సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌  ‌ఫాల్గుణ శుద్ధ అష్టమి – 27 ఫిబ్రవరి 2023, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఆ మాటలు ముదిమితో బుర్ర చెడితే వచ్చిన సంధి ప్రేలాపనలు కావు. భారతదేశం మీద, ప్రధాని నరేంద్ర మోదీపై పన్నిన కుట్రలో అవొక భాగం. ‘మోదీ ఈ అంశం మీద మౌనం వహిస్తున్నారు. ఆయన విదేశీ మదుపరుల ప్రశ్నలకీ, పార్లమెంట్‌కూ సమాధానం చెప్పాలి’ అంటూ హంగేరీ మూలాలు ఉన్న అమెరికన్‌ ‌కోటీశ్వరుడు, వ్యాపారవేత్త జార్జ్ ‌సోరెస్‌ అడుగుతున్నారు. గౌతమ్‌ అదానీ వ్యవహారం పేరుతో సోరెస్‌ ‌దేశ వ్యవహా రాలలో మళ్లీ జోక్యం చేసుకున్నాడు. అంతేనా! కాసేపు రాజకీయ విశ్లేషకుడి అవతారం ఎత్తాడు. అదానీ వ్యవహారంతో ప్రభుత్వం మీద మోదీకి ఉన్న పట్టు సడలిపోతుందని తేల్చాడు. ఇలాంటి విషయాలు పెద్దగా తెలియవు అంటూనే ఇదంతా భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు దారి తీస్తుందని జోస్యం చెప్పాడు. కశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను పునరుద్ధరించాలని పట్టుపడుతున్నాడంటేనే సోరెస్‌ ‌తెంపరితనం ఏ స్థాయిలో ఉన్నదో అర్ధమవుతుంది.

 భద్రతా విషయాల మీద ఫిబ్రవరి 17న మ్యూనిచ్‌లో జరిగిన సమావేశంలో సోరెస్‌ ‌తన అక్కసంతా వెళ్లగక్కాడు. అదానీ మోసంతో భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటే ప్రపంచ స్థాయిలో భయం తప్పదనీ, పెట్టుబడి అవకాశాలు దాదాపు తుడిచిపెట్టుకు పోయినట్టేనని పిల్లి శాపనార్ధాలు పెట్టాడు. మోదీ, అదానీ సన్నిహితులు కాబట్టి వారి కర్మ ఫలితం కూడా ఒకే రకంగా ఉంటుందని మెట్ట వేదాంతం పలికాడు. ఏడాదికి ఒకసారి జరిగే మ్యూనిచ్‌ ‌సమావేశంలో ప్రపంచ భద్రత గురించి చర్చిస్తారు. సీనియర్‌ ‌రాజకీవేత్తలు, సైనికాధికారులు వస్తారు. ఆ వేదికపైన ఈ మిషనరీ కోటీశ్వరుడు ఇవన్నీ పేలాడు. అదానీ కంపెనీలకు వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్ ‌రిసెర్చ్ ‌నివేదిక జనవరి 24, 2023న వార్తలు బయటపెట్టినప్పటి నుంచి నిరంతరం వాటి షేర్లు పతనమవుతూనే ఉన్నాయి. అదానీ మదుపర్ల క్షేమం గురించి ఇంతగా బాధపడిపోతున్న సోరెస్‌ ఈ ‌పరిస్థితినీ సృష్టించాడన్న అనుమానాలు ఉన్నాయి.

వివాదాల పుట్ట ఓపెన్‌ ‌సొసైటీ ఫౌండేషన్స్ ‌సోరెస్‌ ‌స్థాపించినదే. ప్రజా స్వామ్యాన్నీ, పారదర్శకతనీ, భావ ప్రకటనా స్వేచ్ఛనీ ప్రతిష్టించే వ్యక్తులు లేదా సంస్థలకి భూరి విరాళాలు ఇవ్వడమే దీని పని. అలా పెద్ద దాత అన్న పేరు కూడా సోరెస్‌కి వచ్చింది. నాటి షాహీన్‌బాగ్‌ ‌తిష్టకీ, రైతుల అల్లర్లకీ ఖర్చులు ఇచ్చినది ఇతడే. నేటికీ ఒక వర్గం మీడియాకీ ఇతడి నుంచి విరాళాలు అందుతాయన్నదీ బహిరంగ రహస్యం. ‘జాతీయవాదం విస్తరించకుండా నిరోధిస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం’ అనేది ఇతడి నినాదం. న్యాయం, ప్రజాస్వామ్యం, మానవహక్కుల రక్షణ కోసం 120 దేశాలలో ఓపెన్‌ ‌సొసైటీ పని చేస్తోందని అంటారు. నిజానికి ఆ పేరుతో ఇతడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడన్నదే అసలు నిజం. పుతిన్‌ ‌మీద తిరుగుబాట్లు, యూరోపియన్‌ ‌యూనియన్‌లో విభేదాలు, అరబ్‌ ‌స్ప్రింగ్‌ ‌వరకు ఇతడి కనుసన్నలలోనే జరిగాయన్నది బహిరంగ రహస్యం. ఈ ప్రతిభను చూసే, ఓపెన్‌ ‌సొసైటీ సభ్యులని సంక్షోభాల ప్రతినిధులుగా పిలవడం మొదలైంది. థాయ్‌లాండ్‌, ‌మలేసియాల కరెన్సీ విలువ పతనం వ్యవహారం కూడా ఇతడిదేనని విమర్శ. పౌండ్‌ ‌విలువ పడిపోయిందని ప్రచారం చేసి బ్యాంక్‌ ఆఫ్‌ ఇం‌గ్లండ్‌ను ముంచి, సోరెస్‌ ‌కోటీశ్వరుడయ్యాడన్నదీ సత్యమే. ఆ సంక్షోభంలో ఇతడికి ఒక బిలియన్‌ ‌పౌండ్ల లాభం చేకూరింది. ఈ పాపాల చిట్టా చిన్నదేమీ కాదు.

జాతీయవాదం మీద పోరాటానికి బిలియన్‌ ‌డాలర్లు విరాళంగా ఇస్తానని 2020 నాటి దావోస్‌ ‌వరల్డ్ ఎకనమిక్‌ ‌ఫోరమ్‌ ‌సాక్షిగా సోరెస్‌ ‌వాగ్దానం చేశాడు. ఆ విరాళం బీజేపీని కూలదోయడానికేనని ఆ పార్టీ అంటున్నది. ఇది భారత్‌ ‌సార్వభౌమాధికారం మీద దాడేనని బీజేపీ విమర్శించింది. భారత ప్రజాస్వామ్య పక్రియలో జోక్యం చేసుకునే ప్రయత్నమేనని కూడా ఆరోపించింది. సోరెస్‌ ‌తాజా వాగుడుతో రూఢి అయినదేమిటి? ఇటీవలి కాలంలో ప్రతి పార్లమెంట్‌ ‌సమావేశాలకు ముందు రగులుతున్న రగడలు, మైనారిటీల స్థితిగతుల మీద వస్తున్న భాష్యాలు సోరెస్‌ ‌కుట్రలే. రఫెల్‌ ఒప్పందాన్ని పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌ ‌వెనుక ఉన్నది కూడా సోరెస్‌ ‌మనుషులే. భారత్‌ను అస్థిర పరచడం ఇతడి పరమధ్యేయం. భారత్‌లో సోరెస్‌ ‌సంస్థల ఉపాధ్యక్షుడు సలీల్‌ ‌శెట్టి రాహుల్‌ ‌వెంట భారత్‌ ‌జోడో యాత్రలో పాల్గొన్నాడు. చిత్రంగా సోరెస్‌ ‌ప్రకటనను కాంగ్రెస్‌ ‌కూడా ఖండించింది. ఇంతకాలం అవే మాటలు వల్లించి ఇప్పుడు ఖండించడం ఏమిటో మరి! సోరెస్‌ ‌ప్రజాస్వామ్యం కోసం నిలబడడం అంటే దావూద్‌ ఇ‌బ్రహీం శాంతిభద్రతలకు కట్టుబడి ఉంటానని చెప్పడం వంటిదే. ఇతడు లావాదేవీలలో ధనాన్ని వెదజల్లి స్టాక్‌ ‌మార్కెట్లను శాసిస్తాడు. రొహింగ్యాల చొరబాటుకు (భారత్‌లోకి) ప్రోత్సహిస్తాడు. పెద్ద పెద్ద మాటలు చెబుతూ ఇతడు పంపించే నిధులు ఆపడానికి హంగేరీ స్టాప్‌ ‌సోరెస్‌ ‌చట్టం చేసింది. ఆర్థిక ఉగ్రవాది అని ఇంగ్లండ్‌ అచ్చువేసింది. కానీ అదానీ మదుపర్ల శ్రేయస్సు కోసం ఇప్పుడు ఇతడు తెగ బాధపడిపోతున్నాడు.

ఎన్నికైన ప్రభుత్వాలను అల్లకల్లోలం చేయడం ఇతడి ప్రవృత్తి. ఆ విధంగా తనకు కావలసినవారికి అందలం అప్పచెబుతాడు. వాళ్లు ఎవరో కాదు, మిషనరీలు, వారి సానుభూతిపరులు. ఇతడి దానాలలో దానవగుణం ఎంతో గమనిస్తే చాలు, నిజం తెలుస్తుంది. 2014 నుంచి ఇతడు భారత్‌కు పంపిన నిధులు 11.9 మిలియన్‌ ‌డాలర్లని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీజే పాండా ఆరోపణ. ఈ కేటాయింపులలో 33 శాతం ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాలకి. అంటే, దేశాన్ని అల్లకల్లోలం చేసే పనికి. విద్యార్థి వేతనాలకి కేవలం 5 శాతం. అదీ దేవ రహస్యం!

About Author

By editor

Twitter
YOUTUBE