‌వ్యవస్థ కలిగిన తాలిబన్‌ ‌మీద పాకిస్తాన్‌ ‌విజయం సాధించడం అసంభవం.

తెహ్రీక్‌ ఏ ‌తాలిబన్‌ ‌విషయంలో ఆఫ్ఘానిస్తాన్‌- ‌పాకిస్తాన్‌ల మధ్య విభేదాలు ముదిరాయి. ఆఫ్ఘన్‌లోని టీటీపీ రహస్య స్థావరాలపై తాము సైనికచర్య చేపట్టవచ్చనే పాక్‌ ‌హోంమంత్రి రాణా సనావుల్లా చేసిన వ్యాఖ్యలపై తాలిబన్లు తీవ్రంగా స్పందించారు. పాక్‌- ఆఫ్ఘన్‌ ‌సరిహద్దుల్లోని ఖైబర్‌ ‌పఖ్తూన్‌క్వా రాష్ట్రంలో 7,000 నుంచి 10 వేల వరకు టీటీపీ ఉగ్రవాదులు ఉన్నారని ఇటీవల ఓ వార్తా సంస్థకు చెప్పారు పాక్‌ ‌మంత్రి. అయితే టీటీపీ రహస్య స్థావరాల ఏరివేత పేరిట పాకిస్తాన్‌ ‌తమ దేశంలోకి అడుగు పెడితే.. 1971లో భారత్‌ ‌బలగాలకు లొంగిపోయినటువంటి అవమానకర పరిస్థితే పునరావృతం అవుతుందని ఆఫ్ఘానిస్తాన్‌కు చెందిన తాలిబన్‌ ‌కీలక నేత అహ్మద్‌ ‌యాసిర్‌ ‌హెచ్చరించారు. బంగ్లాదేశ్‌ ఏర్పాటుకు దారితీసిన ఆ యుద్ధంలో భారత బలగాలకు పాకిస్తాన్‌ ‌లొంగిపోయినప్పుడు తీసిన చారిత్రక ఫొటోను ట్విటర్‌ ‌వేదికగా ఆయన పంచుకున్నారు. ‘పాకిస్తాన్‌ ‌హోం మంత్రి! సిరియాలోని కుర్దులను టర్కీ లక్ష్యం చేసుకున్నట్లుగా ఇక్కడ ఆఫ్ఘన్‌.. ‌సిరియా కాదు. పాకిస్తాన్‌.. ‌టర్కీ కాదు! ఇది అఫ్ఘానిస్తాన్‌. ‌మహోన్నత సామ్రాజ్యాలు ఏలిన నేల. మాపై సైనిక దాడి గురించి ఆలోచిం చొద్దు. లేదంటే 1971 నాటి పరిస్థితి పునరావృతం అవుతుంది’ అని పేర్కొన్నారు.

కష్టకాలంలో భారత్‌ ‌వైపు చూపు!

పాకిస్తాన్‌ ఇటువంటి పరిస్థితుల్లో పొరుగున ఉన్న భారత్‌తో విభేదాలను పక్కనపెట్టి సత్సంబంధాలు ఏర్పరచుకోవటమే మంచిదని ఆ దేశంలోని మేధావులు, రక్షణ నిపుణులు సలహా ఇస్తున్నారు. భారతదేశం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అభివృద్ధిలో ఎంతో వేగంగా దూసుకుపోతోందని అక్కడి మీడియా కూడా ప్రశంసిస్తోంది. మోదీ నాయకత్వంలో భారత్‌ అం‌తర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసుకుంటోందని ఇటీవల పాకిస్తాన్‌ ‌దినపత్రిక ‘ఎక్స్‌ప్రెస్‌ ‌ట్రిబ్యూన్‌’ ‌పేర్కొంది. ఈ కారణంగానే అమెరికా, రష్యాలు కూడా భారత్‌తో బలమైన సంబంధాలు కోరుకుంటున్నాయని పేర్కొంది. భారత్‌కు వ్యతిరేకంగా కొనసాగితే పాకిస్తాన్‌కు ఎలాంటి ఉపయోగం లేదు. కశ్మీర్‌ ‌కారణంగా భారత్‌తో మూడు యుద్ధాల్లో తలపడటం వల్ల కష్టాలూ, పేదరికం, నిరుద్యోగం మిగిలాయి. ఆ మూడు యుద్ధాలతో ఇప్పుడు తాము పాఠాలు నేర్చుకున్నాం అంటున్నారు పాక్‌ ‌నాయకులు. ఇప్పుడు శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నామనీ, కశ్మీర్‌ ‌వంటి సమస్యలపై భారత ప్రధాని మోదీతో నిజాయితీగా చర్చలు జరపాలనీ కోరుకుంటున్నట్లు పాక్‌ ‌ప్రధాని ఇటీవల పిలుపునిచ్చారు. అయితే ఈ దిశగా అడుగులు మాత్రం పడటం లేదు. ఇంతటి సంక్షోభంలో కూరుకుపోయినా, ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచ వేదికలపై ఆ దేశ నాయకులు భారత దేశంపై వ్యతిరేకతను, కశ్మీర్‌పై విషప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

అమెరికా విధానంలో మార్పు!

ఉగ్రవాదంపై పోరు పేరుతో దశాబ్దాలుగా పాకిస్తాన్‌కు ఆర్థికసాయం చేస్తూ వచ్చిన అమెరికా దృక్పథంలోనూ మార్పు వచ్చింది. పాకిస్తాన్‌ ఉ‌గ్రవాద నిర్మూలనకు ఆ నిధులను ఉపయోగించకపోగా, ఆ సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగిస్తూ వచ్చింది. అయితే డొనాల్డ్ ‌ట్రంప్‌ అమెరికా అధ్యక్షునిగా ఉన్న కాలంలో పాకిస్తాన్‌కు ఇచ్చే నిధులను దాదాపు నిలిపివేశారు. కానీ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ ‌మళ్లీ పాకిస్తాన్‌ ‌వైపు స్వల్పంగా మొగ్గును ప్రదర్శించడం విమర్శలకు దారి తీస్తోంది. ఇటీవల ట్రంప్‌ ‌పార్టీ రిపబ్లికన్‌ ‌నేత నిక్కీ హేలీ పాకిస్తాన్‌కు అమెరికా అందించే సాయంపై అసహనం వ్యక్తం చేశారు. భారత సంతతికి చెందిన ఈ నాయకురాలు రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ ‌పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్నారు. అమెరికా విరోధులకు ప్రతి ఏటా చేస్తోన్న విదేశీ సాయం తగ్గించాల్సిన అవసరముందని ‘ది న్యూయార్క్ ‌పోస్టు’కు రాసిన వ్యాసంలో నిక్కీ పేర్కొన్నారు. ‘పాకిస్తాన్‌కు సైనిక సాయాన్ని బైడెన్‌ ‌ప్రభుత్వం పునఃప్రారంభించింది. అమెరికన్లు పన్నుల రూపంలో చెల్లించే బిలియన్ల కొద్దీ డాలర్లను పర్యావరణ కార్యక్రమాల పేరుతో అటు చైనాకు అందిస్తోంది. చైనా నుంచి అమెరికన్లకు తీవ్ర ముప్పు ఉందని తెలిసి కూడా ఈ సాయం అందిస్తోంది. పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన బెలారస్‌కూ అమెరికా సహాయం చేస్తోంది. క్యూబా విషయం లోనూ అంతే’ అని నిక్కీ హేలీ తీవ్రంగా స్పందిం చారు.

గ్రే లిస్టు నుంచి బయటపడ్డా అందని నిధులు

ఉగ్రవాద సంస్థలకు నిధులు సరఫరా చేస్తోందన్న కారణంతో పాక్‌ను గ్రే లిస్టులో ఉంచిన ఆర్థిక చర్యల కార్యదళం (ఎఫ్‌ఏటీఎఫ్‌) ‌గతేడాది అక్టోబర్‌ ‌చివరలో ఆ జాబితా నుంచి తొలగించింది. ఉగ్రవాదానికి ఊతమిచ్చే అతి ప్రమాదకర దేశాలను ఎఫ్‌ఏటీఎఫ్‌ ‌బ్లాక్‌ ‌లిస్ట్ ‌జాబితాలోకి చేరుస్తుంది. బ్లాక్‌ ‌లిస్టులో ఉన్న దేశాలు అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు పొందడం చాలా కష్టం. ఈ దేశాలకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌), ‌ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ, యూరోపియన్‌ ‌యూనియన్‌ ‌వంటి సంస్థలు ఆర్థిక సాయం చేసే అవకాశం లేదు. తొలిసారిగా 2018 జూన్‌లో ఎఫ్‌ఏటీఎఫ్‌ ‌పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచింది. దీని నుంచి బయటపడేందుకు పాక్‌కు రెండుసార్లు అవకాశమిచ్చింది. ఇందులో భాగంగా ఉగ్రవాదులకు అందుతున్న నిధుల మూలాలను కనిపెట్టే దిశగా పాక్‌ ‌చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదులుగా గుర్తించిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలి. అలాగే పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు నిరూపించగలగాలి. వారికి నిధులు అందకుండా ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలి.

ఎఫ్‌ఏటీఎఫ్‌ ‌నిర్దేశించిన ఈ లక్ష్యాలను చేరుకోవడంలో పాక్‌ ఇప్పటివరకు విఫలమవుతూనే వచ్చింది. కానీ గతేడాది జూన్‌లో ఎఫ్‌ఏటీఎఫ్‌ ‌ప్లీనరీ సమావేశంలో చైనా, టర్కీ, మలేషియా దేశాలు పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడంతో గ్రే లిస్ట్ ‌నుంచి బయటపడింది. గ్రే లిస్టు నుంచి బయట పడ్డా పాకిస్తాన్‌కు ఉన్న ఉగ్ర చరిత్ర కారణంగా అప్పులు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఉద్దీపన ప్యాకేజీ కోసం అధిక వడ్డీతో ఐఎంఎఫ్‌ ‌విధించిన షరతులను పాకిస్తాన్‌ అం‌గీకరించక తప్పట్లేదు.

వ్యాసర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE