సాహిత్య, సంగీత, నృత్యాది కళల సమాహారం సినిమా. ఎందరెందరో కళానిష్ణాతుల సమష్టి కృషి సినిమా. ఐతే సినిమా వాళ్లలో ఏ ఒక్కరిదీ కాదు, అది దర్శకుడిది. తన మనసులో బీజం వేసుకున్న – తనకి మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్న – తన సినిమా స్వరూపాన్ని-సన్నివేశాలుగా ఊహించు కునేది దర్శకుడు మాత్రమే. ఏ సన్నివేశానికి ఏ కళాకారుడు ఏం చెయ్యాలో ఆలోచించుకునేది దర్శకుడు. తన సినిమాకి సరిపోయే కళాకారుల్ని సమకూర్చుకునేదీ దర్శకుడే. వారందరి సృజనా సినిమాలో కలిసిపోయేట్లు చేసుకునే మార్గదర్శ కుడే దర్శకుడు. అలాంటి మార్గదర్శకులలో అగ్రగణ్యుడు కాశీనాథుని విశ్వనాథ్. ఆయన ఐదు దశాబ్దాలకి పైనే – శబ్దగ్రాహకుడి నుండి దర్శకుడి దాకా, దర్శకుడి నుండి నటుడి దాకా – తెలుగు చలన చిత్రసీమకి ఎన్నెన్నో వన్నెలు దిద్దారు. 1970-80 దశాబ్దాలలో అత్యుత్తమ దర్శకుడిగా తెలుగు సినిమాలకి దేశ, విదేశాలలో గుర్తింపూ గౌరవమూ ఆదరణా దక్కేలా చేశారు.
1970 ప్రాంతంలో మనదేశంలో ఆర్ట్ (కళాత్మక) సినిమా అనే న్యూ వేవ్ (కొత్త తరంగం) ప్రారంభమైంది. హిందీలోనూ, మలయాళంలోనూ, కన్నడంలోనూ ఆ సినీతరంగం ఒక్క ఉదుటన ఎగసింది. దానికి కొందరు ప్రేక్షకులు అభిమానుల య్యారు. వారి దృష్టిలో ఆర్ట్ సినిమాలు కానివి.. కమర్షియల్ (వ్యాపారాత్మక) సినిమాలు అని అనే వారు. అంతేకాదు, వాటిని చిన్నచూపు చూసేవారు. అలానే కమర్షియల్ సినిమాల అభిమానులు ఆర్ట్ సినిమాలని తలనొప్పి సినిమాలని చులకనగా చూసేవారు, హేళన చేసేవారు.
ఆ సమయంలోనే కళలకి పెద్ద పీట వేస్తూ, కథలో వైవిధ్యం చూపిస్తూ సినిమాలు తీసిన విశ్వనాథ్ కళలకీ కాసులకీ వారథిగా నిలిచారు. కళాత్మక సినిమాలని ప్రజలకు దగ్గర చేశారు. సినిమాలు చూసే జనాన్ని తక్కువగా అంచనా వేయకుండా సినిమా కళాత్మకంగా తీసినా.. మనోరంజకంగా తీస్తే ప్రజలు చూస్తారని నిరూపించారు.
ఆయన తన సినిమాలలో కళలకు పెద్దపీట వేశారు. ఐనా ఆ సినిమాలు నిర్మాతలకి నష్టం చెయ్యలేదు సరికదా లాభాలు తెచ్చిపెట్టాయి. అంతేకాదు, ఆయనకి ఎన్నో జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలని తెచ్చిపెట్టాయి. 1971, 72, 73 వరసగా విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చెల్లెలి కాపురం, కాలం మారింది, శారద చిత్రాలను ఆంధప్రదేశ్ ప్రభుత్వం వారు ఉత్తమ చిత్రాలుగా గుర్తించారు. అప్పటి నుండి ఆయన తీసిన సినిమాలకి వరసగా భారత ప్రభుత్వ అవార్డులూ, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులూ, ఫిల్మ్‌ఫేర్ అవార్డులూ వస్తూనే ఉన్నాయి.
‘అవార్డు సినిమా’యా అని పెదవి విరిచే జనం విశ్వనాథ్ సినిమాలని చూసి ఆశ్చర్యపోయారు. కళాత్మక సినిమాలని కూడా ప్రజారంజకంగా తియ్యొ చ్చని అర్థం చేసుకున్నారు. ఎంతో ఆదరించారు. కళలని అందంగా చూపిస్తూనే వ్యాపారాత్మకంగా నష్టం రాకుండా సినిమా తియ్యడం అనే మధ్యే మార్గాన్ని చూసి అబ్బురపడ్డారు. తనకి తానే వేసుకున్న బాటలో విశ్వనాథ్ తీసిన సినిమాలు చూస్తూ సంతోషించారు, సంబరపడ్డారు. తన తొలి చిత్రం నుండీ సాహిత్యానికి ప్రాముఖ్యం ఇస్తూనే ఉన్నారు విశ్వనాథ్. రచయితల చేత చక్కని మాటలూ పాటలూ రాయించుకునేవారు. చరణకింకిణులు అన్న పాటలో శబ్దాలంకారాల సమాసాలు సగటు ప్రేక్షకు డికి అర్థం అవవేమో అని ఆయన అనుమానించ లేదు. అలాంటి పాటలు విని ప్రేక్షకులు ముగ్ధులౌ తారని ఆయన నమ్మారు. ఆయన నమ్మకం వమ్ము పోలేదు. సామాన్యంగా కొంచెం కష్టమైన పదాలు పాటలలో ఉంటేనే ప్రేక్షకులకి అర్థం కాక తికమకపడ తారని వాటి జోలికే పోరు చాలా మంది దర్శకులు. ఒకవేళ ఏ రచయిత ఐనా రాసినా వాటిని మార్పించేస్తారు. విశ్వనాథ్ అలా చెయ్యలేదు. అందుకనే తెలుగు ప్రజలకు గంభీరమైన సినీ సాహిత్యం దక్కింది. ప్రేక్షకుల స్థాయి పెరిగింది.
చెల్లెలి కాపురం చిత్రంలో కథానాయకుడు కవి కావడంతో చిత్రం కోసం అందమైన అలంకార భూయిష్టమైన కవితల్ని రాయించుకున్నారు. ఆ చిత్రంలో కథానాయిక నర్తకి. అందుకని శాస్త్రీయ నృత్యప్రధానమైన పాటలకి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని నీలాకృష్ణ నాటికతో, చరణకింకిణులు పాటతో సద్వినియోగం చేసుకున్నారు విశ్వనాథ్. ఆయన చిత్రాలలో శాస్త్రీయ నృత్య ప్రాధాన్యం మొదలైంది చెల్లెలి కాపురంతోనే. సిరిసిరిమువ్వ చిత్రంలో అది పూర్తి ప్రాముఖ్యం సంతరించుకుంది.
విశ్వనాథ్ చిత్రాలలో నృత్యాలకి విశ్వమంతా వేదికే. సిరిసిరిమువ్వలో హైమ వెన్నెలలో వనంలో నృత్యం చేస్తుంది. శంకరాభరణంలో తులసి ఇసుక తిన్నె మీద అద్భుతంగా అడుగులు వేస్తుంది. సప్తపదిలో హేమ గర్భగుడిలో నాట్యం చేస్తుంది. సాగరసంగమంలో బాలకృష్ణ కొండల మధ్యా, స్వర్ణకమలంలో మీనాక్షి హిమవత్సానువులలోనూ మమైరచిపోయి నాట్యం చేస్తారు. శాస్త్రీయ నృత్యంతో పాటు శాస్త్రీయ సంగీతానికి అగ్రస్థానం వచ్చింది శంకరాభరణం చిత్రంతో. అప్పటి నుండి ఆయన తీసిన సప్తపది, సాగరసంగమం, శ్రుతిలయలు, స్వర్ణకమలం, స్వాతికిరణం లాంటి చిత్రాలు అన్నీ సంగీత-నృత్య-సాహిత్యాల ఉన్నత శిఖరాలు అధిరోహించాయి. ఆయన తెలుగు సినీ ప్రేక్షకులకి కళాతపస్వి అయ్యారు.
విశ్వనాథ్ చాలా చిత్రాలలో కథాంశం-కళ ఒక తరం నుండి మరో తరానికి నిరంతరంగా సాగుతుండడమే. శంకరాభరణంలో కట్టెల మీద తన కట్టెతో పాటు కాలిపోవాలనుకున్న గండపెండేరాన్ని తన వారసుడిలా పాడిన చిన్న శంకరం కాలికి తొడగడం తన శాస్త్రీయ సంగీత జ్ఞానాన్ని మరో తరానికి శంకరశాస్త్రి అందించడమే. సాగరసంగ మంలో బాలకృష్ణ తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా శైలజకి నృత్యం నేర్పించి మరీ ప్రాణాలు వదలడం కూడా తన నృత్యానికి తగిన వారసురాలిని తయారు చెయ్యడమే. తల్లి తన తనయుణ్ణి తండ్రికి తగిన వారసుడిగా తీర్చిదిద్ది, తండ్రికీ లోకానికీ చూపించడమే శ్రుతిలయలు చిత్రం పతాక సన్నివేశం. స్వర్ణకమలం చిత్రంలో మీనాక్షి పతాక సన్నివేశ నృత్యం తన తండ్రి నాట్యానికి తను వారసు రాలినని గ్రహించడమే. సంగీతమైనా, నృత్యమైనా కళ అనంతంగా సాగుతూ ఉంటుందన్నదే విశ్వనాథ్ చిత్రాల సందేశం. ఒక విధంగా ఆ సందేశాన్ని తెలుగు నాట పిల్లలు ఆచరిస్తున్నారేమో అనిపిస్తుంది. పిల్లలు శాస్త్రీయ సంగీతం, నృత్యాల మీద గౌరవం పెంచుకోవడానికీ, ఉత్సాహంతో గజ్జె కట్టుకోవడానికీ 1980లలో విశ్వనాథ్ అందించిన చిత్రాలు దోహదం చేశాయనుకోవడంలో అతిశయోక్తి లేదనిపిస్తుంది.
సీతామలక్ష్మి చిత్రంలో రవి చిత్రకారుడు. సిరివెన్నెలలో సుభాషిణి చిత్ర, శిల్ప విద్యలలో ప్రవీణు రాలు. సాగరసంగమంలో మాధవి ఛాయాగ్రాహకు రాలు. స్వర్ణకమలంలో చంద్రశేఖర్ చిత్రకారుడు. చెల్లెలి కాపురంలో రాము కవి. విభిన్న కళలలో నిష్ణాతులు విశ్వనాథ్ చిత్రాలలో కనిపిస్తూనే ఉంటారు. వారు పేరుకి మాత్రమే కళాకారులు కారు. వారి కళలకీ, చిత్రంలో వారి పాత్రలకీ అవినాభావ సంబంధం ఉంటుంది. కళలు ఆ పాత్రలకి ఒక గుర్తింపును ఇస్తాయి.
విశ్వనాథ్ చిత్రాలలో శాస్త్రీయ సంగీత నృత్యాలే కాకుండా – హరికథలు వినిపిస్తూనే ఉంటాయి. ఓ సీతకథ, స్వాతిముత్యం, స్వయంకృషి, సూత్రధారులు చిత్రాలలో మలుపు తిరిగే సన్నివేశాలు హరికథలతోనే ముడిపడి ఉంటాయి. ఉండమ్మా బొట్టు పెడతాలో సంక్రాంతి హరిదాసు కనిపిస్తాడు. మరుగున పడిపోతున్న కళలని వీలైనంతవరకూ చిత్రాలలో పరిచయం చేస్తూనే ఉంటారు విశ్వనాథ్. సూత్రధా రులు చిత్రంలో కథానాయకుడు గంగిరెద్దులను ఆడించేవాడు. సిరిసిరిమువ్వ చిత్రంలో చెక్కభజనల పాట ఉంటుంది. శుభసంకల్పం చిత్రంలో జాలరి నృత్యాలు చూపించారు. జనంలో ఆదరణ తగ్గి పోతున్న వేదాధ్యాయనం గొప్పతనం గురించి స్వర్ణకమలం చిత్రంలో ఒకే ఒక్క సన్నివేశంలో ఒక ఘనాపాఠీ పాత్ర ద్వారా కళ్లకి కట్టినట్లు చూపించారు విశ్వనాథ్.
కళలతో పాటు విశ్వనాథ్ చిత్రాలలో ఉన్న మరో గొప్ప అంశం మనిషికీ మనిషికీ ఉండాల్సిన అభిమానాలూ, ఆప్యాయతలూ.
విశ్వనాథ్ చిత్రాలలో అక్కాచెల్లెళ్లని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. వాళ్ల మధ్య ఉండే అనురాగాలు ఎంతో అందంగా ఉంటాయి. ఓ సీత కథలో శుభా, రోజారమణులు ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉంటారు. శుభలేఖ చిత్రంలో సుమలతా, తులసీ అసలు సిసలైన అక్కాచెల్లెళ్ల లానే ఉంటారు. స్వర్ణకమలం చిత్రంలో అక్కాచెల్లెళ్లైన దేవీలలిత, భానుప్రియల మనస్తత్త్వాలు పూర్తిగా భిన్న ధృవాలు. ఐతే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అభిమానం. ప్రేమ బంధంలో అక్క వాణిశ్రీ, చెల్లెలు జయప్రద. చెల్లెలు జీవితం పాడయిపోతోందన్న ఆవేదనతో అక్క ఒక హత్య కూడా చేస్తుంది. అంత ప్రేమ చెల్లెలంటే. అక్కాచెల్లెళ్ల అన్యోన్యత లాగానే అన్నదమ్ముల అనుబంధాన్ని కూడా తన ఉండమ్మా బొట్టు పెడతా, శ్రుతిలయలు, స్వరాభిషేకం సినిమాలలో చూపించారు విశ్వనాథ్.
అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల అనుబంధం కన్న అపురూపమైనది మామ్మలకీ, అమ్మమ్మలకీ మనవళ్లతో ఉన్న సంబంధం. కాలం మారింది చిత్రంలో సూర్యకాంతం అమ్మమ్మ, శోభన్‌బాబు మనవడు. వారిద్దరి మధ్యా గారాలూ, పైపై అలకలూ, సరదాలూ ఎంతో ప్రేమతో సాగిపోతాయి. అలాంటి సంబంధమే శంకరాభరణంలో నిర్మలకీ, చంద్ర మోహన్‌కీ మధ్య చూపించారు. శుభలేఖలో నిర్మల మనవడు చిరంజీవి. మనవడు తనకి చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నా వచ్చి కోడలు కాబోతున్న సుమలతని చూసి సంతోషపడిపోయే ప్రేమ నిర్మలది. స్వాతిముత్యంలో నానమ్మ నిర్మలకి అమాయకుడైన కమల్‌హాసన్ ప్రాణం. హృద్యంగా ఉంటుంది వారిద్దరి సంబంధ చిత్రీకరణ. శుభసంకల్పం చిత్రంలోనూ నిర్మలా, కమల్ నానమ్మా, మనవలే. ఒకరిని ఒకరు ఆట పట్టించుకుంటూ ఒకరికి ఒకరుగా ఉంటారు. ఆనాడు జీవనజ్యోతి సినిమాను చూడనివారు లేరంటే అతిశయోక్తి కాదు.
బంధువుల మధ్య బంధమే కాదు స్నేహితుల మధ్య ఉండాల్సిన బంధాన్ని కూడా అద్భుతంగా చూపించారు విశ్వనాథ్. ఒకటీ రెండూ మూడూ అవి విడిగా ఉంటే అంతే అని, కలిసి ఉంటే విలువ పెరుగుతుందని అర్థం వచ్చేలా పాడుకుంటూ ఉంటారు ఎన్‌టి రామారావు, శోభన్‌బాబు, చలం నిండు హృదయాలు చిత్రంలో. చిన్ననాటి స్నేహితులు చిత్రంలో ఎన్‌టి రామారావు, జగ్గయ్య చిన్ననాటి నుండి స్నేహితులు. కథంతా స్నేహితుల చుట్టూనే. విశ్వనాథ్ చిత్రాలలోనే స్నేహానికి పరాకాష్ట ‘శంకరా భరణం’లో సోమయాజులు, అల్లు రామలింగయ్యల మధ్య కనిపించే సంబంధం. వారిద్దరి స్నేహం సప్తపదిలోనూ అలాగే కొనసాగింది. సాగర సంగమంలో శరత్‌బాబు, కమల్ హాసన్ స్నేహంలో కూడా ఒకరంటే ఒకరికి ఉన్న ఆప్యాయత అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది.
సాంప్రదాయకమైన ఏ విద్య ఐనా, కళ ఐనా గౌరవించదగ్గవే కానీ తిరస్కరించదగినవి కావని కళాతపస్వి చిత్రాలు చెప్తూనే ఉంటాయి. అలానే మానవ సంబంధాలలోని గాఢతనూ, సున్నితత్వాన్ని, విశాలతనీ విఫులంగా విశదీకరిస్తాయి. అవి పండిత పామరులని, అందరినీ అలరిస్తూనే ఉంటాయి. మనసులకి ఆహ్లాదం కలిగిస్తూనే ఉంటాయి. మన గుండెల్లో ఆర్ద్రతని నింపుతూనే ఉంటాయి. ఆయన్ని రుషిని చేస్తాయి.
అనామకుడు
(ఎ.ఎస్. రామశాస్త్రి)
asramasastri.com
[email protected]