సినిమాల పట్ల ఆసక్తి, అవగాహన లేకపోయినా ‘గాలివాటు గమనం’లా శబ్దగ్రాహక విభాగంలో చేరి, అనంతర కాలంలో తెలుగు వారి సినీ సాంస్కృతిక వైభవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు కాశీనాథుని ‘విశ్వ’నాథుడు. ‘గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత జీవితపు చౌరస్తాలో నిలబడ్డాను. ఎటు వెళ్లాలో, ఏం చేయాలో తెలీని సందిగ్ధం. మా మేనమామ సలహాతో వాహినీ స్టూడియోలో సౌండ్ విభాగంలో ఇంజినీర్‌గా చేరాను. అప్పటికి సినిమా పట్ల నాకెలాంటి అభిప్రాయమూ లేదు. నా ప్రయాణం గాలివాటు గమనంలా మొదలైంది’ అని తమ ‘ఆత్మగౌరవం’ స్వర్ణోత్సవ వేళ ఒక ముఖాముఖీలో చెప్పారు. ఆ ‘గాలివాటు’ పయనమే గగన వీధులలో తెలుగు సినిమా కీర్తిని రెపలాడించింది. అయితే ఆ విజయంలో ఇరవై శాతమే స్వయం కృషి అని, మిగతాది దైవానుగ్రహమని చెప్పేవారు.
తెలుగు చలనచిత్ర ప్రస్థానంలో విశ్వనాథ్‌ది ప్రత్యేక స్థానం. గురువు (ఆదుర్తి సుబ్బారావు) మెచ్చిన శిష్యుడు. భవిష్యత్‌లో ఆణిముత్యాలు, మణిహారాలు లాంటి సినిమాలు అందిస్తాడని ఆదుర్తి ఆనాడే ఊహించినట్లున్నారు. సొంత సినిమా ‘మూగ మనసులు’కు రెండవ యూనిట్ దర్శకుడిగా స్వతంత్రంగా కొన్ని సన్నివేశాలు తీసే అవకాశం ఇచ్చారు. తన సృజనతో ఆ అవకాశాన్ని సద్విని యోగం చేసుకున్నారు శిష్యుడు. ఆదుర్తి తీసిన ఇతర చిత్రాలకు సహకార దర్శకుడిగా వ్యవహరించారు. ఆదుర్తి స్వీయ సమర్పణలోని ‘ఉండమ్మా బొట్టు పెడతా’కు దర్శకత్వం అవకాశం కల్పించారు.
‘ఆత్మగౌరవం’ దర్శకుడిగా ప్రస్థానం ప్రారంభించిన దాదాపు దశాబ్ద కాలం అంటే.. ‘సిరిసిరి మువ్వ’ వరకు కుటుంబం, అనుబంధాలకు ప్రాధాన్యమిస్తూ విజయవంతమైన సినిమాలు తీసిన విశ్వనాథ్ పంథా మారింది. స్వతః తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, కళలను ఇష్టపడే ఆయన చిత్రాలలో వాటికి అవకాశం ఉన్నంత వరకు స్థానం ఇచ్చేవారు. ‘సిరిసిరి…’ నుంచి ఆయన దృష్టి పూర్తిగా ‘కళాత్మకత’ వైపునకు మళ్లింది. మన సంప్రదాయాలు, కళా వైభవాన్ని చాటాలన్న తపనకు ఆ సినిమా అంటుకడితే ‘శంకరాభరణం’ పందిళ్లు వేయించింది. (ఆ చిత్రం విడుదలైన ఫిబ్రవరి 2వ తేదీనే శివైక్యం చెందడం కాకతాళీయం కావచ్చు).
అయితే కళాత్మక సినిమాలు తీయడానికి ‘హార్దిక’ ధైర్యం కంటే ‘ఆర్ధిక’ దన్ను ఉండాలి. అలాంటి నిర్మాత(లు) దొరకాలి. వారు దర్శకుడిని విశ్వసించాలి. కొందరు నిర్మాతలు తమను కలసినప్పుడు ‘నా దర్శకత్వంలో సినిమాలా? నష్టపోతారు.. ఆలోచించుకోండి’ అని సూచించేవారు విశ్వనాథ్. దర్శక నిర్మాతలది భార్యాభర్తల సంబంధం లాంటిది. ఇద్దరి మధ్య సమన్వయంతోనే ఉత్తమ చిత్రాలు రావడానికి అవకాశం ఉంటుంది. సినిమా వ్యాపారమే అయినా, లాభనష్టాల గురించి అంతగా పట్టింపులేని నిర్మాత(లు) తోడైతే ఉత్తమ చిత్రాలు రావడానికి అవకాశం ఉంటుంది. సాంకేతిక నిపుణులకు సృజన ఉంటేనే సరిపోదు. దానికి పదునుపెట్టి, వెలికి తీయగల నిర్మాతలూ అవసరమే. ఈ విషయంలో విశ్వనాథ్ చాలా వరకు విజయం సాధించారనే చెప్పాలి.
మొదటి చిత్రంతోనే ‘నంది’ని గెలుచుకుని, అదే పురస్కారాన్ని వరుసగా అందుకున్న కాశీనాథుని ‘నందుల’ విశ్వనాథ్ అని ప్రముఖ హస్యనటుడు అల్లు రామలింగయ్య మెచ్చుకోలుగా అనేవారు. వెండితెరకు అపురూప చిత్రాలను అందించిన ఆయన టీవీరంగం ప్రవేశం కొద్దిలో తప్పిపోయింది. ‘సర్వ మంగళ’ అనే ధారావాహిక నిర్మాణానికి సిద్ధమయ్యారు. కానీ మరో దర్శకుడు ఇదే పేరుతో తీయాలనుకోవడంతో విశ్వనాథ్ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. తీరా అటు ఆ వ్యక్తి కూడా దానిని తీయలేకపోయారు. ‘అన్నమయ్య’ మరో దర్శకుడు రాఘవేంద్రరావు నుంచి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బాపు, బాలచందర్ దర్శకత్వ ప్రతిభకు అబ్బురపడి ‘వారి దగ్గర సహాయ దర్శకుడిగా పని చేయాలని ఉంది’ అనడం విశ్వనాథ్ ‘ఒదుగుదల’ లక్షణానికి గుర్తు.
పిలకా గణపతి శాస్త్రి ‘విశాల నేత్రాలు’ నవలకు వెండితెర రూపం ఇవ్వాలన్న కల సాకారం కాలేదు. ఇటీవలే కాలం చేసిన నటనిర్మాత కృష్ణంరాజు విషయమై చాలా ఏళ్ల క్రితం విశ్వనాథ్‌తో పాటు బాపుతోనూ చర్చలు జరిపారు. కారణాంతరాల వల్ల కార్యరూపం దాల్చలేదు. విశ్వనాథ్ ‘స్వయంకృషి, అల్లుడు పట్టిన భరతం’ చిత్రాలను హిందీలో నిర్మించాలనుకున్నారు. కళాత్మక కథలకు అగ్రతాంబూలమిచ్చిన ఆయన పౌరాణికాలు, బయోపిక్‌ల జోలికి వెళ్లలేదు. ‘రామాయణ, భాగవత, భారత గాథాల ఆధారంగా నా సినిమాలకు కథలు అల్లుకోలేదు. ఆ అంశాల పట్ల నిష్ణాతులు ఉన్నప్పుడు వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిదనుకున్నాను’ అని చెప్పేవారు. ధ్రువీకృత, పారదర్శక సమాచారం లేకుండా బయోపిక్‌లు తీయడం సబబు కాదన్నది ఆయన భావన. అందుకే సంగీత విద్వన్మణి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి కథను ‘విదుషీమణి’ పేరుతో సినిమా చేయాలనుకునీ విరమించుకున్నారు. ‘సరైన అవగాహన లేకుండా, అందుబాటులోని అస్పష్ట వివరాలతో కల్పితాలకు పోతే చరిత్రకు అన్యాయం చేసిన వాళ్లమవుతాం. అందుకే ఆ ప్రతిపాదనను పక్కన పెట్టాను’ అని ఒక సందర్భంలో చెప్పారు.
సాహిత్య సంగీతాల పట్ల ఆసక్తి గల ఆయన తన చిత్ర రచయితలు, గీతకర్తలతో తన భావాలను పంచుకునేవారు. వారికి కొన్ని పల్లవులు రాసి చూపేవారు. అలా ఆయన మది నుంచి వచ్చిన ఎన్నో పదాలు, పల్లవులు పాటలుగా రూపుదిద్దుకున్నాయని, అదే ‘రిప్లక్సెస్’అని వేటూరి సుందరరామమూర్తి అనేవారు. ‘ఆయన గీతరచనకే పూనుకుని ఉంటే ప్రముఖ సినీకవిగా గుర్తింపు పొంది ఉండేవారు’ అనీ వ్యాఖ్యానించారు.
వేటూరి, సిరివెన్నెలలు ఆయన సినిమాలకి సరిగ్గా సరిపోయిన గీతరచయితలు. ఆయనలో రచయిత, కవితో పాటు ‘ఎప్పుడు జరిగింది?’ అని కమల్ హాసన్ పాత్రతో అనిపించిన మాట (శుభసంకల్పం) ఆయనలో గొప్ప నటుడు దాగున్నాడనే విషయం చాటింది. ఆ సినిమాతో, గంభీర పాత్రలకు మరో యస్వీ రంగారావు లభించాడని సినీ విమర్శకులు విశ్లేషించారు. విశ్వనాథుని కళా వైభవం గురించి ఎంత చెప్పుకున్నా కొంత మిగిలే ఉంటుంది. తెలుగువారి సాహిత్య సంగీతాత్మక కళాత్మక చిత్రాల బావుటాను అంతర్జాతీయ వినువీధులలో కళకళలాడించిన ఆ ‘కళాతపస్వి’కి కైమోడ్పులు.
– స్వామి