సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌  ‌ఫాల్గుణ బహుళ షష్టి – 13 మార్చి 2023, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


భారత్‌ ‌జోడో యాత్ర చేయడం వెనుక ఎంతటి మహత్తర ఉద్దేశం, సందేశం దాగి ఉన్నవో కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ విశ్వ మానవాళి ఎదుట పెట్టారు. భారతదేశంలో చచ్చిపోతున్న ప్రజాస్వామ్యానికి మళ్లీ ఊపిరి పోయడానికే యాత్ర చేశారట. నిర్వీర్యమైపోతున్న వ్యవస్థలను చేతులడ్డి కాపాడడానికి, భారత్‌ ‌సామాజిక వ్యవస్థకు మరమ్మతు చేయడానికి గెడ్డం చేసుకోకుండా యాత్ర చేశారట. ఇవన్నీ వెల్లడించడానికి ఆయన ఎంచుకున్న వేదిక-కేంబ్రిడ్జ్ ‌విశ్వవిద్యాలయం. అక్కడే ఎందుకు? భారతదేశంలో చెబితే ఎవరూ నమ్మరని ఆయన గట్టి విశ్వాసం కాబోలు. రాహుల్‌కి భవిష్యత్తును ముందే చూసే దివ్యశక్తులు ఉన్నాయనే అనుకోవాలి. మూడు రాష్ట్రాల శాసనసభల కోసం 179 స్థానాలకు ఎన్నికలు జరిగితే ఈశాన్య భారతవాసులు అందులో 8 మాత్రమే కాంగ్రెస్‌కు ముష్టి వేస్తారని ఆయనకి భవిష్యద్దర్శనం అయిపోయి ఉండాలి. అది చూడలేకే కాబోలు సాంత్వన కోసం కేంబ్రిడ్జ్ ‌పారిపోయారు.

సందు దొరికితే చాలు, భారతీయ జనతా పార్టీని అడ్డం పెట్టుకుని అంతర్జాతీయ వేదికల మీద భారత్‌ని ఆడిపోసుకోవడం రాహుల్‌కి ఒక రోగంలా పరిణమించింది. పొరుగున ఉన్న చైనాను స్తుతించడం కూడా ఆ రుగ్మత లక్షణమే. తన జోడో యాత్ర కశ్మీర్‌ ‌చేరినప్పుడు అక్కడన్నీ భారత జాతీయ పతాకాలు కనిపించడంతో రాహుల్‌కు పైత్యం ప్రకోపించి పాత రుగ్మత ఇంకాస్త ముదిరినట్టే ఉంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నదని ఆయన పదేపదే తీర్పు ఇస్తున్నారు. అందుకే కాబోలు, కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ ‌వరకు 4000 కిలోమీటర్ల భారత్‌ ‌జోడో యాత్ర జరిగితే ఒక్క ప్రతిఘటన కూడా ఎదురుకాలేదు. బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాలలో కూడా సహాయ నిరాకరణ జరగలేదు. రాహుల్‌ అబద్ధాలు, కువ్యాఖ్యలు భారతీయులలో బీజేపీ పట్ల వ్యతిరేకతను కాదు, సొంత పార్టీ ఎడల జుగుప్స రేపుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీని ఇరుకున పెట్టడానికి పుల్వామా దాడి అంశం పాకిస్తాన్‌కు అనుకూలించే విధంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది భారత సేనలను కించపరచడమని ఆయనకి ఎప్పటికి అర్ధమవుతుందో తెలియదు. పెగసస్‌ ‌సాఫ్ట్‌వేర్‌తో బీజేపీ ప్రభుత్వం తన ఫోన్‌ ‌సంభాషణలు వింటోందని రాహుల్‌ ‌గట్టి నమ్మకం. తనను విచారించిన అధికారులే ఆయనకు అలా ఉప్పందించారట కూడా. అందుకే పెగసస్‌ ‌ప్రహసనం గురించి బీజేపీ ఒక ప్రశ్న అడిగింది. ఈ వ్యవహారం మీద సుప్రీం కోర్టు ఒక కమిటీని నియమించి, మీ మీ మొబైల్‌ ‌ఫోన్లన్నీ అప్పగించవలసిందని ఆదేశించి నప్పుడు రాహుల్‌ ‌గాంధీ, ఇతర బాకారాయుళ్లు ఎందుకు ఉడాయించారు? యథాప్రకారం సమాధానం లేదు. చైనా ఒక ప్రత్యేక దేశం, పైగా అది సామరస్య స్థాపన కోసం పడి చచ్చిపోయే దేశం, ఎల్లో రివర్‌ ‌చైనాను ఒక జాతిగా నిలబెట్టింది, అసలు భారత విదేశాంగ మంత్రికి చైనా అర్ధం కాలేదని కూడా కాంగ్రెస్‌ ‌యువరాజు పనిలో పనిగా తేల్చి పారేశారు. దీనికి సంబిత్‌ ‌పాత్ర ఇచ్చిన సమాధానం గురించి మనం మాత్రమే ఆలోచించగలం. ఎందుకంటే రాహుల్‌, ఆయన రాజకీయ గురువు దిగ్విజయ్‌ ‌సింగ్‌, అనుయాయులు మణిశంకర్‌, ‌జైరాం రమేశ్‌ ‌వీళ్లంతా విమర్శలు గుప్పిస్తారే తప్ప, వాటిలో నిజమెంతో తేల్చమంటే నాలుక మడతేస్తారు. వారంతా బాధ్యతారాహిత్యానికి బ్రాండ్‌ అం‌బాసిడర్లే. రాహుల్‌ ఎల్లో రివర్‌ను చూశారు గానీ, గంగానదిని చూడలేదు కదా అంటూ సంబిత్‌ ‌పెద్ద చురకే వేశారు. నోరు విప్పితే చాలు రాహుల్‌, ఆయన పార్టీ సభ్యులు దేశంలో మైనారిటీల మీద దాడులు జరిగిపోతున్నాయంటూ శోకాలు పెడతారు. క్రమం తప్పకుండా ఇప్పుడు కూడా రాహుల్‌ ‌కేంబ్రిడ్జ్‌లో మైనారిటీల తరఫున వకాల్తా తీసుకోవడం మరచిపోలేదు. కానీ సర్‌ ‌తన్‌సే జుదా అంటూ దేశంలో వీరంగం వేసిన మతోన్మాదుల గురించి ఆయన ఒక్కమాట కూడా ఎందుకు చెప్పరు? కొన్ని ముస్లిం దేశాలు కూడా విద్యాసంస్థలలో హిజాబ్‌ ‌ధారణను నిషేధిస్తే భారత్‌లో దానిని పట్టుకు వేలాడుతూ, బాలికల విద్య మీద ముసుగులు వేస్తున్న వాస్తవాన్ని ఎందుకు పట్టించుకోరు? మోదీ వచ్చిన తరువాత మత ఘర్షణలు తగ్గిన మాట వాస్తవమా, కాదా? 1984 నాటి సిక్కుల హత్యాకాండ, ముంబై దాడులు, భాగల్పూర్‌ ‌దాడులు, ఇంకా ఎన్నో ఆ పార్టీ అధికారంలో ఉండగానే జరిగాయి. వాటి గాయాలు ఇప్పటికైనా మానాయా?

ప్రత్యర్థి పార్టీని విమర్శించడం వేరు. స్వదేశాన్ని విదేశీ గడ్డ మీద దూషించడం వేరు. ఏడు దశాబ్దాలలో కాంగ్రెస్‌ ‌చేసింది సున్న అంటూ మోదీ విమర్శించలేదా అంటారు రాహుల్‌. ‌కానీ మోదీ విమర్శలలో దేశ ప్రతిష్టను కించపరిచే మాటలు చూపగలరా? సైన్యాన్ని నిందించే నీచత్వం ఉందనగలరా? రాహుల్‌ ‌కోసమే అన్నట్టు, మోదీని తూర్పార పట్టడానికే అన్నట్టు ఉండే ఆ ప్రశ్నలలో పస ఎంతో ఇంగ్లండ్‌లోని భారతీయ జర్నలిస్టుల సంఘానికి తెలియదా? అంతర్జాతీయ వేదికలు ఎక్కి భారత్‌ ‌మీద అభాండాలు కురిపించే పని పాకిస్తాన్‌ ‌చేస్తుంది. తుర్కియే, ఇరాన్‌ ‌వంత పాడుతూ ఉంటాయి. వీలు కుదిరినప్పుడల్లా చైనా తన ద్వేషాన్నీ, పాకిస్తాన్‌ ‌విషాన్నీ కలిపి జమిలిగా ఆ వేదికల మీదే కక్కుతూ ఉంటుంది. ఈ శత్రురాజ్యాలతో సమంగా రాహుల్‌ ‌కూడా అంతర్జాతీయ వేదికలను ఎంచుకుని భారత్‌ ‌మీద విమర్శలు కురిపిస్తున్నారు. ఒకప్పుడు చైనా మీద వామపక్ష తీవ్రవాదులు, సీపీఎం ఒలకబోసిన ప్రేమానురాగాలనే రాహుల్‌ ‌నిస్సిగ్గుగా ప్రదర్శిస్తున్నారు. కేంబ్రిడ్జ్‌లో ఉపన్యాసం దంచడానికి వెళుతున్నప్పుడు రాహుల్‌ ‌గెడ్డం ట్రిమ్‌ ‌చేయించుకున్నందుకు ఆంగ్లేయులు సంతోషపడి ఉంటారు. అలాగే మెదడును కూడా కాస్త ట్రిమ్‌ ‌చేయించుకుంటే భారతీయులూ సంతోషిస్తారు.

About Author

By editor

Twitter
YOUTUBE