– క్రాంతి

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా దురదృష్టవశాత్తు బ్రిటిష్‌వారు, మార్క్సిస్టులు రాసిన, చెప్పిన చరిత్ర పాఠాలే ఇంకా చదువు కుంటున్నారు మన పిల్లలు. ఈ వక్రభాష్యాల కారణంగా కొన్ని తరాలకు చారిత్రక వాస్తవాలు తెలియకుండా పోయాయి. దీన్ని సరిదిద్దే క్రమంలో భాగంగా మరుగున పడిన భారతీయ రాజుల చరిత్రలను వెలుగులోకి తెచ్చేందుకు ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమం యావత్‌ ‌దేశ ప్రజల దృష్టిని ఎంతగానో ఆకర్షించింది.

దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ నిర్వహించిన వినూత్న కార్యక్రమం ఇది.

కేంద్ర విద్యామంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌హిస్టారికల్‌ ‌రీసెర్చ్ (ఐసీహెచ్‌ఆర్‌) ‌ఢిల్లీలోని లలితకళా అకాడమీలో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 6 వరకూ నిర్వహించిన ఈ ప్రదర్శన దేశంలోని మేధావులు, చరిత్రకారులు, ప్రముఖుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. ‘ద గ్లోరీ ఆఫ్‌ ‌మెడీవల్‌ ఇం‌డియా: మానిఫెస్టేషన్‌ ఆఫ్‌ ‌ది అన్‌ ఎక్స్‌ప్లోర్డ్ – ఇం‌డియన్‌ ‌డైనాస్టీస్‌, 8-18‌వ శతాబ్దాలు’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్‌ ‌రాజ్‌కుమార్‌ ‌రంజన్‌ ‌సింగ్‌ ‌ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మధ్యయుగంలో మనదేశంపై క్రీ.శ. 712లో మహ్మద్‌బిన్‌ ‌ఖాసిం దాడితో ప్రారంభమైన విదేశీ దురాక్రమణదారుల పాలనా కాలం నుంచి 18వ శతాబ్దంలో మొగలుల పాలన అంతమై బ్రిటిష్‌వారి (ఈస్టిండియా) పాలన మొదలయ్యే వరకూ కొనసాగిన స్వదేశీ రాజులు, వారి పాలనా వైభవాన్ని వెలుగులోకి తీసుకురావడం. 50 మంది భారతీయ రాజుల చరిత్రను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు.

ఈ ప్రదర్శనలో గజనీ, ఘోరీ, ఖిల్జీ, బహమనీలు, మొగలులు, కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీ తదితర రాజులు, వంశాల ప్రస్థావన ఎక్కడా కనిపించలేదు. ఇందుకు కారణం ఏమిటి? ఈ ప్రదర్శన గురించి ఐసీహెచ్‌ఆర్‌ ‌సభ్య కార్యదర్శి ప్రొఫెసర్‌ ఉమేష్‌ అశోక్‌ ‌కదమ్‌ ‌చాలా స్పష్టంగా చెప్పారు. ఇది భారతీయ రాజవంశాలను పరిచయం చేయడానికి ఏర్పాటు చేసినది మాత్రమే. ఇస్లామిక్‌ ‌రాజవంశాలు నిస్సందేహంగా భారతీయ చరిత్రలో భాగమే. కానీ మొఘల్‌, ‌బహమనీ, ఆదిల్షా తదితర ముస్లిం రాజవంశాలు భారతదేశానికి చెందినవి కాదు. ఇవన్నీ విదేశాల (మధ్య ప్రాచ్యం) నుంచి వచ్చిన దురాక్రమణదారులవి. కాబట్టి వారిని భారతీయ రాజవంశాలుగా పరిగణించలేం. మధ్యయుగంలో మనదేశంపై దండెత్తిన ముస్లిం, క్రైస్తవ పాలకులకు భారతీయ సంస్కృతితో సంబంధం లేదు. ఈ దురాక్రమణదారులు ఇక్కడి నాగరికతను, విజ్ఞానాన్ని నాశనం చేశారని కదమ్‌ ‌వ్యాఖ్యానించారు.

కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్‌ ‌రంజన్‌సింగ్‌ ‌మాట్లాడుతూ వలసవాద దృక్పథాన్ని తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును గుర్తుచేశారు. ‘ఆజాదీ (స్వేచ్ఛ) నుంచి స్వరాజ్యం (స్వపరిపాలన) వరకు ప్రయాణంలో మనం చరిత్రను శుద్ధి చేయాలి’ అని రంజన్‌ ‌సింగ్‌ ‌తెలిపారు. ఈయన మణిపూర్‌కు చెందినవారు. ఈ ప్రదర్శనలో ఆ రాష్ట్రానికి చెందిన నింగ్‌ ‌థై రాజవంశ చరిత్ర కూడా కనిపించడంపై ఆయన ఆనందం వ్యక్తంచేశారు. తమ రాష్ట్రంలోని వారికి మాత్రమే తెలిసిన ఈ వంశ చరిత్ర దేశ ప్రజలంతా తెలుసుకునే అవకాశం దక్కిందన్నారు.

ఈ ప్రదర్శనలో మరాఠా, సిక్కులు, మైసూర్‌, ‌చేర, చోళ, పాండ్య, అహోం, రాథోర్‌, ‌యాదవ, కాకతీయ తదితర రాజవంశాల పాలన, ఈ వంశాల వ్యవస్థాపకులు, రాజధానులు, పాలించిన రాజులు, వారి పాలనా కాలాన్ని ప్రస్తావించారు. వారి పాలనా కాలంలో భారతీయ సంస్కృతి, వాస్తుశిల్పం, కళ ఏ విధంగా వైభవోపేత స్థితిని అందుకున్నాయో తెలుసుకునే అవకాశం లభించింది.

దేశవ్యాప్తంగా ప్రదర్శనలు

ఈ ప్రదర్శనలను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, విశ్వవిద్యాలయాలు, విద్యాలయాల్లో ఏర్పాటు చేస్తామని ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌హిస్టారికల్‌ ‌రీసెర్చ్ ‌వర్గాలు తెలిపాయి. రాబోయే ప్రదర్శనల్లో ముస్లిం రాజవంశాలను చేర్చాలనే ప్రతిపాదనను ఐసీహెచ్‌ఆర్‌ ‌తిరస్కరించింది. దీనిని హిందూ రాజవంశాలు, హిందూ సాంస్కృతిక వారసత్వానికి పరిమితం చేయాలని నిర్ణయించింది. అయితే, ప్రదర్శన నుంచి ముస్లిం రాజవంశాలను మినహాయించాలనే నిర్ణయం విమర్శలు, వివాదాలకు దారితీసింది. భారతదేశ చరిత్రపై హిందూ దృక్పథాన్ని ఐసీహెచ్‌ఆర్‌ ‌ప్రోత్సహిస్తోందని కొన్ని వర్గాలు ఆరోపించాయి. ఇది హిందూ భారతదేశం మాత్రమే అనే భావనను శాశ్వతం చేస్తుందని విమర్శకులు అంటున్నారు. అయితే చరిత్రలో జరిగిన పొరపాట్లను సరిచేసే క్రమంలో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికతల్లో భారతదేశం ప్రధానమైనది. పాశ్చాత్యులు ప్రామాణికంగా తీసుకున్న క్రీస్తు పూర్వానికి ముందే ఎన్నో రాజవంశాలు మన దేశాన్ని పాలించాయి. యూరప్‌లో ఆధునిక ప్రజాస్వామ్యానికి నాందిగా మాగ్నాకార్టా గురించి గొప్పగా చెప్పుకుంటారు. మన దేశంలో గణతంత్ర రాజ్య వ్యవస్థ అంతకన్నా గొప్పది. కౌటిల్యుని అర్థశాస్త్రం చదివితే దీన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు. మనదేశంపై లెక్కలేనన్ని విదేశీ దండయాత్రలు జరిగాయి. అయినప్పటికీ మన ధర్మం, సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నాం. ఎన్నో విదేశీ నాగరికతలు, సంస్కృతులు మనలో కలిసిపోయాయి.

ఎప్పుడైతే మన దేశంపై మత ఆధారిత దండయాత్రలు మొదలయ్యాయో, అప్పటి నుంచే మన ధర్మానికి సవాళ్లు మొదలయ్యాయి. గజనీ మహ్మద్‌, ‌మహ్మద్‌ ‌ఘోరీ తదితర ఇస్లాం దురాక్రమణదారులు మనదేశ సిరిసంపదలను కొల్లగొట్టుకు పోవడంతో పాటు ఎన్నో ఆలయాలు, దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. దేశంలో ఇస్లాం సామ్రాజ్యాన్ని వ్యాపింపజేశారు. మొగల్‌ ‌వంశపాలన వీటన్నింటికీ పరాకాష్ట. ఈ దురాక్రమణలను తట్టుకొని ఎన్నో హిందూ రాజ వంశాలు మనదేశాన్ని పాలించాయి. అయితే ఇవేవీ పెద్దగా మన చరిత్రలో కనిపించవు. గజనీ, ఘోరీ, ఖిల్జీ, మొగల్‌ ‌పాలన గురించి మన పాఠ్యపుస్తకాల్లో గొప్పగా చెబుతారు. అక్బరు, ఔరంగజేబు గురించి చదువుకున్నంత గొప్పగా శివాజీ, రాణాప్రతాప్‌, ‌లాచిత్‌ ‌బర్ఫుకన్‌ (అస్సాం), రాజరాజ చోళుడు, కర్నీదేవి (హిమాచల్‌), ‌రాజామార్తండవర్మ (కేరళ), రాణి దుర్గావతి (మధ్యప్రదేశ్‌) ‌చరిత్రలు కనిపించవు.

బ్రిటిష్‌వారి పాలనా కాలం నుంచే మనదేశ చరిత్ర వక్రీకరణకు గురైంది. విభజించు-పాలించు అనే కుటిల నీతిలో భాగంగా భారతదేశం ఏనాడూ ఐక్యంగా లేదని, చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న భూభాగాన్ని వారే ఏకంచేశారని చెప్పుకొచ్చారు. ఆర్య-ద్రవిడ అనే కల్పిత సిద్ధాంతాన్ని మన చరిత్ర మీద రుద్దారు. ఎందరో విదేశీ పాలకులు మనదేశానికి వచ్చి మనకు నాగరికతను నేర్పించారని, ఐక్యంగా నిలిపారని కట్టుకథలు అల్లారు. విదేశీ దురాక్రమణదారులైన రాజులు, రాజవంశాలు, వారి పాలనా విశేషాల గురించి చరిత్రలో గొప్పలు చెప్పారు. కానీ స్వదేశీ రాజవంశాలు, రాజులు, యోధుల గురించి అంతగా రాయలేదు. ముఖ్యంగా మొగల్‌ ‌సామ్రాజ్యం గురించి గోరంతను కొండంతగా చూపిస్తారు. అక్బర్‌ ‘‌ది గ్రేట్‌’ అని చెబుతారు. ఔరంగజేబును కూడా చాలా గొప్ప చక్రవర్తిగా అభివర్ణించారు. కానీ మొగలుల కాలంలో హిందువులు ఎదుర్కొన్న కష్టాలను గురించి చెప్పలేదు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాతైనా చరిత్రను మనదైన జాతీయ దృష్టికోణంలో రాసుకోవాల్సింది. కానీ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ ‌నెహ్రూ పుణ్యమా అని మన విద్యారంగం, చరిత్ర అధ్యయనం మీద మార్క్సిస్టు మేధావుల పెత్తనం మొదలైంది. వీరు చరిత్రను పూర్తిగా వక్రీకరించి మసిపూసి మారెడు కాయను చేశారు.

కేంద్రంలో అటల్‌ ‌బిహారి వాజపేయి నేతృత్వంలో తొలిసారి జాతీయవాద ప్రభుత్వం ఏర్పడినప్పుడు విద్యారంగంలో సంస్కరణలు తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే విద్యను కాషాయీకరిస్తున్నారంటూ కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ ‌గగ్గోలు పెట్టారు. తర్వాత కాలంలో బీజేపీ అధికారంలో లేకపోవడంతో ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. ప్రస్తుతం కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉంది. దీంతో ధైర్యంగా ప్రక్షాళన మొదలు పెట్టింది. నిజమైన చరిత్రను దేశ ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహించారు.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE