– కోటమర్తి రాధా హిమబిందు

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

భావన అత్తవారింటికి వచ్చి రెండునెలలు అవుతోంది. మొదటిసారిగా ఇంట్లోకి అడుగుపెట్టిన కోడల్ని అక్కున చేర్చుకొని ఆదరించింది ప్రేమలత. కరోనా కారణంగా కొడుకు రాఘవేంద్రకు వర్క్ ‌ఫ్రం హోం జాబ్‌ ‌కావటంతో సొంత ఊరు వచ్చాడు. అదే సమయంలో పెళ్లిచూపులు, సంబంధం కుదరటం, పెళ్లి కావటం వెంట వెంట జరిగాయి. తల్లి చెప్పిన భయాలు ఏమీ అత్తవారింట్లో కనిపించలేదు భావనకు. మామగారు బ్యాంక్‌ ‌మేనేజర్‌గా, అత్తగారు టీచర్‌గా రిటైరై వున్నారు.

‘‘మీ మామగారు ఫర్వాలేదు గానీ.. మీ అత్తగారు గట్టి మనిషే.. అయినా ఇక్కడ హైదరాబాదులో ఇల్లు ఉంచుకొని అక్కడికి వెళ్లటం ఎందుకు? మీవారితో చెప్పి హాయిగా హైదరాబాదులో ఉండేట్లుగా ప్లాన్‌ ‌చేసుకో.. ఎన్నిసార్లుచెప్పినా నీకు అర్థం కాదు’’ అంటూ ప్రమీలమ్మ భావనతో చెబుతూనే ఉంది. ఆమె భర్త చనిపోయి ఆరు సంవత్సరాలు అయింది. రెండు సంవత్సరాల క్రితం బాగా వున్న ఇంటి అమ్మాయితో కొడుకు పెళ్లి చేయాలనుకుంటే ప్రేమించానంటూ పేద ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయాడు కొడుకు భాస్కర్‌. ‌కూతురు అందగత్తె తెలివైనది కావటంతో సంబంధం ఇంటికే వస్తుంది అనుకున్న ప్రమీలమ్మ ఆశ, కోరిక నెరవేరింది. అలాగే వచ్చింది. భావన పెళ్లయి పోయింది.

‘‘గుడ్‌ ‌మార్నింగ్‌ ‌భావనా.. లేచావా తల్లీ..! మీ అమ్మగారు రెండుసార్లు ఫోన్‌ ‌చేశారు.. రాత్రి నీ మొబైల్‌ ‌హాల్లో పెట్టావు. నీ మొబైల్‌ ‌మ్రోగుతుంటే మార్నింగ్‌ ‌చూశాను. మాట్లాడు నాన్నా పాపం..ఒక్కతే వుంటారు కదా..బెంగగా వుందేమో?’’

‘‘అలాగే అత్తయ్యగారూ’’ అంటూతర్వాత కాల్‌ ‌చేస్తానని తల్లికి మెసేజ్‌ ‌పెట్టి బ్రెష్‌ ‌చేసుకోవటానికి బాల్కనీలోకి వెళ్ళింది.

* * * * * * *

భావన వచ్చిన మూడోరోజే ఆమెను దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడింది ప్రేమలత.

‘‘అమ్మా..భావనా! ఇలా కూర్చో..నువ్వు ఇక్కడ కొత్తగా ఫీలవకు. ఇది నీ ఇల్లు.. ఇక్కడ నేనెంతో నువ్వూ అంతే. నేను ఈ ఇంటి కోడలిగా వచ్చాను. నువ్వు కూడా అలాగే వచ్చావు. మన ఇంట్లో అత్తగారు ఉండరు. ఓన్లీ కోడళ్లు మాత్రమే ఉంటారు. అమ్మాయి, అల్లుడు, బుల్లి మనవడు, అమెరికాలో ఉన్నారు. మాకళ్లెదురుగా కనిపించేది రాఘవేంద్ర, నువ్వే. మీరిద్దరు ఎంతో ప్రేమగా అన్యోన్యంగా వుండాలి. మనం ఒకరికి మంచి ఉదాహరణగా కనిపించాలి. నువ్వూ ఉద్యోగం చేస్తున్నావు. నీ పని నువ్వు చూసుకో. పనమ్మాయి ఉంది. అన్ని పనులు చేస్తుంది. వంటనేను చేస్తాను’’

‘‘అయ్యో.. వద్దు అత్తయ్య గారూ.. వంట చేయడం నాకు వచ్చు. నా వంట కూడా మీరు రుచి చూడండి’’ చనువుగా అంది భావన.

‘‘శని,ఆదివారాల్లో నీ వంట మేం రుచి చూస్తాం..అదీ మేం నీకు హెల్ప్ ‌చేయటానికి నువ్వు ఒప్పుకుంటే. మామయ్య గారు కూడా చాలా రుచిగా కూరలు చేస్తారు. రాఘవేంద్రకే వంట సరిగా రాదు. అప్పట్లో చాలామంది ఉద్యోగస్తుల్లా మేం ఇద్దరం కూడా కలిసిమెలిసి పనులు చేసుకునే వాళ్లం. ఇప్పటికి మాకు విశ్రాంతి దొరికింది.’’ అలాఅలా అత్తగారు మనసుకు దగ్గరగా మాట్లాడటంతో కొత్త పూర్తిగా పోయి అత్తగారితో చనువు ఏర్పడింది. అమెరికా నుండి మాట్లాడే వదిన గారితో అన్నయ్య గారితో కూడా చాలా త్వరగానే ఎంతో చనువు పెరిగింది.

‘‘మా అమ్మా నాన్నలాగా ఎంతో తక్కువ మంది ఉంటారు భావనా! ఏ విషయంలో అయినా పాజిటివ్‌ ‌థింకింగ్‌ ఉం‌టుంది. మా చిన్నతనం నుండి చూస్తున్నాం కదా.. మా ఇంట్లో ఆనందంగా ఉండటం తప్ప మరొకటి తెలియదు. ‘మేం చెప్పినట్లు మీరు నడుచుకోండి.. మీ భవిష్యత్‌ ‌బాగుంటుంది’ అంటూ అమ్మానాన్న ఎన్నెన్నో మాటలు చెప్పేవారు. వాళ్లు ఏది చెప్తే అది విన్నాం..పాటించాం. ఇప్పుడు నేను గాని తమ్ముడు గానీ ఇలా ఉన్నామంటే అదంతా వాళ్లిద్దరి చలువే. ఇప్పటికే అమ్మానాన్న నీకు బాగా అర్థమైవుంటారు. బావగారికి నువ్వంటే ఎంత ఇష్టమో తనకు తమ్ముడు తప్ప చెల్లెలు లేదుకదా.. నిన్ను తన సొంత చెల్లెలుగానే భావిస్తారు’’ ఇలా ఎవరు ఏది మాట్లాడినా ఆశ్చర్యం గానే ఉంటుంది భావనకు.. అంతా మంచివాళ్లే.. ఎవరో ఒకరన్నా మరోలా వుండరు. ఓకే కుటుంబంలో అంతా ఇలా ఉండటం చాలా అరుదేమో ? అన్పించేది భావనకు.

* * * * * * *

‘‘ఇప్పుడు తీరిందా దొరసానిగారికి?’’

‘‘వీలవలేదు..చెప్పు’’

‘‘చెప్పేది ఏముంది? ఏదో ఉపాయం చేసి హైదరాబాదు వచ్చే ప్రయత్నం చేయి.. మొద్దు రాచిప్ప.. తెలివే లేదు.. ఇలా పెళ్లిళ్లు అవుతున్నాయి.. అలా వేరు కాపురాలు పెడుతున్నారు. ఎందుకే నీకు ఇంత మంచితనం?’’

‘‘అమ్మా.. ప్లీజ్‌.. ఆ ‌విషయం వదిలేయ్‌.. ఇం‌కా ఏమన్నా మాట్లాడు.. నువ్వు బాగున్నావా? ఒకసారి రారాదూ.. అత్తయ్యగారు నిన్ను బాగా అనుకుంటున్నారు’’

‘‘నన్ను రమ్మనకు.. ఇక్కడ నాకు బాగానే ఉంది..నాకు ఫ్రెండ్స్ ఉన్నారు చుట్టుపక్కల వాళ్లు ఉన్నారు.. కిట్టి పార్టీ సరదా ఉండనే ఉంది’’

‘‘అమ్మా..నువ్వు కాస్తా మారమ్మా.. అన్నయ్యకు వదినకు ఫోన్‌ ‌చేస్తున్నావా?’’

‘‘లేదు.. చెయ్యను.. నీకు తెలవనట్లు కొత్తగా అడుగుతావేం?’’

‘‘అమ్మా..వాళ్లతో మంచిగా ఉండమ్మా. అన్నయ్య ప్రతి నెల నీకు ఇరవై వేలు పంపిస్తున్నాడు. డబ్బు కావాలి కానీ వాళ్లు వద్దు.. కదా!’’

‘‘డబ్బుపంపొద్దని చెప్పు..మీ నాన్న పెన్షన్‌ ‌పదివేలు వస్తుంది. అది చాలు నాకు. సొంత ఇల్లు వుంది. నేను నెలకింత పంపమని బిచ్చం కోరలేదే? వాడే పంపిస్తున్నాడు’’

‘‘అబ్బబ్బ.. ఎందుకమ్మా.. ఎప్పుడూ ఇలా ఆలోచిస్తూ ఏదేదో మాట్లాడతావు? అన్నయ్య వాళ్లను ఇండియా రమ్మని పిలువమ్మా.. ఎన్నాళ్లు వాళ్లపై నీకు కోపం?’’

‘‘వాడు ఎంత గొప్ప సంబంధం వదులు కున్నాడు? ప్రేమప్రేమ అంటూ అది వాడిని బుట్టలో వేసింది. వాళ్ల గురించి నాకు చెప్పకు.. నీకు వాళ్ళతో కనెక్షన్‌ ‌వుందిగా.. నాకు డబ్బు పంపవద్దని చెప్పు’’

‘‘అమ్మా.. ఇలా ఏవో లింకులు పెట్టి మాట్లాడకు. నువ్వు వాళ్లని వదులుకున్నావు. నేను నీలా వదులుకోలేను’’

‘‘మీ అత్తగారు మొన్న నాకు ఫోన్‌ ‌చేసింది. మీ అన్నయ్య, వదినతో వాళ్లు మాట్లాడుతున్నారట కదా. వాళ్లను ఒకటే పొగిడింది. చాలా చిరాకు అన్పించింది. మన ఇంటి భాగోతం వాళ్లకు చెప్పు.. ఇందులో దాచేది ఏముంది?’’

‘‘అమ్మా.. నేను మళ్లీ మాట్లాడుతాను’’

‘‘సర్లే.. మీ నాన్నగారిలా అతి మంచితనానికి పోకు’’ అంటూ కాల్‌ ‌కట్‌ ‌చేసిన తల్లి గురించి ఎలా ఆలోచించాలో అర్థం కాకుండా అయింది భావనకు.

* * * * * * *

‘‘రేపు మనం మీ ఇంటికి వెళ్తున్నాం’’ శనివారం సాయంత్రం వంటలో సహాయపడుతూ అత్తగారు అనేసరికి భయపడుతూ చూసింది భావన.

‘‘మామయ్యగారు రాఘవేంద్ర వెళ్దామని అంటున్నారు. నాకు కూడా వెళ్తేనే బాగనిపిస్తుంది. ఒకసారి నువ్వు కూడా అమ్మను చూసినట్లు ఉంటుంది. వీలైతే అమ్మని మనతో రమ్మందాం. కొన్నిరోజులు సరదాగా కలిసుందాం’’ అత్తగారికి ఏం చెప్పాలో తోచలేదు భావనకు. కాసేపటి తర్వాత తల్లికి ఫోన్‌ ‌చేసి విషయం చెప్పింది.

‘‘ఒక్కరోజేగావుండేది. వంటమ్మ గార్ని పిలిచి వంట చేయిస్తాలే. నువ్వు పదిరోజులన్నా ఉంటావా?’’

‘‘ఇప్పుడు కాదు. ఇంకోసారి వచ్చినప్పుడు ఉంటాను. అమ్మా! ఇలా అంటు న్నానని మరోలా అనుకోకు. వాళ్లతో మంచిగా మాట్లాడు’’

‘‘ఇదిగో..ఇలాంటి మాటలే నాకు నచ్చవు..నీకు మీ నాన్నకు, మీ అన్నయ్యకు ఎప్పుడు బయటివాళ్లే నచ్చుతారు. సరే ఉంటా’’ తల్లి కాల్‌ ‌కట్చేసేసరికి చాలా బాధగా అనిపించింది భావనకు.

* * * * * * *

తల్లి మర్యాదలు చేయడం చూసి విస్తుపోయింది భావన. ఆ సాయంత్రం దాకా సంతోషంగానే గడిచింది. బయల్దేరేముందు నలుగురికీ బట్టలు పెట్టి ఏమైనా కొనుక్కోమని అల్లుడు, బిడ్డకు పదివేలు ఇచ్చింది. భావన తల్లిని దగ్గరకు తీసుకొని దుఃఖ పడింది. ప్రమీలమ్మ కూడా కళ్లనీళ్లు పెట్టుకుంది.

‘‘మీరు మాఇంటికి వస్తుండండి. మేము కూడా ఇక్కడికి వస్తుంటాం. నేను మిమ్మల్ని చాలాసార్లు రమ్మన్నాను. మీరు రాలేదు. మీరు చాలా మొహమాట స్తులు అని భావన చెప్పింది. కొడుకు, కోడలు దూరంగా వున్నారు. అమ్మాయిని మీరు అప్పుడప్పుడూ కలుస్తూవుంటే అబ్బాయి, కోడలు దూరంగా ఉన్నా రన్న ఫీలింగ్‌ ‌మీకు రాదు’’ అంటూ అత్తగారు ఏదో చెప్తుంటే ‘నువ్వేం మాట్లాడకు’ అన్నట్లుగా తల్లికి సైగ చేసింది భావన. ఆ తర్వాత నలుగురు బయలు దేరారు.

‘‘అమ్మ ఎందుకో బాధ పడుతుంది కదా?’’ కొద్ది దూరం వచ్చిన తర్వాత అడిగింది ప్రేమలత.

‘‘అదేం లేదు అత్తయ్యగారు’’

‘‘చాలామంది ఇళ్లల్లోలాగా మన ఇంట్లో ఎలాంటి రూల్స్ ఉం‌డవు. శని ఆదివారాల్లో మీ ఇద్దరు అమ్మను చూడటానికి వస్తుండండి. రాఘవేంద్రా! వింటు న్నావా?’’

‘‘అలాగే అమ్మా..నేను మాట్లాడుతున్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను. ఏంటో..అత్తయ్యగారు అస్సలు అర్థ్ధం కారు’’

‘‘అర్థంకారని అలా వదిలేస్తామారా? తెలుసుకోవాలి. నీకు మేమెంతో.. కోడలికి వాళ్లమ్మ అంతే కదా..అమ్మా భావనా.!

మా ఇంట్లో నీకు ఇంకా కొత్త పోలేదు. నీకుఏది కావాలన్నా అడుగమ్మా. మేమంతా నీ వాళ్లమే’’ మామగారు అంటుంటే భావన కళ్లల్లో నీళ్లు నిలిచాయి. తర్వాత డిఫరెంట్‌ ‌టాపిక్స్ ‌ముగ్గురూ మాట్లాడుతుంటే మధ్య మధ్య మాటలు కలిపింది భావన.

* * * * * * *

మూడు వారాలు గడిచాయి. ఆరోజు శుక్రవారం.. అత్తగారు, మామగారు ఏమైనా అనుకుంటారని రాత్రి డిన్నర్‌ ‌సమయంలో తల్లిని చూడటానికి వెళ్తానని అన్నది భావన. ముగ్గురూ సంతోషపడ్డారు. ఆ విషయం తల్లికి చెప్పింది. పొద్దున్నే బయల్దేరే సమయంలో తల్లి ఫోన్‌ ‌చేసేసరికి కంగారు పడింది భావన.

‘‘అమ్మా.. ఏంటి.. ఫోన్‌ ‌చేశావు?’’అంటూ అడిగిందో లేదో తల్లి బావురుమంది. ‘‘మన ఇంట్లో దొంగలు పడి బంగారం డబ్బు దోచుకుపోయారు. మొత్తం పోయిందే తల్లీ. ఇంకో ఇంట్లో కూడా పడ్డారట. పక్కింటి చలపతిగారు పోలీసులను పిలిచారు

వాళ్లు వచ్చారు. అంతా గోల గోలగా ఉంది. ఎలాగూ.. మీరు బయలు దేరుతున్నారు కదా..మీతో పాటు మీఅత్తగారిని, మామగారిని తీసుకురండి.. సహాయంగా ఉంటారు. వాళ్లతో నేను మాట్లాడనా?’’ ఆదుర్దాగా అంది ప్రమీలమ్మ.

‘‘వద్దులే నేను చెప్తాను’’ అంటూ కాల్‌ ‌కట్‌ ‌చేసి విషయం ముగ్గురికీ చెప్పింది.కాసేపట్లో కారులో నలుగురు బయల్దేరారు.

* * * * * * *

ఇంటి ముందు కారు ఆగటమే ఆలస్యం. కనపడని తల్లి అప్పుడే కనిపించే సరికి చిన్నపాప పరిగెత్తుకొచ్చినట్లుగా ప్రమీలమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి కూతుర్ని వాటేసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. దొంగలోపలికి ఎలావచ్చాడో తెలియలేదని గొంతు మీద కత్తి పెట్టి బెదిరించి దోచుకున్నాడని చెప్పింది. చలపతి వచ్చి ప్రసాదరావు, రాఘవేంద్రలతో మాట్లాడాడు. పోలీసులు దొంగను పట్టుకుంటామని చెప్పారని, అన్నీతాను చూసుకుంటానని, ఏదైనా అవసరం పడితే ఫోన్‌ ‌చేస్తానని చెప్పాడు. ఆదివారం సాయంత్రం నలుగురితో పాటు ప్రమీలమ్మ కూడా బయల్దేరక తప్పలేదు. ప్రేమలత, ప్రసాదరావు ఆమెతో మాట్లాడి ఒప్పించారు.

* * * * * * *

వారంరోజులు గడిచాయి. కూతురు చాలా సంతోషంగా కనిపించటం, మిగతా ముగ్గురు చూపించే ప్రేమ ఆప్యాయతకి విస్తుపోసాగింది ప్రమీలమ్మ. అక్కడ ఇరుగుపొరుగు చేరి ఒకరిమీద ఒకరు చాడీలు చెప్పుకోవటం, ఏవో గొడవలు పెట్టుకోవడం, కిట్టీపార్టీలలో భేషజాలతో అంతగా మనశ్శాంతి లేకపోవడం, ఎవరో ఒకరు తనతప్పేదో ఉన్నట్లు నిలదీయటం, ఇక జీవితం అంతా ఇంతేనా? అని అనుకుంటున్న సమయంలో ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. విశాలమైన మూడు బెడ్‌ ‌రూమ్‌లు, పెద్ద హాలు, కిచెన్‌, ‌మూడు వైపులా బాల్కనీలు. చక్కటిగాలి, వెలుతురు. అందమైన ఫ్లాట్‌. ఎప్పుడూ ఇంట్లో సరదా సందడి. ఆరాత్రి బాల్కనీలో కూర్చున్నప్పుడు ప్రేమలతను అడిగింది ప్రమీలమ్మ.

‘‘హైదరాబాద్‌ ‌లో ఫ్లాట్‌ అద్దెకు ఇచ్చారా’’

‘‘ఇవ్వలేదు..కరోనా వున్న ఈ రెండు సంవత్సరా లలో అక్కడ కొన్ని నెలలు, ఇక్కడ కొన్ని నెలలు ఉన్నాం. మళ్లీ ఆఫీసులకు రమ్మంటున్నారు కదా.. పిల్లలు వెళ్లాల్సి వస్తుందేమో? చలపతి గారు ఫోన్‌ ‌చేశారా?’’

‘‘లేదండీ.. ఏదో ప్రయత్నాలు చేయడమేగానీ పోయినవి అంత త్వరగా దొరుకుతాయా? బంగారం, డబ్బు పది లక్షలకు పోగొట్టుకున్నాను. నిద్రపట్టటం లేదు. మావారు చిట్టీలు వేసి నగలు చేయించారు. భాస్కరం నెలనెలా పంపే డబ్బు ఇంట్లోనే దాచుకు న్నాను’’

‘‘మీరు బ్యాంక్‌లో వేసుకుంటే బాగుండేది’’

‘‘ఇలా పోవాల్సిన రాత ఉంటే.. అంతమంచి ఆలోచన రాదు కదా! కట్టలు కట్టలుగా డబ్బు అలా కళ్ల ముందు కనపడితే నాకు ఎంతో ఇష్టం. మా ఫ్రెండ్స్ ‌చాలామంది అన్నారు లాకర్‌ ‌తీసుకోండి అని..అంతా నా ఖర్మ.. ఏంటో వదినగారూ! ఎప్పుడూ ఏదో ఒక చిరాకు నాకు ఉండాల్సిందే.. భాస్కర్‌కు ఎంత గొప్ప సంబంధం చూశానో.. ఏదో పెళ్లిలో ఆ పిల్లను చూసి ప్రేమించాడట. మనవాళ్లే అనుకోండి. నా మాట కాదనివాడు ఇలా చేస్తే నాకెంత బాధగా ఉంటుంది చెప్పండి?’’

‘‘నిజమే.. నేను కాదనను.. కానీ అన్ని మనకు అనుకూలంగా జరగాలని లేదు కదా..?మా అబ్బాయికి ఎమ్మెల్యే వాళ్ల అమ్మాయిని ఇస్తామని ఎన్నిసార్లు మమ్మల్ని అడిగారో..ఆ అమ్మాయికి ఇలాగే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం. చాలా ఆస్తి ఉంది. ఒక్కతే కూతురు. నిజానికి వాళ్లతో మేము ఎక్కడా సరితూగం. మా ఫ్యామిలీ నచ్చి అమ్మాయిని ఇస్తామన్నారు. మా స్థాయికి తగ్గవాళ్లు మాకు చాలు అనుకున్నాము. నేను చెప్పేది ఏంటంటే.. విషయాలను కాస్తా ఈజీగా తీసుకోవటం నేర్చుకోవాలి. నిజం చెప్పండి మన పిల్లలు మనకు కాకుండా పోతారా? మీరు దూరం పెట్టినా కొడుకు మీదమీకు ప్రేమ లేదా?మనసు గుంజటం లేదా?బాగా ఆస్తి డబ్బు ఉన్నసంబంధం మీరు చూశారు. అతను తన ప్రేమకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఇందులో తప్పెందుకు చూశారు మీరు? ముందు ముందు వాళ్లు చాలా సంపాదించుకోగలరు. వాళ్ల ఆనందమే కదా మన ఆనందం. మీరు వాళ్లను దూరం చేయకండి’’ ఆ తర్వాత ఇద్దరి మధ్య కాసేపు చర్చ జరిగింది.

* * * * * * *

మొబైల్‌ ‌చూస్తున్న అత్త గారికి పాద నమస్కారం చేసింది భావన. ‘‘అయ్యో.. ఏంటి తల్లీ’’ అంటూ నవ్వుతూ భావనను లేపి ప్రక్కన కూర్చోపెట్టుకుంది ప్రేమలత.

‘‘మీకు చాలా చాలాథాంక్స్.. ‌రాత్రి అన్నయ్య మాట్లాడాడు. అమ్మ ఫోన్‌ ‌చేసి వాళ్లను రమ్మన్నదట. వదినతో కూడా మాట్లాడిందట. అన్నయ్య అమ్మకు పోగొట్టుకున్న ఆభరణాలు అన్నీ చేయిస్తానని చెప్పాడు. డబ్బు కూడా ఇస్తాడట. ‘ఇక్కడ ఉంటున్నానే గానీ అమ్మ ఒక్కతే ఎలా ఉంటుందో.. అమ్మకు మాపై కోపం ఎప్పుడు పోతుందో అని బెంగ ఉండేది. ఈ విషయంలో అత్తయ్య గారికి నేను బ్రతికినంత కాలం థాంక్స్ ‌చెప్పుకుంటాను’ అన్నాడు. మీకు కూడా ఫోన్‌ ‌చేశానని చెప్పాడు’’

‘‘అవునమ్మా..నాతో కూడా మాట్లాడాడు. మనకు దగ్గర్లో ఫ్లాట్‌ ‌చూడమన్నాడు. కొంటాడట. అమ్మకు ఉన్న కోపంవల్ల మీ పెళ్లికి కూడా రాలేదుగా..పాపం సెలవు దొరకలేదని మాకు ఏదో వంక చెప్పాడు. అక్కడ వదినగారు వాళ్లు క్లోజ్‌ అయ్యారు కదా. వీళ్లు ఇండియా వస్తున్నారని వాళ్లు బాధపడుతున్నారట. భాస్కర్‌ ‌చాలాసేపు మాట్లాడాడు’’

‘‘మాకు చాలా పెద్ద సహాయం చేశారు అత్తయ్యగారు’’ చేతులు జోడించింది భావన.

‘‘మనమంతా ఒకటే భావనా! ఈ బంధాలన్నీ మనం జీవించి ఉన్నంత కాలం ఉండేవి. ఒకరికొకరం తప్పక అండగా ఉండాలి. నువ్వెళ్లు భావనా..మనం మాట్లాడుకోవటం మీ అమ్మగారు చూస్తే బాగుండదు’’

భావనలేచి తల్లి రూమ్‌లోకి వెళ్ళింది. కుర్చీలో కూర్చుని కన్పించింది తల్లి. ‘‘అమ్మా స్నానానికి వెళ్లావు కదా’’

‘‘కరెంట్‌ ‌పోయిందే.. నీళ్లు చల్లగా వున్నాయని’’ అంటూ లేచి భావనను కౌగలించుకుంది ప్రమీలమ్మ.

‘‘మీ అత్తగారు చాలా మంచిదే. కొద్దిరోజుల్లోనే మన ఇంటి పరిస్థితి మొత్తం మారిపోయింది. చాలా సంతోషంగాఉంది. ఇప్పుడు మీరు మాట్లాడు కున్నదంతా విన్నాను. అన్నయ్యగారు, వదినగారు, అల్లుడుగారు మనకు ఎంత అండగా వున్నారు. నువ్వు చాలా మంచి కుటుంబంలో పడ్డావే. నువ్వు అన్నది నిజమే. కన్నకొడుకు చేదుకానీ వాడు ఇచ్చే డబ్బు మాత్రం తియ్యగా వుంటుందా? నామీద నాకే అసహ్యంగా ఉంది. ఇకనుండి నేను మీ అత్తగారిలా ఉంటాను’’ భావన వీపు నిమురుతూ ప్రేమగా అంది ప్రమీలమ్మ.

About Author

By editor

Twitter
YOUTUBE