తాజాగా జరిగిన మూడు ఈశాన్య రాష్ట్రాల శాసనసభల ఎన్నికలలోనూ బీజేపీ మళ్లీ సత్తా చాటుకున్నదంటూ సాధారణ విశ్లేషణకు ఎవరూ పరిమితం కాలేరు. ఆ ఫలితాలు యాంత్రికమైన వ్యాఖ్యానాలకూ, పడికట్టు పదాల వార్తా కథనాలకూ అందేవి కావు కూడా. ఢిల్లీ తమకు సుదూరమని మొత్తం ఈశాన్య భారతంలోని ఏడు రాష్ట్రాలలో కనీసం ఆరు దృఢంగా విశ్వసించిన కాలం ఒకటి ఉండేది. భారతదేశం తమ మాతృభూమే కాదని, అది వేరే దేశమని ఆ ప్రాంతాలు చెప్పుకున్న సమయం ఉంది. కానీ ఇప్పుడు హిందుత్వ నినాదమిస్తున్న ఏకైక పక్షం బీజేపీ, జాతీయవాదమే ఊపిరిగా సాగుతున్న కమలదళాన్ని వారు అక్కున చేర్చుకుంటున్నారు. క్రైస్తవ మిషనరీల విద్రోహపు బోధనలతో, బంగ్లా నుంచి వచ్చి తిష్ట వేసిన ముస్లింల సమస్యతో కొట్టుమిట్టాడుతున్న ఈశాన్య భారత ప్రజలు తాము ఈ దేశ పౌరులమన్న భావనకు వస్తున్నారు. ఇటీవల అస్సాం మొదలుకొని ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీకి లభిస్తున్న ఎన్నికల విజయాలు ఇందుకు సాక్ష్యం పలుకుతున్నాయి. త్రిపుర, నాగాలాండ్‌, ‌మేఘాలయ తాజా ఎన్నికల ఫలితాలు, అందులో  కమల వికాసం ఎన్నో అంశాలను వెల్లడిస్తాయి. 


ఒకటిన్నర దశాబ్దం నుంచే బీజేపీ ‘సెవెన్‌ ‌సిస్టర్స్’ ‌మీద తన ప్రభావం చూపించడం ఆరంభించింది. సెవెన్‌ ‌సిస్టర్స్ ‌సిగలో కమల వికాసం ఐదారేళ్ల క్రితమే కనిపించింది. అస్సాం నుంచి అరుణాచల్‌ ‌ప్రదేశ్‌, అక్కడ నుంచి మణిపూర్‌ ‌వరకు కూడా బీజేపీ క్రమంగా విస్తరించింది. ఇక్కడ గమనించవలసిన అంశం- శతాధిక సంవత్సరాల కాంగ్రెస్‌ను, దశాబ్దాల పాటు ఏలిన వామపక్షాలను బీజేపీ మట్టి కరిపించింది. దేశ రాజకీయ భవిష్యత్తు, రాజకీయ చిత్రం ఈశాన్య భారతం ద్వారా ఈ విధంగా వ్యక్తమయింది. ఈ దేశ ప్రజల మనుసుల నుంచి కాంగ్రెస్‌, ‌కామ్రేడ్లు తొలగిపోతున్నారు. దేశ సమైక్యతకు దారులు విస్తరిస్తున్నాయి.

2016లో అస్సాం ఎన్నికలలో బీజేపీ హవా వీచింది. 15 సంవత్సరాల కాంగ్రెస్‌ ‌పాలన అంతరించిపోయింది. 2021లో జరిగిన ఎన్నికలలో మరొకసారి బీజేపీ విజయం సాధించింది.

2016లో బీజేపీ అరుణాచల్‌ ‌ప్రదేశ్‌లోకి ప్రవేశించిన తీరు నాటకీయంగా జరిగింది. అప్పుడు పెమా ఖందు ముఖ్యమంత్రి. ఆయన కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందినవారు. తన ఎమ్మెల్యేలందరినీ ఆయన బీజేపీలో చేర్చారు. 2017లో మణిపూర్‌ను బీజేపీ గెలుచుకుంది. ఎన్‌. ‌బైరన్‌సింగ్‌ ‌ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన కూడా మొదట కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందినవారే. 2022లో మళ్లీ ఇక్కడ బీజేపీయే గెలిచింది. 2018లో కమలం మరొక రికార్డు సృష్టించింది. 25 ఏళ్ల కమ్యూనిస్టు పాలనకు పాతరేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ సంవత్సరమే మేఘాలయ, నాగాలాండ్‌లలో బీజేపీ మద్దతుతో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 2016లో అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 60 స్థానాలకు గాను 41 చోట్ల బీజేపీ విజయం సాధించింది. సిక్కిం, మిజోరం రాష్ట్రాలు మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీల పాలనలో ఉన్నాయి.

ఈశాన్య భారతంలో కమల వికాసాన్ని అంచనా వేయడం కొంచెం క్లిష్టమైన వ్యవహారమే. అస్సాం, త్రిపుర అంటే హిందూ మెజారిటీ ఉన్న రాష్ట్రాలు. కానీ మిగిలిన ఈశాన్య భారతమంతా గిరిజనులు, క్రైస్తవులే ఎక్కువ. వీరిలో ఎక్కువ మంది గొడ్డుమాంసం తినేవారే. అదీ కాకుండా క్రైస్తవులంతా ఇంగ్లిష్‌ ‌మాట్లాడతారు. ఇదంతా క్రైస్తవ మిషనరీల ప్రభావం. కానీ బీజేపీ హిందూత్వ పార్టీ. హిందీని అభిమానించే పార్టీగా ప్రచారం ఉంది. అలాగే ఆవును పవిత్రంగా భావించే పార్టీ అన్నదీ నిజం. అయినా ఈశాన్య భారత రాష్ట్రాల• ఇప్పుడు బీజేపీని ఎందుకు ఇంతగా ఆరాధిస్తున్నాయి?

భారతదేశమంటే ఢిల్లీ దాని చుట్టూ ఉండే ప్రాంతమే అని బీజేపీ భావించలేదు. ఈశాన్య భారతాన్ని కూడా ఈ దేశంలో భాగంగానే భావిం చింది. రాజకీయాల విషయంలో ఢిల్లీకీ, సోదరత్వం విషయంలో మనసుకీ పెరిగిపోయిన దూరాన్ని తగ్గించేందుకు హృదయ పూర్వకంగానే శ్రమించింది. అటల్‌ ‌బిహారీ వాజపేయి కాలం నుంచే ఇందుకు కృషి ఆరంభమైంది. ఆయన అక్కడి వేర్పాటువాదులతో చర్చలు జరపడానికి వెనుకాడ లేదు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చునన్న ఆయన నమ్మకం వమ్ముకాలేదు. వాజపేయి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, కొత్త చరిత్రలో మొదటి వాక్యం రాశారు. నిజమే, తాము నిర్లక్ష్యానికి గురైనామన్న భావన ఈశాన్య భారతంలో ప్రబలంగానే ఉంది. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అందుకు కారణం. ఈ పరిస్థితిని క్రైస్తవ మిషన రీలు ఉపయోగించుకున్నాయి. తాము భారతీయులం కాదు అన్న అభిప్రాయానికి అక్కడ ప్రజలు రావడమే పెద్ద విషాదం. దీనితో ఉగ్రవాదం పెరగడానికి మార్గం ఏర్పడింది. ఈ వాతావరణాన్ని సమూలంగా మార్చే పనిని వాజపేయి ప్రారంభించారు. అదే నరేంద్ర మోదీ కొనసాగించారు. ఢిల్లీకి ఈశాన్య భారతం దూరం కాదు అన్న నినాదాన్ని చిత్తశుద్ధితో వినిపించారు. నిధులు ఇచ్చి అభివృద్ధికి తోడ్పడ్డారు.

మన్మోహన్‌సింగ్‌ అస్సాం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ తరఫున ప్రధాని అయ్యారు. కానీ ఆయన తన పదవీకాలంలో ఈశాన్య రాష్ట్రాలను సందర్శించింది కేవలం రెండుసార్లు. మోదీ తన ఎనిమిదేళ్ల పాలనలో 60 సార్లకు పైగా అక్కడి ప్రజలను కలుసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని తన వ్యక్తిగత అజెండాగా ఆయన భావించారు. మతం అనేది బీజేపీ పక్కన పెట్టింది. అక్కడ క్రైస్తవం ఎక్కువే. అస్సాంలో అయితే బంగ్లా ముస్లింలు తిష్ట వేసుకుని ఉన్నారు. అయినా అభివృద్ధికే బీజేపీ పెద్ద పీట వేసింది. వారి ఆరాధన వేరు కావచ్చు. కానీ వారంతా భారత పౌరులు, మన సోదరులు అన్న భావనను బీజేపీ బలోపేతం చేసింది. స్థానిక పార్టీలలో భావ సారూప్యత కలిగిన పార్టీలను కలుపుకుని బీజేపీ ప్రజలకు చేరువైంది. దేశంలో మెజారిటీగా ఉన్న హిందువుల విశ్వాసం పట్ల గౌరవం, అదే సమయంలో దేశ సమగ్రత, సమగ్రాభివృద్ధి పట్ల నిబద్ధత బీజేపీలో సమంగా ఉన్నాయి. దీనిని గుర్తించడం దగ్గరే అన్ని విపక్షాలు విఫలమవు తున్నాయి. అసలు ఈశాన్య భారత సమస్యలు కాని, మిగిలిన భారతదేశం ఎదుర్కొంటున్న దారుణ సమస్యలను కాని పరిష్కరించాలన్న చిత్తశుద్ది విపక్షాలకు, ప్రాంతీయ పార్టీలకు, ఇంకా కాంగ్రెస్‌ ఎక్కడుంది?

2015లో జరిగిన ఒక ఉదంతం ఇందుకు చక్కని ఉదాహరణ. హిమంత బిశ్వ శర్మ ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రి. ఆయనను బీజేపీ ఆ స్థానంలో ప్రతిష్టించింది. అంతకు ముందు ఆయన కాంగ్రెస్‌ ‌పార్టీ సభ్యుడే. పైగా అస్సాం మీద పట్టున్న నాయకుడు. కానీ ఆయనను రాహుల్‌, ‌సోనియా దారుణంగా నిర్లక్ష్యం చేశారు. శర్మ బీజేపీలో చేరారు. అస్సాం అనేక సమస్యల కూడలి. సరిహద్దు రాష్ట్రం. ముస్లిం సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతం. వాటన్నిటి మీద శర్మకు అవగాహన ఉంది. సమస్యల పట్ల ఆయన నిశిత దృష్టి, జాతీయ సమైక్యత పట్ల నిబద్ధత, ముస్లిం సమస్య పట్ల ఉన్న తర్కం బీజేపీ గౌరవించింది. ఇప్పుడు ఆయన ప్రభుత్వ నమూనా కూడా మూడు ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ మరింత నమ్మకాన్ని పెంచింది. ఈశాన్య భారత డెమాక్రటిక్‌ అలయెన్స్ అనే వేదికను కూడా ఆయన స్థాపించారు. హిమంతలా ఆలోచించేవారే పేమా ఖందు, ఎన్‌ ‌బైరన్‌సింగ్‌ ‌కూడా. అందుకే కాంగ్రెస్‌ను వీడారు. బీజేపీ ఎదుగుతున్న కొద్దీ ఈశాన్య భారతానికి ప్రాధాన్యం కూడా పెరుగుతున్న సంగతి గమనిస్తాం. అమిత్‌ ‌షా పార్టీ అధ్యక్షుడైన తరువాత ఈశాన్య భారతానికి మరింత ప్రాధాన్యం ఇచ్చారు. దీనితో పాటు 2014 నుంచి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడం కూడా ప్రాంతీయ పార్టీల దృష్టిని మార్చింది. ఈశాన్య భారతంలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉంటే, ఎన్‌డీఏ 18 గెలుచుకోవడం చూస్తే ఆ ప్రాంతవాసులు బీజేపీ పట్ల ఏర్పరుచుకున్న వైఖరి తెలుస్తుంది. అందులో 14 బీజేపీకే దక్కాయి. కాబట్టే వచ్చే 2024 ఎన్నికలలో కూడా బీజేపీకి ఈ ప్రాంతం ఎంతో కీలకం కానున్నది.

ఈశాన్యంలోని ఆ ఏడు రాష్ట్రాలలో అస్సాం, అరుణాచల్‌‌ప్రదేశ్‌, ‌త్రిపుర, మణిపూర్‌లలో రెండోసారి బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. నాగాలాండ్‌, ‌మేఘాలయలో బీజేపీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాలు మళ్లీ వచ్చాయి. మిజోరంలో మాత్రం ప్రాంతీయ పార్టీ ఎంఎన్‌ఎఫ్‌ అధికారంలో ఉంది. ఇది ఈశాన్య భారతంలో వచ్చిన విప్లవంగానే చూడాలి.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కూడా ఈశాన్య భారత్‌లో తన వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహించింది. మనమంతా ఒక్కటేనన్న భావనను అంకురింప చేసింది. నిజానికి బ్రిటిష్‌ ఇం‌డియా కాలంలో కూడా అక్కడ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమగ్రతను సమర్ధించే వాతావరణం కోసం శ్రమిస్తున్నది. ఇక్కడే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చూపిన వాస్తవక దృష్టి ప్రశంసనీయం. ఈశాన్య భారత రాష్ట్రాలంటే పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ఆం‌ధప్రదేశ్‌, ‌తెలంగాణ వంటివో కాదు. అందుకే ఆహార నియమాల గురించి సంఘం ప్రస్తావించడం లేదు. అదానీ వివాదం ఈ ఎన్నికలలో త్రిపుర పని చేయలేదు. కాంగ్రెస్‌కి వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. త్రిపురలో సీపీఎంతో కలసి పోటీ చేసినా 14 స్థానాలకు పరిమితమైంది. మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో జరిగిన తొలి ఎన్నికల ఫలితాలివి. కోటలు దాటే మాటలు చెప్పిన మమత పార్టీ టీఎంసీ చతికిల పడింది. ఎన్‌సీపీ, ఆప్‌కు కూడా భంగపాటే మిగిలింది. అయితే ఈ ఓటమి బాధ నుంచి ఉపశమనం పొందడానికి వీరందరికీ ఎన్నికల కమిషనర్‌ ‌నియామకం మీద సుప్రీం కోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పు రక్షణ కవచంలా ఉపయోగ పడింది. అంతా ఆ తీర్పును శ్లాఘిస్తూ తమ ఓటమిని దాచే ప్రయత్నం చేశారు. బీజేపీ విజయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని చూశారు.

About Author

By editor

Twitter
YOUTUBE