– ‌రాజేంద్ర

అవినీతికి వ్యతిరేకంగా మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆధ్వర్యంలో 2011లో ప్రారంభమైన ఉద్యమం అప్పట్లో దేశ ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. మన్మోహన్‌ ‌సింగ్‌ ‌నాయకత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వం కొంత వరకు దిగివచ్చింది. కొన్ని డిమాండ్లను అంగీకరించేందుకు తలూపక తప్పలేదు. దీంతో అప్పట్లో అన్నా హజారే ఒక్కసారిగా దేశ ప్రజల దృష్టిలో పడ్డారు. ఆయనను మరో గాంధీ అంటూ కొంత మంది పొగడ్తలతో ముంచెత్తారు. అప్పట్లో ఆయన వెంట అనేకమంది అభ్యుదయవాదులు నడిచారు. వారు కూడా హీరోలుగా గుర్తింపు పొందారు. అటువంటి వారిలో అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ఒకరు. ప్రజాజీవితంలో ఊడలు దిగిన అవినీతి కల్మషాన్ని సమూలంగా తొలగించాల్సిన ఆవశ్యకతను ఆయన గుర్తించారు. ఇందుకోసం ఆయన ఐఆర్‌ఎస్‌ (ఇం‌డియన్‌ ‌రెవెన్యూ సర్వీసెస్‌) ఉద్యోగాన్ని వదులుకున్నారు. ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. కాలక్రమంలో కేజ్రీవాల్‌ ‌క్రియాశీలకంగా వ్యవహ రించారు. సొంతంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఏఏపీ)ని ప్రారం భించారు. ఆయన జాతీయ కన్వీనర్‌గా ప్రారంభమైన పార్టీలో అప్పట్లో అనేకమంది సామాజిక కార్యకర్తలు, మేధావులు, న్యాయవాదులు చేరారు. అవినీతి రహిత సమాజ స్థాపనే అంతిమ లక్ష్యమని ఘనంగా ప్రకటిం చారు. అవినీతిని తొలగించాలన్న ఉద్దేశంతో పార్టీ గుర్తుగా ‘చీపురు’ను ప్రకటించారు. దీంతో అప్పట్లో అందరూ కేజ్రీవాల్‌లో కొత్త నాయకుడిని చూశారు. ఆశావాద నాయ కుడిగా రాజకీయాల్లో పేరొందారు. అందరూ అనుకున్నట్లు గానే అనంతరం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అప్పటివరకు వరుసగా మూడు దఫాలుగా (పదిహేనేళ్ల నుంచి) అధికారంలో కొనసాగుతున్న హస్తం పార్టీ అడ్రసే గల్లంతైంది. నాటి ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన కేజ్రీవాల్‌ ‌ఘన విజయం సాధించారు. మొత్తం 70 సీట్లకు గాను ఆప్‌ ‌ఖాతాలో ఏకంగా 67 సీట్లు జమ కాగా కేంద్రంలో చక్రం తిప్పుతున్న భారతీయ జనతా పార్టీ కేవలం 3 సీట్లతో సరిపెట్టుకుంది. అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌ప్రజాజీవితంలో కొత్త శకాన్ని ప్రారంభిస్తారని, ప్రజల జీవన ప్రమాణాల్లో గణ నీయ మార్పులు వస్తాయని అందరూ ఆశించారు. తొలి రోజుల్లో కేజ్రీవాల్‌ ‌పాలన కూడా ఆ దిశ గానే సాగింది. రెండోదఫా, మూడో దఫా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేజ్రీవాల్‌ ‌పార్టీ ప్రజల మన్ననలు అందుకుంది.

ఇప్పుడదంతా చరిత్ర. గతానికీ, వర్తమానానికీ పోలికే లేదు. నాటి కేజ్రీవాల్‌కు, ఇప్పటి కేజ్రీవాల్‌కు హస్తిమశకాంతరం అంత తేడా ఉంది. అప్పట్లో ఆయనలో ఉద్యమకారుడు ఉన్నారు. ఇప్పుడు ఆయన ఫక్తు రాజకీయ నాయకుడిగా మారిపోయారు. వర్తమాన రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం గల నాయకులకే పాఠాలు చెప్పగల స్థాయికి కేజ్రీవాల్‌ ‌చేరుకున్నారు. ఫలితంగా అప్పట్లో ఆయనతో కలిసి నడిచిన నాయకులంతా ఒక్కరొక్కరు దూరమయ్యారు. క్రియాశీల రాజకీయ నాయకుడిగా మారిన కేజ్రీవాల్‌తో కలసి ప్రయాణించడం కష్టమైన పని అని అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నారు. ఫలితంగా ఆయన ఇప్పుడు ఒంటరయ్యారు. ఆయన పక్కన అభ్యుదయవాదులు ఇప్పుడు మచ్చుకైనా లేరు. ఉన్నదంతా ఫక్తు అవకాశాద రాజకీయ నాయకులే. ఫలితంగానే ఆయన మంత్రివర్గ సహచరులు జైలుపాలయ్యారు. అవినీతి కేసుల్లో పీకల్లోతుల్లో కూరుకుపోయి ఇప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్కిస్తున్నారు. కేజ్రీవాల్‌ ‌కుడిభుజాలుగా పేరుగాంచిన ఇద్దరు మంత్రివర్గ సహచరులు జైలుపాలయ్యారు. వారిలో అనేక శాఖలు నిర్వహించిన సత్యేంద్ర జైన్‌ ‌గత ఏడాది మే నెలలో అరెస్టయ్యారు. ఇప్పటికీ ఆయన జైల్లోనే ఉన్నారు. తాజాగా మరో మంత్రివర్గ సహచరుడు, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ ‌సిసోదియాను పోలీసులు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌ ‌కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తొలుత ఆయన బెయిల్‌ ‌కోసం సుప్రీంకోర్టు తలుపుతట్టగా సర్వోన్నత న్యాయస్థానం నిర్మొహమాటంగా తిరస్కరించింది. బెయిల్‌ ‌కోసం ట్రయల్‌ ‌కోర్టును లేదా ఢిల్లీ హైకోర్టును సంప్రదించకుండా నేరుగా తమ వద్దకు రావడంలో అర్థం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌, ‌జస్టిస్‌ ‌పి.ఎస్‌. ‌నరసింహలతో కూడిన ధర్మాసనం తలంటింది. ఇప్పుడు తాము పిటిషన్‌ ‌విచారణకు స్వీకరిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని ధర్మాసనం పేర్కొంది.

అరెస్టయిన సిసోదియా దర్యాప్తులో పోలీసులకు సహకరించకుండా అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారు. కీలక సమాచారం చెప్పకుండా పోలీసుల ప్రశ్నలను దాటవేస్తున్నారు. అడిగిన ప్రశ్నలే అడుగుతున్నా రంటూ పోలీసులపై సిసోదియా ఎదురుదాడి చేశారు. దీంతో ఆయన్నుంచి సమాధానాలు రాబట్టేందుకు పోలీసులు కొత్త వ్యూహంతో ముందుకెళ్లారు. ఆయన సమాధానాల్లోని నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ఆయన వద్ద పనిచేసిన మాజీ అధికారులను కూడా ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించారు. సిసోదియా మాజీ కార్యదర్శి పి.అరవింద్‌, అప్పటి ఎక్సైజ్‌ ‌కమిషనర్‌ ‌గోపీ కృష్ణలను అదే గదిలో ఉంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సిసోదియా వైఖరిని, ఆయన ప్రవర్తన, హావభావాలను పోలీసులు నిశితంగా గమనించారు. అరెస్టు సమయంలో, విచారణ సమయంలో సిసోదియా వైఖరి బాధ్యతా యుతంగా లేదు. అసలు తన అరెస్టే అక్రమమని, మద్యం విధాన రూపకల్పన అన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని, ఇందులో ఆర్థికమంత్రిగా తన పాత్ర ఏమీ లేదని ఆయన వాదించారు. మద్యం విధాన సవరణకు ఆమోద ముద్ర వేసింది లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ అని, కానీ దర్యాప్తు సంస్థ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వేధిస్తుందని సిసోదియా తరఫు లాయర్‌ ‌కోర్టుకు తెలిపారు. అనేక సంప్రదింపుల అనంతరం మద్యం విధాన రూప కల్పన జరిగిందదని, ఇందులో లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌నుంచి సలహాలు కూడా తీసుకు న్నట్లు సిసోదియా తరఫు లాయర్‌ ‌వివరించారు. సీబీఐ ఆరోపిస్తున్నట్లు తాను ఫోన్లు మార్చిన మాట వాస్తవమే అయినప్పటికీ అది తప్పేమీ కాదన్నారు సిసోదియా. అయితే మద్యం విధాన రూపకల్పనకు సంబంధించి ముసాయిదాలో న్యాయనిపుణుల అభిప్రాయాలను సిసోదియా తొలగించారని సీబీఐ పేర్కొంది. ముసాయిదాలో మార్పులపై తమకు వాట్సప్‌ ‌సందేశాలు ఒక ఫోన్‌ ‌నుంచి వచ్చాయని ఎక్సైజ్‌ ‌మాజీ అధికారి ఒకరు విచారణలో పేర్కొ న్నారు. ఆ ఫోన్‌ ‌నెంబరు సిసోదియాదేనని అధికారులు చెబుతున్నారు. 2022 ఆగస్టు, సెప్టెంబరు మధ్య సిసోదియా 18 ఫోన్లు, 4 సిమ్‌ ‌కార్డులు, ఉపయోగించినట్లు వెల్లడైంది. ఆగస్టు 19న కేసు నమోదైతే మర్నాడే ఒకే నంబరుపై 3 ఫోన్లు మార్చడం పైనా సరైన సమాధానాలు ఇవ్వలేదని అధికారులు పేర్కొన్నారు. ఒక సిమ్‌ను ఒకే రోజు రెండు వేర్వేరు ఫోన్లలో వాడినట్లు బయట పడిందన్నారు.

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోదియా అరెస్టును తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఖండించడం గమనార్హం. ఆయన అరెస్టుకు, కేసీఆర్‌ ‌ఖండనకు సంబంధం ఏమిటో!? ప్రధాని, అదానీల అనుబంధంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికే సిసోదియా అరెస్టును తెరపైకి తీసుకువచ్చారని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి మద్యం కుంభకోణానికి సంబంధించి కేసీఆర్‌ ‌కూతురు కవిత పాత్రపై అనేక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమెను దర్యాప్తు సంస్థ విచారించిన సంగతి కూడా తెలిసిందే. ఆమె వ్యక్తిగత ఆడిటర్‌ను ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పటికీ కస్టడీలోనే ఉన్నారు. రేపో మాపో కవితను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి.

సీబీఐ రిమాండు నివేదికను గమనిస్తే నిందితుల పాత్ర గురించి స్పష్టంగా అర్థమవుతుంది. సిసోదియా దక్షిణ భారత వ్యాపారులతో కుమ్మక్కై ఢిల్లీ ఎక్సైజ్‌ ‌విధానాన్ని రూపొందించినట్లు సీబీఐ తన రిమాండు రిపోర్టులో పేర్కొంది. ఈ విధాన రూపకల్పన సమయంలో ఆయన నాలుగు ఫోన్లు మార్చారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించకుండా వాటిల్లో మూడింటిని ధ్వంసం చేశారు. ఈ పాలసీ కోసం రూపొందించిన ముసాయి దాలో తొలుత అయిదు హోల్‌ ‌సేలర్స్ ‌లాభం మార్జిన్‌ 5 ‌శాతం, రూ.100 కోట్ల టర్నోవర్‌ ఉం‌డాలని ప్రతిపాదించారు. అయితే తరవాత మూడు రోజుల్లోనే హోల్‌ ‌సేలర్స్ ‌ప్రాఫిట్‌ ‌మార్జిన్‌ను 5 నుంచి 12 శాతానికి, టర్నోవర్‌ ‌పరిమితిని వంద కోట్ల నుంచి 5 వందల కోట్లకు పెంచుతూ మార్పులు చేశారు. ఇందుకు గల కారణాలను సిసోదియా వివరించలేకపోయారని సీబీఐ పేర్కొంది. ఈ కేసును సీబీఐకి ప్రతిపాదించిన 2022 జులై 22నే సిసోదియా తన ఫోన్‌ ‌మార్చారు. దానిని దర్యాప్తు సమయంలో సీబీఐకి ఇవ్వలేదు. 2021 జనవరి 1 నుంచి ఆగస్టు 19 మధ్యకాలంలో నాలుగు ఫోన్లు మార్చారు. వాటిల్లో మూడింటిని ధ్వంసం చేశారు. సీఆర్పీసీ 41ఏ కింద మూడుసార్లు నోటీసులు ఇవ్వగా సిసోదియా గత ఏడాది అక్టోబరు 17న, తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో హాజరయ్యారు. తగినంత సమయం ఇచ్చినా విచారణలో సిసోదియా వాస్తవాలను దాచిపెట్టారు. మద్యం విధానానికి సంబంధించి కొన్ని దస్త్రాలు కనపడకపోవడం, మాజీ కార్యదర్శి ఇచ్చిన వాంగ్మూలాలు సిసోదియా అరెస్టుకు దారితీశాయి. కీలక ఫైళ్లలో ఏముంది, అన్నిసార్లు ఫోన్లు ఎందుకు ఉపయోగించారు తదితర వివరాలు తెలుసు కునేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్ని స్తున్నారు. గత ఏడాది ఆగస్టులో ఢిల్లీ ఎక్సైజ్‌ ‌కార్యాల యంలో స్వాధీనం చేసుకున్న డిజిటల్‌ ‌సాధనంతో ఈ వ్యవహారంలో సిసోదియా పాత్ర వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్‌ ‌శాఖకు సంబంధం లేని మద్యం విధానం ముసాయిదా పత్రం ఉన్నట్లు తేలిందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి.

 కేజ్రీవాల్‌ ‌మంత్రివర్గంలో సిసోదియా అనేక కీలక శాఖలను నిర్వహించారు. పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌కు మనీశ్‌ ‌సిసోదియా కుడిభుజం వంటివాడు. సిసోదియా సలహా లేకుండా కేజ్రీవాల్‌ అడుగు కూడా ముందుకు వేయరు. కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖ, ఆర్థిక, రిజిస్ట్రేషన్లు, స్థానిక సంస్థలు, భవనాలు, ఉన్నత విద్య, విజిలెన్స్, ‌సహకారం, ఐటీ, ఎక్సైజ్‌ ‌వంటి కీలక శాఖలకు సిసోదియా సారథిగా వ్యవహరిస్తున్నారు. సిసోదియా పూర్వాశ్రమంలో పాత్రికేయుడు. జన లోక్‌పాల్‌ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఢిల్లీలోని పట్వర్‌ ‌గంజ్‌ ‌నియోజకవర్గం నుంచి వరుసగా (మూడుసార్లు) అసెంబ్లీకి ఎన్నికవుతున్నారు. గత ఏడాది అరెస్టయిన జత్యేంద్ర జైన్‌ ‌కూడా కేజ్రీవాల్‌కు కీలక సహచరుడే. జైన్‌ ‌కూడా సిసోదియా మాదిరిగానే పలు ముఖ్య శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఆరోగ్యం, పరిశ్రమలు, విద్యుత్‌, ‌గృహ నిర్మాణం, పర్యాటకం, నీటి పారుదల, వరదల నియంత్రణ, ప్రజా పన్నులు, శ్రమ, ఉపాధి వంటి ప్రధాన శాఖలకు సచివుడుగా పనిచేశారు. యూపీలోని బాగ్‌ ‌పత్‌కు చెందిన జైన్‌ ‌తరవాత రోజుల్లో ఢిల్లీలో స్థిరపడ్డారు. ఢిల్లీలోని షుకుర్‌ ‌బస్తీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్ల నుంచి అసెంబ్లీకి ఎన్నికవుతున్నారు. గత ఏడాది మే నెలలో అరెస్టయిన జైన్‌కు ఇప్పటివరకు బెయిల్‌ ‌రాలేదంటే ఆయనపై గల అభియోగాల తీవ్రత ఏమిటో అర్థమవుతుంది. జైన్‌, ‌సిసోదియా రాజీనామాలను కేజ్రీవాల్‌ ఇప్పుడు ఆమోదించడం విశేషం. ఎప్పుడో అరెస్టయిన జైన్‌ ‌రాజీనామాను ఇప్పటిదాకా పెండింగులో పెట్టడం అర్థరహితం. తీవ్రమైన అభియోగాలపై జైల్లో ఉన్న వ్యక్తులు ఇన్ని శాఖలకు ఎలా సారథ్యం వహించారన్న ప్రశ్నకు ఇక్కడ సమాధానం లభించదు. రాజీనామాల ఆమోదం అనంతరం వారి శాఖలను తాత్కాలికంగా రాజకుమార్‌ ఆనంద్‌కు, కైలాశ్‌ ‌గెహ్లత్‌లకు ప్రభుత్వం కేటాయించింది. మొత్తానికి అవినీతిని అంతమొంది స్తానంటూ ఆర్భాటంగా రాజకీయ అరంగ్రేటం చేసిన అరవింద్‌ ‌కేజ్రీవాల్‌ ఇప్పుడు అదే ఊబిలో పీకల్లోతుల్లో కూరుకుపోవడం కాల వైచిత్రి.

– రాజేంద్ర, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE