– అల్లూరి గౌరీలక్ష్మి
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
‘‘ఈ కనకాంబరం రంగు పట్టుచీర నాకు నప్పిందా?’’ కుదురుగా కట్టుకుని పిన్ పెట్టుకుని, అద్దంలో చూసు కుంటూ నగలు పెట్టుకుంటూ అడిగింది అర్ధాంగి శ్రీలత. బావుందన్నట్టు బొటనవేలు పైకెత్తి చూపించాను. నేను కూడా ఆమె నా కోసం తీసి పెట్టి ఉంచిన సూట్ వేసుకున్నాను.
‘‘చూడండి! ఇవాళ మావాళ్లెంత ఘనంగా మీ రిటైర్మెంట్ ఫంక్షన్ చేస్త్తారో! ఎవ్వరూ చెయ్యనంత బాగా చేస్తారు! మీరు మర్చిపోలేనంత అద్భుతంగా ఉంటుంది‘‘ అంది. ‘‘చూద్దాం.. చూద్దాం..’’ అన్నాను నేను నవ్వుతూ. శ్రీలత బంధువులు, స్నేహితులు అందరూ హైదరాబాద్‌లోనే ఉన్నారు. మా అత్తామావ లిద్దరూ వైజాగ్‌లో ఉండేవారు. ఆయన రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్‌గా ఉండేవాడు. ఇద్దరూ చాలాకాలం క్రితమే పోయారు. పెద్ద బావమరిదీ, మరదలూ బల్కంపేటలో ఉంటారు. చిన్న బావమరిది అమెరి కాలో ఉంటాడు. శ్రీలత పెదనాన్న కొడుకులిద్దరూ, మేనత్త పిల్లలూ, చాలా మంది కజిన్ సిస్టర్స్, బ్రదర్స్, తన క్లాస్‌మేట్స్ ఇక్కడ వివిధ ఉద్యోగాల్లో ఉన్నవాళ్లున్నారు. వైజాగ్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన శ్రీలత కారును ఎక్కడికైనా హాయిగా నడుపుకుంటూ వెళ్లివస్తూ ఉంటుంది. ఆమె వాళ్లందరితోనూ నిత్యం టచ్‌లో ఉంటుంది.
నేను హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ బల్క్ డ్రగ్ కంపెనీలో ఎమ్మెస్సీ కెమిస్ట్‌గా జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ప్రమోట్ అయ్యి జనరల్ మేనేజర్ అవ్వడం జరిగింది. ఉదయం ఎనిమిదికి బయలు దేరితే ఇంటికి వచ్చేప్పటికి రాత్రి తొమ్మిదో పదో అయ్యేది. ఇంటినీ, బంధువుల్నీ చక్కబెట్టుకోవడం ఒక్కగానొక్క కూతురు త్రిషని చూసుకోవడం అంతా ఆమే చేసేది. బి.టెక్ చేసిన త్రిష గడచిన సంవత్సరమే పెళ్లి చేసేసాం. ఎలాగూ అంతా పిల్లదే అయినా నలుగురిలో అందంగా ఉండాలని మంచి కట్నం ఇచ్చాం. పెళ్లికొడుకు ఐ.ఐ.టీ. మద్రాస్ విద్యార్థి. ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంచి పోస్టులో ఉన్నాడు. త్రిష భర్తతో పుణేలో ఉంటోంది. మొన్ననే రిటైర్మెంట్ రోజుకి వచ్చింది. ఇప్పుడు రాలేనంది.
నేను గత నెలాఖరున రిటైర్ అయ్యాను. ఆఫీస్ వాళ్ల ఆఫీషియల్ పదవీ విరమణ సభా సన్మానాలూ, దగ్గరి సహోద్యోగుల పార్టీలూ, ఇతర మిత్రుల గెట్ టు గెదర్‌లతో ఈ నెల చకచకా గడిచిపోతోంది. ఇవాళ శ్రీలత బంధుమిత్రులంతా కలిసి ఒక స్టార్ హోటల్లో లంచ్ ఏర్పాటు చేసారు. అక్కడికే బయల దేరుతున్నాం. పదకొండయ్యేసరికి హోటల్‌కి చేరుకున్నాము. ‘‘వరప్రసాద్ గారి అభినందన పార్టీ’’ అన్న బ్యానర్ రిసెప్షన్ లో మమ్మల్ని ఆహ్వానించింది.
యాభై మంది పట్టేంత చిన్నహాల్ ఎంతో ముద్దుగా, రిచ్‌గా ఉంది. గోడలకి రంగు రంగుల గులాబీలు అతికారు. ఒక పక్క స్పెషల్ కుర్చీలు రెండువేసి టీపాయ్ మీద అందమైన చిన్న చిన్న పూల కుండీలు పెట్టారు. అందరూ అందరికీ కనబడేట్టుగా చైర్స్ అమర్చి ఉన్నాయి.అంతా ఒక్కసారిగా లేచి’’ కంగ్రాచ్యులేషన్స్! ప్రసాద్, శ్రీలతా’’ అంటూ చుట్టుముట్టారు. మమ్మల్ని తీసుకుని వెళ్లి మా స్పెషల్ కుర్చీలలో కూచోబెట్టారు. వాళ్ల ఉత్సాహం చూస్తుంటే నాక్కూడా హుషారు వచ్చింది. అందరినీ నేను కూడా పలకరించాను. మేం కూర్చోగానే ఒక్కొక్కరూ వచ్చి చేతులు కలిపి ప్రత్యేకంగా నాకు అభినందనలు చెప్పారు. ‘‘సో.. మన చీఫ్ గెస్ట్ శ్రీ వరప్రసాద్ గారు వచ్చేసారు. కార్యక్రమం ప్రారంభించేద్దాం’’ అంటూ శ్రీలత కజిన్ బ్రదర్, బ్యాంకు మేనేజర్‌గా చేస్తున్న శివశంకర్ మైక్ తీసుకున్నాడు.
‘‘గౌరవ బంధుమిత్రులారా! ఈరోజు మనం అందరం ఇలా కలవడం ఎంతో ఆనందంగా ఉంది. దానికి కారణమైన వరప్రసాద్ దంపతులకి ముందుగా అభినందనలు చెబుదాం’’ అంటూ మొదలు పెట్టాడు. ముందుగా నా కెమిస్ట్రీ స్పెషలైజేషన్ గురించి చెప్పి, కెమిస్ట్ నుండి జనరల్ మేనేజర్‌గా బల్క్ డ్రగ్ కంపెనీలో నా ఉద్యోగ ప్రస్థానం చదివి నేను ఉద్యోగానికి ఎంత అంకితమై పనిచేశాడో చెప్పాడు. ఇంకా చెబుతూ ‘‘ఏ పండగ లొచ్చినా, చిన్న ఫంక్షన్లు జరిగినా మాతో కలవడానికి బావగారికి కుదిరేది కాదు. వర్క్ ఈజ్ వర్షిప్ అనేది ఈయన్ని చూసే చెప్పుంటారు. వరప్రసాద్ నెమ్మదస్తుడు, నిదానస్తుడు, నిజంగా నైస్ జెంటిల్‌మాన్. ఇంతమంచి భర్తను పొందడం మా శ్రీలత అదృష్టం ఇంతటి కమిట్మెంట్ ఉన్న ఉద్యోగులు ఈ రోజుల్లో అరుదు’’ అని కూడా అన్నాడు. ‘నా గురించి ఇంత ఆలోచించారా? వీళ్లంతా!’ అని నాకు చాలా ఆనందంగా, తృప్తిగా, కాస్త గర్వంగా అనిపించింది.
తర్వాత ఆయనే శ్రీలత గురించి చెబుతూ ‘‘మా చెల్లాయి చిన్నప్పటి నుండీ ఎంతో సంస్కార వంతురాలూ, బంధుప్రీతి, మనుషుల్ని అభిమానించే వ్యక్తిత్వం గలదీ కూడా. మా వైజాగ్ నుంచి హైదరాబాద్‌కి పనుల మీద వచ్చే వారు శ్రీలత దగ్గరే దిగి పనులు చూసుకునేవారు. వారికి తగిన సూచనలూ, సలహాలూ ఇస్తూ ఎంతో సహాయకారిగా ఉండేది. ఇప్పటికీ అదే మంచితనం ఆమెది. ఆమెకు నా దీవెనలు’’ అంటూ ముగించాడు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పని చేస్తున్న శ్రీలత అన్నా, వదినా మా ఇద్దరికీ బట్టలు పెట్టారు. వదిన గారు ‘తాను ఎన్నో సార్లు బైటి ఊర్లకి రీసెర్చ్ పనిమీద వెళ్లినప్పుడు తన పిల్లల్నిద్దర్నీ శ్రీలత సొంత చెల్లెల్లా చూసుకుందని’ చెప్పి మెచ్చుకుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న శ్రీలత చెల్లెలు విద్య, ఆమె భర్తా కొంతకాలం వైజాగ్ మకాం మార్చినప్పుడు వాళ్లమ్మాయి శ్వేతని ఓ ఆరు నెలలు మా ఇంట్లో ఉంచి కాలేజ్‌కి పంపింది శ్రీలత. ఇప్పుడా అమ్మాయి టీసీఎస్‌లో పనిచేస్తోంది. ‘‘మా పెద్దమ్మ నాకు రెండో అమ్మ’’ అంటూ శ్వేత ఎంతో ప్రేమా, కృతజ్ఞత ప్రకటించింది. అక్కడున్న ప్రతి ఒక్కరూ మైక్ తీసుకుని ఆమెతో తమ అనుబంధం గురించి చెప్పారు. ముఖ్యంగా స్నేహితుల్నీ, బంధువుల్నీ ఆదరించే విషయంలో శ్రద్ద తీసుకుని తామందరినీ ప్రేమగా ఆదరించిందని వాళ్లంతా చెప్పారు. చివరగా శ్రీలత లాంటి భార్య దొరకడం వరప్రసాద్ అదృష్టం అని అంతా అన్నారు.
ఇది నా రిటైర్మెంట్‌లా లేదు ఆమె సన్మానసభలా ఉందే అనిపించింది నాకొక్క క్షణం. ఆ వెంటనే ‘నిజమే నేను ఎవరికీ సాయం చెయ్యలేదేమో! ఆ కెమికల్ కంపెనీకి జీవితం అంకితం చేశానేమో. నాతో చదివిన అనేక మంది మిత్రులు, మా రాజోలు కజిన్స్ హైదరాబాద్‌లోనే ఉన్నారని అప్పుడూ,ఇప్పుడూ వినడమే కానీ వారిని పలకరించింది లేదు తాను. ఆఖరికి ఈ సభలో కనీసం ఒక్కరు కూడా నా తరఫు నుంచి రానేలేదు సుమా అనిపించింది.
ప్రతి ఒక్కరూ శ్రీలతని కౌగలించుకుని తాము తెచ్చిన గిఫ్ట్ లిచ్చారు. నాకు హ్యాపీ రిటైర్మెంట్ చెప్పారు. తర్వాత అందరం మాకోసం ప్రత్యేకంగా అమర్చిన లంచ్ హాల్‌కి నడిచాం. వంటకాలన్నీ చాలా బావున్నాయి. అన్నీ మా ఇద్దరికీ నచ్చినవే ఉన్నాయి. కబుర్లు చెప్పుకుంటూ సరదాగా డెసర్ట్‌తో సహా లంచ్ తిని వీడ్కోలు తీసుకునేసరికి మూడయ్యింది. ఇంటికి తిరిగి వస్తుంటే ‘‘నువ్వు చెప్పినట్టే అద్భుతంగా ఉంది పార్టీ’’ అన్నాను లతతో. ‘‘ఎంత యిందో ఎవరు పే చేసారో ?’’ అన్న నా మాటకి ఆనందంతో వెలిగిపోతోన్న మొహంతో ‘‘చెప్తారా మనకి?’’ అంది దర్పంగా. అంతమందితో నవ్వుతూ గల గలా కబుర్లు చెబుతూ అలిసిపోయిన ఆమె ఇంటికి రాగానే బట్టలు మార్చుకుని నిద్రపోయింది. నేను కూడా బట్టలు మార్చు కుని మొహం కడుక్కుని సోఫాలో ఆలోచిస్తూ కూర్చున్నాను. వాళ్లంతా ఎంతో అభిమానంతో మమ్మల్ని గౌరవించారు. అయితే ఎందుకో మరి, ఏదో అస్థిమితంగా ఉన్నట్టుగా ఉంది నా మనసులో.
గత నెల నా రిటైర్మెంట్ రోజుకి త్రిషా,అల్లుడూ, శ్రీలత అన్నావదినా, చెల్లెలూ, మరిదీ ఒకరోజు ముందుగానే రావడానికి ఒప్పుకున్నారు. ‘‘మా చెల్లాయిలిద్దరినీ పిలవనా?’’ అంటే ‘‘వద్దండీ తర్వాతెప్పుడైనా పిలుద్దాం’’ అంటూ వారిం చింది శ్రీలత. చెల్లెళ్లకి ఫోన్ చేసాడు తాను. ‘‘ఈ నెలాఖరుకు రిటైర్ అవుతున్నా నర్రా! మనం తర్వాత కలుద్దాం’’ అంటూ.’’ అలాగే అన్నయ్యా! శుభాకాంక్షలు’’ అన్నా రిద్దరూ. అమ్మా నాన్నా ఏ రెండేళ్లకో వచ్చేవారు. చెల్లెళ్లిద్దరూ పెళ్లయిన కొత్తలో ఒకసారి వచ్చారు. తర్వాత వచ్చింది చాలా తక్కువే. శ్రీలత ఎందుకో అత్తామావల మీదా, ఆడపడుచుల మీద ఎప్పుడూ ఫిర్యాదు చెయ్యలేదు కానీ వాళ్లను కలుపుకోలేదేమో అని అప్పుడప్పుడూ అనిపించేది. అది లోకంలో ఉన్నదేలే అనుకున్నాడు తను. ఎప్పుడు రమ్మన్నా వాళ్లు తన దగ్గరికి రావడానికి ఉత్సాహం చూపించే వారు కాదు.
ఇవాళ ఈ బంధుమిత్రుల కలయిక చూస్తే ఆమె తన పరివారాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నదని అనిపిస్తోంది. అమ్మా నాన్నా ఎలాగూ లేరు కనీసం తాను తన చెల్లెళ్లనయినా పిలవాల్సింది అని కొంచెం బాధ కలిగింది. ఎక్కడో పొరపాటు జరిగిందేమో అనిపిస్తోంది.నిజానికి తనెప్పుడూ ఉద్యోగం బిజీ లోనే ఉండేవాడు.ఎప్పుడైనా పండగలకి అమ్మా, నాన్నా వచ్చి రెండు రోజులుండి వెళ్లిపోయే వారు, పనులున్నాయనే వారు.అది పనులుండేనా? లేక శ్రీలత దగ్గర వాళ్లకు ఆదరణ లభించకా ? ఎప్పుడూ లేని ఆలోచనలు ఇప్పుడే వస్తున్నాయేమిటి నాకు? తల విదిలించాను.
నిద్ర నుంచి లేచి టీ తీసుకొచ్చి కూర్చుంది లత. ‘‘ఏవండీ చాలా బాగా జరిగింది కదా ఫంక్షన్?’’ అన్న ఆమె మాటలకి ‘‘ఆ.. ఆ.. నీ ఫ్యామిలీకి నువ్వింత కావలసిన దానివని, వాళ్లను నువ్వింత కేరింగ్‌గా చూసుకున్నావని ఇన్నాళ్లుగా నాకే తెలీలేదు’’ అన్నాను నవ్వుతూ. ‘‘అంతే కదా మరి మీ మగాళ్లు!’’ అని నవ్వేసింది శ్రీలత. ‘‘నిన్ను చూసి నేను నేర్చుకోవలసింది చాలానే ఉంది లతా’’ అన్నాను. ‘‘అదిగో వెక్కిరిస్తున్నారు’’ అంటూ కప్పులు తీసుకుని లేచింది చిరునవ్వుతో. మర్నాడుదయం టెర్రస్ మీద వాకింగ్ చేస్తుంటే మళ్ళీ ఆలోచనలు చుట్టుముట్టాయి.
అమలాపురంలో ఇంజనీరింగ్ చదివే పెద్ద చెల్లాయి పెద్ద కూతురు శ్రావ్య రోజూ ‘‘గుడ్ మార్నింగ్ మామాశ్రీ’’ అంటూ ఒక కార్డు పెట్టేది. అలా రోజూ మేనకోడలు తనని పలకరిస్తుంటే తనకెంతో బావుండేది చెల్లాయితో మాట్లాడినట్టుండేది. దాని డీపీ చూస్తే చిన్నప్పటి చెల్లాయేననిపించేది. ఒక రోజు ఫోన్‌లో శ్రావ్య కార్డులన్నీ భార్యకీ, కూతురికీ చూపించాడు తను. అవి కొన్ని మంచి సీనరీలు, కొన్ని కొటేషన్లూ.‘‘అన్నీ బావున్నాయి డాడీ! శ్రావ్యది మంచి టేస్ట్’’ అంది త్రిష. శ్రీలత కూడా చూసింది. ఏమీ మాట్లాడలేదు. మర్నాటి నుండీ ఆ పిల్ల నుంచి గుడ్ మార్నింగ్ రావడం ఆగిపోయింది. శ్రావ్యని త్రిష పెళ్లికొచ్చినప్పుడు అడిగాడు తను ‘‘ఏమ్మా! గుడ్ మార్నింగ్ పెట్టడం మానేశావ్ ఈ మధ్య’’ అని. నా ఫోన్ తీసుకుని చెక్ చేసి నీ ఫోన్లో నా నంబర్ డిలీట్ ఐపోయింది మావయ్యా! ఇంకెలా వస్తుందీ!’’ అని నవ్వేసింది. ‘ఎలా డిలీట్ అయ్యింది?’తనకప్పుడు రాని అనుమానం ఇప్పుడు వస్తోంది. త్రిష పెళ్ళికి చెల్లెళ్ల ఫ్యామిలీలు వచ్చాయి కానీ ఎక్కువ ఉత్సాహంగా కనబడలేదు. బావుండదని వచ్చినట్టుగా ఉన్నారు. పెళ్లి అయిన మర్నాడే వెళ్లిపోయారు. మరో రెండు రోజులు ఉండమని అడిగినా ఉండలేదు.
ఒక రోజు మధ్యాహ్నం గెస్ట్‌బెడ్ రూమ్‌లో పడుకున్న తనకి నిద్రపట్టక క్రెడిట్ కార్డు కనబడని విషయం గుర్తొచ్చిమరోసారి వెతుకుదామనిపించి బెడ్ రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడ తల్లీ కూతురూ అటుతిరిగి పడుకుని ఉన్నారు. అప్పటికి కూతురు పెళ్లయి ఆరు నెలలయింది. మరో నెలలో త్రిషని కాపురానికి భర్త దగ్గరికి పూణే పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. త్రిషపై చెయ్యి వేసి శ్రీలత అంటోంది.’’ నువ్వూరికే ఆడబిడ్డా, అత్తా అంటూ వాళ్లతో బాగా కలిసి పోయి ఎక్కువ ప్రేమగా ఉండాలనుకోకు. కొంచెం దూరం గానే ఉండు. ఈ అమ్మ చెప్పేది నీ మంచికోసమే కదా సరేనా, కన్నా!’’ ముద్దుచేస్తూ అంటోంది శ్రీలత. ఆ సంఘటన ఇప్పుడు గుర్తు చేసుకుంటుంటే మనసులో చురుక్కున గుచ్చుకుంటోంది.
తను రాత్రి తొమ్మిదికే అలిసిపోయి పడుకునే వాడు. తర్వాత చెల్లెళ్ల ఫోన్‌లో తల్లితండ్రుల ఫోన్ లో వస్తే మర్నాడు చూసి ‘‘లతా ఎందుకో కనుక్కో’’ అనేవాడు తను హడావిడిగా వెళ్లిపో•తూ మళ్లీ ఎప్పుడో గుర్తొచ్చినపుడు అడిగేవాడు ‘‘కనుక్కున్నావా? ఫోన్ చేసావా?’’ అంటూ. ‘‘ఊరికే చేశారట లెండి’’ అనేది శ్రీలత. క్రమంగా ఆ ఫోన్ లు కూడా చెల్లెళ్లు మానేశారు. అలా నెమ్మదిగా దూరం పెరిగింది. తను ఫోన్ చెయ్యకపోయినా నాన్నే తరచూ చేసి మాట్లాడి అమ్మతో మాట్లాడిస్తూ ఉండేవారు. అమ్మా నాన్నా చెల్లాయిలిద్దరి గురించీ వార్తలు చెప్తూ ఉండేవారు. అమ్మా నాన్నా పోయాక రెంళ్ల నుంచీ చెల్లాయిల కుటుంబ విశేషాలు కూడా తెలియడం లేదు. మా ఊరు కోనసీమ రాజోలు దగ్గర శివకోడు. అక్కడ అమ్మా నాన్నా కట్టుకున్న పెంకుటిల్లు ఉంది. అది పాడవకూడదని నేనే మా బంధువులకే ఉండడానికి ఉచితంగా ఇచ్చి ఇంటిని శుభ్రంగా ఉంచమని చెప్పాను.
మర్నాడు ప్రొద్దున్నే చెల్లాయిలిద్దరికీ ఫోన్ చేసాను. ‘‘రిటైర్ అయ్యావు కదా వీలు చూసుకుని ఇద్దరూ రండి ఓ వారం ఉండాలి’’ అంది పెద్ద చెల్లి. చిన్న చెల్లి కూడా ‘‘రా రా ఒకసారి’’ అంది. ఇద్దరూ పక్క పక్క గ్రామాల్లోనే ఉంటారు. వ్యవసాయదారులే. మధ్య తరగతి ఆస్తి పరులు. లోటులేదు. ఇద్దరేసి పిల్లలు ఇద్దరికీ. చిన్న చెల్లాయి పిల్లలు హైస్కూల్‌లో ఉన్నారు చిన్నప్పుడు చెల్లాయిలిద్దరూ తన వెనకే ఉండే వారు. వాళ్లిద్దరూ కొట్టుకునేవారు కానీ నాతో గొడవ పడేవారు కాదు. ఇద్దరూ టెన్త్ చదివి మానేశారు. ప్రతీ పండగకీ వాళ్లే ఫోన్లు చేస్తుంటారు. తానెప్పుడూ చేసేవాడు కాదు.
ఏ పెళ్లిళ్లలో కలిసినా చెల్లాయిలూ,వారి భర్తలూ ఆంటీ ముట్టనట్టు ఏదో దూరపు బంధువుల్లా ఉంటుంటే పెద్దవాళ్లయ్యాకా అది సహజమే అని పొరబడ్డాడు తాను. ఇకనుంచీ చెల్లెళ్ల ఇళ్లకు రాకపోకలు చేస్తూ వాళ్లను కలుపుకోవాలి. వాళ్ల పిల్లల చదువుల, పెళ్లిళ్ల గురించి సలహా, సహాయాలు చెయ్యాలి. మన అనుకున్న బంధువులైనా మిత్రులైనా, వారితో బంధం పదిలంగా అల్లుకున్న అందమైన గూడులా ఉండాలి కానీ కాకి గూడులా ఉండ కూడదు. దానికి నా ప్రయత్నం ముఖ్యం. అది నా బాధ్యత. ఇన్నేళ్లూ నేనూ నా ఉద్యోగం, నా భార్యా, నా పిల్లా అనుకుంటూ నా ప్రపంచంలోనే ఉండి పోయాను. ఇక్కడే ఉన్న నా క్లాస్‌మేట్‌ల ఫోన్ నంబర్లు సంపాదించి వాళ్లనూ కలవాలి.
రెండురోజులయ్యాక ఆమెకి నా అభిప్రాయం చెప్పాను.‘‘లతా! నేనొక వారం రోజులు మా ఊరు వెళ్లొస్తాను. మా చెల్లాయిల్నీ, ఇతర బంధువుల్నీ చూసొస్తాను. ఇన్నేళ్లూ ఉద్యోగంలో పడి బిజీగా ఉండి పోయాను. ఇప్పుడొక్కసారి అందరినీ కలవాలని పిస్తోంది. పచ్చని చేలూ, కొబ్బరి తోటలూ ఉండే మా శివకోడుని చూడాలనిపిస్తోంది.’’
‘‘ఇప్పుడెందుకు? వీలు చూసుకుని వెళదాం లెండి ఎప్పుడైనా’’ అంది శ్రీలత చటుక్కున.
‘‘లేదు ఇప్పుడే వెళ్లాలి’ అన్నాను ఖచ్చితంగా. ‘‘మరి నేను? నేను రావద్దా? మీతో’’ అంది కినుకగా.
‘‘నీకు అక్కడ సౌకర్యంగా ఉండదు. నువ్వుండ లేవులే. నిద్ర పట్టదు కూడా’’ అన్న నా మాటలకి మెత్తబడిందామె.
‘‘ఒక్కదాన్నే ఎలా ఉంటాను?’’ మరో ప్రశ్న వేసింది. ‘‘మీ వాళ్లెప్పుడూ రమ్మని పిలుస్తూ ఉంటారు కదా! ఇప్పుడు వెళ్లు ’’ అన్నాను.‘‘మంచి ఐడియా, వెళ్తాను. అయితే వారం ఎందుకు ఓ నాలుగు రోజులుండి వచ్చెయ్యండి’’ అంది.
‘‘ఫోన్లు చేస్తూ ఉంటానుగా, చూద్దాం ‘‘అన్నాను.‘‘మీ బట్టలు సర్దుతాను. బాగ్ తీసివ్వండి పైనుండి’’ అంది. నేను స్టూల్ ఎక్కి సూటుకేసు తీసిచ్చా. ఆమె చకచకా నా బట్టలన్నీ బైటికి తీసి సర్దడం మొదలెట్టింది.
నా కార్ డ్రైవర్‌గా పనిచేసిన రఫీక్‌కి మొన్ననే ఫోన్ చేసి డ్రైవర్ కావాలనడిగాను. కొడుకు ఖాదర్‌ను పంపుతానన్నాడు. మర్నాడుదయమే ఖాదర్ నాలుగున్నరకల్లా వచ్చాడు. తెల్లవారక ముందే ఐదు గంటలకే మంచి కాఫీ తాగి కారులో కూర్చుని బయలుదేరుతుంటే ఆకు పచ్చని కోనసీమలోని మా ఊరి కేసి రెక్కలు చాపి గువ్వలా ఎగిరిపోతున్న అనుభూతి! ఎంత బావుందో! వెంటనే నా వీపు నేనే తట్టుకుంటూ, తు.చ. తప్పకుండా నేను చేయాలనుకుంటున్న పనులన్నీ, ఫోన్‌లో ఒక చోట నోట్ చేసుకున్నాను. ఇప్పుడు నా ఉత్సాహం రెట్టింపయ్యింది.