– డా।। పి.వి.సుబ్బారావు, రిటైర్డ్ ‌ప్రొఫెసర్‌

‌మహా వ్రవాహంలా సాగే ఉపన్యాసాల మాదిరిగా సాగుతాయి ఆ వ్యాసాలు. వందేళ్ల క్రితం రాసినవే అయినా నిన్నమొన్నటి సామాజిక, రాజకీయ పరిణామాలను కళ్లకు కట్టించేవిగా ఉంటాయవి. వాటి నిండా దట్టమైన వ్యంగ్యం. కానీ దేశీయత, స్థానీయతల కోసం ఆరాటం, మనవైన మూలాల కోసం అన్వేషణే ఆ వ్యంగ్యం నిండా ధ్వనిస్తూ ఉంటుంది. మాతృభాష పట్ల అకారణ వ్యతిరేకత, మనిషిలోని భేషజం, మూఢభక్తి… దురాచారాల మీద దండయాత్ర.. ఒకటేమిటి ఎన్నో అంశాలను  ఆవిష్కరించిన అద్భుత రచయిత పానుగంటి లక్ష్మీనరసింహా రావు. అపురూపమనిపించే ఈ తరహా వ్యాసంగానికి మూలమేమిటో కూడా బహిర్గతం చేసి, పానుగంటి తన నిజాయతీని నిరూపించుకున్న తీరు అద్భుతం. అలాగే  సమాజ మానసిక వికృతుల పట్ల తనకున్న అపార ఆవేదనకు ఆయన అక్షరరూపం ఇచ్చిన తీరు మహాద్భుతం. నాటక రచయితగా, అధిక్షేపాత్మక ‘సాక్షి’ వ్యాసాల కర్తగా, నటులుగా, ఆధునిక సాహిత్య చరిత్రలో పానుగంటి లక్ష్మీనరసింహారావు చిరస్మరణీయులు.

నాటి రాజమండ్రి తాలుకా సీతానగరంలో పానుగంటి (ఫిబ్రవరి 11, 1865- జనవరి 1, 1940) జన్మించారు. తండ్రి వేంకట రమణయ్య ఆయుర్వేద వైద్యులు. లక్ష్మీనరసింహారావు  రాజమండ్రి కళాశాల నుండి పట్టభద్రులయ్యారు. బీఏ ఇంగ్లిష్‌ ‌సాహిత్యంతో ప్రతిష్ఠాత్మకమైన మెట్కాఫ్‌ ‌స్వర్ణ పతకాన్ని పొందిన ప్రతిభావంతులు. విద్యార్థి దశలో షేక్పియర్‌ ‌నాటకాలలో పాత్రలు ధరించి మెప్పించారు. కందుకూరి వీరేశలింగం ‘అభిజ్ఞాన శాకుంతలం’ అనువాద నాటక ప్రదర్శన బాధ్యతలు చేపట్టి ఎన్నోసార్లు  ప్రదర్శించారు. ప్రసిద్ధ నటులు, దర్శకులు కూచి నరసింహం నటనా, దర్శకత్వ నైపుణ్యాలను గ్రహించి, కొన్ని నాటకాలకు పానుగంటి దర్శకత్వం వహించారు.

పెద్దాపురం ఉన్నత పాఠశాలలో కొద్దికాలం ఉపాధ్యాయునిగా పానుగంటి పనిచేశారు. కొంతకాలం కొత్తపల్లి జగ్గారాయణింగారి పిల్లలకు పాఠాలు చెప్పారు. తర్వాత లక్ష్మీనరసాపురం ఎస్టేట్‌ ‌జమిందారిణి రావు చెల్లయ్యమ్మారావు దగ్గర దివానుగా చేరారు. 1905లో రావు కుమార మహీపతి సూర్యారావు బహద్దూర్‌ ‌పిఠాపురం వచ్చినప్పటి నుండి ఆయన దగ్గరే ఉన్నారు. సూర్యారావు బహద్దూర్‌ ‌వివాహ మహోత్సవ సమయంలో ‘కోకిల’ నాటకాన్ని రాసి ప్రదర్శించారు. ‘విజయ రాఘవం’ అనే నాటకాన్ని ఆయన పట్టాభిషేక సమయంలో రాసి ప్రదర్శించారు.  దాదాపు 30 నాటకాలు రాసినా, వాటిలో 26 మాత్రమే అచ్చయ్యాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం.

 చెల్లాయమ్మారావు ఎస్టేట్‌లో దివానుగా ఉన్నప్పుడే పానుగంటి 1902లో  తొలి నాటకం ‘నర్మదాపురుకుత్సీయం’ రాసి, ఆమెకి అంకితమిచ్చారు. ఈ నాటకంలో పద్యశైలిని గూర్చి ఇలా చెప్పుకున్నారు.

‘‘ఒక్కచో తేనెలొలికించు నొక్క చక్క

చక్కెర ముక్కల నుంచు; నొక ప్రక్క

నాణెమగు సుధల జిలికించు నవ్య భవ్య

కావ్య రచనలనీ మహాకవి వరుండు’’

తన రచనలు తేనె, చక్కెరలు కలసిన మాధురీ భరితమైన అమృతాలని పానుగంటి చెప్పుకున్నారు. ఇందులో  స్వర్గ, మర్త్య, పాతాళాల మధ్య ఇతివృత్తాన్ని నడిపించారు రచయిత. ఈ నాటక సన్నివేశ చిత్రణలో పానుగంటి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. భవిష్యత్తులో ఆయన రాసిన నాటకాలన్నింటికీ ఈ నాటకమే చోదకశక్తిలా పనిచేసిందని విమర్శకుల అభిప్రాయం.

ఆయనకు ఎంతో ఖ్యాతి తెచ్చిన  ‘సారంగధర’ నాటకాన్ని 1904లో ప్రచురించారు. ఈ నాటకాన్ని కూడా చెల్లయ్యమ్మారావుకే అంకితమిచ్చారు. ఇందులో రాజరాజనరేంద్రుడు, సారంగధరుడు ముఖ్యపాత్రలు. చిత్రాంగి మేడపై సారంగధరుని పావురం వాలింది. ‘సుబుద్ధి’ అక్కడకు వెళ్లొద్దని వారించినా, సారంగధరుని చిత్రాంగి మేడపైకి వెళ్లాడు. చిత్రాంగి సారంగధరునిపై వలపును ప్రక టించగా, అతడు తిరస్కరించాడు. చిత్రాంగి కోపంతో సారంగధరుడు తనను బలత్క రించాడని చెప్పిన మాటలు విని రాజు సారంగధరుడికి మరణ శిక్ష విధించాడు. చివరకు రాజు పశ్చాత్తాపచిత్తుడై రాజ్యాన్ని వీడి అరణ్యాలకు వెళ్లాడు. మాననాథుడి ఔషధ ప్రభావంతో అతడు పునర్జీ వితుడైన విషయం తెలిసి రాజు తన కుమారుడు సారంగధరుని కలుసు కుంటాడు. చిత్రాంగిని క్షమించటంతో నాటకం సుఖాంతమవుతుంది. పానుగంటి ఇందులో అంతర్నాటక పక్రియను ప్రవేశపెట్టడం ఔచిత్యంగా ఉంది. ఇది తెలుగునాట విశేష జనాదరణ పొందింది. తన నాటకాలన్నింటిలోను ఆయన అంత ర్నాటక శైలిని ఉపయోగించుకున్నారు.

పానుగంటి మూడో నాటకం ‘ప్రచండ చాణక్యం’ 1909లో ప్రచురితమైన ఈ నాటకం విశేష ప్రజాదరణ పొందింది. అలాగే విమర్శలూ విరివిగానే వచ్చాయి. ఇది విశాఖదత్తుడి ‘ముద్రారాక్షసం’ నాటకానికి పూర్వగాథ. పానుగంటి ఔచిత్య దృష్టితో ఈ నాటకంలో చాలా మార్పులు చేశారు. అవసరాన్ని వివరిస్తూ  ‘ఇందులో కొన్ని అమానుష కృత్యా లున్నందున వర్తమానకాలానికి అవి ప్రేక్షకులకు రుచించవని భావించి కొత్తమార్గంగా ఈ నాటక కథను కల్పించవలసి వచ్చింద’ని చెప్పారు. ఇందులో చరిత్ర ప్రసిద్ధమైన చాణక్య పాత్రనూ, రాక్షస మంత్రి పాత్రనూ కొంత మార్చారు.

1909లో వెలువరించిన ‘రాధాకృష్ణ’ పానుగంటి నాటకాలన్నింటిలో ఉత్తమమైనదిగా పేర్గాంచింది. మధురభక్తి, రచనాశిల్పం ఇందులో  ముఖ్యమైనవి.  నాయికగా రాధ పాత్రను చిత్రించటంలో పానుగంటి చూపిన సంయమనం, ఆధ్యాత్మికత, అంతరంగపు లోతులు ప్రేక్షకులను అలరిస్తాయి.

‘‘నేనే రాధను, పూర్వజన్మముల రాధను, వర్త మానమున రాధను, భవిష్య జన్మలో రాధను, పునః సృష్టిలో రాధను, నా పతి శ్రీకృష్ణుడు-శ్రీకృష్ణుడు’’ – అంటూ పారవశ్యంలో ఉన్న రాధను దర్శింపచేసి పానుగంటి ప్రేక్షకులను ధన్యులను చేశారు.

 వాల్మీకి రామాయణం ఆధారంగా పానుగంటి నాలుగు నాటకాలను రచించారు. అవి 1. పట్టభంగ రాఘవం 2. విజయ రాఘవం, 3. వనవాస రాఘవం, 4. కల్యాణ రాఘవం. ఇవి పానుగంటి వారి రామభక్తికి నిలువెత్తు నిదర్శనాలు. తెలుగు పౌరాణిక నాటక రంగంలో ఇదొక అరుదైన విశేషం. ఈ నాటకాల్లో సంభాషణా చాతుర్యం, పాత్ర పోషణ, నాటకీయత ఒక దానితో ఒకటి పోటీ పడి నాటకాలను రక్తి కట్టించాయి. ఈ నాలుగు నాటకాల్లో మూడింటిని 1909లో, మరొక దానిని 1915లో రచించారు. ఈ నాలుగు నాటకాల మధ్యలో 1909 నుండి 1915 మధ్య ‘కోకిల’, ‘విప్రనారాయణ’, ‘బుద్ధ బోధసుధ’ వంటి నాటకాలు రచించారు.

పానుగంటి రచనలలో ‘కంఠాభరణం’ హాస్య స్ఫోరకమైన విశేష నాటకం. దీనిని పిఠాపురాస్థాన ప్రభువు శ్రీ రాజా వెంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దూర్‌ ‘‘‌మిగుల నవ్వువచ్చు నాటకమేదైనా రచింపువని కోరిన కోరిక మేరకు ఈ నాటకాన్ని 5 వారాల్లో (03-04-1917లో ప్రారం భించి 10-05-1917) రచించినట్లు పీఠికలో చెప్పారు. పానుగంటి వారు ‘విచిత్ర వివాహం’ అనే హాస్యరూపకంలో  బాల్య వివాహాలను అధిక్షేపిం చారు. నాటకాల్లో చారిత్రక, పౌరాణిక, సాంఘిక ఇతివృత్తాలున్నాయి. వీటిలో భక్తి, వీర, అద్భుత, హాస్య రస ప్రధానాలున్నాయి. పానుగంటివారి నాటకాలపై పాశ్చాత్య నాటక ప్రభావం ప్రగాఢంగా ఉంది.

పానుగంటివారు కథానిక రచయితగా సువర్ణ లేఖ పత్రికలో చాలా కథలు ప్రచురించారు. ఆయన దృష్టి కథా రచనపై కన్నా నాటకాలపై, వ్యాసాలపైనే ఎక్కువ. రచయితలు పద్యకావ్యాలు రచించినంత ఎక్కువగా గద్యకావ్యాలు రాయడం లేదని బాధ పడేవారు. గద్య రచయితలకు గౌరవం లేదని అధిక్షేపించారాయన. నాగరిక దేశాలన్నింటిలో వచన ప్రబంధాలు లక్షోపలక్షలుగా వస్తుంటే,  మన దేశంలో అందుకు విరుద్ధంగా జరగడం శోచనీయమన్నారు.

1922లో పిఠాపురం సంస్థానంలో జరిగిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు సభలకు పానుగంటి అధ్యక్షత వహించారు. నాటి అధ్యక్షోపన్యాసం చిరస్మర ణీయమైంది. 1911 నుండి 1914 వరకు ‘సువర్ణ లేదు’ పత్రికలో సాక్షి వ్యాసాలు, వచన ప్రహసనాలు, చిన్న కథలు ప్రచురించారు. ‘సాక్షి వ్యాసాలు’ మీద ఆంగ్ల రచయితలు ఎడిసన్‌, ‌స్పెక్టేటర్‌ ‌ప్రభావం ఉంది. సాక్షి వ్యాసాల మొదటి సంపుటిలో 31, రెండో సంపుటిలో 29 ఉన్నాయి. సాక్షి సంఘంలో ఐదుగురు సభ్యులున్నారు. వారే- సాక్షి, జంఘాల శాస్త్రి, కాలాచార్యుడు, వాణీదాసుడు, బొఱ్ఱయ్య శెట్టి. సత్యపురం తపాలా కచేరీకి ఎదురుగా ఉన్న అద్దె ఇంట్లో ప్రతిరాత్రి సమావేశం కావాలని వారి నియమం. అంతా రాగానే చక్రవర్తిగారికీ, వారి కుటుంబానికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇమ్మని భగవంతుని ప్రార్థించాలి. రాజకీయ విషయాలు చర్చించకూడదు. తప్పులనూ, ఆ తప్పులకు లోనైన వ్యక్తులనూ నిందించకూడదు. వాదాలతో కలహాలు రా‘కూడ’దు అనే నియమాలు సాక్షి సంఘం ఏర్పాటు చేసుకున్నది.

సాక్షి వ్యాసాలు ఆనాటి సాంఘిక స్థితికి అద్దం పట్టాయి. సంఘంలో స్త్రీల స్థానం, హక్కులు, విద్యా సాంస్కృతికాభివృద్ధి మొదలైన అంశాలతోపాటు స్త్రీల పాశ్చాత్య వ్యామోహాన్ని కూడా పానుగంటి నిశితంగానే విమర్శించారు. ఆయన ప్రకర్ణోప న్యాసాల్లో ‘గ్రామ్యవాద ఖండనకొక విన్నపం’ పంటివే కాక, ‘స్వప్నకావ్యం’ అనే ఏకాశ్వాస కావ్యం కూడా ఉంది. విమర్శాదర్శిని వంటి చిన్న పుస్తకాలు ప్రచురించారాయన. ప్రకీర్ణోపన్యాసాల్లో సాహిత్యం ధోరణులపై కొంత విమర్శ ఉంది.

పానుగంటి ఉపన్యాసాల్లో విశిష్టత ఉంది. విన్నవారికి తమరే మాట్లాడుతున్నట్లనిపిస్తుందట. జంఘాల శాస్త్రి ఉపన్యాసాలు ఆవేశపూరితంగా సాగుతాయి. చమత్కార రస్ఫోరకాలుగా శ్రోతలను ఆకర్షిస్తాయి. ‘సువర్ణలేఖ’, ‘భారతి’లో వచ్చిన కథలతో కలిపి ‘కథావల్లరి’ సంపుటిని ప్రచురించారు. పానుగంటివారిపై పాశ్చాత్య రచయితలు చార్లెస్‌ ‌డికెన్స్, ఎడిసన్‌, ‌స్విఫ్ట్ ‌వంటివారి ప్రభావం ప్రగాఢంగా ఉంది. వారి ప్రభావంతో హాస్య రచనలు చేసి ఆధునిక సాహిత్య చరిత్రలో హాస్య వాఙ్మయ నిర్మాతగా ప్రసిద్ధులయ్యారు.

About Author

By editor

Twitter
YOUTUBE