3/3.. ఎన్నికలయిన మూడు ఈశాన్య రాష్ట్రాలు బీజేపీ ఏలుబడిలోకి వచ్చాయి. భారతదేశం వేరు, తాము వేరు అనుకుంటున్న ప్రజలు జాతీయవాదాన్ని మనసా వాచా నమ్మే బీజేపీకి పట్టం కడుతున్నారు. ఇదొక గొప్ప మార్పు. కానీ ఒక్కరోజులో వచ్చినది కాదు. అలనాడు అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం, నేడు నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయం. దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురై, హింసకు, తిరుగుబాట్లకు ఆలవాలమైన ఈ ప్రాంతం నేడు అభివృద్ధిలో పరవళ్లు తొక్కుతూ కనిపిస్తోంది.
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఈ లోగా తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావలసి ఉండగా, అందులో త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలలో ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చేశాయి. ఈశాన్య భారతంలో బీజేపీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని ఈ ఎన్నికలు నిరూపించాయి. త్రిపురలో సీట్లు తగ్గినా అది తన స్థానాన్ని పదిలపరచుకుంది. నాగాలాండ్‌లో కూటమి సహకారంతో విజయాన్ని అందుకుంది. మేఘా లయలో ఓటర్ల తీర్పు కొంచెం భిన్నంగా ఉంది. లోక్‌సభకు ఎక్కువ మంది ఎంపీలను పంపక పోయినా, జాతీయ భద్రత పరంగా ఈశాన్య భారతానికి విశేష ప్రాధాన్యం ఉంది. ఇలాంటి చోట బీజేపీ స్పష్టమైన, సుస్థిరమైన ముద్రను వేయ గలిగింది. రెండుసార్లు అస్సాం, త్రిపురలలో విజయం సాధించింది. నాగాలాండ్‌లో ఎన్డీపీపీ లాంటి పార్టీతో కూటమి ద్వారా అధికారాన్ని పొందగలిగింది. గత ఏడాది మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలలో 60 స్థానాలకు 32 స్థానాల్లో విజయం సాధించి, కాంగ్రెస్‌కు కేవలం ఐదుకు పరిమితం చేయగలిగింది.
ఇక కాంగ్రెస్ పరంగా చూస్తే, ఈశాన్యరాష్ట్రాల ఎన్నికలు ఆ పార్టీకి కష్టాలు తీరలేదని, గత కొంత కాలంగా అపజయాలతో జీవం కోల్పోయిన ఆ పార్టీ తిరిగి కోలుకోలేదని స్పష్టం చేస్తున్నాయి. నాయకత్వ లోపం, అందరినీ కలుపుకుపోయే స్వభావం లేకపోవటం తీరని నష్టాన్ని కలిగించింది. ఈ దఫా కూడా ఇక్కడి ఎన్నికలు, కాంగ్రెస్ ను విడిచిన ఇతర పార్టీల నాయకుల చుట్టూనే తిరిగాయి.
కాంగ్రెస్ మాజీ నాయకుడు ప్రద్యోత్ మాణిక్య దేబ్ బర్మ త్రిపుర రాజవంశీకుడు. పార్టీని వదిలి తిప్రా మోతా పార్టీని పెట్టారు. మేఘాలయలో కాంగ్రెస్ నాయకుడు ముకుల్ సంగ్మాను పార్టీ నిలుపు కోలేకపోయింది. అంతే కాదు. బీజేపీ జతకట్టిన ఎన్డీపీపీ.. అసెంబ్లీలో అతి పెద్ద పార్టీకి కాన్రాడ్ సంగ్మా నాయకత్వం వహిస్తున్నారు. ఈయన తండ్రి పిఏ సంగ్మా కాంగ్రెస్ నాయకుడు. సోదరి అగాథ సంగ్మా మన్మోహన్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. నాగాలాండ్‌లో కూడా అంతే. బీజేపీ మద్దతుతో ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతున్న నిఫ్యూరియో రెండు దశాబ్దాల క్రితం వరకూ నాయకుడే. భాజపా అధ్యక్షుడు, ఈశాన్య రాష్ట్రాల వ్యూహకర్త హిమంత్ బిశ్వ శర్మ కొన్నాళ్ల క్రితం వరకూ కాంగ్రెస్ నాయకుడే. అధిష్టానం తమ సమస్యలను పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ ఆయన పార్టీని వీడారు. త్రిపుర బీజేపీ నేత మాణిక్ సహా కూడా మాజీ కాంగ్రెస్ నాయకుడే. కాంగ్రెస్ ఆయా నాయకులను నిలుపుకుని ఉంటే ఫలితాలు మరో తీరుగా ఉండేవనేది స్పష్టం.
ఈ ఎన్నికల ఫలితాలు వామపక్షాలను కూడా నిరాశపరిచాయి. త్రిపురలో రెండోసారి అవి బీజేపీ చేతిలో చావుదెబ్బ తిన్నాయి. 2018 వరకూ త్రిపుర.. కేరళ మాదిరిగానే సీపీఐ (ఎం)కి పెట్టనికోట. దశాబ్దం క్రితం వరకూ పశ్చిమబెంగాల్ కూడా దాని ఆధీనంలోనే ఉండేది. కాంగ్రెస్‌తో జతకట్టినా సీపీఐ (ఎం) బీజేపీని ఓడించలేకపోయింది. బెంగాల్ మాదిరిగానే, ఈ రాష్ట్రం కూడా తన చేతిలో నుంచి జారిపోయినట్టేనన్న అభిప్రాయాన్ని కలిగించింది.ఈ ఫలితాలు మరో విషయాన్ని స్పష్టం చేశాయి. బీజేపీ ఎప్పటికప్పుడు కొత్త ఓటర్లు ఆకర్షిస్తూ..ఎలక్టోరల్ మిషన్‌లా తయారయ్యింది. బలహీనంగా ఉన్న చోట్ల కూటమికి సిద్ధపడుతోంది. కాంగ్రెస్ పార్టీ దానికి భిన్నంగా ప్రవర్తిస్తూ ప్రతికూల ఫలితాలను చవి చూస్తోంది.
మేఘాలయ ఎన్నికల్లో తృణమూల్ ప్రవేశం మరో కొత్త విషయాన్ని చాటుతోంది. ఒకవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్లు ప్రతిపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్నా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ లాంటి వాళ్లు దానికి మద్దతు పలుకుతున్నా.. అది తృణమూల్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు.. అవి అవకాశం ఉన్న ప్రతి చోటా కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఫలితంగా కాంగ్రెస్ మీద పై చేయి సాధిస్తూ బీజేపీ తన ఆధిపత్యం కొనసాగించు కుంటూ పోతోంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
ఈశాన్యానికి సముచిత ప్రాధాన్యం
మోదీ ప్రభుత్వం ఆది నుంచి ఈశాన్యభారతంపై దృష్టి పెట్టింది. మంత్రివర్గంలో అక్కడి నేతలకు సముచిత స్థానం కల్పించింది. ప్రస్తుతం మంత్రి వర్గంలో ఇద్దరు కేబినెట్ మంత్రులు, ముగ్గురు సహాయమంత్రులు ఉన్నారు. మొట్టమొదటిసారి త్రిపుర నుంచి ఎన్నికయిన వ్యక్తికి కేబినెట్‌లో చోటు దక్కటమే కాదు. కిరణ్ రిజీజుకు అత్యంత ప్రాధాన్యం గల న్యాయశాఖ దక్కటం రాబోయే రోజుల్లో ఈశాన్యం అనేది దేశంలో అత్యున్నతమైన నాయ కత్వాన్ని అందించగలదనేటానికి సూచికగా చెప్ప వచ్చు.
అలాగే ఖ్యాతి పొందిన నాయకులకు ఇక్కడ కొదవలేదు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన రాష్ట్రంలోనే కాదు, ఇతర ప్రదేశాల్లో కూడా ప్రభావం చూపుతున్నారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. నాగాలాండ్ బీజేపీ అధ్యక్షుడు టెంజన్ ఇమ్నా ఆసక్తికరమైన వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. ‘‘ఆయన నాగాలాండ్‌కు, ఈశాన్య భారతానికి గొప్పగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేను కూడా అప్పుడప్పుడు ఆయనను అనుసరించాలని ప్రయత్నిస్తాను’’ అని స్వయంగా ప్రధానే ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. నాగాలాండ్ సాంస్కృతిక వేడుక హాన్బిల్ ఫెస్టివల్ దేశంలో అన్ని ప్రాంతాలవారిని విశేషంగా ఆకర్షిస్తుంది. 2014లో మోదీ ప్రధాని కాగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిం చారు.
సర్వతోముఖాభివృద్ధికి విశేష కృషి
మోదీ ప్రభుత్వ హయాంలో గత తొమ్మిదేళ్లలో ఈశాన్య రాష్ట్రాల స్వరూపమే మారిపోయింది. ప్రాంతాల మధ్య కనెక్టివిటీ, మౌలిక వసతుల కల్పన, శాంతి, స్థిరత్వం, ఇన్ క్లూజివిటీ తదితర అంశాల్లో అసాధారణ మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇక్కడ హింస తగ్గుముఖం పట్టింది. తిరుగుబాట్లు, తీవ్రవాద దాడులు, సాయుధ పోలీసుల పదఘట్టనలు చాలా వరకూ తగ్గిపోయాయి. దాంతో త్రిపుర, మేఘాలయాల్లో పూర్తిగానూ, నాగాలాండ్‌లో ఏడు జిల్లాలోనూ సాయుధ దళాల ప్రత్యేక చట్టాన్ని (ఎఎఫ్‌ఎస్‌పిఏ) ఎత్తివేశారు.
కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలపాటు ఈ ప్రాంతంపైన నిర్లక్ష్యం చూపింది. 1962 చైనా యుద్ధంలో, అరుణాచల్‌ప్రదేశ్ లోని బొమిడాల ప్రాంతాన్ని చైనా సైన్యం ఆక్రమించటంపైన అప్పటి ప్రధాని నెహ్రూ నిస్సహాయత వ్యక్తం చేయటంతో అస్సాంలో మంటలు రేగాయి. మార్చి 5, 1966లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, మిజో నేషనల్ ఫ్రంట్‌కు వ్యతిరేకంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఎఎఫ్)చేత మిజోరాం జనావాసాలపైన బాంబు దాడి చేయించారు. దాంతో ఆ రాష్ట్రంలో తిరుగుబాట్లు రివాజుగా మారాయి. అక్కడ ప్రజల మనస్తత్వంలో అవి భాగంగా మారిపోయాయి. అస్సాం నుంచి రాజ్యసభ సభ్యుడయిన డాక్టర్ మన్మోహన్ సింగ్, ప్రధాని హోదాలో ఒక్కసారి కూడా ఈశాన్యరాష్ట్రాల సమస్యల గురించి ప్రస్తావించలేదు. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరివల్ల ఈ ప్రాంతంలో మిలిటెన్సీ ప్రబలింది. యూపీఏ హయాంలో ఎన్నోసార్లు చైనీయుల చొరబాట్లు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆయా ప్రాంతాలకు మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా ‘దూరాభారం సమస్య’ను ఎదుర్కోవటం మరో కారణం.
ఈశాన్య రాష్ట్రాలో అభివృద్ధికి గల అవకాశాలను ప్రధాని మోదీ గుర్తించారు. ఆయన ప్రతిష్ఠాత్మకమైన ‘లుక్ ఈస్ట్ పాలసీ’కి కొన్ని మెరుగులు దిద్ది, దానిని ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’గా మార్పు చేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి అనేది ఆగ్నేయాసియాకు ప్రవేశద్వారంగా భావించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇండియా-మైన్మార్-థాయ్‌లాండ్ త్రైపాక్షిక రహదారి, అగర్తల-అఖౌరా రైల్ ప్రాజెక్టులు కేంద్రం దూరదృష్టికి తార్కాణంగా నిలుస్తాయి. ఇవి పూర్తయ్యాయంటే ఈ ప్రాంతాల స్వభావమే మారిపోతుంది. అలాగే ఈ రాష్ట్రాలు వివిధ రంగాల్లో సర్వోతోముఖాభివృద్ధిని సాధించాయి.
ఈ 9 ఏళ్ల మోదీ ప్రభుత్వ హయంలో రూ.50వేల కోట్లకు పైగా ఆ రాష్ట్రాలలో వెచ్చిం చింది. కొత్త రైలుమార్గాలు, వంతెనలు, సొరంగ మార్గాలను నిర్మించింది. మరో రూ.80 వేల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులను మంజూరు చేసింది. గత ప్రభుత్వాలతో పోలిస్తే ఇది రికార్డని చెప్పాలి. 2014 వరకూ ఈశాన్యప్రాంతంలో రైలుమార్గాలు కేవలం అస్సాం ప్రాంతం వరకే పరిమితమయ్యేవి. ఇప్పుడు రైల్వేల విస్తరణకు బహుముఖంగా కృషి సాగుతోంది. ఉపరితల రవాణాలో పురోగమన వేగం ఏ ప్రాంతంలోనయినా అభివృద్ధి పరుగులెత్తటానికి కీలకం అవుతుంది. ఇప్పుడు ఈశాన్య భారతంలో దానిని ప్రత్యక్షంగా చూడొచ్చు. భౌగోళికంగాకానీ, ఇతరత్రా గానీ ఎదురయ్యే అన్ని సవాళ్లను అధిగమించి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిపనులు చేపడుతున్నారు. దాంతో ప్రాంతాల మధ్య దూరం తగ్గుతోంది. ప్రయాణసమయం తగ్గటం చెప్పుకోదగ్గ మార్పు.
– గత తొమ్మిదేళ్లలో, నార్త్ ఈస్ట్ రీజియన్ (ఎన్‌ఈఆర్) లో ఎయిర్ పోర్టుల సంఖ్య తొమ్మిది నుంచి 16కి చేరింది. 2014లో 900 వరకూ విమానాలు ఇక్కడ తిరుగుతుంటే ఇప్పుడు వాటి సంఖ్య 1900కి పెరిగింది.
– ఈ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు మొట్టమొదటిసారిగా ఇండియా రైల్వేమ్యాప్ లో చోటు సంపాదించాయి. జలరవాణా మార్గాల వృద్ధికి కూడా చర్యలు సాగుతున్నాయి. అలాగే నేషనల్ హైవేలు.. 2014 నుంచి చూస్తే ఈ ప్రాంతంలో వాటి సంఖ్య 50 శాతానికి పెరిగింది.
– అన్ని ఈశాన్య రాష్ట్రాలు ఇప్పటికి రైల్వే కనెక్టివిటీ పరిధిలోకి వచ్చాయి. మణిపూర్,మిజోరాం, మేఘాలయల రాష్ట్ర రాజధానులను 2023 నాటికి అనుసంధానించాలని నిర్ణయించారు.
– భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య నిర్మిస్తున్న అగర్తల రైల్వే మార్గానికి రూ.1100 కోట్లకు పైగా వెచ్చిస్తు న్నారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ (డోనర్), విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ ప్రాజెక్టుకు సంయుక్తంగా నిధులు సమకూరుస్తు న్నాయి. ఇంఫాల్ రైలుమార్గాన్ని మోరే దాకా పొడిగిస్తున్నారు. అక్కడ మైన్మార్ రైల్వేలకు అనుసంధా నితమై ఆసియా వ్యాప్త రైలుగా మారుతుంది.
– ఎన్‌ఈఆర్‌లో చెప్పుకోదగ్గ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టుల విషయానికొస్తే.. సిక్కిం-కలింపాగ్-డార్జిలింగ్ ప్రాంతంలో బాగ్రాకోటె నుంచి పెక్యాంగ్ (ఎన్ హెచ్ -717ఎ) ల మధ్య ఉన్న రెండు లేన్ల రహదారి (152కి.మీ), ఇంఫాల్-మోరే సెక్షన్ల మధ్య (ఎన్ హెచ్ -39) నాలుగు లేన్ల రహదారి (20కి.మీ), మణిపూర్లో రెండు లేన్ల రహదారి (75.4 కి.మీ), నాగాలండ్‌లో దిమాపుర్-కొహిమా రహదారి (62.9 కి.మీ), అరుణాచల ప్రదేశ్ లో హోలంగ్ కి నాలుగు లైన్ల బైపాస్ (167కి.మీ), మిజోరంలో ఐజ్వాల్- టూపాంగ్ (ఎన్ హెచ్54) బైపాస్ రహదారి (351కి.మీ).
– ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 141 మీటర్ల స్తంభాల వంతెనతో జిరిబామ్-ఇంఫాల్ రైలు మార్గాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయటానికి కేంద్రం నిధుల చేయూతను అంది స్తోంది. 2009-2014 మధ్య ఏటా రూ.2,122 కోట్ల వ్యయంతో పోలిస్తే, సగటువార్షిక బడ్జెట్ కేటాయింపులో ఇప్పుడు 370 శాతం పెరుగుదల ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి అది రూ.9,770 కోట్లకు చేరింది.
– ఈ ప్రాంత భౌగోళిక ప్రాధాన్యతను గుర్తిస్తూ అస్సాం-అరుణాచల్ ప్రదేశ్‌లను కలిపే రైల్-రోడ్ మార్గం నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా భారతదేశంలోనే తొలి జలాంతర రైలుమార్గ సొరంగం నిర్మితం కానుంది.
– 2017లో ఉత్తర అస్సాం-తూర్పు అరుణాచల ప్రదేశ్ లను కలిపే కీలక వ్యూహాత్మక ధోలా-సాదియా వంతెనపై వాహన రాకపోకలు మొదలయ్యాయి. ఇది భారతదేశంలో నీటిపై నిర్మించిన అతిపొడవైన వంతెన మాత్రమేకాదు. మన యుద్ధట్యాంకులను కూడా సులువుగా మోయగలదు.
ఆసియాలోనే రెండో అతి పొడవయిన ‘బోగీబీల్’ రైలు రోడ్డు వంతెన 2018లో ప్రారంభమైంది. ఇది అస్సాం-అరుణాచల్ మధ్య ప్రయాణదూరాన్ని 80 శాతాన్ని తగ్గించింది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతను భూకంపాలను కూడా తట్టుకునేలా ఈ వంతెన నిర్మితమైంది.
– ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌తో డిజిటల్ కనెక్టివిటీ పెంచేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుం టోంది. 5జీ నెట్‌వర్క్ వల్ల స్టార్టప్ ఎకోసిస్టమ్ మెరుగు పడుతుంది. ఈ ప్రాంతంలో సర్వీస్ సెక్టార్ అభివృద్ధికి ఈ చర్యలు దోహదపడతాయి.
– ఈ ప్రాంతంలో నాచురల్ ఫార్మింగ్‌కి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కృషి ఉడాన్ ద్వారా, ఇక్కడి రైతులు తమ ఉత్పత్తులను దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ మూలలోనయినా అమ్ముకోగలుగు తారు. గత ఆరేళ్లలో ఈ ప్రాంతం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులలో 85శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. మౌలికవసతుల అభివృద్ధి, కమ్యూనికేషన్ సేవల విస్తరణ వల్ల ఈ మార్పు సాధ్యమైంది.
– ఈ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అందుకోసం ప్రత్యేకంగా అత్యా ధునికమైన విస్టాడోమ్ కోచ్‌లను ప్రవేశపెట్టింది. దీనివల్ల మహిళలు, గిరిజనులకు, వెనుకబడిన వర్గాల వారికి అవకాశాలు మెరుగుపడ్డాయి. స్థానిక వ్యాపారాలను, ఆర్థిక వ్యవస్థలను ప్రోత్సహించే కృషిలో భాగంగా ఈశాన్యసరిహద్దు రైల్వే 2022లో అసోం-గోవాల మధ్య తొలి పార్సిల్ కార్గో ఎక్స్ ప్రెస్ రైలును నడిపింది. గత మూడు సంవత్సరాలుగా రైల్వేలు 20వేలకు పైగా కార్మికులకు ఉపాధి అవకాశాలను కల్పించింది.
ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలలో ఓటర్లు పాలకపక్షాల కూటమికి మద్దతు పలికారు. 2018తో పోలిస్తే కొద్దిగా సీట్లు తగ్గినా, త్రిపురలో బీజేపీ కూటమికి అత్యధిక ప్రజాదరణ ఉన్న విషయం వెల్లడయ్యింది. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఆటగాడు తిప్రామోతా పార్టీ మొదటిసారి గోదాలోకి దిగినా తన ఉనికిని చాటుకోగలిగింది. వామపక్షాలు, కాంగ్రెస్ కలిసి రంగంలోకి దిగినా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి.
బీజేపీ కూటమి 33 సీట్లు (ఓట్ల శాతం 40.33) సాధించింది. (బీజేపీకి 32 సీట్లు. మెజార్టీ మార్కు కంటే ఒకటి అధికం). కాంగ్రెస్ నాయకుడు ప్రద్యోత్ విక్రమ్ మాణిక్య దేవ్ వర్మ బహదూర్ పెట్టిన కొత్త గిరిజన పార్టీ తిప్రా మోతా 13 సీట్లు దక్కించుకుంది.
ఓట్లశాతం విషయానికొస్తే.. వామపక్షాల కూటమి 10.13 శాతం ఓట్లు కోల్పోతే, తిప్రా మోతా మొదటిసారే 19.69శాతం ఓట్లను తెచ్చుకోగలిగింది.
నాగాలాండ్‌లో..
నాగాలాండ్‌లో నేషనల్ డెమోక్రటిక్ పొగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ•)తో సర్దుబాటు ఉండటం బీజేపీకి ఉపకరించింది. 60 అసెంబ్లీ స్థానాల్లో ముఖ్యమంత్రి నిఫూరియోకు చెందిన ఎన్డీపీపీ 25 స్థానాలు దక్కించుకుంటే, బీజేపికి12 స్థానాలు లభించాయి.
ఎన్డీపీపీ- బీజేపీ కూటమికి 51.03 శాతం ఓట్లు లభిస్తే, అందులో ఎన్డీపీపీ 32.22 శాతం దక్కించుకోగా, ఇక మిగిలిన 18.81శాతం బీజేపీ పరమైంది. రెండు పార్టీలు మొదటిసారి ఎన్నికల గోదాలోకి దిగాయి. అవి లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే). ఈ రెండు పార్టీలు రెండు సీట్లు దక్కించుకున్నాయి. చిరాన్ పాశ్వాన్ నాయకత్వంలోని ఎల్జీపీ (ఆర్వీ) 8.65 శాతం ఓటు శాతంతో నాగాలాండ్‌లో రాష్ట్ర పార్టీ ట్యాగ్ ను దక్కించుకుంది. మొట్టమొదటిసారిగా శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కానుంది. ఏడు సీట్లతో 9.56 శాతం ఓట్లు సాధించింది.
నాగాలాండ్ రాష్ట్రం ఏర్పాటయిన 60 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయిన మహిళగా హెకాని జఖాలు ఘనత దక్కించుకున్నారు. ఆమె న్యాయవాది, సామాజిక కార్యకర్త కూడా. నాగాలాండ్ అసెంబ్లీలో పోటీ పడిన 183 మంది అభ్యర్థులలో నలుగురు మహిళలు. అందులో హెకానీ, బీజేపీ కూటమి ఎన్డీపీపీ తరఫున పోటీచేసి విజయం సొంతం చేసుకున్నారు. మరో మహిళ సల్హౌట్ న్యుయోనో క్రూసె అతి తక్కువ ఓట్లతో విజయం సాధించారు.
ఒకప్పుడు నాగాలాండ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్, ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. కాకపోతే దాని ఓట్ల శాతం 1.45 నుంచి 3.55 శాతానికి పెరిగింది.
వంద ఓట్ల కంటే తక్కువ మెజార్టీతో గెలిచిన అభ్యర్థులు నలుగురు ఉన్నారు. రెండు సీట్లను ఎన్డీపీపీ గెలుచుకుంటే, ఎన్సీపీ ఒకటి, నాగా పీపుల్స్ ఫ్రంట్ చెరో స్థానంలో గెలుపొందాయి. అలాగే అత్యధిక మెజార్టీ సాధించినది బీజేపీకి చెందిన జాకబ్ ఝిమోమీ. ఆయన 20,096 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థిపైన విజయం సాధించారు. నిఫూరియో 15,824 ఓట్లతో అంగామీ-2 అసెంబ్లీ స్థానంలో గెలుపొంది, రికార్డు స్థాయిలో ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మేఘాలయాలో…
మేఘాలయలో ఓటర్లు ఏ పార్టీకి తగినంత మెజార్టీని ఇవ్వలేదు. ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు చెందిన నేషనల్ పీపుల్ పార్టీ, మెజార్టీ మార్కు కంటే నాలుగు తక్కువగా 26 సీట్లకు పరిమితమైంది. బీజేపీ రెండు సీట్లు దక్కాయి. ఎన్పీపీపీకి మద్దతు ఇవ్వటానికి అది అంగీకరించింది. సంగ్మా, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో మాట్లాడారు. సంగ్మాకు మరో రెండు సీట్లు అవసరమవుతాయి. 60 స్థానాలున్న అసెంబ్లీలో, ఒక అభ్యర్థి మరణంతో 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే భారీగా నష్టపోయింది. 60 సీట్లలో గతంలో 21 సీట్లు దక్కితే, ఈ సారి అది కేవలం ఐదు సీట్లకే పరిమితమైంది. అది తన అభ్యర్థి ముకుల్ సంగ్మాను కాపాడుకోవటంలో విఫలం కావటం అందుకు కారణమని చెప్పాలి. ముకుల్ 2021లో కాంగ్రెస్ పార్టీని వదిలి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.ఇది మమతాబెనర్జీ పార్టీకి ఎంతగానో లాభించింది. అది కాంగ్రెస్‌తో సమానంగా ఐదు సీట్లను దక్కించుకో గలిగింది. గత అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాన్రాడ్ సంగ్మా మరోసారి సీఎం అయ్యే అవకాశాలున్నాయి. సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ, బీజేపీ కూటమిగా ఉన్నా అవి ఎన్నికలలో విడివిడిగా పోటీకి దిగాయి.
సంగ్మా మొదటిసారిగా 2004లో ఎన్నికల గోదాలోకి దిగారుగానీ ఓటమిపాలయ్యారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) తరఫున మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. పవర్, టూరిజం మంత్రిగా 2009 వరకూ సేవలందిం చారు. తండ్రి పీఏ సంగ్మా మరణించిన తర్వాత 2016లో నేషనల్ పీపుల్స్ పార్టీ బాధ్యతలను చేపట్టారు. 2009 నుంచి 2013 వరకూ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముకుల్ సంగ్మా ముఖ్యమంత్రిగా వ్యవహ రించేవారు. 2016లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2018లో సౌత్ తురా అసెంబ్లీ ఉపఎన్నికలో గెలిచి లోక్‌సభకు రాజీనామా చేశారు. పీఏ సంగ్మా ఫౌండేషన్‌కు అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. అవి మేఘాలయలో నాలుగు కాలేజీలను నిర్వహిస్తున్నది.
ఎన్నికల గోదాలో అప్రతిహతంగా దూసుకు పోతున్న బీజేపీ, దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈశాన్య భారతంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అభివృద్ధికి రిజర్వాయర్‌గా మారింది. ఈ అభివృద్ధి ఫలాలను దేశవ్యాప్తం చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతోంది.
– డాక్టర్ పార్థసారథి చిరువోలు సీనియర్ జర్నలిస్ట్