ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
పరభాషా పదముల కర్థము తెలిసినంత మాత్రమునఁ బరభాషా పాండిత్యము లభించినదని భ్రమపడకుఁడు.భాషలోని కళను బ్రాణమును తత్త్వము నాత్మను గనిపెట్టవలయును. అది మీ కసాధ్యము. తుద కిన్ని యీనాములనమ్మి – యమ్మమెడలోని పుస్తెపూసలమ్మి – వంట యింటి పాత్రల నమ్మి – దైన్యపడి- వారములు చేసికొని – ముష్టియెత్తి సంపాదించిన – యాంగ్లేయ భాషలోని పాండిత్యపుఁబన యీ రంగులోనికి దిగినది. ఈ విధముగా బ్రద్దలైనది. స్వభాష యిదివరకు మీ చేతఁ జావనే చచ్చినది. మీ గతి యెంత యుభయ భ్రష్టమైనదో చూచు కొంటిరా? మీరు వెచ్చించిన ధనములోఁ బడిన శ్రమములో వినియోగపఱచిన కాలములోఁ, బొందిన దైన్యములో, నేడ్చిన యేడ్పులలోఁ, బదునాఱవ వంతైన నక్కఱ లేకుండ మీరు దేశభాషా పండితులై యుందురు. స్వభాషను మీరు నేర్చుకొనుట కేమంత శ్రమమున్నది? అక్షరాభ్యాస దినమునుండియె మీరు స్వభాష నభ్యసించు చున్నారని యనుకొనవలదు. మీ తల్లి కడుపులో నున్నప్పుడే నేర్చుకొనుట మొదలు పెట్టినారు. ఆమె భుజించిన పదార్థముల రసమును నాభీనాళ ద్వారమున మీలోఁ బ్రవేశపెట్టుచున్నప్పుడే యాంధ్ర భాషా జ్ఞానమును గూడ దానితో జోడించినది. తరతరముల నుండి వంశాను క్రమముగా మీ రక్తమలో జీర్ణమై, మీ మాంసమునకు మాంసమై, శల్యమునకు శల్యమై, మెదడుకి మెదడై, మీ తత్త్వముతో నైక్యమొందిన యాంధ్రభాషను, మీరిప్పుడు క్రొత్తగ నేర్చుకొను టయేమి? ఉపాధ్యాయుఁడైన నక్కఱ లేకుండ గ్రంథము లూరక చదువుకొనుచుఁబోయిన యెడల భాషా జ్ఞానసంపాదన మీ కెంతసేపు? నాకాంధ్రభాష రాదని మన యధ్యక్షుఁడు కంఠోక్తిగాఁ బలికినాఁడు. మా భాష మాకు రాదను ననర్హవాక్య మాంధ్రుని నోట నుండి వెడలఁదగదు. ఏ జాతి వారి నోటి నుండియు నంతే-ఆంధ్రదేశమున పుట్టి యెంత కాలమైనదో, ఇట్టి యనుచిత వాక్యము నేఁడు బయలువెడలినది. అనుచిత మనుమాట నిస్సందేహము. పోనిండు దీనికేమి? అనుచితకు – నసందర్భతకు -నవకతవకకు ననేక సంవత్సర ముల నుండి యలవాటుపడియే యున్నాము. భాష మీకు రాదేమి? అబ్బా! మీరే ప్రయత్నము చేసినా రని రాదనుచున్నారు? భాష తనంత తాను మీకు వచ్చుననియే యనుకొనుచున్నారా? మహమ్మదుగారి యెద్దకుఁ గొండ రాకపోయినప్పుడు మహమ్మదు గారు కొండ యెద్దకు వెళ్లినారా లేదా? మీకు భాష రాకపోవుట భాష లోపమా? మీ లోపమా? భాషను గొంచెము దీక్షతోఁ బఠించిన యెడల నది రానివాఁ డుండునా? పఠింపకుండ భాష రావలయునన్న నది పైపైన నున్నదా? భాష యందు మీకు నిర్లక్ష్యత యైనప్పుడు భాషకు మీ యందభిమానముండునా? భాషా గ్రంథము మీకుఁ దలక్రింద నెత్తునకైనఁ బనికిరానప్పుడు భాషా జ్ఞానము మీ తలలో నెట్లు దూరును? చదివినను భాష రానివాఁడెవ్వండు? ఎవ్వఁడో, వ్రేలు మడఁచి యొక్కని పేరెత్తి చెప్పుఁడు. భాషలోఁ బుట్టి భాష నేర్చుకొని భాషరాక భ్రష్టుఁడైన ప్రపంచాతీతపురుషుఁ డెవ్వఁడో చూతము. చూచి యథార్థముగ స్వభాషా జ్ఞానమున కర్హుఁడు కాని యద్భుతాజ్ఞానతత్త్వమే యగునెడ- నన్నయ భట్టుకాలము నుండి యిప్పటి వఱకున్న భాషా గ్రంథములన్నియుఁ గట్టకట్టి బంగాళా ఖాతములోఁ బాఱవే యుదము. మనకు రానిభాషతో మనకేమి పని? అయ్యయ్యో? రవంత కష్టమైనఁ బడనక్కఱ లేదా? నోరు మెదపనైన నక్కఱలేదా? ‘క్రిమినల్ ప్రాసీజర్కోడ్’ చేతఁ బట్టకుండనే మన యధ్యక్ష శిరోమణికి శిక్షాశాస్త్ర సిద్ధి యయినదా? ‘ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ’ ఆక్టు తలఁగొట్టుకొని వల్లెవేసిన వారే – తారాశశాంక విజయము రవంత చదువలేరా? సరదా తీరును. శబ్దజ్ఞానము వచ్చునే – ఊరకే రమ్మన్న నేదైన వచ్చునా? అట్లెవ్వనికైన వచ్చినదా? కడుపు నిండుటకు నోటిలోఁ బడినదానిని మ్రింగనైన వలదా? అమాత్రపు శ్రమమైనఁ బడనక్కఱ లేదా? ‘మెయిన్సు పీనల్కోడ్’ మడత వేయుటలో మెదడు చింపుకొన్న వాఁడవే- మనుచరిత్రమున నొక్క యాశ్వాసమును విలాసము కొఱకైనను జదువుటకు నీ కోపిక లేకపోయెనా? తీరిక లేకపోయెనా? శక్తి లేకపోయెనా? బుద్ధిలేకపోయెనా? చంద్రబుల్లి నామూలాగ్రముగ నెఱుఁగుదువుకాని చంద్రమతి పేరైన నెఱుఁగవే! ‘కన్హింగ్హామ్సు ఎవిడెన్సు’ ఆక్టు వలన నీకడుపే నిండునుగాని కంకంటి వారి రామాయణము వలన నీ మనస్సు నిండునే! ‘జస్టిసు హాలోనే’గారి జడ్జిమెంటు నొప్పఁజెప్పఁగలవు కాని జనకచక్రవర్తి ప్రపంచమునకు బోధించిన నీతి నెఱుఁగవే? ‘సివిల్ ప్రాసీజర్కోడు లేటెస్టు ఎడిషన్’ కుఁ గర్త యెవ్వఁడో యెఱుఁగుదువుకాని సీతా రామాంజనేయ కవి యెవఁడో యెఱుఁగవే? భారత భాగవతములను బఠింపని నీవు బారిష్టరు వైననేమి – ప్రభూత్తముఁడ వైననేమి? ఆంధ్రుడవై యేల పుట్టితివోయి నాయనా! నీవాంధ్ర దేశయన కెందులకోయి నాయనా. నాకు బోధపడక యడుగు చున్నాను. క్షమింపుము. నీవే పుస్తకములను జదువనక్కఱలేదు. దినమున కొక్కసారి పావుగంట తెఱపిచేసికొని రాత్రి భోజనమైన తరువాత నిల్లాలిని బిల్లలను నీ చుట్టు కూరుచుండఁబెట్టుకొని తాంబూల చర్వణ మాచరించుచు నడుమ నడుమ నాన్కో ఆపరేషను ముచ్చటలఁజెప్పుకొనుచు నాంధ్రపత్రికను జదుపరాదా? నాలుగు మాసములట్లు చదువుము. నాకాంధ్ర భాషా జ్ఞానమెంత వృద్ధియగునో తెలుఁగుబాసలో నేదైనపస యున్నదని నీ కప్పటికిఁ దెలిసినయెడల భాషా గ్రంథములను జదువవచ్చును. అందఱు తెలుఁగు మాటలాడవలసిన యిందఱలో నీ వొక్కఁడ నింగ్లీషుతో మాటలాడితివి! కావుకావు మని యనవలసిన కాకులన్నిటిలో నొక్క కాకి కొక్కొరకో యని యఱచినయెడల మిగిలిన కాకులు దానిని ముక్కుతోఁ బొడిచివేయక మానునా? మేము నీవంటి యనేక ప్రకృతుల కలవాటు పడినవారము కావున సరిపోయినది. కాని లేకున్న నేమి కాఁదగినది? ఆంగ్లేయభాష యేల చదువుకొంటివని నే నధిక్షేపింపను. ఇంతకన్న నధిక జ్ఞానమును గూడ నీ వాభాషలో సంపాదింపుము. నాకు మరింత యిష్టము కాని నీయాంగ్లేయభాషా జ్ఞాన మెందులకో నీ వెఱుఁగుదువా? ఆంగ్లేయభాషయే కాదు, ఇంక ననేక భాషలు కూడా నేర్చుకొనుము. నీవు సంపాదించిన పరభాషాజ్ఞానమంతయు నీ భాష నభివృద్ధి పఱచుటకే. నీ భాషను భాగ్యవత్తరమును జేయుటకే- నీ భాషను బరభాషాగ్రంథ ప్రశస్తాభి ప్రాయములతో వన్నెపెట్టుటకే – అంతకంటే వేరు కాదే. ఆంధ్రభాషలో అ ఆ లకంటే నవతలి యక్కఱము లెరుఁగని వాఁడవు కదా! ఆంధ్రుఁడవై యుండియు నాంధ్రభాషలో ‘ఆ’ యని నోరు మెదలుపలేనివాఁడవు కదా! నీ యాంగ్లేయ భాషా జ్ఞానమును దేశమున కెట్లు పచరింపఁ దలఁచితివో చెప్పుము. నాయనా! నిన్ను గ్రంథములు వ్రాయమని కోరుచున్నా ననుకొంటివేమో? నీవు వ్రాయునదేమి? పార్టీలనెత్తిన పేఁడ- ఏ గ్రంథము నీవు వ్రాయవలదు. ఏ గ్రంథమును జదువవలదు. రేపటి నుండియే యాంధ్రపత్రిక నామూలగ్రముగఁ జదువుచుండుము. తెఱపిలేదని సందేహించుచుంటివా? క్లబ్బులో గంటన్నర చీట్లాటకుఁ దెఱపియుండుఁగా, టెన్నిసు కోర్టులో రెండు గంటలు లోకాభిరామాయణమునకుఁ దెఱపియుండుఁగా, దేశభాషా పత్రికా రాజమును జూచుట కొక్క యరగంట తెఱపిలేకుండునా? తెఱపి లేకపోయినయెడలఁ జేసికో.
నాయనలారా! మన కింగ్లీషు మాటలతోఁ జెప్పినఁగాని యే యంశము కూడ మనస్సున కెక్కదు. అట్టి యభ్యాసము చిరకాలము నుండి యస్థిగత రోగమైయున్నది. ఆయుర్వేదవైద్యుఁడు వచ్చి ‘‘అయ్యా కరివేపాకు పొడుముతోఁబథ్యము పుచ్చుకొనుమని నీతోఁజెప్పఁగ నీ కామాట నచ్చదు. నానెన్సున్సు, కరివేపాకుపాడు మెందులకయ్యా యని నీ వా యాయుర్వేదవైద్యు నధిక్షేపింతువు. ధనియాలు ‘డైజేషన్‌కు’ మంచివి. మిరియాలు ‘లివర్’ మీద ‘ఆక్టు’ చేయును. కరివేపాకు ‘గాల్ బ్లాడర్’కు సత్తువ నిచ్చునని యెనఁడో ఎల్.ఎం.పి. మనవాఁడే చెప్పిన యెడల నీ కది శ్రుతిప్రమా ణము. నాయనలారా! మనమెంత లక్షాధి పతులమైనను గోటీశ్వరులమైనను మన బ్రదుకులు ముష్టి బ్రదుకులు కాని మఱియెకటి కాదు. ఈ ముష్టిదేవులాటలో నింగ్లీషు మాటలు కూడా నెందులకు? ఆ యేడుపేదో మాతృభాషతోడనే యేడ్చిన మంచిది కాదా? మన యేడుపు సహజముగాను సాపుగాను స్వతంత్రముగా నుండునే. ఏడుపులోఁ గూడ మన కస్వతంత్రత యేమి కర్మము? అందుకు సర్వస్వతంత్రులము సంపూర్ణాధికారులమే కదా? ముష్టి బ్రాహ్మణుఁడు నీ యింటికి వచ్చి యాయావరపు బ్రాహ్మణుఁడి నయ్యాయని యఱవక ‘‘బాయ్ రూములోనున్న పాట్‌లో రైస్ యేమైన నున్నదేమో, కైన్ డ్లీగెటిట్ హియర్; థాంకు యూ ఇన్ ఆంటిసిపేషన్’’ అని నీతో సంభాషింపఁగ, వాతనికి ముష్టి వేయుదువా? మూఁతిమీఁద నీడ్చి యొక్కటి వేయుదువా? అలాగే మన ముష్టిలోని యీ ఇంగ్లీషు మాటలు కూడనంత గౌరవప్రదములే యని నిశ్చయముగా నమ్ముఁడు – నమ్ముఁడు.
పానుగంటి లక్ష్మీనరసింహారావు ‘సాక్షి’ వ్యాసాలలోని ‘స్వభాష’లో కొన్ని మెరుపులు