జంధ్యాల శరత్‌బాబు
నృత్యం- జన జీవనాదం, కళల తరంగం. లయబద్ధ కదలిక, చైతన్యవాహిక. సంగీతంతో సరిజోడీగా కొనసాగే నిత్య నవీన దీపిక. ఇందులోనే చరిత్ర, సంస్కృతి, వికాసం, విద్య, విజ్ఞానం, ఇంకా అనేకం నిండి ఉన్నాయి. అన్నింటినీ మించి; ఇదొక ఐక్యతా సాధనం, భారతీయతకు స్వచ్ఛమైన అచ్చమైన ప్రతిరూపం.
ప్రాచీనంతోపాటు సమకాలీన అంశాల మేళవింపు నాట్యానికి మరెంతో వన్నె తెస్తుంది. తెలుగునాట కూచిపూడి, తమిళ సీమన భరత నాట్యం, కేరళ కథాకళి, ఉత్తరప్రదేశ్ కథక్, పంజాబ్ లోని భాంగ్రా, అసోంకి సంబంధించిన బిహు, అలాగే మణిపురి… ఏ పేరుతో పిలిచినా ప్రతి ఫలించేది మాత్రం జాతీయతే. ప్రదర్శనలు నిర్వ హించినా, అనుసరించినా, పాల్గొన్నా, తిలకించినా అన్ని దశల్లోనూ వెల్లివిరిసేది సదానుభూతి.
మానసిక సమున్నతికి, శారీరక ఆరోగ్య భాగ్యానికి, సాంస్కృతిక ఉద్దీపనకి సకల విధాల ఉపకరించే నృత్య కళాక్షేత్ర వ్యవస్థాపకురాలిగా రుక్మిణీదేవి అరండేల్ సదా వందనీయ. పద్మ భూషణురాలిగా, దేశికోత్తమ బిరుదానికి వన్నె తెచ్చిన కళాప్రముఖురాలిగా ఆమెది చిరయశస్సు. ఇంకా సూటిగా వర్ణించాలంటే -భారతీయ నృత్యకళను అంతర్జాతీయ వేదిక మీద కళకళ లాడించిన విదుషీమణి మన రుక్మిణి.
భావం, రాగం, తాళం-ఈ మూడింటి మేలు కలయికే భరతనాట్యం. అనేకానేక శాస్త్రీయ అంశాలకు తోడు వదన, హస్త, పాద కదలికలతో ఆబాలగోపాలాన్నీ ముగ్ధుల్ని చేసే మహాపక్రియ. ఇది నర్తనమైతే, ప్రత్యేకించి దక్షిణ భారతావనికి మకుటాయమానం కర్ణాటక సంగీతం. మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాల వారికి చిరపరిచితం. గీత, నృత్య రంగాలు రెండింటా పరిణతి సాధించడమే రుక్మిణీదేవి విశిష్టత. మదురై ప్రాంతంలో జన్మించిన ఆ కళామయి పుట్టినరోజు మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ఆ తేదీ ఫిబ్రవరి 29. నాలుగేళ్లకు ఒకసారే వచ్చే లీప్ సంవత్సర భాగం. జయంతి తేదీ మొదలు అంతటా ఆమెది ప్రత్యేకం. తొలి శిష్యరికం చేసింది మీనాక్షి సుందరం పిళ్లై సమక్షంలో. మొదటగా ప్రదర్శన ఇచ్చింది దివ్యజ్ఞాన సమాజం వజ్రోత్సవ సందర్భంలో. ప్రథమంగా ఆకట్టుకుంది ప్రేక్షకుల్లోని ఒక ఐర్లాండ్ కవిని. ఫలితంగానే ఇంటర్నేషనల్ ఆర్టస్ అకాడమీ రూపుదిద్దు కుంది. అటు తర్వాత అదే కళాక్షేత్రంగా రూపాంతరం చెంది, దేశ విదేశాల్లో మరిన్ని పేరు ప్రఖ్యాతులందుకుంది.
సకల కళాక్షేత్ర
కళాక్షేత్రం అంటే కేవలం భవన ప్రాంగణం కాదు. సంప్రదాయం, ప్రకృతి సౌందర్యం, ఆధునికత కలగలిసిన మేలిమి కట్టడం. నర్తనతోపాటు సంగీతానికీ అక్కడ సమధిక ప్రాధాన్యం. ఆర్టస్, కల్చరల్ అకాడమీ. సంస్థను స్థాపించి ఇప్పటికి ఎనిమిదిన్నర దశాబ్దాలు దాటింది. చెన్నై బీసెంట్ నగర్‌లోని దాదాపు వంద ఎకరాల సువిశాల స్థలం లోకి మారి సరిగ్గా ఆరు దశాబ్దాలు. ఇదే కళాక్షేత్ర ఫౌండేషన్‌ను జాతీయ ప్రాముఖ్య సంస్థగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి మూడు దశాబ్దాలు కావస్తోంది. ఇవన్నీ విశిష్టతలకు ఆనవాళ్లు.
రుక్మిణీదేవి దంపతుల ఆశయఫలంగా ఏర్పాటై విస్తరించిన కళాక్షేత్రం ఎందరెందరో కళాకారులను అక్కున చేర్చుకుంది. ప్రముఖులెందరినో అనేక ప్రాంతాల నుంచి ఆహ్వానించి బోధనలు ఏర్పాటు చేసింది. కార్యక్రమాల పరంపరతో నిత్యశోభాయ మానంగా ఉంటుండేది కళాక్షేత్రం. అక్కడ సంగీత నృత్యాలతోపాటు ఇతర డిప్లొమా కోర్సుల నిర్వహణకీ నాటి మద్రాసు విశ్వవిద్యాలయం అనుమతినిచ్చింది. రెండు దశాబ్దాల నాడు అక్కడే కళాక్షేత్రంలోనే రుక్మిణి వంద సంవత్సరాల పండుగ అయింది. తన శతజయంతి మహోత్సవాలను ఏడాది పొడవునా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఒక్క తమిళనాడులోనే కాకుండా దేశవిదేశాల్లో కూడా సంబరాలు అంబరాన్నంటాయి. అప్పట్లో లీప్ సంవత్సరం ఫిబ్రవరి 29వ తేదీన దేశ రాజధానిలోని లలిత కళా గ్యాలరీలో వర్ణచిత్రాల ప్రదర్శనను నిర్వహించారు. ఆమె ఫోటో బయోగ్రఫీని నాటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ఆవిష్కరించారు. నాట్య రంగానికి గుర్తింపూ గౌరవాలనూ అనంతంగా తెచ్చిన మహోన్నతురాలిగా ఆమెను కీర్తించారు.
మలుపులూ మెరుపులూ
తనను ఎంతగానో ప్రోత్సహించిన తల్లి దండ్రులకు సదాకృతజ్ఞతలు చెప్తుండేవారు రుక్మిణీదేవి. తల్లి శేషమ్మాళ్ స్వస్థలం సంగీత కేంద్రమైన తిరువయ్యూరు. తండ్రి నీలకంఠశాస్త్రి సంస్కృత నిలయంగా పేరొందిన ప్రాంతీయులు. వారందించిన ఉత్సాహంతో సంగీత నాట్య కళా ప్రదర్శనలతో దూసుకెళ్లిందామె. మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవ సభావేదికపైన ఒక అపురూప ప్రదర్శనను చూసి తన్మయురాలైంది. మొట్టమొదట తానే ప్రదర్శన ఇచ్చినప్పుడు, కళారాధకుల ముందు మనోహరంగా నర్తించినప్పుడు ఆమెకి 30 సంవత్స రాల వయసు. అసంఖ్యాకుల ప్రశంసలందుకున్న గొప్ప కార్యక్రమం అది. అప్పటి నుంచీ తన జీవితం మలుపు తిరిగింది. వివాహమయ్యాక దంపతులు ఐరోపా దేశాల్ని పర్యటించారు. ఎన్నెన్నో కళా రూపాలను కూలంకషంగా అవగతం చేసు కున్నారు. ఈ అధ్యయనం, పరిశోధనలు కళాక్షేత్ర ఆవిర్భావానికి మూలమయ్యాయి. పలు రూపకాలను ఆవిష్క రించారు రుక్మిణీదేవి. శ్రీరామ పట్టాభిషేకం, గీతగోవిందం, కుమార సంభవం – వాటిల్లో కొన్ని. కళారూపాలు తరతరాలూ కొనసాగాలన్న తపన ఆమెతో ఎన్నో పనులు చేయించింది. తన క్షేత్రంలో వృత్తి విద్యలు, దేశవాళీ పరిశ్రమల స్థాపన, నిర్వహణకూ తగినంత ప్రాధాన్యమిచ్చారు. విద్య, శిక్షణ, ప్రయోగాలతో నూతన ఒరవడికి ఆద్యులయ్యా రామె. థియోసాఫికల్ హైస్కూలు, మాంటెస్సోరీ స్కూలు, క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ – రీసెర్చి సెంటర్, కలంకారీ విభాగం… ఇవన్నీ కళాక్షేత్రంలో వెల్లివిరి శాయి. మ్యూజియం, గ్రంథాలయం, ఓపెన్ ఎయిర్ థియేటర్ వంటివెన్నో సేవలందించాయి. ఈ అన్నీ మనదైన సంస్కృతిని విస్తృత ప్రాచుర్యానికి తెచ్చాయి.
విశ్వకవి నుంచి ప్రశంస
మనోపరిజ్ఞానం, త్యాగచింతన, స్థిరమైన ఆలోచన-ఈ మూడూ రుక్మిణీదేవి ప్రధాన లక్షణాలు. అత్యున్నత పదవికి అవకాశం లభించినా, కళాసేవకే తొలి ప్రాముఖ్య మిచ్చారు. కళారంగానికి మన దేశంలో సరికొత్త రూపునివ్వాలన్న ఆమె కృషి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌ని ముగ్ధుల్ని చేసింది. శాంతినికేతన్, కళాక్షేత్ర… ఈ రెండింటినీ భారత దేశంలోని మహోన్నత ధామాలుగా అభివర్ణించిన వారున్నారు. ఆ నృత్య ప్రతిభాశాలినిని పారదర్శకతకు ప్రతీకగా భావిస్తారందరూ. శాస్త్రీయ సంగీతాన్ని పునరుజ్జీవింపచేసిన వారిలో ఒకరిగా పరిగణిస్తా రెప్పుడూ.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు, అక్కడి మేటి కళాకారిణితో పరిచయం పొందారు రుక్మిణీదేవి. ఆమే అన్నా పావ్లోవా. శాస్త్రీయ, ఆధునిక నృత్యరీతుల ఆధారంగా పరస్పరం ప్రభావితులయ్యారు. ఉభయుల సంభాషణలు, ప్రదర్శనలు సరికొత్త కళాసంస్కృతికి కేంద్రాలయ్యాయి. పలు నూతన ఆవిష్కరణలకి అవి దారితీశాయి. కళాక్షేత్రం నుంచి ప్రముఖులెందరో ఆవిర్భవించారు. వారంతా ప్రసిద్ధ నృత్యకారిణులుగా యశస్సు గడించినవారే. అందరినీ తీర్చిదిద్దిన ఆమె సంగీత నాటక అకాడమీ నుంచి ఎన్నో పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు. దేశాన్ని తీర్చిదిద్దిన వందమంది జాబితాలో చోటు సంపాదించుకున్నారు.
విలువల స్థిరీకరణ
భరతముని నాట్యశాస్త్రం ఆధారంగా రూపొందిన పక్రియలో వర్ణం, పదం, అలరింపు, తిల్లానా, మరెన్నో అంతర్భాగాలు. వీటికి తోడు చక్కని నియమ నిబంధనలెన్నో ఉన్నాయి. ఆ అన్నింటినీ నవీనతతో సమన్వయించి, రుక్మిణీదేవి నెలకొల్పిన విలువలు శిఖర సమానాలు. వ్యక్తిగా, నృత్యశక్తిగా నాడు కలిగించిన ప్రభావం నేటికీ కొనసాగుతూనే వస్తోంది. ఆదర్శానికి, ప్రతిభాసంపన్నతకీ రూపంలా భాసించే ఆమె పరిపూర్ణురాలు, స్ఫూర్తినందించిన ధన్యజీవని. సదా స్మరించి తీరాల్సిన మహిళామణి.
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్