– తురగా నాగభూషణం
అమరావతి రాజధాని వ్యవహారంలో అధికార వైసీపీ ఇరకాటంలో పడింది. ఇప్పటి వరకు మూడు రాజధానుల నాటకం ఆడిన వైసీపీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్‌తో గిలగిలలాడుతోంది. ఇప్పటికే 2014 ఏపీ పునర్విభజన చట్ట నిబంధనల మేరకే అమరావతి రాజధాని ఏర్పాటైందని, ఆ మేరకే రాజధానికి నిర్మాణానికి రూ.2,500 కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అలాగే పార్లమెంటులోనూ అమరావతి రాజధానిపై కూడా కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానమిచ్చింది. దీంతో ఈసారి ఉగాది పండుగ నాటికి ఎట్టి పరిస్థితుల్లో సీఎం క్యాంపు కార్యాలయం విశాఖకు తరలించాలన్న ఉత్సాహంతో ఉన్న వైసీపీ అధిష్ఠానం ఆశలు నీరుగార్చినట్లైంది. విశాఖను రాజధానిగా చేసి ఉత్తరాంధ్ర ప్రజల అభిమానం పొందాలనే ఆ పార్టీ ఆశ ఆడియాశైపోయే పరిస్థితి కనిపిస్తోంది.
రాజధానిని నిర్ణయించుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం విస్పష్టంగా చెప్పిన మాట వాస్తవమా? అదే నిజమైతే ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఒకటికి మించిన రాజధానులను ఏర్పాటు చేసుకోవడాన్ని నిరాకరిస్తూ ఆంధప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానమిస్తూ, ‘ఏపీ విభజన చట్టం లోని సెక్షన్ 5, 6 ప్రకారం రాష్ట్ర రాజధాని ఏర్పాటుపై అధ్యయనం కోసం కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ సూచనలు, సలహాలతో నివేదికలు అంద చేసింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించగా, దాన్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి రాజధానిగా అమరావతినే ఎంపిక చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది’అని వెల్లడించారు. ఆ తర్వాతే ఆంధప్రదేశ్ క్యాపిటల్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీసీఆర్డీఏ)ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చినట్లుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పార్లమెంటుకు వివరించింది. అయితే ఏపీసీఆర్డీఏను రద్దుచేసినట్లుగా, మూడు రాజధానులు ప్రతిపాదనలు తీసుకొస్తున్నట్లుగా వైసీపీ ప్రభుత్వం 2020లో కొత్త బిల్లు ప్రవేశపెట్టినట్లు మంత్రి వివరించారు. మళ్లీ ఆ బిల్లును వెనక్కి తీసుకుంటూ ఏపీసీఆర్డీఏ చట్టాన్ని కొనసాగింపుగా మరో బిల్లు ముందుకు వచ్చినట్లుగా మంత్రి వివరించారు. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుం దని కేంద్ర ప్రభుత్వం చెప్పిందా? అని విజయ సాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా, అమరావతి రాజధాని అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందని, ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్నందున దీనికి సంబంధించి ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై మాట్లాడటం కోర్టు ధిక్కరణ అవుతుందని కూడా పేర్కొంది.
ఆదినుంచీ అమరావతిపై వ్యతిరేకతే
వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ‘అమరా వతి రాజధాని నిర్మాణం నిలిపివేసి మూడు రాజధానులు నిర్మిస్తామ’ని చెబుతూ ప్రజలందరినీ గందరగోళంలో నెట్టివేసింది. దాంతో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానులు బిల్లు చెల్లదని విభజన చట్టం ప్రకారం హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిన విషయం తెల్సిందే. అలాగే కోర్టు తీర్పుకు భిన్నంగా ఏ ప్రభుత్వ శాఖ కార్యాలయాన్ని తరలించినా ఆ శాఖ ముఖ్య కార్య దర్శిపై చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది. దీంతో కనీసం సీఎం క్యాంపు కార్యాలయాన్నైనా విశాఖకు తరలించి, అక్కడే సమీక్షలు నిర్వహించడం ద్వారా పరిపాలనా రాజధాని విశాఖేనన్న భ్రమ ప్రజలకు కల్పించాలని వైసీపీ అధిష్టానం ప్రయత్ని స్తోంది. దీనికి కూడా సాంకేతికంగా అనేక ఆటంకాలు ఏర్పడుతూ ఉండడంతో వాయిదాలు వేస్తూ వస్తోంది. గత మూడేళ్లుగా ప్రతి ఉగాదికి తరలింపు ఖాయమనే ప్రచారం చేస్తున్నారు. అమరావతే రాజధాని అని హైకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చినా, వైసీపీ వైఖరిలో మార్పు రాలేదు. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంటున్నామని హైకోర్టులో స్వయంగా అఫిడవిట్ దాఖలు చేసింది. అంతలోనే, రాజధానిపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఉత్తరాంధ్ర ప్రజల ఓట్ల కోసం గాలం
విశాఖలో రాజధాని ఏర్పాటు వెనుక సొంత లాభాలు ఎన్నున్నా ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లకు గాలం వేయడమేనని బహిరంగంగా తెలిసిపోతోంది. అమరావతి రాజధాని కేసుపై ఈనెల 23వ తేదీ విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. కోర్టు తీర్పు ఎలా ఉన్నా వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ ప్రభుత్వం తన పంతం నెగ్గించుకోవడానికి విశాఖకు సీఎం క్యాంపు కార్యాలయాన్ని అయినా తరలించాలనే పట్టుదలతో ఉంది. అందుకోసం ఉగాది నాటికి తరలించేలా విశాఖ బీచ్ రోడ్డులో ఏర్పాట్లు జరుగు తున్నట్లు మీడియాలో వార్తలు రావడమే కాదు పాలక నేతలే చెబుతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి దాదాపు 30వేల మంది రైతులు 34 వేల ఎకరాల భూములు ఉచితంగా ఇవ్వడం, ఆ భూముల్లో సుమారు 50వేల విలువైన నిర్మాణ పనులు ప్రారంభం కావడం, గత ఏడేళ్లుగా ఇక్కడ నుంచే పరిపాలన జరుగుతున్న నేపథ్యంలో అమరావతి రాజధాని తరలింపు అసాధ్యమని అందరూ అంగీకరిస్తున్నారు. కాని వైసీపీ ప్రభుత్వం మాత్రం విశాఖపై మనసును మాత్రం వదలిపెట్టడం లేదు. అక్కడ రాజధాని ఏర్పాటును ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధితో ముడిపెట్టింది. అందుకోసం విశాఖలో ఉత్తరాంధ్ర గర్జన నిర్వహించింది. ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే అమరా వతి రాజధానిగా కోరిన పక్షంలో విశాఖ రాజధానిగా ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని కూడా ప్రకటించారు. సీఎం క్యాంపు కార్యాలయం ఎక్కడైనా పెట్టుకునే అధికారం ఉన్నందున, ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఇకపై విశాఖలోనే సీఎం తిష్టవేసి అక్కడే అన్ని శాఖల సమీక్షలు జరుపుతూ చెప్పిన మాట ప్రకారం పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించామని విస్తృత ప్రచారం చేసుకుని ఉత్తరాంధ్రలో ప్రజాభిమానం పొందాలనేది వైసపీ ప్రభుత్వ ఆలోచన.
‘శివరామ’ నివేదిక అమలుచేయాలని పిటిషన్
సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేంద్రం అఫిడవిట్‌కు కౌంటర్‌గా ఏపీ సర్కార్ వికేంద్రీకరణకు మద్దతుగా శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టును తెరపైకి తెచ్చింది. ఏపీ రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీ నివేదిక అమలు చేయాలని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది. చంద్రబాబు ప్రభుత్వం ఆ కమిటీ నివేదికను సక్రమంగా అమలు చేయలేదని సుప్రీంకోర్టులో బలంగా వాదించి, కేసు నెగ్గాలనే ధోరణిలో వైసీపీ ఉంది. ఏపీ రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీ నివేదిక అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్నం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లో ఉమ్మడి ఆంధప్రదేశ్ విభజన సమయంలో నాటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను వివరించింది. ఏపీలో అతి పెద్ద రాజధాని ఏర్పాటు సరైందని కాదని, రాష్ట్రంలో రాజధానిని, అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలని, ప్రభుత్వ వ్యవస్థలను ఒకేచోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కమిటీ తెలిపినట్లు గుర్తుచేసింది. విజయవాడ-గుంటూరు, విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి – నడకుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రభుత్వ వ్యవస్థలను వికేంద్రీకరించాలని, అసెంబ్లీ, సచివాలయం ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదని తెలిపింది. హైకోర్టు ఒక ప్రాంతంలో, మరో ప్రాంతంలో బెంచ్ ఏర్పాటు చేయవచ్చు అని, ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రభుత్వ వ్యవస్థలను విస్తరించాలని, రాజధానిని రెండు పట్టణాల మధ్య పూర్తిగా కేంద్రీకరిస్తే… రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయని కమిటీ తెలిపినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రధానంగా గుంటూరు-విజయవాడ మధ్య సారవంతమైన పంటలకు తక్కువ నష్టం జరిగేలా రాజధానిని ఏర్పాటు చేయాలని, విజయవాడ-గుంటూరు మధ్య భూగర్భ జలమట్టం చాలా పైకి ఉంటుందని తెలిపిందని, ఈ ప్రాంతం భూకంప ప్రభావిత క్షేత్రం అని, అందుకే ఇక్కడ భారీ భవనాల నిర్మాణం సరికాదని, అన్ని జిల్లాల ప్రధాన నగరాల్లో సమగ్రాభివృద్ధికి విధి విధానాలను రూపొందించాలని కమిటీ సూచించిందని పిటిషన్లో వివరించింది.
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్